పరిశుద్ధ 14వ లియో జగద్గురువులు కార్డినల్స్‌తో సమావేశం, 10 మే 2025
2025 మే 10వ తేదీ ఉదయం, నూతనముగా ఎన్నికైన 14వ లియో పరిశుద్ధ జగద్గురువులు (సింహరాయలు), కార్డినల్స్‌తో ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భముగా ఆయన వారికి ఒక ప్రత్యేకమైన ప్రసంగాన్ని వినిపించారు.
మీ
అందరకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మనము కూర్చునే ముందు, విశ్వ శ్రీసభను స్ఫూర్తితో, ఉత్సాహముతో, దృఢవిశ్వాసముతో నడిపించమని ప్రభువునకు ప్రార్థన చేద్దాం...
ప్రియ సోదర కార్డినల్స్ లారా! నేటి ఈ
సమావేశానికి, మరియు గడచిన రోజులను బట్టి మీ అందరికీ కృతజ్ఞతతో నా శుభాకాంక్షలు! పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ గారిని
కోల్పోవడముతో దుఃఖముతో నిండిన రోజులను, అలాగే మనపై ఉన్న బాధ్యతల కారణముగా సవాళ్లతో కూడిన కాలాన్ని మనము
ఎదుర్కొన్నాము. అదేసమయములో, యేసు ప్రభువు స్వయముగా ఇచ్చిన వాగ్దానము
ప్రకారం, “ఆత్మలో
కృపను, ఓదార్పును”
కూడా మనము అనుభవిస్తున్నాము (యో 14:25-27).
ప్రియమైన కార్డినల్స్ లారా! మీరు
జగద్గురువులకు సన్నిహిత సహకారులు. అందుకే, నా శక్తికి మించిన ఈ బాధ్యతను స్వీకరించడంలో మీ సహకారం నాకు
ఎంతో ఓదార్పునిచ్చింది. ప్రభువు అప్పగించిన ఈ బాధ్యతను / ప్రేషిత సేవను నెరవేర్చడములో నన్ను
ఒంటరిగా వదిలివేయడని మీ సహకారము నాకు గుర్తుకు చేయున్నది. ప్రభువు యొక్క సహాయము, కృప,
మీ సాన్నిహిత్యం అలాగే, ప్రపంచమంతా శ్రీసభను ప్రేమించే దైవవిశ్వాసుల ప్రార్థనలు, వారి
మద్దతు తప్పక ఉంటుందని నాకు తెలుసు.
కార్డినల్స్‌కు డీన్ అయిన జోవన్నీ బతిస్త రే కార్డినల్ గారికి
నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి జ్ఞానం, అనుభవం ఎన్నో సంవత్సరాలుగా జగద్గురువులకు విశ్వాస పాత్రమైన సేవలను
అందించాయి. ఈ ప్రత్యేక సమయములో వారి సహాయం అమూల్యమైనది. అలాగే, కెవిన్
జోసెఫ్ ఫారెల్ కార్డినల్ గారికి నా కృతజ్ఞతలు. ఆరోగ్య
కారణాల వల్ల హాజరు కాలేకపోయిన సోదర కార్డినల్స్‌ను కూడా నేను గుర్తుచేసు
కుంటున్నాను.
దుఃఖము మరియు ఆనందము రెండూ మిళితమైన ఈ సమయములో, ఈస్టర్ వెలుగులో నున్న ఈ కాలములో,
మన ప్రియమైన పరిశుద్ధ
పోప్ ఫ్రాన్సిస్ మరణాన్ని, కాన్‌క్లేవ్‌ను (కొత్త పొప్ ఎన్నిక) ఒక పాస్క సంఘటనగా,
ప్రభువు మనలను పరిపూర్ణత
వైపు నడిపిస్తున్న సుదీర్ఘ నిర్గమనములో ఒక భాగముగా చూడాలని నేను కోరుకుంటున్నాను.
ఈ దృక్పథంలో, “కృపామూర్తి, ఆదరణ కర్త అయిన మన తండ్రి” (2 కొరి 1:3)
దేవునకు దివంగత
పొప్ ఫ్రాన్సిస్ ఆత్మను మరియు శ్రీసభ భవితవ్యమును అప్పగిద్దాం.
పునీత పేతురు వారసుడిగా, ఈ బాధ్యతకు నేను అర్హుడను కానప్పటికీ,
జగద్గురువులు
ఎల్లప్పుడూ దేవునికి, ఆయన బిడ్డలకు వినయపూర్వకమైన సేవకులే! దీనిని నా
పూర్వీకులలో ముఖ్యముగా పోప్ ఫ్రాన్సిస్ సేవ, నిగ్రహమైన సరళత, అంకితభావం, పరిచర్యలోతన పరిత్యాగం దృఢ విశ్వాసం వారిలో స్పష్టంగా కనిపించాయి. ఈ అమోల్యమైన
వారసత్వాన్ని స్వీకరించి, విశ్వాసము నుండి పుట్టిన అదే ఆశతో
ప్రేరణ పొంది ప్రయాణాన్ని కొనసాగిద్దాం.
మన మధ్య నున్న పునరుత్థాన ప్రభువు శ్రీసభను
రక్షిస్తాడు, మార్గనిర్దేశం చేస్తాడు. “దేవుడు మనకొసగిన పవిత్రాత్మ ద్వారా మన హృదయములను
నింపిన తన ప్రేమతో” (రోమా 5:5) శ్రీసభను నిరీక్షణతో నింపుతూనే ఉంటాడు. దేవుని
స్వరాన్ని విధేయతతో వినడం, ఆయన రక్షణ ప్రణాళికకు విశ్వసనీయ పరిచారకులుగా ఉండటము మన
బాధ్యత. దేవుడు గాలి, భూకంపము, నిప్పులో గాక, “మెల్లని స్వరములో” (1 రాజులు 19: 12) తనను తాను తెలియ జేయడానికి
ఇష్టపడతాడు. మన సంరక్షణకు అప్పగించబడిన దేవుని పవిత్ర ప్రజలందరికీ మనము మార్గనిర్దేశము
చేయాలి. వారికి తోడుగా ఉండాలి.
ఈ రోజులలో, అపారమైన శ్రీసభ యొక్క యొక్క అందాన్ని చూడగలిగాము, అలాగే శ్రీసభ బలాన్ని
అనుభవించ గలిగాము. శ్రీసభ ఆప్యాయత, భక్తితో కాపరి మరణము పట్ల దుఃఖించింది. వారి చివరి
ప్రయాణము వరకు విశ్వాసము, ప్రార్థనతో వారికి తోడుగా నిలిచింది. “మన ఆత్మలకు రక్షకుడును,
కాపరియు అగు” (1 పేతురు 2:25) ఒకే శిరస్సు
అగు క్రీస్తుతో ఐఖ్యమై, సజీవముగా నున్న శ్రీసభ వైభవాన్ని మన కనులారా చూసాము. శ్రీసభ
గర్భము నుండి మనం జన్మించాము. అదే సమయములో మంద (cf. యో
21: 15-17), నేల (cf. మార్కు 4: 1-20) అయిన శ్రీసభ మన సంరక్షణకు అప్పగించ బడింది. రక్షణ దివ్యసంస్కారములతో శ్రీసభను
పోషించ డానికి, వాక్యము అనే విత్తనాన్ని వెదజల్లడము ద్వారా ఫలవంతము చేయడానికి మనకు
అప్పగించ బడింది. ఈ సువార్త సేవలో, “పగలు త్రోవ చూపు మేఘ స్తంభముగా, రాత్రి వెలుగు
ఇచ్చు అగ్ని స్తంభముగా” ప్రభువు ఇజ్రాయెలీయులను నడిపించిన విధముగా (cf. నిర్గమ 13: 21) శ్రీసభ కూడా ముదుకు సాగునుగాక.
ఈ విషయములో, రెండవ వాటికన్ మహాసభ మార్గదర్శక
సూత్రాలకు అనుగుణంగా, సార్వత్రిక
శ్రీసభ దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానాలకు మనమందరము కలిసికట్టుగా కట్టుబడి
ఉండాలని నేను కోరుకుంటున్నాను. పోప్ ఫ్రాన్సిసు గారి అపోస్టోలిక లేఖ ‘ఎవెంజెలీ గౌదియం’లో నుండి
నేను అనేక ప్రాథమిక అంశాలను నొక్కి వక్కాణించాలని అనుకుంటున్నాను: ప్రకటనలో క్రీస్తు యొక్క ప్రాధాన్యతను
పునరుద్ఘాటించడం (cf. సంఖ్య 11); క్రైస్తవ సమాజము యొక్క మిషనరీ స్వభావాన్ని
పెంపొందించడము (cf. సంఖ్య 9); సహబాధ్యత, సినొడాలిటీని ప్రోత్సహించడము (cf. సంఖ్య 33); విశ్వాసుల
భావాలకు ప్రాధాన్యత ఇవ్వడము (cf. సంఖ్యలు 119-120), ముఖ్యముగా జనాదరణ పొందిన భక్తి, దాని
అత్యంత ప్రామాణికమైన, సమగ్రమైన రూపాలలో (cf. సంఖ్య 123); పేదలు
మరియు అణగారిన వర్గాల పట్ల ప్రేమ చూపడం (cf. సంఖ్య 53); మరియు దాని వివిధ భాగాలు మరియు
వాస్తవికతలలో సమకాలీన ప్రపంచముతో నిర్మాణాత్మకమైన సంభాషణను కొనసాగించడం (cf. సంఖ్య 84; రెండవ వాటికన్ మహాసభ, గౌదియం ఎత్ స్పెస్, 1-2).
ఇవి దేవుని కుటుంబము యొక్క జీవితం, కార్యకలాపాలను ఎల్లప్పుడూ ప్రేరేపించిన,
మార్గనిర్దేశము చేసిన సువార్త సూత్రాలు. ఈ విలువలలో, తండ్రి దయగల ముఖము వెల్లడైనది మరియు
సత్యము, న్యాయము,
శాంతి, సోదరభావము కొరకు నిజాయితీగా వెతుకుతున్న
వారందరికీ అంతిమ ఆశగా అవతరించిన కుమారుడిలో వెల్లడిస్తూనే ఉన్నది (cf. బెనెడిక్ట్ XVI, స్పీ సాల్వి, 2;
ఫ్రాన్సిస్, స్పీస్ నాన్ కన్‌ఫుండిట్, 3).
ఈ దిశగా కొనసాగడానికి దేవుడు నన్ను పిలిచినట్లుగా భావించి,
నేను 14వ లియో అనే
పేరును ఎంచుకున్నాను. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి, కానీ ప్రధానముగా 13వ లియో జగద్గురువులు తన
చారిత్రాత్మక లేఖ ‘రేరం
నోవారమ్’ ద్వారా
మొదటి పారిశ్రామిక విప్లవ సమయములో సామాజిక సమస్యలకు పరిష్కారాన్ని చూపారు. నేడు,
కృత్రిమ మేధస్సు
పెరుగుదల కారణముగా మానవ గౌరవము, న్యాయము,
శ్రమ యొక్క భద్రతకు
కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యములో, శ్రీసభ తన సామాజిక బోధనల ద్వారా అందరికీ
మార్గనిర్దేశాన్ని చేస్తున్నది. అందుకే నేను లియో పేరును ఎంచుకున్నాను.
ప్రియమైన సోదరులారా, 1963లో తన పరిచర్య ప్రారంభోత్సవములో పునీత
ఆరవ పాల్ జగద్గురువులు వ్యక్తము చేసిన ఆశను నా స్వంతము చేసుకోవడము ద్వారా, మీకు కూడా ప్రతిపాదించడము ద్వారా ఈ మన
సమావేశమును ముగించాలను కుంటున్నాను: “మంచి సంకల్పం ఉన్న పురుషులు, మహిళలందరిలో
రగిలిన విశ్వాసము, ప్రేమ యొక్క గొప్ప అగ్ని వలె ఇది ప్రపంచమంతటా వ్యాపింపవచ్చు. పరస్పర
సహకార మార్గాలపై ఇది వెలుగు నిస్తుంది మరియు దేవుని సహాయం లేకుండా ఏదీ చెల్లదు,
ఏదీ పవిత్రము కానేరదు
(మానవ కుటుంబం మొత్తాన్ని ఉద్దేశించి క్వి ఫౌస్టో దియె,
సందేశము, 22 జూన్ 1963)."
ప్రభువు దయతో, మన
ప్రార్థనలు, నిబద్ధత, కార్యాచరణ రూపము దాల్చునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక
ధన్యవాదాలు!
మూలము: https://press.vatican.va/content/salastampa/en/bollettino/pubblico/2025/05/10/250510a.html
గురుశ్రీ ప్రవీణ్ గోపు, OFM Cap.
Rector, Vianney College, Eluru, Andhra
Pradesh
No comments:
Post a Comment