ఆదాము – ఏవ: ఆదికాండము 1-3 అధ్యాయాలు

ఆదాము – ఏవ
ఆదికాండము 1-3 అధ్యాయాలు
గురుశ్రీ ప్రవీణ్ కుమార్ గోపు OFM Cap.
Licentiate in Biblical Theology (2013-2015)
Angelicum, Rome

1. ఉపోద్ఘాతము
బైబులు గ్రంథములో ఆదాము-ఏవల ప్రస్తావన, సృష్టి, మానవాళిమూలాలు, మానవస్వభావము, ఆదిపాపము, దేవుని రక్షణప్రణాళికను తెలియజేయుచున్నది. వారి కథనం ఆదికాండము 1-3 అధ్యాయాలలో ప్రస్తావించబడినది. ఈ మూడు అధ్యాయాలలోని కథనాలను సాహిత్యపరముగాను, వేదాంతపరముగాను వివరించబడినది. ఆదాము-ఏవలు చారిత్రాత్మిక వ్యక్తులను ప్రాతినిధ్యం వహించడం అన్నదానికన్న, మానవాళియొక్క మూలం, స్వభావం, దేవునితో సబంధానికి సంబంధించిన లోతైన వేదాంత అర్ధాలను వారు ప్రతిబింబిస్తున్నారు. వారు సమస్త మానవాళికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హీబ్రూ భాషలో “ఆదాము” [Adam] అనగా ‘నరుడు, మానవుడు’ లేదా ‘మానవాళి’ అని అర్ధము. “అదమ:” [adamah] అను హీబ్రూ పదమునుండి ఉద్భవించింది, అనగా ‘నేల, భూమి, మట్టి’ అని అర్ధము. నేలనుండి మానవుడు సృష్టింపబడ్డాడు అని సూచిస్తుంది. “ఏవ” [హీబ్రూ ‘హవ్వ’] అనగా ‘జీవితం’ అనే అర్ధముతో ముడిపడియున్నది. ఎందుకన, ఆమె “జీవులకందరకు తల్లి” (3:20) అని పిలువ బడుచున్నది.

2. రెండు సృష్టికథనాలు (1:1-2:3 మరియు 2:4-25)
సృష్టి గురించి రెండు కథనాలు ఉన్నాయి 1:1-2:3 మరియు 2:4-25. మానవాళి సృష్టిపై పరిపూరకరమైన దృక్పధాలను అందిస్తున్నాయి. రెండు కథనాలుకూడా చారిత్రక లేదా శాస్త్రీయ నివేదికలు కాకుండా, దేవుడు, సృష్టి, మానవస్వభావమును గురించిన వేదాంత సత్యాలను వెల్లడి చేస్తున్నాయి.
2.1. మొదటి కథనం[1] ప్రకారం, దేవుడు ఆరు రోజులలో సృష్టి అంతయును కలుగచేసాడు. మానవాళి సృష్టియంతటకు పారాకాష్ట (1:26-28), మానవాళిని దేవుని పోలికలో సృష్టించడం (1:27), స్త్రీ,పురుషుల సమానత్వం, దేవుని దీవెన మరియు ఆజ్ఞ ఈ కథనములోని ముఖ్యాంశాలు.
ఆదికాండము 1:26-27 ప్రకారముగా, దేవుడు మానవాళిని తన పోలికలో [రూపురేఖల్లో] సృష్టించాడు. ఈ విశిష్టసృష్టి మానవ గౌరవాన్ని, తెలివిని, దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని, మానవస్వభావాన్ని ప్రతిబింబిస్తుంది.

2.2. రెండవ కథనం[2] ప్రకారం, దేవుడైన యావే నేలమట్టినుండి మానవుని [నరుని] చేసాడు. అతని ముక్కురంధ్రములలో ప్రాణవాయువును [ఆత్మ] ఊదగా, మానవుడు జీవము గలవాడయ్యెను (2:7). నేలమట్టి భౌతికం. దేవునిశ్వాస ఆధ్యాత్మికం. కనుక మానవుని వ్యక్తిత్వం ఏకకాలములో భౌతికం, ఆధ్యాత్మికం. మానవుడు దేహాత్మల సమ్మేళనం. ఇది మానవాళి గౌరవాన్ని నొక్కిచెబుతుంది (శ్రీసభ సత్యోపదేశం 362-365). ఏదెను అను స్థలములో దేవుడైన యావే ఒక తోట వేసి, తాను సృజించిన నరుని దానిలో ఉంచెను (2:8). హీబ్రూ పదమైన “ఏదెను” అనగా ‘ఆనందం’ అనే అర్ధమున్నది. దేవుడు సర్వసృష్టికర్త అని సూచిస్తుంది.
“ప్రాణమిచ్చు చెట్టు” ఆదాము-ఏవలకు శాశ్వత జీవమును ఒసగు శక్తి కలిగి యుండెను. అది తోట నడుమ ఉండెను. రెండవ ప్రత్యేకమైనది “మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు”.
నరునినుండి తీసిన ప్రక్కటెముకనుండి స్త్రీని రూపొందించాడు (2:21-23). ఇది ఐఖ్యత, సమానత్వం, పరిపూరకతను సూచిస్తుంది. “చివరకు ఈమె నా వంటిదైనది. ఈమె నా యెముకలలో ఎముక, నా దేహములో దేహము” అన్న నరుని ఆశ్చర్యం వారిరువురి మధ్యనున్న గాఢమైన ఐఖ్యతను, ప్రేమను సూచిస్తుంది. వివాహ జీవనాన్ని అర్ధం చేసుకోవడానికి ఇది పునాదిగా నున్నది (శ్రీ.స.371-372). కతోలిక వేదాంత శాస్త్రములో ఈ సంబంధం ఒకరిపట్ల ఒకరికి గౌరవం, ఐఖ్యత, తొలినీతిని, తొలిపవిత్రతను వివరిస్తున్నది (శ్రీ.స.374).

2.2.1. వివాహము-స్థిరమైన మానవ సమాజానికి పునాది (2:18-25)
ఆదాము-ఏవల మధ్య సంబంధం వివాహాన్ని సూచిస్తుంది. ఎందుకన ఇది తొలి కలయిక. ఇది వైవాహిక ఐఖ్యత, ప్రేమ, సంతానం కొరకు దేవుని ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తుంది (2:24; శ్రీ.స.1605). మొదటి సృష్టికథనములో దేవుడు పదేపదే తన సృష్టిని చూసి తన కంటికి బాగుగా ఉండెను అని పలికెను (1:10,12,18,21,25,31). అయితే, రెండవ సృష్టికథనములో రెండుసార్లు నరుడు ఒంటరిగా ఉండటముపట్ల బాగుగా లేదని దేవుడు తలంచినట్లుగా చూస్తున్నాము (2:18). ఇప్పటివరకు సృష్టించిన వాటిలో ఏదీకూడా నరుని ఒంటరితనమును తీసివేయలేక పోయినది. కనుక, దేవుడు నరుని ప్రక్కటెముక నొకదానిని తీసి తోడుగా స్త్రీని రూపొందించాడు (2:18-25). ఈవిధముగా, వివాహమును స్థిరమైన మానవ సమాజానికి పునాదిగా చూస్తున్నాము.

3. పాపము - శ్రమలు, మరణమునకు కారణం (3:1-24)
3.1. సర్పము (3:1-7)
ఆదికాండము మూడవ అధ్యాయము మానవుని పతనము, సర్పము రూపములో సాతాను ఆదాము-ఏవలను ఏవిధముగా శోధించినదో వివరిస్తున్నది (3:1-7). చెడు అనేది జిత్తులమారి ‘సర్పము’ రూపములో వచ్చి, దేవున్ని అవిధేయించమని స్త్రీని శోధించినది, “ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగును. మంచి చెడ్డలు తెలుసుకొని దేవునివలె అగుదురు” (3:5). దేవుని ఆజ్ఞపట్ల అవిశ్వాసాన్ని నింపినది. దురాశ అనే విత్తనాన్ని స్త్రీ మనసులో నాటినది. హద్దులేని దురాశ, ఆలోచనలేని కోరిక శోధనకు లొంగి సర్పముయొక్క ఉచ్చులో పడేలా చేసింది. “ఆమె ఆ చెట్టుపండ్లు కోసి తాను తిని, భర్తకు ఇచ్చెను” (3:7).

3.2. దేవుని జోక్యం (3:8-13)
ఈ పరిస్థితిలో దేవుడు జోక్యం చేసుకున్నాడు (3:8-13). పాపము చేసిన వారు దేవుని అడుగుల చప్పుడు విని, ఆయన సన్నిధినుండి చెట్ల నడుమ దాగుకొనిరి. అవిధేయత పాపము వారిని కల్మషం చేసినది. నరుడు తన తప్పును అంగీకరించక, తన భార్య ప్రలోభ పెట్టినదని ఆరోపించాడు. ఆ స్త్రీ తన పాపానికి సర్పాన్ని నిందించినది. ఒకరినొకరు నిందించే మానవ ధోరణిని బట్టబయలు చేయుచున్నది. ఎవరి చర్యలకు వారే బాధ్యులు అన్న విషయం స్పష్టమగుచున్నది.
నిర్ణయాలు తీసుకొనే స్వేచ్చను దేవుడు వారికి ఇచ్చాడు. మంచి-చెడ్డల పరిజ్ఞానం ఇచ్చే చెట్టు పండును దేవుడు తినవలదని ఆజ్ఞాపించినను (2:16-17) వారు తిన్నారు. “ప్రాణమిచ్చు చెట్టు” కూడా వారికి అందుబాటులోనే నున్నది. వారి అవిధేయత, దైవాజ్ఞ అతిక్రమణ మొదటి పాపముగా పరిగణింప బడినది. పాప ఫలితముగా, “ప్రాణమిచ్చు చెట్టు” [జీవము, నిత్యజీవము] వారికి అందుబాటులో లేకుండా పోయినది. దీనిని మనం ‘ఆదిపాపము’గా పిలుస్తున్నాము. దేవునికి వ్యతిరేకముగా ధిక్కరించే ఈ చర్య వారి తొలిపవిత్రతను కోల్పోయేలా చేసినది. ఈవిధముగా, మానవ జీవితములోనికి బాధలు, మరణం, పాపస్వభావం ప్రవేశించాయి (శ్రీ.స.396-400). మానవునికి ఒసగబడిన స్వేచ్చను దుర్వినియగము చేసిన ఫలితమే చెడు, శ్రమలు!
‘ఆదిపాపము’ వ్యక్తిగత అపరాధము కాదు. ఆదాము-ఏవలనుండి సోకిన లేదా అంటుకున్న మానవాళికి వారసత్వముగా వచ్చిన పతనమైన స్థితియే ఆదిపాపము. ఈ అవగాహన కతోలిక బోధనలలో ప్రధానాంశం. ఇది జ్ఞానస్నాన దివ్యసంస్కారముతో అనుసంధానించబడినది. జ్ఞానస్నానము ఆదిపాపమును తొలగించును (శ్రీ.స.402-405).
ఆదాము-ఏవల పాపము, క్రీస్తుద్వారా రక్షణయొక్క అవసరతను మనకు తెలియజేయు చున్నది. “నూతన ఆదాము”గా పిలువబడే క్రీస్తు, తన సంపూర్ణ విధేయతద్వారా, ఆదాము అవిధేయతను తలక్రిందులుగా చేసియున్నాడు. “నూతన ఏవ”గా పిలువబడే మరియమ్మ, ఏవ అవిధేయతకు వ్యతిరేకముగా విధేయత, పవిత్రతను సూచిస్తుంది (శ్రీ.స.411). ఆదికాండము 3:5లో స్త్రీ సంతానము సర్పముయొక్క తలను చితక గొట్టును అని దేవుడు వాగ్దానం చేసాడు. ఈ వాగ్దానం పాపముపై, సాతానుపై క్రీస్తు విజయంయొక్క ప్రవచనముగా వ్యాఖ్యానించ బడుచున్నది.
ఆదాము-ఏవల కథలో ‘ఏదెను తోట’ సృష్టిసామరస్యతను సూచిస్తుంది. మంచి-చెడ్డల పరిజ్ఞానం ఇచ్చే చెట్టు మానవ స్వేచ్చ, నైతిక చట్టాన్ని సూచిస్తుంది. ఈ స్వేచ్చ దేవునితో నిజమైన ప్రేమ, సహవాస సంబంధానికి ఎంతో అవసరము, అయితే స్వేచ్చ, సరియైనది ఎన్నుకొను బాధ్యతో కూడి యుంటుంది (శ్రీ.స.396).

3.3. దేవుని శిక్ష (3:14-21)
ఆదిపాపములో ప్రమేయము కలిగిన ముగ్గిరికి కూడా దేవుడు శిక్షను ప్రకటించాడు. మొదటిగా సర్పమునకు, రెండవదిగా స్త్రీకి, మూడవదిగా నరునికి శిక్షను ప్రకటించాడు. దీనిఫలితముగా, దేవుని తోటనుండి ఆదాము-ఏవలు వెళ్ళగొట్టబడ్డారు, తరిమివేయబడ్డారు. ఇది దేవుని శిక్ష అనేదానికన్న, వారు ప్రాణమిచ్చు చెట్టును లేదా జీవవృక్షమును చేరుకోకుండా దేవుడు తీసుకున్న ముందుజాగ్రత్త చర్యగా పరిగణించాలి (3:22-24). దేవుడు వారికి ఇచ్చిన మొదటి ఆజ్ఞను ధిక్కరించడము వలన, అవిధేయించడము వలన, జీవవృక్ష ఫలాలను తిని శాశ్వతముగా జీవించే హక్కును వారు కోల్పోయారు. అనగా, జీవవృక్షమును పొందుకొను అవకాశమును, మృత్యువృక్షము, పాపవృక్షమైన “మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు” వారిని అడ్డుకున్నది. అది మృత్యువును కొనివచ్చినది. జీవవృక్ష పండ్లను తిని, శాశ్వతముగా జీవించే బదులుగా, వారు మృత్యుమార్గమును ఎన్నుకున్నారు. ఈ జీవవృక్షముపైనే క్రీస్తు మరణించాడు. అది జీవమును కొనివచ్చినది. మొదటిది పాపమును గూర్చిన తెలివిని తీసుకొనివస్తే, రెండవది పాపమునుండి విమోచనను తీసుకొని వచ్చినది. మొదటిది ఉద్యాన వనము (దర్శన 2:7) నుండి మానవున్ని తరిమివేస్తే, రెండవది తిరిగి ఉద్యాన వనములోనికి ప్రవేశించేలా చేయుచున్నది.
3:15లో దేవుడు సర్పముతో పలికిన పలుకులలో మానవాళికి ఒక ఆశా కిరణం కనిపిస్తున్నది. ఈ పలుకులు పూర్వనిబంధనలో ‘మెస్సయ్య’ను గూర్చిన ఆలోచనకు ఆధారితమైనది. కనుక, ప్రవచనాలలో అతి ప్రాముఖ్యమైన ప్రవచనముగా [‘mother prophecy’] భావించ బడుచున్నది.
ఏవను శోధించిన ‘సర్పము’ నూతన నిబంధనలో ‘సాతాను’గా గుర్తించబడినది. ఈ విషయం రోమీ 16:20లో స్పష్టం చేయబడినది, “మన సమాధానమునకు మూలమగు దేవుడు, త్వరలో సైతానును మీ పాదముల క్రింద చితుక త్రొక్కును.” పౌలు కోరింతీయులను ఇలా హెచ్చరించాడు, “ఏవ సర్పము టక్కరి పలుకులకు లోనైనట్లుగా, మీ హృదయములు కలుషితములై, క్రీస్తునందు మీకు ఉన్న స్వచ్చమైన విశ్వాసమును త్యజింతురేమో అని నాకు భయమగుచున్నది” (2 కొరి 11:3). ఆదిపాపముయొక్క కథనమునుండి గుణపాఠములను తెలియజేస్తూ పౌలు ఇంకా ఇలా అంటున్నాడు, “ఇందులో ఆశ్చర్యము ఏమియును లేదు! సైతాను కూడ వెలుగు దేవదూతవలె అగపడునట్లు తననుతాను మార్చుకొనగలడు” (2 కొరి 11:14). అలాగే దర్శన గ్రంథము 12:9లో సర్పమునకు శిక్ష గురించి, “ఆ భయంకర సర్పము బయటకు గెంటబడెను! ఆ సర్పము మనకు సుపరిచితమైనదే. పిశాచము, సైతాను అను నామములు గల ఆ సర్పమే లోకము నంతటిని మోసగించినది. అతడును, అతని దూతలును భువికి నెట్టబడిరి.”
3:15లో ప్రవచింప బడిన “స్త్రీ సంతతి” [ఏకవచనము], రక్షణ చరిత్రలోని మెస్సయ్యయే. క్రైస్తవులకు ఆ మెస్సయ్య క్రీస్తుయే! ఆ స్త్రీ మరియమ్మ. కనుక, 3:15 మానవాళి రక్షణ ప్రవచనం! దైవకుమారుడు భూలోకములో జన్మించడం, అతని రక్షణ కార్యాలు 3:15లోని ప్రవచనాన్ని నెరవేర్చాయి. మరియ కుమారుడు క్రీస్తు, తన ఉత్థానముద్వారా సాతానుపై విజయమును సాధించుట వలన, అతని తలను చితక గొట్టెను.
దేవుని తదుపరి చర్య, జంతు చర్మములతో వస్త్రములను చేసి ఆదాముకు ఏవకు తొడిగెను (3:21). భయము, సిగ్గు అప్పటికే వారు వస్త్రములను తొడుగుకునేలా చేసినను, దేవుడు కొత్త విధానాన్ని ఆమోదించాడు. “అంజూరపుటాకులు కుట్టి మొలకు కప్పుకొనిన” (3:7) వస్త్రములకంటే చర్మములతో చేసిన మెరుగైన వస్త్రములను వారికి ధరింప జేసాడు.

3.4. దేవుడు తోటనుండి వెళ్ళగొట్టుట (3:22-24)
దేవుడు వారిని ఏదెను తోటనుండి పంపివేసిన తరువాత, తూర్పు దిక్కున కెరూబులను (దేవదూతలను), గుండ్రముగా తిరుగుచు నిప్పులు చిమ్ము కత్తిని నిలిపెను. ప్రాణమిచ్చు చెట్టు దరిదాపులకు ఎవ్వరిని రానీయకుండుటకే దేవుడు ఇట్లు చేసెను (3:24).

4. సందేశం 
ఆదాము-ఏవల కథ, నేటి లోకానికి ముఖ్యముగా కతోలిక విశ్వాసులకు లోతైన పాఠాలను నేర్పిస్తున్నది.
1. దేవుని పోలిక, గౌరవము: నరుడు దేవుని పోలికలో సృష్టింప బడ్డాడు (1:27). ప్రతీ వ్యక్తియొక్క గౌరవాన్ని నొక్కిచెబుతుంది. దేవుని దృష్టిలో అందరూ విలువైనవారే. దేవుడు అందరిని సమదృష్టితో ప్రేమిస్తాడు. తనపట్ల, యితరులపట్ల గౌరవాన్ని ప్రోత్సహిస్తుంది.
2. స్వేచ్చ-బాధ్యత: ఆదాము-ఏవలకు ఎంచుకునే స్వేచ్చను ఒసగినను, సరిహద్దులు కూడా నిర్దేషించ బడ్డాయి. ఈ స్వేచ్చలో నైతిక నిర్ణయాలు చేయడం, దేవుని చిత్తానికి అనుగుణముగా జీవించే బాధ్యత ఉంటుంది. మన స్వేచ్చను తెలివిగా ఉపయోగించుకోవాలి. మన చర్యలు స్వార్ధపూరితం, హానికరం కాకుండా మంచితనానికి దారితీసే చర్యలై యుండాలి.
3. పాపముయొక్క వాస్తవికత, దాని పర్యవసనాలు: మానవుని పతనము (3వ అధ్యాయము) దేవునినుండి దూరమయ్యే ధోరణి, దాని తర్వాత వచ్చే సహజ పరిణామాల గురించి తెలియజేయు చున్నది. ఇది వ్యక్తిగత మరియు సామాజిక పాపముయొక్క వాస్తవికతను, మన సంబంధాలకు, సంఘాలకు, చివరిగా ఈ లోకానికి ఎలాంటి హాని కలుగజేయునో మనకు గుర్తుకు చేయుచున్నది. వినయము, పశ్చాత్తాపము, మారుమనస్సు, క్షమాగుణము ఎంత అవసరమో తెలియజేయు చున్నది.
4. దేవుని దయ, విమోచన వాగ్దానం: ఆదాము-ఏవలు దేవున్ని అవిధేయించినప్పతికినీ, దేవుడు వారిని చేయివిడువ లేదు. దేవుడు వారికి విమోచన వాగ్దానాన్ని తెలియజేసాడు (3:15). దయ, నిరీక్షణ, రక్షణగల ఈ సందేశం మనకు ప్రధానమైనది. దైవప్రేమ, కృపలో ముఖ్యముగా పాపములో పడిపోయినప్పుడు నమ్మకముంచాలని పిలుపునిస్తున్నది.
5. సృష్టిపట్ల బాధ్యత: దేవుడు ఆదాము-ఏవలను సృష్టికి సంరక్షకులుగా చేసాడు (1:28-30; 2:15). భూమాతతో గౌరవప్రదమైన, స్థిరమైన సంబంధానికి పిలుపునిస్తున్నది. పర్యావరణ పరిరక్షణ అను ఆధునిక కతోలిక బోధనలకు ఇది అనుగుణముగా యున్నది. పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న ఈ లోకం, దేవుని బహుమతిగా, సృష్టిని సంరక్షించే కర్తవ్యాన్ని గుర్తుకు చేయుచున్నది.
6. అహంకారము, శోధనలపట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నది. దేవునియందు విశ్వాసముయొక్క ప్రాముఖ్యతను తెలియజేయుచున్నది. ఆదాము-ఏవల అవిధేయత విశ్వాసులకు వినయము, పశ్చాత్తాపము, దేవుని దయపై ఆధారపడవలసిన అవసరాన్ని గుర్తుచేస్తున్నది. మానవ పతనముద్వారా పాపము ఈ లోకములోనికి ప్రవేశించినప్పటికిని, క్రీస్తుద్వారా దేవుని దయ ఎల్లప్పుడూ అందుబాటులోనున్నది.
కనుక, కతోలిక వేదాంతములో ఆదాము-ఏవల కథ మూలము. ఇది సృష్టి, పతనం, విముక్తియొక్క ఇతివృత్తాలను వివరిస్తున్నది. దేవునితో సఖ్యతకై మానవాళి ప్రయాణాన్ని, క్రీస్తుద్వారా నిత్యజీవమును నొక్కిచెబుతుంది. ఈ కథనం, కతోలిక దైవార్చన క్రమములో, దివ్యసంస్కారాలలో, కతోలిక విశ్వాస బోధనలలో, ముఖ్యముగా పాపం, మోక్షమును గూర్చిన బోధనలలో ప్రతిబింబిస్తూ ఉంటుంది.

[1] మొదటి సృష్టి కథనం “P” సాంప్రదాయంనుండి వచ్చినది. బాబులోనియ ప్రవాసములో లేదా తరువాత వ్రాయబడినది. “ఎనుమా ఎలిష్” అనే క్రీ.పూ. రెండవ సహస్రాబ్దికి చెందిన బాబిలోనియా సృష్టి ఇతిహాసముచే ప్రభావితమైనదిగా చెప్తారు.
[2] రెండవ సృష్టి కథనం “J” సాంప్రదాయంనుండి వచ్చినది.

No comments:

Post a Comment