జపమాల ప్రార్ధన – మరియ మధ్యవర్తిత్వం

జపమాల ప్రార్ధన – మరియ మధ్యవర్తిత్వం

కతోలిక విశ్వాసములో జపమాల అత్యంత ప్రాముఖ్యమైన, ప్రతిష్టాత్మకమైన ప్రార్ధనలలో ఒకటి. అత్యంత ప్రియమైన ప్రార్ధనలలో జపమాల ఒకటి. మన ఆధ్యాత్మిక ప్రయాణములో జపమాల ప్రధాన పాత్రను పోషిస్తుంది. యేసుప్రభువు తల్లియైన మరియయెడల మనకున్న భక్తి జపమాల. యేసుక్రీస్తు జీవితములోని కీలక సంఘటనలను, మానవాళి విమోచన కొరకు ఆయన చేసిన పవిత్ర కార్యములను, పరమ రహస్యములుగా ధ్యానిస్తూ చేసే గొప్ప ప్రార్ధన జపమాల. ఈ ప్రార్ధన మరియతల్లి మధ్యవర్తిత్వాన్ని కోరుతూ యేసు జీవితం, శ్రమలు, మరణ-పునరుత్థానములను ధ్యానం చేస్తూ ఉంటాము. మరియతల్లి మధ్యస్థ ప్రార్ధనలద్వారా యేసుక్రీస్తు జీవిత-మరణ-పునరుత్థానముల పరమ రహస్యములను లోతుగా ధ్యానించుటకు ఆకర్షించే శక్తివంతమైన ప్రార్ధన.

జపమాల యొక్క అర్ధము, భావము: ఆంగ్లములో “రోసరి” అనే పదం ‘రొసారియుం’ అనే లతీను పదమునుండి వచ్చినది. ‘గులాబీపూల మాల’ అని అర్ధము. ఈ సందర్భములో, జపమాల మరియతల్లికి అర్పించే ఆధ్యాత్మిక పూలగుచ్చాన్ని సూచిస్తుంది. జపమాల, క్రీస్తు జీవితము, పరమ రహస్యాలపై మనస్సును లగ్నము చేసే లక్ష్యముతో నిర్దిష్టమైన ప్రార్ధనలతో రూపొందించ బడినది.

జపమాల క్రమము:
1. సిలువ గురుతు: జపమాల ప్రారంభాన్ని సూచించే ప్రార్ధన
2. విశ్వాస సంగ్రహము: కతోలిక విశ్వాస సత్యాలను ప్రకటించే ప్రార్ధన
3. పరలోక జపము (ప్రభువు ప్రార్ధన): పెద్ద పూసలపై చేసే ప్రార్ధన
4. మంగళవార్త జపము: చిన్న పూసలపై చేసే ప్రార్ధన
5. త్రిత్వైక జపము: త్రిత్వమును స్తుతించే ప్రార్ధన
6. ఫాతిమా మాత జపము: ఈ వేడుదల తప్పక చెప్పాలని స్వయంగా మరియమాతయే ఫాతిమా నగరంలో చిన్నారులకు దర్శనమిచ్చినప్పుడు, క్రీ.శ. 1917 మే 13న మరియు జూన్‌ 13న తెలియ జేశారు.
7. జపమాల పరమ రహస్యములు: యేసు, మరియతల్లి జీవితములో నిర్దిష్టమైన సంఘటనలపై ధ్యానము
జపమాల పరమ దేవరహస్యములు
జపమాల నాలుగు పరమ దేవరహస్యాలుగా విభజింపబడినది. (1). సంతోష దేవరహస్యాలు (2) దుఃఖదేవరహస్యాలు (3) మహిమ దేవరహస్యాలు (4) వెలుగు దేవరహస్యాలు [2002లో పునీత రెండవ జాన్ పాల్ జగద్గురువులచే జోడించబడినది]. ఒక్కొక్క విభజనలో ఐదు పరమరహస్యాలు ఉంటాయి. వీటిని ప్రార్ధనలో ధ్యానిస్తూ ఉంటాము.

జపమాల భక్తి ప్రాముఖ్యత
క్రీస్తు-కేంద్రీకృతం: జపమాల క్రీస్తు-కేంద్రీకృతమైన ప్రార్ధన. మరియతల్లికి ప్రార్ధనలు ఉన్నప్పటికిని, యేసు జీవితం, ఆయన ప్రేషిత కార్యాలపై దృష్టిని సారిస్తూ, ధ్యానిస్తూ ఉంటాము. మరియతల్లిద్వారా యేసు ప్రభువు దరికి చేరుతున్నాము అనేది కతోలిక నమ్మకము.

మరియతల్లి మధ్యవర్తిత్వం: యేసు ప్రభువు తల్లిగా, మరియకు పరలోకములో ప్రత్యేక స్థానమును కలిగి యున్నదని, నిరంతరం మధ్యవర్తిత్వ ప్రార్ధనలు చేయునని కతోలిక విశ్వాసం. జపమాలద్వారా, మరియతల్లి ప్రార్ధనలను, కాపుదలను వేడుకొనుచున్నాము.
ధ్యానము,శాంతి: ప్రార్ధనలను పదేపదే వల్లించడము వలన, మన మనస్సులను శాంతపరుస్తూ, పరమ దేవరహస్యాలను లోతుగా ధ్యానిస్తూ ఉంటాము. ఇది మనలో శాంతిని నెలకొల్పి, దేవునితో సహవాస సంబంధాన్ని పెంపొందిస్తుంది.
ఆధ్యాత్మిక కవచం: జపమాల తరుచుగా శక్తివంతమైన ఆధ్యాత్మిక రక్షణ కవచముగా పరిగణించ బడుచున్నది. జపమాలను క్రమము తప్పకుండా జపించడం వలన చెడునుండి రక్షింప బడుచున్నాము. మన విశ్వాసం బలపడుచున్నది.
సామూహిక, వ్యక్తిగత ప్రార్ధన: జపమాలను వ్యక్తిగతముగాను, సామూహికముగాను ప్రార్ధించవచ్చు. సాధారణముగా దేవాలయాలలోను, మరియతల్లి సంస్మరణ రోజులలోను, వివిధ సందర్భాలలో జపమాలను జపిస్తూ ఉంటాము. ప్రపంచమంతటా కతోలిక విశ్వాసులు జపమాలను వ్యక్తిగతముగా ప్రార్ధిస్తూ ఉంటారు.

జపమాల భక్తి: భక్తిమార్గాలలో జపమాల ఒక గొప్ప అందమైన, మధురాతి మధురమైన భక్తిమార్గం. జపమాల భక్తి శతాబ్దాల నాటిది. ప్రత్యేకించి ఫాతిమా, లూర్దు నగరాలలో మరియతల్లి దర్శనాలద్వారా, ప్రతీరోజు జపమాలను ప్రార్ధించమని కోరియున్నది. పునీత దోమినిక్, రెండవ జాన్ పాల్ జగద్గురువులు, పునీత లూయిస్ మోంట్’ఫోర్ట్ [1673-1716] వంటివారు జపమాలను ఎంతగానో ప్రోత్సహించారు. వ్యక్తిగత పవిత్రతకు, ప్రపంచ శాంతి, పాపుల మారుమనస్సు కొరకు జపమాల ప్రాముఖ్యమని నొక్కిచెప్పారు. అక్టోబరు మాసం ప్రత్యేకించి జపమాల మాసముగా అంకితం చేయబడినది. అక్టోబరు 7న జపమాలమాత మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంటాము. ఈ పండుగ కతోలిక సంప్రదాయములో జపమాల ఎంత ప్రాముఖ్యమైనదో సూచిస్తుంది. జపమాల మహోత్సవం ప్రార్ధనయొక్క శక్తిని, భక్తియొక్క సౌందర్యాన్ని, అలాగే మన విశ్వాస ఆధ్యాత్మిక ప్రయాణములో మరియతల్లి నడిపింపును మనకు తెలియజేయుచున్నది.

జపమాల ప్రారంభ మూలాలు: జపమాల ప్రారంభ మూలాలను అనాధి క్రైస్తవ ప్రార్ధన పద్ధతులనుండి గుర్తించవచ్చు. మూడు, నాలుగవ శతాబ్దాలలో అనేకమంది మఠవాసులు, అలాగే సామాన్య ప్రజలుకూడా, రోజువారి ప్రార్ధనలలో 150 కీర్తనలను పఠించేవారు. నిరక్ష్యరాసులు, కీర్తనలను చదవలేనివారు, 150 సార్లు పరలోక ప్రార్ధనను జపించేవారు. ఈ ప్రార్ధనలను లెక్కించడానికి, జపమాల లాంటి పూసలను ఉపయోగించేవారు. ఈ ప్రార్ధనను “సామాన్య క్రైస్తవుల ప్రార్ధనా విధానము”గా పిలువబడేది. ఎందుకన, మఠవాస ప్రార్ధనా విధానములో పాల్గొనడానికి ఇదొక చక్కటి మార్గముగా ఉండేది.

పదకొండు, పన్నెండు శతాబ్దాల నాటికి మరియతల్లి భక్తి ఐరోపా దేశాలలో విస్తృతముగా వ్యాప్తి చెందినది. ఈ సమయములోనే ‘మంగళవార్త’ జపము ప్రాచుర్యములోనికి వచ్చినది. లూకా సువార్త ఆధారముగా, గబ్రియేలు దూత మరియతో పలికిన పలికుల ఆధారముగా చిన్న ప్రార్ధనగా ప్రారంభమైనది. కాలక్రమేణ మరియ మధ్యవర్తిత్వ ప్రార్ధనగా మారింది. సామాన్య క్రైస్తవులు 150 కీర్తనలను పఠించినట్లుగా, 150 మంగళవార్త జపాలను పఠించడం ప్రారంభించారు. వాటిని లెక్కించడానికి తరుచుగా పూసలను ఉపయోగించారు.

పునీత దోమినిక్ పాత్ర: జపమాల అధికారిక ప్రార్ధనగా గుర్తించడానికి ముఖ్య కారకులు 13వ శతాబ్ద ప్రారంభములోని పునీత దోమినిక్ గారు [1170-1221]. 1214వ సంవత్సరములో మరియతల్లి దోమినిక్ గారికి కనిపించి పాపుల మారుమనస్సుకు, తప్పుడు బోధనలను ఎదుర్కోవడానికి జపమాలను సాధనముగా ఉపయోగించ ప్రోత్సహించమని కోరియున్నది. ఈవిధముగా, జపమాల భక్తిని ప్రోత్సహించడములో పునీత దోమినిక్ సభ సభ్యులు ప్రధాన పాత్ర పోషించారు. వారే జపమాలను పది మంగళవార్త జపాలుగా నిర్వహించారు. ప్రార్ధన చేసేప్పుడు, యేసు-మరియ జీవిత పరమరహస్యాలను ధ్యానించే అభ్యాసాన్ని ప్రవేశ పెట్టారు. నేడు మనం జపిస్తున్న జపమాలకు రూపకర్త 15వ శతాబ్దములో దోమినిక్ సభ గురువు అలాన్ రోచ్ గారు [1428-1475]. జపమాల విభజన, పది మంగళవార్త జపాలు, యేసు-మరియ జీవిత పరమరహస్యాల ధ్యానం నిర్వహించారు. పాపుల పరివర్తన, శాంతి కొరకు మరియ మధ్యవర్తిత్వం కోరుకొనే భక్తిమార్గముగా జపమాలను ప్రచారం చేసారు. జపమాల ప్రార్ధన జపించడానికి, సమూహాలను ఏర్పాటు చేసి జపమాల భక్తిని వ్యాప్తి చేయుటకు ఎంతగానో కృషి చేసారు.

అధికారిక ఆమోదం: శతాబ్దాలుగా జపమాల జనాదరణ క్రమముగా పెరిగింది. అనేకమంది జగద్గురువులు జపమాలను శక్తివంతమైన ప్రార్ధనగా ఆమోదించారు. ముఖ్యముగా ఐదవ భక్తినాధ జగద్గురువులు [1566-1572] జపమాల చరిత్రలో ముఖ్యపాత్ర పోషించారు. 1569లో ఆధునీకరించిన జపమాలను అధికారికముగా ఆమోదించారు. లెపాంతో యుద్ధ విజయ [1571] జ్ఞాపకార్ధముగా అక్టోబరు 7న జపమాల మాత మహోత్సవాన్ని ప్రతిష్టించారు. 2002వ సంవత్సరములో రెండవ జాన్ పాల్ జగద్గురువులు సాంప్రదాయక సంతోష, దుఃఖ, మహిమ దేవరహస్యాలకు, వెలుగు దేవరహస్యాలను జోడించారు. విశ్వాసం బలోపేతమవుటకు, ప్రేమను పెంపొందించడానికి జపమాలను కుటుంబ ప్రార్ధనగా జపించాలని ప్రోత్సహించారు.

ఈవిధముగా, జపమాల పురాతన క్రైస్తవ సంప్రదాయాల కలయిక. మరియతల్లి పట్ల పెరుగుచున్న భక్తినుండి ఉద్భవించినది. నేడు కతోలిక ప్రార్ధనా జీవితానికి మూలస్థంభముగా నిలిచిపోయింది.

జపమాల-పునీతులు: పవిత్రతలో ఎదగడానికి, యేసు-మరియపట్ల భక్తిని పెంపొందించడానికి జపమాల పునీతుల జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైన స్థానాన్ని కలిగి యున్నది. వారు జపమాలను ఒక శక్తివంతమైన సాధనముగా భావించారు. పునీత పాద్రే పియో [1887-1968], చెడుకు వ్యతిరేకముగా జరిగే యుద్ధములో జపమాల తన ‘ఆయుధం’ అని పేర్కొన్నాడు. పునీత కలకత్తాపురి మదర్ థెరిసా [1910-1997], శాంతి, పరివర్తన కొరకు జపమాల శక్తివంతమైన ప్రార్ధనగా పరిగణించారు. లూర్దునగరములో మరియతల్లి బెర్నదెత్తకు [1844-1879] జపమాలతో దర్శనమిచ్చి పాపుల పరివర్తన కొరకు ప్రార్ధించ వలసినదిగా ప్రోత్సహించినది.

పునీత అల్ఫోన్సస్‌ ది లిగోరిగారు, “జపమాల భక్తి ప్రపంచానికి అపరితమైన మేలు అందించింది. ఎంతోమంది పాపమునుండి విమోచింప బడ్డారు. పరిశుద్ధ జీవితం జీవింప గాడిన పడ్డారు. మంచి మరణముతో సత్కరింపబడ్డారు. జపమాలను హృదయ పూర్వకంగా మనస్సు కలిగి జపించాలి” అని చెప్పియున్నారు.
మరియతల్లి, పునీత ‘యులాలియ’తో, “ఆదరా బాదరాగా మితభక్తితో ఏబది మూడు పూసల జపమాలను జపించడంకంటే, నెమ్మదిగా భక్తితో ఏబది మూడు పూసల జపదండ జపింపవలయును” అని చెప్పడం జరిగినది.
ఆరవ పౌల్‌ పాపుగారు, “జపమాలను వల్లించడం వలన యేసుప్రభువు జీవిత పరమ రహస్యాలను ధ్యానించేటట్లు తోడ్పడుతుంది. ప్రభువుకు దగ్గరగానున్న ఆ తల్లి దృష్టితో మనం ప్రభువును గాంచగలము” అని చెప్పియున్నారు.
పునీత రెండవ జాన్ పౌల్ జగద్గురువులు, “జపమాల నాకు యిష్టమైన ప్రార్ధన. ఇది దివిని-భువిని కలిపే ప్రార్ధన. మరియతల్లితో మనలను ఏకం చేస్తుంది. క్రీస్తు చెంతకు నడిపింపులో, ఆమె మన చేయి పట్టుకొని నడిపిస్తుంది” అని చెప్పియున్నారు.

No comments:

Post a Comment