30వ సామాన్య ఆదివారము, Year B

30వ సామాన్య ఆదివారము, Year B
యిర్మీయా 31:7-9; హెబ్రీ 5:1-6; మార్కు 10: 46-52
ప్రేమగల దేవునియందు మన విశ్వాసం


మొదటి పఠనము, నిరీక్షణ, పునరుద్ధరణ, దేవుని దయయొక్క సందేశాన్ని తెలియజేయుచున్నది. యిర్మియా గ్రంథములోని “ఓదార్పు ప్రవచన” భాగములోనిది. యిస్రాయేలు ప్రజలు ప్రవాసములో ఉండగా పలుకబడిన ప్రవచనాలు. చెల్లాచెదరైన తన ప్రజలను పిలచి, వారి గాయాలను నయము చేసి వారిని రక్షణలోనికి నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేయుచున్నాడు. పునర్నిర్మాణము, పునరుద్ధరణ వాగ్ధాన ప్రవచనాలు. ప్రవాసములోనున్న ప్రజలకు గొప్ప ఊరటను కలిగించే వాక్యాలు. వారి బాధలలో, కష్టాలలో దేవుడు వారిని మరువలేదని వారికి జ్ఞాపకం చేసే పలుకులు. నేటికీ ఈ ప్రవచనం మనకు వర్తిస్తుంది. పాపపు బానిసత్వములోనున్న మనకుకూడా ఊరటను కలిగించే పలుకులు. యిస్రాయేలు ప్రజలు దేవునిపట్ల వారి అవిశ్వాసము వలన ప్రవాసానికి కొనిపోబడ్డారు [586లో దక్షిణరాజ్యం (యూదా), 722లో ఉత్తరరాజ్యం (ఇశ్రాయేలు) ప్రవాసానికి లోనయ్యాయి]. అయినప్పటికినీ, “సంతసముతో పాడుడు. ప్రభువు తన ప్రజలను రక్షించెను” (31:7) అని నిరీక్షణతో కూడిన పలుకులను దేవుడు పలుకుచున్నాడు. ప్రజలు అవిశ్వాసముగా నున్నను, దేవుడు విశ్వాసపాత్రుడై యున్నాడు. ఈ వాక్యం నేడు మనకుకూడా బలమైన సందేశాన్నిస్తుంది. పాపములోనున్న మనకు, ఆధ్యాత్మిక ప్రవాసములోనున్న మనకు, దేవునినుండి దూరముగానున్న మనకు, దేవుని దయ మన చేరువలోనే నున్నదని తెలియజేయుచున్నది. యిస్రాయేలు ప్రజలవలె మనలనుకూడా దేవుడు తన దరి చేర్చుకోవాలని ఆశిస్తున్నాడను నమ్మకాన్ని కలిగిస్తుంది. పాపక్షమాపణ ఒసగే దివ్యసంస్కారాల ద్వారా దేవుని దయను ఇప్పటికే మనం పొందుచున్నామని గుర్తుచేసుకుందాం.

“గ్రుడ్డివారు, కుంటివారు, గర్భవతులు, ప్రసవించుటకు సిద్ధముగా నున్నవారు ఎల్లరు కలిసి మహా సమూహముగా తిరిగి వత్తురు” (31:8). దేవుడు కేవలం బలవంతులను, నీతిమంతులను మాత్రమే కాకుండా, బలహీనులను కూడా తిరిగి పిలుస్తాడని, నడిపిస్తాడని ప్రవచనం తెలియజేయు చున్నది: బలహీనులపట్ల, పేదవారిపట్ల, అట్టడుగున నున్నవారిపట్ల, బాధలలో నున్నవారిపట్ల దేవునికి ప్రత్యేక శ్రద్ధ కలిగి యున్నాడని చెప్పడానికి ఇదొక గొప్ప సాక్ష్యం. తమంతటతాము గమ్యానికి చేరుకోలేరు. దేవుడు వారిని నడిపిస్తాడని వాగ్దానం చేయుచున్నాడు. క్రీస్తు దేహమైన శ్రీసభయొక్క దృక్పధముకూడా ఈవిధముగా ఉండాలని ఈ ప్రవచనం పిలుపునిస్తుంది.

దేవుడు యిస్రాయేలు ప్రజలను నడిపించుకొని రాగా వారు ఏడ్పులతో, ప్రార్ధనలతో తిరిగి వత్తురు. (31:9). ఏడ్పులు - దేవుని దయకు ప్రతిస్పందనగా, గతములో చేసిన పాపాలకు దుఃఖపడుదురని సూచన. ‘తప్పిపోయినవారు’ తిరిగి దొరికినప్పుడు పొందే ఆనంద భాష్పాలుగా అర్ధంచేసుకోవచ్చు. ఇది నేటి మన పశ్చాత్తాపానికి, దేవునితో సఖ్యతను సూచిస్తుంది. వినయముతో దేవున్ని సమీపించినపుడు, ఆయన దయకొరకు వేడుకొనినప్పుడు, యిస్రాయేలు ప్రజలవలెనె ఆయన మనలను తన వైపునకు నడిపిస్తాడు. ఈ పరివర్తన కొన్నిసార్లు బాధాకరమైనను, దేవునితో సహవాస బంధములోనికి నడిపించునను సంతోషమును కలిగిస్తుంది. పాపసంకీర్తనలో పాపాల కోసం కార్చిన కన్నీరు, దేవుని దయను పొందినప్పుడు ఆనంద బాష్పాలుగా మారతాయి.

దేవుడు యిస్రాయేలు ప్రజలను తిన్నని మార్గమున నడిపించును. వారు కాలుజారి పడిపోరు. జల ప్రవాహముల వద్దకు కొనివచ్చును (31:9). సరళమైన మార్గములో, తడబడని మార్గములో, అనగా దేవుని మార్గదర్శకములో వారిని నడిపించును. జలము తాజాదనమును, జీవితాన్ని, పరిశుభ్రతను సూచిస్తుంది. జలప్రవాహం నేడు మనకు మన జ్ఞానస్నాన జలాలను జ్ఞప్తికి చేయుచున్నది. మనం పాపమునుండి శుద్ధిచేయబడి యున్నాము. తిరిగి దేవుని కుటుంబములోనికి నడిపింపబడి యున్నాము. సువార్తలో ప్రభువు చెప్పిన “జీవజలము”ను (యోహాను 4:10) ఇది గుర్తుకు చేయుచున్నది. విశ్వసించు వారికి నిత్యజీవం ఒసగును. “తిన్నని మార్గము” నైతిక, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని సూచిస్తుంది.

దేవుడు యిస్రాయేలుకు తండ్రి. ఎఫ్రాయీము తొలిచూలు బిడ్డయగును (31:9). ఇది దేవుని ఒడంబడికను గుర్తుచేస్తుంది. తన ప్రజలతో చేసుకున్న ఒడంబడిక కొనసాగును. తన ప్రజలతో దేవునికున్న అవినాభావ సంబంధాన్ని, సాన్నిహిత్యాన్ని తెలియజేయుచున్నది. దేవుడు దూరముగా ఉండువాడు కాదు. తన బిడ్డలకోసం లోతైన శ్రద్ధ కలిగే ప్రేమగల తండ్రి. దేవుడు మన తండ్రియని గుర్తుకు చేయుచున్నది. క్రీస్తుద్వారా మనం దేవుని బిడ్డలమైనాము. ఇది మన గుర్తింపునకు పునాది. ప్రేమగల తండ్రిగా, దేవుడు మనలను నడిపించును, మనకు ఒసగును, తన సహవాసములోనికి కొనివచ్చును. “ఎఫ్రాయీము తొలిచూలు బిడ్డ” యిస్రాయేలుపై దేవునికున్న ప్రత్యేక సంబంధాన్ని సూచిస్తుంది. అయితే విశ్వసించు వారందరూ ఈ దైవీక కుటుంబములోనికి చేర్చబడతారనే గొప్ప అవగాహనను మనకు కలుగ జేయుచున్నది.

యిర్మియా 31:7-9 ప్రవాసమునుండి దేవుని విడుదలకు వాగ్దానం. ఇది క్రీస్తు రక్షణ కార్యాన్ని ముదస్తుగానే సూచిస్తుంది. క్రీస్తు సమస్త మానవాళిని [నేటి సువిశేషములో గ్రుడ్డివానిని] నిత్యజీవములోనికి నడిపించును. ఈ పఠనమును ధ్యానిస్తూ ఉండగా, యిస్రాయేలు ప్రజలవలె మన పాపాల కొరకు దుఃఖపడుదాం. దేవుని దయపై నమ్మకముంచుదాం. ఆయన ఏర్పాటు చేసిన ‘తిన్నని’ మార్గమున అనుసరించుదాం.

నేటి సువిశేషములో యేసుప్రభువు యెరికో పట్టణమునుండి, తన శిష్యులతోను, జనసమూహములతోను యెరూషలేము వైపునకు వెళ్ళుచుండగా, భిక్షకుడైన బర్తిమయి అనే గ్రుడ్డివానికి దృష్టిదానము చేయుట గురించి వింటున్నాము. ‘బర్తిమయి’ అనగా ‘తిమయి కుమారుడు’ అని అర్ధం. ఈ సంఘటన బర్తిమయి విశ్వాసము, పట్టుదలను, యేసుప్రభువు యొక్క కరుణ, దైవీకశక్తిని వెల్లడి చేయుచున్నది. బర్తిమయి గ్రుడ్డివాడైనప్పటికిని, యేసు ఎవరో తన లోతైన అత:దృష్టిని ప్రదర్శించాడు. యేసు అటుగా వెళ్ళుచున్నాడని విని, “దావీదు కుమారా! యేసు ప్రభూ! నన్ను కరుణింపుము” (10:47, 48) అని కేకలు వేసాడు. అయితే, ఈ కేక భిక్షము కోసం కాదు. ఇది నజరేతు నివాసియగు యేసునందు తన విశ్వాస ప్రకటన. యేసును ‘మెస్సయ్య’గా గుర్తించాడు, అంగీకరించాడు, విశ్వసించాడు. “దావీదు కుమారా!” అనునది దీర్ఘకాలముగా ఎదురుచూస్తున్న దావీదురాజు వారసుడిగా, ‘మెస్సయ్య’యొక్క ప్రేషిత కార్యమును గుర్తేంచే బిరుదుగా చూస్తున్నాము. అతని కేకలు విన్నవారు, అతనిని ఆపాలని చూసినవారు కూడా అతని ముఖములో, స్వరములో పట్టుదలను చూసారు. అందుకే వారు “ఓరి, లెమ్ము, ధైర్యముగా నుండుము. ఆయన రమ్మనుచున్నాడు” (10:49) అని బర్తిమయిని పిలిచారు. ఇది నిజముగా యేసు తనను స్వస్థపరచగలడని తన అచంచలమైన నమ్మకానికి, విశ్వాసానికి గొప్ప నిదర్శనం. ఈ అత:దృష్టిని కలిగి యుండటములో అనేకసార్లు శిష్యులు విఫలమయ్యారు.

యేసు పిలవగానే, బర్తిమయి తన వస్త్రమును పారవేసి, వెంటనే లేచి యేసు వద్దకు వచ్చెను. “వస్త్రమును పారవేయడం” [బహుశా తనకున్న ఏకైన సంపద] తన పాత జీవితాన్ని వదిలివేయడాన్ని, భిక్షమెత్తుకునే తన స్థితిని వదిలివేయడాన్ని సూచిస్తుంది. వాటన్నింటిని వదిలిపెట్టి యేసును అనుసరించడానికి బర్తిమయి సిద్ధముగా నున్నాడని సూచిస్తుంది. యేసుప్రభువుతో కలయిక తన జీవితాన్ని సంపూర్ణముగా మార్చివేస్తుందని బర్తిమయి విశ్వసించాడు. శిష్యరికం అనేది ప్రతీఒక్కరికి అని కూడా మనకు అర్ధమగుచున్నది.

“నేను ఏమి చేయగోరుచున్నావు?” అని యేసు బర్తిమయిని అడుగగా, “బోధకుడా! నాకు చూపు దయచేయుము” అని వేడుకొన్నాడు” (10:51). “నీవు వెళ్ళుము. నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూర్చినది” (10:52) అని యేసు అనిన వెంటనే బర్తిమయి దృష్టిని పొంది యేసును “త్రోవవెంట” అనుసరించాడు. స్వస్థతకు వాడిన గ్రీకు పదానికి అర్ధం “రక్షింపబడెను” అని అర్ధం. కనుక, బర్తిమయి శారీరక స్వస్థతతో పాటు ఆధ్యాత్మిక స్వస్థతను కూడా పొందియున్నాడు. “త్రోవవెంట” అనుసరించడం అనగా భౌతిక మార్గం మాత్రమేగాక, శిష్యరిక మార్గాన్ని, సిలువ మార్గాన్ని సూచిస్తుంది.

బర్తిమయి పట్టుదల: విశ్వాసమునందు బర్తిమయి పట్టుదల మనందరికి ఆదర్శం. “ఊరకుండుము” అని గద్దించినను మరింత బిగ్గరగా కేకలు పెట్టాడు. యేసును వెతకడములో ఈ పట్టుదల మన ఆధ్యాత్మిక జీవితాలకు ఆదర్శం. అనుమానం, అడ్డంకులు, భయం, ఒత్తిడుల సమయాలలో మనం ధైర్యముగా ప్రభువును పిలుస్తూనే [ప్రార్ధన] ఉండాలి.

ఆధ్యాత్మిక అంధత్వం: బర్తిమయి శారీరకముగా అంధుడైనను, చూపు ఉన్న చాలామంది కంటే స్పష్టముగా ప్రభువును చూడగలిగాడు. యేసును ‘మెస్సయ్య’గా గుర్తించాడు. బైబులులో గ్రుడ్డితనం ఆధ్యాత్మిక అంత:దృష్టి లేకపోవడానికి సూచన (యెషయ 42:18-19) కనుక, మన ఆధ్యాత్మిక అంధత్వాన్ని పరికించుకుందాం. మన అనుదిన జీవితాలలో, ఆధ్యాత్మిక కన్నులతో యేసును ఇతరులలో చూడగలుగు చున్నామా?

విశ్వాసము వలన పరివర్తన: బర్తిమయి కేవలం శారీరక స్వస్థతయేగాక, అతని విశ్వాసం అతని జీవితాన్ని పరిపూర్ణముగా మార్చివేసింది. యేసు శిష్యునిగా క్రొత్త జీవితాన్ని ప్రారంభించాడు. విశ్వాసముతో క్రీస్తును అనుసరించాలని అనుకున్నప్పుడు, పాత జీవితాన్ని విడిచి పెట్టాలని ప్రభువు మనలను కోరుచున్నాడు. దేవుని కృపను పొందుటకు, విశ్వాసం కీలకం. విశ్వాసము వలన స్వస్థత, రక్షణ లభిస్తుంది.

నేటి సువార్త మన విశ్వాసాన్ని సవాలు చేయుచున్నది. విశ్వాసముతో యేసును అనుసరిస్తున్నామా? యేసు మనలను పిలుస్తాడు అన్న నమ్మకముతో ఉన్నామా? ప్రభువునుండి మనం నిజముగా ఏమి కోరుకుంటున్నాము. యేసు మన కోరికలను తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. కాని మనం విశ్వాసముతో, ఆయన దయపై నమ్మకముతో అడగడానికి సిద్ధముగా ఉన్నామా? ఒకసారి యేసు స్వస్థత స్పర్శను పొందుకున్న తర్వాత, మనం ఆయనను అనుసరించాలని పిలువ బడతాము. విశ్వాసం అనగా కేవలం స్వీకరించడం మాత్రమే కాదు, ఆయనతో సహవాస బంధములోనికి ప్రవేశించడం, మరియు ప్రతిరోజు ఆయనతో నడవడము.

2 comments: