మరణాన్ని ఎలా అర్ధం చేసుకుందాం?

 మరణాన్ని ఎలా అర్ధం చేసుకుందాం?


మరణము–బైబులు: జీవితం దైవానుగ్రహం. ‘ఆత్మ’ తన ఉనికిని కొనసాగించే నూతన జీవితమునకు మార్పుయే మరణము. కనుక, మరణం అంతిమం కాదు. పాపము వలన మరణం లోకమునకు ప్రవేశించినది. ఆదాము ఏవలు దేవున్ని అవిధేయించిన కారణమున, నరుని ఏదెను తోటనుండి వెళ్ళగొట్టెను (ఆది 3:23). తద్వారా, మరణం నరుని జీవితములోనికి ప్రవేశించినది (3:19). నూతన నిబంధనములో పౌలు “పాపము యొక్క వేతనము మరణము” (రోమీ 6:23) అని ఇదే విషయాన్ని పున:ప్రస్తావించాడు. మరణం ఆదిపాపానికి శిక్షయని, అయితే మానవాళిపట్ల దేవుని దయగల ప్రణాళికలో భాగమే అని పునీత అగుస్తీను వర్ణించాడు. మరణం అనగా శరీరమునుండి ఆత్మ వేరుచేయబడుట. “నరుని దేహము ఏ మట్టినుండి వచ్చినదో ఆ మట్టిలోనికి తిరిగి పోవును. అతని ప్రాణము మొదట దానిని దయచేసిన దేవుని చేరుకొనును” (ఉపదేశకుడు 12:7). అయితే, మరణించిన వారి పునరుత్థానముపై నిరీక్షణను కూడా బైబులు నొక్కివక్కానిస్తుంది. యేసు పునరుత్థానం క్రైస్తవ విశ్వాసమునకు పునాది, ప్రధానం. మరణానికి అంతము లేదనే ఆశను మనకు కలిగిస్తుంది. “నేనే పునరుత్థానమును, జీవమును. నన్ను విశ్వసించువాడు, మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికిని మరణింపడు” (యోహాను 11:25-26) అని యేసు ప్రకటించాడు. పౌలు కూడా మరణాన్ని జయించడం గురించి చెప్పాడు, “మృత్యువు నాశనం చేయబడినది. ఓ మృత్యువా! నీ విజయము ఎక్కడ? ఓ మృత్యువా! బాధ కలిగింపగల నీ ముల్లు ఎక్కడ?” (1 కొరి 15:54-55). క్రీస్తుద్వారా మరణముపై ఈ విజయం క్రైస్తవ విశ్వాసానికి ప్రధానం.

మరణము–కతోలిక విశ్వాసం: మరణం భూలోక జీవితమునుండి శాశ్వతజీవితానికి మార్గము. శరీరమునుండి ఆత్మ నిష్క్రమిస్తుంది, కాని వ్యక్తిగత ఉనికికి అది ముగింపు కాదు. ఆత్మ జీవిస్తూనే ఉంటుంది. అది శాశ్వతములోనికి ప్రవేశిస్తుంది. మరణం తరువాత, ప్రతీ ఆత్మ ప్రత్యేక/వ్యక్తిగత తీర్పును ఎదుర్కుంటుంది. “ప్రతి వ్యక్తి ఒక్కసారే మరణించి తదుపరి దేవునిచే తీర్పు పొందవలెను” (హెబ్రీ 9:27). విశ్వాసము, నైతిక జీవిత ఆధారముగా, ఆత్మ పరలోకములోనికిగాని, ఉత్థరించు స్థలములోనికిగాని, నరకములోనికిగాని ప్రవేశిస్తుంది. పరలోకము అనగా [వెంటనే లేదా ఉత్థరించు స్థలముద్వారా] దైవకృపలో నున్నవారు, నీతిమంతులు. ఉత్థరించు స్థలము అనగా రక్షింపబడిన వారు, కాని ఇంకా శుద్ధీకరణ అవసరమైనవారు. నరకము అనగా పశ్చాత్తాపం లేకుండా ఘోర పాపములో మరణించి తద్వారా దైవకృపను తిరస్కరించినవారు. అంతిమ కాలమున, సకల ఆత్మలు సాధారణ తీర్పును పొందును. పునరుత్థానములో ఆత్మలు వారి శరీరములతో ఐఖ్యమగును. దేవుని న్యాయము సంపూర్ణముగా బయలు పరచ బడును (పునీత జస్టిన్, వేదసాక్షి).

మరణము-వేదసాక్షి: శ్రీసభ వేదసాక్షులను అనగా విశ్వాసము కొరకు తమ ప్రాణాలను అర్పించినవారిని ఎంతగానో గౌరవిస్తూ ఉంటుంది. శాశ్వత జీవితమునకు, క్రీస్తుతో ఐఖ్యము, సహవాస జీవితానికి ప్రత్యక్ష మార్గము. వీరు ఎలాంటి శుద్ధీకరణ లేకుండానే నేరుగా పరలోకానికి కొనిపోబడతారు. పునీత అతియోకు ఇగ్నేషియస్ గారు ఇలా ప్రార్ధించారు, “నేను దేవుని గోధుమను. క్రూరమృగాల దంతాలచేత నేను నలిపివేయబడినప్పుడు, నేను క్రీస్తుయొక్క స్వచ్చమైన రొట్టెను కనుగొనగలను” (రోమీయులకు లేఖ, 4వ అధ్యాయం).

నిత్యజీవితము: మరణం అంతిమం కాదని కతోలిక విశ్వాసం. దేవుని కృపలో మరణించేవారు పరలోకములో ఆయనతో నిత్య జీవితాన్ని ఆనందిస్తారు. ఇది దేవునితో పరిపూర్ణమైన సహవాస జీవితము. “దేవుడు ప్రతీ కన్నీటిని తుడిచి వేయును...ఇక మృత్యువు ఏ మాత్రము ఉండబోదు” (దర్శన 21:4) అని దర్శన గ్రంధములో చూస్తున్నాము.

మరణం-క్రీస్తు మరణములో పాల్గొనడము: కతోలిక విశ్వాసం ప్రకారం, క్రీస్తు మరణ-పునరుత్థానముల వలన మరణం రూపాంతరము చెందినది. క్రైస్తవులు జ్ఞానస్నానములో క్రీస్తు మరణ-ఉత్థానములో ఐఖ్యమగుచున్నారు. “మనము అందరము క్రీస్తు యేసు నందు జ్ఞానస్నానము పొందినపుడు ఆయన మరణము నందు జ్ఞానస్నానము పొందితిమి. కనుక మన జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలుపంచుకొంటిమి. ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై యుండినచో, ఆయన పునరుత్థానములో కూడ మనము తప్పక ఆయనతో ఏకమై యుందుము” (రోమీ 6:3-5). అనగా మరణము వలన కలుగు దు:ఖములో నున్నప్పటికిని, మరణము పాస్క పరమ రహస్యములో పాల్గొంటుంది. కనుక, మరణము అర్ధరహితమైనది కాదు. మరణము నిరీక్షణతో నిండియున్నది. ఎందుకన, క్రీస్తు మనందరి కోసం నిత్యజీవపు ద్వారాలను తెరచాడు. “చనిపోయిన వారిని పోగుట్టుకున్న వారివలె దు:ఖపడకూడదు. ఎందుకన, మరణించి ఉత్థానమైన క్రీస్తునందు వారు లేపబడుదురు అని విశ్వసిస్తున్నాము” (పు. జెరుసలెం సిరిల్, సంక్షేప బోధనలు IV 23).

మరణము-దివ్యసంస్కారాలు: కతోలికులు అవస్థ అభ్యంగనమను దివ్యసంస్కారాన్ని విశ్వసిస్తారు. తీవ్రమైన అనారోగ్యము లేదా మరణావస్థలో నున్నవారికి ఈ దివ్యసంస్కారం ఇవ్వబడుతుంది. దైవకృప, ఆధ్యాత్మిక స్వస్థత, కొన్నిసార్లు శారీరక స్వస్థతను చేకూరుస్తూ వారిని ఆత్మీయముగా బలపరుస్తుంది. మరణావస్థలో నున్నవారిని [చివరి] దివ్యసత్ప్రసాదమును (వియాటికుం) స్వీకరించమని శ్రీసభ ప్రోత్సహిస్తుంది. ఇది నిత్యజీవిత ప్రయాణానికి ఆధ్యాత్మిక పోషణగా ఒసగబడుచున్న పవిత్ర దివ్యసత్ప్రసాదము.

పునీతుల బాంధవ్యము-మరణించిన వారి కొరకు ప్రార్ధనలు: పునీతుల బాంధవ్యముద్వారా జీవించుచున్నవారికి, మరణించిన వారికి మధ్యన లోతైన బంధమున్నదని కతోలిక విశ్వాసం. మృతుల కొరకు ప్రార్ధించే సంప్రదాయాన్ని శ్రీసభ పాటిస్తుంది. మరణించిన ఆత్మలకోసం, ముఖ్యముగా ఉత్థరించు స్థలములోనున్నవారి శుద్ధీకరణ కొరకు ప్రార్ధించమని భూలోకములో జీవించుచున్న విశ్వాసులను ప్రోత్సహిస్తుంది. ఈ విశ్వాసం 2 మక్క 12:45న చూడవచ్చు, “చనిపోయిన వారికి పాప విముక్తి కలుగునని యెంచి వారి కొరకు పాపపరిహారబలి అర్పింపజేసెను”. “క్రీస్తు శరీరరక్తముల బాంధవ్యములో శ్రీసభ మరణించిన వారికొరకు ప్రార్ధిస్తూ ఉంటుంది” (పు. అగుస్తీను, ప్రసంగం 172, 2). “ఒక వ్యక్తి శరీరమునుండి నిష్క్రమించిన తరువాత, ఆ వ్యక్తి పేర అర్పించబడే ప్రార్ధనలు, పుణ్యకార్యాలు, దానధర్మాల ద్వారా సహాయం అందించ బడుచున్నది” (పు. నిస్సా గ్రెగోరి, మరణించిన వారిపై ప్రసంగం)

మంచి మరణము కొరకు సిద్ధపడుట: ఆధ్యాత్మిక సంసిద్ధత ఎంతో అవసరము. సుగుణాలతో కూడిన జీవితాన్ని జీవించాలి. విశ్వాసము, పశ్చాత్తాపము కలిగి జీవించాలి. మంచి మరణము అనగా దేవునితో సఖ్యపడి, దేవుని కృపలో మరణించడం. మరణ తీర్పులో మనతో వచ్చేవి మన సద్గుణాలు, మన మంచి పనులు మాత్రమే! “ఈ లోకాన్ని విడచినప్పుడు, మనం ఈ లోకములో వదిలేసిన వాటిపైగాక, మనతో తీసుకొని వెళ్ళే సద్గుణాలు, పుణ్యకార్యాలను బట్టి తీర్పు ఉంటుంది” (పు. జాన్ క్రిసోస్తం, మత్తయి సువార్తపై ప్రసంగం 34).

సారాంశం: పాపము యొక్క ఫలితం మరణము అయితే, క్రీస్తుద్వారా మరణము జయించ బడినది. మరణం అనేది శాశ్వత జీవితానికి మార్పు. ఆత్మలు తీర్పునకులోనై, పరలోకము, ఉత్థరించు స్థలము, నరకములోనికి ప్రవేశిస్తాయి. శరీరము యొక్క పునరుత్థానం, దేవునితో శాశ్వత జీవిత సహవాసం కతోలిక విశ్వాసములో ప్రధానం.

No comments:

Post a Comment