మత్తయి 2:1-12 – జ్ఞానులు – బాలయేసు సందర్శనము
యేసు
దావీదు కుమారుడు. ఆయన యూద వంశములో జన్మించిన రాజు. ఆయన నిజమైన రాజు. రాజులకు రాజు,
ప్రభువులకు ప్రభువు. యూదయా సీమయందలి బెత్లేహేమునందు యేసు జన్మించాడు. తూర్పు
దిక్కునుండి వచ్చిన జ్ఞానులు యూదేతరులు. యేసు రాజ్యాధికారం ఇశ్రాయేలుకు మాత్రమేగాక,
అన్ని దేశాలకు సంబంధించినదని సూచిస్తుంది. ప్రభువు సేవకుని గూర్చిన రెండవ గీతములో,
“నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును” (యెషయ 49:6) అన్న ప్రవచనాన్ని
నెరవేరుస్తూ, యేసు పుట్టుక విశ్వవ్యాప్తముగా ప్రాముఖ్యమైనదని అర్ధమగుచున్నది.
విశ్వమంతయు, క్రీస్తు రాజ్యాధికారమును గుర్తించులాగున జ్ఞానుల సందర్శన మనకు తెలియ
జేయుచున్నది.
తూర్పు
దిక్కున నక్షత్రమును చూచి జ్ఞానులు యేసును ఆరాధింప వచ్చితిరి. నక్షత్రము దైవీక
మార్గదర్శకముగా చూస్తున్నాము. వారు విశ్వాసముతో నక్షత్రాన్ని అనుసరించారు. గమ్యం
తెలియకపోయినా, దేవుని ప్రణాళికలో విశ్వాసము, విశ్వాసంయొక్క ప్రాముఖ్యతను ఇది
సూచిస్తుంది. హేరోదురాజు, భూసంబంధమైన శక్తి, భయం, అధికారమును కాపాడుకోవాలనే
కోరికకు ప్రతీక. యేసు జనన వార్త విని “కలత చెందాడు”, కలవర పడ్డాడు. తన
రాజ్యాధికారానికి ముప్పుగా భావించాడు. దీనికి విరుద్ధముగా, జ్ఞానులు వినయముతో
రాజుగా జన్మించిన యేసును గౌరవించి ఆరాధింప వచ్చారు. వినయశీలురు దేవుని చిత్తాన్ని
అంగీకరిస్తారు. ప్రాపంచిక శక్తి, అహంకారమును అంటిపెట్టుకొని యున్నవారు దేవుని
చిత్తాన్ని వ్యతిరేకిస్తారు.
జ్ఞానులు
తెచ్చిన బహుమతులు, అర్ధవంతమైన బహుమతులు. ‘బంగారం’ యేసు రాజుల రాజు అని
సూచిస్తుంది. ‘సాంబ్రాణి’ యేసు దైవత్వాన్ని సూచిస్తుంది. ఎందుకన, ఆరాధనలో
సాంబ్రాణి [ధూపం] ఉపయోగిస్తారు. ‘పరిమళ ద్రవ్యములు’ మానవాళి రక్షణ కొరకు యేసు మరణాన్ని
సూచిస్తుంది. భూస్థాపనలో పరిమళ ద్రవ్యములను ఉపయోగిస్తారు. భవిష్యత్తులో యేసు
శ్రమలను, లోక పాప పరిహార్ధముగా మరణించబోయే రక్షకునిగా ఆయన పాత్రను సూచిస్తుంది.
“హేరోదు
చెంతకు మరలి పోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ
దేశమునకు తిరిగిపోయిరి”. దైవీక రక్షణకు ప్రతీక. మానవ బెదిరింపులు, దుష్టపథకాలు
పన్నినప్పుడు, దేవుని సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని అర్ధమగుచున్నది. రక్షణ ప్రణాళికను
ఎవరూ అడ్డుకొనలేరు. అది కొనసాగుతూనే ఉంటుంది.
జ్ఞానులద్వారా,
అన్యులకు దేవుడు బయలు పరచు [ఎరుక పరచుట] సంఘటనను “యేసు సాక్షాత్కార మహోత్సవము”గా
కొనియాడుతూ ఉంటాము. యేసును మెస్సయ్యగా, రాజుగా కొనియాడటం. ఈ సంఘటన యేసును
మెస్సయ్యగా, రాజుగా బహిరంగముగా అంగీకరించిన ప్రధమ సంఘటనలలో ఒకటి.
ఆధ్యాత్మిక సందేశం: (1). క్రీస్తును నిష్కపట హృదయాలతో వెదకాలి. జ్ఞానుల ప్రయాణం, నరుని ఆత్మ సత్యమును, అర్ధమును అన్వేషించుటను సూచిస్తుంది. ఎన్ని ఇబ్బందులు, అడ్డంకులు ఉన్నప్పటికినీ, విశ్వాసులు, హృదయపూర్వకముగా, విశ్వాసముతో, అంకితభావముతో యేసును వెదకాలి. (2). దేవుని పిలుపుకు ప్రతిస్పందించాలి. నక్షత్రమనే దైవీక చిహ్నానికి జ్ఞానులు స్పందించినట్లుగా, మన జీవితములో కూడా, ప్రార్ధన, వాక్కు, ఇతర దైవీక మార్గదర్శకాల ద్వారా దేవుని సాన్నిధ్యముగల సంకేతాలకు ప్రతిస్పందించాలి. (3). యేసు ముందు సాష్టాంగపడి వినయపూర్వకముగా ఆరాధించాలి. ‘సాష్టాంగపడటం’ వినయమునకు, గౌరవమునకు సూచన. నిజమైన గొప్పతనం దేవున్ని ఆరాధించడములో ఉంటుంది తప్ప, భూసంబంధమైన శక్తిని, హోదాను వెదకుటలో ఉండదు.
No comments:
Post a Comment