మత్తయి 2:16-18 – శిశుహత్య
బాల
యేసును చంపే క్రమములో బేత్లెహేము నందును, పరిసరములందున్న రెండేండ్లను, అంతకంటే
తక్కువ ప్రాయముగల మగ శిశువులందరు, పవిత్రమైన చిన్నారి బిడ్డలను ఘోరాతి ఘోరముగా
చంపమని హేరోదు రాజు ఆజ్ఞాపించాడు. ఇదొక విషాద సంఘటన. హేరోదు రాజుచేత చంపబడిన ఈ
చిన్నారులు క్రీస్తు వేదసాక్షులుగా శ్రీసభ పరిగణిస్తుంది. వారు చేసిన త్యాగం,
వారికి తెలియక పోయిననూ, వారు యేసుక్రీస్తు కొరకు మరణించారు. డిశంబరు 28న వారిని
తల్లి శ్రీసభ స్మరించుకుంటూ ఉన్నది. వేదసాక్షులుగా వారిని గౌరవిస్తూ ఉన్నది. వారి
శ్రమలు, బాధలు, క్రీస్తు రక్షణలో పాల్గొనడముగా పరిగణింప బడుతుంది. తరువాత క్రీస్తు
మానవాళి కొరకు శ్రమలను పొంది మరణించారు.
2:17-18,
యిర్మియా ప్రవక్త పలికిన ప్రవచనం నేరవేరినట్లుగా ప్రస్తావించబడినది (యిర్మియా 31:15).
రాహేలు, యాకోబు భార్య, ఇశ్రాయేలు ప్రజలకు తల్లిగా, వారు బానిసత్వము లోనికి
కొనిపోబడి నపుడు ఆమె విలపించినది. మత్తయి సువార్తలో బేత్లెహేములోని తల్లులు తమ
పిల్లల పట్ల దు:ఖిస్తున్నప్పుడు ఈ ప్రవచనం వర్తింప జేయబడినది. పాత నిబంధన
ప్రవచనాలను నెరవేరుస్తూ, యేసు జననానికి సంబంధించిన సంఘటనలు దేవుని ప్రణాళికలో
భాగమని అర్ధమగుచున్నది.
చిన్నారుల
ఊచకోత, లోకములోనున్న చెడును బట్టబయలు చేస్తుంది. ముఖ్యముగా, గర్వం, భయం, అధికార
దుర్వినియోగము యొక్క విధ్వంసకర పరిణామాలను తెలియ జేస్తుంది. యేసు జనన వార్త విని
హేరోదు కలత చెందడం, బెదిరింపులకు గురైనప్పుడు, హింసను ఆశ్రయించే మానవ ధోరణి వెల్లడిస్తుంది.
అహం, భూలోక శక్తి, అన్యాయాలకు దారితీస్తుంది.
బాలయేసు
సాన్నిధ్యమే ప్రపంచ అవినీతి అధికారులను వణికించినది. లోకముననున్న అవినీతి, అన్యాయ,
అక్రమ, హింస, అణచివేత మొదలగు దుష్ట శక్తులకు యేసు సువార్త పరిచర్య సవాలుగా
ఉండబోతుందని స్పష్టముగా అర్ధమగుచున్నది.
చిన్నారి
బిడ్డల మరణం దు:ఖాన్ని కలిగిస్తుంది. ఇది లోకమున అమాయకుల బాధలను
ప్రతిబింబిస్తున్నది. నేడు మనం అలాంటి అమాయక బిడ్డలను కాపాడాలి. అన్యాయానికి
వ్యతిరేకముగా మనం ఉద్యమించాలి.
అయితే,
ఈ లోకములో చెడు తాత్కాలికముగా గెలిచినట్లు అనిపించినప్పటికినీ, అంతిమముగా మంచిదే
విజయం. దేవుని ప్రణాళిక ఎన్నటికీ విఫలం కాదు. బాధలలో దేవుని సహాయం ఉంటుంది. బాధలలో
దేవుని ఓదార్పు తప్పక ఉంటుంది.
No comments:
Post a Comment