బప్తిస్మ యోహాను శిరచ్చేదనము (ఆగష్టు 29)

 బప్తిస్మ యోహాను శిరచ్చేదనము (ఆగష్టు 29)

నూతన నిబంధనలో, జెకర్యా-ఎలిశబెతమ్మల కుమారుడు, యేసు బంధువుయైన బప్తిస్మ యోహాను శిరచ్చేదనము ప్రాముఖ్యమైన, కీలకమైన సంఘటన. ఇది యేసుక్రీస్తు మార్గమును సిద్ధపరచిన యోహాను వేదసాక్ష్యము. దీనిని గూర్చిన వివరణ మార్కు 6:14-29, మత్త 14:1-12లో చదవవచ్చు. యోహాను శిరచ్చేదనము గావింపబడుటకు ప్రధాన కారణాలు: హేరోదు [అంతిపాసు; హేరోదు మహారాజు కుమారుడు] తన తమ్ముడగు ఫిలిప్పు భార్య హేరోదియాను వివాహమాడినందున అతనిని యోహాను హెచ్చరించాడు (మత్త 14:3-4; మార్కు 6:17-18); హేరోదియా యోహానుపై పగపట్టి అతనిని చంపదలచెను; హేరోదియా కుమార్తె బప్తిస్మ యోహాను శిరమును పళ్ళెములో పెట్టి ఇవ్వుమని కోరెను (మత్త 14:6-11; మార్కు 6:21-28). రాజుయొక్క త్రాగుబోతు ప్రమాణం, రాణియొక్క ద్వేషం, మొహపూరిత నృత్యం కలిసి యోహాను మరణానికి దారితీసాయి.

అలాగే, యోహాను మరణం, రాజకీయ ఉద్రిక్తల నేపధ్యములో కూడా చూడాల్సి ఉంది. యోహాను ప్రవక్తయని ప్రఖ్యాతి గాంచుటచే, గలిలీయ, పెరియ ప్రాంతాలకు చతుర్దాంశాధిపతియగు [4 BC-39AD] హేరోదు ప్రజలకు భయపడెను (మత్త 14:5). యోహాను నీతిమంతుడు, పవిత్రుడు అని హేరోదు ఎరిగి’ అతనికి భయపడి అతనిని కాపాడ చూచెను. అతని హితోపదేశములకు హేరోదు కలత చెందినను వానిని ఆలకింప మనస్సు కలవాడై ఉండెను” (మార్కు 6:20). అయినను, యోహాను బోధనలను పెడచెవిన పెట్టాడు. తన అధికారానికి, పాలనకు ముప్పుగా భావించాడు. భయముతో ఏమీ చేయలేక చెరసాలలో వేయించాడు. బహుశా, మెస్సయ్య రాకను ఆశించి చాలా మంది ప్రజలు యోహానును వెంబడించారు. కాని, స్వకీర్తికోసం యోహాను ఎప్పుడు ప్రాకులాడలేదు. తప్పుడు గౌరవాన్ని ఎప్పుడూ అనుమంతించలేదు. తాను కేవలం “ప్రభువు మార్గమును సిద్ధపరచుటకు” పంపబడినాడని ఎరిగియున్నాడు. అందుకే, సమయమాసన్న మైనప్పుడు, యోహాను తన శిష్యులకు యేసును “దేవుని గొర్రెపిల్ల”యని పరిచయం చేయగా, వారు ఆయనను వెంబడించిరి (యోహాను 1:35-37).

హేరోదు క్రూరుడు, అహంకారి, గర్విష్టి. ఒకానొక సందర్భములో ప్రభువు అతనిని “నక్క”గా సంబోధించాడు (లూకా 14:32). చట్టబద్ధమైన భార్యను [ఫాసెలిస్] విడచి, సోదరుని భార్య, తనకు మేనకోడలు అయిన హేరోదియాను వివాహ మాడాడు. హేరోదియాతో సహా పలు భార్యలు, ఉంపుడు గత్తెలు ఉన్నారు. యూదుల చట్టం ప్రకారముగానే (లేవీ 18:16; 20:21) హేరోదు-హేరోదియాల వివాహమును యోహాను ఖండించాడు. “ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు” (మార్కు 6:4) అని హెచ్చరించాడు. యూదుల ప్రమాణాల ప్రకారం, వారి వివాహం వ్యభిచారము, అక్రమ సంబంధముగా పరిగణింప బడుతుంది. కుటుంబ ధర్మములను మీరినట్లు అవుతుంది. ఈవిధముగా, పాపమును, అన్యాయమును, ఇతర దుశ్చర్యలను యోహాను ధైర్యముగా ఖండించాడు. దానిపర్యవసానమే, చెరసాలలోనున్న (మృత సముద్రానికి వాయువ్యముగా, ప్రస్తుత జోర్ధాను) యోహాను శిరచ్చేదనము గావింపబడినాడు (సుమారు క్రీ.శ. 30). తన తలను పళ్ళెములో పెట్టి హేరోదియా కుమార్తెకు ఇవ్వగా, ఆ బాలిక [సలోమి] తన తల్లికి ఇచ్చెను (మత్త 14:11; మార్కు 6:28). వెంటనే యోహాను శిష్యులు వచ్చి భౌతిక దేహమును తీసికొని పోయి సమాధి చేసారు. పిమ్మట వారు యేసు యొద్దకు వెళ్లి ఆ విషయమును తెలియజేసారు (మత్త 14:12-13; మార్కు 6:29). ఈ వార్త విని యేసు నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా వెళ్ళారు (మత్త 14:13). ఆతరువాత యేసు యోహానును ప్రవక్తగా, వేదసాక్షిగా గౌరవించాడు (మత్త 11:11; లూకా 7:28).

          బప్తిస్మ యోహాను శిరచ్చేదనము సత్యమునకు సాక్ష్యముగా నున్నది. అతని మరణం తన అచంచలమైన విశ్వాసము కొరకు అంతిమ త్యాగబలిగా సూచిస్తుంది. దేవుని చిత్తము పట్ల తనకున్న నిబద్ధతకు గొప్ప నిదర్శనం. తాను పలికిన “ఆయన హెచ్చింప బడవలెను. నేను తగ్గింప బడవలెను” (యోహాను 3:30) అన్న ప్రవచనం నెరవేరినది. యోహాను మొదటి నుండి కూడా యేసు జీవితానికి ప్రతిబింబముగా నున్నాడు (మార్కు 1:2-14). అతని శిరచ్చేదనము యేసు జీవితానికి శ్రమలకు సూచనగా యున్నది. యోహాను మరణం, యేసు మరణ పునరుత్థానములను సూచిస్తుంది.

          తనకు అప్పగింప బడిన ప్రేషిత కార్యమును, దైవచిత్తమును వెనుకంజ వేయక, నిస్వార్ధముగా చివరి వరకు, మరణానికి సైతం భయపడక సంపూర్ణముగా నెరవేర్చాడు. దేవుని ఆజ్ఞల పట్ల అతనికున్న విశ్వసనీయత అమోఘం! వేదసాక్షి మరణం, శిష్యులకు, విశ్వాసులకు ఏ సమయములోనైనా సంభవించ వచ్చును. బప్తిస్మ యోహాను శిరచ్చేదనము క్రైస్తవ జీవితం, ప్రేషిత కార్యం, దానిలో భాగముగా పొందవలసిన, శ్రమలకు దర్పణముగాను, ఆదర్శముగాను ఉంటుంది. అలాగే, యోహాను మరణం నిజమైన శిష్యరికానికి, దాని స్వభావానికి నిదర్శనం.

          యోహాను ప్రధానముగా “హృదయ పరివర్తనము అనెడు బప్తిస్మము పొందవలెనని” ప్రకటించాడు (మార్కు 1:4). అనగా దేవుని మార్గాలను పాటించాలని ధైర్యముగా బోధించాడు. నిజమైన పశ్చాత్తాపమనగా శిష్యుడు ఉత్థాన క్రీస్తు స్వభావాన్ని ధరించడం. యోహాను బోధించడం మాత్రమేగాక, తన జీవితాదర్శముద్వారా నిరూపించాడు. అతను ఎడారిలో ఉపవాస ప్రార్ధనలతో, సాధారణ జీవితాన్ని జీవించాడు. ఆనాటి ప్రజల అనైతిక జీవితాన్ని ఎండగట్టాడు. నేడు మనం యోహాను జీవితమునుండి అనేక విషయములను నేర్చుకొనవచ్చు. ఆయనవలె, మన చుట్టూ ఉన్నవారికి యేసు మార్గమును సిద్ధపరచవచ్చు. ఈనాటి అనైతికత, అప్రజాస్వామ్యం మొదలగు వాటి గురించి ధైర్యముగా మాట్లాడవచ్చు.

1 comment: