20వ సామాన్య ఆదివారము, Year B
మొదటి పఠనములో విజ్ఞానమునకు సంబంధించిన లోతైన భావాన్ని గూర్చి వింటున్నాము. “విజ్ఞానమను స్త్రీమూర్తి తన భవనమును నిర్మించి, ఏడు స్తంభములు నెలకొల్పెను” (9:1). ఈ సామెత దైవీక జ్ఞానము యొక్క లోతును మరియు స్థిరత్వమును తెలియ జేయుచున్నది. దైవీక జీవితము, అర్ధవంతమైన మరియు నీతిగల జీవితానికి పునాది అని వివరిస్తున్నది. “ఏడు” అనే సంఖ్య ‘పూర్తిని’ మరియు ‘పరిపూర్ణతను’ సూచిస్తుంది. దీనిని బట్టి జ్ఞానం నశ్వరమైన ఆలోచన కాదని, మన జీవితములోని ప్రతీ అంశానికి మద్దతునిచ్చే సుస్థిరమైన, సమగ్రమైన వాస్తవికత అని ఈ సామెత తెలియజేయు చున్నది. “భవనము” అనేది ఆశ్రయం మరియు పోషణకు తావు లేదా స్థలము. నిజమైన జ్ఞానమును కోరుకునే వారందరిని లోపలకు వచ్చి నివసించుమని ఆహ్వానిస్తున్నది.
“ఆమె వేట మాంసము వండి, సుగంధ ద్రవ్యములు కలిపిన ద్రాక్షారసము సిద్ధము చేసి, భోజన పదార్దములు తయారు చేసెను” (9:2). ఈ విందు జ్ఞానము యొక్క గొప్పతనాన్ని, సమృద్ధిని తెలియజేస్తుంది. జ్ఞానం కేవలం ప్రాథమిక అవసరాలను మాత్రమే గాక, గొప్ప “విందు”ను అందజేయును. ఈ విందు ఆత్మీయ పోషణను, సమృద్ధిని సూచిస్తుంది. విజ్ఞానాన్ని ఆలింగనం జేసుకోవడం అనగా, కేవలం జ్ఞానాన్ని పొందుకోవడం మాత్రమే కాదని, జీవితాన్ని సంపూర్ణముగా ఆస్వాదించడం మరియు జీవితములో నిమగ్నమై జీవించడం అని తెలియజేస్తూ, ఈ విందులో పాల్గొనమని ఆహ్వానిస్తున్నది. “రమ్ము, నేను తయారు చేసిన భోజనము ఆరగింపుము. నేను సిద్ధము చేసిన ద్రాక్షారసము సేవింపుము” (9:5) అన్న ఈ పిలుపు, విజ్ఞానము ఒసగు జీవిత సూత్రాలను, బోధనలను అందుకోవడానికి ఆహ్వానం. ఇది లోతైన మరియు సంతృప్తికరమైన జీవన విధానాన్ని అనుభవించడానికి ఆహ్వానం. ఇచ్చట నిర్ణయాలు, చర్యలు జ్ఞానముచేత (అంత:దృష్టి, అవగాహన) మార్గనిర్దేశం చేయబడతాయి.
ఈ ఆహ్వానము యొక్క ఉద్దేశ్యం స్పష్టం చేయబడినది: “మూర్ఖత్వమును విడనాడెదవేని నీవు జీవింతువు. నీవు విజ్ఞాన పధమున నడువుము” (9:6). జ్ఞానము, మూర్ఖత్వమునకు వ్యతిరేకం. అజ్ఞానమును విడచిపెట్టి, జ్ఞానములో మునిగిపోయిన జీవితాన్ని జీవించమని మనలను ప్రోత్సహిస్తున్నది. ఆలోచనారహిత జీవితమునుండి వివివేచనతో కూడిన జీవితానికి మార్పును సూచిస్తుంది. ఇది ఆధ్యాత్మిక మరియు నైతిక జీవితానికి మార్గాన్ని సుగమము చేస్తూ జీవించడానికి ఆహ్వానం.
ఈ మొదటి పఠనమును ధ్యానిస్తూ ఉండగా, జ్ఞానం మనకొసగే సమృద్ధిని, గొప్పదనాన్ని గుర్తించుదాం. మూర్ఖత్వాన్ని విడచిపెట్టి, విజ్ఞానముతో కూడిన సుసంపన్నమైన జీవితాన్ని జీవించ ప్రయత్నం చేద్దాం. ఈవిధముగా, జ్ఞానాన్ని పొందడం మాత్రమే కాకుండా, దయ, శాంతి, అనుగ్రహములో ఎదుగుతాము. జ్ఞానమును శ్రద్ధతో వెదకుటకు, అది ఒసగు సమృద్ధిగల విందులో పాల్గొనుటకు, విజ్ఞానము ఒసగు లోతైన బోధనలకు అనుగుణముగా జీవించుటకు గల క్రుపను, శక్తిని దయచేయుమని ప్రార్దన చేద్దాం!
రెండవ పఠనములో మన క్రైస్తవ పిలుపును ప్రతిబింబించే జీవితాన్ని జీవించడానికి శాశ్వతమైన మార్గనిర్దేశకాన్ని పౌలు చేయుచున్నాడు: “మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గూర్చి శ్రద్ధ వహింపుడు. జ్ఞానహీనులవలె జీవింపకుడు. వివేకవంతులవలె జీవింపుడు. ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగము చేసికొనుడు.” (5:15). పౌలుగారి ఈ సలహా నేటికీ మనకు ఎంతగానో వర్తిస్తుంది. మన విశ్వాసానికి అనుగుణముగా తగిన నిర్ణయాలతో జ్ఞానయుక్తముగా జీవించమని ప్రోత్సహిస్తున్నాడు. ఇచ్చట జ్ఞానం అనగా క్రీస్తు బోధనలను మన అనుదిన జీవితములో అర్ధముచేసుకొని, అన్వయించుకొని జీవించడం. “చెడు దినములు” మనం ఎదుర్కుంటున్న నైతిక, ఆధ్యాత్మిక సవాళ్ళను సూచిస్తుంది. ఈ లోక ప్రలోభాలు, శోధనలు మన గమ్యమునుండి మనలను పెడత్రోవ పట్టిస్తాయి. వీటిని ఎదుర్కోవడానికి క్రీస్తు వెలుగును ప్రతిబింబించే క్రైస్తవ జీవితాలను జీవించాలని పౌలు ఆశిస్తున్నాడు. జ్ఞానమునకు వ్యతిరేకం మూర్ఖత్వము. మద్యపానం దుర్మార్గానికి దారితీస్తుంది. అది మిడిమిడి ఆనందాలకు దారితీస్తుంది. దానికి బదులుగా ఆత్మపూరితులై జీవించాలి. ఆత్మ నిజమైన ఆనందాన్ని, పరివర్తనను కలుగజేస్తుంది. ఆరాధన, కృతజ్ఞతతో కూడిన జీవితాన్ని జీవించాలి. మన మాటలు, చేతలు దేవునితో మనకున్న సంబంధాన్ని ప్రతిబింబించాలి. అలా జీవించినప్పుడు, మన ఆధ్యాత్మిక జీవితాలను, మన చుట్టూ ఉన్న వారి జీవితాలను సైతం సుసంపన్నం చేస్తూ, విశ్వాసము, ఆనందముతో కూడిన సంఘాన్ని నిర్మించగలము.
ఈ పఠనముపై ధ్యానం చేయుచుండగా, విశ్వాసములో ఎదగడానికి, తోటివారికి సేవ చేయడానికి అవకాశాలను స్వీకరించి, జ్ఞానములో జీవిస్తూ, అవకాశాలను సద్వినియోగము చేసుకోవడానికి కృషి చేద్దాం! లోకపు శోధనలను తప్పించుకొని ఆత్మలో జీవించుదాం! దేవునకు అంకితం కావింప బడిన జీవితము నుండి వచ్చే ఆనందాన్ని వెదకుదాం! తద్వార, దేవుని ప్రేమకు, దయకు ఈ లోకములో నిజమైన సాక్ష్యులుగా జీవించగలము. జ్ఞానములోను, ఆత్మలోను, సేవలోను, కృతజ్ఞతతోను జీవించడానికి కావలసిన శక్తికోసం ప్రార్ధన చేద్దాం!
సువిశేష పఠనములో “నేనే జీవాహారము” అని యేసు ప్రకటించి యున్నారు: “పరలోకము నుండి దిగివచ్చిన జీవముగల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే” (6:51). ఇది దివ్యసత్ప్రసాదాన్ని సూచిస్తుంది. అలాగే, ఈ దివ్యసంస్కారాన్ని లోతుగా అర్ధం చేసుకోవడానికి, ప్రశంసించడానికి సవాలు చేస్తుంది. “ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే” అను వాక్యం యేసు క్రీస్తు యొక్క లోతైన ప్రేమను, శ్రీసభలో “దివ్యసత్ర్పసాదము” యొక్క ప్రాముఖ్యతను వెల్లడి చేయుచున్నది. తన శరీరరక్తములనే ఒసగుట ద్వారా, ఒక నూతన ఒడంబడికను ఏర్పాటు చేయుచున్నాడు. ఇది దేవునితో సహవాసము మరియు నిత్యజీవితాన్ని వాగ్దానం చేయుచున్నది. కడరాత్రి భోజన నేపధ్యములో ఇది మరింత ప్రాముఖ్యతను సంతరించు కున్నది. తను అర్పించే బలికి జ్ఞాపకార్ధముగా దివ్యసత్ప్రసాదాన్ని స్థాపించాడు. తన శరీర రక్తములో మనం పాలుపంచుకోవాలని ఆహ్వానిస్తున్నారు.
“మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఈయగలడు?” అని యూదులు వాదించుకున్నారు. ఇది దివ్యసత్ర్పసాదము యొక్క పరమరహస్యాన్ని నొక్కి చెబుతుంది. ఇది మన తెలివి తేటలకు అందనిది. విశ్వాసముతో మరియు దేవిని విజ్ఞానముతో మాత్రమే గ్రహించగలము.
“నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువాడు నాయందును, నేను వానియందును ఉందును” (6:56). దివ్యపూజలోని లోతైన సహవాసాన్ని తెలియ జేయుచున్నది. ఇది ఒక సూచక క్రియ లేదా ప్రతీకాత్మక చర్య కాదు. నిజముగానే మనం క్రీస్తుతో సహవాసము కలిగి జీవిస్తాము. నిజముగానే మనం క్రీస్తును కలుసుకుంటాము. దివ్యసత్ర్పసాదమును స్వీకరించుట ద్వారా మనం దైవీక జీవితములో భాగస్తుల మగుచున్నాము.
అంతేకాకుండా “ఈ ఆహారమును భుజించు వాడు ఎల్లప్పుడును జీవించును” (6:58). దివ్యసత్ర్పసాదము అనేది స్వర్గపు విందును సూచిస్తుంది. దేవునితో మన అంతిమ సహవాసానికి సంకేతం. ఇది మన జీవిత ప్రయాణములో ఆధ్యాత్మిక పోషణ. మనకు బలాన్ని చేకూర్చుతుంది.
ఈ సువిశేష పఠనమును ధ్యానిస్తూ ఉండగా, భక్తితోను, కృతజ్ఞతతోను దివ్యసత్ర్పసాదమును ఆశ్రయించుదాం! ఇది దేవుని గొప్ప బహుమానము, కృపానుగ్రహము. ఇది క్రీస్తుతోను మరియు తోటివారితోను ఐఖ్యముగా జీవించమని ఆహ్వానం. విశ్వాస పరమ రహస్యాన్ని ఆలింగనం చేసుకొనుటకు, తద్వారా క్రీస్తుతో సహవాసాన్ని కలిగియుండుటకు మరియు దాని ఫలితాలను మన అనుదిన జీవితములో జీవించుటకు ఇది సవాలు!
దివ్యసత్ర్పసాద అనుగ్రహాన్ని ప్రశంసించుటకు, గౌరవించుటకు, పవిత్ర హృదయములతో స్వీకరించుటకు, తద్వారా మనం క్రీస్తుకు ప్రియ శిష్యులుగా మారే అవకాశాన్ని దయచేయమని ప్రార్ధన చేద్దాం!
No comments:
Post a Comment