గుణదల లూర్దుమాత పుణ్యక్షేత్ర నూరు వసంతాల వేడుకలు (1924-2024)

గుణదల లూర్దుమాత పుణ్యక్షేత్ర నూరు వసంతాల వేడుకలు (1924-2024)
ఫాదర్ ప్రవీణ్ గోపు OFM Cap.
పెద్దావుటపల్లి
కానా పల్లెలో పెండ్లి సందర్భముగా, కుటుంబములోని అవసరతను మొదటగా గుర్తించిన మరియతల్లి సేవకులతో “ఆయన చెప్పినట్లు చేయుడు” (యోహాను 2:5) అని చెప్పడం వలన యేసు తన మొదటి సూచక క్రియను ప్రదర్శించాడు. ఆ పరలోకతల్లి అవసరత నేటికీ మనకు అవసరమనే, తండ్రి దేవుడు అప్పుడప్పుడు మరియతల్లి దర్శనాలను కలుగజేస్తున్నాడు. 11 ఫిబ్రవరి 1858లో మరియమాత ఫ్రాన్స్ దేశములోని లూర్దునగరములో దర్శన మిచ్చి, దైవకుమారుడైన యేసుక్రీస్తును విశ్వసించమని కోరియున్నది. పాప జీవితానికి స్వస్థిచెప్పి, పుణ్య జీవితాన్ని జీవించమనేదే ఆమె సందేశం. ఫ్రాన్స్ దేశములోని లూర్దునగరములో దర్శనమిచ్చిన లూర్దుమాత పేరున వెలసిన గుణదల మాత పుణ్యక్షేత్రం కూడా అట్టిదే. మనం పొందుకున్న గొప్ప దైవానుగ్రహం. అట్టి గుణదల పుణ్యక్షేత్రం, 2024లో నూరువసంతాల జూబిలీ వేడుకలను కొనియాడుచున్నది. భారతావనిలోని క్రైస్తవ పుణ్యక్షేత్రాలలో రెండవ అత్యంత ప్రజాదరణ పొందుతున్న పుణ్యక్షేత్రం. ఎక్కువగా సందర్శించే దేవాలయాలలో గుణదల మరియమాత దేవాలయము ఒకటిగా పేరుగాంచినది. ఎన్నో లక్షల విశ్వాసులు, భక్తులు, యాత్రికులు, ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, మరియమాత ద్వారా దేవున్ని దర్శించ గలుగుతున్నారు.
గుణదల మరియమాత మహోత్సవాలను ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఘనముగా కొనియాడుతారు. అయితే, 2024వ సంవత్సరములో ఈ పుణ్యక్షేత్రానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. ఎందుకన, నూరువసంతాల వేడుకలను ఈ పుణ్యక్షేత్రం కొనియాడు చున్నది.
మోన్సిగ్నోర్ H. పెజ్జోని గుణదలలో 1923లో స్థలాన్ని పొందారు. మొదటిగా 15 జూన్ 1924న సెయింట్ జోసఫ్ అనాధాశ్రమం, తరువాత పారిశ్రామిక పాఠశాల ప్రారంభించడం జరిగింది. ఇది అప్పటి బెజవాడ విచారణకు జోడించబడినది. గుణదల సంస్థల ప్రధమ మేనేజరుగా రెవ. ఫాదర్ P. అర్లాటి 1924లో నియమించ బడినారు. బాధ్యతలు చేపట్టిన రోజునుండే ఎన్నోకష్టాలను, ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొన్నారు. స్థలాన్నంతా శుభ్రంచేయించారు. మంచి నీటికోసం బావిని త్రవ్వించారు.
సంస్థలకు మరియమాత ఆశీర్వాదాలు, సంరక్షణ పొందేందుకు రెవ. ఫాదర్ P. ఆర్లాటి 1924లో కొండపైన సహజ సిద్ధమైన ప్రదేశములో మరియమాత స్వరూపాన్ని నెలకొల్పారు. ఇదే గుణదల మరియమాత భక్తికి నాంది పలికింది. 1931లో దేవాలయమును నిర్మించారు. 1933లో గుణదల సంస్థల ప్రధమ శతాబ్ది పూర్తిచేసుకున్న సందర్భముగా, రెవ. ఫాదర్ P. అర్లాటి గుణదల కొండ అంచుపై 18 అడుగుల ఎత్తైన ఇనుప సిలువను ఏర్పాటు చేసారు. సిలువ యొద్దకు మరియమాత గుహనుండి వెళ్ళాల్సి ఉంటుంది. కనుక TO JESUS THROUGH MARY (మరియమాత ద్వారా యేసు చెంతకు) అన్న సత్యాన్ని చక్కగా మనకు స్పురిస్తుంది. ఇది కతోలిక బెజవాడకు గర్వకారణమైనది.
1937 నాటికి గుణదల పండుగ మేత్రాసణ పండుగగా ప్రసిద్ధి గాంచినది. 1937లో, రెవ. ఫాదర్ P. అర్లాటి, ప్రస్తుతం గుణదల కొండపై చూస్తున్న, 300 కిలోల బరువుగల మరియమాత స్వరూపాన్ని ఇటలీ దేశమునుండి తీసుకొని వచ్చి నెలకొల్పడం జరిగింది. ఆ రోజు స్వరూపాన్ని బెజవాడ పురవీధులలో ఊరేగింపుగా తీసుకెళ్ళి గుహలో ప్రతిష్టించడం జరిగింది.
1944-1946 మధ్యకాలములో, సహజ సిద్ధముగా కనిపించే గుహను, అలాగే, దివ్యపూజలు సమర్పించడానికి, గుహముందు బలిపీఠము నిర్మించడం జరిగింది. అప్పటినుండి, ప్రతీసంవత్సరం లూర్దుమాత పండుగను స్థానిక కతోలిక క్రైస్తవులతో కలిసి కొనియాడటం జరుగుతుంది. కొండపైన మరియమాత గుహవరకు ప్రదక్షిణగా వెళ్లి, అక్కడ దివ్యపూజా బలిని సమర్పిస్తారు. గుహకు వెళ్ళుమార్గములో పదిహేను జపమాల రహస్యాలను చిత్రపటాలతో బహుసుందరముగా ఏర్పాటు చేయబడ్డాయి. 1951లో యాత్రికుల మరియమాత స్వరూపమును దగ్గరకు వెళ్ళుటకు, కానుకలు చెల్లించుటకు మెట్లమార్గము ఏర్పాటు చేయబడినది. అలాగే, గుహపైన అందమైన తోరణం నిర్మించడమైనది. 1971లో నూతన దేవాలయం నిర్మించడ మైనది.
కాలక్రమేణ, గుణదల పుణ్యక్షేత్రములో అనేక వసతులు ఏర్పాటు చేయబడ్డాయి. బిషప్ గ్రాసి స్కూల్ ఆవరణలో, పూజ, సాంస్కృతిక కార్యక్రమాల కొరకు పెద్ద వేదిక నిర్మించడమైనది. యాత్రికుల బస కొరకై షెడ్లు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయబడ్డాయి. కొండపైన విద్యుత్, మంచినీటి వసతులు కల్పించ బడ్డాయి. కొండపైకి సులువుగా చేరుకోవడానికి మరిన్ని మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. మరియమాత గుహనుండి సిలువ వరకు సిలువమార్గము ప్రతిమలతో ఏర్పాటు చేయబడినది.
గుణదల పుణ్యక్షేత్ర సందర్శనలో కొన్ని ప్రాముఖ్యమైనవి: యాత్రికులు తలనీలాలు సమర్పించడం. తలనీలాలు త్యాగానికి గురుతు. మరియమాత మధ్యస్థ ప్రార్ధనలద్వారా పిల్లలు లేనివారికి పిల్లలు కలుగుతారని, అలాంటి శక్తులు గుణదల మరియ మాతకు ఉన్నట్లు ప్రజల విశ్వాసం, నమ్మకం. మరియమాతకు కొబ్బరికాయలు, పూలు సమర్పిస్తారు. పేరుకు తగ్గట్టుగానే, గుణదల లూర్దుమాత స్వస్థతకు మరోపేరుగా ప్రసిద్ధి చెందినది. గుణదల మాతగా భక్తులపై స్వస్థత, కృపానుగ్రహ జల్లులను కురిపిస్తుంది. నిజమైన, దృఢమైన విశ్వాసముతో ప్రార్ధించే వారిని గుణదల మరియమాత ఎప్పటికీ విడిచి పెట్టదు. ఆమె దయగల హృదయాన్ని గ్రహించిన భక్తులు, విశ్వాసులు ఏడాది పొడవునా పుణ్యక్షేత్రాన్ని సందర్శించి మరియమాత ఆశీర్వాదాలను పొందుతూ ఉంటారు.
11 ఫిభ్రవరి 2024న గుణదల పుణ్యక్షేత్రం నూరువసంతాల వేడుకలను ఘనముగా కొనియాడుచున్నది. ఇది విజయవాడకు, తెలుగు రాష్ట్రాల క్రైస్తవులకు, యావత్ కతోలిక శ్రీసభకు గర్వకారణం! ఈ సందర్భముగా, గుణదలలో వెలసిన లూర్దుమాత స్వరూపాన్ని విజయవాడ మేత్రాసణములోని అన్ని గురుమండలాలకు ప్రదక్షిణగా తీసుకొని వెళ్ళుచున్నారు. దివ్యపూజలు అర్పిస్తున్నారు. ప్రతీచోట, వేలమంది భక్తులు స్వరూపాన్ని సందర్శించి దీవెనలను పొందుచున్నారు. భూలోకములో అమ్మ అంటే మనందరికీ ఎంతో ప్రేమ, అనురాగం, ఇష్టం. అలాగే పరలోకములోకూడా మనందరికీ మరియతల్లి రూపములో ఒక అమ్మ ఉన్నదని మనదరం సంతోషపడాలి. గుణదల మరియ మధ్యస్థ ప్రార్ధనలద్వారా దేవుడు మనలనందరినీ దీవించునుగాక!

No comments:

Post a Comment