వరప్రసాదముల మాత మహోత్సవము

 వరప్రసాదముల మాత మహోత్సవము

దేవదూత లోపలి వచ్చి, కన్యక మరియమ్మతో, “అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు” అనెను (లూకా 1:28).

దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మా, వందనము!



వరప్రసాదముల మాత పేరిట శ్రీసభలో ఎన్నో దేవాలయాలు వెలిసాయి. ఈ దేవాలయాల ద్వారా స్థానిక శ్రీసభ మరియతల్లి ద్వారా పొందిన మేలులకు కృతజ్ఞతలు తెలియ జేస్తారు. మరియద్వారా వరప్రసాదమైన క్రీస్తును మనం పొందుకొనుచున్నాము. ముందుగా మరియమ్మను వరప్రసాదముల మాత అని ఎందుకు పిలుస్తున్నాము అంటే, పునీత పౌలుగారు చెప్పినట్లుగా, “సర్వమానవాళి రక్షణకై ‘దేవుని కృప’గా ప్రత్యక్ష మయ్యెను” (తీతు 2:11). ఆ దేవుని కృప ఎవరో కాదు, సత్యము, జీవము, మార్గము అయిన యేసుక్రీస్తు ప్రభువే. మరియ ఆ ‘దేవుని కృపకు’ తల్లి. అందుకే ఆమె క్రుపానుగ్రహ మాత లేదా వరప్రసాదాల మాత. ఈవిధముగా, దేవుడు వాగ్ధానము చేసిన కృప యేసుక్రీస్తు. ఆ దేవుని కృపకు మానవ శరీరాన్ని ఒసగిన మాతృమూర్తి కనుక, మరియ ‘దైవకృప’కు తల్లి అని ఖచ్చితముగా చెప్పగలము. యోహాను సువార్తీకుడు కూడా క్లుప్తముగా “క్రీస్తు కృపాసత్యములతో నిండెను” అని సూచించాడు (1:14). యేసుక్రీస్తు “దేవునికృపకు” పాత్రురాలుగా ఉండుటకు, ఆమెను “అనుగ్రహ పరిపూర్ణురాలుగా” (లూకా 1:28) చేసాడు దేవుడు. కనుక, “దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము” అని ప్రార్ధించి నపుడెల్ల, దేవుని పరిపూర్ణ జీవితమును మరియ కలిగియున్నదని చెబుతున్నాము.

దేవదూత లోపలి వచ్చి, కన్యక మరియమ్మతో, “అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు” అనెను (లూకా 1:28): దేవుని సందేశమును, చిత్తమును, ప్రణాళికను తెలియజేయువారు దేవదూతలు. దేవుని సందేశానికి స్పందించాలని, సమాధాన మివ్వాలని ఆహ్వానిస్తారు. దేవుని సందేశానికి స్పందించడం చాలా ప్రధానం. పిలుపునిచ్చిన దేవునికి సమాధాన మివ్వడం అతిప్రాముఖ్యము. మత్త 1:18-25లో ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, దేవుని ఆజ్ఞను తెలియజేయగా, యోసేపు అటులే చేసాడు. లూకా 1:5-25లో జెకర్యాకు దేవదూత ప్రత్యక్షమై, దేవుని సందేశమును తెలియ జేసెను. జెకర్యా ఆరంభములో స్పందించక పోయినను, నెమ్మదిగా దేవుని చిత్తమును గ్రహించి అటులనే చేసాడు. అలాగే, లూకా 1:26-38లో గబ్రియేలు దేవదూత కన్యక మరియమ్మ దగ్గరకు పంపబడెను. ఆ వృత్తాంతాన్ని ధ్యానిస్తూ, మరియ ఎలా వరప్రసాదముల మాత అయినదో తెలుసుకుందాం!

మరియ “అనుగ్రహ పరిపూర్ణురాలు” అని బైబులు గ్రంథం చెబుతుంది (లూకా 1:28). మరియను మాత్రమే ఇలా పిలువబడి యుండటం చూస్తాము. ఇది దేవుని కుమారునికి తల్లిగా ఆమె ఎన్నికను సూచిస్తుంది. అలాగే, మరియకు “దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును ఒసగినట్లు” (ఎఫెసీ 1:3) సూచిస్తుంది. “అనుగ్రహ పరిపూర్ణురాలు” అనగా మరియ దేవుని జీవముతో, సాన్నిధ్యముతో నింపబడినది అని అర్ధం. దేవుని సాన్నిధ్యముతో పరిపూర్ణముగా నిండియున్నది కనుక, ఆమెలో పాపమునకు ఎలాంటి చోటు లేదు. ఆమె నిష్కళంక మాత. అదియే కృపావరం, వరప్రసాదము. మరియమ్మ వరప్రసాదముల మాత, ఎందుకన “కృపాసత్యములు యేసుక్రీస్తు ద్వారా వచ్చినవి” (యోహాను 1:17). యేసుక్రీస్తు మన యొద్దకు వచ్చును; ఆ కృపానుగ్రహం (యేసుక్రీస్తు) మరియమ్మ ద్వారామన యొద్దకు వచ్చును. అందుకే ఆమె వరప్రసాదముల మాత, అమ్మ! వరప్రసాదముల మాతగా మరియమ్మను ధ్యానించినపుడు, ఆమె మనకు ఆ దేవుని కృపను గురించి, ప్రాముఖ్యత గురించి మనకు బోధిస్తుంది.

వరప్రసాదము అనగా ఏమి?

కృపావరం, వరప్రసాదము అనగా “దేవుని బిడ్డలమగుటకు, దత్తపుత్రులమగుటకు, దేవుని స్వభావములో, శాశ్వత జీవనములో భాగస్వాములమగుటకు పిలుపునిచ్చిన దేవునికి సమాధాన మివ్వటానికి ఆయన అందించే వరప్రసాదం, ఉచితార్ధం, అర్హతకు తగని సహాయమే కృపావరం (grace) అని, దేవుని జీవనములో పాలుపంచుకోవటమే కృపావరం అని సత్యోపదేశం (నం. 1996, 1997) బోధిస్తుంది. దైవకుమారుడు, లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తుకు తల్లి కావడానికి “ఆ పాత్రకు తగిన వరాలతో” దేవుడు ఆమెను దీవించాడు (సత్యోపదేశం, 490). మరియమ్మ దేవునితో లోతైన, స్థిరమైన, అతిసన్నిహిత సంబంధములో జీవించినది. దేవుని చిత్తానికి స్పందించక పూర్వమే దేవుడు ఆమెతో ఉన్నాడు – “ఏలినవారు నీతో ఉన్నారు” (లూకా 1:28) అని గాబ్రియేలు దూత పలికింది. మరియమ్మ దేవున్ని ఎన్నుకొనక మునుపే, దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు అని అర్ధమగు చున్నది.

మనమే దేవున్ని ఎన్నుకున్నామని కొన్నిసార్లు తప్పుగా భావిస్తూ ఉంటాము. ఈ విషయాన్ని యేసుక్రీస్తు యోహాను 15:16లో తన శిష్యులకు స్పష్టం చేసియున్నారు, “మీరు నన్ను ఎన్నుకొనలేదు. కాని, నేను మిమ్ము ఎన్నుకొంటిని”. కనుక, మనం దేవుని అనుగ్రహముచేత నింపబడి, నడిపింప బడుచున్నాము. దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటారు. మనమే ఆయనతో ఉండటము లేదు. తన ప్రేమచేత (యోహాను 3:16) దేవుడే మన చెంతకు వస్తారు, మనలను చేరదీస్తారు. ప్రభువే తన అనుగ్రహాన్ని మనకు దయచేస్తారు. మనము కేవలము ఆ దైవానుగ్రహాన్ని, కృపానుగ్రహాన్ని స్వీకరించు వారము మాత్రమే. ఆ కృపయే, మన మాటలో, చేతలో దేవునికి ప్రతిస్పందించడానికి, సమాధాన మివ్వటానికి, ‘అవును’ అని చెప్పటానికి కదిలిస్తుంది. దేవుడు “ఇమ్మానుయేలు” మనతో ఉన్నాడు. దేవుడు తన ప్రేమానుగ్రహములకు స్పందిస్తూ మన సమాధానం కొరకు ఎదురుచూచు చున్నాడు.

దేవుని కృపకు, అనుగ్రహమునకు సమాధాన మివ్వడములో, మనం మరియమ్మనుండి ఎంతో నేర్చుకోవచ్చు. గబ్రియేలు దూతతో మరియమ్మ అనుభవం మన అనుదిన జీవితములో ఎన్నో పాటాలను నేర్పుతుంది. మన జీవితములో కూడా దేవదూతలను గుర్తించడానికి, ఎలా ప్రతిస్పందించాలో నేర్చుకోవడములో మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దేవుని అనుగ్రహాన్ని విశ్వసించువారికి నేటికీ దేవదూతలు ప్రత్యక్ష మవుతారు, కనిపిస్తారు, దేవునిచేత పంపబడతారు. అయితే, దానికొరకై మనం ఆధ్యాత్మిక కన్నులను తెరవాలి. దేవుని మంచితనము వలన, మరియతల్లి దేవుని కృపతో సహకారము వలన, మనము కూడా దేవుని కృపతో జీవించ గలుగుచున్నాము. మనం ఎల్లప్పుడు దేవుని కృపతో సహకరించాలి. పాపమును, సాతానును, దాని దుష్క్రియలను త్యజించాలి. పవిత్రముగా జీవించాలి. ఏడు దివ్యసంస్కారములు కూడాను ముఖ్యముగా జ్ఞానస్నానము, దివ్యసత్ప్రసాదము, పాపసంకీర్తనములు మనకు దేవుని కృపను ఒసగు మార్గాలు.

లూకా 1:26లో “తదుపరి ఆరవమాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలీయసీమయందలి నజరేతు నగరమునకు పంపెను” అని చూస్తున్నాము. దేవదూతల ప్రత్యక్షత ఒక నిర్దిష్ట సమయములో జరుగునని లేదా దేవుడు నిర్ణయించిన సమయములో జరుగునని స్పష్టమగు చున్నది. మన స్వంత జీవితాలలో కూడా దేవుడు జోక్యం చేసుకోవడానికి తాను ఎంచుకున్న నిర్దిష్ట సమయములో తన దేవదూతలను పంపుతారు. అలాగే, లూకా 1:27లో “ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను” అని చదువుచున్నాము. అనగా ఒక నిర్దిష్టమైన వ్యక్తి (మరియ) దగ్గరకు పంపబడెను. ఆ వ్యక్తి రోజువారి జీవితములోని వాస్తవ పరిస్థితులలో, మానవ సంబంధాల మధ్యన పంపబడెను. దూతలు దేవుని సందేశాన్ని కలిగి ఒక నిర్దిష్ట సమయములో, ఒక నిర్దిష్ట పరిస్థితి అవసరతలో పంపబడతారు. “అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు” (లూకా 1:28) అను దేవదూత శుభవచనము, దేవునితో సంబంధములోనికి ఆహ్వానిస్తున్నట్లుగా యున్నది. దూత పలుకులు చాలా నిర్దిష్టముగా ఉన్నాయి. మరియమ్మను ఆమె హీబ్రూ పేరుతో సంబోధించడం చూస్తున్నాము. అనగా దేవదూత పంపబడక మునుపే దేవునకు మరియమ్మ వ్యక్తిగతముగా తెలుసు మరియు ఆమెతో సత్సంబంధాన్ని కలిగియున్నాడని అని అర్ధం. అలాగే మనతో కూడా దేవుడు ప్రవర్తించును. గొప్ప హీబ్రూ కీర్తన కారుడు దావీదు పాడినట్లుగా:

“నాలోని ప్రతి అణువునునీవే సృజించితివి. మాతృగర్భమున నన్ను రూపొంచించితివి.
నీవు నన్ను అద్భుతముగ కలుగజేసిన భీకరుడవు. కనుక నేను నీకు వందనములు అర్పింతును.
నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి. ఈ అంశము నాకు బాగుగా తెలియును.
నేను రహస్య స్థలమున రూపము తాల్చినపుడు, మాతృగర్భమున విచిత్రముగా నిర్మితుడనైనపుడు
నీ కంటికి మరుగై యుండలేదు.
నేను పిండముగా నున్నపుడే నీవు నన్ను చూచితివి. నాకు నిర్ణయింప బడిన రోజులన్నియు
అవి ఇంకను ప్రారంభము కాకమునుపే, నీ గ్రంథమున లిఖింపబడి యున్నవి” (కీర్త 139:13-16).

          మరియమ్మను “అనుగ్రహ పరిపూర్ణురాలు” అని దేవదూత సూచించినది. ఆమె నిజముగానే దేవుని అనుగ్రహాన్ని పరిపూర్ణముగా పొందినది. పరలోక భూలోకముల ప్రభువు ఆమెను సారవంతమైన నేలగా సిద్ధంచేసి, ఎంచుకొని, తన వాక్యమగు విత్తనాన్ని నాటాడు. ప్రభువు మాటలకు, చిత్తానికి, ప్రణాళికకు ప్రతిస్పందించినపుడు, సమాధానం ఇచ్చినపుడు, మనము కూడా దేవుని అనుగ్రహముచేత నింపబడతాము. మన మనస్సులు పవిత్రముగా యున్నచో, యేసుక్రీస్తు మనలో కూడా జన్మిస్తాడు. ఆధ్యాత్మికముగా ఆయన మనలో వసిస్తాడు. బైబులులో మరియమ్మ గురించి చాలా తక్కువగా చెప్పబడింది. ఎందుకనగా, ఆమె తనకన్నా గొప్పవాడైన ప్రభువు యొక్క అద్దము, ప్రతిబింబము మాత్రమే కనుక! దేవుని అనుగ్రహముతో ఆమె నింపడినది. “ప్రభువు దాసురాలు” (లూకా 1:38) అయినది. పవిత్ర హృదయాలు కలిగిన సాధారణ ప్రజలను దేవుడు నూతన జీవితముతో నింపుతాడు. వారు దేవున్ని కలుసుకున్నప్పుడు, మరియమ్మవలె వారు దేవుని దయతో నింపబడతారు.

నజరేతు వాసియైన మరియమ్మ జీవిత సాక్ష్యముద్వారా పరమరహస్యము సులభతరం చేయబడింది. ఆమె ఫలభరితమైన జీవితాన్ని జీవించినది. పసిబిడ్డ అమాయకత్వము, మనస్తత్వముతోను జీవించినది. అందుకే ప్రభువు ఇలా అన్నారు, “ఓ తండ్రీ! పరలోక భూలోకములకు అధిపతీ! ఈ విషయములను నీవు జ్ఞానులకును, వివేకులకును మరుగుపరచి, పసిబిడ్డలకు వీనిని తెలియపరచినందులకు నీకు ధన్యవాదములు. ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము” (లూకా 10:21).

మరియమ్మ మనకు ఆదర్శమూర్తి: మరియమ్మ మనకు మార్గచూపరి. ఆమె దేవుని వాగ్దానాన్ని ఆలకించినది, విశ్వసించినది, అనుగ్రహముతో నింపబడినది, ప్రేమ స్వరూపుడైన దేవున్ని గర్భమున దాల్చినది. మనము కూడా ప్రార్ధన చేసినచో, దేవుని వాక్యాని, చిత్తాన్ని ఆలకించినచో, దేవునికి ‘అవును’ అని సమాధానం ఇచ్చినచో, మనముకూడా మరియమ్మవలె జీవించగలము. అలా చేసినప్పుడు, ‘దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు’ (లూకా 1:37) అని మరియమ్మవలె గుర్తించ గలము. మనము దేవుని అనుగ్రహముతో నింపబడి, యేసుక్రీస్తును ఇంకా అవసతలోనున్న ఈ లోకములోనికి, మరియమ్మవలె తీసుకొని రాగలము.

వరప్రసాదముల మాత చిత్ర పటము – చరిత్ర

శ్రీసభ ఆరంభము నుండి కూడా అద్భుత వరములు కలిగిన మరియమ్మ చిత్ర పటాలు, స్వరూపాలు ఉన్నాయి. సాంప్రదాయం ప్రకారం, మొట్టమొదటిగా మరియమ్మ పటాన్ని గీసినది సువార్తీకుడు పునీత లూకాగారు. అనాధి కాలము నుండి కూడా కన్యమరియమ్మ చిత్రాలను, స్వరూపాలను ప్రపంచ వ్యాప్తముగా ఎంతోమంది చేత పెయింటింగ్ చేయబడ్డాయి, రూపొందించ బడ్డాయి. వీటిలో కొన్ని, అద్భుత మధ్యస్థ వేడుదల ద్వారా ఎంతగానో ప్రసిద్ధి గాంచాయి. ఆలాంటి వాటిలో ‘వరప్రసాదముల మాత’ (అవర్ లేడి అఫ్ గ్రేస్) చిత్ర పటము ఒకటి. దీనిని ‘అవర్ లేడి అఫ్ బౌవ్డ్ హెడ్’ అని కూడా పిలుస్తారు. ఇది ఆస్ట్రియా దేశములోని వియన్నా నగరములోని కార్మలైట్ ఆశ్రమ దేవాలయములో ఉన్నది.

          ఫాదర్ దోమినిక్ అను ఒక కార్మలైట్ సన్యాసి దీనిని రోమునగరములో 1610లో కనుగొన్నాడు. అతను కార్మలైట్ మఠముగా మార్చాలనుకుంటున్న ఒక పాడుబడిన ఇంటిని చూసుకుంటూ ఉన్నాడు. ఆ ఇంటిముందు నడుస్తూ ఉండగా ఒక చెత్తకుప్పలో పడియున్న మరియమ్మ చిత్ర పటము ఒకటి ఆయన కంట బడింది. ఇంత అందమైన చిత్ర పటాన్ని ఎవరు చెత్తకుప్పలో పడేసారు అని ఆశ్చర్యపోయి, బాధపడి మరియమ్మకు క్షమాపణలు చెప్పి, దానిని తీసుకెళ్ళి మఠములోని తన గదిలో పెట్టుకున్నాడు. ఒకరోజు పటముపై నున్న దుమ్మును తుడుస్తూ ఉండగా, మరియమ్మ ముఖము సజీవముగా, నవ్వుతూ కనిపించినది. ఇలా అనేకసార్లు ఫాదర్ దోమినిక్ గారికి కనిపించి, తన సందేశాలను వినిపించినది. ఉత్తరించు స్థలములోనున్న ఆత్మల కొరకు పూజా ప్రార్ధనలు పెట్టించాలని, నా బిడ్డలు రక్షణ పొందుటకు కావలసిన వరములను పొందునట్లు చేయుదునని తెలియ జేసింది. ఇంకా, నా సంరక్షణను కోరువారి, భక్తితో ఈ పటాన్ని గౌరవించేవారి ప్రార్ధనలకు సమాధానం, అనేక వరప్రసాదములను పొందుదురని, ముఖ్యముగా ఉత్తరించు స్థలములోనున్న ఆత్మల విడుదల కొరకు ప్రార్ధించే వారి విన్నపాలకు ప్రత్యేక శ్రద్ధను చూపుతానని తెలియ జేసింది.

          అందుకే, ఫాదర్ దోమినిక్, ఆ చిత్ర పటాన్ని రోమునగరములోని ‘సాంత మరియ అల్లా స్కాల’ (Santa Maria alla Scala in Trastevere, Rome) దేవాలయానికి అనుబంధముగా నున్న పునీత చార్లెస్ చిన్న గుడిలో ఉంచాడు. అనేకమంది ఈ చిత్రపటము ముందు ప్రార్ధన చేసారు. అది అనేక వరప్రసాదములకు మూలం అయినది. ఫాదర్ దోమినిక్ మరణించు వరకు అనగా 16 ఫిభ్రవరి 1630వ సం.రం వరకు అది అక్కడే ఉంచబడింది. ఆ తరువాత కొంతకాలము రాజుల కొలువులో ఉన్నతరువాత, కార్మలైట్ మఠవాసినుల దగ్గర ఉంచబడింది. ఆతరువాత 1655వ సం.లో తిరిగి కార్మలైట్ మఠవాసులకు అప్పజెప్పడం జరిగింది. కాలక్రమేనా, వియన్నా పట్టణములో (Silbergasse, 35) నూతన దేవాలయము, మఠము నిర్మించబడటముతో, అద్భుత శక్తిగల వరప్రసాదముల మాత చిత్రపటమును 14 డిసంబరు 1901న నూతన దేవాలయములోనికి మార్చబడినది. 27 సెప్టెంబరు 1931న వియన్నాలో 300ల శతాబ్ద వేడుకలను ఘనముగా కొనియాడారు. ఆ సందర్భముగా, 11వ భక్తినాధ జగద్గురువులు చిత్రపటానికి కిరీటాన్ని అలంకరింప జేశారు.

          వరప్రసాదముల మాత మధ్యస్థ ప్రార్ధనను వేడుకొనడం అనగా, ‘దేవునికృప’ అయిన యేసుక్రీస్తు ప్రభువు మనకు అవసరమని గుర్తించడం! మరియతల్లి ద్వారా ఆ దేవుని కృప కొరకు ప్రార్ధన చేయడమే! లోకానికి వెలుగు శ్రీసభ అను చట్టములో ఈవిధముగా చదుచున్నాము, “దేవుని కృపావర శ్రేణిలో తొలి వరుసలో నిలుస్తుంది” మరియ (నం. 61). “నేటికీ ఆ దేవమాత మనలోని ప్రతి ఒక్కరికోసం ప్రార్ధిస్తూ మనకు నిత్యజీవ బహుమానాలను సంపాదించి పెడుతుంది” (నం. 62). 

No comments:

Post a Comment