నిత్యసహాయమాత మహోత్సవము
క్రీస్తునందు
ప్రియ సహోదరీ సహోదరులారా! చాలామంది ఈ దివ్యపూజలో పాల్గొంటున్నారు. మరియతల్లిపై,
ముఖ్యముగా నిత్యసహాయమాతపై మీకున్న ప్రేమ ఎంత గొప్పదో అర్ధమగుచున్నది. మరియతల్లి
యొక్క రక్షణ, సంరక్షణపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి ఇది గొప్ప సూచనగా యున్నది.
యోహాను సువార్త 19వ అధ్యాయములో చూస్తున్నట్లుగా, సిలువపైనున్న యేసు తన శిష్యునితో
“ఇదిగో నీ తల్లి” అని పలికాడు. “శిష్యుడు ఆ గడియనుండి ఆమెను స్వీకరించి తన స్వంత
ఇంటికి తీసికొని పోయెను” (19:27). మనముకూడా ఆ శిష్యునివలె చేయాలి. మరియ మనందరికీ
తల్లి, అమ్మ. కనుక, ఈ సమయమున యేసు మనందరితోకూడా “ఇదిగో నీ తల్లి” అని
చెప్పుచున్నాడు. అప్పుడు మనం ఏమి చేయాలి? మరియ తల్లిని మన ఇంటికి తీసుకొని పోవాలి.
అనగా, ఆమె విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ధైర్యాన్ని, పవిత్రతను, భక్తిని,
ఆధ్యాత్మికతను, ప్రార్ధన జీవితాన్ని, సంతోషాన్ని, సేవాజీవితాన్ని, విశ్వసనీయతను,
ప్రేమను, మాతృత్వాన్ని, సరళతను, దైవవాక్కును
మరియు ఆ తల్లిద్వారా మనం పొందుకునే నిత్యసహాయాన్ని మనం తీసుకుని పోవాలి.
నిత్యసహాయమాత
ప్రాచుర్యములోనికి వచ్చినది, నిత్యసహాయమాత చిత్ర పటము వలన. ఆ పటము యొక్క చరిత్రను
మీకు క్లుప్తముగా వివరిస్తాను. అది...1498వ సం.ములో గ్రీసు దేశములోని క్రీటు అనే
ద్వీపములోని ఒక దేవాలయములో కొంతకాలముగా ఈ చిత్రపటము ఉండేది. దీనికి అద్భుతమైన
పటముగా పేరు. ఒకరోజు ఒక వ్యాపారి, ఆ ఫోటోను దొంగిలించి, తనతో తీసుకొని వెళ్ళాడు.
ఒక సం.రం తతువాత ఆ వ్యాపారి రోము నగరానికి వెళ్ళాడు. అచట తీవ్రమైన జబ్బుకు గురై
మరణావస్థలో ఉండగా, రోమునగరములో తన స్నేహితున్ని పిలచి ఆ చిత్ర పటము గురించి
చెప్పి, దానిని బహిరంగముగా అందరు దర్శించడానికి వీలుగా ఉండే ఏదైనా ఒక దేవాలయములో
ఉంచమని కోరతాడు. అతడు మరణించిన తరువాత, ఆ స్నేహితుడు దానిని తన యింటికి తీసుకొని
వెళ్ళగా, ఆయన భార్య దానికి వారి యింటిలోనే ఉంచుతుంది. మరియతల్లి అనేకసార్లు ఆ
వ్యక్తికి దర్శనం యిచ్చి అ చిత్ర పటాన్ని అక్కడనుండి తీసివేయమని చెప్పిన వినలేదు.
చివరికి, మరియతల్లి 6 సం.ల అతని కుమార్తెకు దర్శనమిచ్చి చెప్పడముతో, అలాగే ఆ
వ్యక్తికూడా వ్యాధిబారిన పడటముతో, 27 మార్చి 1499న, ఆ పటాన్ని రోమునగరములోని పునీత
మత్తయి దేవాలయములో ఉంచడం జరిగింది. అప్పటినుండి దాదాపు మూడు వందల సం.లు అక్కడే
ఉంది. ఎంతోమంది ఆ పటాన్ని దర్శించి, ఎన్నో అద్భుత మేలులను పొందటం జరిగింది. అయితే,
1798వ సం.లో ఫ్రెంచ్ సైన్యం రోమునగరాన్ని ఆక్రమించుకొని 30 దేవాలయాలను
కూల్చివేయాల్సిందిగా నిర్ణయించారు. దానిలో పునీత మత్తయిగారి దేవాలయము కూడా ఒకటి.
అందుకే ఆ పటాన్ని దగ్గరలోనున్న పునీత యూసేబియో దేవాలయములోనికి మార్చడం జరిగింది.
అక్కడ దాదాపు 20 సం.లపాటు ఉంచడం జరిగింది. 1818వ సం.లో అక్కడ నుండి పునీత మరియ అనే
దేవాలయములోని మార్చబడింది. చివరిగా 1866వ సం.లో పునీత మత్తయిగారి దేవాలయ స్థలములో
నిర్మించబడిన పునీత అల్ఫోన్స్ లిగోరి దేవాలయమునకు మార్చడం జరిగింది.
క్రీ.శ.1808లో 7వ భక్తినాధ జగద్గురువులను నియంత అయిన
నెపోలియన్ నిర్భందించి జైలులో పెట్టించాడు. నెపోలియన్, దేవుడంటే నమ్మని పాషాణ
హృదయుడు, తన శక్తియుక్తులే కాని దైవశక్తి సహాయం
అంటూ ఏదిలేదని చెప్పిన అహంభావి. అయితే ‘లీప్ జిగ్’
యుద్దం ముగిశాక నెపోలియన్ జగద్గురువులను
విడుదలచేశాడు క్రీ.శ. 1814లో జగద్గురువులు విజయోత్సాహంతో
విశ్వాసుల జయజయ ధ్వానాలమద్య రోమునగర పేతురు సింహాసనం తిరిగి అధిష్టించారు.
నిత్యసహాయమాత ఫోటోను
మనం చూసినట్లయితే, ముందుగా మరియతల్లి కళ్ళను మనం గమనించాలి. ఆ ఆమె తన కళ్ళను
పెద్దవిగా చేసి మనలనే చూస్తూ ఉన్నది. ఆమె చల్లని చూపు ఎంతో ప్రేమతో కలిగిన చూపుగా
మనం గమనించవచ్చు. ఆమె కుడిచేయిని బాలయేసు తన రెండు చేతులతో గట్టిగా
పట్టుకున్నట్లుగా చూస్తాం. మరియ మనవైపు చూస్తూనే, తన కుడి చేయి బాలయేసును చూపిస్తూ
మనకు సైగ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. దాని అర్ధం ఏమిటంటే, ఆ తల్లి మనలను యేసు
వద్దకు నడిపిస్తుంది.
కానా పల్లెలో
పెండ్లిలో ద్రాక్షారసం అయినప్పుడు చేసినట్లే, ఇప్పుడు కూడా చేస్తుంది. యేసువైపునకు
మనలను సూచిస్తుంది. అక్కడనున్న సేవకులతో “ఆయన చెప్పినట్లు చేయుడు” (యో 2:5) అని
చెప్పింది. నిత్యసహాయమాత ఈరోజు మనదరితోకూడా చెప్పేది ఇదే, “ఆయన చెప్పినట్లు
చేయుడు”. ఈవిధముగా, మరియతల్లి “మార్గము, సత్యము, జీవము” (యో 14:6) అయిన యేసు
చెంతకు మనలను నడిపిస్తుంది. పరలోకమునకు, నిత్యజీవమునకు నడిపించు మార్గము యేసు
క్రీస్తు ప్రభువు వైపునకు మనలను నడిపిస్తుంది. తండ్రి దేవుని యొద్దకు మనలను
నడిపించు మార్గము యేసు క్రీస్తు ప్రభువు.
“నేనే
మార్గమును, సత్యమును, జీవమును. నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు” (యో
14:6) అని ప్రభువు పలికియున్నారు. ఈ విషయం మరియ తల్లికి తెలుసు కనుక, ఆమె,
“మార్గము, సత్యము, జీవము” అయిన యేసు చెంతకు మనలను నడిపిస్తుంది. “దేవుడు లోకమును
ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను...నిత్య జీవమును పొందుటకై అటుల
చేసెను (యో 3:16). ఈ విషయం మరియ తల్లికి తెలుసు కనుక, మనలను ఈ దేవుని కుమారుని
చెంతకు నడిపిస్తుంది.
దేవుడు తన దయను
మరియ తల్లిద్వారా మనకు ప్రకాశింప జేయుచున్నాడు. మరియ తల్లి గర్భమున ఉద్భవించి,
దివ్యబాలయేసుగా, ఆమె చేతులలో, ఒడిలో పెరిగి లోక రక్షకునిగా ఆవిర్భవించాడు. జ్ఞానస్నానములో
దయతో మనలను పాపమునుండి రక్షిస్తాడు. దివ్యసత్ప్రసాదమును స్వీకరించినపుడు దయతో
మనలను పోషిస్తున్నాడు. పాపం చేసినపుడు పాపసంకీర్తనం ద్వారా ఆయన వద్దకు
వస్తున్నాము. దయతో మన పాపములను క్షమిస్తున్నాడు. తద్వార, మరల మనం ఆ మార్గములో
ఉంచబడుతున్నాము. శాంతి, సంతోషముగల పరలోకమునకు, నిత్యజీవమునకు నడిపించ బడుచున్నాము.
ఇలా జీవించ గలగడానికి, మరియ తల్లి మనకు సహాయం చేస్తుంది. నిత్యమూ సహాయం చేస్తుంది.
ఇంకా చిత్ర
పటములో ఆసక్తికరమైన మరొక అంశం ఏమిటంటే, ఇద్దరు దేవదూతలు (గబ్రియేలు దేవదూత,
మైకేల్ దేవదూత). ఒక దేవదూత సిలువను మోసుకొని వస్తూ ఉన్నది. ఇంకొక దేవదూత పులిసిన
ద్రాక్షారసములో ముంచిన స్పాంజ్’ను మోసుకొని వస్తూ ఉన్నది. ఈ రెండు సూచనలు క్రీస్తు
శ్రమలకు సూచనలు. యేసుక్రీస్తు మనకోసం, మన పాపముల నిమిత్తం శ్రమలను అనుభవిస్తాడు
అన్నదానికి సూచనగా యున్నది.
యేసు ఎందుకు
మనకోసం శ్రమలను అనుభవించాడు? ఎందుకన, ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన శ్రమలద్వారా
మనం పాపమునుండి విముక్తిని పొందుచున్నాము. ఆయన శ్రమలద్వారా, దేవుని కృపానుగ్రహము
లోనికి మనం పునరుద్దరింప బడుచున్నాము.
ఈవిధముగా,
నిత్యసహాయమాత చిత్ర పటము మన క్రైస్తవ విశ్వాసాన్ని తెలియ బరుస్తుంది. యేసు మన
“మార్గము” అని తెలియజేస్తుంది. ఆయన మనకోసం శ్రమలను అనుభవించాడని, తద్వారా మనకు
రక్షణను, నిత్యజీవితమును ప్రసాదించాడని తెలియజేస్తుంది. ఈరోజు ఎన్నో మనవులతో
మరియతల్లి చెంతకు వచ్చియున్నాము. మరియతల్లి ఏవిధముగానైతే దివ్యబాల యేసును తన చేతుల్లో
పట్టుకొని యున్నదో, మనలనుకూడా తన చేతుల్లోనికి తీసుకొని తండ్రి దేవునికి
సమర్పించమని కోరుదాం. చిన్నారి బాల యేసును రక్షించిన విధముగా, మనలనుకూడా రక్షించి,
పరలోక తండ్రికి అందజేయమని ప్రార్ధన చేద్దాం.
“నిత్యసహాయమాత”
అనే పేరు స్వయముగా మరియ తల్లియే ఎన్నికోవడం జరిగింది. ఎందుకంటే, మన ప్రతీ అవసరములో
విశ్వాసముతో, నమ్మకముతో ఆ తల్లి చెంతకు రావాలని.
అలాగే, “నిత్యసహాయమాత”
ఫోటోపై ఉన్న పేర్ల గురించి తెలుసుకుందాం. “దేవునితల్లి” అని వ్రాయబడి
యుండటం మనం చూస్తాము. ఆమె యేసుని తల్లి. మనదరికే తల్లి. ఒక అమ్మగా మనకు సహాయం
చేస్తుంది. “నిత్యమూ” అని చూస్తున్నాము, అనగా ఎల్లప్పుడు, అన్నివేళల అని
అర్ధం. మరియతల్లి మనకు ఎల్లప్పుడు, నిత్యమూ తోడుగా యుండి, మనలను యేసు చెంతకు
రమ్మని ప్రోత్సహిస్తూ ఉంటుంది అని అర్ధం. మరియ తల్లి మధ్యస్థ ప్రార్ధనల ద్వారా
నిత్యమూ మనం దేవుని సహాయం పొందుతామని అర్ధం. “సహాయం” మరియ భక్తులము,
బిడ్డలమైన మనందరమూ చేసెది అదే నిత్యమూ ఆమె సహాయం కొరకు వేడుకుంటాము. మనకు
ఎల్లప్పుడు దేవుని సహాయం మనకు ఎంతో అవసరం. ఆయన లేకుండా మనం జీవించలేము. దేవుని
సహాయం కొరకు, మరియమ్మ సహాయం కూడా మనకు ఎంతో అవసరమని తెలియ జేస్తుంది.
నిత్యసహాయము: ఈ మూడు పేర్లను
గురించి తెలుసుకున్న తరువాత, నిత్యసహాయము ఎవరు అంటే మీరు ఏమి చెప్తారు? వెంటనే మన
సమాధానం మరియతల్లి అని చెప్తాం! సహాయానికి, ఆశీర్వాదాలకు మూల మరియతల్లి అని
అనుకుంటాం! కాని మరియ నిత్యసహాయమునకు మాత, అమ్మ అని మనం గుర్తించాలి. మరియ దేవుని
తల్లి అయితే, యేసు క్రీస్తు నిత్యసహాయానికి మూలం.
నిత్యసహాయము అనేది శాశ్వతమైన, అనంతమైన దేవుని ప్రేమనుండి వస్తుంది. మరియతల్లి దేవుని శాశ్వతమైన, అనంతమైన ప్రేమను పొందింది. కనుక, మనం మరియ తల్లిని చూసినప్పుడు, మన జీవితాలుకూడా ఆ దేవుని శాశ్వతమైన, అనంతమైన, షరతులు లేని ప్రేమతో నింపబడాలని చూడాలి.
No comments:
Post a Comment