ప్రపంచ యువత దినోత్సవం 2023
దివ్యపూజాబలిలో ప్రసంగం, పోప్ ఫ్రాన్సిస్
6 ఆగష్టు 2023
“భయపడకండి”: ప్రపంచ యువత దినోత్సవ ముగింపు సందర్భముగా యువతకు పొప్ ఫ్రాన్సిస్ అంతిమ సందేశం
‘లిస్బన్’, పోర్చుగల్ 6 ఆగష్టు 2023
“భయపడకండి” అని పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం పోర్చుగల్‌లోని లిస్బన్‌లో జరిగిన ప్రపంచ యువత దినోత్సవం 2023 ముగింపు సందర్భంగా కథోలిక యువతకు తెలిపారు. ప్రియమైన యువత, మీ అందరి కళ్ళలోకి చూసి, “భయపడకండి” అని చెప్పాలనుకుంటున్నాను. నేను మీకొక మంచి విషయాన్ని చెప్తాను. అదేమిటంటే, ఇకనుండి మీ కళ్ళలోకి చూసేది నేను కాదు, ఈ క్షణంనుండి స్వయముగా యేసే మిమ్ములను చూస్తున్నాడు. ఆయనకు మీ గురించి తెలుసు. మీలో ప్రతీఒక్కరి హృదయం ఆయనకు తెలుసు. మీలో ప్రతీఒక్కరి జీవితం ఆయనకు తెలుసు. మీ ఆనందం, దుఃఖం, మీ విజయాలు, వైఫల్యాలు ఆయనకు తెలుసు. యేసు మీ హృదయాలను ఎరిగియున్నాడు. ఆయన మన హృదయాలను చవిచూచును. ఈరోజు లిస్బన్ నగరములో యేసు మీతో “భయపడకండి”అని పలుకుచున్నాడు.
6 ఆగష్టు ఆదివారమున “యేసు దివ్యరూపం ధారణ” మహోత్సవ సందర్భముగా పొప్ ఫ్రాన్సిస్ దివ్యపూజా బలిని సమర్పించారు. 1.5 మిలియన్ ప్రజలు ఈ దివ్యపూజా బలిలో పాల్గొన్నారు. అచ్చట యువత శనివారం రాత్రి జాగరణ ప్రార్ధనలో పాల్గొని ఆదివారం ఉదయం దివ్యపూజలో పాల్గొన్నారు. సుమారు 10 వేలమంది గురువులు, 700 మంది పీఠాధిపతులు పాల్గొన్నారు. ఈ ప్రపంచ యువత దినోత్సవ వేడుకలు వందల, వేలమంది యువతను ఆకర్షించింది. ఈ వారమంతయు కూడా వారు వివిధ ప్రార్థనలలో, చర్చలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు.
పొప్ ఫ్రాన్సిస్ తన ప్రసంగములో సువిశేష పఠనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు: “ప్రభూ! మనం ఇచట నుండుట మంచిది” (మత్త 17:4) అని ‘దివ్యరూపం ధారణ’ కొండపై అపోస్తలుడు పేతురు ప్రభువుతో పలికాడు. ఈ యువత దినోత్సవ వేడుకలలో, యేసు ప్రభువును అనుభూతి చెందాము. కలిసి ప్రార్ధించాము. ఎన్నో విషయాలను నేర్చుకున్నాము. అయితే, మన దైనందిన జీవితాలకు తిరిగి వెళ్లేప్పుడు ఇక్కడనుండి ఏమి తీసుకొని వెళ్లుచున్నాము? అని ప్రశ్నించు కోవాలి.
మనం విన్న సువార్త పఠనం ఆధారముగా మూడు క్రియలతో (కార్యాలతో) సమాధానం ఇవ్వాలని అనుకుంటున్నాను: ప్రకాశించుట, ఆలకించుట, భయపడక ఉండుట.
ప్రకాశించుట: “యేసు రూపాంతరం చెందెను. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను” (మత్త 17:2). ఈ సంఘటనకు ముందుగా యేసు సిలువపై తాను పొందబోవు శ్రమలు, మరణం గురించి ప్రస్తావించాడు. శిష్యుల ఊహలను యేసు పటాపంచలు చేసాడు. వారి అంచనాలను తలక్రిందులు చేసాడు. అయితే, సిలువలో మహిమపరపబడిన దేవుని ప్రణాళికను, దేవుని చిత్తమును ఆలింగనం చేసుకోవడానికి, దేవుని ప్రణాళికను అర్ధం చేసుకోవడములో శిష్యులకు సహాయం చేయడానికి, తన ముగ్గురు శిష్యులతో (పేతురు,యాకోబు, యోహాను) ఒక ఎత్తైన పర్వతముమీద వారి ఎదుట రూపాంతరం చెందాడు. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించింది. ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లగా నయ్యెను. ఈ అద్భుతమైన వెలుగు ద్వారా, శిష్యులు అనుభవించబోయే చీకటి రాత్రిని ఎదుర్కొనుటకు సంసిద్ధం చేయుచున్నాడు. ఈ అఖండమైన జ్యోతి, వెలుగు, కాంతి గెత్సేమని, కల్వరి చీకటి ఘడియలను చేధించడానికి వారికి ఉపకరిస్తుంది. మన దైనందిన జీవితాలలోనున్న సవాళ్ళను, వివిధ సమస్యలను, భయాలను, అభద్రతా భావాలను అధిగమించడానికి మనకుకూడా ఈ “వెలుగు” తప్పక అవసరం. ఈ వెలుగే - యేసు క్రీస్తు. “ఆయన అస్తమించని సూర్యుడు. కటిక చీకటిలో కూడా ప్రకాశిస్తూనే ఉంటాడు”.
బైబిలులోని మరో సంఘటనను ధ్యానించుదాం: యాజకుడు ఎజ్రా వలె మనము కూడా, “మా కన్నులను ప్రకాశవంతం చేయండి”(ఎజ్రా 9:8) అని ప్రార్ధన చేద్దాం. క్రీస్తు వెలుగులో మనంకూడా రూపాంతరం చెందుదాం. మన కన్నులు, ముఖము క్రీస్తు వెలుగులో ప్రకాశించును. యవ్వనంలో మీరు ప్రకాశవంతులుగా ఉండాలని, సువార్త వెలుగును ప్రసరింప జేయాలని, అంధకారంలో ఆశాజ్యోతులుగా ఉండాలని, తల్లి శ్రీసభ, ఈ ప్రపంచము ఆశించుచున్నది. మనం వెలుగును ఎలా ప్రసరింపజేయ గలము? ఖచ్చితముగా మన బాహ్య సౌందర్యము ద్వారా కాదు. మన విజయాలద్వారా కాదు. మన శారీరక బలముద్వారా కాదు. ఎప్పుడైతే మనం క్రీస్తును మన హృదయాలలోనికి ఆహ్వానిస్తామో, ఆయనవలె మనం ప్రేమిస్తామో, అప్పుడు మాత్రమే మనం వెలుగును ప్రసరింప జేయగలము. ప్రేమకోసం ఫణముగా పెట్టు జీవితం ప్రకాశవంతమైన జీవితం.
ఒక తత్వవేత్త (S. Kierkegaard) “ప్రేమకు అయోగ్యమైన దానిని కూడా యోగ్యముగా చేయడమే క్రీస్తు యొక్క విప్లవాత్మక సందేశం”అని వ్రాసాడు. మరొక మాటలో చెప్పాలంటే, మన పొరుగు వారిని వారిగా ప్రేమించాలి. అంతేగాని, మనతో ఏకీభవించే వారిని మాత్రమే ప్రేమించడం కాదు. వారు మనపై దయకలిగి లేనప్పుడుకూడా, మనతో ఏకీభవింపనపుడు కూడా వారిని ప్రేమించగలగాలి. యేసు ప్రభువు వెలుగుతో మనం ఖచ్చితముగా చేయగలము. యవ్వనస్థులు, తప్పక అలాంటి ప్రేమను కలిగి యుంటారు. ఆ ప్రేమతో అడ్డుగోడలను, దురభిప్రాయాలను విచ్చిన్నం చేయగలరు. తద్వారా, క్రీస్తు ప్రేమగల రక్షణ వెలుగును లోకమునకు తీసుకొని రాగలరు. మీరు ఎల్లప్పుడూ ఆ ప్రేమను ప్రసరింప జేయండి. “లోకమునకు వెలుగు” అయిన క్రీస్తును ప్రసరింప జేయండి.
ఆలకించుట: తండ్రి దేవుడు పలికిన “ఆయనను ఆలకింపుడు” (మత్త 17:5) అను మాటలను పొప్ ఫ్రాన్సిస్ గుర్తుచేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. మనం యేసు చెప్పేది వినాలి. ఆయనతో సంభాషించాలి. ఆయన మాటలను చదివి ఆచరణలో పెట్టాలి. ఆయన అడుగుజాడలలో అనుసరించాలి. యేసు నిత్యజీవపు మాటలు కలవాడు. దేవుడు తండ్రియని, ప్రేమయని మనకు బయలుపరిచాడు. పరిశుద్ధాత్మలో మనము కూడా దేవునకు ప్రియమైన బిడ్డలమవుతాము. ఈ లోకములో మనకు కావలసినది ఇదియే. డబ్బు, కీర్తి, విజయం కాదు. ఈ లోకములో మనం ఒంటరిగా లేమని గుర్తుంచుకోవాలి. మనతో ఎల్లప్పుడూ క్రీస్తు ఉన్నాడు. మనం ప్రేమించ బడుతున్నామని, దేవుని కౌగిలిలో యున్నామని నమ్మాలంటే, యేసు మాటలను ఆలకించాలి.
ప్రభువు మాటలను ఆలకించినపుడు, దేవుని ఆశ్చర్యకరమగు కార్యములకు మన హృదయాలు తెరచి యుంచినపుడు, మనం ఒకరినొకరం ఆలకించగలము. మన చుట్టూయున్న పరిస్థితులకు, ఇతర సంస్క్రుతులకు, పేదలపట్ల, గాయపడిన వారిపట్ల, సున్నిత మనస్కులమై యుండగలము. యేసు మాటలను ఆలకించడం, ఒకరినొకరు ఆలకించడం ఎంత మంచిది! ఒంటరితనం, స్వార్ధం బలముగానున్న ఈ ప్రపంచములో, సంభాషించగలిగే సామర్ధ్యం కలిగి యుండటం ఎంత మంచిది!
భయపడకండి: యేసు శిష్యుల వద్దకు వచ్చి, వారిని తట్టి, “లెండు, భయపడకుడు” అని పలికాడు. యేసు మాటలు శిష్యులకు ఎంతో ఊరటను, ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. అవే మాటలను యేసు మనతో కూడా పలుకుచున్నారు. పరలోక మహిమను అనుభూతి చెందిన తరువాత, తమకై ఎదురుచూస్తున్న సవాళ్ళను ఎదుర్కొనడానికి వారు పర్వతం దిగి వచ్చారు. మనం కూడా వారి అడుగుజాడలలో నడవాలి. క్రీస్తు వెలుగును మన జీవితములో నిండుగా నింపుకొని యుంటే, మనము కూడా భయము లేకుండా జీవించవచ్చు.
యువత అయిన మీకు ఎన్నో కలలు యుంటాయి. అవి నెరవేరడం లేదని తరుచుగా భయపడవచ్చు! కొన్నిసార్లు సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధముగా లేమని భావించవచ్చు! నిరాశనిస్పృహలకు లోనుకావొచ్చు! గుండెధైర్యం కోల్పోవచ్చు! అయినను, భయపడకండి! ధైర్యముగా ఉండండి!
యువకులుగా, మీరు ఈ లోకాన్ని మార్చాలని, శాంతి కోసం పనిచేయాలని కోరుకుంటున్నారు. దీనికోసమై, మీ శక్తిని, సృజనాత్మకతను వెచ్చిస్తున్నారు. భూమికి వర్షం ఎంత అవసరమో, యువత శ్రీసభకు, ఈ లోకానికి అంతే అవసరము. ప్రియ యువత, మీరే ఈ లోకానికి వర్తమానము మరియు భవిత! మీ అందరితో యేసు, “భయపడకండి” అని పలుకుచున్నాడు.
ఒక యువత దినోత్సవ వేడుకలలో పునీత రెండవ జాన్ పౌలు గారు చెప్పిన మాటలు గుర్తుచేసుకుందాం: “మీరు ఆనందము గురించి కలలు కన్నప్పుడెల్ల, మీరు వెతుకుచున్నది యేసునే. మీకు సంతృప్తి కలిగించే చిన్నవి పొందినప్పుడు, యేసు మీకోసం ఎదురుచూచు చున్నాడు. మనం వెదికే పరిపూర్ణ ఆనందం ఆయనయే. మన హృదయ కోరికలను అర్ధం చేసుకుంటాడు. జీవితములో ఏదైనా గొప్పగా చేయాలనే కోరికను రేకెత్తిస్తాడు. కనుక మిమ్ములను మీరు ఆయనకు ఒప్పగించుకొనుటకు భయపడకండి” (జాగరణ ప్రార్ధన, రోమునగరము, 2000).
ప్రియమైన యువత! యేసు మీ కళ్ళలోకి చూసి “భయపడవద్దు” అని పలుకుచున్నాడు. ఆయన మిమ్ములను అనంతముగా ప్రేమిస్తున్నాడు. కనుక, దేవుని చిరునవ్వును పంచుతూ ముందుకు సాగండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమకు సాక్ష్యమివ్వండి. క్రీస్తు వెలుగుతో ప్రకాశించండి. ఈ లోకమునకు వెలుగుగా మారుటకు ఆయనను ఆలకించండి.
No comments:
Post a Comment