మరియ తల్లి
మన భూలోక
జీవితములో, అమ్మ అంటే
అందరికి ప్రేమ, మమత, అనురాగం. అమ్మ అనే
పదములోనే కమ్మదనం, తీయదనం ఉంది. అమ్మ అంటే అందరికీ ఎంతో ఇష్టం.
అమ్మకోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాము. అమ్మను ఎంతగానో గౌరవిస్తాము. ఈరోజు, సెప్టెంబరు 8, విశ్వశ్రీసభ
మరియతల్లి జన్మదినోత్సవాన్ని కొనియాడుచున్నది. మరియ జన్మముగూర్చి, పునీత అల్ఫోన్స్ లిగోరిగారు, “ఒక మహోన్నత పునీతురాలు
జన్మించినది” అని చెప్పారు.
కతోలిక క్రైస్తవ
విశ్వాస జీవితములో మరియమ్మను ఎంతగానో గౌరవిస్తాము. శ్రీసభ రక్షణ చరిత్రలో, మరియమ్మ పాత్ర ఎనలేనిది. అందుకే,
శ్రీసభ మరియమ్మకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించినది. ఆమె
ధన్యురాలు! అపోస్తోలిక కాలమునుండియే, మరియమ్మ
గౌరవింపబడుచున్నది. మరియమ్మను అనేక విధాలుగా మనం కొనియాడుచున్నాము.
మరియమ్మ ఆశాజనని, కరుణామూర్తి, ఆత్మయందు
జీవమునకు ఆదర్శమూర్తి, క్రైస్తవులకు జీవనదాయిని, మన సంతోషమునకు కారణమూర్తి, పరలోకరాజ్ఞి, ప్రార్ధనసహాయిని! ఎందుకన, ఆమె పరమపవిత్రురాలిగా,
విధేయురాలిగా, గొప్పపునీతురాలిగా
గుర్తించబడినది. గాబ్రియేలుదూత శుభసమాచారమును అందించిన సందర్భముగా, మరియతల్లిలోని గొప్పసుగుణాలను మనం స్పష్టముగా చూడవచ్చు. గడచిన శతాబ్దాలలో,
మరియతల్లి అద్భుతరీతిన, అనేకమందికి అనేకసార్లు
తన దర్శనాలను కలుగజేసి, దేవుని సందేశాన్ని తెలియజేసినది.
మరియ “దేవుని తల్లి”
అని అన్నివర్గాల క్రైస్తవులు గుర్తించారు (ఆర్థోడాక్స్, కాథలిక్,
ఆంగ్లికన్, లూథరన్). అయితే, కథోలిక శ్రీసభ మరియతల్లికి సంబంధించిన కొన్ని విలక్షణమైన విశ్వాస సత్యాలను, సిద్ధాంతాలను కలిగియున్నది – ఉదాహరణకు, “దేవునితల్లి,
నిష్కళంకమాతా, నిత్యకన్యక, మోక్షారోపితమాతా”... మొ.వి. మరియతల్లి గురించి
కొన్ని విషయాలను ధ్యానిద్దాం.
1. మరియ:
దేవుని తల్లి - మనందరి తల్లి: “నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తించెను” (లూ 1:43) అని పవిత్రాత్మచే పరిపూర్ణురాలైన ఎలిశబేతమ్మ ఎలుగెత్తి పలికింది.
కనుక, మరియ దేవుని తల్లి లేదా ప్రభుని తల్లి. యేసు దేవుడైనప్పుడు,
మరియ ఆయన తల్లి అయినప్పుడు, ఆమె దేవుని తల్లికూడా.
మరియ మనందరికీ
అమ్మ. మన ఆధ్యాత్మిక తల్లి. ప్రభువు సిలువలో మరణించక ముందుగా, తన తల్లితో “స్త్రీ!
ఇదిగో నీ కుమారుడు” మరియు తన శిష్యునితో, “ఇదిగో నీ తల్లి” అని పలికాడు (యో 19:26,27). మరియతల్లిని, తన శిష్యుల సంరక్షణలోను, బాధ్యతలోను అప్పగించాడు. తద్వారా, ప్రభువు
విశ్వాసులందరికీ ఆమెను అమ్మగా ఒసగియున్నాడు. అందుకే, ఆమె
శ్రీసభమాత. కనుక, మరియ మనందరికీ అమ్మ. యేసువలన, మరియ మనకి అమ్మ అవుతున్నది. మెస్సయ్యకు తల్లిగా ఉండుటకు దేవుని పిలుపును
ఆమె ఇష్టపూర్తిగా అంగీకరించింది. యేసుకు జన్మనిచ్చి, యోసేపుతో
కలిసి పెంచి పెద్దచేసింది. ఆమె యేసుతల్లి కనుక, ఆమె కథోలిక
శ్రీసభకుతల్లి, విశ్వాసులందరికీ తల్లి. ఒక తల్లిగా ఆమె మనలనుండి
కోరుకునేది ఏమిటంటే, మనందరంకూడా దేవున్ని సంపూర్ణముగా
ప్రేమించాలి, ఆమె కుమారున్ని శ్రద్ధగా ఆలకించాలి. దీనికై
మనకు సహాయం చేయడానికి మరియ ఎల్లప్పుడూ సిద్ధమే.
ఆ.కాం. 3:20వ వచనంలో చదువుతున్నట్లుగా,
“జీవులందరకు తల్లి గావున నరుడు [ఆదాము] తన భార్యకు
‘ఏవ’ అను పేరు పెట్టెను.” మరియ నూతన ఏవగా రక్షణ చరిత్రలో తన పాత్రను పోషిస్తుంది. కనుక, మరియ జ్ఞానస్నానమందు నూతన జీవితాన్ని పొందిన వారందరికీ తల్లి.
2. మరియ: ప్రభువు దాసిరాలు (వినయము, విధేయత): “నేను ప్రభువు దాసిరాలను. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక” (లూ 1:38). ఈవాక్యంలో, మరియతల్లి
వినయసుగుణాన్ని చూడవచ్చు. తన వినయపూర్వకమైన అంగీకారంతో, ఏవమ్మయొక్క
అవిధేయతను రద్దుచేసింది. సాతానుయొక్క ప్రణాళికలను నాశనం చేసింది. తద్వారా, ఒక తల్లి తన బిడ్డలను కాపాడుకొనునట్లు, మరియతల్లి
మనలను సాతాను వలనుండి రక్షించినది. ఆదికాండము (3:15) నుండి
దర్శన గ్రంథము (12:1-6) వరకు, మరియమ్మ
ప్రస్తావన చూడవచ్చు. సృష్టి ఆరంభములోనే, పాపము చేసిన మానవాళిని
రక్షించాలని దేవుడు నిర్ణయించినప్పుడే, మరియతల్లిని, రక్షణ ప్రణాళికలో భాగాస్తురాలిగా, నూతన ఏవమ్మగా
ఎన్నుకున్నారు (ఆది 3:15; పు. జస్టిన్, పు. యురేనియుసు; పయస్ IX, Ineffabilis
Deus). ఏవమ్మ అవిధేయతతో దేవుని ఆజ్ఞను ధిక్కరించి, అవిశ్వాసముతో పాపంచేసి, మరణానికి మనలను
బానిసలుచేస్తే, నూతన ఏవమ్మ అయిన మరియ దేవునికి సంపూర్ణముగా
విధేయించి, తన విశ్వాసముతో లోకాన్ని జీవముతో నింపినది. తన
సంపూర్ణ సహకారాన్ని క్రీస్తుకు అందించి, మన రక్షణలో
పాలుపంచుకున్నది.
3. మరియ: జన్మపాప రహిత, అమలోద్భవి మాతా: “అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ప్రభువు నీతో ఉన్నారు” (లూ 1:28). మరియ జన్మపాపరహిత కనుక, ఆమె “అనుగ్రహ
పరిపూర్ణురాలు”. అయితే, మరియ జన్మపాపరహిత కనుక ఆమెకు రక్షకుడు అవసరంలేదని
అర్ధంకాదు. మరియ పాపములో పడకముందే, జన్మపాపము ఆమెకు
సోకకముందే, దేవుడు ఆమెను సంరక్షించాడు. మనమందరం పాపములో
పడిపోయాక, రక్షింపబడ్డాము. కాని, మరియపై
సాతాను ఏనాడు తన శక్తిని ప్రదర్శించే అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు. అందుకే, మరియ, సకల దేవదూతలకన్న శక్తిగలది. సకల ప్రవక్తలకన్న
జ్ఞానముగలది. సకల పునీతులకన్న ధైర్యముగలది. కనుక, మరియ అమలోద్భవం
క్రీస్తు రక్షణ ఫలితం. తద్వారా, మన రక్షణ ఫలితాన్ని ఆమె ముందుగానే సూచించింది.
మరియకుముందు
దేవుడు ఒక్కడే పాపరహితుడు. దేవుడే స్వయముగా మరియనుగూర్చిన ప్రవచనాన్ని
ప్రవచించాడు. ఆ.కాం. 3:15 – “నీకు, స్త్రీకి, నీ సంతతికి,
స్త్రీ సంతతికి తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితక
గొట్టుదురు. నీవేమో వారి మడమలు కరచెదవు”. మరియద్వారా,
ఆమె సంతతిద్వారా, సాతాను పొందబోవు ఓటమిని
దేవుడు ముందుగానే ప్రవచించాడు. మరియ జన్మించకపూర్వమే, ఆమె
దేవుని ఆలోచనలో, ప్రణాళికలో ఉన్నది. మరియద్వారా, దేవుడు మనకోసం మన రక్షణకోసం భువికి ఏతెంచాడు.
మరియ మరణానంతరం, తనతో కలకాలం ఉండుటకు, దేవుడు ఆమెను ఆత్మశరీరములతో తన చెంతకు చేర్చుకున్నాడు [మోక్షారోపితమాతా]. శరీర ఉత్థానమును, పరలోక మహిమను పొందియున్నది. “అంతట దివియందు ఒక గొప్ప
సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు. చంద్రుడు
ఆమె పాదములక్రింద ఉండెను. ఆమె శిరముపై పండ్రెండు నక్షత్రములుగల కిరీటము ఉండెను” (దర్శన 12:1). “నూతన వాగ్దత్త మందసమైన” మరియతల్లిని
పరలోక యెరూషలేమగు దేవాలయములోనికి దేవుడు [క్రీస్తు] కొనివచ్చెను. కనుక, కుమారుడైన క్రీస్తు దరిచేరుటకు, మనం మరియ తల్లిని తప్పకుండా
గౌరవించాలి.
4. మరియ నిత్యకన్యక: “పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది”
(మ 1:18). దూత మరియమ్మతో ఇట్లనెను, “పవిత్రాత్మ
నీపై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు ‘దేవుని కుమారుడు’ అని పిలువబడును” (లూ 1:35). మరియ కన్యకగనే యేసునకు జన్మనిచ్చినది. మరియ
నిత్యకన్యకమాత - కన్యక మరియు మాతృమూర్తి. పునీత థామస్ అక్వినాస్ గారు ఇలా వివరించారు:
ఆత్మస్వరూపియైన దేవుడు శరీరధారియై ఈ లోకములో జన్మించాడు. ఆయన శరీరధారియై ఈలోకానికి
రావడానికి ఒక స్త్రీద్వారా జన్మించాడు. అలాగే, తన దైవత్వాన్ని
స్పష్టపరచుటకు, ఆయన ఒక కన్యకనుండి జన్మించాడు. ఆ స్త్రీమూర్తి,
కన్యాకమని మన మరియతల్లి. ఆమె “కన్యమరియతల్లి”. కనుక, యేసును విశ్వసించాలంటే, మరియ కన్యత్వమును విశ్వసించాల్సిందే! కన్యత్వము ఆమెలోని స్వభావము మాత్రమే కాదు.
లేకపోతే ఆమెగురించిన వివరణ కాదు. కన్యత్వము ఆమెలో భాగము. అది ఆమెకు ఒక పేరులాగా మారిపోయింది.
సృష్టిలోనే ఒకేఒక కన్యక మరియ తల్లి.
మరియ తన కన్యత్వాన్ని
యేసునకు జన్మనిచ్చిన తరువాత కూడా కాపాడుకున్నది, అందుకే ఆమె నిత్యకన్యక. యోసేపుతో వివాహము అయినప్పటికిని,
వారిరురువు కాపురము చేయలేదు. అందుకే ఆమె నిత్యకన్యత్వము చెడని మాతగా
కొనియాడబడుచున్నది.
5. మరియ: శక్తిగల ప్రార్ధనా మధ్యవర్తి: “కుమారా! వారికి ద్రాక్షారసము లేదు” (యో 2:3) అని చెప్పగానే వెంటనే ప్రభువు అద్భుతాన్ని చేసాడు. మరియతల్లి ఏది అడిగినను,
కుమారుడు యేసు కాదనడు. అలాగే, మరియతల్లి,
ఇతరులకు సహాయం చేయడం ఎన్నటికీ మానదు. మన అవసరాలన్నింటినీ తన
కుమారుని ముందు ఉంచుతుంది. యేసు తీర్పరి, న్యాయమూర్తి అయితే,
మరియ న్యాయవాది. మనకోసం, మన అవసరాలకోసం ప్రభువును
అభ్యర్థిస్తుంది, వేడుకొంటుంది, మనవిచేస్తుంది,
ప్రార్ధిస్తుంది. అయితే, మరియతల్లి
చెప్పినట్లుగా, మనం “ప్రభువు
చెప్పినట్లు చేయాలి” (యో 2:5).
“స్త్రీ!
అది నాకేమి? నీకేమి? నా గడియ ఇంకను
రాలేదు” (యో 2:4) అని మొదటగా ప్రభువు
చెప్పినను, “తన గడియను”, “శాశ్వతముగా ముందుగానే నిర్ణయింపబడిన తన సమయాన్ని”, “తండ్రి
దేవునిచే నిర్ణయింపబడిన కాలాన్ని”, “మహిమపరపబడు కాలాన్ని”కూడా, తన అమ్మ కోరిక మేరకు మార్చాడు. అమ్మ అడిగిందని, వెంటనే తన మొదటి అద్భుతాన్ని ప్రదర్శించాడు.
దేవుడైనప్పటికిని, ప్రియమైన మరియతల్లికి విధేయుడైనాడు.
దేవునితో
మరెవ్వరికీలేని సన్నిహిత సంబంధాన్ని మరియతల్లి కలిగియున్నది. కుమారునిపై తల్లికి
అంతటి నమ్మకం, విశ్వాసం!
ఇక్కడ మరియ ప్రార్ధన సహాయినిగా కనిపిస్తుంది. ఆపదలోనున్న వారికి, క్రీస్తు సహాయముతో ఆదుకునే తల్లిగా మనకి కనిపిస్తుంది. మరియ మధ్యస్థ
ప్రార్ధనద్వారా యేసు “శ్రేష్టమైన”
ద్రాక్షారసమును (యో 2:10) చేసారు. అనగా, మరియతల్లిద్వారా వేడుకుంటే, “పరిపూర్ణమైన” వరాలను పరిపూర్ణముగా పొందుతాము. కాబట్టి, మరియతల్లివలె
సుతుడు క్రీస్తుపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచుదాం! మరియతల్లివలె
ఇతరుల ఆపదలను కనిపెట్టి, శ్రేష్టమైన వాటికొరకు క్రీస్తుకు
ప్రార్ధన చేద్దాం!
6. మరియలోని
మూడు ప్రధాన సద్గుణాలు:
ఒకటి వినయము. క్రైస్తవులముగా, మనమందరము తప్పక వినయము అనే సద్గుణము కలిగియుండాలి. వినయము, సౌమ్యము కలిగి యున్నప్పుడే, మనం క్రీస్తును
స్వీకరించగలము. “సాధు శీలుడనని, వినమ్ర
హృదయుడనని మీరు నానుండి నేర్చుకొనుడు” (మ 11:29) అని ప్రభువే స్వయముగా చెప్పియున్నారు. “వినయము,
దైవభీతి కలవాడు సంపదలు, గౌరవము, దీర్గాయువు పొందును” (సామె 22:4). మరియతల్లి స్వయముగా తాను “ప్రభువు దాసురాలుగా” గుర్తించింది (లూ 1:38). తద్వారా, గర్వము, స్వార్ధము వీడాలని మరియతల్లి నేడు మనందరికీ
తెలియజేయుచున్నది. దేవునికితల్లి అయినప్పటికిని, వినయముతో
జీవించినది. భక్తిపూర్వకముగా, ప్రభవునకు సేవలు చేసినది. మన
జీవితములో మనకన్నా, ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వాలని మరియతల్లి
వినయము నేర్పుచున్నది. వినయముగా ఉన్నప్పుడే, మనలో
స్వార్ధాన్ని వీడగలం. అప్పుడే, దేవుని మార్గాలను, దేవుని చిత్తాన్ని తెలుసుకోగలం మరియు పాటించగలం. “దేవుడు
అహంకారులను ఎదిరించును. వినమ్రులకు కృపను అనుగ్రహించును”
(యాకోబు 4:6).
రెండవ సద్గుణము నిరాడంబరత.
మరియతల్లి చాలా నిరాడంబరముగా జీవించినది. “దేవుని అనుగ్రహ పరిపూర్ణురాలు” ఐనను, “స్త్రీలందిరిలో ఆశీర్వదింపబడినది”
ఐనను, “ఆమె గర్భము ఆశీర్వదింపబడినది” ఐనను, “ప్రభువు తల్లి” ఐనను, తనకు ఒసగబడిన
దానిని వినయముతో అంగీకరించి నిరాడంబరముగా జీవించినది. నిరాడంబరంగా జీవించినప్పుడు,
ఎక్కువగా దేవునిలో నమ్మకాన్ని కలిగి యుంటాము. అలాగే, నిరాడంబరంగా జీవించినప్పుడు, అవసరతలోనున్న వారికి,
చేరువ కాగలము. ఎందుకన, వారి పరిస్థితిని
సులువుగా మనం అర్ధంచేసుకోగలము.
మూడవ సుగుణం దాతృత్వము.
మరియతల్లి చేసిన ప్రతీవిషయములో తన దాతృత్వాన్ని, సేవాగుణాన్ని చాటుకుంది. ఎలిజబెతమ్మ గర్భవతియని తెలిసిన
వెంటనే, ఆమెకు సహాయము చేయడానికి త్వరితముగా ప్రయాణమై
వెళ్ళినది (లూ 1:39). ఒక తల్లిగా దాతృత్వము, ఉదారస్వభావము కలిగి జీవించినది. “పుచ్చుకొనుటకంటే,
ఇచ్చుట ధన్యము” (అ.కా. 20:25) అని పౌలుగారు చెప్పియున్నారు.
7. మరియ
మన ఆదర్శమూర్తి:
అచంచల విశ్వాసము కలిగియుండుటలోను, దేవునిపై నమ్మకం ఉంచడములో మరియతల్లి మనందరికీ ఆదర్శం.
తల్లులందరికీ కూడా
మరియతల్లి గొప్ప ఆదర్శమూర్తి. మన అమ్మలు చాలా గొప్ప వారు,
ఎందుకన, మనకు జన్మనిచ్చియున్నారు. వారి
జీవితాన్ని మనకోసం జీవించారు. మనలను మానవమూర్తులుగా తీర్చిదిద్దుటకు వారి
జీవితాన్ని త్యాగం చేసియున్నారు. మన జీవితాన్ని అర్ధవంతముగా జీవించడం మనకు
నేర్పించారు. అమ్మలందరిలో మరియతల్లి చాలా గొప్పది. ఎందుకంటే, ఆమె దేవునికేతల్లి. అందుకే, “స్త్రీలందరిలో
ఆశీర్వదింప బడినది”గా కొనియాడబడినది (లూ 1:42). క్రైస్తవ తల్లులందరికీ మరియతల్లి ఆదర్శమూర్తి, ప్రేరణ.
ఎందుకన, ఒక తల్లిగా, ఆమె
ప్రేమగలది, కరుణగలది. దేవుని వాక్యముపట్ల ఎంతోశ్రద్ధను
చూపింది. దేవుని చిత్తాన్ని ఎల్లప్పుడూ విధేయించినది. ప్రతీ క్రైస్తవతల్లి,
పూర్ణహృదయముతో దేవున్ని ప్రేమించాలి. దేవునిపిలుపుకు మరియతల్లివలె
స్పందించాలి. మాతృత్వం అనేది దేవుని గొప్పవరము. పిల్లలు దేవుని వరాలు. తల్లులు
పిల్లల బాగోగులు చూసుకుంటారు. వారిని ఆధ్యాత్మిక పథములోనికి నడిపిస్తారు.
అపాయములనుండి కాపాడుతారు. పిల్లలకోసం అనేక బాధలను, శ్రమలను
అనుభవిస్తారు. తల్లులు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. తల్లులు దేవుని స్తుతిస్తారు.
కనుక, మరియతల్లివలె, మనం దేవుని చిత్తానికి కట్టుబడి ఉండాలి.
దేవుని వాక్కును చదివి, ధ్యానించాలి.
8. మరియతల్లి
పట్ల మన భక్తిని ఎలా చాటగలం?
- మరియతల్లి పటాన్నిగాని, స్వరూపాన్నిగాని, మన గృహాలలో పెట్టుకోవడం.
- మరియతల్లికి సంబంధించిన బైబులు
భాగాలను చదివి ధ్యానించడం.
- జపమాలను జపించడం: శోధనలను
జయించడానికి, కాస్త నెమ్మదించి, ప్రశాంతతకొరకు,
యేసుక్రీస్తుతో అనుసంధానించబడిన జీవితాన్ని జీవించుటకు, మరియతల్లియొక్క ప్రేమగల సంరక్షణలో ఉండుటకు, ఇతరుల
కొరకు ప్రార్ధన చేయడానికి, ప్రపంచములో శాంతిని నెలకొల్పుటకు,
ప్రార్ధన చేయడం ఎలాగో తెలియనప్పుడు, మనం జపమాలను జపించాలి.
- మరియతల్లి తేరు లేదా ఊరేగింపులో
పాల్గొనడం (మరియతల్లి ప్రార్ధనలు చేయడం, పాటలు పాడటం).
- దివ్యసంస్కారాలను, ముఖ్యముగా పాపసంకీర్తనము చేయడం,
దివ్యసత్ప్రసాదమును స్వీకరించడం.
- దయగల కార్యములను చేయుట: పేదవారికి సహాయం చేయడం, రోగులను పరామర్శించడం,
ఆపదలోనున్నవారిని ఆదుకోవడం...
- సువార్త ప్రకటన చేయడం
గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.
మేరిమాత కపూచిన్ ప్రావిన్స్
ఆంధ్ర-తెలంగాణ-ఒడిషా
No comments:
Post a Comment