దివ్యసంస్కారాలు

దివ్యసంస్కారాలు
బైబులు ఆధారితము
దివ్యసంస్కారము అనగా “దేవ వరప్రసాదములను ఇచ్చుటకు యేసునాధుడు స్థాపించిన సాధనము”. దేవవరప్రసాదము అనగా “మోక్షము పొందుటకు సర్వేశ్వరుడు మనకు ఉచితముగా దయచేయు దైవవరమే దేవవరప్రసాదము”. సంస్కారం ఆటే ఏమిటో ఒక్కమాటలో చెప్పాలంటే, “అంతరంగిక దైవానుగ్రహాన్ని సూచించే బహిరంగ చిహ్నం”. శ్రీసభ ఇచ్చే నిర్వచనం – “పవిత్రీకరణ దైవవరప్రసాదాన్ని సూచించి, దాన్ని ఉత్పత్తి చేయు జ్ఞానేంద్రియాలతో గ్రహింపగల ఒక సంకేతం”. ఇవి “శ్రీసభ జీవజాలాలు, దేవుని క్రుపావర సెలయేళ్ళు”.

అక్వినా తోమాసు గారు ఇలా అన్నారు: “సంస్కారం అంటే గతములో యేసు సాధించి పెట్టిన రక్షణ సంస్మరణం, వర్తమానములో సిద్ధిస్తున్న వరాల సాక్ష్యం, భవిష్యత్తులో బహుకరించనున్న నిత్యజీవ వాగ్దానం”.

కతోలిక శ్రీసభ సత్యోపదేశం నం. 1116 ప్రకారం, సంస్కారాలు క్రీస్తు దేహము నుండి వెలువడే శక్తులు’. (లూకా 5:17; 6:19; 8:46). అవి ఎల్లప్పుడూ జీవిస్తాయి, జీవాన్ని అందిస్తాయి. క్రీస్తు శరీరమైన శ్రీసభలో పనిచేసే పవిత్రాత్మ చర్యలు. నూతన శాశ్వత ఒప్పందములో అవి దేవుని ప్రతిభా కృతులు (the masterworks of God).

దివ్యసంస్కారము అనగా క్రీస్తుచే స్థాపించబడిన బాహ్యపరమైన లేదా గ్రహించదగిన చిహ్నము. ఇది దైవీక జీవితాన్ని, దేవునితో సన్నిహిత స్నేహాన్ని ప్రసరించుటకు సమర్ధవంతమైన సాధనం. “చావు పుట్టుకల మధ్య వచ్చు వివిధ దశల్లో ఆవశ్యకమగు ఆధ్యాత్మిక వరాలను అనుగ్రహించుటకు యేసు ప్రభువు సంస్కారాలను స్థాపించాడు”. “శ్రీసభ ఆరాధనా జీవితమంతా దివ్యప్రసాద సంస్కారం కేంద్రముగా గల ఏడు సంస్కారాల చుట్టూ పరిభ్రమిస్తుంది (SC పవిత్ర దైవార్చనా చట్టం 6)

ఈవిధముగా, ఒక దివ్యసంస్కారాన్ని కొనియాడుటకు ఖచ్చితముగా అత్యవసరమైన మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి: (1). క్రీస్తుచేత స్థాపించ బడటం (2). బాహ్యపరమైన లేదా గ్రహించదగిన చిహ్నం (3). దైవీక జీవితాన్ని, దేవునితో సన్నిహిత స్నేహాన్ని సమర్ధవంతముగా క్రీస్తు తన శ్రీసభలో  ప్రసరించుటకు సమర్ధవంతమైన సాధనముగా ఉండటం.

(1). మనకొరకు స్వయముగా క్రీస్తే దేవుని సంస్కారము. ఆయనే ‘ఆదిమమైన సంస్కారము’ (Primordial Sacrament). తన పవిత్ర మానవత్వం, తన మనుష్యావతారము వలన, దేవుడు మన జీవితాలను తట్టియున్నాడు. అదృష్యుడైన దేవుడు క్రీస్తుద్వారా మనందరికీ ప్రత్యక్షమయ్యాడు.
(2). ఉత్తానమైన క్రీస్తు తన ప్రేషితకార్యమును నేటికీ శ్రీసభద్వారా కొనసాగిస్తున్నారు. శ్రీసభ భాహ్యముగా కనిపించెడు ఉత్థాన క్రీస్తు సంఘము. అందుకే, శ్రీసభ ప్రాధమిక సంస్కారము (Basic Sacrament). ఉత్థాన క్రీస్తు దైవప్రజల అర్చనలో ప్రత్యక్షమవును. క్రీస్తు శరీరముగా, మన అనుదిన నిర్దిష్ట పరిస్థితులద్వారా, క్రీస్తు సాన్నిధ్యమును ఈ లోకములో కొనసాగిస్తున్నాము. ఇది మన సంస్కారాల జీవితానికి ఆధారం.
(3). ప్రతీ దివ్యసంస్కారమును కొనియాడుటలో దివ్యసంస్కారానుభూతిని మనం పొందాలి. దానికై ‘శ్రీసభ అర్చన - నిర్వహణా విధానము’ ఉంటుంది. ఈ ‘నిర్వహణా విధానము’ను విశ్వాసముతోను, నిబద్ధతతోను కొనియాడాలి. లేనిచో అది కేవలం ఒక మతాచారముగానే మిగిలి పోతుంది.
(4). యేసుక్రీస్తు, శ్రీసభ, దివ్యసంస్కారాలు అను త్రయం ఇమిడి యున్నాయి. ఈ త్రయాన్ని విడదీయలేము.
(5). అలాగే విశ్వాసం, దివ్యసంస్కారం, శ్రీసభ అను త్రయం కూడా యున్నది. అవి ఒకదానితో ఒకటి ముడిపడి యున్నవి (అ.కా. 2:37-38; 8:12-13, 34-38; 9:4-6, 17-18; 10:44-48; 16:14-15; 18:8; 22:12-16; మత్త 28:18-20). అందుకే శ్రీసభ పితరులు “విశ్వాసపు సంస్కారాలు” అని పిలవడానికి ఇష్టపడ్డారు. ఎందుకన, విశ్వాసం దివ్యసంస్కారాలకు నడిపించును; దివ్యసంస్కారాలు విశ్వాసమును పోషించును (కతోలిక శ్రీసభ సత్యోపదేశం 1122-1124; SC పవిత్ర దైవార్చనా చట్టం 59
(6). ప్రతీ దివ్యసంస్కారమును కొనియాడుట, ఉత్థానక్రీస్తు సాన్నిధ్యమును మనకు ప్రత్యక్షం చేస్తుంది. అయితే, క్రీస్తు సాన్నిధ్యాన్ని నేనెప్పుడైతే గ్రహిస్తానో, అప్పుడే క్రీస్తు సాన్నిధ్యం ఫలభారిత మవుతుంది. వేరే మాటలలో చెప్పాలంటే, ప్రభువు సన్నిధి నాకు అందుబాటులో నున్నది కాని, ప్రభువు సన్నిధిలో నేను కొలువై యుండక పోవచ్చు!
(7). ప్రతీ దివ్యసంస్కారములో ఉత్థానక్రీస్తు తననుతాను నాకు సమర్పణ గావించుకొనుచున్నారనే వాస్తవాన్ని నేను అంగీకరించాలి. కనుక, నిజమైన ఉనికి పరస్పరము ఇచ్చుకోవడాన్ని, అంగీకరించు కోవడాన్ని సూచిస్తుంది. ఫలితముగా, ఇది వేడుకలకు దారితీస్తుంది.
 దివ్యసంస్కారాలు – బైబులు ఆధారిత ఆవిర్భావం
బైబులులో క్రీస్తు తన శిష్యులకు దివ్యసంస్కారాలను ఎలా నిర్వహించాలో, ఎలా స్వీకరించాలో స్పష్టమైన సూచనలను చేసాడు. ఆయన చేసిన కార్యాలలో, జబ్బుపడిన వారిని స్వస్థపరచడములో, ఉపమానాలలో, ఆత్మల రక్షణ నిమిత్తమై తన శరీరరక్తాలను ఇవ్వడములో, పాపులను క్షమించుటలో ఇది మనకు కనిపిస్తుంది. దేవున్ని ఆరాధించుటకు, రక్షణ పొందుటకు దివ్యసంస్కారాలు నిర్దేషించ బడ్డాయి.

‘సంస్కారం’ అను పదం గ్రీకు పదమైన ‘మిస్తేరియన్’ అన్న పదములో వేళ్ళూని ఉంది. దీనిని రెండు పదాలుగా అనువాదం చేయాల్సి వచ్చింది: ఒకరి మిస్తేరిఉం = సంస్కార పరమార్ధములోని అంతరంగిక దైవానుగ్రహాన్ని ప్రతిధ్వనిస్తుంది. రెండు సాక్రమెంతుం = జ్ఞానేంద్రియాలతో గ్రహింపగల చిహ్నాన్ని ప్రతిధ్వనిస్తుంది. మిస్తేరియం అనుపదం గ్రీకు మతకర్మల్లో, ప్లేటో తత్వశాస్త్రములో కన్పిస్తుంది. అయితే, బైబులులో కూడా ఈ పదం కనిపిస్తుంది. కాని దాని భావం చాల విసృతార్ధముతో నిండుకొని యున్నది – జ్ఞాన 6:22; దాని 2:28, 47, మత్త 13:11; లూకా 8:10; 1కొరి 2:7-10, రోమీ 16:25-26; కొలస్సీ 1:26-27; 4:3; ఎఫెసీ 1:9-10; 3:3-12; 5:32.

అయితే 12వ శతాబ్దం వరకు దాని (‘సంస్కారం’) నికరమైన అర్ధాన్ని గూర్చి పెద్దగా పట్టించుకోలేదు. మొదటిసారిగా లాబర్ట్ పీటర్ సంస్కారము యొక్క విశిష్టతను నిర్దుష్టముగా వివరించాడు. ఆదినుండి క్రైస్తవులు “ఆత్మకు అద్వితీయ వరప్రసాదాలను కలిగియుండె కనిపించే చిహ్నాలు సంస్కారాలు” అని, వాటినే యేసే స్థాపించాడని నమ్మారు. ఆ భావాన్ని లాబర్ట్ పీటర్ గారు, “పవిత్రీకరించు వరప్రసాద కార్యకారణ సంబంధప్రేరణం” అని చక్కగా వ్యక్తం చేసాడు. ఈవిధముగా 12వ శతాబ్దంలో క్రమబద్ధమైన వేదాంతముగా సప్త దివ్యసంస్కారాలు రూపొందాయి.

 1. జ్ఞానస్నానము
జ్ఞానస్నానము అన్ని సంస్కారాలకు మూలం. మొదటిది, ప్రధానమైనది. క్రైస్తవ జీవితానికి పునాది. ఆత్మైక జీవనానికి ఆరంభం. క్రీస్తుతోను, శ్రీసభతోను ఐఖ్యమయ్యే మొట్టమొదటి దివ్యసంస్కారము. జ్ఞానస్నానము స్వీకరించకుండా ఏ ఇతర దివ్యసంస్కారాలను మనము పొందలేము (సత్యోపదేశం, 1213). కనుక, ఇతర సంస్కారాలను స్వీకరించేందుకు ముఖద్వారం, దివ్యమార్గం.
సాధారణముగా, ఒక గురువు (లేదా దీకను) జ్ఞానస్నానమును ఇస్తారు. జ్ఞానస్నాన అభ్యర్ధి తలమీద నీళ్ళు పోయుచు పేరు చెప్పి, “పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున నేను నీకు జ్ఞానస్నానమును  ఇచ్చుచున్నాను” అని చెప్పెదరు. నీరు, వాక్కుద్వారా జన్మపాపమును, ఇతర పాపములను పోగొట్టి సర్వేశ్వరునికి, తిరుసభకు బిడ్డలుగా చేయును. ‘బప్తిస్మం’ అనే పదం ‘బాప్తేజియన్’ అనే గ్రీకు పదం నుండి వచ్చినది. దీని అర్ధం ‘ముంచడం’ లేదా ‘కడగడం’. ఇది మన ఆత్మను కడిగి, డాన్ని పాపమాలిన్యం నుండి శుద్ధిచేస్తుంది.
జ్ఞానస్నాన దివ్యసంస్కారము యేసుక్రీస్తుచేత స్థాపించబడినది. ప్రభువు దీనిని సరికొత్త ఆచారముగా స్థాపించలేదు. ఉన్న ఆచారాన్నే (బప్తిస్మ యోహాను జ్ఞానస్నానం ఇచ్చేవాడు) తీసుకొని దానికి ప్రత్యేక వరప్రసాదాన్ని జోడించాడు. స్నాపక యోహాను ద్వారా బప్తిస్మం పొందినపుడు, క్రీస్తుని పరిశుద్ధ శరీరము నీటిని తాకుట మూలముగా పాపములను పోగొట్టు శక్తిని ఆ నీటికిచ్చి, బప్తిస్మం అను దివ్యసంస్కారాన్ని స్థాపించారు.
దీనిని తను జ్ఞానస్నానము పొందుటలోను (మత్త 3:13-17), మోక్షరోహణమున శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞద్వారా సూచించ బడినది:
మార్కు 1:9-11 – “ఆ రోజులలో గలిలీయ సీమలోని నజరేతునుండి యేసు వచ్చి, యోర్దాను నదిలో యోహానుచేత బప్తిస్మము పొందెను. ఆయన నీటినుండి వెలుపలికి వచ్చిన వెంటనే పరమండలము తెరువ బడుట, పవిత్రాత్మ పావురము రూపమున తనపై దిగివచ్చుట చూచెను. అప్పుడు పరలోకమునుండి ఒక వాణి ‘నీవు నా ప్రియమైన కుమారుడవు. నిన్నుగూర్చి నేను ఆనందించుచున్నాను’ అని వినిపించెను”. యేసు పొందిన ఈ జ్ఞానస్నానం, తాను స్థాపించబోయే దివ్యసంస్కారాన్ని సూచిస్తుంది.
అటుపిమ్మట యేసు కూడా జ్ఞానస్నాన మిచ్చినట్లు యో 3:22లో చూస్తున్నాము (చదువుము).
మత్త 28:19 – యేసు తన అంతిమ సందేశములో తన శిష్యులతో, “మీరు వెళ్లి, సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మొసగుచు, వారిని నా శిష్యులను చేయుడు” అని ఆజ్ఞాపించాడు.
ఈవిధముగా, క్రీస్తు మొక్షారోహణం అగుటకు ముందు తన అపోస్తలులకు, వారి తర్వాత వచ్చు వారికిని ఈ అధికారం ఇచ్చారు.
శిష్యులు ఈ ఆజ్ఞను పెంతకోస్తు రోజుననే విధేయించారు. పేతురు సందేశమును వినిన తరువాత ప్రజలు తీవ్రమైన ఆవేదనతో, “మేము ఏమి చేయవలయును?” అని ప్రశ్నించినపుడు, పేతురు, “మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున, బప్తిస్మము పొందవలయును” (అ.కా.2:38; (9:18; 10:48)) అని చెప్పాడు. ఆరోజు రమారమి మూడువేల మంది జ్ఞానస్నానమును పొందిరి (అ.కా.2:41). శిష్యులు జ్ఞానస్నానమిచ్చి సంఘములోనికి చేర్చుకొనిరి. ఏడుగురు దీకనులలో ఒకడైన ఫిలిప్పు నపుంసకుడగు ఇతియోపియా నివాసికి, యేసును గురించి బోధించిన తరువాత మార్గమధ్యలో నీటి మడుగులో అతనికి జ్ఞానస్నానమును ఇచ్చెను (అ.కా.8:26-40).
జ్ఞానస్నానముద్వారా, మనము దేవుని బిడ్డలమైనాము, బిడ్డలము కనుక వారసులమైనాము (రోమీ 8:15-17; గల 4:4-6). జ్ఞానస్నానముద్వారా, మనము క్రీస్తుతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి (రోమీ 6:4; ఎఫెసీ 2:6; కొలొ 3:1; 2 తిమో 2:11).
జ్ఞానస్నానముద్వారా, “క్రీస్తు సభ్యులమయ్యాం. శ్రీసభలో చేర్చబడినాము. శ్రీసభ ప్రేషిత కార్యములో భాగస్తులమయ్యాం” (సత్యోపదేశం, 1213). జ్ఞానస్నానముద్వారా, “మనం క్రీస్తు రూపురేఖలను పొందుతున్నాం” (LG లోకానికి వెలుగు శ్రీసభ, 7). “మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బప్తిస్మము పొందితిమి” (1 కొరి 12:13). “జ్ఞానస్నానం ఆచరించిన విశ్వాసులు, తాము పొందిన ‘నవజీవం’ వలనను, పవిత్రాత్మ ప్రభు అభిషేకం వలనను, పావనమైన ఆధ్యాత్మిక మందిరముగా రూపాంతరం చెందుతున్నారు, పవిత్రులైన యాజకులుగా మారుతున్నారు” (LG లోకానికి వెలుగు శ్రీసభ, 10).
దేవుని బిడ్డలుగా శాశ్వత పరమానందము లోనికి (పరలోకం) ఖచ్చితముగా ప్రవేశించే మార్గం జ్ఞానస్నానం తప్ప మరొక మార్గం శ్రీసభకు తెలియదు. రక్షణకు జ్ఞానస్నానం అవసరమని ప్రభువే స్పష్టం చేసియున్నారు: “ఒకడు నీటి వలన, ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” (యో 3:5). రక్షణకు జ్ఞానస్నానం ఎందుకు అవసరము? ఎందుకంటే, ఇది స్వయముగా క్రీస్తు బోధ (యో 3:5; మార్కు 16:16). శిష్యులకు ఆజ్ఞాపించాడు (మత్త 28:19). క్రీస్తు కాలమునుండియే శ్రీసభయొక్క స్పష్టమైన బోధ. అలాగే, కేవలం జ్ఞానస్నాన దివ్యసంస్కారం మాత్రమే జన్మపాపమును తొలగించ గలదు (cf. సత్యోపదేశం, 1257).
జ్ఞానస్నానముద్వారా, శ్రీసభలో సభ్యులుగా చేరే విశ్వాసులు, తమ బాప్తిస్మ ధర్మం ప్రకారం క్రైస్తవ మతారాధనలలో అర్చనాకాండలో పాల్గొన బద్ధులై ఉంటారు. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పునర్జన్మించిన విశ్వాసులు, శ్రీసభద్వారా దేవుడు తమకు ప్రసాదించిన విశ్వాస వరాన్ని మానవుల ఎదుట తమ ఆదర్శ జీవనంద్వారా సజీవముగా ప్రదర్శించాలి, స్పష్టముగా ప్రకటించాలి.
జ్ఞానస్నానం యొక్క ప్రభావాలు:
(1). మొదటిగా యేసుక్రీస్తుతో సజీవ సంబంధాన్ని ఏర్పరస్తుంది (cf. 1 పేతు 2:4-5). మనం పాపమునకు మరణించి, క్రీస్తుతో నూతన జీవములోనికి ఎత్తబడు చున్నాము. పాపాంధకారము క్రీస్తువెలుగుతో భర్తీచేయ బడినది. ఇది త్రిత్వైక దేవునితో సాంగత్యమును కలుగజేస్తుంది. మనం దేవుని బిడ్డలము అవుచున్నాము. ఈవిధముగా, జ్ఞానస్నానముద్వారా మనం పునర్జన్మించిన వారమవుతున్నాము. (2) రెండవదిగా, జ్ఞానస్నానముద్వారా, శ్రీసభ సభ్యులవుతున్నాము. శ్రీసభ చట్టాలకు లోబడి ఉంటాము. ఇతర దివ్యసంస్కారాలను స్వీకరించుటకు అర్హులమవుతున్నాము. విశ్వాసమును ప్రకటించుటకు క్రీస్తు శిష్యులుగా జీవించాల్సిన బాధ్యతను పొందుచున్నాము. (3). జ్ఞానస్నానం క్రైస్తవునిపై చెరగని ఆధ్యాత్మిక ముద్రను వేస్తుంది. క్రీస్తుకు చెందిన వాడని దీని భావం. అనగా మనం క్రైస్తవులమని ధృవీకరిస్తుంది. ఏ పాపముకూడా ఈ ముద్రను చెరిపివేయలేదు (cf. రోమీ 8:29). అందుకే, ఒకసారి తీసుకున్న జ్ఞానస్నానాన్ని మరల తీసికోకూడదు (సత్యోపదేశం, 1272). ఎందుకన, “క్రీస్తులోనికి జ్ఞానస్నానము పొందిన మీరందరు క్రీస్తును ధరించి యున్నారు” (గలతీ 3:27).
జ్ఞానస్నానములో ఉపయోగించే బాహ్యసూచకాలు: నీరు, క్రిస్మాతైలం, తెలుపువస్త్రం, వెలుగుచున్న క్రొవ్వొత్తి, ఎఫెతా సాగ్యం.

2. భద్రమైన అభ్యంగము (ధృవీకరణం)
జ్ఞానస్నాన కృపావరాన్ని భద్రమైన అభ్యంగము పరిపూర్తి చేస్తుంది (సత్యోపదేశం, 1288). భద్రమైన అభ్యంగముతో ఇంకా ఎక్కువగా శ్రీసభతో బంధాన్ని పెంచుకుంటారు. పవిత్రాత్మ ప్రత్యేక శక్తితో సంపూర్ణులవుతారు (సత్యోపదేశం, 1285). జ్ఞానస్నానం తీసుకున్న వ్యక్తి భద్రమైన అభ్యంగమునకు అర్హుడు (సత్యోపదేశం, 1306). జ్ఞానస్నానంద్వారా సంక్రమించిన యాజకత్వాన్ని [జ్ఞానస్నానం వలన క్రీస్తు యాజకత్వములోనూ, ప్రబోధములోనూ, రాజరిక ప్రేషిత కార్యములో పాల్గొంటారు, సత్యోపదేశం, 1268] ఈ “అక్షయ ముద్ర” సంపూర్ణం చేస్తుంది. భద్రమైన అభ్యంగమును ఆచరించిన వ్యక్తి అధికారికముగా, బహిరంగముగా క్రీస్తులో తన విశ్వాసాన్ని ప్రకటించే శక్తిని అందుకుంటాడు (సత్యోపదేశం, 1305). దీనికొరకే, జ్ఞానస్నానం పొందిన వ్యక్తి, భద్రమైన అభ్యంగములో పవిత్రాత్మ వరములను పొందును.
ధృవీకరణ ద్వారా పవిత్రాత్మను పొంది, విశ్వాసములో ధృడపడి, క్రీస్తు సారూప్యాన్ని పొంది క్రీస్తుకు సాక్షుల మౌతాము. విశ్వాస యోధులుగా సత్యవేద ప్రచార బాధ్యతను స్వీకరిస్తాం. క్రైస్తవ జీవితములో, మనం విశ్వసించు సత్యాన్ని పూర్తిగా నమ్మి, అందుకు సాక్ష్యమిచ్చుటే గాక అవసరమైతే ప్రానాలిచ్చేందుకు కూడా సిద్ధం చేస్తుంది ఈ సంస్కారం.
భద్రమైన అభ్యంగము రక్షణకు అత్యవసరము కాకున్నను, ఆచరించుటలో నిర్లక్ష్యం చేయడం పాపమే! ఎందుకన ఇది పవిత్రాత్మ ఫలాలను, వరాలను ఒసగుతుంది.
పెంతకోస్తు (ఏబదియవ దినము, కోతకాల పండుగ) దినమున పవిత్రాత్మ రాకడ గూర్చి అ.కా. 2:1-4లో చదువుచున్నాము. క్రీస్తు తన శిష్యులకు పవిత్రాత్మ వరమును వాగ్దానం చేసాడు. తద్వారా వారు క్రీస్తు సందేశమును ధైర్యముగా ప్రకటించెదరు (లూకా 24:47-49; యో 14;16-17; 16:7,13).
పాతనిబందనలో పవిత్రాత్మ ప్రస్తావన: ఆ.కాం.1:2; 2:7; న్యాయాధి 3:10-11; 1 సమూ 10:6; 16:13; యిర్మీ 1:4-10.
నూతన నిబంధనలో, యేసు ప్రభువు పవిత్రాత్మ శక్తి చేతనే సువార్తను బోధించారని, అద్భుతాలు చేసారని సువార్తలలో చెప్పబడింది (లూకా 4:18; 11:20).
అపోస్తలులే స్వయముగా ఈ దివ్యసంస్కారాన్ని ఇచ్చారు (అ.కా 8:17; 19:6; హెబ్రీ 6:2). హస్తనిక్షేపణము పవిత్రాత్మ వరాలను ప్రసాదించును [అందుకే మేత్రానులు అభ్యర్ధిపై చేతులు చాపి పవిత్రాత్మ ప్రార్ధన చేయును].
భద్రమైన అభ్యంగము దైవీక జీవితాన్ని మనలో బలపరుస్తుంది. ప్రత్యేకమైన దివ్యసంస్కార కృపానుగ్రహాన్ని ఒసగుతుంది. మన ఆత్మపై ఎన్నటికి చెరగని  “అక్షయ ముద్ర”ను వేస్తుంది. క్రీస్తు క్రైస్తవున్ని తన ఆత్మతో ముద్రించి, గుర్తిస్తాడని ఈ అక్షయ ముద్ర సూచిస్తుంది.
పవిత్రాత్మను పొందిన వారే నిజమైన క్రైస్తవులు. ఎందుకంటే, ఆత్మ వలన నడిపించ బడినవారే ఆయన పుత్రులని పౌలు ప్రభోదించారు (రోమీ 8:14). చదువుము రోమీ 8:15; గలతీ 4:14-19; 1 కొరి 3:16; 6:19). సత్యమును బోధించుటలోను, న్యాయం కోసం పోరాడుట లోను పవిత్రాత్మ దేవుడు మనకు తోడుగా నిలుస్తున్నారు.
భద్రమైన అభ్యంగము యొక్క ప్రభావాలు:
(1). భద్రమైన అభ్యంగము ప్రత్యేకమైన కృపావరాన్ని ఒసగుతుంది, తద్వారా మన విశ్వాసం బలపడుతుంది. ఇతరుల ఆధ్యాత్మిక విషయాలపట్ల కూడా శ్రద్ధను వహిస్తాము. క్రీస్తు రక్షణ కార్యములో భాగస్థులమవుతాము. దైవరాజ్య వ్యాప్తిలో క్రీస్తు ప్రేషిత కార్యములో పాలుపంచు కుంటాము. క్రీస్తుకు సాక్షులుగా మారతాము (సత్యోపదేశం, 1303-1304). (2). భద్రమైన అభ్యంగము వలన క్రీస్తు అపోస్తలులకు వాగ్దానం చేసిన దానిని పొందుతాము: “పవిత్రాత్మ మీ పైకి వచ్చునప్పుడు, మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు ... భూదిగంతముల వరకు నాకు సాక్ష్యులై ఉండెదరు” (అ.కా.1:8). పవిత్రాత్మ ప్రసాదించే ప్రత్యేక వరప్రసాదాలతో వారు బలసంపన్ను లవుతారు. కనుక, క్రీస్తుకు సజీవ సాక్షులుగా, తమ భక్తివిశ్వాసాలను తమ మాటలద్వారాను చేతలద్వారాను చాటిచెప్పడం ధర్మముగా భావించాలి (LG లోకానికి వెలుగు శ్రీసభ, 11). (3). అక్షయ ముద్ర – ఆధ్యాత్మికమైన, చెరగని ముద్ర. మనం సంపూర్ణముగా క్రీస్తుకు చెందినవారమని సూచిస్తుంది. భద్రమైన అభ్యంగము ఆచరించిన వారు శ్రమలనుభవించుటకు సిద్దముగా ఉంటారు (చదువుము: మత్త 10:19-20). అక్షయ ముద్ర వలన భద్రమైన అభ్యంగమును ఒకసారి మాత్రమే స్వీకరించాలి.
ధృవీకరణ ఫలాలు: (1). పవిత్రాత్మ జ్ఞానవరాలు: జ్ఞానము, బుద్ధి, విమర్శ, ధృడము, తెలివి, భక్తి, దైవభయం, (2). పవిత్రాత్మ అనుగ్రహాలు: సోదరప్రేమ, జ్ఞానసంతోషం, సమాధానం, ఓర్పు, దయ, మేలెరిగినతనం, తాళిమి, శాంతం, విశ్వాసం, మర్యాద, నిగ్రహం, విరక్తత్వం
 ధృవీకరణ – కర్మాచరణం: (1). ముందుకు వచ్చుట (2). విశ్వాస ప్రకటన (3). చేతులను చాచి ప్రార్ధించుట (4). క్రిస్మాతైలం పూయుట (5). చెంపపై కొట్టుట (6). చివరి ఆశీస్సులు

 3. దివ్యసత్ర్పసాదము
దివ్యసత్ప్రసాదము అన్ని సంస్కారాలకు కేంద్రం. దీనిని ‘సంస్కారాలకే సంస్కారం’ అని సంబోధిస్తారు. దివ్యసత్ప్రసాద దివ్యసంస్కారము ప్రవేశ దివ్యసంస్కారాలను పరిపూర్తి చేస్తుంది. క్రైస్తవ ప్రవేశాన్ని పరిపూర్తి చేస్తుంది (సత్యోపదేశం, 1322).
దివ్యసత్ప్రసాద దివ్యసంస్కారాన్ని యేసు ప్రభువు కడరాత్రి భోజన సమయములో స్థాపించాడు. పరిశుద్ధ దివ్యసత్ప్రసాదములో బెత్లెహేములో జన్మించి, కలువరిలో సిలువపై మరణించి, మూడవ రోజున ఉత్థానమైన క్రీస్తు కొలువై ఉంటాడు. ఇది దైవప్రేమకు, కరుణకు నిదర్శనం. ఇందులో క్రీస్తు ఆత్మ దైవత్వముతో పాటు, ఆయన శరీర రక్తాలు ఉంటాయి. కాబట్టి దివ్యసత్ప్రసాదములో సంపూర్ణ క్రీస్తు సత్యముగా, వాస్తముగా, స్వభావ సిద్ధముగా ఉన్నాడు (సత్యోపదేశం, 1374). దివ్యసత్ప్రసాదము క్రైస్తవ జీవనానికి ‘ఆరంభమూ అంతిమ గమ్యమూ (LG లోకానికి వెలుగు శ్రీసభ, 11).

దివ్యసత్ప్రసాదమును క్రీస్తు కడరా భోజన సమయములో స్థాపించాడు. “దివ్యబలి సంస్కారాన్ని సాక్షాత్తూ మన రక్షకుడైన క్రీస్తు ప్రభువే స్థాపించారు. ఆయన “అప్పగింప బడనున్న రాత్రి”, కడరా భోజన సదర్భములో, తన శరీర రక్తాలతో “దివ్యబలి”ని స్థాపించారు. సిలువపై తాను సమర్పించిన లోక రక్షణ బలిని తరతరాల వరకు, తాను మరల వచ్చువరకు కొనసాగించడానికి వీలుగా ప్రభువు ఈ దివ్యసంస్కారాన్ని నెలకొల్పారు” (SC పవిత్ర దైవార్చనా చట్టం, 47).
ఈ దివ్యసంస్కారాన్ని స్థాపించడానికి మూడు కారణాలు:
(1). మన ఆత్మకు దివ్యభోజనమై ఉండుటకు (యో 6:48, 56, 58). (2). మనతో వాసము చేయుటకు – “నేను మీ యందు ఉందును. మీరు నా యందు ఉండుడు” (యో 15:4). (3). తన మరణమును జ్ఞాపక పరచుకొనుటకు – “ఈ రొట్టెను భుజించునపుడెల్ల, ఈ పాత్రము నుండి పానము చేయునపుడెల్ల ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు” (1 కొరి 11:26). ఈ దివ్యసంస్కారాన్ని “కృతజ్ఞాతార్పణం” (Eucharist) అని పిలుస్తాము. ఎందుకన, ఇది దేవునికి కృతజ్ఞతలర్పించే చర్య (సత్యోపదేశం, 1328). యేసుక్రీస్తు దివ్యసత్ప్రసాదమును స్థాపించు సమయములో దేవునకు కృతజ్ఞతలను అర్పించాడు. దివ్యబలిపూజ ద్వారా దేవునకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము.
ఈ దివ్యసంస్కారము పరమ పవిత్ర సంస్కారముగా పిలువబడుచున్నది, ఎందుకన, ఇది స్వయముగా క్రీస్తునే మనకు ఒసగుచున్నది.
దివ్యబలిపూజలో స్వీకరించు దానిని మనం “దివ్యసత్ర్పసాధము” అని పిలుస్తాం. మరణావస్థలో ఒసగే దివ్యసత్ర్పసాధమును “స్వర్గ ప్రయాణ భోజనము” అని పిలుస్తున్నాము (సత్యోపదేశం, 1524).
క్రీస్తు ఈ దివ్యసంస్కారాన్ని ఎలా స్థాపించారు? (చదువుము మత్త 26:26-28). చివరిగా, “దీనిని నా జ్ఞాపకార్ధము చేయుడు” (లూకా 22:19; 1 కొరి 11:23-25) అని శిష్యులకు ఆజ్ఞాపించాడు.
క్రీస్తు ఎప్పుడైతే, “ఇది నా శరీరము” అని పలికాడో, రొట్టె [లేదా అప్పము] అంతయు కూడా (పదార్థము అంతయు) తన శరీరముగా మారినది. “ఇది నా రక్తము” అని పలికినప్పుడు, ద్రాక్షారస మంతయు (పదార్థము అంతయు) తన రక్తముగా మారినది.
ఈ దివ్యసంస్కారాన్ని స్థాపించక మునుపే ప్రభువు తన శరీరాన్ని భోజనముగా, తన రక్తాన్ని పానముగా వాగ్దానం చేసియున్నాడు (చదువుము యో 6:48-57).
కడరా భోజన సమయములో ప్రభువు పలికిన మాటలను అపోస్తలులు అర్ధం చేసుకున్నారు. అందుకే పౌలు ఇలా వ్రాసాడు: చదువుము 1 కొరి 10:16; 11:27.

కడరా భోజన సమయములో (పవిత్ర గురువారమున) ప్రభువు గురుత్వాన్నికూడా స్థాపించాడు. “దీనిని నా జ్ఞాపకార్ధము చేయుడు” (లూకా 22:19) అన్న మాటలతో అపోస్తలులకు, వారి వారసులకు అప్పద్రాక్ష రసములను క్రీస్తు శరీర రక్తములుగా మార్చె శక్తిని ఒసగి యున్నాడు. కృతజ్ఞతార్చనలో క్రీస్తు మాటలను పలుకుట వలన గురువులు ప్రభువు ఒసగిన శక్తిని వినియోగించు చున్నారు. అప్పుడు రొట్టెలోని పదార్థము క్రీస్తు శరీరముగా, ద్రాక్షా రసములోని పదార్థము, క్రీస్తు శరీరముగా మార్పు చెందుతుంది.

ఈ మార్పును కతోలిక శ్రీసభ “పదార్థ రూపాంతర మార్పు” (పదార్ధాంతరీకరణం - transubstantiation) అని పిలుస్తుంది (సత్యోపదేశం, 1376).
దివ్యసత్ప్రసాదములో ఉత్థాన క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు సాన్నిధ్యం ఉన్నది. రొట్టెను విరిచినప్పుడు క్రీస్తు ముక్కలు కాదు. ప్రతీ ముక్కలో కూడా ఆయన సంపూర్ణముగా సమగ్రముగా ఉంటాడు (సత్యోపదేశం, 1377).
దివ్యబలిపూజ యొక్క ఉద్దేశాలు:
(1). దేవున్ని సృష్టికర్తగా ఆరాధించుటకు. (2). దేవుని అనేక కృపానుగ్రహాలకు కృతజ్ఞతలు చెల్లించుటకు. (3). దేవుని కృపానుగ్రహాలను అందరిపై కుమ్మరించుమని వేడుకొనుటకు. (4). దేవునితో సఖ్య పడుటకు (పాప పరిహార్ధమై మత్త 26:28).
దివ్యబలిపూజ యొక్క ఫలాలు:
(1). దేవుని దయను పొందెదము; చేసిన పాపాలకు పశ్చాత్తాప పడే కృపను పొందెదము; పాపాలకు మన్నిపును పొందెదము; పాపశిక్ష నుండి ఉపశమనం పొందెదము. (2). మన ప్రార్ధనలు తప్పక ఆలకించ బడును, ఎందుకన, పూజలో స్వయముగా ప్రభువే మన కోసం ప్రార్ధన చేయును. 
దివ్యసత్ర్పసాద అనుగ్రహాలు:  
(1). క్రీస్తుతో మన ఐఖ్యతను బలపరుస్తుంది (యో 6:56-57; 1 కొరి 10:17). (2). మనలను పాపమునుండి వేరుచేస్తుంది (సత్యోపదేశం, 1393), సత్కార్యములలో పాల్గొనునట్లు చేయును. (3). దేవునితో స్నేహాన్ని అధికం చేస్తుంది. భౌతిక ఆహారం ఏ ఫలితాన్ని ఇస్తుందో దివ్యసత్ర్పసాదము ఆధ్యాత్మిక జీవితములో సాధిస్తుంది. దివ్యసత్ర్పసాదము పవిత్రాత్మద్వారా జీవాన్నిచ్చింది, జీవాన్నిస్తూనే ఉన్నది. జ్ఞానస్నానములో అందుకున్న కృపావరాన్ని పదిలపరచి అభివృద్ధి చేస్తుంది, నూత్నీకరిస్తుంది (సత్యోపదేశం, 1392). (4). దివ్యసత్ర్పసాదము పేదలపట్ల మనలను బాధ్యులను చేస్తుంది (సత్యోపదేశం, 1397). రోజు రోజుకూ దేవునితోను, సాటి విశ్వాసులతోను సంపూర్ణ సాన్నిహిత్యాన్ని సాధించేలా చేస్తుంది (SC పవిత్ర దైవార్చనా చట్టం 48).
 బైబులులోవిందు – ద్వితీ 12:7; లేవీ 7:15; ఆది.కాం 14:18-20 (చదువుము).
ఆది.కాం. 18:1-18; ద్వితీ 26:11; ఆది.కాం 26:28-30; 31:46-54; నిర్గమ 24:11;

4. పాప సంకీర్తనము / పాపోచ్చారణం-సఖ్యత
‘పాపోచ్చారణం’ అనగా జ్ఞానస్నానం పొందిన వెనుక కట్టుకొను పాపములను మన్నించి, దేవునితోను, తోటివారితోను సఖ్యతను ప్రసాదించు దివ్యసంస్కారం. పాపసంకీర్తన (పాప విమోచన / పశ్చాత్తాప) దివ్యసంస్కారమును మొదటి పాస్కా ఆదివార సాయంత్రమున మన ప్రభువే స్థాపిచాడు. శిష్యుల మీద శ్వాస ఊది, “ఎవరి పాపములనైనను మీరు క్షమించిన యెడల అవి క్షమింప బడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని యెడల అవి క్షమింప బడవు” (యో 20:22-23) అని చెప్పెను.
పాపసంకీర్తనము ద్వారా జ్ఞానస్నానము తరువాత చేసిన పాపాలు పరిహరించ బడును. పశ్చాత్తాప సంస్కారమును భక్తి విశ్వాసాలతో ఆచరంచే వారు దేవుని దయకు పాత్రులవుతారు. పాప మన్నింపు పొందుతారు. పాపము వలన గాయపడిన తల్లి శ్రీసభతోను తిరిగి సఖ్యత పడుదురు (LG లోకానికి వెలుగు శ్రీసభ, 11; సత్యోపదేశం, 1422).

ప్రభువు శిష్యులకు చేసిన వాగ్ధానము: “భూలోకమందు మీరు వేనిని బంధింతురో అవి పరలోక మందును బంధింప బడును. భూలోకమందు మీరు వేనిని విప్పుదురో అవి పరలోక మందును విప్పబడును (మత్త 18:18). ఈ వాగ్ధానమును ప్రభువు మొదటి పాస్కా ఆదివారమున నెరవేర్చారు. పాపములను క్షమించే అధికారమును ప్రభువు తన శిష్యులకు ఒసగాడు.
యేసు – ప్రజలను పాపం నుండి విమోచిస్తాడు (మత్త 1:21). పాప బానిసత్వం నుండి విముక్తి చేయువాడు క్రీస్తు ఒక్కడే (యో 12:31).

పాపసంకీర్తన (పాప విమోచన / పశ్చాత్తాప) దివ్యసంస్కార ప్రభావాలు:
(1). పాప మన్నింపు. “దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో, ఆయన మన పాపములను క్షమించును. మన అవినీతి నుండి మనలను శుద్ధి చేయును” (1 యో 1:9). (2). పాపము వలన కలుగు శిక్షనుండి ఉపశమనము. యేసు జక్కయ్యతో ఇట్లు పలికెను, “నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఏలన, ఇతడును అబ్రహాము కుమారుడే” (లూకా 19:9). (3). సమస్త సృష్టితో సఖ్యత పడును: తనతోను, దేవునితోను, తోటివారితోను, శ్రీసభతోను సఖ్యపడును. (4). మరల పాపం చేయకుండా ఉండుటకు తోడ్పడును.
పాపసంకీర్తనము చేయుటకు ఐదు కార్యములు కావలెను:
(1). చేసిన పాపములను జ్ఞాపక పరచు కొనుట (2). చేసిన పాపముల కొరకు పశ్చాత్తాప పడుట (3). ఇక పాపములను చేయనని ప్రతిజ్ఞ చేయుట (4). చేసిన చావైన పాపముల నన్నింటిని గురువునకు బయలు పరచుట (5). గురువు కట్టడ చేసిన అపరాధమును తీర్చుట. 
పాపోచ్చారణ చట్టం (1973).
పాపం అనగా అవిధేయత (రోమీ 5:19; 2 కొరి 10:6); అన్యాయ బుద్ధితో ప్రవర్తించుటకు, దురాలోచనలు, మూర్ఖత్వం (1 పేతు 2:6). తప్పిదాల వలన, అక్రమాల వలన, ‘అప్పుపడి’ యుండుట (మత్త 6:12; లూకా 11:4) దేవుని క్షామాపణ (లూకా 15:11-28) పాపాలన్నింటిలో ఘోరపాపం పవిత్రాత్మను తిరస్కరించడం, వెలుగు కాదనడం (మత్త 12:31-32; యో 9:39-41) పాపాల మన్నింపుపై క్రీస్తు మనం పాపాత్ములుగా ఉన్నప్పుడే మనకోసం మరణించాడు (రోమీ 5:6-11) పాపం మన దేహములో తిష్ట వేయును (రోమీ 5:6-12; 7:13-17)
పాపోచ్చారణం చేయు విధానం: (1) అంతరాత్మ పరిశోధన (2) పశ్చాత్తాపం (3) పాపోచ్చారణం (4) పాపపరిహారం-నిష్కృతి

5. వ్యాధిగ్రస్తుల (అవస్థ) అభ్యంగము
వ్యాధిగ్రస్తుల ఆత్మ శరీరములకు ఆదరణను ఇచ్చెడు దివ్య సంస్కారము.
“మీలో ఎవ్వడైన వ్యాధి గ్రస్తుడా? అనచో అతడు సంఘపు పెద్దలను పిలువా వలెను. వారు అతని కొరకు ప్రార్ధింతురు. ప్రభువు నామమున వానిపై తైలమును పూయుదురు. విశ్వాసముతో చేసిన ఈ ప్రార్ధన ఆ వ్యాధి గ్రస్తుని రక్షించును. ప్రభువు వానిని ఆరోగ్య వంతుని చేయును. వాని పాపములు క్షమింప బడును. కాబట్టి పరస్పరము మీ పాపములు ఒప్పుకొనుడు. ఒకరికొకరు ప్రార్ధించు కొనుడు. అప్పుడు మీరు స్వస్తులగుదురు” (యాకోబు 5:14-16).

“స్వస్తతా సంస్కారముద్వారా, ఆ సందర్భములో గురువు చేసే ప్రార్ధనద్వారా, యావత్ శ్రీసభ వ్యాధిబాధితులైన వ్యక్తులను, తన శ్రమలద్వారా ఎనలేని మహిమకు పాత్రుడైన క్రీస్తు ప్రభువు సన్నిధానములో నిలుపుతుంది, వారి విమోచన బాధ్యతను ప్రభువు దివ్యహస్తాలకు అప్పజెబుతుంది, వారిని బాధా విముక్తులను కావించి స్వస్థపరచి రక్షణ భాగ్యాన్ని ప్రసాదించుమని వేడుకుంటుంది” (LG లోకానికి వెలుగు శ్రీసభ, 11).

రోగులను స్వస్థపరచుటకు, బాధితులను ఒదార్చుటకు, ప్రభువు అనేకమైన అద్భుతాలను చేసాడు. “యేసు గలిలీయ ప్రాంత మంతట పర్యటించుచు, వారి ప్రార్ధనా మందిరములలో బోధించుచు, పరలోక రాజ్యపు సువార్తను గూర్చి ప్రసంగించుచు, ప్రజల వ్యాధిబాధల నెల్ల పోగొట్టు చుండెను” (మత్త 4:23). “ప్రొద్దు గ్రుంకు చుండగా నానావిధ రోగ పీడితులైన వారినందరిని వారివారి బంధువులు యేసు వద్దకు తీసికొని వచ్చుచుండిరి. అపుడు ఆయన వారిలో ఒక్కొక్కని మీద తన హస్తము నుంచి వారినందరిని స్వస్థపరచెను” (లూకా 4:40).

యేసు తన శిష్యులను వేద ప్రచారమునకు పంపినపుడు, “వారు అనేక పిశాచములను పారద్రోలిరి. రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థ పరచిరి” (మార్కు 6:13).
ఇవన్నియుకూడా, ప్రభువే స్వయముగా ఈ సంస్కారాన్ని స్థాపించారని సూచిస్తున్నాయి. మొక్షారోహనమునకు ముందుగా తన శిష్యులకు వాగ్దానం చేసారు: “నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు ... రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్య వంతులగుదురు” (మార్కు 16:17-18).
అపోస్తలులు ఖచ్చితముగా ఈ దివ్యసంస్కారాన్ని నిర్వహించారు. ఈ విషయాన్ని గురించి యాకోబు 5:13-15లో స్పష్టముగా చెప్పబడినది.

దివ్యసంస్కార ప్రభావాలు:
(1). పవిత్రాత్మ ప్రత్యేక వరం: బలహీనత వలనగాని, అనారోగ్యము వలనగాని, వృద్ధాప్యం వలనగాని వచ్చే కష్టాలను ఎదుర్కొను బలం, శాంతి, ధైర్యాన్ని ఒసగును. నిస్సహాయత వలన, మరణ భయం వలన కలిగే శోధనలను ఎదుర్కొనే బలాన్ని ఒసగును (సత్యోపదేశం, 1520). (2). క్రీస్తు శ్రమల్లో ఐఖ్యత: క్రీస్తు శ్రమల్లో ఐఖ్యం కావడానికి కావలసిన బలాన్ని పొందును (సత్యోపదేశం, 1521). (3). శ్రీసభ కృపావరం: రోగి దేవుని ప్రజల మంచికి దోహదం చేస్తాడు. శ్రీసభ పునీతులతో ఏకమై రోగి మేలు కొరకు వేడుకుంటుంది (సత్యోపదేశం, 1522). (4). అంతిమ యాత్రకు సన్నాహం: మరణాన్ని దాటి జీవానికి నడిపే సంస్కారం. ఈ ప్రపంచం నుంచి తండ్రి దగ్గరకు తీసికెళ్ళే సంస్కారం (సత్యోపదేశం, 1523). (5). దేవుని చిత్తమైతే, ఆత్మ స్వస్థతతో పాటు దేహ స్వస్థత కూడా జరుగుతుంది (సత్యోపదేశం, 1520). (6). పాపాలకు క్షమాపణ లభిస్తుంది (సత్యోపదేశం, 1520).
పాత నిబంధనలో స్వస్థత – నిర్గమ 15:26; కీర్తన 107;20;

6. గురుపట్టము
పవిత్ర యాజకత్వం ఒక సంస్కారం. దీనిద్వారా క్రీస్తు తన అపోస్తులలకు ఆపగించిన ప్రేషిత కార్యం యుగాంతము వరకు అమలు జరుగుతూనే ఉంటుంది. దీనిలో మూడు అంతస్తులు ఉన్నాయి: పీటాధిపత్యం, గురుత్వం, దీకను (సేవకత్వం).
మన ప్రభువే స్వయముగా ఈ దివ్యసంస్కారాన్ని స్థాపించారు. కడరాత్రి భోజన సమయములో స్థాపించారు. “దీనిని నా జ్ఞాపకార్ధము చేయుడు” (లూకా 22:19) అని చెప్పి దివ్యబలి పూజను సమర్పించమని ఆదేశించారు.
హెబ్రీ 5:1; 5:4; 1 పేతు 2:9; చదువుము: 1 కొరి 11:26 –
ఉత్థాన మైన రోజున పాపములను క్షమించే అధికారం ప్రభువు శిష్యులకు ఒసగాడు (చదువుము యో 20:21-23).
చివరిగా, మొక్షారోహనానికి ముందు సువార్త బోధన ప్రేషిత కార్యాన్ని, సంస్కారాల నిర్వహణ బాధ్యతలను అప్పగించాడు (చదువుము మత్త 28:18-20).
ఈ ప్రేషిత కార్యమును కొనసాగించడానికి, క్రీస్తు శిష్యులపై ప్రత్యేక విధముగా పవిత్రాత్మను వారిపై క్రుమ్మరించాడు. హస్తనిక్షేపణ ద్వారా పవిత్రాత్మ వరమునును నేటికినీ ఇతరులకు ఒసగబడు చున్నది (అ.కా. 1:8; 2;4; యో 20:22-23; 1 తిమో 4:14; 2 తిమో 1:6-7).
క్రీస్తు ప్రధాన యాజకుడు (హెబ్రీ 5:5-6)
గురుతర బాధ్యతలు: యాజకుడు (హెబ్రీ 4:14-5:10), ప్రవక్త (మార్కు 3:14; 16:15; యో 20:21; రోమీ 10:13; 1:1; 1 కొరి 9:16), కాపరి (లూకా 22:26)

 7. జ్ఞాన వివాహము
“దంపతులు సన్మార్గమందు నడచుటకు, తమ బిడ్డలను పుణ్య మార్గములో నడిపించుటకును, దేవవరప్రసాదములను ఇచ్చెడు దివ్యసంస్కారము”.
యోహాను 2:1-11 కానా పల్లెలో వివాహము.
క్రైస్తవ వివాహము [బాప్తిస్మము పొందిన] ఒక పురుషుడిని, ఒక స్త్రీని ఐఖ్యం చేస్తుంది. భార్యాభర్తలు ఇరువురు కూడా శాంతి, ప్రేమలతో జీవించాలి. వివాహమును క్రీస్తు దివ్యసంస్కారముగా ఏర్పాటు చేసి, దాని గౌరవాన్ని పెంచారు. కాన పల్లె వివాహములోనే యేసు తన మొదటి అద్భుతాన్ని చేసి, సందర్భాన్ని గౌరవప్రాయముగా మార్చాడు. వివాహ అంతస్థు పవిత్రమైనదని ప్రకటించాడు.
వివాహ జీవితం ప్రారంభము నుండి ఉన్నది (ఆ.కాం. 2:23-24). ప్రభువు రాకముందు వివాహము ఒక పవిత్రమైన ఒప్పందమే. క్రీస్తు వివాహమును ఓ దివ్యసంస్కారముగా స్థాపించారు. ఒకరినొకరు పరస్పర సమ్మతిని వెల్లడి చేసుకొనడం ద్వారా, అనుగ్రహాన్ని ఒకరిపై ఒకరు ప్రదానం చేయుదురు. గురువు శ్రీసభ చేత ఆమోదింప బడిన సాక్షిగా వారి ఐఖ్యతను ఆశీర్వదించును.
ఏవను ఆదాము శరీరము నుండి సృష్టించాడు (ఆ.కాం. 2:21-22). వారిరువురు సంపూర్ణముగా సమానులని దీని అర్ధం. వివాహము ద్వారా ఇరువురు భిన్న శరీరులు ఏక శరీరులైనారు (మత్త 19:6). కనుక వారిలో స్వార్ధం, పోటీతత్వం, నేనే పెద్ద అన్న వాటికి చోటు ఉండరాదు. వివాహ వాగ్దానాలకు ఒకరికొకరు విశ్వసనీయముగా ఉండాలి.
భర్త భార్యను ప్రేమించాలి (చదువుము ఎఫెసీ 5:25). క్రైస్తవ వివాహ బంధం, క్రీస్తుకు-శ్రీసభకు మధ్యనున్న దైవీక బంధము, ఐఖ్యతతో పోల్చబడినది. క్రీస్తు శ్రేసభకు శిరస్సు. అలాగే, వివాహములో భర్త కుటుంబానికి శిరస్సు అయితే, భార్య హృదయం (పోప్ పయస్ XI).
భార్య భర్తకు సహచరినిగా, తోడుగా సుఖదుఃఖాలలో పాలు పంచుకోవాలి (ఆ.కాం. 2:23-24).
దేవునికి-ప్రజలకు మధ్యనున్న బంధం వివాహ బంధముతో పోల్చబడినది: యెహేజ్కె 16; హోషేయ 2; యెష 54; యిర్మీ 3.
“జీవితములో, ప్రేమలో దంపతులు సన్నిహిత భాగస్వాములుగా ఉండేందుకు వివాహం నిర్దేశింప బడినది” (సత్యోపదేశం, 2364).
కుటుంబ అనుదిన జీవితములో ప్రార్ధన తప్పనిసరి భాగమై యుండాలి (పోప్ జాన్ పాల్ II).
విడాకులు (మత్త 19:6; మార్కు 10:9). “వివాహము విడదీయలేని బంధము అని దేవుడు తన ఉద్దేశాన్ని క్రీస్తు నిశ్చయముగా సమర్ధించాడు. పాత చట్టములో చొరబడిన సర్దుబాటును ఆయన రద్దు చేసాడు”. ఒక్క మరణం తప్ప మరే ఇతర కారణాల వలన ఏ మానవ శక్తి కూడా రద్దు చేయలేదు. (సత్యోపదేశం, 2382).
(చదువుము లూకా 16:18) – వ్యభిచారం
(చదువుము 1 కొరి 7:10-11)
గురుశ్రీ ప్రవీణ్ కుమార్ గోపు OFM Cap.
STL in Biblical Theology
పెద్దవుటపల్లి
9550629255
BIBLIOGRAPHY
 1. కతోలిక శ్రీసభ సత్యోపదేశం (Catechism of the Catholic Church in Telugu), September 2005
2. Our Catholic Faith, Revised Edition for India, Louis Laravoire Morrow, 2004
3. పవిత్ర దైవార్చనా చట్టం (Sacrosanctum Concilium: The Constitution on the Sacred Liturgy), ద్వితీయ వాటికన్ మహాసభ అధికార పత్రాలు (Vatican Council – II Documents), Jeevan Print 2009
4. లోకానికి వెలుగు శ్రీసభ (Lumen Gentium: Dogmatic Constitution on the Church), ద్వితీయ వాటికన్ మహాసభ అధికార పత్రాలు (Vatican Council – II Documents), Jeevan Print 2009
5. దివ్య సంస్కారాలు, SJP భక్త యోహాను ప్రాంతీయ గురువిద్యాలయ ప్రచురణ, 2003

No comments:

Post a Comment