21వ సామాన్య గురువారము
1 తెస్స. 3:7-13; మత్త. 24:42-51
ధ్యానాంశము: క్రీస్తు రెండవ రాకడ-జాగరూకత
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “మీరును సిద్ధముగా ఉండుడు.
ఏలయన, మనుష్యకుమారుడు మీరు
ఊహింపని గడియలో వచ్చును” (మత్త. 24:44)
ధ్యానము: క్రీస్తు రెండవ రాకడ అనూహ్యమైన గడియలో వచ్చును అని మత్తయి సువార్తలో
వింటున్నాము. మత్తయి సువార్తీకుడు, మూడు సంఘటనలను మనకు
గుర్తుచేస్తున్నాడు. మొదటిది, నోవా దినములందు వచ్చిన
ప్రళయం: ప్రజలు ధర్మమును, నీతిని మరచి, తినుచు, త్రాగుచు, వివాహములాడుచు, విచ్చలవిడి జీవితమును
జీవించునప్పుడు ప్రళయము సంభవించినది. అలాగే,
మనుష్యులు
ఊహించని దినమునందు రెండవ రాకడ వచ్చును (మత్త. 24:37-39). రెండవది, “ఆ సమయమున ఇరువురు పొలములో పనిచేయుచుండ ఒకరు కొనిపోబడును, మరియొకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి
త్రిప్పుచుండ, ఒకతె కొనిపోబడును, మరియొకతె విడిచిపెట్టబడును”. కనుక, రెండవ రాకడ కొరకై జాగరూకులై యుండాలి (మత్త. 24:40-42). మూడవది, రెండవ రాకడ (ప్రభువు
దినము) దొంగవలె వచ్చును (మత్త. 24:43-44; 2 పేతు. 3:10). అందుకే, ప్రతి క్రైస్తవుడు ఒక కావలివాడు. కనురెప్ప మూయక
గస్తికాయునట్లు మెలకువతో నిరీక్షించాలి. మెలకువగా యుండటం, క్రైస్తవ గొప్పలక్షణం.
ప్రభువు రెండవ రాకడకై మన సంసిద్ధతకు రెండు కారణాలు: మొదటిది, రెండవ రాకడ సమయము, గడియ, రోజు ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు. “మేలుకొని ఉండుడు. అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు
నిద్రించుచుండుట చూడవచ్చును. జాగరూకులై ఉండుడు”
(మార్కు. 13:35-37). అందుకే, పౌలు, “నిద్రితుడా!
మేల్కొనుము. మృతులనుండి లెమ్ము! క్రీస్తు నీపై ప్రకాశించును” (ఎఫెసీ. 5:14) అని హెచ్చరిస్తున్నాడు. “కనుక ఇతరులవలె, మనము నిద్రించుచుండరాదు.
మేల్కొని జాగరూకులమై ఉండవలెను (1 తెస్స. 5:6). ప్రభువు రాకడ ఎప్పుడు సంభవించునో మనకు తెలియదు కనుక, మనము ఎల్లప్పుడూ మేల్కొని, జాగరూకులమై
యుండాలి. ఈ క్షణములోనే వచ్చును అన్న భావనతో మనం సంసిద్ధ పడాలి.
గమనించండి! “ఆయన వచ్చినప్పుడు
మేల్కొని సిద్ధముగా ఉన్నవారు ధన్యులు! అతడు నడుము కట్టుకొని, వారిని భోజనమునకు కూర్చుండ బెట్టి, తానే వచ్చి వారలకు వడ్డించును” (లూకా. 12:37). మత్తయి 25లో ‘పదిమంది కన్యలు’
ఉపమానములో, సిద్దముగనున్నవారు అతని వెంట వెళ్ళిరి. మిగతావారికి తలుపు
మూయబడెను. కనుక, మెలకువతో ఉండుడు. ఆరోజును, ఆ గడియను మీరెరుగరు (1-13).
ప్రభువు రాకడ, అంత్యదినమున మాత్రమేగాక,
మన
అంత్యదినమునకూడా సంభవించును. అది ఎప్పుడైనా సంభవించవచ్చు. మరి సిద్ధముగానున్నావా? మన ఆకస్మిక మరణం గురించి తప్పక ధ్యానం చేయాలి. అప్పుడే, దేవుడు ఇచ్చిన జీవితము,
సమయముయొక్క
విలువను తెలుసుకుంటాం. కనుక, సిద్ధపాటుతో జీవించుదాం.
No comments:
Post a Comment