21వ సామాన్య ఆదివారము Year A

21వ సామాన్య ఆదివారము Year A
యెషయ 22:19-23; రోమీ. 11:33-36; మత్త. 16:13-20
నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు
 
అధికార దుర్వినియోగం చేసేవారిని దేవుడు తొలగిస్తాడు అన్నది మొదటి పఠన సారాంశం. యెషయ గ్రంథములో యెరూషలేము పాలకులను గూర్చిన ప్రవచనాన్ని నేడు వింటున్నాము. నాయకులను వారి అధికారమునుండి తొలగించే శక్తి దేవునికి యున్నది. ముఖ్యఅధికారి, రాజగృహ నిర్వాహకుడు అయిన షెబ్నాను తొలగించాడు. ఎందుకన, తన పదవిని, ప్రజలకొరకుగాక, తనకోసం, తన పేరుకోసం, ప్రతిష్ఠకోసం వాడుకున్నాడు. షెబ్నా స్థానములో ఎల్యాకీమును నియమిస్తున్నాడు. దావీదు వంశపురాజు తాళపు చెవిని ఎల్యాకీము తన భుజములమీద తాల్చునట్లు చేయుదనిని, అతడు తెరచిన దానిని ఎవరు మూయలేరు. అతడు మూసిన దానిని ఎవరు తెరువలేరు” (22:22) అని దేవుడు పలికాడు. అయితే, తరువాత కాలములో ఎల్యాకీమునుకూడా పదవినుండి తొలగించాడు. ఎందుకన, బంధుప్రీతి వలన ఎల్యాకీము తన బాధ్యతలను సరిగా నిర్వహించలేక పోయాడు. ఇది మనందరికీ ఒక గుణపాటం కావాలి. కనుక, మనకు ఇవ్వబడిన అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. మనకు అధికారము ఇచ్చునది దేవుడే. కనుక, దేవుని మహిమ కొరకే దానిని వినియోగించాలి.

దేవుని మనస్సును మనం పూర్తిగా తెలుసుకోలేమని రెండవ పఠనములో పౌలుగారు తెలియజేయు చున్నారు. ఎందుకన, దేవుని జ్ఞానం మనకు అందనిది.

సువార్తలో యేసు మెస్సయ అని, దేవుని ప్రత్యక్షరూపమని చూస్తున్నాము. యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతమునకు (ఎక్కువగా గ్రీకులు, రోమనులుయుండే ప్రాంతం) వెళ్ళుచూ, మార్గమధ్యమున ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు?” అని అడిగారు. కొందరు బప్తిస్త యోహాను అని, మరికొందరు ఏలియా అని, లేదా మరియొక ప్రవక్త అని చెప్పుకొనుచున్నారుఅని సమాధానం ఇచ్చారు. హేరోదుతోసహా ప్రజలు ఇలా అనుకోవడం మార్కు 6:14-15లో చూడవచ్చు. వారు మెస్సయ్య గురించి బిన్నాభిప్రాయాలను కలిగియున్నారు. దావీదు  మహారాజు వారసుడిగా, రోమను సామ్రాజ్యాన్ని నాశనంచేసి, ఇశ్రాయేలు రాజ్యకీర్తిని తిరిగి స్థాపిస్తాడని భావించారు. అప్పుడు యేసు మరి నన్నుగూర్చి మీరు ఏమనుకొనుచున్నారు?”(వ్యక్తిగత ప్రశ్న) అని ప్రశ్నింపగా, పేతురు, నీవు క్రీస్తువు అని సమాధాన మిచ్చాడు. పేతురు (ఇతర శిష్యులు) యేసును అభిషిక్తునిగా, మెస్సయ్యగా, క్రీస్తుగా గుర్తించారు. (Christos – ‘క్రీస్తుగ్రీకు పదం; ‘మెస్సయ్యహీబ్రూపదం. మెస్సయ్య అనగా అభిషిక్తుడుఅని అర్ధం). మార్కు తన సువార్తను "దేవుని కుమారుడు యేసు క్రీస్తుసువార్త" (1:1) అంటూ ప్రారంభించాడు. యేసుకూడా స్వయముగా నేనే క్రీస్తుఅని చెప్పారు. ప్రధానార్చకుడు, ‘దేవుని కుమారుడవు అగు క్రీస్తువు నీవేనా?’ అని ప్రశ్నింపగా, అందుకు యేసు ఔను, నేనేఅని సమాధాన మిచ్చారు (మార్కు 14:61-62).

యేసు, శిష్యుల ప్రయాణం, గలిలీయ ప్రాంతమునుండి, యెరూషలేము వైపునకు మొదలైనది. ఇది యేసు శ్రమల, మరణం వైపునకు పయణం. బహుషా, అందులకే ప్రభువు తనను గురించి ప్రజలుగాని, శిష్యులుగాని ఎలా అర్ధం చేసుకొనుచున్నారో తెలుసుకోవాలని అనుకున్నారు. అందుకే యేసు శిష్యులకు, “మనుష్యకుమారుడు (బాధామయ సేవకునిగా) అనేక శ్రమలను అనుభవించి, పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్రబోధకులచే (Sanhedrin, యూదప్రజల న్యాయసభ) నిరాకరించబడి, చంపబడి, మూడవరోజున ఉత్థాన మగుట అగత్యముఅని ఉపదేశించారు (మార్కు 8:31). నీవు క్రీస్తువుఅని చాటిచెప్పిన పేతురుకు ఈ విషయం బోధపడలేదు. అందుకే, పేతురు యేసును ప్రక్కకు తీసికొనిపోయి, "అట్లు పలుకరాదు" అని వారించాడు (మార్కు 8:32). దీనినిబట్టి, శిష్యులు యేసును "క్రీస్తు, మెస్సయ్య"గా గుర్తించారు, కాని దానిలోని అర్ధాన్ని గ్రహించలేక పోయారు. బహుశా, పేతురు, ఇతర శిష్యులు, మెస్సయ్య అంటే ఒక రాజుగా యూదులను పాలిస్తాడని, రోమను సామ్రాజ్యాన్ని కూలద్రోస్తాడని భావించి ఉంటారు! యేసు శిష్యులవైపు చూచి, “సైతాను! నీవు నా వెనుకకు పొమ్ము. నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని, దేవునికి సంబంధించినవి కావు” (మార్కు 8:33) అని అన్నారు. ప్రభువు ఉత్థానము తరువాత, మెస్సయ్య అనగా ఏమిటో, శిష్యులకు అర్ధమయినది.

పేతురు చెరసాలలో నున్నప్పుడు, క్రీస్తు సంఘము ఆయన కొరకు పట్టుదలతో దేవుని ప్రార్ధించింది. అప్పుడు దూత అతనిని చెరసాలనుండి (మరణమునుండి) విడిపించినది (అ.కా. 12:1-12). కొన్ని సం.ల తరువాత, రోమునగరములో పేతురు మరల చెరసాలలో నున్నప్పుడు, క్రీస్తు సంఘము తప్పక అతని కొరకు ప్రార్ధన చేసియుండవచ్చు. కాని, ఈసారి అతను తన మరణమును తప్పించు కొనలేకపోయాడు. చెరసాలనుండి విముక్తుడైనందుకు పేతురు వీరుడు’ (హీరో) కాలేదు. కాని, తన ప్రాణమును త్యాగము చేసినందులకు, వేదసాక్షి మరణము పొందినందులకు వీరుడయ్యాడు. పేతురు చెప్పిన విశ్వాస సత్యము అతని జీవితమునే మార్చివేసింది: నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు” (మత్త 16:16). అందుకు ప్రభువు, “యోనా పుత్రుడవగు సీమోను! నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని, రక్తమాంసములు కావు” (16:17) అని అన్నారు. ధన్యతఅనగా సంతోషము. ఈ ధన్యతకు/సంతోషమునకు కారణం, యేసు సజీవుడగు దేవుడుఅని గుర్తించడం. పేతురు తన జీవితములో, తన హృదయములో యేసును సజీవ దేవునిగా నిలుపుకున్నారు. అందుకే యేసు, “నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింప జాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో, అది పరలోక మందును బంధింపబడును. భూలోక మందు నీవు దేనిని విప్పుదువో, అది పరలోక మందును విప్పబడును” (16:18-19) అని బాధ్యతను అప్పగించారు.

యేసు నాకు ఎవరు? అన్న ప్రశ్నకు నా సమాధానం ఏమిటి? ఈప్రశ్న క్రీస్తుపట్ల మనకున్న నిబద్ధతపైగల చాలా క్లిష్టమైన ప్రశ్న! క్రీస్తునుగూర్చి ఎన్నో విన్నాము, చదివాము. కాని, ప్రభువు మనలనుండి మనవ్యక్తిగత అభిప్రాయాన్ని కోరుచున్నారు. ప్రభువును తెలుసుకోవాలంటే, జ్ఞానం ఉంటే సరిపోదు. క్రీస్తును వ్యక్తిగతముగా అనుభూతి చెందాలి. ఆయన జీవిత బాటలో మనం పయనించాలి. ఆయనవలె ప్రేమించాలి, క్షమించాలి. మనకు అప్పగించ బడిన బాధ్యతలను (తల్లి, తండ్రి, గురువు, మఠకన్య, టీచరు...) సక్రమముగా నెరవేర్చాలి.

5 comments:

  1. Very much helpful for me and my work easy. Thank you so much 🙏🙏🙏

    ReplyDelete
  2. Nice Reflection Father

    ReplyDelete
  3. Thank youvery much father

    ReplyDelete
  4. Dear father plz send me your reflections

    ReplyDelete