21వ సామాన్య బుధవారము
1 తెస్స. 2:9-13; మత్త. 23:27-32
ధ్యానాంశము: దైవ పిలుపు
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “విశ్వాసులైన మీ పట్ల మేము
ఎట్లు పరిశుద్ధముగను, నీతిగను, నిందారహితముగను ప్రవర్తించితిమో అందుకు మీరే మాకు సాక్షులు” (1 తెస్స. 2:10)
ధ్యానము: మనం దైవపిలుపును గురించి ధ్యానించేటప్పుడు, పిలుపు కేవలం గురువులకు,
మఠకన్యలకు
మాత్రమే అని ఆలోచిస్తాము. నిత్యం దైవసన్నిధిలో,
సేవలో ఉండటానికి వారిది
శ్రీసభలో ప్రత్యేక పిలుపు. అయితే, దేవుడు వారిని మాత్రమే
పిలుస్తున్నాడు అని అనుకోవడం పొరపాటు. దేవుడు అందరిని పిలుస్తారు. దేవుడు ప్రతీ
ఒక్కరిని “తన రాజ్యమునకును, మహిమకును పిలుచుచున్నారని” నేటి మొదటి
పఠనములో పౌలు తెలియజేయుచున్నాడు. అలాగే, “పిలుచుచున్న దేవునికి తగినట్లు
నడుచుకొనవలెనని” ప్రార్ధన చేయుచున్నాడు.
దేవుని కొరకు మన జీవితాన్ని జీవించాలి. మన జీవితముద్వారా దేవుని చిత్తం ఈ లోకములో
నేరవేరాలి.
దేవుడు పిలిచే జీవితానికి విరుద్ధముగా ధర్మశాస్త్రబోధకుల, పరిసయ్యుల జీవితం ఉన్నదని ప్రభువు నేటి సువిషేశములో తెలియజేయు చున్నారు. వారిది కపట జీవితం. నియమ నిబంధనలలో నైపుణ్యంకలవారు, కాని వారిలో విలువలు ఏమీ ఉండవు. బయటకు నీతిమంతులవలె కన్పించినను (సున్నము కొట్టిన సమాధులవలె), లోపల కపటముతోను, కలుషముతోను (మృతుల ఎముకలతోను, దుర్గంధపదార్ధములతోను) నిండి యుంటారు. ప్రవక్తలను, భక్తులను హింసిస్తారు. మోసపూరితముగా జీవిస్తారు. దీనికి విరుద్ధముగా, మన పిలుపు నీతిమంతులుగా, విశ్వసనీయతతో కూడిన జీవితమునకు దేవుడు పిలుస్తున్నారు. మనకు పరలోకములో శాశ్వత జీవితమును సిద్ధము చేసియున్నారు. అయితే, ఈ లోకములో ఉండగానే, మనకు తన ప్రేషితకార్య బాధ్యతను అప్పజెప్పియున్నారు. మన అనుదిన జీవితాలలో, మన కుటుంబాలలో, మన చుట్టుప్రక్కల, పని చేయుచోట్ల నమ్మకమైన క్రైస్తవులుముగా ఉండటమే మన బాధ్యత. “విశ్వాసులైన మనయందు, వాక్కు దైవకార్యమును నేరవేర్చును” (1 తెస్స. 2:13). కనుక, మనం ఎక్కడున్నను, క్రీస్తును, ఆయన సత్యమును ప్రతిబింబించడమే మన ధ్యేయం. శ్రీసభకు చెందడం మాత్రమేగాక, మనమే శ్రీసభ అన్న భావనతో జీవించాలి. క్రైస్తవ జీవితములో కపటత్వం లేకుండా, చిత్తశిద్ధితో జీవించుదాం. అంతర్గతముగా మన జీవితాలు పవిత్రముగా లేనప్పుడు, బాహ్యముగా అత్యుత్సాహాన్ని ప్రదర్శింపక జీవించుదాం. పరిశుద్ధమైన, నీతికరమైన, నిందారహితమైన మన జీవితాలు ఇతరులకు సాక్షము కావలయును.
No comments:
Post a Comment