పునీత బాసిల్ ది గ్రేట్, పునీత నజియాంజెన్ నగర గ్రెగోరి (జనవరి 2)

పునీత బాసిల్ ది గ్రేట్, పునీత నజియాంజెన్ నగర గ్రెగోరి
(2 Jan)


ఆసియా మైనరులో (ప్రస్తుత టర్కీ) కపడోసియాలోగల కైసరియా పట్టణములో 329లో జన్మించారు. ఒక గొప్ప పునీతుల కుటుంబములో జన్మించారు. తండ్రి పెద్ద బాసిల్. తల్లి పునీత ఎమిలియ. వీరి తాత, నాయనమ్మలు కూడా పునీతులే. సోదరులు నిసానగర గ్రెగొరీ, సెబాస్టీనగర పీటర్ వారలు కూడా పునీతులే. వీరి చిన్న సోదరి చిన్న మక్రీన కూడా పునీతురాలే. ఎన్నో విద్యలను అభ్యసించారు. ఏథెన్స్ నగరంలో చదువుకునే రోజులలో నజియాంజిన్ నగర పునీత గ్రెగొరితో స్నేహం చేశారు. వీరిరువురిని ఒకేరోజు శ్రీసభ జనవరి 2న స్మరించుకుంటుంది.

ఈ లోక సంబంధమైన విషయాలనుండి ఆధ్యాత్మిక జ్ఞానం వైపు మరలిన తరువాత, క్రైస్తవ సన్యాసుల మఠాలను సందర్శించి, తానుకూడా ఐదు ఏళ్లపాటు సన్యాసిగా జీవితం గడిపారు. తరువాత తానే స్వయంగా 'పొంతు' అనే గ్రామములో ఒక మఠాన్ని స్థాపించారు. పని - పఠనం - ప్రార్ధన ఈ ఆశ్రమ ప్రాధానాంశాలుగా ఉండేవి. బాసిల్ గారు "తూర్పు దేశాల సన్యాస ఆశ్రమ పితా మహుడు" అని పేరు గాంచారు.

364లో గురువులుగా అభిషిక్తులైనారు. 370లో కైసరియకు పీఠాధిపతులుగా నియమింప బడినారు. యేసు దైవత్వాన్ని అంగీకరించని "ఏరియనిజం"ను, అలాగే అసత్య బోధనలను నమ్మిన చక్రవర్తి వాలెన్సును అదుపులో పెట్టగలిగారు. తద్వారా కపడోసియా ప్రాంత మంతా క్రైస్తవ విశ్వాసం దిగ్విజయంగా వ్యాపించింది. అందుకే 4వ శతాబ్దంలో అతనిని శ్రీసభ "బాసిల్ ది గ్రేట్"గా కొనియాడింది.

క్రైస్తవ వ్యతిరేకత, వేదహింసల సమయంలో బాసిల్ చెక్కుచెదరని భక్తిని, దృఢ విశ్వాసాన్ని, పరిపూర్ణ విధేయతను చాటారు. పేదవారి కొరకు ఎన్నో శరణాలయాలను స్థాపించారు. కుష్ఠ రోగులను ఆదరించారు. ఉచిత, ఉత్తమ వైద్య సేవలు కల్పించారు. ప్రముఖ సంఘ సేవకునిగా పేరు గాంచారు.

379, జనవరి 1న తన 50వ ఏట మరణించారు.

పునీత నజియాంజెన్ నగర గ్రెగోరి 330లో జన్మించారు. తన 30వ ఏట జ్ఞానస్నానం పొందారు. సన్యాసిగా పునీత బాసిలుతో కలిసి జీవించారు. తరువాత గురువుగా అభిషిక్తులైనారు. 381లో కాన్స్టాంటినోపిల్ పీఠాధిపతులుగా నియమింప బడినారు. కాన్స్తాంటినోపుల్ నందు జరిగిన అఖిల క్రైస్తవ పీఠాధిపతుల సమావేశములో పాల్గొన్నారు. "నైసియ విశ్వాస ప్రమాణమును" సమర్ధించారు. పునీత బాసిలుతో కలిసి 'ఏరియనిజం' అసత్య బోధనలను  తిప్పికొట్టి, విశ్వాసాన్ని పునరుద్ధరించారు. 25 జనవరి 389లో మరణించారు.

No comments:

Post a Comment