ప్రపంచ వృద్ధుల (అమ్మమ్మ, నానమ్మ, తాతలు) దినోత్సవము - 25జూలై 2021

 పోపు సందేశము – 2021
ప్రపంచ వృద్ధుల (అమ్మమ్మ, నానమ్మ, తాతలు) దినోత్సవము (25జూలై)
“సర్వదా నేను మీతో నుందును”



ప్రియమైన అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు, వృద్దులారా!

యేసు పరలోకమునకు కొనిపోబడుటకు ముందుగా తన శిష్యులతో, “సర్వదా నేను మీతో నుందును” (మత్త. 28:20) అని వాగ్దానం చేసారు. ప్రియమైన తాతలు, అమ్మమ్మ, నానమ్మలు, వృద్దులారా, అదే వాగ్దానాన్ని ప్రభువు నేడు మీతో చేయుచున్నారు. రోము పీఠాధిపతులుగా, నేనునూ మీ వలె వయసులో పెద్దవానిగా, ఈ మొదటి “ప్రపంచ తాతలు, అమ్మమ్మ, నానమ్మలు, పెద్దల దినోత్సవము” సందర్భముగా “సర్వదా నేను మీతో నుందును” అను అదే ప్రభువు వాగ్దానముతో మిమ్ములను సంబోధించడానికి నేను సంతోషిస్తున్నాను. శ్రీసభయంతయు మీకు, నాకు తోడుగా యున్నది. శ్రీసభ మీ గురించి శ్రద్ధ వహిస్తుంది, మిమ్ములను ప్రేమిస్తుంది. మిమ్ములను ఒంటరిగా విడిచి పెట్టుటకు శ్రీసభ ఎన్నడు ఇష్టపడదు.

ఈ నా సందేశం చాలా క్లిష్ట సమయములో మీకు చేరుచున్నదని నాకు బాగా తెలుసు. కరోన మహమ్మారి ఊహించని విధముగా తుఫానులా మనపై వచ్చిపడింది. ఇది ప్రతీ ఒక్కరికి, ముఖ్యముగా మనలాంటి వృద్ధులకు పరీక్షా సమయం. దీని వలన చాలామంది అనారోగ్యం పాలైయ్యారు, చాలామంది చనిపోయారు, ఇంకొందరు వారి జీవిత భాగస్వాముల లేదా ప్రియమైన వారి మరణాన్ని చవిచూసారు. ఇంకా అనేకమంది చాలా కాలం పాటు ఒంటరితనాన్ని అనుభవించారు.

ఈ కష్టసమయములో మనం అనుభవించుచున్న దంతయు ప్రభువు ఎరిగి యున్నారు. కరోన మహమ్మారి వలన ఒంటరితనాన్ని అనుభవించిన వారందరికి ప్రభువు చేరువలోనే యున్నారు. సంప్రదాయం ప్రకారం, యేసు తాతగారు పునీత జ్వాకీము తనకు పిల్లలు లేని కారణముగా తన చుట్టూ ఉన్నవారందరి నుండి ఒంటరివాడయ్యాడు. ఆయన భార్య అన్నమ్మవలె, ఆయన జీవితం నిరుపయోగమైనదిగా భావించబడింది. అందువలన, అతనిని ఓదార్చడానికి ప్రభువు ఆయన యొద్దకు తన దూతను పంపారు. జ్వాకీము నగరము వెలుపల విచారముతో ఉండగా, ప్రభువు దూత అతనికి కనిపించి, “జ్వాకీము, జ్వాకీము! నీ ప్రార్ధనను ప్రభువు ఆలకించారు” అని తెలిపినది. గియోత్తో అనే చిత్రకారుడు, తాను గీసిన ఒక ప్రసిద్ధ చిత్ర పటములో ఈ సంఘటనను రాత్రిపూట జరిగినట్లుగా చిత్రీకరించాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఆందోళన, జ్ఞాపకాలు, కోరికలతో నిండిన జ్వాకీమును ఆ పటములో చూడవచ్చు.

కరోన మహమ్మారివంటి అంధకార సమయాలలో, మన ఒంటరితనములో మనలను ఒదార్చుటకు ప్రభువు తన దూతలను పంపి, “సర్వదా నేను మీతో నుందును” అని మనకు గుర్తుచేయు చున్నారు, అభయ మొసగుచున్నారు. ఈ మాటలను మీతోను, నాతోను ప్రభువు పలుకుచున్నారు. ఈనాడు మనం కొనియాడే ఈ దినోత్సవమునకు అర్ధము ఇదియే! దీనినే, చాలాకాలం ఒంటరితనము తరువాత, నెమ్మదిగా సామాజిక జీవనం తిరిగి ప్రారంభమవుతున్న తరుణములో, నేను ఈ ప్రత్యేక సంవత్సరములో మొదటిసారిగా ఉత్సవముగా జరుపుకోవాలని తలంచాను. ప్రతీ తాత, అమ్మమ్మ, నానమ్మ, పెద్దలు, ముఖ్యముగా మనలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వారందరిని దేవుని దూతలు దర్శించునుగాక!

కొన్నిసార్లు, ఆ దూతలు మన మనవళ్ళు, మనవరాళ్ళ రూపాన్ని కలిగి ఉంటారు. మరికొన్నిసార్లు, మన కుటుంబ సభ్యులు, మన చిరకాల స్నేహితులు, మనకు తెలిసినవారి రూపాన్ని కలిగి యుంటారు. వీరు మనలను సందర్శించినపుడు వారి పలకరింపులు, ఆలింగనము ఎంత ముఖ్యమైనవో మనం నేర్చుకున్నాము. కొన్ని ప్రదేశాలలో ఇలాంటివి ఇప్పటికీ లేకపోవడం నన్నెంతగానో బాధిస్తుంది.

అయితే, ప్రభువు ఎల్లప్పుడూ తన వాక్కు ద్వారా మన యొద్దకు తన దూతలను పంపుచూనే యున్నారు. ప్రతీ రోజు సువార్త పేజీలను చదువుదాం. కీర్తనలతో ప్రార్ధన చేద్దాం. ప్రవక్తల గ్రంథాలను చదువుదాం. ప్రభువు విశ్వసనీయత వలన మనం ఓదార్చబడతాము. నేడు మన జీవితాలనుండి ప్రభువు ఏమి కోరుచున్నారో పరిశుద్ధ గ్రంథం మనకు తెలియ జేయును. రోజులో ప్రతీ గంట (మత్త. 20:1-16), ప్రతీ కాలమున, ప్రభువు తన తోటలో పనిచేయుటకు పనివారిని పంపును. నేను రోము పీఠాధిపతిగా ఎన్నికొనబడే సమయానికి నాకు పదవీ విరమణ చెందాల్సిన వయసు. ఆ సమయములో ఇప్పుడు కొత్తగా నేనేమి చేయగలను అని భావించాను. ప్రభువు ఎప్పుడు మనతోనే యున్నారు. ప్రభువు ఎప్పుడు కూడా కొత్త అవకాశాలతో, ఆలోచనలతో మనకు చేరువలోనే యున్నారు. ప్రభువు నిత్యుడు, శాశ్వితుడని మీకు తెలుసు; ఆయనకు ఎప్పుడూ పదవీ విరమణ యుండదు.

మత్తయి సువార్తలో, ప్రభువు తన శిష్యులతో, “కనుక మీరు వెళ్లి, సకల జాతి జనులకు పిత, పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మొసగుచు, వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించిన దంతయు వారు ఆచరించ బోధింపుడు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును” (మత్త. 28:19-20) అని వారికి అభయ మొసగారు. ఇవే మాటలను ప్రభువు నేడు మనతో కూడా పలుకుచున్నారు. మన మూలాలను కాపాడుకొనుటకు, విశ్వాసాన్ని యువతకు అందజేయుటకు, చిన్న పిల్లలను చూసుకొనుట మన పిలుపు అని సరిగా అర్ధం చేసుకోవడానికి ప్రభువు పలికిన మాటలు మనకు ఎంతగానో తోడ్పడతాయి. దీని గురించి ఆలోచించండి: ఈ వయసులో మన పిలుపు దేని కొరకు? మన మూలాలను కాపాడుకొనుటకు, విశ్వాసాన్ని యువతకు అందజేయుటకు, చిన్న పిల్లలను చూసుకొనుటకు. దీనిని ఎప్పటికీ మరచి పోవద్దు.

మీరు ఇంకా పనిచేయుచున్నను, లేకున్నను, ఒంటరిగా ఉన్నను లేదా కుటుంబముతో ఉన్నను, మీరు అమ్మమ్మ, నానమ్మ, తాతలుగా చిన్న వయసులో అయినను లేదా పెద్ద వయసులో అయినను, మీరు ఇంకా స్వతంత్రముగా జీవిస్తున్నను లేదా ఇతరులపై ఆధారపడి జీవిస్తున్నను ఏమీ తేడా లేదు, ఎందుకన, సువార్తను ప్రకటించుటకు, మీ పిల్లల పిల్లలకు సంప్రదాయాలను అందించుటకు వయసుతో సంబంధము లేదు. మీరు కొత్తది ఏదైనా చేయుటకు సిద్ధపడాలి.

చరిత్రలో, కీలకమైన ఈ సమయములో, పునరుద్దరింప బడిన పిలుపును మీరు అందుకొను చున్నారు. ఇది ఎలా సాధ్యము? అని మీరు ఆశ్చర్య పడవచ్చు! నా శక్తి కొడగంటి పోవుచున్నది; నేను ఇంకా ఏమైనా చేయగలనని అనుకోవడం లేదు; ఒక జీవిత క్రమానికి నేను అలవాటు పడినప్పుడు, భిన్నముగా వ్యవహరించుట నేనెలా ప్రారంభించ గలను? నా కుటుంబము గురించి ఇప్పటికే ఎంతగానో ఆందోళన చెందుచున్న నేను పేదవారికి నా జీవితాన్ని నేను ఎలా అంకితం చేసుకోగలను? నేనున్న నివాసాన్ని కూడా విడచి వెళ్ళలేకున్నప్పుడు, నేను నా దృష్టిని ఎలా విస్తృతం చేయగలను? ఇప్పటికే నా ఏకాంత జీవితం తగినంత భారంగా మారలేదా? ఈ ప్రశ్నను మీలో ఎంతమంది ప్రశ్నించు కొంటున్నారు: నా ఏకాంత జీవితం ఇప్పటికే తగినంత భారం కాదా? ఇలాంటి ప్రశ్ననే ప్రభువు నికోదేము నుండి విన్నాడు: “వృద్ధుడైన మనుష్యుడు మరల ఎటుల జన్మింపగలడు?” (యోహాను. 3:4). మన హృదయాలను పరిశుద్ధాత్మ దేవుని కార్యమునకు అంకితం చేయాలి. గాలివలె ఆత్మ తనకు ఇష్టమైనటుల వీచును. అలాగే, ఆత్మ వలన జన్మించు ప్రతివాడు అటులనే ఉండును.

నేను తరచుగా గమనించినట్లుగా, ఈ ప్రస్తుత సంక్షోభము నుండి మనం పూర్వ స్థితికి వెళ్లలేము, దానికన్న మంచి స్థితిలోనికి లేదా అధ్వాన్న స్థితిలోనికి వెళతాము. “దేవుని సహాయముతో ... ఈ సంక్షోభము నుండి మనం ఏమీ నేర్చుకోలేదు అన్న విషాదాన్ని చరిత్ర మరోసారి నిరూపించక యుండునుగాక! కృత్రిమ శ్వాస అందించే వెంటిలేటర్ల కొరత వలన మరణించిన వృద్ధులందరినీ మన దృష్టిలో ఉంచుకుంటే... ఈ దు:ఖం నిరుపయోగంగా మారకపోతే, అది తప్పక నూతన జీవన శైలిని ప్రారంభించుటకు వీలు కల్పించును. ఒకరికి ఒకరం అవసరమని మనం ఒకసారి తెలుసుకుంటే ఈవిధముగా, మానవ బలహీనత పునర్జన్మానుభూతి పొందగలదు” (అందరూ సోదరులే, నం. 35). ఎవరూ ఒంటరిగా రక్షింప బడరు. మనమందరం ఒకరి కొకరం ఋణపడి యున్నాము. మనమందరం సోదర సోదరీమణులము.

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సౌభాతృత్వం, సామాజిక స్నేహములో, కరోన మహమ్మారి తగ్గిన తరువాత మనము, మన పిల్లలు కలిసి జీవించే రేపటి ప్రపంచాన్ని నిర్మించడములో మీ సహాయం ఎంతో అవసరమని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సమస్యల వలయములో చిక్కుకున్న మన సమాజాన్ని, సంఘాలను పునరుద్దరించుటకు సహాయం చేయుటలో ప్రతీ ఒక్కరు చురుకుగా భాగస్వామ్యం కావాలి (అందరూ సోదరులే, నం. 77). ఈ నూతన ప్రపంచాన్ని నిర్మించడానికి కావలసిన మూల స్తంభాలలో మీరు మాత్రమే మెరుగ్గా చేయగలిగేవి మూడు ఉన్నాయి. ఆ మూడు స్తంభాలు ఏవనగా - కలలు, జ్ఞాపకాలు, ప్రార్ధన. ఈ మూడింటితో నూతన ప్రయాణాన్ని ప్రారంభించడానికి అందరికీ, మనలో బలహీనులకు కూడా అవసరమైన బలాన్ని, ప్రభువు సాన్నిహిత్యం దయచేయును.

యోవేలు ప్రవక్త ఇలా వాగ్దానం చేసారు: “మీ ముదుసలులు కలలు కందురు. మీ యువకులు దర్శనములు గాంతురు” (2:28). లోక భవిష్యత్తు యువకులకు, వృద్ధులకు మధ్యనున్న ఈ నిబంధనపై ఆధారపడి యున్నది. వృద్ధుల కలలను యౌవనస్తులు గాక ఇంకెవరు నిజం చేయగలరు? అయినప్పటికినీ, ఇది జరగాలంటే, మనం కలలు కనడం కొనసాగించడం ఎంతో అవసరం. న్యాయం, శాంతి, సంఘీభావం అనే మన కలలు, మన యువతకు నూతన దర్శనాలను గాంచడానికి అవకాశం కల్పించ గలవు. ఈవిధముగా, మనమందరం కలిసి మన భవిష్యత్తును నిర్మించు కొనవచ్చును. కష్టాల అనుభవం నుండి పునరుద్ధరణ సాధ్యమేనని మీరు మార్గాన్ని చూపించాలి. ఇలాంటి అనుభవాలు మీకు ఒకటికన్న ఎక్కువే ఉన్నాయని నేను అనుకుంటున్నాను: మీ జీవితములో మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికిని, వాటన్నింటి నుండి బయటపడ గలిగారు. ఆ అనుభవాలను ఉపయోగించి, ఇప్పుడు కూడా ఎలా బయట పడాలో నేర్చుకొనండి.

కలలు, జ్ఞాపకాలతో ముడిపడి ఉంటాయి. నేను యుద్ధం అను బాధాకరమైన జ్ఞాపకం గురించి, శాంతి యొక్క విలువను యువతకు నేర్పించుటలో గల ప్రాముఖ్యతను గురించి ఆలోచిస్తున్నాను. మీలో యుద్ధ బాధను అనుభవించిన వారు ఈ సందేశాన్ని తప్పక యువతకు అందించాలి. జ్ఞాపకాలను సజీవముగా ఉంచడం, వాటిని ఇతరులతో పంచుకోవడం ప్రతీ వృద్ధ వ్యక్తి నిజ ప్రేషిత కార్యము. “షోవా” (యూదులపై నాజీల వినాశకర విధ్వసం) విపత్తునుండి బయట పడిన ఎడిత్ బ్రూక్, “ఒక్క మనసాక్షిని ప్రకాశింప చేసినను జ్ఞాపకాలను సజీవముగా ఉంచవచ్చు” అని చెప్పినది. ఆమె ఇంకా, “నాకు నా జ్ఞాపకాలే నా జీవితం” అని చెప్పింది. మా తాతల గురించి, అలాగే మీలో సర్వాన్ని విడిచి, ఓ నూతన భవిష్యత్తు కోసం ఆశతో వలస వెళ్లి పోవడం గురించి ఆలోచిస్తున్నాను. అది ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. అలాంటి వారిలో కొందరు ఇప్పటికి కూడా మన పక్షాన ఉండి మనపట్ల శ్రద్ధ వహించవచ్చు! ఇలాంటి జ్ఞాపకాలు, మరింత మానవీయమైన, స్వాగతించే ప్రపంచాన్ని నిర్మించడానికి సహాయపడతాయి. జ్ఞాపకాలు లేకుండా మనం నిర్మించలేము; పునాది లేకుండా ఒక ఇంటిని మనం ఎప్పటికీ నిర్మించలేము. జీవితానికి పునాది జ్ఞాపకాలు.

చివరిగా ప్రార్ధన. ఇప్పటికీ శ్రీసభకోసం ప్రార్ధన చేస్తూ దాని కొరకు కృషిచేయుచున్న పరిశుద్ధులు, వృద్ధులు అయిన పోపు బెనెడిక్టు ఒకసారి ఇలా అన్నారు, “అనేకమంది విపరీతమైన కార్యకలాపాల కన్న, వృద్ధుల ప్రార్ధన సమర్దవంతముగా ఈ లోకానికి సహాయం చేస్తూ కాపాడ గలదు.” అతను 2012వ సం.లో ఈ మాటలను చెప్పారు. దీనిలో ఎంతో భావం ఉన్నది. మీ ప్రార్ధన ఎంతో విలువైనది. శ్రీసభకు మన ప్రార్ధన ఊపిరి లాంటిది. ఇది శ్రీసభకు అత్యవసరం (సువార్తానందం, నం. 262). ముఖ్యముగా, మానవ కుటుంబము యొక్క మహమ్మారి కరోన కష్టసమయాలలో, ఈ తుఫాను సంద్రములో మనమందరం ఒకే పడవలో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నందు వలన, ప్రపంచం కొరకు, శ్రీసభ కొరకు మీ మధ్యవర్తిత్వ ప్రార్ధనలు ఎంతో విలువైనవి: త్వరలోనే అందరం తీరాన్ని సురక్షితముగా చేరుకుంటామనే నిర్మలమైన నమ్మకాన్ని అందరిలో ప్రేరేపిస్తుంది.

ప్రియమైన అమ్మమ్మ, నానమ్మ, తాతలారా, వృద్ధ స్నేహితులారా! ఈ సందేశాన్ని ముగిస్తూ, నేను ధన్యజీవి చార్లెస్ ది ఫౌకాల్ద్ (త్వరలో పునీతులు) జీవితాన్ని ఉదాహరణగా ప్రస్తావించాలని అనుకుంటున్నాను. అతను అల్జీరియా దేశములో మఠవాసిగా జీవించాడు. “తననుతాను అందరికీ సోదరుడిగా భావించాలి” అనే తన కోరికను తన జీవితముతో సాక్ష్యమిచ్చాడు (అందరూ సోదరులే, నం. 287). ఒక వ్యక్తి యొక్క ఏకాంతము అనే ఎడారిలో కూడా, ప్రపంచములోని పేదవారందరి కొరకు ప్రార్ధన చేయడం, అందరికీ సోదరుడుగా మారడం ఎలా సాధ్యమో ఆయన జీవిత గాధయే మనకు నేర్పిస్తుంది.

చార్లెస్ ది ఫౌకాల్ద్ వలె మనం కూడా పేదల బాధలకు మన హృదయాలను తెరచి వారి అవసరాల కొరకు ప్రార్ధన చేసేలాగున ప్రభువును వేడుకుంటున్నాను. నేడు మనకు వినిపింప బడిన “సర్వదా నేను మీతో నుందును” అను ఓదార్పు మాటలను మనం అందరికీ ముఖ్యముగా యువతకు తెలియ జేయడం మనలో ప్రతీ ఒక్కరం నేర్చుకోవాలి. ధైర్యముగా ముందుకు కొనసాగండి. ప్రభువు తన ఆశీర్వాదము మీకు అనుగ్రహించునుగాక.

పొప్ ఫ్రాన్సిస్
రోము, పునీత జాన్ లాథరన్ దేవాలయం, 31 మే 2021,
పరిశుద్ధ కన్యమరియమ్మ సందర్శన మహోత్సవము

No comments:

Post a Comment