28వ సామాన్య ఆదివారం A
యెషయ 25:6-10; ఫిలిప్పీ 4:12-14, 19-20; మత్త 22:1-14
పరలోక విందుకు ఆహ్వానం
“అతడు
తన విందుశాలకు నన్ను తోడుకొని వచ్చెను” (పరమగీతం 2:4).
క్రీస్తునందు
ప్రియ సహోదరీ సహోదరులారా! ఈరోజు 28వ సామాన్య ఆదివారం! నేటి వాక్యోపదేశానికి మీ
అందరకు ప్రేమపూర్వక ఆహ్వానం!
నేటి పఠనాలు పరలోక విందుకు దేవుని ఆహ్వానాన్ని
గుర్తుకు చేస్తున్నాయి. ఎంత గొప్ప శుభవార్త! తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పునరుద్ధరణ, నిరీక్షణ, దయ, సమృద్ధి, విముక్తి సందేశాన్ని ఇస్తున్నప్పటికీ, దేవుని ఆహ్వానానికి మన సరైన స్పందన ముఖ్యం అని నేటి పఠనాలు తెలియజేస్తున్నాయి.
మనలను
మనం ప్రశ్నించుకుందాం! దేవుని యొక్క ఆహ్వానాన్ని లేదా పిలుపును మనం చివరిసారిగా
ఎప్పుడు నిర్లక్ష్యం చేశాము? దేవుడు మనలను ప్రార్ధన
చేయమని, ఇతరులను క్షమించమని, కుటుంబముతో కలిసి సమయం గడపమని, పవిత్ర దివ్యపూజాబలిలో
పాల్గొనమని, దివ్యసప్రసాదమును స్వీకరించమని... ఈవిధంగా అనేక విషయాలలో దేవుడు మనలను
ఆహ్వానిస్తూ ఉంటాడు!
దేవుని
ఆహ్వానాన్ని త్రోసిపుచ్చడానికి, లేదా నిర్లక్ష్యం చేయడానికి మనకు అనేక కారణాలు
ఉండవచ్చు! సమయం లేదనే సాకుతో, ప్రార్థన చేయమన్న పిలుపును బహుశా మనం పక్కన పెట్టామేమో!
మనల్ని నొప్పించిన వారిని క్షమించమని అడిగినప్పుడు, లేదా మన పని కంటే కుటుంబముతో కొంత సమయం గడపమని కోరినప్పుడు... ఆదివారం
పవిత్ర దివ్యబలిపూజలో భక్తితో పాల్గొనమని పిలచినప్పుడు, అవసరంలో
ఉన్నవారికి సహాయం చేయమని అడిగినప్పుడు, మన జీవితంలోని
కష్టకాలంలో దేవునిపై నమ్మకం ఉంచమని దేవుడు పిలిచినప్పుడు... మనం నిర్లక్ష్యం చేశామేమో!
మనలో చాలామందిమి
దేవున్ని ఉద్దేశపూర్వకంగా తిరస్కరించము; కేవలం వాయిదా వేస్తుంటాము;
‘తర్వాత చూద్దాంలే’ అని మనకు మనం సర్దిచెప్పుకుంటాము. అయినప్పటికీ, నేటి పఠనాలు తన ప్రజలను ఎప్పటికీ ఆహ్వానిస్తూనే ఉండే దేవుడిని, ఆ పిలుపునకు స్పందించడంలో తరచూ విఫలమయ్యే
మానవత్వాన్ని మనకు తెలియజేస్తున్నాయి.
మొదటి పఠనం (25:6-10): దేవుడు
మనల్ని ఎందుకు ఆహ్వానిస్తున్నారో అర్థంచేసుకోవడానికి యెషయా గ్రంథం నుండి, నేటి
మొదటి పఠనం మనకు సహాయపడుతుంది.
యెషయా
ప్రవక్త ద్వారా దేవుడు మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నారు. అదేమిటంటే, దేవుడు మనకోసం ఒక దివ్యవిందును సిద్ధం చేస్తున్నారు.
యేసుక్రీస్తు ప్రభువు వారు రెండవ రాకడలో తిరిగి వచ్చినప్పుడు జరిగే పరలోక విందే
ఇది! ఈ విందులో మనం భాగస్తులు కావాలంటే, మనమందరం ఒక
ప్రత్యేకమైన ‘గుర్తు’ను కలిగి ఉండాలి. ఆ ప్రత్యేక గుర్తు ఏమిటంటే, ఎల్లప్పుడూ
దేవుని ఆలోచనలను కలిగి ఉండటం; దేవునితో మంచి అనుబంధాన్ని పెంపొందించుకోవడం మరియు
దైవానుసరణలో జీవించడం.
ఇహలోక
జీవితంలో మనం అనుభవిస్తున్న పేదరికం, అనారోగ్యాలు, ఇబ్బందులు మరియు అనేక రకాల సమస్యల వల్ల మన కళ్ళనుండి రాలిన కన్నీరంతా
శాశ్వతం కాదు. ఇదంతా కేవలం తాత్కాలికమే! “మృత్యువు సదా నాశనం చేయబడుతుంది” అని
దేవుని వాక్కు మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ లోకంలో ప్రాణం ఉన్నంతవరకు మన
శరీరంతో జీవించేటప్పుడు మృత్యువు మనలను తాకవచ్చు; అది మన
ఇహలోక జీవితాన్ని అంతం చేయవచ్చు. కానీ, పరలోక జీవిత
ఆహ్వానంలో, ఆ మృత్యువు స్వయంగా నాశనం చేయబడుతుంది. ఈ లోకంలో మనం ఎదుర్కొన్న
ఇబ్బందులు, కన్నీళ్లు అన్నీ తొలగిపోయి, నశించిపోయిన మన మట్టి శరీరము మహిమతో లేవనెత్తబడుతుంది. అప్పుడు, మనం పరలోక రాజ్య నిత్యజీవితంలో క్రీస్తు ప్రభువుతో పాటు నిరంతరం
నివసిస్తాము. ఇదే అసలైన పరలోక విందు.!
ఈ లోక
జీవితంలో మనం ఎదుర్కొంటున్న శ్రమలను చూసి ఎప్పుడూ కృంగిపోకుండా... దేవుని విందు
కొరకు ఓర్పుతో, ఓపికతో, విశ్వాసంతో
వేచి ఉందాం. మొదటి పఠనం ద్వారా, దేవుడు మనకు బయలు పరిచిన ఈ పరమ రహస్యాలను గ్రహించి,
వాటిని మన జీవితంలో ఆచరిద్దాం. దేవుని దివ్య ఆహ్వానానికి కట్టుబడి,
ఆయన విందులో మరియు రాకడలో పాలుపంచుకోవడానికి కావలసిన గట్టి
పట్టుదలను, కృపను ప్రసాదించమని ఆ సర్వశమంతుడైన దేవున్ని
వేడుకుందాం!
ఈవిధంగా, సహోదరీ సహోదరులారా! యేసు ప్రభువు, ఈ “పెండ్లి పిలుపు” ఉపమానం చెప్పడానికి శతాబ్దాల ముందే, యెషయా ప్రవక్త ప్రజలందరి కోసం దేవుడు ఒక గొప్ప
విందును సిద్ధం చేస్తున్న దర్శనాన్ని చూశాడు. అది ఏ ఒక్క దేశానికో, ఏ ఒక్క భాష వారికో, ఏ ఒక్క సంస్కృతికో పరిమితం కాదు;
సమస్త మానవాళి కోసం! ఆ విందులో “ప్రభువు సకల జాతిజనులు విచారముతో కప్పుకొనిన
ముసుగును, సకల ప్రజలను కప్పియున్న దు:ఖపు తెరను తొలగించును. మృత్యువును సదా నాశనం చేయును.
ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును.” కాబట్టి, ఇది కేవలం ఒక విందును గురించిన ఉపమానం
కాదు. ఇది మన పట్ల దేవుని కల, వాగ్దానం! గాయపడిన, సమాధానపడిన,
తన చుట్టూ చేరిన ఒక నూతన ప్రపంచపు దర్శనం అది! యేసు ఉపమాన రీతిగా విందు
గురించి మాట్లాడినప్పుడు, ఈ అందమైన దేవుని వాగ్దానాన్నే మనకు
గుర్తుచేస్తున్నారు. దేవుని ఆహ్వానం అనేది జీవము, ఆనందం,
స్వస్థత మరియు సహవాసాల వైపు నడిపించే పిలుపు, ఆహ్వానం.
ఈ మొదటి
పఠనంలో, మనం రెండు విషయాలను గమనించాలి: ఒకటి, ప్రభువు విందును “పర్వతం మీద”
సిద్ధం చేస్తున్నాడు. మరి మనం “ఆ పర్వతంపై” ఉన్నామా? దేవుని ఆహ్వానానికి స్పందనగా
“ఆ పర్వతంపైకి” అనగా “దేవుని సన్నిధికి” వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా? విశ్వాసంతో
కూడిన అడుగు దేవుని వైపు వేయడానికి సిద్ధముగా ఉన్నామా? రెండు, దేవుని
ఆహ్వానం “సకలజాతులకు”. ఆహ్వానంలో ఎలాంటి వివక్షత లేదు. ఎలాంటి భేదభావాలు, జాతి, కుల, వర్గ తారతమ్యాలు లేవు. మనలో ప్రతీ ఒక్కరు ఈ విందుకు ఆహ్వానితులే! అయితే
దేవుని ఆశీర్వాదాలను, అనుగ్రహాలను పొందడానికి “పర్వతంపై” అనగా “దేవుని సన్నిధిలో”
ఉండాలి.
నేటి 23వ
కీర్తన మంచి కాపరి యొక్క ప్రార్థన! అయితే 5వ వచనంలో, “నీవు నాకు విందు చేయుదువు” అని
చూస్తున్నాం! ప్రభువు కేవలం తన మందను నడిపించే కాపరి మాత్రమే కాదు; అతిథులను సాదరంగా ఆహ్వానించే వారు కూడా. మనం గాడాంధకారపు
లోయలో పయనించునపుడును, అనారోగ్యం, దుఃఖం,
ఒంటరితనం, నిరాశ, అనిశ్చితి
లేదా నష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు, ప్రభువు మనకు విందును
సిద్ధపరుస్తూనే ఉంటాడు. జీవితం కష్టతరమైనప్పుడు ప్రభువు ప్రేమ దూరమవ్వదు; ఆయన ఆహ్వానం మనకు ఎప్పుడూ ఉంటుంది.
రెండవ పఠనం: రెండవ పఠనంలో, అపొస్తలుడైన పౌలు, తన
స్వంత అనుభవం నుండి రెండు గొప్ప సత్యాలకు సాక్ష్యమిస్తున్నారు.
ఒకటి, “క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటిని చేయగలను” (ఫిలిప్పీ
4:13) అని అంటున్నాడు. “కలిమి లేములలో ఉండుట అననేమియో నాకు తెలియును” అని
అంటున్నాడు; అనగా, సమృద్ధిలో ఎలా బతకాలో, లేమిలో ఎలా నెగ్గుకు రావాలో
తనకు తెలుసని చెబుతున్నాడు. పౌలు తన జీవితంలో ఆకలిని, సంపదను,
సుఖాన్ని, కష్టాలను అనుభవించారు. అయినప్పటికీ,
లోకానికి అర్థం కాని ఒక రహస్యాన్ని పౌలుగారు కనుగొన్నాడు, అదే
“క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటిని చేయగలను” అని! రెండు,
“క్రీస్తు యేసునందలి తన మహిమైశ్వర్యముల కనుగుణముగా నా దేవుడు మీ అవసరములన్నింటిని
తీర్చును” అని అంటున్నాడు (ఫిలిప్పీ 4:19).
పౌలు
దేవుని ఆహ్వానాన్ని సంపూర్ణంగా అంగీకరించాడు. ఆయన వద్ద ఎక్కువ ఉన్నా క్రీస్తే చాలు, తక్కువ ఉన్నా క్రీస్తే చాలు’ అని జీవించాడు. ఆయన ‘ప్రశంసించబడినా
క్రీస్తే చాలు, శ్రమలు అనుభవించినా క్రీస్తే చాలు’ అని
జీవించాడు. ఈవిధంగా, ‘క్రీస్తుకు చెందడం ద్వారా వచ్చే శక్తిని’ పౌలుగారు
కనుగొన్నాడు.
కానీ మన
విషయానికి వస్తే... మనం ఒక్కో పరిస్థితిని బట్టి ఒక్కో విధంగా మారుతూ ఉంటాం: కష్టాలు
వచ్చినప్పుడు, ఇతరులను దూషిస్తాం; ఒక్కోసారి దేవుడిని కూడా
ప్రశ్నిస్తాం లేదా దూషిస్తాం; మనల్ని మనమే కష్టపెట్టుకుంటాం!
సుఖసంతోషాలలో ఉన్నప్పుడు, దేవుడిని పూర్తిగా మరచిపోతాం; మనకు ఇష్టమైన రీతిలో మాత్రమే జీవిస్తాం; కనీసం మన
పక్కన ఉన్నవారి దీనస్థితిని కూడా చూడము, పట్టించుకోము,
వారికి సహాయం చేయము!
దేవుని
నిజంగా మహిమ పరచాలంటే మనం ఆయన ఆజ్ఞలను పాటించాలి. దేవుడు మనకు ఇచ్చిన అపారమైన
కృపను మనం కూడా ఇతరులకు పంచుతూ జీవించాలి. ఇటువంటి నిస్వార్థ జీవితమే దేవుడు
మెచ్చే జీవన విధానం!
కాబట్టి,
మనము కూడా దేవుని ఆహ్వానానికి పూర్తిగా స్పందిస్తే, ఆయన రక్షణ కవచం ఎల్లప్పుడూ
మనతో ఉంటుంది. మనం కూడా క్రీస్తు యేసునందు ఉన్న యెడల, మన అవసరములన్నీ తీర్చబడతాయి.
క్రీస్తుతో మనకు ఉన్న సంబంధముపై మరియు ఆయన చిత్తానికి లోబడి ఉండటంపై ఆధారపడి
ఉంటుంది! దేవుని చిత్తానుసారంగా, ఇతరులకు మేలు చేసే మరియు
నిజమైన అవసరాలను దేవుడు తప్పక తీరుస్తాడు!
సువార్త పఠనం: దేవుడు తన విందుకు అందరినీ
ఆహ్వానిస్తున్నాడని తెలియజేయడానికి, యేసు ప్రభువు, నేటి సువార్త పఠనంలో, “పెండ్లి
పిలుపు” అను ఒక అద్భుతమైన ఉపమానాన్ని మన ముందుంచుతున్నారు.
ఒక రాజు తన కుమారుడి వివాహ విందును సిద్ధం చేస్తాడు. సమస్తం సిద్ధంగా ఉంది, విందు ఏర్పాటయింది, ఆహ్వానాలు
కూడా పంపబడ్డాయి. అయినప్పటికీ ఆహ్వానించబడిన అతిథులు రాలేదు. కొందరు తమ పొలాల
పనుల్లో నిమగ్నమయ్యారు, మరికొందరు వ్యాపారాలతో బిజీగా
ఉన్నారు, ఇంకొందరు రాజు పంపిన సేవకులను చిన్నచూపు చూసి
అవమానించారు. యేసు కేవలం ఒక పెండ్లి కథను లేదా పెండ్లి విందును గూర్చి మాత్రమే చెప్పడం లేదు. దేవుని వాగ్దానాలను
ఎరిగినప్పటికీ, తన కుమారుని ద్వారా వచ్చిన
దేవుని ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్న వారితో ఆయన మాట్లాడుతున్నారు. చరిత్ర అంతటా
దేవుడు పంపిన ఎందరో దూతలకు, ఈ సేవకులు ప్రతీకలుగా ఉన్నారు. ఈ ‘పెండ్లి విందు’ అనేది దేవుడు తన ప్రజలతో పంచుకోవాలని పరితపించే ‘పరలోక
రాజ్యానికి’ సూచనగా ఉంది. ప్రజలు దేవుని ఆహ్వానాన్ని ఇతర విషయాలన్నింటికంటే తక్కువ
ప్రాధాన్యమైనదిగా చూసారు!
మనం
కూడా లౌకిక విషయాల కోసం పాకులాడే క్రమంలో, మనలో చాలామంది మొదటి ఆహ్వానితుల వలె
దేవుని ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నాము లేదా నిర్లక్ష్యం చేస్తున్నాము. దేవుని
‘పర్వతానికి’, ‘దేవుని సన్నిధికి’ రావడానికి మనకు సమయం లేదు, ప్రార్థనకు అసలు సమయం దొరకదు, కానీ
లౌకిక విషయాల కోసం మాత్రం మన దగ్గర సమయం ఉంటుంది. పొలం ఉండటం తప్పు కాదు, వ్యాపారం చేయడం కూడా తప్పు కాదు. అసలు విషయం ఏమిటంటే, పొలం పనులు, వ్యాపార
పనులు, దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. మనలో చాలామంది
దేవున్ని ద్వేషించడం వల్ల విశ్వాసాన్ని కోల్పోవడం లేదు; బహుశా
దేవుని కోసం సమయం కేటాయించక... మన పనులలో బిజీగా ఉండిపోవడం వల్ల...
విశ్వాసాన్నికోల్పోయే అవకాశం ఉంది!
జీవనోపాధి
సంపాదనలో పడి, బ్రతకడమే మర్చిపోతున్నాం. భవిష్యత్తును ప్లాన్ చేసుకునే హడావుడిలో,
మన ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నాం. ఫోన్లతో కాలం గడుపుతూ, పక్కన ఉన్నవారినికూడా
పట్టించుకోవడం లేదు. ఎన్నో పనులతో బిజీగా మారి, అన్నింటికీ అర్థాన్నిచ్చే ఆ ఏకైక దేవునికి మన జీవితంలో చోటు లేకుండా
చేస్తున్నాం.
ఈ
రోజుల్లో చాలామంది తాము ఒంటరిగా మోయకూడని బరువులను మోస్తూ అలసిపోతున్నారు. తమ
ఆందోళనలను, భయాలను, నిరాశలను,
గాయాలను ఒంటరిగా మోస్తున్నారు. తమ పిల్లల గురించిన బెంగ, భవిష్యత్తు గురించిన చింత, ఆరోగ్యం, ఆర్థిక విషయాల
గురించిన భయాలను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. అయితే దేవుని ఆహ్వానం ఖచ్చితం: “నా
వద్దకు రండి. నాతో నడవండి. నేను మిమ్మల్ని బలపరుస్తాను. మీకు విందును
సిద్ధపరుస్తాను. మిమ్మల్ని స్వస్థపరుస్తాను” అని ఆహ్వానిస్తున్నారు. దేవుని
ఆహ్వానం అనేది మనపై మోపే మరొక భారం కాదు; మనం ఇప్పటికే
మోస్తున్న భారాలకు అది చక్కటి పరిష్కారం.
మనం
బిజీగా ఉన్నందువల్ల బహుశా దేవునికి దూరంగా ఉంటున్నామేమో! లేదా మనం అర్హులం కాదనే
భావనతో దూరంగా ఉంటున్నామేమో! చెడిపోయిన సంబంధాలు, వైఫల్యాలు, తప్పుడు నిర్ణయాలు, గత పాపాలను
తలచుకుంటాము. మనలో మనమే, మనకు ఇంకా దేవుని హృదయంలో చోటుందా
అని సంశయిస్తాము. నేటి సువార్త దానికి స్పష్టమైన సమాధానం ఇస్తుంది. రాజు పదే పదే
ఆహ్వానాలు పంపుతూనే ఉన్నాడు. మన గురించి సమస్తం తెలిసినప్పటికీ, దేవుడు మనల్ని తన ‘విందుకు’ రమ్మని కోరుకుంటున్నాడు. ఈ ఆహ్వానం
పరిపూర్ణులైన వారి కోసం కాదు; రావడానికి సిద్ధంగా ఉన్న ప్రతి
ఒక్కరి కోసం. మనం ఎంత దూరంగా వెళ్లిపోయినప్పటికీ, ప్రభువు
మనల్ని వెనక్కి పిలుస్తూనే ఉన్నాడు.
సువిషేశములో
వింటున్నట్లుగా, అప్పుడు ఆ ప్రభువు కోపగించి, తన సైన్యమును పంపి, ఆ
హంతకులను హతమార్చి, వారి పట్టణాన్ని తగలబెట్టించాడు. ఆ తర్వాత తన సేవకులను పిలిచి,
“నా విందు సిద్ధముగా ఉన్నది, కానీ నేను
మొదట ఆహ్వానించిన వారు దానికి యోగ్యులు కారు; కాబట్టి మీరు
వీధి మార్గములకు వెళ్లి మంచి చెడు తేడా లేకుండా కంటబడిన వారందరినీ పిలుచుకొని
రండు” అని పంపాడు. ఆ సేవకులు పురవీధులలోనికి వెళ్లి
అందరినీ తీసుకొని వచ్చి ఆ కళ్యాణ మండపమును అతిథులతో నింపారు.
ప్రతి
ఆదివారం దేవుడు తన ప్రజల కోసం ఒక విందును సిద్ధం చేస్తాడు. ప్రతి ఆదివారం ఆయన
వేర్వేరు దేశాలు, భాషలు, సంస్కృతుల నుండి
ప్రజలను ఒక్కచోట చేర్చుతాడు. ప్రతి ఆదివారం ఆయన తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు
మరియు క్రీస్తు తన దివ్య శరీరరక్తాలతో మనకు పోషణనిస్తాడు. దివ్యబలిపూజ అనేది కేవలం
నెరవేర్చవలసిన ఒక బాధ్యత మాత్రమే కాదు. అది స్వీకరించవలసిన ఒక ఆహ్వానం. మనం
ప్రేమించబడ్డామని, స్వాగతించబడ్డామని, జ్ఞాపకం
చేసుకోబడ్డామని దేవుడు మనకు ప్రతి వారం అందించే సుందరమైన జ్ఞాపిక ఇది. విందు కోసం
ప్రజలను ఆహ్వానించడానికి సేవకులు పదేపదే పంపబడుతున్నారు. అదే సంఘం యొక్క శాశ్వతమైన
సేవ. ఈ ఆహ్వానాన్ని అందుకున్న మనం, ఆ ఆహ్వానాన్ని ఇతరులకు
అందించే దూతలుగా పిలువబడుతున్నాము.
నేటి మన
ప్రపంచం ఒంటరితనంతో, గాయాలతో, నిరుత్సాహంతో, అర్థం కోసం వెతుకుతున్న ప్రజలతో నిండి
ఉంది. కొన్నిసార్లు సువార్త ప్రకటన చాలా సరళమైన మాటలతో మొదలవుతుంది: “రండి,
ప్రార్థన చేద్దాం.” “నాతో పాటు పూజకి రండి.” “వచ్చి చూడండి.”
ప్రభువు తన విందు శాలయైన దేవాలయాన్ని నింపాలని కోరుకుంటున్నాడు, అందుకే ఇతరులను తీసుకువచ్చేలా ఆయన మనల్ని పంపుతున్నాడు.
ఉపమానములో,
ఎందుకు ఒక వ్యక్తి బయటకి గెంటివేయబడ్డాడు? ఎందుకన “వివాహ వస్త్రము” లేకయే పెండ్లి
విందుకు వచ్చాడు. ఆనాటి కాలములో, అందరికీ “వివాహ వస్త్రము” ఉచితముగా ఇవ్వబడుతుంది.
కాని ఆ వ్యక్తి దానిని ధరించడానికి నిరాకరించాడు. ఇది రాజుకు చేసిన తీవ్రమైన
అవమానం. ఉపమానములో రాజు తన అతిథుల కోసం వివాహ వస్త్రాలను అందించినట్లే, దేవుడు మానవజాతికి విశ్వాసాన్ని మరియు రక్షణను అందించాడు.
క్రీస్తు యేసులో మరియు ఆయన ద్వారా వీటిని మనకు ఉచితంగా అందుబాటులో ఉంచాడు. వాటిని
ధరించడానికి నిరాకరించడం అంటే విందును కోల్పోవడమే! దేవుని పర్వతం మీద “విడులో”
పాల్గొనుటకు, మర్యాద, మంచి ప్రవర్తన, విశ్వాసము,
భక్తి, విధేయత ఉండాలి.
ఈ ఉపమానం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు:
1. అందరికీ
పిలుపు: ప్రియ విశ్వాసులారా! దేవుని పిలుపు అందరికీ ఉంది. గొప్పవారికి ఉంది, దీనులకు ఉంది, పాపులకు కూడా
ఉంది. ఎట్టి విభేదమూ లేకుండా సమస్త ప్రజలకు దేవుని ఆహ్వానం అందుబాటులో ఉంది.
2. బాధ్యతాయుతమైన జీవితం: దేవుని
పిలుపును, ఆయన అప్పగించిన బాధ్యతను ఎవరైతే
గౌరవంతో, బాధ్యతతో నెరవేరుస్తారో వారే సన్మానింపబడతారు. దేవుని
ఆజ్ఞలను పాటిస్తూ, ఆయన ప్రణాళికను నెరవేరుస్తూ, దైవానుసరణలో ఉండే వారందరూ ఆ విందుకు యోగ్యులే. ఎటువంటి నిర్లక్ష్యం
చేయకుండా వారు ఆ విందులో పాలుపంచుకుని ఆనందిస్తారు.
3. పరలోక రాజ్య విందు: ఈ
ఉపమానంలో ‘విందు’ అనగా పరలోక రాజ్య ఆహ్వానమే! దేవుని పిలుపును మనం నిర్లక్ష్యం
చేస్తే కాలం చెల్లిపోతుంది; దేవుడు తెరిచిన పరలోక
తలుపులు మూసుకుపోతాయి. కాబట్టి, మన సొంత ఆలోచనలను పక్కన
పెట్టి, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను భక్తిశ్రద్ధలతో
నెరవేర్చాలి.
4. ఇహలోక బాధ్యతలు: మన ఉద్యోగ బాధ్యతలను, కుటుంబ బాధ్యతలను, దేవుని సేవా
బాధ్యతలను సరైన రీతిలో నిర్వర్తించాలి. వాటిని విస్మరించి ప్రక్కదారులు పడితే అది
దేవుని ప్రణాళికను నెరవేర్చినట్లు కాదు.
5. పెండ్లి వస్త్రం మరియు మన నీతివంతమైన జీవితం: పెండ్లి విందు ఉపమానంలో మొదటిగా ఎంపికచేయబడిన వారు తమ అహంభావం వల్ల ఆ
విందులో పాలుపంచుకోలేకపోయారు. మనకు పరలోక భాగ్యమును దయచేయడానికి దేవుడు తన ఏకైక
కుమారుని భూమికి పంపిస్తే, మనం ఆ దైవకుమారుని సిలువ
వేసి చంపాము.
పెండ్లి
విందులో రాజు వివాహ వస్త్రం లేని వానిని చూసి, కాళ్లు చేతులు కట్టివేసి చీకటిలోనికి త్రోసివేయమని ఆజ్ఞాపించాడు - అదే
నరకము. ఇక్కడ మన వివాహ వస్త్రం అనగా మన ‘నీతివంతమైన జీవితమే!’ నీతి, న్యాయం, నియమం, విలువలు మరియు
దైవాజ్ఞలను పాటించకపోతే నిత్య నరకాగ్నిని అనుభవించాల్సిందే.
ముగింపు - పిలుపు: దేవుడు మనకు ఒకే హెచ్చరికను, సరిదిద్దుకునే అవకాశాన్ని ఇస్తున్నారు. దైవరాజ్య
ఆహ్వానంలో మనం ఉండాలన్నా, అందులో ఆనందించాలన్నా దేవుని
అనుసరణే ప్రధానం. దేవుడు ప్రతి ఒక్కరికీ ఒక్కో ప్రత్యేకతను దయచేశారు. ఆ
ప్రత్యేకతను అసమర్థతతో పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా జీవించ కూడదు. చివరి శ్వాస
వరకు దేవుని అనుసరణే ప్రధానంగా భావించి... నీతిని, న్యాయమును,
ప్రేమను, సాటివారి యెడల సహాయక గుణమును,
సహనమును, ఓర్పును, దేవునియందు
భక్తి విశ్వాసములను కలిగి జీవిద్దాం. అప్పుడు, పిలువబడిన
అనేకులలో ఎన్నుకోబడిన కొందరిలో మనము తప్పనిసరిగా ఉంటాము!
మనం ఈ
దివ్యబలిని జరుపుకుంటున్నప్పుడు, మనం మొదలుపెట్టిన ప్రశ్నను
మరొకసారి అడుగుదాం, ‘దేవుని యొక్క ఆహ్వానాన్ని లేదా పిలుపును మనం చివరిసారిగా
ఎప్పుడు నిర్లక్ష్యం చేశాము?’ బహుశా ఆ ఆహ్వానం నేడు మళ్లీ మన
వద్దకు వస్తోందేమో! ప్రార్థించడానికి, క్షమించడానికి,
సమాధానపడటానికి, నమ్మకం ఉంచడానికి, సేవ చేయడానికి, తిరిగి రావడానికి, ప్రేమించడానికి ఒక
పిలుపు ఇది! దేవుడు మనలను ఆహ్వానించడం ఎప్పటికీ ఆపలేదనేదే నేటి వాక్యాల ద్వారా
మనకు అర్ధమగుచున్నది. విందు సిద్ధంగా ఉంది; తలుపులు తెరచి ఉన్నాయి, ప్రభువు వేచి చూస్తున్నాడు. దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడా లేదా అనేది
ప్రశ్న కాదు, మనం ఆయన పిలుపునకు, ఆహ్వానానికి స్పందిస్తామా
లేదా అనేదే ప్రశ్న! నేడు మన సమాధానం ఎంతో సరళంగా, వినయంగా,
హృదయపూర్వకంగా ఉండాలి: “ప్రభువా, నేను
వస్తున్నాను” అని!
ముగింపు: దేవుని విందులో నిత్యజీవమును సొంతం చేసుకుందాం!
ఈ
సృష్టిలో జీవించిన ప్రతి ఒక్కరూ దేవుని విందుకు ఆహ్వానింపబడినవారే! కానీ ఆ దివ్య
విందులోకి, కోరబడిన ఆ ప్రత్యేక వస్త్రంతో
(నీతివంతమైన జీవితంతో) ప్రవేశించాలంటే మాత్రం మనం పూర్తిగా దేవుని కనుసన్నలలో,
ఆయన మార్గంలో జీవించాలి. దేవుని ఆహ్వానమునకు తగిన పవిత్రమైన
జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. విచ్చలవిడితనంతో కూడిన, ఇష్టానుసారమైన
లేదా స్వార్థపరమైన జీవితం ఎప్పుడూ దేవుని పిలుపునకు తగినది కాదు. అయితే, ఎటువంటి జీవితం దేవుని పిలుపునకు అంకితమై ఉందో మన అంతరాత్మకు బాగా తెలుసు!
నీతి మార్గమే పరలోక మార్గం! అటువంటి నీతి మార్గంలో నడుస్తూ, దేవుడు
మన కొరకు ప్రత్యేకంగా ఏర్పరిచిన పరలోక రాజ్య నివాస స్థలమునకు చేరుకుందాం.
“దేవా!
నీవు ఎన్నుకునే ఆ పవిత్ర గుంపులో నేనూ ఉండాలి; నా జీవితాన్ని నీ చేతులలోకి తీసుకుని, నీ ఆజ్ఞలలో,
నీ వాక్కులో నన్ను తీర్చిదిద్దు నాయనా!” అని ఆ దేవాది దేవుని
వేడుకుందాం. దేవుని పరలోక విందులో, ఆ తీర్పు దినాన నిలబడి
విజయం సాధించి, నిత్య జీవములోనికి ప్రవేశమును పొందుకుందాం.
“నేను
దైవ రాజ్యమునకు చేరుకోవాలి” అనే ఈ పవిత్రమైన తపనను, సంకల్పాన్ని దేవుడు మన జీవితంలో తప్పక నెరవేరుస్తారు. ఆ పరలోక భాగ్యమును
పొందే గొప్ప ఆశతో, ఓర్పుతో, భక్తి
విశ్వాసాలతో ముందుకు సాగిపోదాం.
ఆమేన్!
No comments:
Post a Comment