లూకా 8:16-18 దీపపు వెలుగు

లూకా 8:16-18 - దీపపు వెలుగు

లూకా 8:16-18. యేసు ఈ లోకమునకు వెలుగు. తనను అనుసరించు వారందరిని (ఆయన శిష్యులు) ఈ లోకమునకు వెలుగు ప్రసాదించు సాధనములుగా మలిచారు. వెలుగు 'జీవము'నకు గురుతు. వెలుగు అంధకారమును పారద్రోలుతుంది. వెలుగు 'దైవసన్నిధి', 'చట్టం', 'సత్కార్యముల'కు కూడా సూచిస్తుంది. నేటి సువిషేశములో, దీపము ఎలా వెలుగు నిచ్చునో, మన వెలుగు జీవితాలద్వారా, అనగా సత్కార్యముల వలన, ఇతరుల జీవితాలలో వెలుగును నింపాలని కోరుచున్నారు. అనగా, మనం క్రీస్తుకు, ఆయన వెలుగుకు సాక్షులముగా జీవించాలి. మత్తయి 5:16లో ప్రభువు చెప్పినట్లుగా, “ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోక మందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి యెదుట ప్రకాశింపనిండు.” 

మన విశ్వాసమే ఆ వెలుగు; మన విశ్వాసపు వెలుగుతో మనం నివసించే ఈ లోకమును క్రీస్తు జ్యోతితో వెలిగించాలి, పునరుద్ధరణ గావించాలి. సత్కార్యములు అనగా, క్రైస్తవ ప్రేమలో జీవించడం. ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించడం. అలా జీవించినప్పుడు, ఆ ప్రేమ, మన దయాపూరిత కార్యములద్వారా వ్యక్తపరచ బడుతుంది. త్యాగపూరితమైన సేవాభావముతో జీవించాలి. అలాంటివారు ఈ లోకమునకు వెలుగు కాగలరు. 

దీపము 'దేవుని వాక్యము'ను సూచిస్తుంది. అదియే క్రీస్తు ఈ లోకమునకు కొనివచ్చిన రక్షణ వెలుగు, రూపాంతరం చేయు వెలుగు. కనుక దాచబడిన సందేశం బయలు పరచ బడును. క్రీస్తు ఉత్థానంతో, ఆయన శిష్యులు సంపూర్ణ సందేశాన్ని గ్రహించ గలిగారు. అప్పుడు వారు ఆ సందేశమును లోకమునకు ప్రకటించిరి. లోకమునకు వెలుగుగా మారిరి. కనుక, నేడు మనం కూడా ఆ వాక్కును ప్రకటించాలి, బోధించాలి.

“ఉన్నవానికే మరింత ఒసగబడును” (8:18). మనం క్రీస్తుకు విశ్వాసపాత్రముగా ఉన్నచో, దైవరాజ్యమునకై పాటుబడినచో, మనలను అధికమధికముగా దీవించును. దేవుడు మనకొసగిన వరములను ఇతరులతో పంచుకోవాలి.

మనలోని ‘వెలుగు’ను దాచవద్దు (8:16). ఇతరులకు ప్రకాశింప జేయాలి. మనం మనలో ఉన్న దేవుని వాక్యాన్ని, ప్రేమను ఇతరులకు పంచకపోతే అది నిరుపయోగం అవుతుంది. మన జీవితాన్ని ఇతరులకు సేవ చేయడానికి, సాక్ష్యం ఇవ్వడానికి ఉపయోగించినప్పుడు, మనం దీపస్తంభం మీద ఉన్న దీపంలా ప్రకాశిస్తాం.

సత్యం బయలుపడును (8:17). మన జీవితంలో మనం చేసే మంచి, చెడు క్రియలన్నీ దేవుని ముందు బయటపడక తప్పదు. చివరికి, మన హృదయాలలో దాగి ఉన్న రహస్యాలన్నీ బయటపడతాయి. ఈ వాక్యం మనకు భయాన్ని కలిగించకూడదు, బదులుగా మన జీవితాన్ని దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించడానికి ఒక హెచ్చరికగా ఉండాలి. దేవునికి భయపడి, మన జీవితాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి ఇది మనకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది.

దేవుని వాక్యాన్ని వినాలి, పాటించాలి (8:18). మీరు ఎట్లు వినుచున్నారో గమనింపుడు” అనే మాటలు చాలా ముఖ్యం. ఇది కేవలం వినడం కాదు, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఎలా స్వీకరిస్తున్నామో, దానికి ఎలా స్పందిస్తున్నామో కూడా సూచిస్తుంది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని, దాన్ని మన జీవితంలో అన్వయించుకుంటే, దేవుడు మనకు ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని, కృపను అనుగ్రహిస్తాడు. అదేవిధంగా, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, మనకు ఉన్నదని మనం అనుకున్న ఆధ్యాత్మిక జ్ఞానం కూడా మన నుండి తీసివేయబడుతుంది. ఇది దేవుని వాక్యం పట్ల మనం ఎంత బాధ్యతగా ఉండాలో తెలియజేస్తుంది.

No comments:

Post a Comment