పరిశుద్ధ
పొప్ ఫ్రాన్సిస్ గారి
వేదవ్యాపక
ఆదివార సందేశము
19
అక్టోబరు 2025
“సకల
ప్రజల నిరీక్షణకు మిషనరీలమై ఉందాం”
ప్రియ సహోదరీ సహోదరులారా!
నిరీక్షణ
అనే అంశముతో కొనసాగుతున్న 2025 జూబిలీ సంవత్సరములోని వేదవ్యాపక ఆదివారమునకు నేను
ఎన్నుకున్న నినాదం: “సకల ప్రజల నిరీక్షణకు మిషనరీలమై ఉందాం”. ప్రతి క్రైస్తవునికీ,
జ్ఞానస్నానం పొందినవారికీ, సకల శ్రీసభకు ఇది ఒక ప్రాథమిక పిలుపుని
గుర్తు చేస్తుంది. క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తూ, ఆశకు
దూతలుగా, ఆశను నిర్మించేవారిగా ఉండటమే ఆ పిలుపు.
పునరుత్థానుడైన క్రీస్తు ద్వారా “సజీవమగు నిరీక్షణలోకి” మనకు నూతన జన్మను
ప్రసాదించిన విశ్వసనీయుడైన దేవుని కృపతో నిండిన సమయమిదని నేను నమ్ముచున్నాను (1
పేతు 1:3-4). క్రైస్తవ మిషనరీ గుర్తింపుకు సంబంధించిన కొన్ని
ముఖ్యమైన విషయాలను నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. తద్వారా, ప్రపంచాన్ని
ఆవరించిన చీకటి నీడలను తొలగించి (ఫ్రతెల్లి తుత్తి, 9-55), ఆశను
పునరుద్ధరించడానికి పంపబడిన సంఘంలో ఒక నూతన సువార్త కాలం కోసం దేవుని ఆత్మచే
నడిపించబడి, పవిత్రమైన ఉత్సాహంతో రగిలిపోగలం.
1. మన నిరీక్షణయగు
క్రీస్తు అడుగుజాడల్లో
2000
పవిత్ర సంవత్సరం తర్వాత, మూడవ సహస్రాబ్దపు మొదటి సాధారణ జూబిలీని
మనం జరుపుకుంటున్నాం. ఈ సమయంలో, మన దృష్టిని చరిత్రకు కేంద్రబిందువు అయిన,
“నిన్న, నేడు, ఎల్లప్పుడు ఒకే రీతిగ ఉన యేసుక్రీస్తుపై”
(హెబ్రీ 13:8) నిలపాలి. నజరేతులోని యూదుల ప్రార్థనా మందిరంలో,
యేసు “నేడు” లేఖనము నెరవేరినదని ప్రకటించారు. దీని ద్వారా, ఆయన
తండ్రిచే పంపబడి, పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవుని రాజ్య సువార్తను
ప్రకటించి, సమస్త మానవాళికి “ప్రభుహితమైన
సంవత్సరమును” ప్రకటించుటకు అని వెల్లడించారు (లూకా 4:16-21).
ఈ
ఆధ్యాత్మికమైన “నేడు” (ఈరోజు),
లోకాంతం వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో క్రీస్తు అందరికీ, ముఖ్యంగా
దేవుడే తమ ఏకైక ఆశగా ఉన్నవారికి, రక్షణకు సంపూర్ణతగా ఉన్నారు. ఆయన తన భూలోక
జీవితంలో “సమస్తాన్ని మంచిగా చేస్తూ, చెడు నుండి మరియు దుష్టశక్తి నుండి
అందరినీ స్వస్థపరుస్తూ” పర్యటించారు (అ.కా. 10:38). తద్వారా
నిరుపేదలకు, ప్రజలకు దేవునిపై ఆశను తిరిగి నింపారు. పాపం మినహా, మన
మానవ బలహీనతలన్నింటినీ ఆయన అనుభవించారు. గెత్సెమనే తోటలో పడిన వేదన, సిలువపై
అనుభవించిన బాధ వంటి నిరాశ కలిగించే కష్ట సమయాలను కూడా ఆయన చవిచూశారు. అయినప్పటికీ,
మానవాళి రక్షణకు, భవిష్యత్తులో శాంతిని అందించడానికి (యిర్మీయా 29:11)
తండ్రియైన దేవుడు వేసిన ప్రణాళికపై విధేయతతో, నమ్మకంతో
అన్నింటినీ ఆయనకు అప్పగించారు. ఈ
విధంగా, క్రీస్తు ఆశకు ఒక దైవిక మిషనరీగా మారారు. ఎటువంటి
కఠినమైన పరీక్షల మధ్యనైనా దేవుడు తమకు అప్పగించిన మిషన్‌ను నిర్వర్తించే శతాబ్దాల
నాటి మిషనరీలందరికీ ఆయన ఒక గొప్ప ఆదర్శంగా నిలిచారు.
తన
శిష్యుల ద్వారా, సకలప్రజల యొద్దకు పంపబడిన, మరియు
ఆధ్యాత్మికంగా వారితో ఉన్న ప్రభువైన యేసు, మానవాళికి ఆశను అందించే తన సేవను
కొనసాగిస్తున్నారు. ఆయన ఇప్పటికీ పేదవారిపైనా, బాధలో
ఉన్నవారిపైనా, నిరాశలో ఉన్నవారిపైనా, అణగారినవారిపైనా,
“వారి గాయాలపై ఓదార్పు అనే తైలమును, ఆశ అనే
ద్రాక్షారసాన్ని” పోస్తూ ఉంటారు (ప్రెఫేస్ “యేసు మంచి
సమరయుడు”). ప్రభువు, నాయకుడైన క్రీస్తుకు విధేయత చూపుతూ,
అదే సేవాస్ఫూర్తితో, శ్రీసభయైన క్రీస్తు
మిషనరీ శిష్యుల సంఘం, తన మిషన్‌ను కొనసాగిస్తుంది. జాతుల మధ్య తన
జీవితాన్ని అందరి కోసం అంకితం చేస్తుంది. అనేక హింసలు, కష్టాలు,
శ్రమలను ఎదుర్కొంటూ, మరియు తోటివారి బలహీనతల వల్ల కలిగే అసంపూర్ణతలు,
వైఫల్యాలు ఉన్నప్పటికీ, శ్రీసభ క్రీస్తు ప్రేమతో నిరంతరం ముందుకు
సాగుతుంది. ఆయనతో ఏకమై తన మిషనరీ ప్రయాణాన్ని కొనసాగించడానికి, మరియు
ఆయన వలె, ఆయనతో కలిసి బాధలో ఉన్న మానవాళి యొక్క మొరను,
నిశ్చయమైన విమోచన కోసం ఎదురుచూస్తున్న ప్రతి ప్రాణి యొక్క ఆక్రందనను
వినడానికి ప్రోత్సహించబడుతుంది. ప్రభువు ఎల్లప్పుడూ పిలిచే సంఘం ఇదే: “స్థిరంగా ఉండే సంఘం కాదు, కానీ
తన ప్రభువుతో కలిసి ప్రపంచ వీధుల్లో నడిచే ఒక మిషనరీ సంఘం” (పీటాధిపతుల
సినోడ్ సాధారణ సభ ముగింపు దివ్యబలిపూజలో ఉపన్యాసం, అక్టోబర్
27, 2024).
మనమంతా
ప్రభువైన యేసు అడుగుజాడల్లో నడవడానికి ప్రేరణ పొందుదాం. తద్వారా, ఆయనతో,
ఆయనలో మనం అందరికీ, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి చోట, ప్రతి
పరిస్థితిలో ఆశకు చిహ్నాలుగా, దూతలుగా మారగలం. జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరూ
క్రీస్తు యొక్క మిషనరీ శిష్యులుగా, ఆయన ఆశను భూమి నలుమూలలా ప్రకాశింపజేయాలి!
2. క్రైస్తవులు: సకల ప్రజల ఆశకు వాహకులు, నిర్మాణకర్తలు
తాము కలిసే ప్రజల జీవిత పరిస్థితులను పంచుకోవడం, సువార్తను అందించడం కొరకై ప్రభువైన క్రీస్తును
అనుసరించే క్రైస్తవులు పిలువబడి యున్నారు. దీనివల్ల వారు ఆశకు వాహకులుగా, నిర్మాణకర్తలుగా మారతారు. నిజానికి, “ఈ కాలపు ప్రజల ఆనందాలు, ఆశలు, దుఃఖాలు, వేదనలు, ముఖ్యంగా పేదవారివి, బాధలో ఉన్నవారివి అన్నీ క్రీస్తును
అనుసరించేవారివిగా కూడా ఉంటాయి. నిజమైన మానవ జీవితంలో ఉన్న ఏది కూడా వారి హృదయాలలో
ప్రతిధ్వనించకుండా ఉండదు” (గౌడియమ్ ఎట్ స్పేస్ 1). ద్వితీయ వాటికన్ మహాసభ యొక్క ప్రసిద్ధ ప్రకటన, ప్రతి శతాబ్దపు క్రైస్తవ సమాజాల భావన మరియు విధానాన్ని
ప్రతిబింబిస్తుంది. ఇది ఇప్పటికీ వారి శ్రీసభ సభ్యులను ప్రేరేపిస్తూ, ప్రపంచంలో వారి సోదర సోదరీమణులతో కలిసి నడవడానికి సహాయపడుతుంది. ఇక్కడ
నేను ప్రత్యేకంగా ‘ఆద్ జెంతెస్’ మిషనరీలు అయిన మీ గురించి
ఆలోచిస్తున్నాను. ప్రభువు పిలుపును అనుసరించి, మీరు ఇతర దేశాలకు వెళ్ళి, క్రీస్తులో ఉన్న
దేవుని ప్రేమను తెలియజేస్తున్నారు. దీనికోసం మీకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు
తెలుపుతున్నాను! పునరుత్థానం చెందిన క్రీస్తు తన శిష్యులను సకల ప్రజలకు సువార్తను
బోధించమని పంపిన ఆదేశానికి (మత్త 28:18-20) మీ జీవితాలు ఒక స్పష్టమైన ప్రతిస్పందన. ఈ విధంగా, మీరు పరిశుద్ధాత్మ శక్తితో, నిరంతర కృషి ద్వారా, జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరికీ ఉన్న సార్వత్రిక పిలుపుకు
చిహ్నాలుగా మారారు. మీరు సకల ప్రజలలో మిషనరీలుగా, అలాగే ప్రభువైన యేసు మనకిచ్చిన గొప్ప ఆశకు సాక్షులుగా నిలిచారు.
ఈ ఆశ యొక్క పరిధి ఈ ప్రపంచంలోని అశాశ్వతమైన విషయాలను అధిగమించి,
మనం ఇప్పటికే పాలుపంచుకుంటున్న దైవిక వాస్తవాల
వైపు తెరుచుకుంటుంది. వాస్తవానికి, పునీత ఆరవ పాల్ గారు గమనించినట్లుగా,
దేవుని దయ యొక్క వరంగా శ్రీసభ అందరికీ అందించే
క్రీస్తులోని రక్షణ కేవలం “భౌతిక లేదా ఆధ్యాత్మిక అవసరాలను తీర్చే ఒక అంతర్గతమైనది
మాత్రమే కాదు... ఇది తాత్కాలిక కోరికలు, ఆశలు, వ్యవహారాలు మరియు పోరాటాలలో పూర్తిగా నిమగ్నమై లేదు. దాని బదులు,
అది అటువంటి పరిమితులన్నింటినీ దాటి, ఏకైక, నిరపేక్షమైన దేవునితో సహవాసంలో
సంపూర్ణతను పొందుతుంది. ఇది అతీతమైన మరియు అంతిమమైన రక్షణ. ఈ రక్షణ నిజానికి ఈ
జీవితంలోనే మొదలవుతుంది, కానీ నిత్యత్వంలో నెరవేరుతుంది”
(ఎవాంజెలీ నున్షియాంది, 27).
ఈ గొప్ప ఆశతో ప్రేరేపించబడి, క్రైస్తవ
సమాజాలు ఒక నూతన మానవాళికి దూతలుగా మారగలవు. అత్యంత “అభివృద్ధి చెందిన” ప్రాంతాలలో కూడా ప్రపంచం
తీవ్రమైన మానవ సంక్షోభ లక్షణాలను కలిగియుంది: విస్తృతమైన అయోమయం, ఒంటరితనం, వృద్ధుల అవసరాల పట్ల నిరాసక్తత,
కష్టాల్లో ఉన్న పొరుగువారికి సహాయం చేయడానికి
ముందుకు రాకపోవడం. అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలలో, “సామీప్యత” కనుమరుగవుతోంది. మనం పరస్పరం అనుసంధానించబడ్డాం, కానీ సంబంధాలు లేవు. సామర్థ్యంపై ఉన్న వ్యామోహం, భౌతిక వస్తువులు, ఆశయాల పట్ల ఉన్న ఆసక్తి మనల్ని
స్వార్థపరులుగా మారుస్తున్నాయి. ఇవి మనల్ని పరోపకారానికి దూరం చేస్తున్నాయి. అయితే,
ఒక సమాజంలో అనుభవించిన సువార్త, మనల్ని సంపూర్ణమైన, ఆరోగ్యకరమైన, విమోచించబడిన మానవత్వానికి తిరిగి తీసుకురాగలదు.
అందువల్ల, జూబిలీ సంవత్సర ప్రకటన పత్రంలో (బుల్
ఆఫ్ ఇండిక్షన్) పేర్కొనబడిన పనులను (నం. 7-15)
మనమందరం తిరిగి చేయాలని నేను కోరుకుంటున్నాను.
ముఖ్యంగా, అత్యంత పేదవారు, బలహీనులు, రోగులు, వృద్ధులు, భౌతికవాద, వినియోగదారు సమాజం నుండి వెలివేయబడిన
వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నేను ఆహ్వానిస్తున్నాను. మనం ఈ కార్యాన్ని
దేవుని “శైలి”లో చేయాలి: సామీప్యతతో, కరుణతో, సున్నితత్వంతో. మన సోదర సోదరీమణుల ప్రత్యేక పరిస్థితులలో వారితో
వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవాలి (ఎవాంజెలీ గౌదియుమ్,
127-128). చాలాసార్లు, వారే మనకు ఆశతో ఎలా జీవించాలో నేర్పిస్తారు. వారితో వ్యక్తిగత పరిచయం
ద్వారా, మనం ప్రభువు యొక్క కరుణామయ హృదయం యొక్క
ప్రేమను కూడా అందిస్తాము. అప్పుడు మనం, “క్రీస్తు
హృదయం... సువార్త యొక్క ప్రారంభ ఉపదేశానికి కేంద్ర బిందువు” అని గ్రహిస్తాము (దిలెక్సిత్ నోస్, 32). ఈ విధంగా, మనం దేవుని నుండి పొందిన నమ్మకము (1
పేతు 1:21) సరళంగా ఇతరులకు అందించగలం. అలాగే, దేవుని ద్వారా మనం పొందిన ఓదార్పునే ఇతరులకు కూడా తీసుకురాగలం (2
కొరి 1:3-4). యేసు యొక్క మానవ, దైవిక హృదయంలో, దేవుడు ప్రతి మనిషి హృదయంతో మాట్లాడాలని, మనందరినీ తన ప్రేమవైపు ఆకర్షించాలని కోరుకుంటున్నారు. “ఈ మిషన్‌ను కొనసాగించడానికి మనం పంపబడ్డాము: క్రీస్తు హృదయం తండ్రి
ప్రేమకు చిహ్నాలుగా ఉంటూ, ప్రపంచం మొత్తాన్ని ఆలింగనం
చేసుకోవడానికి” (పొంతిఫికల్ మిషన్ సొసైటీల సాధారణ సభలో పాల్గొన్నవారికి ఉపన్యాసం,
జూన్ 3, 2023).
3. ఆశతో నిండిన మిషన్‌ను పునరుద్ధరించడం
ఈ రోజుల్లో ఆశతో కూడిన మిషన్ యొక్క ఆవశ్యకతను ఎదుర్కొంటూ, క్రీస్తు శిష్యులు ముందుగా “ఆశకు కళాకారులుగా” మరియు తరచుగా అయోమయంలో, అసంతోషంగా ఉన్న
మానవత్వానికి దానిని తిరిగి తీసుకువచ్చే వారిగా ఎలా మారగలరో కనుగొనమని
పిలవబడ్డారు.
దీనికోసం, మనం ప్రతి దివ్యబలిపూజలో, ముఖ్యంగా దైవార్చన సంవత్సరానికి కేంద్రబిందువైన ఈస్టర్ త్రయాహములో అనుభవించిన ఈస్టర్
ఆధ్యాత్మికతలో పునరుద్ధరించబడాలి. మనం క్రీస్తు యొక్క విమోచనా మరణం, పునరుత్థానంలో,
అంటే చరిత్ర యొక్క నిత్య వసంతాన్ని సూచించే
ప్రభువు యొక్క పవిత్ర పాస్కలో జ్ఞానస్నానం పొందాము. అందువల్ల, మనం “వసంతకాల ప్రజలు”గా, అందరితో
పంచుకోవడానికి నిండిన ఆశతో ఉన్నాము. ఎందుకంటే క్రీస్తులో “మరణం మరియు ద్వేషం మానవ
జీవితంపై పలికిన చివరి మాట కాదు అని మనం విశ్వసించి, తెలుసుకున్నాం” (కాటేకేసిస్, ఆగస్టు 23, 2017). దైవార్చనా వేడుకలు, మరియు సంస్కారాలలో ప్రస్తుతం ఉన్న పవిత్ర పాస్క పరమ రహస్యాల నుండి, ప్రపంచ సువార్త యొక్క విశాలమైన క్షేత్రంలో ఉత్సాహంతో, పట్టుదలతో, ఓపికతో పనిచేయడానికి మనం పరిశుద్ధాత్మ శక్తిని నిరంతరం
పొందుతాము. “పునరుత్థానుడైన, మహిమ పొందిన క్రీస్తు
మన ఆశకు, నిరీక్షణకు, నమ్మకమునకు మూలం. ఆయన మనకు అప్పగించిన మిషన్‌ను
నెరవేర్చడానికి అవసరమైన సహాయాన్ని మన నుండి దూరం చేయరు” (ఎవాంజెలీ గౌదియుమ్,
275). ఆయనలో, మనం “దేవుని నుండి
వచ్చిన ఒక వరం, క్రైస్తవులకు ఒక కర్తవ్యం” (హోప్
ఇస్ ఎ లైట్ ఇన్ ది నైట్, వాటికన్ సిటీ 2024, 7) అయిన ఆ పవిత్రమైన ఆశను జీవిస్తాము, దానికి సాక్షులుగా ఉంటాము.
నిరీక్షణ కలిగిన మిషనరీలు ప్రార్థించేవారు. కార్డినల్
ఫ్రాంకోయిస్-జేవియర్ వాన్ తువాన్ చెప్పినట్లుగా, “నిరీక్షణ కలిగిన వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తి”. వారు తమ సుదీర్ఘ ఖైదు జీవితంలో విశ్వాసపూర్వకమైన ప్రార్థన మరియు
దివ్యబలిపూజ నుండి పొందిన శక్తితో ఆశతో జీవించగలిగారు (ది
రోడ్ అఫ్ హోప్, బోస్టన్, 2001, పేజీ 963). ప్రార్థన ప్రధానమైన మిషనరీ కార్యం అని, అదే సమయంలో ప్రార్ధన
“నిరీక్షణకు మొదటి బలం” అని మనం మర్చిపోకూడదు (కాటేకేసిస్,
మే 20, 2020).
ప్రార్థన ద్వారా, ముఖ్యంగా దేవుని వాక్యం ఆధారంగా,
నిరీక్షణతో కూడిన ఈ మిషన్‌ను మనం
పునరుద్ధరించుకుందాం. ప్రత్యేకంగా, పవిత్రాత్మచే రచించబడిన గొప్ప
ప్రార్థనా సమూహాలైన కీర్తనల ద్వారా దీన్ని చేద్దాం (కాటేకేసిస్,
జూన్ 19, 2024). కీర్తనలు కష్టాల్లో కూడా ఆశతో ఉండటానికి, మన చుట్టూ ఉన్న
ఆశ యొక్క సంకేతాలను గుర్తించడానికి, దేవుడు సకల ప్రజలచేత స్తుతించబడాలి అనే నిరంతర “మిషనరీ” కోరికను
కలిగి ఉండటానికి మనకు నేర్పిస్తాయి (కీర్తన 41:12; 67:4). ప్రార్థించడం ద్వారా, దేవుడు మనలో వెలిగించిన ఆశ యొక్క నిప్పురవ్వను
మనం సజీవంగా ఉంచుతాము. తద్వారా అది ఒక పెద్ద అగ్నిగా మారి, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ వెలిగిస్తుంది మరియు వెచ్చగా
ఉంచుతుంది. ప్రార్థన ప్రేరేపించే నిర్దిష్టమైన
పనులు, క్రియల ద్వారా కూడా ఇది సాధ్యమవుతుంది.
చివరగా, సువార్త ప్రకటన అనేది ఒక సామాజిక
ప్రక్రియ, క్రైస్తవ ఆశ కూడా (బెనెడిక్ట్ XVI,
స్పె సాల్వీ, 14). ఈ ప్రక్రియ కేవలం సువార్త యొక్క ప్రారంభ ఉపదేశంతో, జ్ఞానస్నానంతో ముగిసిపోదు. బదులుగా, ప్రతి జ్ఞానస్నానం పొందిన వ్యక్తికి సువార్త మార్గంలో తోడుగా ఉండి,
క్రైస్తవ సమాజాలను నిర్మించడం ద్వారా ఇది కొనసాగుతుంది.
ఆధునిక సమాజంలో, శ్రీసభలో సభ్యత్వం ఎప్పటికీ ఒక్కసారి
సాధించేది కాదు. అందుకే, క్రీస్తులో పరిపక్వమైన విశ్వాసాన్ని
అందించడం, దాన్ని రూపొందించే మిషనరీ కార్యం “శ్రీసభ యొక్క అన్ని కార్యకలాపాలకు ఒక
ఆదర్శం” (ఎవాంజెలీ గౌదియుమ్,
15). ఈ పనికి ప్రార్థన మరియు కార్యాచరణలో ఐక్యత
అవసరం. మరొక్కసారి నేను శ్రీసభ యొక్క ఈ మిషనరీ సినోడాలిటీ ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాను. అలాగే, జ్ఞానస్నానం పొందినవారి మిషనరీ బాధ్యతను ప్రోత్సహించడంలో, మరియు నూతన ప్రత్యేక స్థానిక శ్రీసభకు మద్దతు ఇవ్వడంలో పొంతిఫికల్ మిషన్ సొసైటీలు అందిస్తున్న సేవను నొక్కి
చెబుతున్నాను. పిల్లలారా, యువత, పెద్దలు, మరియు వృద్ధులారా, మీరందరూ మీ
జీవిత సాక్ష్యం, ప్రార్థన, త్యాగాలు, దాతృత్వం ద్వారా శ్రీసభ యొక్క ఉమ్మడి
సువార్త మిషన్‌లో చురుకుగా పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. మీకు ధన్యవాదాలు!
ప్రియమైన సహోదరీ సహోదరులారా, మన ఆశ అయిన
యేసుక్రీస్తు తల్లియైన మరియ వైపు చూద్దాం. ఈ
జూబిలీ కోసం, రాబోయే సంవత్సరాల కోసం మనం ఆమెకు మన
ప్రార్థనను అప్పగించి ఇలా వేడుకుందాం: “క్రైస్తవ ఆశ యొక్క కాంతి ప్రతి మనిషిని
వెలిగించుగాక! అది దేవుని ప్రేమ సందేశంగా అందరినీ చేరుకోగాక! శ్రీసభ ప్రపంచంలోని
ప్రతి భాగంలో ఈ సందేశానికి విశ్వసనీయంగా సాక్ష్యమిచ్చుగాక!” (బుల్ ‘స్పెస్ నాన్ కన్‌ఫుందిత్’, 6).
రోము, సెయింట్ జాన్ లాటరన్, జనవరి 25, 2025, పునీత పౌలు పరివర్తన పండుగ.
పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్
No comments:
Post a Comment