23వ సామాన్య బుధవారము
23వ సామాన్య వారములోని బుధవార ధ్యానాంశమునకు
స్వాగతం. నేటి సువిశేష పఠనము, లూకా 6:20-26 వచనముల గురించి
ధ్యానిద్దాం. నేటి సువిశేషపఠనం మత్తయి సువార్తలోని అష్టభాగ్యాలను గుర్తుకు
చేస్తుంది. లూకా కొంచెం భిన్నముగా అష్టభాగ్యాలను వ్రాసాడు. లూకా 6:20లో చదువుచున్నట్లుగా,
“యేసు శిష్యులవైపు కనులెత్తి చూచి ఉపదేశ ఆరంభించెను”. శిష్యులు అనగా, 12మంది
అపోస్తలులు మాత్రమేకాదు. ప్రభువును అనుసరిస్తున్న వారందరు. అదేసమయములో, యేసు
బోధనలను వినుటకు వచ్చిన వారందరుకూడా కాదు. కనుక, ఈ ఉపదేశం, క్రీస్తును విశ్వసించి
ఆయనను అనుసరించు వారికి వర్తిస్తుంది. ఎందుకన, క్రీస్తు శిష్యులు నిజమైన పేదలు, ఆకలిగొనియున్నవారు,
శోకించుచున్నవారు మరియు క్రీస్తు నిమిత్తము హింసలకు గురియగువారు.
లూకా సువార్తలో యేసుప్రభువు ఆశీర్వాదాలతోపాటు అనర్ధాలనుకూడా
పలుకుచున్నారు. నాలుగు ఆశీర్వాదాలు, నాలుగు అనర్ధాలను లూకా సువార్తలో చూస్తున్నాము. ఆశీర్వాదాలు
ఏవనగా: (1) “పేదలగు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది”. (2) “ఇపుడు ఆకలిగొనియున్న
మీరు ధన్యులు, మీరు సంతృప్తిపరపబడుదురు.” (3) “ఇపుడు శోకించు మీరు ధన్యులు, మీరు
ఆనందింతురు”. (4) “మనుష్యకుమారుని నిమిత్తము, మనుష్యులు మిమ్ము ద్వేషించి, వెలివేసి,
నిందించి, మీ పేరు చెడగొట్టినపుడు మీరు ధన్యులు”. అనర్ధాలు ఏవనగా: (1) “అయ్యో!
ధనికులారా! మీకనర్ధము. మీరు మీ సుఖములను అనుభవించియున్నారు”. (2) అయ్యో! ఇపుడు
కడుపు నిండినవారలారా! మీకనర్ధము, మీరు ఆకలితో అలమటింతురు”. (3) అయ్యో! ఇపుడు
నవ్వుచున్న వారలారా! మీరు దు:ఖించి ఏడ్చెదరు”. (4) ప్రజలెల్లరు మిమ్ము ప్రశంసించినపుడు
మీకనర్ధము”
“ధన్యత” అనగా భాగ్యము, సంతోషము, సంతృప్తిగలవారు, దేవుని
కృపానుగ్రహముతో నింపబడినవారు, ఇది రక్షణ ఆనందమును సూచిస్తుంది. “అనర్ధము” అనగా
అసంతృప్తిని సూచిస్తుంది.
“ధనికులారా! మీకనర్ధము”, “ఇపుడు కడుపు
నిండినవారలారా! మీకనర్ధము” అని ప్రభువు పలుకుచున్నారు. మనమైతే, ధనికులే, కడుపునిండినవారలే
ధన్యులు అని భావిస్తాం. మరి యేసు ఎందుకు ధనవంతులకు అనర్ధము అని పలికాడు? ఎందుకన, వారి హృదయాలు దేవునికి దూరముగా ఉన్నాయి. ధనం
ఒక వ్యక్తిని స్వయంసంతృప్తులుగా చేసి, దేవుడు అవసరం లేదని
భావించేలా చేస్తుంది. అహంకారులుగా మార్చుతుంది. ఆత్మసంబంధమైన విషయాలను మరచిపోయేలా,
అశ్రద్ధ చేసేలా చేస్తుంది. ఇలాంటివారు దేవుని వాక్యాన్ని
ఆలకించలేరు. దేవుని చిత్తాన్ని తెలుసుకోలేరు. అందుకే, అలాంటి
వారికి అనర్ధము అని యేసు పలికియున్నాడు.
“ఇపుడు ఆకలిగొనియున్న మీరు ధన్యులు” అని యేసు
పలికారు. దేవుడు పేదలను ఆశీర్వదిస్తాడు. కనుక, పేదలుగా ఉండటానికి ఎప్పుడూ భయపడకూడదు.
దేవుడు తన ప్రేషితకార్యాన్ని పరిపూర్తి చేయుటకు పేదలను, బలహీనులను
ఎన్నుకుంటాడు. పేదరికములోనున్నవారు, ఆకలితోనున్నవారు,
అవమానింపబడినవారు, వెలివేయబడినవారు, నిందింపబడినవారు, ద్వేషింపబడినవారు, ఖండింపబడినవారు ధన్యులు, ఎందుకన, పేదలు దేవుని రాజ్యాన్ని గుర్తిస్తారు. ఆకలితోనున్నవారు దేవునిపై ఆధారపడి
జీవిస్తారు. దుఃఖంలో నిజమైన సంతోషాన్ని, హింసలలో నిజమైన
ఆనందాన్ని చూస్తారు.
యేసు ఉపదేశించిన ఈ భాగ్యాలు మనం ఎలా జీవించాలో
ఆదేశిస్తున్నాయి. మనలను ఆశీర్వదించేవి కేవలం మన పేదరికం, మన ఆకలి, మన దుఃఖం, విశ్వాసం కొరకు మనం పొందే హింసలు కాదు
కాని, యేసు ప్రభువుకు, ఆయన
పరిశుద్ధాత్మకు మనం ఎంత నిబద్దతత కలిగి జీవిస్తామో అన్నదానిపై ఆధారపడి ఉంటుంది.
యేసు బోధించిన ఈ ఉపదేశానికి మనం ఎలా స్పందించాలి? మన చుట్టూ ఎంతోమంది
ఆకలితో అలమటిస్తున్నారు, హింసల పాలవుతున్నారు, నిరాశ్రయులవుతున్నారు, నిస్సహాయతలో జీవిస్తున్నారు.
వారికి మన సహాయాన్ని అందించినప్పుడు, యేసు ఉపదేశాన్ని
జీవించిన వారమవుతాము. కష్టాలలోనున్నవారికి సేవ చేసినప్పుడు స్వయముగా యేసుక్రీస్తుకే
సేవ చేసిన వారమవుతాము. ప్రభువు మనలను ప్రేమించినట్లే మనం పొరుగువారిని
ప్రేమించాలి. అందుకే మనం చేసే దయాపూరిత క్రియల ఆధారంగానే మనం తీర్పు తీర్చబడతాము అని
మ 25:31-46 వచనాలలో చూస్తున్నాం. ఇతరులకు,
ముఖ్యముగా పేదలకు, రోగులకు, సహాయం చేసిన ప్రతీసారి దేవుని ప్రేమానుభవాన్ని వారికి అందిస్తున్నాము అని
గుర్తుంచుకుందాం.
నేటి సువిశేష పఠనం దైవరాజ్యానికి, లౌకిక రాజ్యానికి
ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టపరుస్తుంది. లౌకిక విలువలు కలిగిన మన జీవితం, దైవరాజ్య
విలువలు కలిగిన జీవితానికి మారాలి. దేవుని రాజ్యములో భాగస్థులము కావాలంటే, లౌకిక
ప్రపంచానికి భిన్నముగా మనం జీవించాలి. నిజమైన ఆనందము ఈ లోక సంపదలలో లేదని
అర్ధమగుచున్నది. నిజమైన ఆనందం అంత:ర్గత పరివర్తను కోరును. హృదయపరివర్తన, మారుమనస్సు
పరిశుద్ధాత్మ అనుగ్రహంద్వారా మాత్రమే జరుగుతుంది. పేదరికం, ఆకలిదప్పులు, దు:ఖము,
హింసలలో ఎలా ఆనందాన్ని పొందగలం? పరలోక ఆనందాన్ని మనం పొందాలంటే, మన హృదయాలనుండి దేవున్ని
దూరం చేసే ప్రతీ దానిని మనం తీసివేయాలి. దీనాత్ములు మాత్రమే దేవున్ని గొప్ప సంపదగా
వారి హృదయాలలో కలిగియుందురు. ఆత్మయందు ఆకలిదప్పులు గలవారు, దేవుని వాక్యంచేత, ఆత్మచేత
వారి ఆత్మలు పోషింపబడగలవు. పాపజీవితముకై దు:ఖపడువారు ధన్యులు, వారు అపరాధభావంనుండి
సంతోషకరమైన స్వాతంత్రమును పొందుదురు.
ఈరోజు, పునీత జాన్ క్రిసోస్తం వారిని స్మరించుకుంటున్నాము.
వారు అగ్రపీటాధిపతి, శ్రీసభ విద్వాంసుడు, బోధకులకు పాలక పునీతుడు. క్రీ.శ.347లో
జన్మించి 407లో మరణించారు. “క్రిసోస్తం” అనగా ‘బగారు నోరుగల’ అని అర్ధం. ఆయన
నామానికి తగ్గట్లుగానే, కతోలిక విశ్వాసానికి సంబంధించిన ఎన్నో వ్యాసాలను,
గ్రంథాలను రచించారు. అంతియోకు పట్టణములో ప్రజలను విగ్రహారాధన నుండి విముక్తులు
కావడానికి ఎంతగానో కృషిచేసాడు. శ్రీసభలో ధనదుర్వినియోగాన్ని సరిచేసాడు. వారి
అద్భుత ప్రసంగాలు ఎంతోమందిని ఆకర్షించాయి. దైవార్చన క్రమమును సంస్కరించిన
పితామహుల్లో వీరుకూడా ఒకరు. పేదలను ఆదరించాడు. అందరినీ సమాన దృష్టితో చూసాడు. అయితే
కొంతమంది స్వార్ధపరులు, అవినీతిపరులు ఆయనపై తప్పుడు నేరాలు మోపి బహిష్కరణకు
గురయ్యేలా చేసారు. ఆర్మేనియా దేశ అడవుల్లోనికి పంపబడ్డాడు. ఆక్కడ ఆయన అనేక శ్రమలను
అనుభవించారు. క్రీ.శ. 407, సెప్టెంబరు 14న ధన్యమరణాన్ని పొందారు.
No comments:
Post a Comment