23వ సామాన్య మంగళవారము
23వ సామాన్య వారములోని మంగళవార ధ్యానాంశమునకు
స్వాగతం. నేటి సువిశేష పఠనము లూకా 6:12-19 వచనముల గురించి
ధ్యానిద్దాం. యేసు ప్రార్ధన చేసికొనుటకై కొండకు వెళ్లెను. రాత్రి అంత
దైవప్రార్థనలో మునిగియుండెను. ఎందుకన, మరుసటిరోజు చాలా
ప్రాముఖ్యమైన రోజు. యేసు పండ్రెండుగురు అపోస్తలులను ఎన్నిక చేసుకొనురోజు. లూకా
సువార్త ప్రకారం, యేసు తన పరిచర్యలో, ముఖ్యమైన
సమయాల్లో క్రమం తప్పకుండా ప్రార్ధించాడు (లూకా 3:21; 6:12; 9:18, 28; 11:1;
22:32, 41; 23:46).
దైవకుమారుడు అయిన యేసుక్రీస్తు ఎందుకు రాత్రంతయు
ప్రార్ధనలో గడిపాడు? అతడు దేవుడు-మానవుడు కనుక అతనికి ప్రార్ధన అవసరము లేదు. ఆయన నిరంతరం,
తండ్రి దేవుని సహవాసములో ఉన్నాడు. కాని, మానవ
మాత్రులమైన మనకు, ప్రార్ధన ఎంతో అవసరము ఎందుకన, మనం పరిపూర్ణులముకాదు కాబట్టి.
దేవునితో మనకున్న సంబంధములో ప్రార్ధన చాలాముఖ్యమని ప్రభువు మనకు
తెలియజేయుచున్నారు. తండ్రిదేవునితో సన్నిహితముగా ఉండుటకు యేసునకే అంతసమయం
అవసరమైనచో, మనం ఇంకా ఎంతఎక్కువ సమయాన్ని ప్రార్ధనలో గడపాలో
ఆలోచన చేద్దాం. ప్రభువువలె మనం చేసే ప్రతీచిన్న కార్యానికిముందు ప్రార్ధన చేద్దాం.
మనం ఏ కార్యము చేసినను, ముందుగా దేవునిని సంప్రదిద్దాం.
మనచిత్తం కాకుండా, దేవునిచిత్తం నెరవేరాలని ప్రార్ధనచేద్దాం.
మరోమాటలో చెప్పాలంటే, మనం సాధించే విజయాలు, మనం చేసే గొప్పగొప్ప కార్యాలు అన్నింటిని దేవునికి ఆపాదించాలి. అవి దేవుని
విజయాలు, కార్యాలుగా భావించాలి.
ప్రార్ధన తరువాత, తన శిష్యులను [mathētēs, శిష్యుడు అనగా
అభ్యాసకుడు, విద్యార్థి, అంకితమైన
అనుచురుడు] పేరుపెట్టి పిలచి, వారికి ‘అపోస్తలులు’ అని
పేరుపెట్టాడు. ‘అపొస్తలుడు’ (apostolos) అనగా ‘పంపబడినవాడు’
అని అర్ధము [అపోస్తలుడు అనగా రాయబారి, ప్రతినిధి, దూత అని అర్ధము]. క్రీస్తు సువార్తా ప్రచారం కొరకు, దైవారాజ్య
స్థాపన కొరకు అపోస్తలులు పంపబడినారు [ఇది వారి నిర్దిష్టమైన బాధ్యతను సూచిస్తుంది].
అపోస్తలులు ప్రజలను తమవైపునకుకాక, వారిని ఎన్నుకొని, పంపిన దేవునివైపునకు నడిపించాలి. యేసు ఎన్నుకున్న పండ్రెండు అపోస్తలులను
మనం పరిశీలించినట్లయితే, వారు అసాధారణమైన వ్యక్తులుగాని,
విశిష్టమైన వ్యక్తులుగాని కాదు. అయినప్పటికిని, వారిలో యూదా ఇస్కారియోతు తప్ప, అందరూ యేసు సువార్తా
పరిచర్యలో భాగస్తులైనారు. ప్రభువుకు నమ్మకమైన సేవకులుగా జీవించారు. క్రీస్తుకొరకు
తమ ప్రాణాలనుసైతం త్యాగంచేశారు. అలాగే, దేవుడు మనలో ప్రతీఒక్కరిని
పేరుపెట్టి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రేషిత బాధ్యతను
ఒప్పచెబుతాడు. అయితే, దేవుడు ఎవరినీ బలవంతపెట్టడు.
క్రైస్తవులుగా మన బాధ్యత ఏమిటి? మన లక్ష్యం ఏమిటి? అని ఎప్పటికప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనముకూడా జ్ఞానస్నానంద్వారా,
సువార్త పరిచాకులుగా పిలువబడినాము. పవిత్రజీవితాన్ని జీవించుటకు
పిలువబడినాము. యేసు శిష్యరికంలో సహనం, పట్టుదల కలిగి
జీవించడానికి పిలువబడినాము.
క్రైస్తవులుగా మన అనుదిన బాధ్యత వివిధ రకాలుగా
చెప్పుకోవచ్చు: ప్రార్ధన,
విశ్వాస ప్రకటన, శ్రద్ధవహించడం, సువార్తా ప్రకటన, క్షమాపణ, సఖ్యతపడుట.
దైవసేవ-సోదరసేవ మనందరి బాధ్యత. ఆపోస్తలుల ఎన్నిక తరువాత, యేసు
అనేకమందిని స్వస్థతపరచాడు. ఆయననుండి మహాశక్తి (Dunamis) వెలువడి అందరిని స్వస్థతపరచింది. అనేక ప్రాంతాలనుండి ప్రజలు యేసువద్దకు
రెండు ఉద్దేశముల కొరకు వచ్చారు: ఒకటి యేసు ఉపదేశములను ఆలకించుటకు. రెండు, రోగములనుండి విముక్తి పొందుటకు.
ప్రార్ధన యనగా దేవుని సహవాసములో యుండుట, కనుక ప్రార్ధనను
నిర్లక్ష్యంచేయక ఉందాము. మనం బిజీగా ఉన్నప్పుడు, మొదటిగా మనం
చేసేది పూజలో పాల్గొనక పోవడం. మనం అనారోగ్యం పాలైనప్పుడు, మన
అనుదినచర్యనుండి మొదటిగా తొలగించేది జపమాల లేదా బైబులు పఠనం. మన ఇంట్లోగాని,
ఆఫీసులోగాని సమస్య వచ్చినప్పుడు మనం మొదటిగా చెప్పేది, నేను రేపు ప్రార్ధన చేస్తాను అని. ప్రార్ధన చేయకపోడానికి మనకు అనేక సాకులు,
కారణాలు కనిపిస్తాయి. కనుక, ప్రార్థనకు
తప్పకుండా తగినంత సమయాన్ని ఇవ్వాలి.
నేడు యేసుతల్లియైన “మరియ పవిత్రనామ” మహోత్సవమును
కొడియాడుచున్నాము. “ఆ కన్యక పేరు మరియమ్మ” అని లూకా 1:27వ వచనములో
చదువుచున్నాము.
మొదటిసారిగా ఈ పండుగ, స్పెయిన్ దేశములో 1513వ సం.లో స్థానిక పండుగగా కొనియాడబడినది. 1684వ సం.లో, 11వ ఇన్నోసెంట్ జగద్గురువులు ఈ మహోత్సవాన్ని దైవార్చనా కాలెండరులో చేర్చి,
విశ్వశ్రీసభలో విస్తరింప జేశాడు. ఈరోజు, మరియ
నామమును స్మరించుకుంటున్నాము. ‘మరియ’ అనగా ‘దైవప్రేమ గలది’, ‘దేవునికి
ప్రియమైనది’ అని అర్ధం. పునీత పాదువాపురి ఆంథోనివారు ఇలా అన్నారు, “మరియ నామము పెదవులకు తేనెపట్టుకన్న మధురమైనది, చెవులకు
తీయని పాటకన్న ఆనందదాయకమైనది, హృదయానికి పరిపూర్ణానందనముకన్న
ఆకర్షించేది.”
కన్యమరియ, దేవునితల్లి తన కుమారుడు యేసుపై చూపించిన
ప్రేమను స్మరించుకుంటున్నాము. మరియ మన ఆధ్యాత్మిక తల్లి. మనలను ఎప్పుడుకూడా
దేవునివైపునకు మరల్చుతుంది. దేవునియొక్క అనంతమైన మంచితనాన్ని, దయాగుణాన్ని మనకు గుర్తుచేస్తూ ఉంటుంది. మన హృదయాలను దేవునిని మార్గానికి,
చిత్తానికి తెరుచునట్లుగా సహాయం చేస్తుంది.
No comments:
Post a Comment