త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవము, Year C

త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవము, Year C
సామె. 8: 22-31; రోమీ. 5:1-5; యోహాను. 16:12-15


ధ్యానాంశము: త్రిత్వైక సర్వేశ్వరుడు: ప్రేమ, ఐఖ్యత
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినపుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును” (యోహాను. 16:13).
ధ్యానము: ఈ రోజు మనం త్రిత్వైక సర్వేశ్వరుని పండుగను కొనియాడు చున్నాము. చారిత్రాత్మకముగా, ఈ పండుగ క్రీ.శ. 1030వ సం.లో పెంతకోస్తు పండుగ తరువాత, మొదటి ఆదివారమున ప్రారంభమైనది. ఇరువైరెండవ జాన్ పోపుగారు, క్రీ.శ. 1334వ సంవత్సరములో, దీనిని విశ్వ శ్రీసభ పండుగగా ఆమోదించారు. దేవుడు ఏక త్రిత్వవంతుడైన సర్వేశ్వరుడు. ఒకే సర్వేశ్వరుడు కాని, త్రిత్వవంతుడై యున్నాడు. అనగా, పిత, పుత్ర, పవిత్రాత్మ అను ముగ్గురు వేరువేరు వ్యక్తులు ఉన్నారనియు, ఆ ముగ్గురు వ్యక్తులకు స్వభావము ఒకటేననియు అర్ధము. ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరుడు. ఈ ముగ్గురికి ఒకే జ్ఞానము, ఒకే చిత్తము, ఒకే శక్తి, ఒకే దైవస్వభావము ఉండుట వలన, ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరుడై యున్నారు. వీరిలో శక్తి, మహిమ మొదలైన లక్షణములలో ఎలాంటి బేధము లేదు. ఈ ముగ్గురు వ్యక్తులు అన్నింటిలో సరిసమానులు. వీరు ముగ్గురు ఆరంభము లేనివారై యుండుట వలన, వీరిలో ముందటి వ్యక్తి, వెనుకటి వ్యక్తి లేరు. “పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏక పుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించు చున్నాను. పవిత్రాత్మను విశ్వసించు చున్నాను” అని అపోస్తలుల విశ్వాస ప్రమాణములో ప్రకటిస్తున్నాము.

పిత దేవుడు, మనకు తండ్రి లాంటివారు. మనలను తన పోలికలో సృజించారు. భూలోకములో మన ప్రయాణం ముగిసాక, మరల తండ్రి దేవుని యొద్దకు చేరుకుంటాము. ఆయన మనలను పోషించును, నిత్యము తన జీవితాన్ని మనకు ఇచ్చును. “నేను ఉన్నవాడను” అని దేవుడు మోషేకు తెలియ జేసాడు. తండ్రి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన ప్రజలుగా చేసుకొని వారిని బానిసత్వమునుండి నడిపించి, సినాయి కొండపై ఆజ్ఞలను ఒసగారు. వారి వెన్నంటే ఉన్నారు. ఆయన ప్రేమామయులు, దయామయులు. పుత్ర దేవుడు, యేసు క్రీస్తు మనకు సోదరుడు, స్నేహితుడు. యేసు తండ్రిని మనకు పరిచయం చేసారు. అలాగే, అవిధేయత మార్గములనుండి మనలను తనవైపుకు మరల్చుకుంటారు. ఆయన మనకోసం, మనలో ఒకరిగా జన్మించారు. శ్రమలలోనున్నప్పుడు, మనతో శ్రమలనుభవిస్తారు. మన ఆనందములో పాలుపంచుకుంటారు. ప్రేమించడం, ప్రేమించబడటం అను జీవిత పరమార్ధం వైపుకు మనలను నడిపిస్తారు. ఆయన ద్వారా దేవుని కృపానుగ్రహమును, రక్షణను మనం పొందియున్నాము. పవిత్రాత్మ దేవుడు. మనలో వసిస్తున్న జీవము, మన శ్వాస, దైవీకశక్తి. ఆత్మద్వారా మనము దేవుని అబ్బా! తండ్రీ!అని పిలుస్తున్నాము. దేవుని బిడ్డలమయ్యాము. బిడ్డలము కనుక వారసులము. క్రీస్తు తోడివారసులము (రోమీ. 8:15-17). యేసు క్రీస్తు, ఆత్మ ఇరివురుకూడా మనలను ప్రేమగల తండ్రి దేవుని వైపునకు నడిపించును. జ్ఞానస్నానము ద్వారా ఆత్మను పొందిన మనం నూతన జీవితమును పొందియున్నాము. ఆత్మ మనలను క్రీస్తులో ఐఖ్యము చేయును; బిడ్డలముగా దేవునితో ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరచును. ఆత్మ మనకు మార్గనిర్దేశం చేయును, బోధించును, మనలను ప్రేమించును, ఒదార్చును, బలపరచును.

యోహాను సువార్తలో త్రిత్వైక బోధన
తండ్రి కుమారుల మధ్యనున్న అతి సన్నిహిత సంబంధము గురించి యోహాను నొక్కి చెప్పాడు. తండ్రి ప్రేమను తెలియజేయడమే కుమారుని లక్ష్యం (17:6-8). “నేనును, నా తండ్రియు ఏకమై యున్నాము” (10:30) అని యేసు ప్రకటించాడు. వారి మధ్య ఐఖ్యత ఉన్నది. ఒకరిని చూస్తే మరొకరిని చూసినట్లే (14:9). తండ్రిని గురించి వెల్లడి జేయడములో, యేసు ఆత్మను గురించి కూడా తెలియజేసాడు, “తండ్రి యొద్దనుండి వచ్చు సత్యస్వరూపియగు ఆత్మ” (15:26). మనతో ఉండటానికి దేవుడు పవిత్రాత్మను పంపును. అలాగే, “నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను” (16:7) అని యేసు పలికాడు. అనగా యేసు పవిత్రాత్మను పంపును. తండ్రి దేవుడు / పుత్ర దేవుడు పవిత్రాత్మను పంపును. ఈ సత్యం తండ్రి కుమారుల మధ్యనున్న గొప్ప సహవాసమును, ఐఖ్యతను స్పష్టముగా వెల్లడి చేయుచున్నది. ఇదే ఐఖ్యత తన ప్రజల మధ్య ఉండాలని ప్రభువు ఆశించారు (13:34-35;17:21). ఇదే త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ గొప్ప సందేశము: మనము పరస్పర ప్రేమ కలిగి, ఐఖ్యతగ జీవించాలి.

త్రిత్వం ప్రేమ యొక్క పరమ రహస్యం. త్రిత్వం ఐఖ్యత యొక్క పరమ రహస్యం. త్రిత్వైక దేవుని జీవితములో మనము పాలుపంచుకోవడానికి పిలువబడి యున్నాము. దేవుడు మనకు నిత్య జీవమును ఒసగును. త్రిత్వైక దేవునిలో ప్రేమ, ఐఖ్యత కలిగి మనము జీవించాలని ప్రార్ధన చేద్దాం.

No comments:

Post a Comment