14వ సామాన్య ఆదివారము, YEAR C - పునీత తోమా

14వ సామాన్య ఆదివారము, YEAR C
పునీత తోమా (జూలై 3)
సువార్తా ధ్యానం: లూకా 10:1-12, 17-20

నిజమైన శాంతి, సమాధానాలు

మీరు ఏ యింట ప్రవేశించిన ఆ యింటికి సమాధానము కలుగునుగాక! శాంతి కాముడు అచ్చట ఉన్న యెడల మీ శాంతి అతనికి కలుగును. లేనిచో అది తిరిగి మీకే చేరును” (లూకా 10:6-7). అందరం శాంతి, సమాధానాలతో జీవించాలని ఆశిస్తాం. పూజలు కూడా ఈ ఉద్దేశ్యం కొరకు పెట్టిస్తాం. శాంతి, సమాధానం యొక్క అవసరత ఎంతగా ఉందో, అది మన జీవితములో ఎంత ప్రాముఖ్యమో, మనకు తెలుసు! బైబులులో శాంతి యనగా ‘షలోం’. అయితే ఆ శాంతి, సమాధానాలను మనం ఎక్కడ వెదుకుచున్నాము? ఈ లోక సంపదలలోనా? అభివ్రుద్ధిలోనా? మరెక్కడైనా? నిజమైన శాంతి, సమాధానం దేవునినుండి లభిస్తాయి. శాంతి, సమాధానమునకు మూలకర్త క్రీస్తు ప్రభువు. క్రీస్తు ప్రభువు ఒసగు శాంతి మన హృదయాలలో ప్రవహించేలా, మన జీవితాలను నడిపించేలా మనం అనుమతించాలి. అప్పుడే మనం సంతృప్తిగా జీవిస్తాం. అప్పుడే ఈ లోకం అద్భుత ప్రదేశముగా మారుతుంది. అలాంటి శాంతి, సమాధానాలకు మనం దూతలుగా, సాధనాలుగా ఉండాలని ప్రభువు కోరుచున్నారు. “శాంతి సాధనముగా నన్ను మలచుమయా దేవా!” అని పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారు ప్రార్ధించారు. శాంతిస్థాపనకై, ప్రభువు తన శిష్యులను లోకములోనికి పంపించారు. దురదృష్టవశాత్తు మనలో చాలామందిమి భొతిక సంపదలలో (ధనం, ఇల్లు, భూమి, కార్లు..) శాంతి, సమాధానం ఉంటాయని భావిస్తూ ఉంటాము.

శాంతి యనగా, యుద్ధాలు లేకపోవడం మాత్రమే కాదు.

-          విజయవంతమైన జీవితము యొక్క ఆశీర్వాదం;
-         సజీవుడైన దేవుని సన్నిధిలో జీవితము యొక్క పరిపూర్ణత;
-         మానవుల పరస్పర ప్రేమ యొక్క పరిపూర్ణత;
-         ఇతరులతో కూడి సమాజములో సంపూర్ణ జీవితం;
-         సమాజ సామరస్యం మరియు సంపూర్ణ శ్రేయస్సు;

‘షలోం’ అనగా దేవుని పరిపూర్ణమైన అనుగ్రహం. దేవుని చిత్తానికి అనుగుణముగా జీవించినప్పుడు, దేవుని ఆజ్ఞలను పాటించినపుడు – మన హృదయాలలో, కుటుంబములో, సంఘములో, సమాజములో, ప్రపంచములో శాంతిని చవిచూస్తాము. సువార్త సందేశాన్ని తిరస్కరించిన వారికి శాంతి, సమాధానం ఉండవు.

మనం నేడు ప్రతీ ఒక్కరికి ఈ శాంతి సందేశాన్ని చాటాలి. ప్రతీ యింటికి శాంతిని, సమాధానమును తీసుకొని వెళ్ళాలి. ఈ ప్రపంచానికి మనం ఒసగెడి గొప్ప బహుమానం ‘శాంతి’.  శాంతితో మనం ప్రపంచాన్ని మార్చగలం; పునరుద్ధరించగలం! ద్వేషం, యుద్ధం అను సంస్కృతినుండి శాంతి అను సంస్కృతికి మనం మారాలి. శాంతి దూతలుగా, శాంతి సాధనాలుగా మారాలని ప్రభువు కోరుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు శాంతికి సంబంధించిన శుభవార్తను మనం ప్రపంచానికి తీసుకురావాలి.

అయితే, “పంట విస్తారము కాని పనివారు తక్కువ” (లూకా 10:2). “పనివారు” అనగా శాంతి స్థాపకులను, దూతలను, శాంతి సాధనాలను ఎక్కువగా ఒసగమని “యజమాని” అయిన దేవున్ని మనం ప్రార్ధించాలి. “పంటపొలము” ఈ ప్రపంచము. కోతకు [తీర్పు] సిద్ధముగా యున్నది. ప్రజలకు సువార్తా ప్రకటింప బడాలి; దైవరాజ్య మార్గాలను బోధించాలి. దీని నిమిత్తమై ప్రచారకులు, బోధకులు, గురువులు అవసరం. కనుక దేవున్ని ప్రార్ధించాలి. అనేక చోట్ల గురువుల కొరత పెరిగి పోవుచున్నది!

“తోడేళ్ళ మధ్యకు గొర్రెపిల్లలవలె మిమ్ము పంపుచున్నాను” (లూకా 10:3). “తోడేళ్ళ మధ్య” అనగా సువార్తకు వ్యతిరేక పరిస్థితులు. సాతాను ఎప్పుడుకూడా సువార్త బోధనకు అడ్డుపడుతూ ఉంటుంది. లోకం శత్రువులతో, ప్రలోభాలతో నిండియున్నది, కనుక శిష్యులు జాగరూకులై యుండాలి. యేసు ప్రభువునే ఆయన శత్రువులు సిలువకు నడిపించారు. శిష్యులుకూడా ఇలాంటి ఇబ్బందులను లేక ఎక్కువ ఇబ్బందులనే ఎదుర్కొంటారు. అందుకే ప్రభువు ముందుగానే శిష్యులకు సూచనలను చేస్తున్నారు. శిష్యులు పరిపూర్తిగా దేవునిపై ఆధారపడి జీవించాలి. శాంతి స్థాపనకై పాటుబడాలి. జాలి, సంచి అవసరం లేదు; ఎందుకన వారు భిక్షాటనకు వెళ్ళడం లేదు. వారు దేవుని పొలములో [రాజ్యములో] పనివారు. కాబట్టి వారి జీతానికి వారు అర్హులు. “పనివాడు కూలికి పాత్రుడు” (లూకా 10:7). పాదరక్షలు కూడా అవసరం లేదు. దేవుని కొరకు అంత పేదవారిగా శిష్యులు జీవించాలి. సర్వసంపూర్ణ పరిత్యాగానికి సూచన! ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు! ఇది సువార్త యొక్క అత్యవసరతను సూచిస్తుంది. కొన్నిసార్లు, అనవసరమైన మాటలద్వారా, చర్చలద్వారా, వాగ్వివాదాలద్వారా, విలువైన సమయాన్ని వృధా చేస్తూ ఉంటాము. లూకా 1:39 – దేవుని వాక్య సందేశాన్ని స్వీకరించిన మరియ, “త్వరితముగా ప్రయాణమై పోయినది.” యోహాను 1:41-42 – క్రీస్తును కనుగొనిన అంద్రేయ, వెంటనే అతని సోదరుడగు సీమోనును కనుగొని “మేము మెస్సయ్యను కనుగొంటిమి” అని చెప్పాడు. యోహాను 4:28-29 – క్రీస్తును గుర్తించిన సమరీయ స్త్రీ “తన కడవను అక్కడే వదిలిపెట్టి పట్టణములోనికి వెళ్లి ప్రజలతో, “ఒక మనుష్యుడు నేను చేసినవి అన్నియు చెప్పెను. వచ్చి చూడుడు. ఆయన క్రీస్తు ఏమో!” అని చెప్పినది. లూకా 24:33-35 – ఎమ్మావు మార్గములో క్రీస్తును దర్శించుకొనిన ఇద్దరు శిష్యులు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. ఇతర శిష్యులకు తెలియజేసారు.

సువార్తను తిరస్కరించే వారు, ఆ ప్రదేశం అపవిత్రమైనదిగా భావించ బడును. అందుకే, కాళ్ళకు అంటిన దుమ్మును అచ్చటె దులిపి వేయాలి. సువార్తను తిరస్కరించేవారు దైవరాజ్యములో భాగస్తులు కాలేరు. ఎందుకన, వారు దేవుని తిరస్కరించుచున్నారు. ఈ శాంతి స్థాపనలో సామాన్య ప్రజలు కూడా గురువులకు, బోధకులకు తప్పక సహాయముగా యుండాలి. శిష్యుల పరిచర్య ఎలా ఉండాలంటే, సాతానుపై విజయం సాధించేలా ఉండాలి (లూకా 10:17). యేసు సువార్త పరిచర్య మనద్వారా పరిపూర్ణం కావాలి. అయితే మన విజయాల వలన గర్వితులుగా మారకూడదు. “దుష్టాత్మలు మీకు వశమగుచున్నవని ఆనందంపడక, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి యున్నవని ఆనందింపుడు” (లూకా 10:20) అని ప్రభువు పలికారు. మన విజయాలకు కారణం దేవుడు అని ఎల్లప్పుడు గుర్తుపెట్టు కోవాలి! “సాతాను ఆకాశము నుండి మెరుపువలె పడిపోవుట కాంచితిని” (లూకా 10:18) అని ప్రభువు అన్నారు. సాతాను గర్వము వలన పరలోకమునుండి భూలోకానికి పడిపోయాయి. కనుక గర్వితులు కాకూడదని ప్రభువు హెచ్చరిస్తున్నారు.

కనుక, నేటి సువార్త భాగములో, (i) సువార్త ప్రచారం; (ii) ఆతిథ్యం; (iii) దేవుని ఓదార్పు అను అంశాలను గూర్చి ధ్యానిస్తుంది. గతములోని మిషనరీలు మనకు ఆదర్శము కావాలి. ఎంతో దూరం కాలినడకన వెళ్ళారు. వారు తమ పనిని మిక్కిలిగా ప్రేమించారు. దానికి కట్టుబడి జీవించారు. ఎలాంటి రిస్కులకు వెనుకాడలేదు. ప్రజలతో వ్యక్తిగత పరిచయాలను కలిగి యున్నారు. సంఘాలను స్థాపించి, నిర్మించారు. నేటి పరిస్థితులు వేరుగా ఉన్నాయి: వ్యక్తిగత పరిచయాలు కనుమరుగై పోవుచున్నాయి. వేగముగా (వేగము, పైన చెప్పబడిన అత్యవసరత ఒకటి కాదు; వేగముగా పనులు చేయడం అత్యవసరత కానేరదు) ఎన్నో పనులు, కార్యక్రమాలు చేస్తున్నాం; కాని, సువార్త ప్రచారములో ‘పస’ లేకుండా పోతున్నది. కొన్నిసార్లు అభిరుచి కూడా తగ్గిపోవుచున్నది. కనుక, నేటి సువిశేషం మనందరికీ ఓ సవాలు! ప్రభువు కేవలం గురువులను మాత్రమేగాక, జ్ఞానస్నానం పొందిన ప్రతీ క్రైస్తవులను పంపుచున్నారు. కనుక ఈ సవాలు అందరికీ!

పునీత తోమా (జూలై 3)
అపోస్తలుడు, వేదసాక్షి, భారతదేశ అపోస్తలుడు

తోమా (అరమాయిక్: teoma; గ్రీకు: దిదీము = కవలలో ఒకరుఅని అర్ధం యోహాను. 11:16, 20:24, 21:2) గలిలయ వాసి. తోమాపేరును మత్త. 10:3, మార్కు. 3:18, లూకా. 6:15, అ.కా. 1:13లో కూడా చూడవచ్చు. వారు యూద కుటుంబములో జన్మించారువారి వృత్తి బహుశా జాలరి (మత్స్యకారుడు) లేదా వడ్రంగి అయ్యుండవచ్చు. అయితేఅతని వృత్తి గురించి ఎలాంటి ఆధారాలు లేవు. యేసు తన 12మంది అపోస్తలులలో తోమాను ఒకనిగా పిలుచుకున్నారు. యూదయా సీమలోని బెతానియాలో, మరియ, మార్తమ్మల సోదరుడు, యేసు స్నేహితుడు లాజరు మరణించినపుడు, యేసును అక్కడ హింసించే అవకాశం ఉన్నందున, యూదయాకు వెళ్ళుటకు శిష్యులు భయపడగా, తోమా, “మనము కూడా వెళ్లి ఆయనతో పాటు చనిపోవుదముఅని తోడి శిష్యులతో ధైర్యముగా అన్నారు (యోహాను. 11:16). గురువుపై తన ప్రేమను తెలియజేసారు, కష్ట సమయములో యేసుతో ఉండటానికి నిశ్చయించాడు. కడరా భోజన సమయములో సత్యమును తెలుసుకోవడానికి తోమా, “ప్రభూ! మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు. ఇక మార్గమెట్లు ఎరుగుదుము?” (యోహాను. 14:5) అని యేసును ప్రశ్నించినపుడు, అందుకు యేసు, “నేనే మార్గము, సత్యము, జీవము” (14:6) అని చెప్పారు. ఉత్థాన క్రీస్తును చూచితిమి అని మిగతా శిష్యులు తోమాతో చెప్పినప్పుడు, అతను విశ్వసించలేదు. మరల అతని సమక్షములో ఉత్థాన క్రీస్తు దర్శనమిచ్చి, “అవిశ్వాసివి కాక, విశ్వాసివై ఉండుము” (యోహాను. 20:27) అని తోమాతో అన్నప్పుడు, “నా ప్రభూ! నా దేవా!” (20:28) అని తన విశ్వాసాన్ని ప్రకటించారు. యేసు దైవత్వాన్ని ప్రకటించారు. దీనిని మనం ఒక చక్కటి ప్రార్ధనగా మలచుకోవచ్చు.

పెంతకోస్తు, మొక్షారోహణము తరువాత, తోమా పార్థియనులకు (ప్రస్తుత ఖొరాసన్), మిదీయనులకు (ఇరాన్), పర్షియనులకు క్రీస్తు సువార్తను బోధించి, ఆ తరువాత భారతదేశములో తన ప్రేషిత సేవలను కొనసాగించారు. భారతదేశములో క్రీస్తు సువార్తను తొలిసారిగా ప్రకటించిన అపోస్తలుడు తోమా.

మొదటిగా, (బహుశా, 52లో), తోమా భారతదేశములోని (కేరళ) మలబారు తీరప్రాంతములో ప్రభువు సువార్తను ప్రకటించి క్రైస్తవ సంఘాన్ని స్థాపించారు. సముద్ర మార్గాన గురువాయూరుసమీపమున పాలయూరురేవుకు చేరుకొని, అక్కడ నాలుగు (బహుశా బ్రాహ్మణ) కుటుంబాలకు జ్ఞానస్నాన మిచ్చాడు. వారికి క్రైస్తవ సిద్ధాంతాలను, ఆచారవ్యవహారాలను, సంప్రదాయాలను నేర్పించాడు. బహుశా, భారతావనిలో వీరే తొలి క్రైస్తవులు. అలాగే, కేరళలో పలు దేవాలయాలను కూడా నిర్మించారు. అనేకమంది యూదులు, స్థానికులు, రాజ కుటుంబీకులు జ్ఞానస్నానం స్వీకరించారు.

భవన నిర్మితుడిగా తోమా పేరు గాంచారు. ఒకసారి ఒక రాజు, రాజమందిర నిర్మాణానికై తోమాసువారికి కొంత డబ్బు ఇవ్వగా, అతను ఆ డబ్బును పేదలకు పంచి పెట్టాడు. కొంత కాలము తరువాత, ఆ రాజు రాజభవన నిర్మాణం ఎక్కడ అని అడుగగా, పరలోకములో నిర్మించబడినదని సమాధానం చెప్పారు.

ఆ తరువాత, తోమా మద్రాసు (చెన్నై) నగరములోనున్న మైలాపూర్ ప్రాంతం చేరుకున్నారు. అక్కడ సువార్తను బోధించి, అనేకమందిని క్రైస్తవ మతములోనికి స్వీకరించాడు. దానితో స్థానికులు కొంతమంది ఆయనపై కన్నెర్ర జేశారు. అదును చూసుకొని, ఒకరోజు మద్రాసు సమీపములోని కొండపై ప్రార్ధన చేసుకుంటుండగా, ఆయనపై దాడిచేసి, ఈటెతో పొడిచి చంపివేశారు. ఆయన 3 జూలై 72లో వేదసాక్షి మరణాన్ని పొందారు. మైలాపూరులో కొండపై (St. Thomas Mount) ఆయన నిర్మించిన దేవాలయములోనే భూస్థాపితం చేసారు. అక్కడ తోమా అద్భుత సిలువను ఆరాధిస్తారు. వీరి జ్ఞాపకార్ధం ఇప్పుడు అక్కడ ఒక పెద్ద దేవాలయం నిర్మించబడింది. ప్రస్తుతం తోమా వెముకలలోని ఒక చిన్న అవశేషం మాత్రమే ఈ దేవాలయములో ఉన్నదిఎందుకనక్రీ.శ. 232లో వారి భౌతిక అవశేషాలను సిరియాలోని ‘ఎడెస్సా’ నగరమునకు పంపడం జరిగింది. ఆ తరువాత, 1258లో వాటిని ఇటలీ దేశానికి పంపించారు. ఒర్తోనాలోని పునీత తోమాసు వారి పెద్ద దేవాలయములో భద్రపరచబడినవి. ఎదేమైనప్పటికిని, తోమావారి కపాలము గ్రీసు ద్వీపమైన పత్మోసునందు అపోస్తలుడైన పునీత యోహాను మఠంలో ఉన్నదని ఒక నమ్మకం.  

తోమా భారతదేశ అపోస్తలుడుఅని ఆరవ పాల్ పోపుగారు (Pope Paul VI) 1972లో ప్రకటించారు.

పునీత తోమాసుగారికి స్తోత్రముగా జపము

సర్వేశ్వరా స్వామీ! మీ అపోస్తలుడైన పునీత తోమా వలన భారత దేశమునకు సత్యోపదేశమును బోధింప నవదరించితిరికదా! ఆయన వేడుదల ఫలముచేత ఇప్పుడు ఈ దేశమందుండు అవిశ్వాసుల మనస్సు తిరుగను, ఎన్ని విఘ్నములు వచ్చినను మేము విశ్వాసములో దృఢమును పొంది, ఈ లోక తంత్రశోధనలను జయించి, మోక్షానంద భాగ్యము పొందను కృపజేయ నవధరించండి. మా నాధుడైన యేసు క్రీస్తుని దివ్య ముఖమును జూచి ఈ మనవులను మాకు దయ చేయండి. ఆమెన్. 

No comments:

Post a Comment