నిష్కళంక మాత మహోత్సవం (జూన్ 12)

నిష్కళంక మాత మహోత్సవం (జూన్ 12)

ఉపోద్ఘాతము: “మరియమ్మ అంతయు తన మనస్సున పదిల పరచుకొని మననము చేయుచుండెను” (లూకా. 2:19). “ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొని పోనున్నది” (లూకా. 2:35). సంపూర్ణ హృదయశుద్ధి తోనే భగవత్ దర్శనం. దేవుని వరప్రసాదలను మన జీవితాలలో నింపుకోవాలి అంటే మన హృదయంకూడా మరియతల్లి హృదయంవలె నిష్కళంకముగా ఉండాలి. మరియమాత ప్రేమమూర్తి, దేవునిపట్ల ప్రగాఢమైన ప్రేమగల పుణ్యమూర్తి. ఆ తల్లి అంతరంగంలో జ్వలించే ప్రేమాగ్ని జ్వాలలు పాపపు ఆశల్నికూడా దరిచేరనివ్వవు. కనుకనే పాపపు కళంకమెరుగని పావనాత్మురాలుగా జీవించి ధన్యులయ్యారు. ఆమె బిడ్డలమైన మనంకూడా అదే బాటలో నడవాలి అన్నది ఆ తల్లి ప్రగాఢమైన కోరిక.


శ్రీసభలో పండుగ: మరియతల్లిని "నిష్కళంకమాత"గా శ్రీసభ ప్రకటించటం సాక్షాత్తు దైవచిత్తం. సెడూలియస్ అనే 5వ శతాబ్దపు లాటిన్ కవి మరియతల్లిని గూర్చి ఈ విధముగా ప్రశంసించారు: "సుందరమైన గులాబీ పువ్వు ముండ్ల మొక్కమీద వికసిస్తుంది. అది తల్లి చెట్టు కంటే మిక్కిలి సుందరమైనది. తల్లి చెట్టులాగా ముళ్ళు లేనిది కూడా. అలాగే, "మరియ" అనే సుందరమైన పుష్పం ఏవ అనబడు ముండ్ల మొక్కమీద వికసించింది. దోషరహితయై ఆ తొలి కన్య పాపానికి ప్రాయశ్చిత్తం చేసింది." 11వ శతాబ్దం చివరిలో లేదా 12వ శతాబ్దం ఆరంభములోనో, పు. బెర్నార్డు ప్రసంగములో నిష్కళంకమాత పట్ల భక్తిని గుర్తించారు. 13వ శతాబ్దంలో డన్స్ స్కోటస్ అనే దైవ వేదాంత శాస్త్రజ్ఞుడు మరియతల్లి నిష్కళంకమాత అనే సత్యాన్ని రుజువు పరిచారు, అలాగే అనేకమంది పునీతులు ఈ భక్తిని కొనియాడారు. 17వ శతాబ్దములో పునీత జాన్ యూదెస్ యేసు తిరుహృదయ పండుగతో, మరియ నిష్కళంకమాత గురించి బోధించాడు. 1648లో మొదటి సారిగా నిష్కళంకమాత మహోత్సవాన్ని కొనియాడారు. 1799లో ఆరవ భక్తినాధ పోపుగారు (Pius VI) పలెర్మో అను మేత్రాసణములో ఈ పండుగను కొనియాడుటకు అనుమతిని ఇచ్చాడు. 19వ శాత్తబ్ధములో, ఏడవ (Pius VII), తొమ్మిదవ (Pius IX) భక్తినాధ పోపుగార్లు అనేక దేవాలయాలలో ఈ పండుగను కొనియాడుటకు అనుమతిని ఇచ్చారు. పన్నెండవ భక్తినాధ పోపుగారు (Pius XII), రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యములో (1944), ప్రపంచాన్ని నిష్కళంకమాత హృదయానికి అంకితంచేసి, ఆ తల్లి సంరక్షణలో ఉంచారు. నిష్కళంకమాత మధ్యస్థ ప్రార్ధనల ద్వారా, దేశాలమధ్య శాంతి, శ్రీసభ స్వాతంత్ర్యము, పాపాత్ముల హృదయపరివర్తన కొరకు ప్రార్ధించ కోరారు. విశ్వశ్రీసభయంతా ఈ మహోత్సవాన్ని స్థాపించారు. ఈ విధముగా, జూన్ మాసంలో తల్లి శ్రీసభ నిష్కళంకమాత మహోత్సవాన్ని కొనియాడుతూ, మరియతల్లి కళంకం లేని కరుణామయి అనే సత్యాన్ని యావత్ విశ్వ శ్రీసభ ప్రకటిస్తుంది.

నిష్కళంక మాత - నిర్వచనం: క్రైస్తవ లోకం ఎప్పుడుకూడా మరియతల్లి ప్రేమ, సుగుణాల పట్ల ఆకర్షితురాలైనది. “మన రక్షణ కొరకు ఆమె దేవునితో సహకరించినది” (పు. అగుస్తీను). లోకసృష్టికి పూర్వమే దేవుడు మరియతల్లిని జన్మపాపము, కర్మపాపము సోకకుండానే ఉద్భవింప చేసారు. మరియతల్లి అందరిలాగే ఆదాము సంతానములో జన్మించారు. కాని, ఆమెకు జన్మపాపము సోకలేదు. భవిష్యత్తులో జన్మించబోయే క్రీస్తు వరప్రసాదాలద్వారా దేవుడు ముందుగానే మరియతల్లిని జన్మపాపం సోకకుండా పదిలపరిచారు. తనద్వారా ఈ లోకంలో అడుగిడబోయే రక్షకుడైన యేసుక్రీస్తు లోకానికి ప్రసాదించబోయే రక్షణ ఫలమును దైవానుగ్రహంతో మరియతల్లి ముందుగానే అందుకొని జన్మపాప, కర్మపాప దోషమునుండి విడుదల పొందారు. పాపపు కళంకము అంటని పావనమూర్తిగా మరియతల్లి ఈ లోకంలో జన్మించారు. మానవ రక్షణ మహత్కార్యాన్ని దేవుడు మరియతల్లిని జన్మపాపమునుండి విముక్తురాలను చేయడం ద్వారానే ఆరంభించారు. నిష్కళంక మరియతల్లి ద్వారానే పాపపు కళంకితమైన మానవజాతిని శుద్దీకరించి, రక్షణ భారాన్ని ప్రసాదించాలన్నది దేవుని ప్రణాళిక.


నిష్కళంకమాత దేవుని ప్రణాళిక: “నీకు, స్త్రీకి, నీ సంతతికి, స్త్రీ సంతతికి తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు. నీవేమో వారి మడమలు కలచెదవు” (ఆది. 3:15). ఆదిదంపతుల దృష్టిని మరల్చి పాపము చేయమని ప్రోత్సహించిన సైతానును శపిస్తూ ప్రభువైన దేవుడు పలికిన మాటలు. "స్త్రీ" కన్య మరియకు కలగబోయే సంతానమే సైతాను తలను చదుక కొడతారు (పాపముపై విజయం). అంటే మరియ తనయుడైన క్రీస్తు సైతానును జయిస్తారు. పాప మరణ బంధనాలనుండి మానవజాతిని విముక్తం గావిస్తారు. జన్మపాపరహితోద్భవిగా ఉద్భవించే ఒక గొప్ప మహా వరాన్ని ఆ తల్లికి దేవుడు అనుగ్రహించారు. నిష్కళంకతోద్భవి మరియమాత ద్వారానే మానవుని పతనానికి కారణమైన సైతాను తలను తన ప్రియ కుమారుని ద్వారా చిదుకకొట్టే ఏర్పాటు చేశారు. అందుకే మరియతల్లిని జన్మపాపము, కర్మ పాపము సోకకుండా ఉద్భవింప చేసారు. ఇది దేవుని ప్రణాళిక.


మరియతల్లి బిడ్డలమైన మన హృదయాలు నిష్కళంకముగా ఉన్నాయా? నిష్కళంకమాత పట్ల మనం ఎటువంటి భక్తి భావాలు కలిగి జీవించాలి? మరియతల్లి మననుండి ఎటువంటి భక్తివంతమైన జీవితాన్ని ఆశిస్తున్నారు? ఆత్మపరిశీలన చేసుకుందాం.


నిష్కళంక మరియ – మన ఆదర్శం: క్రైస్తవ ప్రేమకు మరియ నిష్కళంక హృదయం ఆదర్శం అని ఆరవ పౌల్ పోపుగారు అన్నారు. “హృదయ శుద్ధిగలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు (మత్త. 5:8). దైవప్రేమను చవిచూడాలంటే, మన హృదయాలు పరిశుద్ధముగా ఉండాలి. మన హృదయాలలో పరిశుద్ధత కరువైతే సంపూర్తిగా దైవప్రేమను చవిచూడలేము. భౌతికముగా, హృదయము అనగా గుండె, శరీరములో ఒక భాగము. కాని, పరిశుద్ధ గ్రంథములో అది భావోద్వేగాలకు, ఆలోచనాసరళికి, నిర్ణయాత్మకశక్తి మొదలైనవాటికి నిలయమై దైవమును కలిసే చోటుగా ఉన్నది. మానవ శరీరంలో ఏర్పాటు చేసిన ఒక న్యాయస్థానం అని చెప్పవచ్చు. ఈనాడు మన హృదయాలలో దైవ ప్రేమ కన్నా కూడా, ఈ లోక ఆశలు నింపుకుంటూ హృదయాన్ని పాడు చేస్తున్నాము. “ఏలయన, హృదయమునుండి దురాలోచనలు పుట్టుచున్నవి. వీనిమూలమున నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్దపుసాక్ష్యములు, దూషణములు కలుగుచున్నవి” (మత్త. 15:19). వీటిమూలానే, మానవ హృదయాలు కలుషితం అయిపోతున్నాయి. ఇవి దైవదర్శనానికి అడ్డుపడుతున్నాయి.


సాధుశీలుడు, వినమ్ర హృదయుడైన తననుండి నేర్చుకొని ఆత్మలో విశ్రాంతి పొందమని మనందరిని ప్రభువు ఆహ్వానిస్తున్నారు, శాంతిని అనుగ్రహిస్తున్నారు. హృదయము మనిషి - దైవము కలిసే స్థానము. దైవకుమారుడైన క్రీస్తు భగవానుడి మానవ హృదయము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల సంఘ స్థానముగా దైవజీవన నిలయముగా రూపుదిద్దుకున్నది. జ్ఞానస్నానం పొంది శ్రీసభలో దేవుని బిడ్డలుగా ఎన్నిక కాబడిన మన హృదయాలు కూడా క్రీస్తు భగవానుడి హృదయంవలె మరియతల్లి నిష్కళంక హృదయంవలె రూపుదిద్దుకోవాలి. ఇలా రూపుదిద్దుకోవాలి అంటే మన హృదయాలు పరిశుద్ధాత్మకు నిలయముగా మారాలి. అనుదిన జీవితంలో హృదయం పదిలంగా శుద్ధిగా ఉంచుకోమని క్రీస్తు భగవానుడు దైవవాక్కు ద్వారా అనుదినం హెచ్చరిస్తూ ఉన్నారు.


“నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడైన దేవునియందు నా యాత్మ ఆనందించుచున్నది” (లూకా. 1:46-47). మరియతల్లివలె మన హృదయాలుకూడా దేవున్ని సంపూర్తిగా స్తుతించాలి. మరియతల్లి హృదయంవలె, మన హృదయాలు కూడా పరిశుద్ధాత్మకు ఆలయాలుగా మారాలి. మరియతల్లి మనందరినికూడా దేవునికి పోలికగా, దేవునికి ఇష్టులుగా జీవించాలని కోరుకుంటున్నారు. క్రీస్తును ఏవిధంగా అయితే తన గర్భంలో మోసారో, మనందరినికూడా తన నిష్కళంక హృదయ వెలుగులో ఇముడ్చుకోవాలని తన ప్రియ కుమారుని బిడ్డలుగా మనమంతాకూడా వెలుగొందాలని ఆ తల్లి కోరిక. తన మధ్యస్త వేడుదలద్వారా మన క్రైస్తవ జీవితానికి కావలసిన వరప్రసాదాలను తన ప్రియ కుమారునిద్వారా మనందరికీ మరియతల్లి అనుగ్రహిస్తారు. మన సాధకబాధకాలు, మన అక్కరలు, మన ప్రార్ధనా అవసరతలు ఆ తల్లికి తెలియనివి కావు. ఆనాడు కానాపల్లె వివాహములో ద్రాక్షారసము కొరతను గుర్తించి క్రీస్తుతో అద్భుతంగా చేయించి వివాహ పరువును నిలబెట్టిన తల్లి, ఈనాడు మన తరఫునకూడా నిలిచి నిత్యం మనకొరకు ప్రార్ధిస్తుంటారు. మన హృదయాలు, మన ఆలోచనలు మరియతల్లివలె పరిశుద్ధముగా మారిననాడే, మనము ఆచరిస్తున్న మరియతల్లి పండుగలకు అర్థం ఉంటుంది. కాబట్టి, మనమంతా కూడా నిర్మల హృదయంతో హృదయశుద్ధితో జీవిద్దాం! ఆ తల్లికి ప్రియమైన బిడ్డలుగా వెలుగొందే భాగ్యాన్ని సంపాదించుకుందాం! ఆమెన్.

No comments:

Post a Comment