పరిశుద్ధ ఫాతిమామాత మహోత్సవం - మే 13వ తేదీ

 పరిశుద్ధ ఫాతిమామాత మహోత్సవం - మే 13వ తేదీ


కతోలిక ప్రపంచచరిత్రలో మరియతల్లి దర్శనాలు మనకు అనేకం కనిపిస్తాయి... విశ్వాస చరిత్రలో మరియతల్లి విరివిగా దర్శనాలు ఇవ్వటం అర్థం కాని అంశం మరియతల్లి మాత్రమే ఇంత విరివిగా దర్శనాలు ఎందుకు ఇవ్వాలి? దేవుడు ఆ తల్లికి చెప్పిన పని, ఆమె కేవలం క్రీస్తుని కన్నా దేవుని తల్లి మాత్రమే కాదు కానీ ఆమె క్రీస్తును అనుసరించిన ప్రథమ శిష్యురాలు తన ప్రియ కుమారుని గురించి ప్రపంచానికి వెల్లడి చేయవలసిన బాధ్యత ఆమెపై కూడా ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో కుమారుని గురించి కన్నతల్లి కంటే మరెవ్వరికీ తెలియదు కాబట్టి... ఆ తల్లి ఇన్ని దర్శనాలు ఎందుకు ఇచ్చారు అంటే తన ప్రియ కుమారుని ప్రేమను గురించి తెలియజేయడానికి, మన అందరిని కూడా ఆ కరుణామయుని మార్గంలో నడిపించటానికి..

కతోలిక విశ్వాస చరిత్రలో మరియతల్లి దర్శనాలు అనేకం కనిపిస్తుంటాయి.. కానీ అన్ని అధికారపూర్వకంగా ప్రపంచానికి వెల్లడి చేసినవి కావు.. అధికారపూర్వకంగా వెల్లడి చేసి కతోలిక ప్రజల విశ్వాసాభివృద్ధికి తోడ్పడిన దర్శనాలు కొన్ని మాత్రమే అందున అతి ప్రాముఖ్యమైనది మరియతల్లి "ఫాతిమామాతగా" ముగ్గురు చిన్నారులకు ఇచ్చిన దర్శనం ప్రపంచ కతోలిక ప్రజలందరి విశ్వాసాన్ని బలపరచు విధముగా ఉన్నది... ప్రతి సంవత్సరం ఈ రోజున మనమంతా కూడా "ఫాతిమా మాత" మహోత్సవాన్ని అత్యంత భక్తి ప్రపత్తులతో కొనియాడుతూ ఉంటాము.. ఈ మేరకు ఈ వ్యాసము ద్వారా ఆ తల్లి తన దర్శనాల ద్వారా మనందరికీ ఇస్తున్నటువంటి సందేశాన్ని హృదయపూర్వకంగా ధ్యానం చేద్దాం-:

అద్భుత దర్శనం: శాంతి సందేశం

మొదటి దర్శనం:

అది 1917వ సంవత్సరం మే 13వ తేదీ... ఆదివారం విశ్రాంతి దినం మరియు మరియతల్లికి అంకితంచేయబడిన పూజిత మాసం... ఆరోజున ముగ్గురు చిన్నారులు లూసీ, ఫ్రాన్సిస్, జెసింత తమ గొర్రెల మందలను మేపుకుంటున్నారు.. వీరు గొర్రెలు కాచే స్థలం వీరి నివాసానికి ఒక మైలు దూరంలో ఉన్నది. అది మిట్టమధ్యాహ్న సమయం అకస్మాత్తుగా ఆకాశంలో ఒక మెరుపు దివ్య కాంతితో రెండుసార్లు తళుక్కుమని మెరిసింది.. ఆ పిల్లలు వర్షం పడబోతున్నదేమో అని గ్రహించి. ఆ గొర్రె పిల్లలను ఒక చోట చేర్చి  ఇంటి బాట పట్టారు..

నడుస్తూ ఉండగా ఈ చిన్నారుల దృష్టి  ఒక ఒలీవ చెట్టు పై పడింది... ఆ చెట్టు ఉపరితలాన్ని ప్రజ్వల కాంతి ఆవరించి ఉన్నది.. దానిపై పసిడి రూపాన్ని ధరించిన ఒక " స్త్రీ " మూర్తి  నిలబడి ఉన్నది.( ఫాతిమా మాత చిత్రపటాలను లేదా స్వరూపాలను మనం చూసినట్లయితే ఆ తల్లి ఒక చెట్టుపై నిలబడి ఉన్నట్లు మనకు కనిపిస్తుంది.. ఒకసారి  ఇంటర్నెట్ లో మీరు జూమ్ చేసి చూడవచ్చు) ఆమె పాదాలు మేఘాలతో కప్పబడి  ఉన్నాయి. నిలువ పాటి తెలుపు వస్త్రాన్ని ధరించి ఉన్నది.. ఆమె శిరస్సు పై నుండి భుజస్కంధాల మీదగా మేలిముసుగు బంగారు పాదాలవరకు వ్రేలాడి ఉంది... ఆమె కుడి చేతి నుండి మిల మిల మెరిసే ముత్యాలతో కూర్చబడిన అతి మనోహరమైన జపమాల ఒకటి వ్రేలడుతున్నది..ఆ స్త్రీ సూర్యుని కంటే ఎక్కువ ప్రకాశవంతంగా ఉన్నది. (ప్రియ మిత్రులారా Our Lady of Fathima అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేయండి.. ఫాతిమామాత చిత్రపటాలు మనకు కనిపిస్తాయి. అప్పుడు మీకు ఇంకా క్షుణ్ణంగా అర్థం అవుతుంది)

ముగ్గురు చిన్నారులకు దర్శనమిచ్చిన స్త్రీ మూర్తి ఆ పిల్లలతో. "ప్రియ బిడ్డలారా! భయపడకండి మీకు ఏ హాని నేను కలిగించను అని పలికారు. ఈ ముగ్గురు చిన్నారులలో "లూసీ" అను బాలిక ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి అమ్మా! మీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? అని ప్రశ్నించింది. అప్పుడు మరియతల్లి

"నేను పరలోకము నుండి వచ్చి ఉన్నాను". మీరు ప్రతి నెల 13వ తేదీన ఈ ఘడియలోనే ఈ వచ్చే ఆరు నెలలు వరుసగా అక్టోబర్ నెల వరకు తప్పనిసరిగా రావాలెనని కోరుచున్నాను. అప్పుడు నేనెవరినో, ఎందుకు వచ్చానో నేను ఆశించేదేమిటో తెలుపుతాను అని ఆ స్త్రీ మూర్తి వారికి జవాబు ఇచ్చింది..

2. రెండవ దర్శనం:

ఆ చిన్నారులకు చెప్పినట్లుగా మరియతల్లి జూన్ మాసం 13వ తేదీన పోర్చుగల్ దేశ పాలకులు పునీత అంతోని వారి పండుగనాడు మరల ఆ చిన్నారులకు దర్శనమిచ్చారు.. అక్కడ సుమారు 70 మంది వ్యక్తులు హాజరైనా, వారెవరు ఆ తల్లిని చూడలేదు.. ఆ ముగ్గురు చిన్నారులు మాత్రం ఆ తల్లిని కళ్ళారా చూసి ఆమె పలుకులు మనసారా విన్నారు. రెండవ దర్శనంలో ఆ తల్లి పలికిన మాటలు: " ప్రతి దినం జపమాలను జపించండి" అని ఆ తల్లి ప్రాధేయపడి ఒక గొప్ప పరమ రహస్యాన్ని వారికి తెలిపి అదృశ్యమయ్యారు...

3. మూడవ దర్శనం:

జూలై 13 వ తేదీన మరల ఆ తల్లి ముగ్గురు చిన్నారులకు యధావిధిగా దర్శనమిచ్చారు..ఆ దర్శనంలో మరియతల్లి చిన్నారులతో ఈ విధంగా చెప్పి ఉన్నారు: ప్రపంచ శాంతి కొరకు, మొదటి ప్రపంచ యుద్ధం త్వరలో ముగిసిపోవాలని ప్రతి ఒక్కరూ హృదయ పరివర్తన చెంది జపమాలను స్మరించమని కోరారు అలాగే ప్రతి గుర్తుకు చివరన, "ఓ నా యేసువా! మా పాపాలు మన్నించండి. మమ్ము నరకాగ్ని నుండి కాపాడండి. ఆత్మలన్నిటినీ, ముఖ్యముగా మీ కృపఅత్యవసరమైనవాటినిమోక్షమునకు తీసికొని పొండి” అని ఆనతిస్తూ ఆ తల్లి అదృశ్యమయ్యారు‌...

నాలుగవ దర్శనం:

ప్రతి నెల ఒకే తేదీన, ఒకే సమయాన ముగ్గురు చిన్నారులకు దర్శనమిచ్చిన తల్లి ఈసారి ఇవ్వలేదు.. అందుకు కారణం ఏమనగా మరియతల్లి గురించి ఈ పిల్లలు చెబుతున్నటువంటి విషయాలలో ఎటువంటి సత్యం లేదని, ఇవి కేవలం అసత్యాలు మాత్రమేనని అక్కడి ప్రభుత్వ  అధికారులు కొట్టిపడేశారు.. అభం శుభం తెలియని ఆ చిన్నారులను వారి ఆధీనంలోకి తీసుకొని మరొక చోటకి తీసుకొనిపోయి.. చెత్త చెత్త ప్రశ్నలతో వారిని చిత్రవధ చేసి వారి పసి హృదయాలను గాయపరిచారు... వారిని భయభ్రాంతులకు గురి చేశారు‌. అయినా సరే ఆ ముగ్గురు చిన్నారులు ధైర్యముతో అచంచల విశ్వాసంతో మేము పొందిన దర్శనాలు నూటికి నూరుపాళ్లు వాస్తవాలని అధికారులతో గట్టిగా చెప్పారు.. పసి హృదయాలలో దాగి వున్న గొప్ప విశ్వాసాన్ని చూసిన ఆ ప్రభుత్వ అధికారులు ఈ చిన్నారులను విడిచిపెట్టారు..

ఈ విధమైన  జాప్యం మూలాన ఆగస్టు మాసంలో 19వ తేదీన వారు దేవమాత దర్శన భాగ్యానికి నోచుకున్నారు. ఈసారి దర్శనంలో ఆ తల్లి అక్టోబర్ మాసంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నానని.. ప్రతి ఒక్కరు మరింత ఎక్కువగా ప్రార్థనలలో, జపమాల ధ్యానంలో పాల్గొనాలని ఆ తల్లి ఆదేశించి అదృశ్యమయ్యారు..

ఐదవ దర్శనం:

ఈసారి దేవమాత దర్శనం సెప్టెంబర్ 18వ తేదీన ఇరియాలోనే జరిగింది.. అక్కడ సుమారు 25 వేల మంది హాజరయ్యారు.. అప్పుడు ఆ తల్లి ఈ విధంగా చెప్పి ఉన్నారు. "ప్రతిదినం జపమాల చెప్పటం మర్చిపోవద్దు...  అక్టోబర్ మాసంలో ఒక గొప్ప మహా అద్భుతాన్ని చేయబోతున్నాను అని మరొకసారి చెప్పి అదృశ్యమయ్యారు... ఈ వాగ్దానాలన్నీ తప్పకుండా నెరవేరతాయని చిన్నారి బాలిక లూసి దృఢంగా నమ్మింది..

ఆరవ దర్శనం:

మరియతల్లి వాగ్దానం చేసినట్లుగా అక్టోబర్ 18వ తేదీన ఒక మహా అద్భుతం చోటు చేసుకుంది.. ఇరియా లోయలో 70 వేల మందికి పైగా ప్రత్యక్షంగా కనులారా చూసిన అద్భుత దృశ్యం ఇది... ఈ దర్శనంలో మరియతల్లి విశ్వాసులను ఈ విధంగా కోరింది..

"ఇక్కడ నా మహిమార్థం ఒక దేవాలయాన్ని కట్టించాలి" నేను క్రీస్తు తల్లిని "జపమాలరాజ్ఞీని" మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా జపమాల జపించండి త్వరలోనే మొదటి ప్రపంచ యుద్ధం ముగుస్తుంది.. ప్రజలు పరివర్తన పొంది తమ జీవితాలను సరిదిద్దుకోవాలి. ప్రతి ఒక్కరు క్రీస్తు బాటలో అడుగులు వేయాలని ఆ తల్లి కోరారు... అంతే సూర్యబింబం చలనం కలిగి చుట్టు భ్రమణం గావించడం  ప్రారంభించింది. వివిధ పునీతుల దృశ్యాలు కనిపిస్తున్నాయి.. క్రీస్తు భగవానుడు, సాకుడు తండ్రి జోజప్ప, మరియతల్లి ఈ ప్రపంచాన్ని ఆశీర్వదించడం లాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి..

వెనువెంటనే గొప్ప మహా కాంతి కిరణాలతో ఆ సూర్యబింబం అగ్ని చక్రం వలె తన చుట్టూ గుండ్రంగా తిరగడం మొదలుపెట్టింది.. జోరు పుంజుకుని ఆకాశం నుంచి ఊడి పడినట్లు భయంకర అగ్ని గోళంగా ఇటు అటు నాట్యం చేస్తూ అందర్నీ ఆందోళనకు గురిచేసింది.. భయాందోళనతో వణుకుతున్న ప్రజానీకం మోకాళ్ల మీద పడి  ఏడుస్తూ ప్రార్థనలు చేశారు.

అసలు దేవుడిని నమ్మని నాస్తికులు సైతం ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసి దేవుని విశ్వసించారు.. అమ్మ మరియ తల్లి ! మమ్ము కరుణించు మీ ప్రియ కుమారుని మార్గంలో నడిపించు అని ప్రాధేయపడ్డారు... ఆకాశంలో ప్రళయతాండవం చేస్తున్న ఆ ప్రచండ భానుడు అదృశ్యమయ్యాడు... మరియమాత ముగ్గురు చిన్నారులకు ఇచ్చిన దర్శనాలు నూటికి నూరుపాళ్లు నిజమని ఈ యొక్క అద్భుతం ద్వారా ప్రజలు సంపూర్తిగా నమ్మారు...

చివరిగా:

మరియ తల్లి ప్రతి దర్శనంలో పలికిన మాట ఏమనగా " జపమాలను జపించండి" హృదయ పరివర్తన చెంది క్రీస్తు బాటలో అడుగులు వేయండి అని కాబట్టి ఆ తల్లి చెప్పినట్లు చేద్దాం. జపమాల ద్వారా ప్రతి రోజు ఆ తల్లిని పలకరిద్దాం మన కష్టసుఖాలను ఆ తల్లితో పంచుకుందాం. మంచి జీవితాన్ని జీవిద్దాం! మీ అందరికీ "ఫాతిమామాత" పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆమెన్..

జోసెఫ్ అవినాష్
యువ కతోలిక రచయిత
పెదవడ్లపూడి విచారణ

No comments:

Post a Comment