సకల పునీతుల పండుగ

 సకల పునీతుల పండుగ

దర్శన గ్రంధము 7:9వ వచనాన్ని ఆలకించుదాం, “అచట ఒక గొప్ప జనసమూహము ఉండెను. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను. అందు అన్ని జాతుల వారును, అన్ని తెగలవారును, అన్ని వర్గములవారును, అన్ని భాషలవారును కలిసి ఉండిరి. వారు సింహాసనమునకు, గొర్రెపిల్లకును ఎదురుగా నిలిచిరి. వారు తెల్లని దుస్తులు వేసుకొని ఉండిరి. చేతులయందు ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉండిరి.”

నవంబరు ఒకటవ తేదీన, శ్రీసభ, సకల పునీతుల పండుగను ఘనంగా కొనియాడుతుంది. ‘సకల పునీతులు’ అంటే ఎవరు? అనే, ఆలోచన మనలో కొందరికి వస్తూ ఉంటుంది! ‘వీరు జీవించిన జీవితములో, దేవునికి ఇష్టమైన జీవితమును జీవించి, దేవున్ని అనుసరించి, దేవుని కొరకు ఎన్నో శ్రమలను భరించి, మరణించిన వారు సకలపునీతులు. సకల పునీతులందరూ మోక్షం చేరుకున్నవారు’. పునీత మత్తయి గారు వ్రాసిన సువార్త 5:12 - “మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్పబహుమానము గలదు. కావున మీరు ఆనందపడడు, మహాదానందపడుడు.”

పవిత్రమైన, దేవుని అనుసరణ కలిగి జీవించి, మరణించిన వారు పునీతులు! వీరు మరణించిన వెంటనే, తిన్నగా పరలోక రాజ్యమునకు చేరుకుంటారు. అనగా పునీత పట్టా ఇవ్వబడినా, ఇవ్వబడకున్నా, పరలోకంలో దేవుని సమక్షంలో, సంతోషంగా ఉన్న వారందరినీ స్మరించుకొను పండుగ సకల పునీతుల పండుగ! దేవుని పిలుపునకు “ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక” అని సంపూర్ణంగా తనను తాను సమర్పించుకున్న పరిపూర్ణ పునీతురాలికి నిలువెత్తు రూపం మరియమ్మ! జీవితాంతం పాపిగా బతికినా, చివరి క్షణంలో తన తప్పు తెలుసుకొని యేసు వైపు తిరిగి, “యేసూ! నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకొనుము” అనగానే అదే రోజు పరలోకానికి చేరిన తొలి పునీతులలో ఒకడు, ప్రభువుతో సిలువవేయబడి పశ్చాత్తాపపడిన వ్యక్తి! పాపులందరికీ సకల పునీతుల పండుగ ఇస్తున్న గొప్ప నిరీక్షణ! మత్త 5:8 – “నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు.”

శ్రీసభ సకల పునీతుల పండుగను, క్రీస్తు శకం 8వ శతాబ్దమునుండియే జరుపుకుంటుంది. నాలుగవ గ్రెగోరి పోపుగారు, రోమునగరంలో నవంబరు ఒకటవ తేదీన సకల పునీతుల పండుగను జరిపి, మరుసటి సంవత్సరం నుండి విశ్వశ్రీసభ అంతటా, సకల పునీతుల పండుగను జరుపుకొనే విధముగా ఏర్పాటు చేసారు. అప్పటినుండి మనమందరమూ... సకల పునీతుల పండుగను జరుపుకొనుచున్నాము.

మనకు తెలియని, దేవుని దృష్టిలో ఉన్నవారు అనేకులు పునీతులైన వారు, ఈ సకల పునీతులు! మనతోనే, కలిసి జీవించి, దేవుని వద్ద ధన్యత్వమును పొందుకొని, దేవునితో, నిత్యజీవితంలో నిత్యానందమున చేరుకున్న వారే, ఈ సకల పునీతులు.

సకల పునీతులలో మనకు తెలిసిన వారి కన్నా, తెలియని వారు అనేకులు. ఎవరి జీవిత రహస్యాలు ఏమిటో మనకు తెలియదు. దేవునికి మాత్రమే తెలుసు! మొదట పాపులుగా జీవించి, తర్వాత దేవున్ని తెలుసుకొని, పశ్చాతాపం ద్వారా, వారి పాపములను కడిగి వేసుకొని, మనకు తెలియని మంచివారు పునీతులైన వారు ఎందరో, పునీతులుగా, దేవుని దగ్గరకు చేరుకొనియున్నారు. దేవునికి ఇష్టమైన జీవితం జీవించి, దేవుని అనుసరణలో ఆయన అడుగుజాడలలో, ఆయన చూపిన మార్గంలో జీవించి, తమకున్న జీవితాన్ని మొత్తం, దేవుని ఇష్టమైన కార్యాలకు ధారపోసి, ఆ విధముగా జీవించి, ఆయన కొరకు మరణించి, తమ జీవితాలను త్యాగం చేసుకున్న వారందరూ పునీతులే!

అయితే మరణించిన వారందరూ పునీతులా? అంటే కాదు. పవిత్రమైన జీవితం ఎవరైతే జీవించి, తమ జీవితంలో ఏర్పడిన కష్టసుఖాలలో దేవునితోనే జీవించి, అన్నీ దేవునికి అర్పించుకొని, దేవుని అడుగుజాడల్లో, కేవలం దేవునికి మాత్రమే ఆనుకొని, పాపము చేసినా, పాపమును తెలుసుకొని, బ్రతికుండగానే, పశ్చాత్తాప పడి, దేవుని ముందు క్షమాపణ పొందుకొని, జీవించి, మరణించినవారు సకల పునీతులు.

ఉదాహరణగా: పునీత చిన్న తెరేసమ్మగారి జీవితం తీసుకున్నట్లయితే... వీరు జీవించిన తీరు పవిత్రమైన పునీత జీవితం. అతి చిన్న వయసులోనే దేవుని సన్నిధికి చేరుకున్నారు. చిన్న వయసు నుండే, దేవుడు అంటే అమితమైన ప్రేమ, అమితమైన భక్తి విశ్వాసములు, చిన్న వయసులోనే కన్యస్త్రీ కావాలనే ఆశయం, ఆశ, ఆమెలో ఉండేవి. కనుకనే కన్యస్త్రీ కాగలిగారు.

ఆమె జీవితాన్ని ఎక్కువగా ఇతరులకు సహాయం చేయడానికి, ఇతరుల శ్రమలను భరించడానికి ఇష్టపడేవారు. కనుకనే క్రీస్తు ప్రభువు ఆమెకు బాలయేసుగా దర్శనమిచ్చారు. ఆమెతో ముచ్చటించారు. ఆమె తోట పని చేస్తుంటే బాలయేసు దర్శనమయ్యారు, ఆ చిన్న తెరేస ఆ బాలయేసుని ఎత్తుకొని ముద్దాడి, నీ పేరేంటి... అని లాలనగా అడిగారు. ముందు నీ పేరు చెప్పు అని బాలుడు అడగ్గా, “బాలయేసు యొక్క చిన్న తెరేస‌”, అని చిన్న తెరేస చెప్పగా, బాలుడు బదులుగా నా పేరు “చిన్న తెరేస యొక్క బాలయేసు” అని చెప్పి అదృశ్యమయ్యాడు. అప్పుడు అర్థమయింది చిన్న తెరేస గారికి, తాను అప్పటివరకు మాట్లాడింది స్వయముగా దివ్య బాలయేసుతోనేనని!

మన జీవితాలలో కూడా, దేవునిలో మమేకమై, ఆయన కీర్తనలు ఆలపిస్తూ... ఆయనకు ఇష్టమైన కార్యాలు చేయుచూ... ఆయనను అమితంగా ప్రేమిస్తూ ఉంటే, దేవుడు మనతో కూడా మాట్లాడుతారు, ముచ్చటిస్తారు.

చిన్న తెరేస గారు దేవునికి అంకితం చేసుకొని, ఆమె యేసు కోసమే తన జీవితం అని ఏనాడు మరువకుండా, ప్రతిక్షణం యేసు కోసమే తన జీవితాన్ని అంకితం చేసుకున్నారు. పునీత చిన్న తేరేసమ్మ ఈ విధంగా అన్నారు, “నా పరలోక జీవితాన్ని, భూలోక వాసుల మేలుకోసమే ఉపయోగిస్తాను... నా మరణానంతరం రోజాపూలు వర్షం కురిపిస్తాను, ప్రపంచమంతా నన్ను అభిమానిస్తారు” అని ప్రవచనం చెప్పారు. తన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసుకొని తన సమయాన్ని దేవునికి ఇష్టమైన రీతిలో జీవించగలిగారు. ఎన్నో పుణ్యకార్యాలు చేసుకోగలిగారు. యేసు కోసమే తన జీవితం అని ఏనాడు ఆమె మర్చిపోలేదు.

అతి చిన్న వయసులోనే వారికి క్షయరోగం ప్రాప్తించింది. ఆమె జీవిత చరిత్రను ‘ఆత్మ యెుక్క గాధ’గా పుస్తకంలో లిఖించారు. పునీతుల జీవితం ఇదే విధంగా ఉంటుందని చెప్పడానికి ఇది నిదర్శనం!

పునీత చిన్న తెరేసమ్మ మనకు మాట ఇచ్చారు! బ్రతికున్న మన కోసము, మన మేలు కొరకు, తన పరలోక జీవితాన్ని భూలోకములో ఉన్న మన కొరకు ఉపయోగిస్తానని చెప్పారు. అంటే మన కొరకు ప్రార్థిస్తారు. మనం కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని, మనము మంచి ప్రవర్తన కలిగి జీవించాలని, క్రీస్తు కొరకు మనం కూడా పాటుపడాలని, మన యోగక్షేమముల కొరకు ప్రార్థిస్తుంటారు, సకల పునీతులు.

హెబ్రీ 12:1 – “ఈ మహాసాక్షీ సమూహము మేఘము వలెఆవరించి ఉన్నందున మనము సమస్త భారమును మనలను పెనవేసుకొని ఉన్న పాపములను వదల్చుకొని, మనయెదుటనున్న పరుగు పందెమున నిశ్చయముతో పరుగిడుదము.” కాబట్టి, సకల పునీతులు పరలోకంలో కేవలం చూస్తూ ఉండరు. వారు భూమిపై ఉన్న మన పరుగును చూస్తూ, మనం గెలిచేలా మనకు నైతిక మద్దతునిచ్చే ఒక పెద్ద ‘సాక్షుల సమూహం’ లాంటివారు. వారు మన కొరకు నిత్యమూ ప్రార్ధన చేస్తారు. విశ్వాస సంగ్రహములో “పునీతుల బాంధవ్యము అని చెప్తాం; అంటే పరలోకంలోనున్న పునీతులు, ఉత్తరించుస్థలంలోనున్న ఆత్మలు, భూలోకములో పోరాడుతున్న మనం, క్రీస్తు శిరస్సు క్రింద ఒకే కుటుంబము. అందుకే మనం పునీతుల ప్రార్ధన సహాయాన్ని కోరుతుంటాం!

శ్రీసభనందు మాత్రమే ఈ సకల పునీతుల పండుగను కొనియాడుకుంటాము. నీవు... నేను... మనమందరమూ... కూడా, పునీతుల జీవితాలను, సుమాతృకగా తీసుకొని, మనం కూడా దేవునికి ఇష్టమైన కార్యాలు చేయుచూ, ఆయన యందు, ఆయనతో సంభాషిస్తూ... తోటివారి యెడల సఖ్యత కలిగి, ప్రేమతో, క్షమాపణతో, జీవిస్తూ... మంచి మార్గంలో దేవుని బిడ్డలమై, క్రీస్తు ప్రభువు మనకు చూపిన మార్గంలో జీవించుచూ... ఆయనను స్తుతిస్తూ... ఆరాధిస్తూ... ప్రేమిస్తూ... ఆయన యందు విశ్వాసము కలిగి, మన జీవితాలను కూడా, పునీతులను ఆదర్శంగా తీసుకొని, సాటివారిలో క్రీస్తు ప్రభువును చూస్తూ... మనము సకల పునీతులను ఆదర్శంగా తీసుకొని, వారివలె, మనం కూడా, జీవించగలుగుదాం!

మనము బ్రతుకు దినములలో, మనము క్రీస్తు పేరిట మరియు మన జీవితంలో ఎన్ని శ్రమలనుభవిస్తే, మనకు అంత ప్రతిఫలము దక్కును అని గ్రహించి, క్రీస్తు పేరిట, క్రీస్తు శ్రమలలో, భాగస్తులమై జీవించగలగాలి. పునీతులందరూ కూడా అదేవిధంగా జీవించారు.

పునీతులు అంటే మనకు తెలిసిన వారేనా పునీతులు, ఆహా కానే కాదు... ఇంకా అనేకులు... మన దృష్టిలో గుర్తింపు లేని పునీతులు అనేకులు, దేవుని దృష్టిలో గుర్తింపు పొందుకొనిన వారు చాలామంది ఉన్నారు. మన కళ్ళ ముందే ఎంతో మంచి వ్యక్తిత్వం కలిగి, నిందలు, అవమానాలు భరించి క్రీస్తు పేరిట తమకు ఏర్పడిన శ్రమలను భరించి, జీవించి‌... మరణించిన వారు కూడా పునీతులే, వారు నిత్యమూ... మన కొరకు ప్రార్థిస్తూనే ఉంటారు. ఎందుకంటే వారు మంచి జీవితాన్ని దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించారు; కాబట్టి, బ్రతికున్న, జీవిస్తున్న, మన కొరకు, మనం మంచి ప్రవర్తన కలిగి సత్యముతో, స్వార్ధము లేని, దేవునియందు విశ్వాసంతో జీవించాలని వారి ప్రార్థన నిత్యం మనకు తోడై ఉంటుంది.

మనందరం కూడా పునీతులు కావడానికి పిలువబడినామని, అనగా మన జీవిత స్థితిలో, దేవుని పరిపూర్ణతను సాధించడానికి పిలువబడినామని శ్రీసభ మనకు తెలియజేస్తుంది. మనలో ప్రతీ ఒక్కరు, గృహిణులు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు... ప్రతిఒక్కరూ... దైనందిన జీవితంలో దేవుని ప్రేమను ఆచరించడం ద్వారా పునీతులు కాగలరనే సత్యాన్ని నేడు మనం గ్రహించాలి.

ఈనాడు సకల పునీతులను, సకల పునీతులారా! మా కొరకు ప్రార్థించండి, మేము దేవునికి ఇష్టమైన బిడ్డలముగా, మా జీవితాలను, దేవునికి అర్పించుకొని, ఒకవేళ మేము పాపము చేసినచో, మేము అభాగ్యులమని, ఆ పాపములోనే జీవించక, నిజ దేవున్ని తెలుసుకొని, పశ్చాత్తాపము పొందుకొని, సౌలు పౌలుగా మారిన విధముగా మేము కూడా, దేవుని పిలుపును హృదయపూర్వకముగా స్వీకరించి, ఆ విధముగా జీవిస్తూ దేవుని బోధనలను మా జీవితంలోనికి అన్వయించుకొని, తప్పనిసరిగా దేవుని వాక్కను మేమందరమూ కూడా... అనుసరిస్తూ...‌ జీవించులాగున, మా కొరకు ప్రార్థించమని సకల పునీతులను, మనమందరమూ ప్రార్థనా సహాయం కోరుకుందాం. ఆమెన్. సకల పునీతులారా! మా కొరకు ప్రార్థించండి! పితా, పుత్ర, పవిత్రాత్మ నామమునకు, మహిమ కలుగునుగాక! ఆమెన్.

No comments:

Post a Comment