ఫాతిమా మాత / జపమాలమాత మహోత్సవ ప్రసంగం (యెష 61:9-11; 1 పేతు 2:1-10; లూకా 1:26-38)
పూజ్య
గురువులు, గ్రామ పెద్దలు, ప్రియ సహోదరీ, సహోదరులారా! ముందుగా మీ అందరికి ఫాతిమా మాత దేవాలయ వార్షికోత్సవ పండుగ
శుభాకాంక్షలు! ఈరోజు మనం అత్యంత భక్తిశ్రద్ధలతో కొనియాడుతున్న ఫాతిమా మాత దేవాలయ మహోత్సవం
మనకు ఎంతో ఆనందాన్ని, ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ
పవిత్ర సందర్భంలో ఫాతిమా మాత జీవితం, ఆ తల్లి మనకు అందించే
దివ్యసందేశాన్ని ధ్యానించుదాం. వార్షికోత్సవం ఎందుకు? దేవాలయ వార్షికోత్సవం
జరుపుకోవడం కేవలం ఒక ఆచారం, సాంప్రదాయం మాత్రమే కాదు! దేవాలయ ప్రతిష్ట గురించి,
రాజుల మొదటి గ్రంధము 8:62-66; రాజుల దినచర్య రెండవ గ్రంధము 7:8-10లో చూస్తాం. సొలొమోను
మహారాజు యెరూషలేములో మొదటి దేవాలయాన్ని నిర్మించిన తర్వాత, దేవుని
సన్నిధి అక్కడ నిలిచియుండునట్లు దానిని ప్రతిష్ఠించి, ప్రజలందరితో
కలసి 8 రోజుల పాటు గొప్ప ఉత్సవాన్ని జరుపుకున్నాడు. మక్కబీయుల
మొదటి గ్రంధము 4:59 – “ప్రతియేడు బలిపీఠము ప్రతిష్టను పురస్కరించుకొని
సంతసముతో ఉత్సవము చేసికోవలెను... ఆ పండుగను ఎనిమిది దినాళ్ళు జరుపవలయును.” యూదుల
చరిత్రలో అంటియోకస్ అనే రాజు దేవాలయాన్ని అపవిత్రం చేసినప్పుడు, యూదా మక్కబీ మరియు అతని సోదరులు దానిని తిరిగి శుద్ధిచేసి ప్రతిష్ఠించారు.
ఈ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం “దేవాలయ పునర్నిర్మాణ/ప్రతిష్ఠాపన
పండుగ” జరుపుకునే ఆచారం ప్రారంభమైంది. నూతన నిబంధనలో, యోహాను 10:22-23 “యెరూషలేములో
దేవాలయ ప్రతిష్టోత్సవము జరుగుచుండెను. అది శీతకాలము. యేసు దేవాలయమున సోలోమోను
మంటపమున నడుచుచుండెను.” యేసుప్రభువు స్వయంగా యెరూషలేములో జరిగిన దేవాలయ
ప్రతిష్ఠాపన వార్షికోత్సవ పండుగలో పాల్గొని, ఆ ఆచారాన్ని
గౌరవించారని సువార్త స్పష్టం చేస్తోంది.
శ్రీసభ
బోధనల ప్రకారం, దేవాలయ వార్షికోత్సవానికి మూడు ప్రధానమైన ఆధ్యాత్మిక అంశాలు
ఉన్నాయి:
ఒకటి, దేవాలయం అంటే దేవుని నివాసం. దేవాలయం
అంటే కేవలం రాళ్ళు, సిమెంటుతో కట్టిన భవనం
కాదు. దివ్యబలిపూజ ద్వారా ప్రభువైన యేసు స్వయంగా నివసించే “దైవ నివాస స్థలం”. ప్రార్ధనకు, దైవారాధనకు పవిత్రమైన స్థలం! రెండు, ఈ భౌతిక దేవాలయం
మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రతీక. మనమందరం క్రీస్తు అనే పునాది రాయిపై నిర్మించబడిన
సజీవమైన దేవాలయాలమని శ్రీసభ బోధిస్తుంది. (చదువుము: 1 పేతురు 2:5; 1 కొరి 3:16). దేవాలయ
వార్షికోత్సవం జరుపుకున్నప్పుడు, భౌతిక దేవాలయంతో పాటు మన
హృదయాలనే పవిత్ర దేవాలయాలను కూడా పవిత్రంగా ఉంచుకోవాలని శ్రీసభ గుర్తుచేస్తుంది. మూడు,
ప్రతిష్ఠించబడిన ప్రతి దేవుని ఆలయం విశ్వ కతోలిక శ్రీసభకు చిన్న రూపం. విశ్వాసంలో
మనం అంతా దేవుని కుటుంబం, దేవుని బిడ్డలం అని గుర్తుకు చేస్తుంది.
కాబట్టి, దేవాలయ వార్షికోత్సవాలు ఎందుకు జరుపుకుంటాము అంటే,
1. మన గ్రామానికి లేదా సంఘానికి దేవుడు
ఇచ్చిన పవిత్ర దేవాలయాన్ని బట్టి, ముఖ్యంగా ఈ దేవాలయంలో
లభించిన దివ్యసంస్కారాలను బట్టి, కృతజ్ఞతలు తెలపడం. 2. విశ్వాసులందరూ
ఒక్కటై, ఐఖ్యతగా దేవుని కుటుంబంగా ప్రార్థనలో,
దివ్యబలిపూజలో మరియు సహవాసంలో పాలుపంచుకోవడం. 3. మన
వ్యక్తిగత మరియు కుటుంబ జీవితాలలో పాపపరిహారం పొంది, హృదయ
పరివర్తన ద్వారా నూతన ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పొందడం కోసం. 4. ఆ
దేవాలయానికి నామకరణం చేయబడిన పవిత్ర దేవమాత లేదా పునీతుల జీవితాన్ని ధ్యానించి,
వారి మధ్యవర్తిత్వ ప్రార్ధన సహాయాన్ని కోరడం. మన దేవాలయం ఫాతిమా మాత
దేవాలయం...
కాబట్టి, ప్రియ సహోదరీ సహోదరులారా! దేవాలయ వార్షికోత్సవం అనేది దేవుడు మన మధ్య నివసిస్తున్నాడనే పరమ సత్యాన్ని కొనియాడే మహోత్సవం. ఇది భౌతిక కట్టడానికి ఇచ్చే గౌరవం మాత్రమే కాదు, ఆ కట్టడం ద్వారా, దేవుని ప్రజలైన మనందరి ఆత్మీయ ఉత్సవం!
ఫాతిమా దర్శనాల నేపధ్యం
ఫాతిమా
మాత అనగానే మొదటిగా మనకు గుర్తుకు వచ్చేది, ఫాతిమా మాత దర్శనాలు. 1917 మే 13వ తేదీ నాటికి మొదటి
ప్రపంచ యుద్ధం ప్రారంభమై మూడు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ యుద్ధం వల్ల ప్రపంచమంతా
అశాంతితో, ప్రాణ నష్టంతో ఛిన్నాభిన్నమైంది. దాదాపు 80
లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. సరిగ్గా అదే సమయంలో, పోర్చుగల్‌లోని
‘ఫాతిమా’ అనే చిన్న గ్రామంలో గొర్రెలు మేపుకునే లూసీ, ఫ్రాన్సిస్,
జసింత అనే ముగ్గురు చిన్నారులకు పరలోకం నుండి దేవుని తల్లి మరియమాత
దర్శనమిచ్చారు. ఆ తల్లినే మనం ఈరోజు ‘ఫాతిమా మాత’ అని భక్తితో గౌరవిస్తున్నాం. ఆ
ముగ్గురు చిన్నారులకు ఆ తల్లి ఆరుసార్లు ప్రత్యక్షమై, మానవాళికి
ఒక ప్రత్యేకమైన దివ్య సందేశాన్ని అందించారు.
ఫాతిమామాత ఇస్తున్న హెచ్చరిక మరియు సందేశం
మానవులు
తమ ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా చేస్తున్న పాపాల వలన పరలోక తండ్రి ఎంతో బాధపడుతున్నారని ఆ
తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. పాపాత్ములు తమ మనసు మార్చుకోవాలని, పశ్చాత్తాపం చెందాలని, ప్రాయశ్చిత్తం చేసుకోవాలని
కోరారు. మానవులను నరకం నుండి రక్షించి, యేసుక్రీస్తు నేర్పిన
దేవుని ప్రేమను, సోదర ప్రేమను అందరూ ఆచరించాలన్నదే ఆ తల్లి
ముఖ్య ఉద్దేశం. నిజమైన పశ్చాత్తాపము: యోవేలు 2:13 (చదువుము).
అలాగే, ప్రపంచ శాంతి కోసం, సమైఖ్యతకోసం ప్రతిరోజూ భక్తితో జపమాలను
ప్రార్థించమని ఆ తల్లి కోరారు.
ఆరు దర్శనాలు – నిలిచిన అద్భుతం
మొదటి దర్శనం (మే 13): గొర్రెలు కాస్తున్న ఆ ముగ్గురు చిన్నారులకు ఒక ఒలీవ చెట్టుపై బంగారు రంగు
దుస్తులు ధరించి, చేతిలో జపమాలతో దర్శనమిచ్చింది. లూసీ అను
చిన్నారు, ధైర్యంచేసి, మేర్రు ఎవరు?’ అని అడుగగా, ఆ తల్లి... “నేను పరలోకము నుండి
దిగివచ్చాను. రాబోయే ఆరు నెలల పాటు ప్రతి నెల 13వ తేదీన మీరు
తప్పకుండా ఇక్కడికి రావాలి. అప్పుడు నేనెవరినో, ఎందుకు
వచ్చానో నేను ఆశించేదేమిటో తెలుపుతాను” అని చెప్పారు.
రెండవ దర్శనం (జూన్ 13): ఆ
చిన్నారులకు చెప్పినట్లుగా మరియతల్లి జూన్ మాసం 13వ తేదీన పోర్చుగల్ దేశ పాలకులు పునీత అంతోని వారి పండుగ రోజున మరల ఆ
చిన్నారులకు దర్శనమిచ్చారు. అక్కడ సుమారు 70 మంది హాజరైనా, వారెవరు ఆ తల్లిని చూడలేదు. ఆ ముగ్గురు చిన్నారులు మాత్రం ఆ తల్లిని
కళ్ళారా చూసి ఆమె పలుకులు మనసారా విన్నారు. రెండవ దర్శనంలో ఆ తల్లి పలికిన మాటలు: “ప్రతి దినం జపమాలను జపించండి” అని చెప్పారు.
మూడవ దర్శనాలు (జూలై 13): ప్రపంచ
శాంతి కోసం జపమాల చెప్పాలని ఆ తల్లి మళ్లీ మళ్లీ గుర్తుచేశారు. ఆ తల్లి ప్రాధేయపడి,
ప్రతి జపమాల గుర్తు చివరన మనం నేడు చెప్పుకునే ప్రార్థనను వెల్లడిచేసారు, “ఓ నా
యేసువా! నా పాపములను మన్నించండి. నరకాగ్ని నుండి నన్ను కాపాడండి. ఆత్మలన్నింటినీ, ముఖ్యంగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్షమునకు
తీసుకొనిపొండి.”
నాలుగవ దర్శనం (ఆగష్టు 19): ప్రజలు నమ్మకపోయినా, ప్రభుత్వ అధికారులు
పిల్లలను భయపెట్టినా, ఆ చిన్నారులు అచంచల విశ్వాసం ముందు
ఎవరి ప్రయత్నాలూ సాగలేదు. ఆగస్టు మాసంలో 19వ తేదీన వారు
దేవమాత దర్శన భాగ్యానికి నోచుకున్నారు. ఈసారి దర్శనంలో ఆ తల్లి అక్టోబర్ మాసంలో ఒక
గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నానని. ప్రతి ఒక్కరు మరింత ఎక్కువగా ప్రార్థనలలో, జపమాల ధ్యానంలో పాల్గొనాలని ఆ తల్లి ఆదేశించి అదృశ్యమయ్యారు.
ఐదవ దర్శనం (సెప్టెంబరు 18): ఈసారి దేవమాత దర్శనం సెప్టెంబర్ 18వ తేదీన ఇరియాలోనే జరిగింది. అక్కడ సుమారు 25 వేల మంది హాజరయ్యారు. అప్పుడు ఆ తల్లి ఈ విధంగా అన్నారు, “ప్రతిదినం జపమాల చెప్పటం మర్చిపోవద్దు. అక్టోబర్ మాసంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాను అని మరొకసారి చెప్పి అదృశ్యమయ్యారు.
అద్భుతమైన ఆఖరి దర్శనం (అక్టోబర్ 13): ఆ తల్లి మాట ఇచ్చినట్లుగానే,
అక్టోబర్ 13వ తేదీన ఇరియా లోయలో 70 వేల మందికి పైగా ప్రజల సమక్షంలో ఒక గొప్ప అద్భుతం చోటు చేసుకుంది. సూర్యుడు
రంగులు మారుతూ చక్రంలా తిరగడం, వర్షం ఆగిపోవడం అక్కడ ఉన్న
ప్రతి ఒక్కరూ కళ్లారా చూశారు. నాస్తికులు సైతం ఆ అద్భుతాన్ని చూసి దేవుని మహిమను
నమ్మి మోకాళ్లపై నిలబడి ప్రార్థించారు. అక్టోబర్ 13వ తేదీన ఆ
ముగ్గురు చిన్నారులకు చివరి సారిగా ప్రత్యక్షమై “నేను జపమాల
మాతను. మానవాళి చేస్తున్న పాపాల కోసం ప్రాయశ్చిత్తం పొందాలని అడిగేందుకు నేను
ఇచ్చటకి వచ్చాను. మనుషులు తమ పాపాలతో ఇప్పటికే ప్రభువును అనేక రకాలుగా హింసించారు.”
అని తన చివరి దర్శనంలో దేవమాత తమ మనో వ్యధను వ్యక్తం చేశారు.
ఫాతిమామాత - మనకందరికీ ఈ దేవాలయ వార్షికోత్సవం రోజున ఇస్తున్న సందేశం:
క్రైస్తవ
చరిత్రలో మరియ తల్లి ఎన్నో దర్శనాలిచ్చినా, ఫాతిమా దర్శనాలు ప్రపంచ
విశ్వాసులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చాయి. మరియ తల్లి కేవలం యేసును కన్న తల్లి
మాత్రమే కాదు... క్రీస్తును అనుసరించిన మొదటి శిష్యురాలు. తన కుమారుని మార్గంలో
మనం కూడా నడవాలనే ఆ తల్లి ఇంతగా తపన పడ్డారు.
ప్రియమైన
విశ్వాసులారా! మరియ తల్లి ప్రతి దర్శనంలోనూ మనకు చెప్పిన ఒకే ఒక మాట – “జపమాలను జపించండి, హృదయ పరివర్తన చెంది క్రీస్తు మార్గంలో అడుగులు
వేయండి.” ఈ పవిత్ర వార్షికోత్సవ దినాన మనమందరం ఆ తల్లి మాటను పాటిద్దాం. ప్రతిరోజూ
మన ఇళ్లలో జపమాలను ప్రార్థిద్దాం. మన కష్టసుఖాలను ఆ తల్లితో పంచుకుందాం. ఫాతిమా
మాత మధ్యవర్తిత్వం ద్వారా మన కుటుంబాలన్నీ ఆయురారోగ్యాలతో, సంతోషంతో,
ఐక్యతతో వర్ధిల్లాలని ఆ తల్లిని వేడుకుందాం.
పునీత లూకా గారు వ్రాసిన సువార్త 1:50 - “ప్రభువుపట్ల భయభక్తులుగలవారి
మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును.” కీర్తన 103:17 – “ప్రభువు పట్ల
భయభక్తులు చూపువారి యెడల ఆయన కృప అనాదినుండి అనంతకాలము వరకు ఉండును.” దేవుని ప్రేమ, దేవుని అపరిమితమైన
కనికరము మరియు దేవుడు ఒసగు ధన్యత మనందరికీ లభించాలంటే - మనము దేవునికి పరిపూర్ణమైన
బిడ్డలముగా జీవించాలి. మన పట్ల ఉన్న దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడాలి.
మన హృదయాలను ప్రభువునకు అంకితం చేస్తూ, ప్రతిక్షణం ఆయనను
స్తుతిస్తూ సాగిపోయే క్రైస్తవ జీవితమును మనం జీవించాలి. దేవుడు ఎల్లప్పుడూ తన
అపారమైన కృపను మనపై కురిపించడానికి సిద్ధంగా వేచి చూస్తున్నారు.
మరియమాత సమర్పణ – విధేయతకు మాదిరి
మన
పరిశుద్ధ జపమాల మాత, దేవుని సంకల్పాన్ని
నెరవేర్చడానికి - “ఇదిగో నేను ప్రభువు దాసురాలను; నీ మాట
చొప్పున నాకు జరుగునుగాక!” (లూకా 1:38) అని తనను తాను దేవుని చిత్తానికి
సంపూర్ణంగా అప్పగించుకుంది. అందుకే ఆమె స్త్రీలందరిలో ఆశీర్వదించబడినదిగా, ధన్యురాలిగా కీర్తించబడింది.
జపమాల
రాజ్ఞిగా అమ్మ ఎన్నో అద్భుత కార్యములను చేస్తూనే ఉన్నారు. వివిధ దర్శనాల ద్వారా
విశ్వాసులను దేవుని చిత్తం వైపు నడిపిస్తున్నారు. స్వచ్ఛమైన ప్రేమతో జీవించాలని, దేవుని అనుసరణలో ఆయన చెప్పినట్లు నడుచుకోవాలని మనల్ని
నిరంతరం హెచ్చరిస్తూ, కాపాడుతున్నారు.
ప్రేమ రాజ్య నిర్మాణం - శాంతి పిలుపు
మనందరి
హృదయాలలో స్వచ్ఛమైన దైవప్రేమ పొంగిపొర్లాలి. కుట్రలు, కుతంత్రాలు, శత్రుత్వము,
ద్వేషము మరియు యుద్ధాలు దేవుని హృదయాన్ని తీవ్రంగా గాయపరుస్తాయి. ప్రపంచ
దేశాలన్నీ సమైక్యతతో మెలగాలి; ఒక దేశం మరొక దేశంపై
యుద్ధానికి దిగకూడదు. దేవుడు కోరుకున్నది ప్రేమ రాజ్యాన్ని, శాంతి
వాతావరణాన్ని మాత్రమే! మత్త 5:9 – “శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని
కుమారులనబడుదురు”. రోమీ 12:18 – “అందరి తోడను సౌమ్యముగా జీవించునట్లు మీకు
సాధ్యమైనంత వరకు ప్రయత్నింపుడు.”
వ్యక్తిగతంగా
మరియు కుటుంబపరంగా మనమందరం గొడవలకు, మనస్పర్ధలకు దూరంగా
ఉండాలి. దేవుని పట్ల భయభక్తులు కలిగి, ఆయనకు విధేయులమై
జీవించినప్పుడే, ఆయన కనికరాన్ని మన తరతరాలు పొందుకుంటాయి. అప్పుడే
మనం దేవునిచే ఎన్నుకోబడతాము, ఆశీర్వదించబడతాము, ఆయన మహిమలో ఘనపరచబడతాము.
జపమాల – మన ఆత్మరక్షణ ఆయుధం
ప్రతి
ఒక్కరి ఇంటా, ప్రతి ఒక్కరి చేతిలో ‘పవిత్ర
జపమాల’ అనే క్షేమకరమైన ఆత్మీయ ఆయుధం తోడుగా ఉండాలి. ఏకాగ్రతతో, ధ్యాసతో జపమాలను ప్రార్థిద్దాం. ప్రతి కుటుంబంలో జపమాల ప్రార్థనను విధిగా
పాటిద్దాం. మన పిల్లలకు జపమాల విశిష్టతను, దాని ఆధ్యాత్మిక
విలువను నేర్పిద్దాం. కృతజ్ఞతా భావంతో ప్రార్ధన చేద్దాం - ఫిలిప్పీ 4:6
(చదువుము)
“ఓ
జపమాల రాజ్ఞీ! మా కొరకు మీ ప్రియ కుమారుని వేడుకొనండి తల్లీ! మమ్ములను, మా కుటుంబాలను క్షేమంగా కాపాడండి” అని నిత్యం అమ్మను
ప్రార్థిద్దాం. దేవుని దయలో, ఆయన దివ్య ప్రేమలో మన జీవితాలు,
కుటుంబాలు నూతన మేలులతో నిండుగాక! దేవుని కృప ద్వారా మన అనుదిన
జీవితంలో ఆశ్చర్యకార్యములను చవిచూద్దాం.
నేటి సమాజ పరిస్థితులకు అనుగుణంగా ఆచరణాత్మక జీవిత మార్గదర్శకాలు:
1. నేడు చిన్నపిల్లల నుండి పెద్దల వరకు
రోజూ గంటల తరబడి స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా మరియు
టీవీలకే సమయం కేటాయిస్తున్నారు. ప్రతిరోజూ కనీసం కొంత సమయం ఫోన్‌లు పక్కన పెట్టి, కుటుంబమంతా
కలసి జపమాల ప్రార్థన చేయడం అలవర్చుకోవాలి. డిజిటల్ ప్రచారాలకు గురికాకుండా,
దేవుని వాక్యం మరియు ప్రార్థనల ద్వారా మన హృదయాలలో ప్రశాంతతను,
సమాధానాన్ని, సంతోషాన్ని, ఆత్మసంతృప్తిని నెలకొల్పుకోవాలి.
2. కులాలు, మతాలు, రాజకీయాలు మరియు సమాజంలో, సంఘములో చిన్న
విషయాలకే కోపతాపాలు, విద్వేషాలు, గొడవలు
పెరుగుతున్నాయి. ఫాతిమా మాత కోరినట్లుగా, సమాజంలో లేదా
పొరుగువారితో వివాదాలు వచ్చినప్పుడు క్రోధాన్ని చూపక, ఓర్పుతో,
ప్రేమతో సమాధానపరచాలి. “శాంతి స్థాపకులు ధన్యులు” అన్న వాక్యాన్ని
పదేపదే గుర్తుచేసుకుందాం. మన చుట్టూ ఉన్న ఇతర మతాల వారితో, ఇరుగుపొరుగు
వారితో క్రీస్తు ప్రేమను ప్రతిబింబించేలా సోదరభావంతో జీవించడానికి ప్రయత్నం
చేద్దాం.
3. కుటుంబాలలో చిన్న చిన్న మనస్పర్ధలు, అహం వలన, ఆస్తి తగాదాల వలన,
రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువులు, అలాగే భార్యాభర్తలు
విడిపోతున్నారు. జపమాల ప్రార్థనతో పాటు, పగలు-ప్రతీకారాలు
పక్కన పెట్టి ఒకరినొకరు క్షమించుకోవాలి. ప్రతిరోజూ
“ఓ నా యేసువా! మా పాపములను మన్నించండి” అని ప్రార్థించే మనం, మనకు హాని చేసినవారిని కూడా హృదయపూర్వకంగా మన్నించే గుణాన్ని
అలవర్చుకోవాలి.
4. నేటి యువత, పిల్లలు లోకసంబంధమైన ఆకర్షణలకు, వ్యసనాలకు త్వరగా లోనవుతున్నారు. (ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగులు,
చెడు అలవాట్లు, కొన్నిచోట్ల మత్తుపదార్ధాలు, తాగుడు, జూదం... మొ.వి.). తల్లిదండ్రులు
కేవలం పిల్లల చదువులు, భవిష్యత్తు కోసమే కాక, వారి ఆధ్యాత్మిక ఎదుగుదలపై దృష్టి పెట్టాలి. ఫాతిమాలో మరియతల్లి చిన్న
పిల్లలైన లూసీ, ఫ్రాన్సిస్, జసింతలను
ఎన్నుకున్నట్లే, మన పిల్లలకు కూడా భక్తి, వినయం, నిజాయితి మరియు జపమాల ప్రాముఖ్యతను పసి వయసు నుండే నేర్పించాలి.
5. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఒంటరితనంతో
బాధపడేవారు మన చుట్టూ ఎందరో ఉన్నారు. ప్రార్థన కేవలం పెదవులకే పరిమితం కాకుండా
క్రియలలో కనిపించాలి. మన గ్రామంలో లేదా ఇరుగుపొరుగున ఉన్న పేదలకు, వృద్ధులకు, వ్యాధిగ్రస్తులకు మనకు తోచిన రీతిలో
సహాయం చేయడం ద్వారా క్రీస్తు ప్రేమను కార్యాచరణలో చూపించాలి.
ప్రియమైన
విశ్వాసులారా! నేటి కాలంలో మన చేతుల్లో స్మార్ట్‌ఫోన్‌లు ఎంత సహజమైపోయాయో, మన హృదయాలలో ‘జపమాల’ అంతకంటే ఎక్కువగా భాగం కావాలి.
సోషల్ మీడియాలో సమయం గడిపే మనం, దేవుని సన్నిధిలో జపమాల
చెప్పడానికి సమయం కేటాయిద్దాం. మన ఇళ్లలో శాంతిని, మన
పొరుగువారితో ప్రేమను, మన పిల్లలలో భక్తిని
పెంపొందించుకోవడమే ఫాతిమా మాత మనకు ఇస్తున్న నిజమైన ఆచరణాత్మక సందేశం!

No comments:
Post a Comment