వేదవ్యాపక ఆదివారము
యెషయ 2:1-5; ఎఫెసీ 3:2-12; మార్కు 16:15-20
“మీరు ప్రపంచ మందంతట తిరిగి, సకలజాతి జనులకు సువార్తను బోధింపుడు” (మార్కు. 16:15)
ఉపోద్ఘాతము
క్రీస్తునందు ప్రియమైన సహోదరీ సహోదరులారా! ప్రతీ సంవత్సరం అక్టోబర్ మూడవ ఆదివారమున ‘ప్రపంచ వేదవ్యాపక ఆదివారము’. ప్రపంచ వ్యాప్తముగా ఒక
బిలియన్ పైగానున్న (10,000 లక్షలు) కతోలిక విశ్వాసులందరమూ ‘ప్రపంచ వేదవ్యాపక ఆదివారము’ను కొనియాడుచున్నాము. ‘వేదవ్యాపక
ఆదివారము’ను 1926వ సం.లో 11వ భక్తినాధ జగద్గురువులు స్థాపించారు. ఆనాటినుండి
నేటివరకు కూడా విశ్వశ్రీసభ అక్టోబరు మాసమును వేదవ్యాపకము కొరకై ప్రార్ధన చేయడానికి
అంకితం చేసింది. ఈరోజు మనం వేదవ్యాపక ఆదివార దివ్యపూజాబలిలో పాల్గొని, ప్రపంచ వ్యాప్తంగా
సువార్తా ప్రచారము కొరకు, ప్రార్ధనలు చేస్తూ, దానినిమిత్తమై మనకు తోచిన ఆర్ధిక
సహాయాన్ని అందజేస్తాము. ఈ వార్షిక వేడుకద్వారా విశ్వశ్రీసభ యొక్క మిషన్,
ప్రేషితకార్యమైన సువార్త ప్రచారం లేదా వేదవ్యాపకం గురించి ధ్యానిస్తూ ఉంటాము.
అలాగే, విశ్వశ్రీసభతో ‘మేమున్నాము’, క్రీస్తుయొక్క ప్రేశితకార్యమైన ‘దైవరాజ్యవ్యాప్తి’
కొనసాగింపుకు కట్టుబడియున్నామని నేడు మనమందరముకూడా ప్రకటిస్తున్నాము.
సువార్త ప్రచారం శ్రీసభ ప్రధాన పరిచర్య – మనందరి బాధ్యత
శ్రీసభ ప్రధానముగా మిషనరీ లేదా వేదవ్యాపక సభ.
కనుక శ్రీసభ ప్రధాన బాధ్యత లేదా ప్రేషిత ధర్మం సువార్తీకరణ. ఎందుకన, యేసుక్రీస్తు
ప్రధమ మిషనరీ. తండ్రియైన దేవుడు, దైవకుమారున్ని తన ప్రేమ, పరలోక రక్షణ సందేశముతో ఈ
లోకానికి పంపియున్నాడు. ఒక మిషనుతో, ఒక మిషనరీగా ఆయన ఈ లోకానికి ఏతెంచాడు.
దైవరాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ సందేశాన్ని స్పష్టముగా
యోహాను సువార్త 3:16లో చూడవచ్చు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక
కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్యజీవమును
పొందుటకై అట్లు చేసెను”. యోహాను ఇదే విషయాన్ని మరల తన మొదటి లేఖ 4:9లో స్పష్టం
చేసియున్నాడు: “ఆయనద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ
లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను”. పౌలు తిమోతీకి
రాసిన మొదటి లేఖ 2:4లో, శ్రీసభ ప్రేషిత లక్ష్యాన్ని ఇలా తెలిపియున్నారు: “మానవులు
అందరు రక్షింపబడ వలయునని, సత్యమును తెలిసికొన వలయునని దేవుని అభిలాష”. ఇదే నిజమైన
సువార్త, శుభవార్త. ఈ సువార్తను మనం ప్రకటించాలి.
కనుక, శ్రీసభ తప్పనిసరిగా దేవుని ప్రేమ, దయ,
కనికరము, క్షమాపణ, రక్షణ గురించి ప్రకటించాలి, బోధించాలి. అందుకే, శ్రీసభ ప్రధాన
అంశం అయిన సువార్తా వ్యాప్తిలో, వేదవ్యాపకములో పాల్గొనడం ముఖ్యమైన భాగముగా మనం
గుర్తించాలి. క్రీస్తుసువార్తా సారాంశమైన ప్రేమ, శాంతి, నిరీక్షణ, మన్నింపు,
సహవాసముల సందేశాన్ని ధైర్యముగా ప్రకటించాలి. “మీరు ప్రపంచ మందంతట తిరిగి, సకలజాతి జనులకు
సువార్తను బోధింపుడు” (మార్కు. 16:15; చూడుము. మత్త. 28:19) అన్న క్రీస్తు మాటలు
మనలను చైతన్యవంతులను చేయాలి.
వేదవ్యాపకం జ్ఞానస్నానం పొందిన ప్రతీ క్రైస్తవుని
బాధ్యత, కర్తవ్యం. ఈ బాధ్యతను, కర్తవ్యాన్ని యెషయ ప్రవక్తవలె స్వచ్చందముగా చేయాలి.
“నేనున్నానుగదా, నన్ను పంపుడు (6:8) అని యెషయ ప్రవక్త పలికి యున్నాడు. ఒకరు బలవంతం
చేస్తే చేసేది కాదు వేదవ్యాపకం. మనస్పూర్తిగా, స్వచ్చంధముగా చేయాలి. అయితే అ.కా.
4:20వ వచనములో, విచారణ సభముందు - యూదుల నాయకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు,
ప్రధాన యాజకుడైన అన్నా, కైఫా, మొదలగు వారి సమక్షములో, పేతురు, యోహానులు పలికిన
వాక్యాలుకూడా మనకు స్పూర్తిదాయకం కావాలి. “మేము మా కన్నులార చూచిన దానిని గూర్చి,
చెవులార విన్న దానిని గూర్చి మాట్లాడకుండ ఉండలేము” అని ధైర్యముగా పలికి యున్నారు.
మన హృదిలో, మదిలో పొందిన క్రీస్తు విశ్వాసాన్ని, క్రీస్తు సువార్తను చాటాలి,
ప్రకటించాలి.
పరలోకానికి కొనిపోబడుటకు ముందు యేసు తన
శిష్యులతో, “పవిత్రాత్మ మీ పైకి వచ్చునప్పుడు, మీరు శక్తిని పొందుదురు. కనుక... భూదిగంతముల
వరకు నాకు సాక్ష్యులై ఉండెదరు” (అ.కా. 1:8) అని పలికి యున్నారు. వేదవ్యాపకం కేవలం మన
పని కాదు, మనం మాత్రమే చేసేది కాదు. పవిత్రాత్మ శక్తిని పొందుకున్నప్పుడు మాత్రమే
మనం చేయగలం. అది పరిశుద్ధాత్మ దేవుని పవిత్ర కార్యము. మనం కేవలం ఆయన సాధనాలము
మాత్రమే. కనుక, ప్రతీ క్రైస్తవుడు/రాలు క్రీస్తు మిషనరీగా, క్రీస్తు సాక్షిగా
పిలువబడి యున్నారు. సువార్తా ప్రచారం మన అందరి బాధ్యత. ప్రతీ ఒక్కరు దేవుని
ప్రేమను, రక్షణను ఇతరులతో పంచుకోవాలి.
సువార్త వ్యాప్తి / వేదవ్యాపకం మనం ఎలాచేయాలి?
మొట్టమొదటిగా శ్రేష్టమైన, పారదర్శకమైన, పవిత్రమైన
క్రైస్తవ జీవితాన్ని జీవించడం ద్వారా సువార్తా ప్రచారం చేయాలి. క్రీస్తుకు
సాక్షిగా ఉండటానికి అత్యంత శక్తివంతమైన సాధనం ‘నిజమైన లేదా అసలు సిసలైన క్రైస్తవ
జీవితాన్ని జీవించడం’. ప్రేమ, దయ, కనికరము, ప్రార్ధన, క్షమాగుణము కలిగిన
జీవితాన్ని జీవించడం. “నా జీవితమే నా సందేశము”గా మారాలి. రోజాపువ్వు ఎలాంటి
వాఖ్యలను చేయదు. కాని, తను వెదజల్లే సువాసనద్వారా, తన ఎదురులేని అందముద్వారా
అందరిని తనవైపునకు ఆకర్షిస్తుంది. కనుక, వేదవ్యాపకములో ముఖ్యమైన విషయం మనం జీవించే
మంచి జీవితం. అనాధి క్రైస్తవులు ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించారు. క్రైస్తవుల
పరస్పర ప్రేమను చూసి అన్యులు అనేకమంది ఆకర్షింప బడ్డారు. ఇచ్చట క్రీస్తు పలుకులను
జ్ఞాపకం చేసుకుందాం: “మీరు పరస్పరము ప్రేమ కలిగి యున్నచో, దానిని బట్టి మీరు నా
శిష్యులని అందరు తెలిసి కొందురు” (యోహాను. 13:35).
రెండవదిగా ప్రార్ధన. మన ప్రార్ధనద్వారా
సువార్తా ప్రచారం చేయవచ్చు. “నేను లేక మీరు ఏమియు చేయ జాలరు” (యోహాను. 15:5) అని
ప్రభువు పలికి యున్నారు. కనుక, యేసును ప్రభువుగా, రక్షకునిగా అంగీకరించాలని
కోరుకునే వారందరికీ, అలాగే క్రీస్తు సువార్తను బోధించే ప్రతి ఒక్కరికి ప్రార్ధన
ఎంతో అవసరం. ప్రార్ధన నేపధ్యములో మాత్రమే క్రీస్తుకు సాక్ష్యులుగా మారడానికి
పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయును. మిషనరీలు, సువార్తా బోధకులు అందరిలాగే మానవ
మాత్రులు, బలహీనులు. క్రీస్తుకు సాక్ష్యులుగా జీవించడం అంత సులువు కాదు. అది ఎన్నో
సవాళ్ళతో కూడుకున్నటు వంటిది, కనుక మన ప్రార్ధనలతో వారిని బలపరచుదాం. “పంట విస్తారము
కాని పనివారు తక్కువ. కనుక పనివారిని పంపవలసినదిగా ప్రార్ధింపుడు” (లూకా. 10:2).
కనుక, దేవుని రాజ్యములో పనిచేయుటకు, తమ జీవితాలను అంకితం చేసుకొనుటకు అనేకమంది ప్రేరేపింప
బడాలని, సంసిద్ధమై ధైర్యముగా ముందుకు రావాలని ప్రార్ధన చేద్దాం. సిలువ చెంత, మరియు
‘పైగది’లో శిష్యులతో కలిసి మరియ తల్లి శ్రీసభ కొరకు ప్రార్ధన చేసిన విధముగా,
తనవంతు సహకారాన్ని అందించిన విధముగా, మనము కూడా ప్రార్ధన ద్వారా, తల్లి శ్రీసభకు
మనవంతు సహకారాన్ని అందిద్దాం.
మూడవదిగా ఆర్ధిక సహాయముద్వారా మనం సువార్తా ప్రచారం లేదా వేదవ్యాపకాన్ని చేయవచ్చు. ప్రతీ వేదవ్యాపక ప్రయత్నానికి ఆర్ధిక మద్దతు ఎంతో అవసరం. పేదవారికి సహాయం చేయడం, అనారోగ్యులకు వైద్యసహాయం అందించడం, సువార్తా వ్యాప్తికి ఆధునిక టెక్నాలజీకి...మొ.గు వాటన్నింటికీ ఆర్ధిక సహాయం ఎంతో అవసరం. ప్రపంచ మంతటా నెలకొన్న 3వేల మేత్రాసణాలలో దాదాపు ఒక వెయ్యికి పైగా మేత్రాసణాలు ఇంకా మిషనరీ మేత్రాసణాలుగా ఉన్నాయి. వారికి ఆర్ధిక సహాయం ఎంతో అవసరం. మనం చేసే ఆర్ధిక సహాయం, విరాళాలు జగద్గురువులు పోపు ఫ్రాన్సిస్ ద్వారా, ఈ మిషనరీ మేత్రాసణాలకు చేరుతుంది. మన ఉదారమైన విరాళాల ద్వారా సువార్త వ్యాప్తికై సహాయం చేద్దాం, తద్వారా, మనము కూడా వేదవ్యాపకములో భాగస్థులమవుదాం.
సవాళ్లు / ఇబ్బందులు – మన
దృక్పధం
వేదవ్యాపకం ఎన్నో
సవాళ్ళతో కూడుకున్నటు వంటిది. “మీరు పొందు. ఇదిగో! తోడేళ్ళ మధ్యకు గొర్రెపిల్లలవలె
మిమ్ము పంపుచున్నాను” (లూకా. 10:3) అని ప్రభువు చెప్పియున్నారు. నేడు మనం
ఎదుర్కుంటున్న పెద్దమిషనరీ సవాలు లౌకికవాదం మరియు వినియోగ సంస్కృతి. వీని మూలముగా అనేకమంది
దేవునికి అంతగా ప్రాముఖ్యత లేకుండా జీవిస్తున్నారు. నైతిక విలువలు కుంటుబడి పోవుచున్నాయి.
మతాలు అవసరం లేదని ఎంతోమంది భావిస్తున్నారు. ఇలాంటి ‘సంస్కృతి’లో, సువార్తా
ప్రచారం, వేదవ్యాపకం నిజముగా పెద్ద సవాలే! ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులలో శ్రీసభ
మరింత ఆలోచనాత్మకముగా, పవిత్రముగా, మిషనరీ-కేంద్రీకృతమైన శ్రీసభగా మారాలి. తన
ప్రేషిత కార్యాన్ని ప్రార్ధనపై ఆధారపడుతూ కొనసాగించాలి. దైవపిలుపులు అధికముగా
నున్న ప్రాంతాలనుండి, దైవపిలుపులు ఎక్కువగా లేని ప్రాంతాలకు వెళ్లి సువార్తా పరిచర్యను
చేయడానికి సిద్ధపడాలి. నేటికీ సువార్త ప్రకటింపబడని ప్రాంతాలకు సైతము ఉత్సాహముతో,
ధైర్యముగా వెళ్ళడానికి సిద్ధపడాలి.
ప్రజలందరూ
దేవునివైపుకు చేసే ప్రయాణములో, వారిని సువార్త వెలుగుతో ప్రకాశింప జేయడమే శ్రీసభ
లక్ష్యం. దైవప్రేమకుగల శక్తి తప్పక అంధకారాన్ని జయించి, సన్మార్గములో
నడిపిస్తుంది. కనుక, ఇతర సాంప్రదాయాలను, తాత్విక వ్యవస్థలను తెలుసుకోవడం,
గౌరవించడం ఎంతో అవసరం. వారివారి సాంప్రదాయాలు, సంస్కృతులద్వారా దేవుని జ్ఞానరహస్యములోనికి
ప్రవేశించుటకు, క్రీస్తు సువార్తను విశ్వసించుటకు సహాయం చేయాలి. ప్రజలందరు వారి
మూలాలకు వెళ్ళడం, వారి సంస్కృతుల విలువలను రక్షించుకుంటూ సత్యములోనికి రావడమే
శ్రీసభ లక్ష్యం. ఇది ఎంతో సవాలుతో కూడినటువంటిదే! అయినను, ఇది పరిశుద్ధాత్మ దేవుని
కార్యముగా భావించి మనవంతు మనం కృషి చేయాలి. పవిత్రాత్మచేత మనం నడిపింప బడాలి.
పవిత్రాత్మ ప్రేరణలను శ్రద్ధగా ఆలకించాలి.
మనముందు ఉన్న మరో
సవాలు, నేడు కొంతమంది కతోలికులు శ్రీసభను వీడి ఇతర క్రైస్తవ శాఖలలో చేరుతున్నారు.
ఇది కతోలికేత్తర క్రైస్తవులను, క్రైస్తవేత్తరులను ఒకింత డైలమాలోనికి,
సందేహములోనికి నెట్టివేస్తుంది. కతోలికులుగా చేరాలని అనుకుంటున్నవారు వెనకడుగు
వేస్తున్నారు లేదా వారి ఆలోచనలను విరమించు కుంటున్నారు. దీనికి కారణాలు అనేకం
కావచ్చు – ఉదాహరణకు అంత:ర్గత కలహాలు, విభేదాలు, సమన్వయలోపం, వ్యక్తిగతస్వార్ధం,
లౌకికకార్యకలాపాలు, గ్రూపులు, దైవార్చనలో అతిఆర్భాటాలు...మొ.వి. కనుక, వారిని
తప్పుబట్టకుండా, మన జీవితాలను ఆత్మపరిశీలన చేసుకుందాం. ముందుగా, మన జీవితాలను
పునరుద్దరించుకుందాం! మానవీయ, సువార్తా విలువలు కలిగి జీవించుదాం!
నేడు మనముందున్న మరో
అతిగొప్ప సవాలు – క్రైస్తవులు ‘మతమార్పిడి’ చేస్తున్నారనే తప్పుడు భావన, తప్పుడు
ప్రచారం! వాస్తవానికి అది కతోలిక శ్రీసభ ఉద్దేశ్యం కానేకాదు. మన ఉద్దేశ్యం –
మానవాళికి సేవచేయడం. ‘మతమార్పిడి’ అను తప్పుడు భావనను సామరస్యముగా పరిష్కరించడానికి
ప్రయత్నం చేయాలి.
ముగింపు
ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా! నేడు ప్రధానముగా కావలసిన అంశాలు: బోధనకన్న క్రీస్తుబోధనల సారాంశాన్ని జీవించ గలగడం. జీవిత సాక్ష్యులుగా మారడం. సిననడల్ పద్ధతిలో ప్రయాణం చేయడం: అనగా అందరితో కలిసి నడవడం, అందరితో చర్చించడం / సంభాషించడం, పవిత్రాత్మ ప్రేరణతో నిర్ణయాలు చేయడం. విశ్వాస వికాసానికి ప్రతీ ఒక్కరు కృషిచేయడం. విశ్వాసులు మరియు ఆధ్యాత్మిక నాయకులు పవిత్ర జీవితాన్ని జీవించడం, ముఖ్యముగా ప్రార్ధనా జీవితాన్ని జీవించడం.
వేదవ్యాపక ఆదివారాన్ని కొనియాడుచున్న మనం, వేదవ్యాపకుల కొరకు మరీ ముఖ్యముగా తిరుసభలో పునరుద్ధరనకు అవిరామముగా కృషి చేయుచున్న జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ వారి కొరకు ప్రార్ధన చేద్దాం. తాను తలపెట్టిన సినడల్ ప్రయాణం దిగ్విజయముగా శ్రీసభ ఆధ్యాత్మికాభివృద్ధికి బాటలు వేయాలని ప్రార్ధన చేద్దాం. అలాగే వేదవ్యాపకములో పాల్గొంటున్న మేత్రాణుల కొరకు, గురువుల కొరకు, మఠకన్యల కొరకు, ఉపదేశుల కొరకు ప్రార్ధన చేద్దాం. దేవుడు మనందరినీ కూడా తన ప్రణాళిక ప్రకారం సువార్తా ప్రచారం కొరకు వినియోగించు కొనమని వేడుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక! ఆమెన్.
Glory to the lord Jesus 🙏
ReplyDeleteMeaningful Reflection Father 🙏🙏🙏
ReplyDelete