మరియమ్మ స్తోత్రగీతము (లూకా 1:46-56)
దేవునిపట్ల కలిగియున్న కృతజ్ఞతా భావానికి, వినయానికి, విశ్వాసానికి ప్రతీకయే మరియమ్మ స్తోత్రగీతము. “నీవెంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము. అప్పుడు ప్రభువు మన్ననను పొందుదువు” (సీరా. 3:18). మరియమ్మ స్తోత్రగీతము ఒక ప్రార్ధన, కీర్తన. దేవుని ప్రేమను, దయను గూర్చి తెలియజేస్తుంది. ఇది మరియమ్మ గాధ. తన జీవితములో అనుభవించిన దానిని కృతజ్ఞతాపూర్వకముగా వ్యక్తపరచినది: “దేవుడు తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను” (లూకా 1:48). ఆమెను ధన్యురాలుని చేసాడు. ఎందువలన, ధన్యురాలు? ఆమె యేసును (ఇమ్మానుయేలు = దేవుడు మనతో ఉన్నాడు; దైవసాన్నిధ్యం; రక్షణ, ధన్యత) కలిగియున్నది. దేవునికి తల్లియైనది. యేసు గురించి ఆ తల్లికి తెలిసంతగా మరెవ్వరికి తెలియదు! ఇంతటి భాగ్యానికి, “నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడగు దేవునియందు నా యాత్మ ఆనదించుచున్నది” (లూకా ౧:46-47) అని ఎన్నో వేలసార్లు ఆమె పెదవులు స్తుతించి యుంటాయి! దేవుడు చేసిన మేలులకు మరియ, తన నిష్కళంక హృదయముతో స్తోత్రములను చెల్లిస్తున్నది. మెస్సయ్య అయిన లోకరక్షకుని ప్రసాదించినందులకు, ఆ రక్షకునికి తల్లిగా అయ్యే భాగ్యమును ఒసగినందులకు మరియ దేవునకు స్తోత్రములు చెల్లిస్తున్నది. తన విశ్వాసాన్ని వెల్లడి చేయుచున్నది.
1:46 - మరియ నిష్కళంక హృదయముతో దేవుని స్తుతించుట
1:47 - నిజమైన ఆనందము దేవునియందు మాత్రమే
1:48 - మరియ వినయము [సత్యమును అంగీకరించడం], ధన్యురాలు
1:49 - దేవుని నామము పవిత్రమైనది (రెండవ ఆజ్ఞ)
1:50 - ప్రభువు కనికరము
"ఆయన తన బాహు బలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్చిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి, దీనులను లేవనెత్తును. ఆకలిగొన్న వారిని సంతృప్తి పరచి, ధనవంతులను వట్టి చేతులతో పంపి వేసెను" (లూకా 1:51-53).
బాహుబలము, సాధారణముగా యుద్ధములో విజయమును సూచిస్తుంది. దేవుని బాహుబలము ఆయాబున శక్తిని, మహిమను సూచిస్తుంది.
బాబెలు గోపురమును కట్టిన ప్రజలు, "రండు! మనము ఒక పట్టణమును నిర్మించి, ఆకాశమును అంటు గోపురమును కట్టుదము. ఇట్లు చేసిన మనకు పేరు వచ్చును. మనము భూమి యందంతట చెల్లాచెదరయి పోము" (ఆ.కాం 11:4) అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కాని, దేవుడు వారినందరను అక్కడి నుండి భూమి నాలుగు చెరగులకు చెదరగొట్టెను (11:8).
ఐగుప్తు దేశమున అరిష్టములద్వారా యావే దేవుడు తన బాహు బలమును చూపి, ఇశ్రాయేలు ప్రజలను రక్షించెను. దేవుని బాహు బలము ఆయన విజయమునకు సూచన (నిర్గమ 7:19). దేవుని "బాహుబలము" (నిర్గమ 15:16), ఫరో సైన్యమును ఎర్ర [రెల్లు] సముద్రములో ముంచివేసి, ఇశ్రాయేలు ప్రజలను సముద్రమును దాటవేసినది.
అహంకారుల దురాలోచనలను, అధిపతులను ఆసనముల నుండి పడద్రోసెను - అహంకారులు, గర్వితులైన అస్సీరియనులు, ఐగుప్తీయులు, బబులోనీయులు, ఇశ్రాయేలుపై యుద్ధము చేయునపుడు, యావే తన బాహుబలముతో వారిని చెదరగొట్టి, తరిమివేశాడు.
"పీడితులను [దీనులను] కాపాడుటకు ప్రభువు తన బాహు బలమునే వినియోగించెను" (యెష 59:16). అందుకే పేతురు తన లేఖలో, "శక్తివంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు. యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును" (1 పేతు 5:6). మరియమ్మ దేవుని బాహుబలమును గుర్తించింది. వినయముతో తన జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నది.
"నీవు మిక్కిలి పరాక్రమ వంతుడవు. నీ హస్తము బలమైనది. నీ కుడి చేయి ఉన్నతమైనది" (కీర్త 89:13). "ప్రభువు తన మహా బలముతో సాహస కార్యములు చేసెను. అతడు తన బలముతో విజయమును సాధించెను" (కీర్త 118:16; 98:1). దేవుడు తన ప్రజలపట్ల వ్యవహరించినట్లే, మరియపట్ల వ్యవహరించెను. దేవుడు తన విజయమును మెస్సయ్య రాకతో పూర్తిచేయడం ప్రారంభిస్తాడు (యెష 9:6-7).
అలాగే, గర్వాత్ముల గర్వమును అణచునని మరియ ముందే గ్రహించింది (దాని 4:37; యెష 2:17; సామె 21:4). క్రీస్తు ఈలోకపు అహంకార దృక్పథాన్ని తారుమారు చేసారు (1 కొరి 1:20, 27-31). దేవుని రాజ్యం మానవ ఆలోచనలను, విలువలను తారుమారు చేసింది.
దేవుడు దీనులను, దీనావస్థలోనున్నవారిని దీవించును (లేవనెత్తును). “వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు” (మత్త. 5:5). దేవుడు పేదవారిని అవసరతలోనున్నవారిని దీవించును. “పేదలగు మీరు ధన్యులు. దేవరాజ్యము మీది” (లూకా 6:20). బైబులులో దేవుడు ఎప్పుడుకూడా పేదవారి పక్షాన ఉన్నవాడు (పేదల పక్షపాతి! anavim of Yahweh = దేవుని పేదవారు). ఇతరులకన్న. పేదలకు ఎందుకింత ప్రాధాన్యత, ప్రత్యేక శ్రద్ధ దేవుడు చూపుచున్నారు. వారి అర్హత, యోగ్యత ఏమి? బహుశా, విముక్తి అత్యవసరమని పేదలకు తెలుసు; వారికి దేవునిపై, బలవంతులపై అధారపడటమేగాక, ఒకరిపై ఒకరు అధారపడటముకూడా తెలుసు; వారు తమ భద్రతను వస్తువులపైగాక, ప్రజలపై ఉంచెదరు; సహకారమునుండి ఎక్కువ ఆశిస్తారు. నిత్యావసరాలకు, విలాసాలకు మధ్య తేడాను చెప్పగలరు; పేదలకు సహనం ఎక్కువ; వారి భయాలు వాస్తవికమైనవి; సువార్త బోధించినప్పుడు, అది వారికి శుభవార్తలా వినిపిస్తుంది; సువార్త పిలుపునకు వారు పూర్ణ పరిత్యాగముతో స్పందించగలరు, దేనికైనా సిద్ధముగా ఉంటారు. దేవునిపట్ల భయభక్తులు గలవారు, దేవునిపై ఆధారపడువారు, ఆయన ఆజ్ఞలప్రకారం జీవించువారు నిజమైన పేదలు. దేవుడు ఆకలితోనున్న వారిని ఆశీర్వదించును. “ఆకలిగొనియున్న మీరు ధన్యులు. మీరు సంతృప్తి పరపబడుదురు” (లూకా 6:21). "నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు సంతృప్తి పరపబడుదురు" (మత్త 5:6). దివ్యసత్ప్రసాదము మన ఆత్మలను సంతృప్తి పరచును.
1:54 - అబ్రాహాము విశ్వాసమునకు తండ్రి. మరియ గొప్ప విశ్వాసురాలు. మరియవలె మన విశ్వాసాన్ని సేవ ద్వారా ఇతరులతో పంచుకోవాలి.
1:55 - సేవకుడగు యిస్రాయేలునకు సహాయము చేసెను. క్రీస్తు విశ్వాసులు సేవకులై, సేవాభావంతో జీవించాలి (మార్కు 10:45). కడరాత్రి భోజన సమయములో యేసు శిష్యుల పాదాలను కడుగుట, ప్రేమాజ్ఞను ఇచ్చుట.
No comments:
Post a Comment