సామాన్య 2వ వారము - సోమవారం (II)

దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 2వ వారము - సోమవారం
1 సమూ 15: 16-23; మార్కు 2:18-22

ధ్యానాంశము: ఉపవాసమ
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత వరకు వారు ఉపవాసము ఉండరు. పెండ్లి కుమారుడు ఎడబాయు కాలము వచ్చును, అపుడు వారు ఉపవాసము ఉందురు” (మార్కు 2:19-20).
ధ్యానము: శ్రీసభ మనకు ఒసగిన ఎన్నో ఆచారాలలో ఉపవాసము ఒకటి. దివ్యసత్ప్రసాదమును యోగ్యరీతిగా తీసుకొనుటకు సంసిద్ధపడటానికి విశ్వాసులు ఉపవాస నియమాన్ని పాటించాలి అని సత్యోపదేశం 1387లో చదువుచున్నాము. ఈ కాలములో ఈ ఉపవాస నియమాన్ని పాటించేవారు తక్కువే! యేసు కాలములో, బప్తిస్మ యోహాను శిష్యులు, పరిసయ్యులు ఉపవాసం ఉండేవారు. మూడు ముఖ్యమైన మతపరమైన పుణ్య కార్యాలు: ఉపవాసము, ప్రార్ధన, దానధర్మాలు.
పాపాలకు ప్రాయశ్చిత్త దినము ఉపవాసదినముగా, మోషే ప్రకటించడం లేవీ. 16:29-34లో చూస్తున్నాము. దేవున్ని దర్శించడానికి ఉపవాసము చేసేవారు. మోషే 40 దినాలు ఉపవాసము ఉన్నాడు (నిర్గమ. 34:28). ఆ తరువాత యూదులకు ఉపవాసం చేయడం సాధారణమైనది. కొంతమంది వారానికి రెండుసార్లు ఉపవాసం చేసేవారు. కొంతమంది దు:ఖము వలన ఉపవాసము చేసేవారు. ఇంకొంతమంది, సువార్తలో ప్రభువు చెప్పినట్లుగా, ఇతరులు చూడాలని ఉపవాసము చేసేవారు. ఇలాంటి ఉపవాసమును ప్రభువు ఖండించుచున్నారు (మత్త. 6:16-18). ఉపవాసము అనగా మనకిష్టమైన వాటిని వదిలివేయడం. మన పంచేద్రియాలకు ఆహ్లాదపరిచే వాటిని వదులుకోవడం. దేవుని ఎదుట తననుతాను వినయముగా అర్పించుకోవడం నిజమైన ఉపవాసము. ఉపవాసము, పాపాలకు పశ్చాత్తాపమునకు, భక్తికి, పరిత్యాగమునకు సూచన. తన బహిరంగ ప్రేషిత కార్యమును ప్రారంభంచేముందు, యేసు నలుబది రోజులు ఉపవాసమున్నాడు. నిజమైన ఉపవాసం, దేవుని కొరకు, ఆయన నీతికొరకు ఆకలిదప్పులు కలిగి యుండటం. ఉపవాసము గురించి, ప్రభువు పలుకులుగా, ప్రవక్తలు చెప్పిన మాటలు: చదువుము. యెషయ 58:6-7, యిర్మీ. 14:12, జెక. 7:5. నూతన నిబంధనములో, ఆధ్యాత్మిక మెరుగుదలకోసం, ఉపవాసము సిఫార్సు చేయడం చూడవచ్చు: చదువుము. అ.కా. 13:2, 14:22-23, 2 కొరి. 6:5, 11:27. శ్రీసభ పితరులుకూడా (పునీత అగుస్తీను, పునీత లియో ఘనుడు) ఉపవాసము మనలను దేవుని సాన్నిధ్యానికి, తోటివారి సాంగత్యానికి, చివరికి, దేవునిలో ఐఖ్యతకు నడిపించును అని బోధించారు. శ్రీసభ సత్యోపదేశం నం. 2043లో “నియమిత దినాల్లో ఉపవాసాన్ని, భోగ్యాహార నిషేధాన్ని, శుద్ధ భోజన నియమాన్ని పాటించాలి” అని చదువుచున్నాము.

No comments:

Post a Comment