క్రీస్తు శరీర, రక్తముల మహోత్సవం Year ABC

 క్రీస్తు శరీర, రక్తముల (దివ్యసత్ప్రసాద) మహోత్సవం Year ABC
Year A: ద్వితీయ. 8:2-3, 14-16, 1 కొరి. 10:16-17, యోహాను. 6:51-58
Year B: నిర్గమ. 24:3-8, హెబ్రీ. 9:11-15, మార్కు. 14:12-16, 22-26
Year C: ఆది. 14;18-20, 1 కొరి. 11:23-26, లూకా. 9:11-17

ఉపోద్ఘాతం

శ్రీసభ ఆత్మ ప్రేరణతో ప్రవేశపెట్టిన పవిత్ర సప్త సంస్కారాలలో “దివ్యసత్ర్పసాదం” మన క్రైస్తవ జీవితానికి కేంద్ర బిందువు. క్రీస్తు ప్రభువు మన హృదయాలలో నివసించుటకు మన ఆత్మలను పెంచి పోషించుటకు,  ఈ “దివ్యసత్ర్పసాదాన్ని” స్థాపించారు. “దివ్యసత్ర్పసాదం” యేసు ప్రభువు సర్వమానవాళికి ప్రసాదించిన గొప్ప వరం. ఇది  శ్రీసభకు గొప్ప ఆధ్యాత్మిక సిరి సంపద. దివ్యసత్ర్పసాదములో “దైవ సాన్నిధ్యం” నెలకొని ఉంటుంది. త్రిత్వేక సర్వేశ్వరుని మహోత్సవము తరువాత వచ్చు ఆదివారాన్ని “క్రీస్తు శరీర రక్తముల” మహోత్సవముగా కొనియాడుతూ ఉంటాము. శ్రీసభలో  ఈ పండుగను జరపాలని, “దివ్యసత్ర్పసాద భక్తిని, ఔన్నత్యాన్ని గూర్చి దశదిశలా వ్యాప్తిచేయాలని సాక్షాత్తు ప్రభువే ఆదేశించి ఉన్నారు. ఈ మేరకు ఈ పండుగను గురించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ధ్యానించుదాం.

పండుగ నేపథ్యం

బెల్జియం దేశానికి చెందిన జూలియన్ అనే మఠకన్యకు తరచుగా ఓ దృశ్యం కనిపిస్తుండేది‌. అందులో ఆమె దగదగ మెరిసిపోతున్న చంద్రుని, దానిలో ఓ మచ్చను చూస్తుండేది. అది అద్భుతమని ఆమె గ్రహించింది. కానీ దీని గురించి ఇతరులతో చెప్పడానికి భయపడుతూ ఉండేది. ఎందుకంటే, ఆ దృశ్యం గురించి వివరించలేని అశక్తత ఆమెలో ఉంది. దానిలో దాగి యున్న  లోతైన భావం ఆమెకు తెలియదు. ఆ దృశ్యం యొక్క భావాన్ని తెలియజేయుమని ఆమె ఉపవాసాలు, ప్రార్థనలు మొదలు పెట్టింది. కొన్నాళ్ళ తరువాత సాక్షాత్తు క్రీస్తు ప్రభువు ఆ దృశ్యం యొక్క లోతైన భావాన్ని ఆమెకు అర్థమయ్యేలా చేశారు. ఆమె జ్ఞానోదయం పొందింది. దాని భావం గ్రహించింది.

ఆమెకు కనిపించిన దృశ్యంలో చంద్రుడు శ్రీసభ కాగా, అందులోని మచ్చ “దివ్యసత్ర్పసాద” గౌరవార్ధం ప్రత్యేక ఉత్సవం లేని కొరత అని ఆమెకు స్పష్టమైంది. ఆ ఉత్సవమును ఏర్పాటు చేయ తోడ్పడాల్సిందిగా ప్రభువు తనను ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఆమె గ్రహించింది. ‘నేను ఒక సాధారణ కన్యస్త్రీని, ప్రభువు నాకు ఒక బాధ్యతను అప్పగించారు, ఈ బాధ్యతను నేను నెరవేర్చగలనా!’ అని లోలోపల సతమతమవుతుండగా, శ్రీసభ పెద్దలను ఆశ్రయించమని దేవుడు ఆమెకు ధైర్యాన్ని ప్రసాదించారు. ముందుగానే దృశ్యం గురించి ఆమె కొంతమంది దేవాలయ పెద్దలకు, ఆమెకు తెలిసిన కొంతమంది గురువులకు, తోటి మఠకన్యలకు తెలిపింది. వారందరూ కలిసికట్టుగా అప్పటి లియోదిపుర పీఠాధిపతిని కలిసి విషయం ప్రస్తావించారు. తమ మేత్రాసనంలో “దివ్యసత్ర్పసాద” మహోత్సవాన్ని ఏర్పాటు చేయవలసిందిగా పీఠాధిపతిని అభ్యర్థించారు. తత్ఫలితంగా, రోబెర్టో  పీఠాధిపతులు 1246వ సంవత్సరంలో తమ గురువులందరికీ అధికారపూర్వకమైన ఉత్తర్వులను పంపి, ఈ ఉత్సవాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. అలా ఆ మేత్రాసనంలో ఉత్సవం ప్రారంభమైనందున ప్రజలు ఈ గొప్ప మహోత్సవము ద్వారా “దివ్యసత్ర్పసాద” ప్రాముఖ్యతను, ఔన్నత్యాన్ని గ్రహించారు. అది చూసిన ఇతర పీఠాధిపతులు తమ మేత్రాసనాల్లో ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. తరువాత కొన్నాళ్ళకి ఈ ఉత్సవ సంబరం ఇతర దేశాలకు విస్తరించింది. ముఖ్యంగా జర్మనీ దేశస్తులు ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవోపేతంగా జరుపుతారు. చివరికి 1264వ సంవత్సరంలో అప్పటి మూడవ ఉర్భాను పోపు గారు ఈ మహోత్సవం శ్రీసభ అంతా జరపాలని ఆదేశించారు. అలా ఈ మహోత్సవం క్రైస్తవుల్లో క్రీస్తు ప్రభువు యొక్క దివ్య శరీర రక్తముల పట్ల గౌరవం, విశ్వాసం, భక్తిని పెంపొందిస్తుంది.

దివ్యసత్ర్పసాదం- చారిత్రకాంశాలు

తొలిరోజులలో క్రైస్తవులు జ్ఞానస్నానాన్ని మాత్రమే ప్రధాన సంస్కారంగా ఎంచారు. జ్ఞానస్నానంతో ప్రారంభమైన క్రైస్తవ జీవితాన్ని దివ్యసత్ర్పసాదం పెంపుకి తెస్తుంది అని మాత్రం భావించారు. కనుక వాళ్ల దృష్టిలో ‘సత్ర్పసాదం’ జ్ఞానస్నానమంత ముఖ్యమైనది కాదు. ఇక క్రీస్తు “దివ్యసత్ర్పసాదాన్ని"” స్థాపించిన సందర్భాన్ని పరిశీలిస్తే, క్రీస్తు భుజించమన్నారు కానీ ఆరాధించమనలేదు. కనుక తొలినాటి క్రైస్తవులు దాన్ని భోజనంగా ఎంచారు‌ కానీ ఆరాధ్య వస్తువుగా ఎంచ లేదు. తొలిరోజుల్లో ఓ సాంప్రదాయం ఉండేది! పూజకు హాజరైన క్రైస్తవులు, దివ్యసత్ర్పసాదాన్ని ప్రసాదంగా ఇళ్లకు తీసుకొని వెళ్ళేవాళ్ళు. దాన్ని తమ ఇళ్లల్లో భద్రపరుచుకుని భుజించేవాళ్లు. ఈ సాంప్రదాయం 8వ శతాబ్దం వరకు కొనసాగుతూ వచ్చింది. అదే కాలంలో దాన్ని దేవాలయాలలో పదిలపరచి పూజ జరగని సమయాల్లో పంచి పెట్టే వాళ్ళు. వ్యాధిగ్రస్తులకు కూడా భోజనంగా ఇచ్చేవాళ్ళు. ఈ సందర్భాలన్నిటిల్లోను దాన్ని భోజనంగానే ఎంచారు. విశ్వాసులు దాన్ని బహిరంగంగా ఆరాధించ లేదు.

పదకొండవ శతాబ్దంలో బెరింగారియస్ అనే అతని మూలంగా ఓ పెద్ద మార్పు వచ్చింది. అతడు దివ్యసత్ర్పసాదంలో దైవసాన్నిధ్యం లేదని, అసలు రొట్టెరసాలు క్రీస్తు శరీరరక్తాలుగా మారనే మారవని వాదించాడు. అందుచేత. శ్రీసభ “దివ్యసత్ర్పసాదంలో” దైవ సాన్నిధ్యముందని ప్రచురంగా బోధించడం మొదలు పెట్టింది. ప్రజలలో కూడా ఈ సాన్నిధ్యం పట్ల భక్తిభావం పెరిగింది. క్రమేణా, ప్రజల్లో అది భోజనమన్న విషయం మరుగున పడిపోయింది. ఆరాధ్య వస్తువన్న విషయం పెచ్చుపెరిగింది. కనుక, విశ్వాసులు దానిని పుచ్చుకోవడం మానేసి, ఆరాధించడం మొదలు పెట్టారు. సాన్నిధ్యం నడి పూజలో నెలకొంటుంది కనుక ఆ విషయాన్ని విశ్వాసులకు విదితం చేయడం కోసం గురువులు నడి పూజలో “దివ్యసత్ర్పసాదాన్ని” పైకెత్తి చూపించే వాళ్ళు (ఇది ఇప్పటికీ కొనసాగుతున్నది). అలా పైకత్తబడిన దివ్య భోజనాన్ని కంటితో చూడడం మహాభాగ్యమనుకున్నారు విశ్వాసులు.

క్రమేణా ఈ సాన్నిధ్యం పట్ల భక్తి ఇంకా పెరిగింది. 13వ శతాబ్ద కాలంలో “దివ్యసత్ర్పసాద” పండుగను నెలకొల్పారు. సత్ర్పసాద ఆశీర్వాదము ప్రదక్షణలు, 40 గంటల ఆరాధనలు మొదలైనవన్నీ ప్రారంభమయ్యాయి. ఈ  విధంగా దివ్యసత్ర్పసాద ఆరాధన ప్రచారంలోనికి వచ్చింది. కాని సత్ర్పసాదాన్ని ఆరాధించటం ఎంత ప్రచారంలోనికి వచ్చిందో, దాన్ని భోజనంగా స్వీకరించడం అంతగా తక్కువై పోయింది. విశ్వాసులు తాము పాపులమని భావించి, ఆ దివ్య భోజనాన్ని స్వీకరించటానికి యోగ్యులం కామని భావించేవాళ్ళు. పూజకు వెళ్లేవాళ్లు కాని, “దివ్యసత్ర్పసాదాన్ని” తీసుకునే వాళ్ళు కాదు.

ఈ ఉద్యమంలో కొంత మంచి కొంత చెడు కూడా లేకపోలేదు. మంచి ఏమిటంటే తొలి వెయ్యేండ్లల్లో లేని ఆరాధనాంశం పదకొండవ శతాబ్దం తర్వాత ప్రచారంలోకి రావడం ఇది మెచ్చుకోదగిన అంశం. చెడు ఏమిటంటే “దివ్యసత్ర్పసాదం” భోజనం అన్న విషయం మరచి పోవడం. ఎప్పుడూ కూడా ప్రభువు దివ్యసత్ర్పసాదంలో తన్నుతాను మనకు భోజనంగా అర్పించుకో గోరుతుంటారు. ఇది అతని చైతన్యవంతమైన సాన్నిధ్యం. ఈ చైతన్యవంతమైన సాన్నిధ్యాన్ని విశ్వాసులు కేవలం జాడాత్మకమైన సాన్నిధ్యంగా మార్చారు. అనగా ప్రభువు సత్ర్పసాదంలో వట్టినే ఉండిపోతారు అనుకున్నారు. మనం  అతన్ని భుజించనక్కరలేదు, ఆరాధిస్తే చాలు అనుకున్నారు ఇది నిక్కంగా పొరపాటు.

దివ్యసత్ర్పసాదం- నాలుగు ప్రభావాలు

మనకు దివ్యసత్ర్పసాదంలో నాలుగు ప్రభావాలు కనిపిస్తాయి అవి ఏమనగా:

1. నిత్య జీవితం

“నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువాడు నిత్యజీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును” (యోహాను. 6:54). “దివ్యసత్ర్పసాదంతో” మనకు లభించే కృపానుగ్రహము మనల్ని కడవరకు నడిపిస్తుంది. పౌష్టికాహారం ఏ విధముగా అయితే మనకు బలాన్ని మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందో, “దివ్యసత్ర్పసాదం” కూడా దైవ జీవమును అనగా దేవునిలో ఐక్యతను ప్రసాదించునంత వరకు, శాశ్వత జీవము ఇచ్చునంత వరకు, ఈ భోజన ప్రభావము ఏ మాత్రం ఆగిపోదు.

2. పునరుత్థానము

పై వచనాన్ని మనం పరిశీలిస్తే భక్తి, విశ్వాసాలతో “దివ్యసత్ర్పసాదాన్ని” స్వీకరించే వారు, నిత్య జీవితాన్ని పొందుకుంటారని ప్రభు వాగ్దానం చేసి యున్నారు. దేవునితో బసచేయబడిన మహిమ కొరకు అనగా మరణాంతరం  పునరుత్థాన మహిమతో మనలను లేవనెత్తి పరలోక బహుమానమైన నీతి కిరీటము మనకు అందించు వరకు ఈ దివ్య భోజనం మనలో తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది..

3. ప్రభువుతో సహవాసం

“నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువాడు నా యందు, నేను వానియందు ఉందును” (యోహాను. 6:56). “దివ్యసత్ర్పసాదం” స్వీకరించడం ద్వారా మన శరీరం క్రీస్తు శరీరముగా, మన హృదయం క్రీస్తు హృదయముగా రూపాంతరం చెందుతుంది. “దివ్యసత్ర్పసాద” రూపంలో క్రీస్తు మన హృదయంలోనికి వచ్చిన తర్వాత మనము ఆయనతో  ఏకమవుతున్నాము. క్రీస్తుతో పాటు మనము జీవిస్తున్నాం.

4. క్రీస్తు ద్వారా నూతన జీవితం

“పరలోకము నుండి దిగివచ్చిన జీవముగల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను” (యోహాను. 6:51). భౌతిక ఆహారం మనకు శక్తిని, బలాన్ని ఇస్తుంది. రోజువారీ పనులను చేసుకోవటానికి కావలసినటువంటి శక్తిని అనుగ్రహిస్తుంది. మన ఆత్మలను పోషించటానికి ఆహారం అవసరం. ఈ ఆధ్యాత్మిక ఆహారాన్ని క్రీస్తు భగవానుడు “దివ్యసత్ర్పసాదముగా” మనకు అనుగ్రహించారు.

అయితే భౌతికాహారాన్ని జీర్ణించుకుని శక్తిని పొందడానికి ఆరోగ్యకరమైన దేహం ఎంత అవసరమో, అలాగే క్రీస్తు నాథుడు ప్రసాదించే “దివ్యసత్ర్పసాదాన్ని” స్వీకరించి ఆధ్యాత్మిక శక్తిని, బలాన్ని పొందటానికి మన ఆత్మలు ఆరోగ్యంగా ఉండటానికి పవిత్రంగా ఉండటానికి కూడా ఈ జీవాహారం అంతే అవసరం. పరిపూర్ణ విశ్వాసముతో యోగ్యమైన రీతిలో నిండు పూజలో పాల్గొని “దివ్యసత్ర్పసాదాన్ని” స్వీకరించాలి.

చివరిగా

ఈ పండుగ నాడు, క్రీస్తు ప్రభువు మన అందరిని కూడా యోగ్యమైన రీతిలో తన శరీర, రక్తములను స్వీకరించమని మనలను కోరుతూ ఉన్నారు. ఈమధ్య కాలములో, చాలామంది కతోలికులు “దివ్యసత్ర్పసాద” విషయంలో అనేక పొరపాట్లు చేస్తూ ఉన్నారు. అవి ఏమనగా, పూజకు ఆలస్యంగా రావడం, (నిండు పూజలో సరైన విధముగా పాల్గొనని వారు, ఆ మహా ప్రసాదాన్ని స్వీకరించడానికి అనర్హులు, 1 కొరి. 11:27-31). క్రీస్తు చూపిన ప్రేమ, క్షమాగుణ సిద్ధాంతాలను మనం పాటిస్తున్నామాఆత్మ పరిశీలన చేసుకుందాం! అలా పాటించకపోతే మనలో “దివ్యసత్ర్పసాద” శక్తి, ఏ మాత్రం పని చేయదు. కనీసం ఇక నుండైనా యోగ్యమైన రీతిలో ప్రభువు సర్వమానవాళికి ప్రసాదించిన ఈ గొప్ప జీవాహారాన్ని స్వీకరించుదాం.

Mr. జోసఫ్ అవినాష్,
పెద్దవడ్లపూడి విచారణ, గుంటూరు
పర్యవేక్షణ: గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.

No comments:

Post a Comment