ఈస్టర్ ఐదవ ఆదివారము, Year A
అ.కా. 6:1-7, 1 పేతు. 2:4-9, యోహాను. 14:1-12
యోహాను
సువార్త ముఖ్యోద్దేశం, సాధారణ శిష్యులను, యేసుకు ప్రియమైన శిష్యులుగా మారడం,
తండ్రి దేవునితో సన్నిహిత సంబంధమును కలిగి యుండటం, త్రిత్వైక సర్వేశ్వరునిలో
ఐఖ్యమవడం. నేటి సువిశేష పఠనము, కడరాత్రి భోజన సమయములో, యేసు తన శిష్యులతో చేసిన
ఆఖరి ఉపదేశములోని భాగము. “యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకువెళ్ళవలసిన గడియ
సమీపించినదని గ్రహించెను” (యోహాను. 13:1). యేసు చుట్టూ శత్రువులు. ఆయనను చంపాలని
కుట్రలు, మరోవైపు గురుద్రోహానికి సిద్ధము... అంతా అంధకారముగా నున్న పరిస్థితి... ఈ
పరిస్థితిని ఎదుర్కొనుటకు... యేసు అద్భుతమైన, మహిమగల భవిష్యత్తు గూర్చి
ఉపదేశిస్తున్నాడు.
యోహాను
14వ అధ్యాయం, “మీ హృదయములను కలవర పడనీయకుడు” (14:1) అని యేసు తన శిష్యులతో చెప్పిన
మాటలతో ప్రారంభ మగుచున్నది. తన తండ్రి వద్దకు తిరిగి వెళ్ళవలసిన సమయము ఆసన్నమైనదని
ఎరిగిన యేసు, తన శిష్యులతో ఈ మాటలను పలికి యున్నాడు. సీమోను పేతురు, “ప్రభూ! నీవు
ఎక్కడకు వెళ్ళు చున్నావు?” అని ప్రశ్నించగా, యేసు, “నేను వెళ్ళు స్థలమునకు ఇప్పుడు
నీవు నా వెంట రాలేవు. కాని, తరువాత రాగలవు” అని చెప్పెను (యోహాను. 13:36).
ఇలాంటి
పలుకులనే (14:1), యేసు తన శిష్యులతో వేరే సందర్భాలలో కూడా చెప్పియున్నాడు, “కావున,
ఏమి తినెదమా? ఏమి త్రాగెదమా? ఏమి ధరించెదమా? అని మీ ప్రాణమును గూర్చి వెత
చెందకుడు” (మత్త. 6:25, లూకా. 12:22), “మీరు వస్త్రములకై తహ తహ పడనేల?” (మత్త.
6:28), “రేపటిని గూర్చి మీరు విచారింప వలదు” (మత్త. 6:34), “కావున భయపడకుడు. మీరు
అనేక పిచ్చుకల కంటె అతి విలువైన వారు” (మత్త. 10:31). “మార్తమ్మా! మార్తమ్మా! నీవు
ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురపడు చున్నావు” (లూకా 10:41).
శిష్యుల
యొక్క జీవన స్థితి, పరిస్థితి ఎలా యున్నను, వారు తన యందు సంపూర్ణ నమ్మకమును,
విశ్వాసమును కలిగి యుండాలనేది ప్రభువు కోరిక. ఏదీ కూడా వారిని ‘కలవర పెట్ట కూడదు’.
వారి హృదయములో ఎలాంటి ఆందోళన, విచారము, భయము, కలవరపాటు ఉండకూడదు. ఎప్పుడైతే,
క్రీస్తు సాన్నిధ్యము లేదని భావిస్తామో, అప్పుడు, మన హృదయములో అవిశ్వాసము,
అపనమ్మకము చోటు చేసుకుంటాయి. నిజమైన శిష్యులు, ఏ కారణము చేతనూ గుండె ధైర్యాన్ని
కోల్పోరు, హృదయాన్ని కలవర పడనీయరు. “లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును”
(మత్త. 28:20) అన్న యేసు మాటలయందు సంపూర్ణ విశ్వాసమును వారు ఉంచాలి.
యోహాను
తన సువార్తలో “విశ్వసించుట” (గ్రీకు pisteuein) అను
వాక్యమును, 85 సార్లు ఉపయోగించాడు. “విశ్వసించుట” అనగా ‘ఒకరి ఆధ్యాత్మిక
శ్రేయస్సును క్రీస్తుకు అప్పగించుట’. “విశ్వసించుట” అనగా ‘యేసు మాటలను,
ప్రవచనములను, బోధనలను సంపూర్ణముగా నమ్మడము. విశ్వాసము అనేది నిత్యమూ కొనసాగే
ప్రక్రియ. కనుక, విశ్వాసములోను, ప్రేమలోనూ ప్రతీ నిత్యమూ ఎదుగుతూ ఉండాలి.
యేసు
తన తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాడని చెప్పినప్పుడు, సర్వాన్ని విడిచిపెట్టి ఆయనను
అనుసరించిన శిష్యులు ఒంటరితనాన్ని, కలవరపాటును అనుభవించడం సాధారణమే! ఆ సమయములో,
దేవుడు వారిని విడిచి పెట్టాడని, అనాధలుగా చేసాడని భావిస్తూ ఉంటారు! అలాంటి
భావనలోనికి తన శిష్యులు వెళ్ళకూడదనే ఉద్దేశముతోనే యేసు, వారి ‘హృదయాలను కలవర పడనీయ
కూడదు’ అని, దేవుని విశ్వసించాలని, తననూ విశ్వసించాలని చెప్పారు (14:1). యేసును
విశ్వసించడం, ఆయనలో ఐఖ్యమై జీవించడం, ఆయనతో సాన్నిహిత్యాన్ని కలిగి యుండటం,
క్రీస్తానుచారులుగా, విశ్వాసులుగా మనకు ఎంతో ముఖ్యము. త్రిత్వైక సర్వేశ్వరునిలో
మనం ఐఖ్యమై జీవించాలి.
నేడు
మన సమాజములో, మన గృహాలలో, ఒంటరితనం, విచ్చిన్నత, విభజనలు ఎన్నో ఉన్నాయి. దీనికి
కారణం, దేవునితోను, తోటివారితోను ఇలాంటి సాన్నిహిత్యం, సంబంధం లేకపోవడమే! విశ్వాస
సంక్షోభముతో పాటు, నేడు మన సంబంధాలలో కూడా ఎంతో సంక్షోభం నెలకొను చున్నది. దీనికి
కారణం, మన జీవితాలలో, దైవసాన్నిధ్యానికి భిన్నముగా ప్రవర్తించడం; వ్యక్తులపైగాక,
వస్తువులపై ఆసక్తిని చూపడం; దేవునితోను, ఇతరులతోను మన బంధాలు మిడిమిడిగా మాత్రమే
ఉండటము.
నేటి
ప్రధాన సమస్య, మన గృహాలలో, ప్రార్ధనకు చాలా తక్కువ సమయము ఉన్నది. కొన్ని చోట్ల
అసలే లేదు! ఆదివారము కూడా గుడికి రావడానికి ఎంతోమందికి సమయము లేదు! విచారణ జనాభా
గణాంకాలను, పూజలో పాల్గొనే వారితో పోల్చితే, మనకు ఇట్టే అర్ధమవుతుంది. కొంతమంది,
కష్టకాలములో మాత్రమే, దేవునివైపు చూస్తారు. అనారోగ్యము, దగ్గరివారి మరణము లేదా ఇతర
సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే గుడికి వస్తారు. ఈ రకమైన జీవనశైలి, ఒంటరితనానికి దారి
తీస్తుంది, దేవుని ఉనికిని గుర్తించకుండా చేస్తుంది. దేవునితో సాన్నిహిత్యాన్ని,
ఐఖ్యతను అసాధ్యం చేస్తుంది.
యేసు తండ్రి యొద్దకు మార్గము
యేసు
తన తండ్రితో తిరిగి ఐఖ్యమైనప్పుడు, తండ్రి వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు, దేవునితో,
ఇతరులతో మన సాన్నిహిత్యానికి, ఐఖ్యతకు మార్గము సుగమం అవుతుంది. తన శిష్యులకు నివాస
స్థానమును సిద్ధము చేయుటకు ప్రభువు, తండ్రి వద్దకు వెళ్ళాడు: “నా తండ్రి గృహమున
అనేక నివాసములు కలవు... నేను మీకొక నివాస స్థానమును సిద్ధము చేయబోవుచున్నాను. నేను
వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి, మరల వత్తును. నేను ఉండు స్థలముననే మీరును
ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును” (14:2-3). దేవునితో మనం శాశ్వతముగా
జీవించాలంటే, ఇప్పుడే తగిన నిర్ణయం చేయాలి.
“గృహము”,
“నివాసములు”, “నివాస స్థానము” (గ్రీకు mone) అనగా ‘దేవుని బిడ్డలగు భాగ్యమును ప్రసాదించుట’ (యోహాను. 1:12). కుమారుడు
(యేసు) తండ్రితో పొందిన భాగ్యమును, యేసు తన శిష్యులకు కూడా సిద్ధము చేయుచున్నాడు.
‘యేసు వెళ్ళడం’ అనగా ‘ఆయన మరణం, ఉత్థానం, మోక్షారోహణం’ ద్వారా, తండ్రి గృహములో,
దేవుని బిడ్డలగు అర్హతను వారికి సంపాదించి పెట్టడము. బిడ్డలకు ‘గృహము’ అనగా కేవలము
ఒక స్థలము మాత్రమే కాదు; అది ఎప్పుడుకూడా ప్రేమ, నమ్మకము, అంగీకారముతో కూడిన బంధం
కలిగి యున్నటు వంటిది.
యేసు
తన శిష్యులను అనాధలుగా విడిచి పెట్టడు. తాను తండ్రితో ఐఖ్యమైనట్లే, తన శిష్యులను
తండ్రితో ఐఖ్యము చేయును. యేసు కూడా ఈ ‘ఐఖ్యత’ కొరకు ప్రార్ధన చేసాడు: “వారందరు
ఒకరుగ ఐఖ్యమై ఉండునట్లు ప్రార్ధించు చున్నాను. ఓ తండ్రీ! నేను నీ యందును, నీవు
నాయందును ఉండునట్లు, వారిని మనయందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితివని లోకము
విశ్వసించుటకు వారు ఒకరుగ ఐఖ్యమై ఉండనిమ్ము. మనవలె వారును ఒకరుగ ఐఖ్యమై ఉండుటకు
నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించితిని... నేను ఉండు స్థలముననే
వారును ఉండవలయునని కోరుచున్నాను” (యోహాను. 17:21-22, 24).
యేసు
మనలను ప్రేమించినట్లే, మనంకూడా ఇతరులను ప్రేమిస్తే, మనం దేవున్ని ప్రేమిస్తాము,
దేవునితో సాన్నిహిత్యాన్ని కలిగి యుంటాము. తండ్రి గృహమున అనేక నివాసములు కలవు.
విశ్వాసులకు ఈ నివాస స్థానములను సిద్ధముచేయుటకు, యేసు తండ్రి యొద్దకు వెళ్ళెను. మనము
తండ్రితోను, యేసుతోను ఐఖ్యమగుటకు, ఆయన మరల తిరిగి వచ్చును. మార్గము గురించి, తోమా
అడిగిన ప్రశ్నకు సమాధానముగా, యేసు “నేనే (ego eimi) ‘మార్గము’ (hodos),
‘సత్యము’, (aletheia), “జీవము’ (zoe). నా మూలమున తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరు” (14:6)
అను గొప్ప సత్యమును వెల్లడి చేసాడు. తండ్రి యొద్దకు నడిపించు మార్గము. మార్గము
ఆయనే, గమ్యము ఆయనే! తండ్రిని గురించి వెల్లడిచేయు సత్యము ఆయనయే. సైతనులో సత్యము
లేదు (యోహాను. 8:44). ఆయనే జీవము. సమృద్ధిగా జీవము నిచ్చుటకు వచ్చానని స్పష్టం
చేసాడు (యోహాను. 10:10).
యేసు తండ్రి
యొద్దకు మార్గము. విశ్వాసులందరికి, తండ్రి యొద్దకు మార్గము, సిలువ మార్గము.
యేసు తన శిష్యులతో, “నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన
సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింప వలయును” (లూకా. 9:23) అని చెప్పాడు. నిత్య
జీవమును పొందుటకు విశ్వాసులందరు తప్పక ఈ మార్గమును అనుసరించ వలెను. “నన్ను పంపిన
తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవరును నా యొద్దకు రాలేరు” (యోహాను. 6:44, 14:6; మత్త.
11:27, అ.కా. 4:12). సర్వ మానవాళిని దేవుని యొద్దకు నడిపించు మార్గము యేసు
క్రీస్తు. క్రీస్తు నందు విశ్వాసము ద్వారా అందరికి రక్షణ భాగ్యము కలుగును. లోకరక్షణార్ధమై,
శాశ్వత జీవమునకు మార్గము సుగమం చేయడానికే, దేవుడు “వాక్కు”ను ఈ లోకమునకు పంపాడు.
యేసు క్రీస్తే ఈలోకమునకు పంపబడిన దేవుని వాక్కు, దేవుని కుమారుడు. యేసు తండ్రిని
మనకు బహిర్గత మొనర్చాడు. మనం యేసును ఎరిగియున్నచో, తండ్రిని ఎరిగినట్లే! యేసును
చూచినవారు, తండ్రిని చూచినట్లే! (14:7-9). యేసు, తండ్రి ఒక్కరే! “నేనును, నా
తండ్రియు ఏకమై యున్నాము” (యోహాను. 10:30). కనుక, మనం క్రీస్తును ఎంత ఎక్కువగా
తెలుసుకుంటే, అంత ఎక్కువగా దేవునిని తెలుసుకుంటాము.
యేసు
అను మార్గము ద్వారా తండ్రి యొద్దకు చేరవలేనంటే, మనకు ఉండవలసినది - విశ్వాసము
- “నేను తండ్రి యందు, తండ్రి నా యందు ఉన్నామని నీవు విశ్వసించుట లేదా?... నేను
తండ్రి యందు ఉన్నాననియు, తండ్రి నా యందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ
క్రియలను బట్టియైనను నన్ను విశ్వసింపుడు” (14:10-11). నేటి రెండవ పఠనములో కూడా
పేతురు, క్రీస్తునందు విశ్వాసము లేనిచో నాశనం అవుతారని తెలియజేయు చున్నాడు: “ఆ
వాక్కును విశ్వసింపకుండుట చేతనే వారు పతనమైరి” (1 పేతు. 2:8). నిజమైన విశ్వాసము
ప్రాణమును త్యాగము చేయుటకును వెనుకాడదు (యోహాను. 13:36-37).
యేసునందు
సంపూర్ణ విశ్వాసము కలిగినవారు యేసు చేయు క్రియలను చేయగలరు: “నన్ను విశ్వసించు వాడు
నేను చేయు క్రియలను చేయును. అంతకంటె గొప్ప క్రియలను చేయును” (14:12). “క్రియలు”
అనగా ‘అద్భుత సంకేతాలు’ (5:20,36, 7:3, 9:3-4, 10:25, 32-33, 37-38, 15:24), అలాగే
‘యేసు సంపూర్ణ ప్రేషిత కార్యం’ (4:34, 17:4), ‘యేసు నైతిక పనులు’ (3:19-21, 7:7,
8:39, 41). యోహాను సువార్తలో “క్రియలు” అనగా ‘దేవుని చిత్తమును నెరవేర్చడం’ అని
కూడా అర్ధము.
మొదటి పఠనము: సువార్తలో ధ్యానించిన
ఐఖ్యత, మనం జీవిస్తున్న సంఘములో జీవించగలగాలి. అనాధి క్రైస్తవ సంఘం ప్రేమ, సేవ,
ఆరాధన అను సుగుణాలు కలిగి యున్నది. అయితే, శిష్యుల సంఖ్య పెరుగుచున్న కొలది (సంఘం
పెరుగుచున్న కొలది), అనాధి క్రైస్తవ సంఘములో కొత్తకొత్త సమస్యలు తలెత్తుచున్నాయి. ఉదా.
అనుదిన పరిచర్యలో (diakonia అనుదిన పరిచర్య = ఆహార పరిచర్య, సువార్త పరిచర్య),
ముఖ్యముగా ఆహార పరిచర్యలో, వారి వితంతువులు నిర్లక్ష్యము చేయబడుచున్నారని, గ్రీకు
మాట్లాడే యూదులు, హెబ్రీయులమీద సణుగసాగిరి. గ్రీకు మాట్లాడే యూదులు, బహుశా
అన్య-గ్రీకులు కారు. వీరు గ్రీకు మాట్లాడే ‘డయాస్పోరా’ యూదులు (ఇక్కడ క్రైస్తవ విశ్వాసులు).
హెబ్రీయులు అరమాయిక్ మాట్లాడే యూదులు (ఇక్కడ క్రైస్తవ విశ్వాసులు). సంఘములో
అవకతవకలు, విభజనలు ఉన్నాయి.
అంత:ర్గత
సమస్యను అపోస్తలులు పరిష్కరిస్తున్నారు. అపోస్తలులు ప్రార్ధనలోను, సువార్త
పరిచర్యలోను నిమగ్నమై యుండుట వలన, సంఘమంతటిని సమావేశ పరచి, పరిచర్యకు
పవిత్రాత్మతో నిండిన వారిని, జ్ఞానము గలవారిని, మంచి పేరు గలవారిని ఎన్నుకొనమని
సలహా ఇచ్చియున్నారు. ఎన్నుకోబడిన ఏడుగురి కొరకు, అపోస్తలులు ప్రార్ధన చేసి వారిపై
చేతులుంచిరి. “వారిపై చేతులుంచడం” అనగా ‘పరిచర్యకు ఆమోదించడం’ (6:6). అలాగే ఇతర
అర్ధాలు, ‘పవిత్రాత్మను పొందడం’ (8:17-18), ‘స్వస్థత పొందడం’ (9:12, 28:8). ఆ
ఏడుగురిలో స్తెఫాను ఒకరు. దైవానుగ్రహముతోను, శక్తితోను నిండినవాడు. ప్రజల మధ్య
గొప్ప అద్భుతములను, సూచక క్రియలను చేసాడు. అయితే, యూదుల నుండి వ్యతిరేకతను
ఎదుర్కున్నాడు.
ప్రతీ
సంఘములోను విశ్వాసులు, అవిశ్వాసులు ఉంటారు. పరివర్తన చెందినవారు, చెందనివారు
ఉంటారు. యేసును అంగీకరించేవారు, తృణీకరించేవారు ఉంటారు. సంఘములో గ్రూపులు, విభజనలు
ఉంటాయి. ఇవన్నికూడా, ఐఖ్యతకు సవాలుగా ఉంటాయి. సంఘపరముగా మనం వాటిని సావదానముగా
పరిష్కరించు కోవాలి. ఇతరుల అవసరాలను గుర్తించడం, వారికి సహాయం చేయడం సంఘములో ఎంతో
అవసరం. పరిచర్య చేయడం, యేసుకు నిజ శిష్యులుగా ఎదుగు చున్నారనడానికి సూచన. సంఘములో
ఐఖ్యత కొరకు అందరు పాటు బడాలి. సంఘములో విభజనల వలన (గ్రూపులు) సంఘ (విచారణ,
మేత్రాసనణ) సమగ్రతకు ముప్పు వాటిల్లుతుంది. ఐఖ్యత ఉన్నచోట, పరస్పర ప్రేమ, సేవ
ఉన్నచోట, సంఘం బలపడుతుంది, అభివృద్ధి చెందుతుంది. అనుదినం ఎదురయ్యే సమస్యలను
ఎదుర్కున్నప్పుడే, సంఘము (శ్రీసభ) సజీవముగా ఉండగలదు.
సంఘములో ఐఖ్యత
No comments:
Post a Comment