తపస్కాల మూడవ ఆదివారము, Year A

తపస్కాల మూడవ ఆదివారము, Year A
నిర్గమ. 17:3-7; రోమీ. 5:1-2, 5-8; యోహాను. 4:5-42

తపస్కాలము లేదా ‘పాస్కాయత్తకాలము’ అనుగ్రహ సమయము. పాపహితులమైన మనము పాపరహితులుగా మారుటకు ప్రయత్నించతగు మంచి సమయము. పలురకాల ఉన్నత నిర్దేశములను తీసుకుని వాటిని నిష్టగా పాటించి, పరిపూర్తిచేయ చక్కని సమయము. చెడు అలవాట్లనుండి మనలను మనము కాపాడుకొన పరిశుద్ధ సమయం. ఇటువంటి పవిత్ర సమయములో తిరుసభ బోధించే ఈనాటి సందేశం: ‘‘క్రీస్తే జీవజలము’’.

దేవుని పరీక్షించరాదు

ఈ నాటి మొదటి పఠనములో (నిర్గమ.17:3-7)  ఇస్రాయేలు ప్రజలు దేవున్ని పరీక్షకు గురిచేస్తున్నారు. వారిని అద్భుతరీతిన ఫరోబానిసత్వమునుండి విముక్తిచేసిన యావే దేవునిమీద అపనమ్మకంతో, అవిశ్వాసముతో తిరుగుబాటు చేస్తున్నారు. మోషేను దూషిస్తూ ఉన్నారు. ఈనాటి ఈ భక్తికీర్తన (కీర్తన. 95: 8-9), “‘మెరీబా’ (జగడమాడుట) చెంత మీ పితరులవలె, నాడు ఎడారిలో ‘మస్సా’ (పరీక్షించుట) చెంత మీ పితరులవలె మీరును హృదయమును కఠినము చేసుకోవలదు. నేను చేసిన కార్యములను చూసిన పిదపకూడా మీ పితరులు నన్నచట శోధించి పరీక్షకు గురిచేసిరి’’ అని గుర్తుకు చేయుచున్నది. ఎన్నో అద్భుత కార్యములు చేసి, చివరికి శక్తివంతమైన ఫరోసైన్యమును నాశనంచేసి అద్భుతరీతిన వారిని కాపాడిన ఆ దేవునిశక్తిని ప్రత్యక్షముగా చూసిన తరువాతకూడా, వారు మూర్కులవలె ఆయనపై తిరుగుబాటు చేస్తున్నారు. బానిసత్వములో మ్రగ్గుచున్న వీరిని ప్రేమతో స్వాతంత్రములోనికి నడిపించు దేవున్ని పరీక్షిస్తున్నారు. వారి హృదయములను కఠినము చేసికొనియున్నారు. ఇదిగో దేవుడు మనలను ఈ రోజు ప్రశ్నిస్తున్నాడు, మనము ఎన్ని సందర్భాలలో మన హృదయములను కఠినము చేసుకొని దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసియున్నాము? చేస్తున్నాము?

వాగ్దాన భూమి అనగా గొప్ప జీవితం, ఆనంద జీవితం, స్వేచ్ఛా జీవితం, పాలు తేనెలతో కూడిన అందమైన జీవితం. ఇది దేవుడు యిస్రాయేలీయులకు ఇచ్చిన గొప్ప వాగ్దానం. అయితే  వారు తమ చిన్న సమస్య అయిన నీటి కొరతను భూతద్దంలో చూస్తూ గొప్ప లక్ష్యమైన వాగ్దాన భూమిని చిన్నదిగా చేసి గొడవ చేస్తున్నారు, దేవున్ని పరీక్షిస్తున్నారు. తిరిగి ఐగుప్తుదేశం అనగా బానిసత్వమే మెరుగని మమ్మును ఎందుకు తీసుకొచ్చావు అని మోషెపై తిరుగుబాటు చేస్తున్నారు. గోరంత సమస్యను కొండంత చేసి కొండంత శక్తిగల దేవున్ని గోరంత చేస్తున్నారు. ఆ సమయంలో దేవుడు వారి దృష్టిలో  చిన్నబోయాడు.

ఇదిగో దేవుడు మరల మనలను ప్రశ్నిస్తున్నాడు. నీ చిన్నచిన్న సమస్యముందు దేవుని గొప్పశక్తిని గుర్తించలేక పోవుచున్నావా? నీ సమస్య కారణమున నీవు దేవుని వదిలిపెట్టి దూరంగా వెళ్లిపోతున్నావా? సర్వశక్తిమంతుడైన దేవున్ని చిన్నచూపు చూస్తున్నావా? వాటి మూలమున నీ విశ్వాసమును కోల్పోవుచున్నావా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా, బలహీనులైన యిస్రాయేలీయుల అవిశ్వాసమును తొలగించుటకై యావే దేవుడు రాతినుండి వారికి జలమును ప్రసాదించు చున్నాడు (నిర్గమ. 17:6). 

యేసు – సమరీయ స్త్రీ: సువిశేష పఠన నేపధ్యము

నేటి ప్రధాన ధ్యానాంశం: “క్రీస్తే జీవజలము”. యేసు ఏవిధముగా సమరీయ స్త్రీని, పట్టణములోని అనేక సమరీయులకు, ఆ ‘జీవజలము’ను [రక్షణ] ఒసగినది ధ్యానిద్దాం. మనము కూడా ఆ సమరీయ స్త్రీతో ప్రయాణం చేద్దాం.

యేసు యెరూషలేము దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బు మార్చువారిని వెడలగొట్టి, దేవాలయమును శుభ్రపరచిన తరువాత, యెరూషలేములో అనేక అద్భుతములను చేసియున్నారు (యోహాను 3:14-17). పాపము అనే పాముకాటుకు బాధపడుచున్నవారి రక్షణ కొరకు “మనుష్యకుమారుడు ఎత్తబడవలెను” అని యేసు నికోదేముతో చెప్పెను (యోహాను. 3:1-21). “పిదప యేసు తన శిష్యులతో యూదయా సీమకు వెళ్లి, వారితో కొంత కాలము గడుపుప్చు జ్ఞానస్నాన మిచ్చుచుండెను” (యోహాను. 3:22). “యేసు యూదయా సీమ వదిలి మరల గలిలీయకు ప్రయాణమయ్యెను” (యోహాను. 4:3). యేసును నిరాకరించిన యెరూషలేము పట్టణమును వీడి అన్యులు నివాసముండే గలిలీయ ప్రాంతమునకు ప్రయాణమయ్యాడు. యూదయా సీమనుండి, గలిలీయ సీమకు ‘పెరీర’ అనే ప్రాంతముగుండా మార్గము ఉన్నది. అన్యులు నివసించే ప్రాంతమును తప్పించుకొనుటకు యూదులు ఈ మార్గమునే ఎన్నుకొనెడివారు. ఎందుకన, యూదులు అన్యులను అసహ్యించు కొనెడివారు. కాని, యేసు ఆ మార్గమును ఎన్నుకొనలేదు. అన్యులు వసించే ప్రదేశాలగుండా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. దీని పరమార్ధం: యేసు నిర్మింపబోయే దేవాలయం లేదా శ్రీసభ, అన్ని దేశములవారికి వర్తిస్తుంది. ఆయన ఈ లోకమునకు, అన్ని మతమువారి కొరకు అంకితమై సేవచేయడానికి, రక్షించడానికి వచ్చియున్నాడు.

“ఆయన సమరియా మీదుగా వెళ్ళవలసి యుండెను” (4:4). యూదయా, గలిలీయ ప్రాంతములను వేరుపరచేది సమరియా ప్రాంతము. సమరీయులు పూర్తిగా అన్యులు కారు, అలాగని పూర్తిగా యూదులు కూడా కాదు. అస్సీరియా బానిసత్వములోనున్నప్పుడు, సమరియా జాతి ఉద్భవించినది. సమరీయులు, మోషే వ్రాసిన ఐదు గ్రంథములను మాత్రమే విశ్వసించెడివారు. అనేకమైన ఇతర పూర్వనిభందన గ్రంథములను నిరాకరించారు. ఎందుకనగా, అవి ఎక్కువగా యూదులగూర్చి ప్రస్తావిస్తున్నాయి. యూదులు ఆరాధించెడి స్థలము ‘యెరూషలేము’ అయితే, సమరీయులు ‘గిరిజిమ్‌’, అనే పర్వతముపై ఆరాధన చేసేడివారు (4:20).

యూదులు ‘సమరీయ’ అనే పదమును ఉచ్చరించెడివారు కాదు. ఎందుకన, సమరియానుగాని, ‘సమరీయులనుగాని వారు మిక్కిలిగా ద్వేషించెడివారు. ఎవరినైనా అవమానించాలనిగాని, కించపరచాలనిగాని అనుకొన్నప్పుడు, వారిని ‘సమరీయులు’ అని సంబోధించెడివారు.

యేసు ప్రభువు ఎప్పుడుకూడా సమరీయులను నిర్లక్ష్యం చేయలేదు. వారినుండి దూరముగా పారిపోలేదు. వారిని ఎన్నడు అవమానింపలేదు, కించపరచలేదు. ఆయన సర్వమానవాళి రక్షకుడు. సకల సృష్టికి మూలాధారము. అందరిపై తన అనంతమైన ప్రేమను చూపించాడు.

సువిశేష పఠన వ్యాఖ్యానము

సువిశేష పఠనములో (యోహాను. 4:5-42), యేసు క్రీస్తు ప్రభువు సమరీయ స్త్రీని శిథిలమైన తన పాత జీవితములోనుండి నూతనమైన అనుగ్రహ జీవితములోనికి నడిపిస్తున్నాడు. త్రాగునీటి కొరకై వచ్చిన ఆ స్త్రీకి, జీవజలమును అనుగ్రహిస్తున్నాడు, బలహీనురాలైన ఆమెను బలపరచుచున్నాడు. ఈ ఆధ్యాత్మిక పరిపక్వత ఎలా చిగురించినదో ధ్యానించుదాం.

“యేసు సమరియాలోని సిఖారు అను పట్టణమునకు వచ్చెను. అది యాకోబు తన కుమారుడగు యోసేపునకు ఇచ్చిన పొలము సమీపములో ఉన్నది. అక్కడ యాకోబు బావి ఉండెను. యేసు ప్రయాణపు బడలికచే ఆ బావి వద్ద కూర్చుండెను. అది మధ్యాహ్నపు వేళ. [ఆ సమయములో] ఒక సమరీయ స్త్రీ నీటి కొరకు అక్కడకు వచ్చెను” (4:5-7). ఒక స్త్రీ నీటి కొరకు మధ్యాహ్నవేళ బావి వద్దకు రావడం సాధారణముగా జరిగేదికాదు. అదే సమయములో, ఇది ఉద్దేశపూర్వకముగా జరిగినదికూడా కాదు. సమరీయ స్త్రీ, యేసును చూడాలనే తలంపుతో అచ్చటకు రాలేదు. తను లోకరక్షకుడిని చూస్తానని కలలోకూడా భావించకపోయి ఉండవచ్చు. ఇదంతయు కూడా దేవుని చిత్తమని గుర్తించాలి. దేవునికి తెలియకుండా ఏదీ జరగదు. దేవుడు ఎప్పుడుకూడా తన వారికోసం వెదకుతూ వస్తూ ఉంటాడు. “నేను వారికి దర్శనమీయ గోరితిని’’ (యెషయ 65:1). జక్కయ్య ఎప్పుడు ప్రభువును వెదకలేదు. ప్రభువే అతన్ని కనుగొన్నాడు. పౌలును కూడా ప్రభువే కనుగొన్నాడు. “నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు’’ (యోహాను. 6:44).

సమరీయ స్త్రీ యేసును చూచిన వెంటనే, తన కడవను నింపుకొని త్వరగా అక్కడనుండి వెళ్లిపోవాలని భావించి ఉంటుంది. ఎందుకన, యేసును ఒక యూదునిగా గుర్తించినది. యూదులకు, సమరీయులకు ఎట్టి పొత్తులేదు (4:9). వారిమధ్య మాటలుకూడా ఉండేవికావి.  కాని, ఆస్త్రీ ఆశ్చర్యపడునట్లుగా, యేసు ఆమెను నీరిమ్మని అడిగాడు. “నాకు త్రాగుటకు నీరు ఇమ్ము’’ (4:7). యేసు ప్రతీసారి ఇతరుకు ఉపకారము చేయుటకు ముందుగా, ఒక ప్రశ్నతో తన సంభాషణను ప్రారంభిస్తాడు. ఆ ప్రశ్న అర్ధించెడిది కాదు. అది విన్నపముతో కూడినదై ఉంటుంది. ఇక్కడ, దేవుడు మానవున్ని కరుణించడానికి, తననుతాను ఏమిలేనివానిగా చేసుకున్నాడు. యేసు నీరిమ్మని కోరినప్పుడు, ఆ స్త్రీ తన ఆశ్చర్యాన్ని ఇలా వ్యక్తపరచినది, ‘‘యూదుడవైన నీవు సమరీయ స్త్రీనగు నన్ను నీరు ఇమ్మని ఎట్లు అడుగుచున్నావు? (4:9). “నీవు దేవుని వరమును గ్రహించియున్న యెడల ‘త్రాగుటకు నీరు ఇమ్ము’ అని అడుగుచున్నది ఎవరు అని తెలుసుకొని ఉన్న యెడల, నీవే ఆయనను అడిగి ఉండెడి దానవు. అపుడు ఆయన నీకు జీవజలమును ఇచ్చి ఉండెడివాడు” (4:10) అని యేసు సమాధానమిచ్చాడు.

యేసు మానవాళి అవసరమును తీర్చువాడు. అందరి హృదయావసరాలను ఎరిగియున్నవాడు. ఆస్త్రీ జీవజలావసరముతో నుండుటచేత, తననుతాను ‘నీరు’ [జీవజలము]గా వ్యక్తపరచాడు. దాహముతోనున్నాను, త్రాగుటకు నీరిమ్మని కోరాడు. ఎవరైన జీవాహారావసరముతో ఉన్నయెడల తననుతాను ఆహారముగా వ్యక్తపరచు గొప్ప దేవుడు ఆయన. తను దేవునినుండి వచ్చిన మానవాళికి వరమునని చెప్పియున్నప్పటికినీ, ఆ స్త్రీ, యేసుని ఒక యూదునిగా, ఒక బాటసారిగా, ప్రయాణపు బడలికచే, అలిసిపోయిన ప్రయాణికుడిగా మాత్రమే గుర్తించినది. ఆయనలో నున్న దైవస్వభావమును, దైవస్వరూపమును ఆమె చవిచూడలేక పోయింది. ఆమె ఒక యూదున్ని మాత్రమే చూసింది కాని, దేవుని కుమారున్ని చూడలేక పోయింది. అలసిపోయినవానిగా గుర్తించినది కాని అలసి సొలసియున్న సమస్త జనులకు ఊరట నిచ్చువాడని ఆ క్షణాన గుర్తించలేక పోయింది. దాహముతోనున్న ప్రయాణికునిగా గుర్తించింది కాని, ఈలోక దాహమును తీర్చువాడని, జీవజలమునొసగువాడని ఆ క్షణాన గుర్తించలేకపోయింది. ఇహలోక మోహములతో, కార్యములతో, ఆలోచనలతో మునిగితేలెడివారు, ఆధ్యాత్మిక సంపదను, పరలోక సంపదను తెలుసుకోలేరు. అయితే, చివరికి ఎలాగో ఆయనపై ఈవిధముగా గౌరవాన్ని వ్యక్తపరచింది: ‘‘అయ్యా! ఈ బావి లోతైనది. నీరు చేదుటకు నీయొద్ద ఏమియు లేదు. జీవజలమును నీవు ఎక్కడనుండి తెచ్చెదవు? మా పితరుడగు యాకోబు మాకు ఈ బావిని ఇచ్చెను. అతడు, అతని కుమారులు, ఈ బావి నీటిని త్రాగిరి. నీవు అతని కంటె గొప్పవాడవా?’’ (4:11-12).

ఇప్పుడు ఆ స్త్రీ యేసుని యూదుడని పిలువక ‘‘అయ్యా!’’ అని సంభోదించినది. యేసు చెప్పినది అర్ధం కానప్పటికిని, ఆయన పలుకుపై అనుమానాన్ని వ్యక్తపరచింది. ఆ బావిని ఇచ్చిన యాకోబును, ఆయన కుమారులను, సమరీయులందరిని భంగపరుస్తున్నాడని తలంచినది. ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానముగా, తను యాకోబుకన్నా గొప్పవాడని చెప్పాడు, “ఈ నీటిని త్రాగువాడు మర దప్పిక గొనును. కాని నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికిని దప్పిక గొనడు నేను ఇచ్చు నీరు వానియందు నిత్యజీవమునకై ఊరెడి నీటి బుగ్గగా ఉండును’’ (4:13,14). యేసు ఇచ్చట తన జీవిత తత్వాన్ని వ్యక్తపరచాడు. మానవుని ప్రతీ శరీర కోరిక ఒక లోపాన్ని కలిగి ఉంటుంది. అదేమనగా, ఆ కోరికలు శాశ్వతమైన సంతృప్తిని ఇవ్వలేవు. ప్రస్తుత అవసరాన్ని తీర్చుటకు మాత్రమే తోడ్పడతాయి. కాని, శాశ్వతముగా ఉపశమనాన్ని కలుగజేయలేవు. కొంత సమయము తరువాత, ఆ కోరికలు మరల కలుగుతాయి. ఈ లోక జలము మరల దప్పికగొనునట్లు చేయును. కాని, యేసు ప్రభువు ఒసగే ‘జీవజలము’ వలన ఎప్పటికిని దాహము గొనము. మన ప్రభువు ఈలోక కోరికలనుండి, పాపపు సంకెళ్ళనుండి శాశ్వతముగా నిర్మూలించుటకు వచ్చియున్నాడు. ఈ లోకమును మంచి లోకముగా తీర్చిదిద్దుటకు పూనుకున్నాడు. అయినప్పటికిని, ఈ లోకములో ప్రవహించే జలాలను ఆయన ఖండించలేదు. ఒకవేళ ఆ స్త్రీ ఈ లోకపు నీటిపై మాత్రమే ఆధారపడినచో, శాశ్వతమైన సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించలేదని ప్రభువు ఉద్దేశం! అయితే ఆ స్త్రీ యేసు ఉద్దేశాన్ని అర్ధం చేసుకోకుండా, యేసును ఈ విధముగా అడుగుచున్నది: ‘‘అయ్యా! నేను మరల దప్పికగొనకుండునట్లును, నీటికై ఇక్కడకు రాకుండునట్లును నాకు ఆ నీటిని ఇమ్ము’’ (4:15).

యేసును ఆమె ఇక యూదునిగా మాత్రమే పరిగణింపలేదు. ఆయనను ఇప్పుడు ‘అయ్యా’ అని సంబోధిస్తున్నది. అయితే ఇప్పటికికూడా ఆమెలోని అనుమానాలు తీరలేదు. ఆమె ఇక నీటికొరకు బావిదగ్గరకు రాకుండా శాశ్వతముగా శారీరక దాహమును తీర్చునీటిని ఇస్తాడని ఆశపడుతూ ఉంది. కాని, ప్రభువు ఆధ్యాత్మిక దాహముగూర్చి ప్రస్తావించియున్నాడు. ఆమె హృదయపు ద్వారము పాపముతో కూడుకొని యున్నందువలన, ఆధ్యాత్మిక జీవజలమును అర్ధం చేసుకొనలేక పోయింది.

అది గమనించిన ప్రభువు, ఆమె ఎందుకు అర్ధం చేసుకొనలేక పోయిందో విశ్లేషించాడు. ఆమె జీవితం అవినీతి పరమైనది. ఇహలోకమైనది. ఆమె హృదయంతరంగాలోనికి చూచి ఆమెతో ఈవిధముగా పలికాడు, ‘‘నీవు పోయి నీ భర్తను పిలుచుకొని రమ్ము’’ (4:16). ఆమె జీవిస్తున్న దుర్లభమైన, అవినీతిపరమైన జీవితాన్ని సరిచేయుటకు ఆమె భర్తని పిలుచుకొని రమ్మని చెప్పాడు. ‘పోయి’... అనగా ‘నీవు వెళ్లి నీ జీవిత వాస్తవాన్ని చూడు’ అని అర్ధం. ‘రమ్ము’ అనగా ‘వచ్చి జీవజలమును స్వీకరించు’ అని అర్ధం. అందుకు ఆ స్త్రీ, ‘‘నాకు భర్త లేడు’’ (4:17) అని సమాధానం ఇచ్చినది.

ఆమె సత్యమునే పలికినది. తన అవినీతిపరమైన జీవితాన్ని అంగీకరించినది. అంగీకరించిన మాత్రాన ఆమె జీవజలమును పొందలేకపోయింది. ఎందుకనగా, జీవజలమును పొందుటకు జీవితము అనే బావిని లోతుగా త్రవ్వవలసియున్నది. తన హృదయపు లోతులోనే జీవజలమున్నదని గ్రహించలేక పోయింది. ఆమె పాప జీవితము వలన, చెడు తలంపులు ఆలోచనల మూలముగా జీవజలమును పొందలేకపోయింది. జీవజలమును పొందుటకు వీటన్నింటిని త్రవ్వవలసియున్నది. రక్షణ పొందబోవుముందు పాపమును ఒప్పుకోవలసి ఉంటుంది. ఆప్పుడు ఆమెలో కలిగిన ఆవేదనని, తప్పుచేశాననే మనస్తాపాన్ని ప్రభువు గమనించి ఇలా పలికాడు: ‘‘‘నాకు భర్త లేడు’ అని నీవు యథార్దముగా చెప్పితివి’’ (4:17). ఆమె నిజాయితీకి ప్రభువు ఆమెను పొగిడాడు. ఇతరులైతే ఆమెను విసుగుకొనేవారు, హేళన చేసేడివారు. ప్రభువు యథార్దమే పలికితివని చెప్పి ఈవిధముగా అన్నాడు, ‘‘నీకు ఐదుగురు భర్తులుండిరి. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు’’ (4:18).

యేసు ఎవరిని అడగకుండానే చెబుతున్నాడని భావించినది. తన ప్రవర్తనని, జీవితమును సూక్ష్మముగా పరిశీలిస్తున్నాడని, తద్వారా, తను పొందవసిన వరము పొందలేమోనని తలంచుచున్నది. సంభాషణను మార్చడానికి ప్రయత్నించినది, ‘‘అయ్యా! నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది’’ (4:19). మొదటగా ప్రభువుని ‘యూదుడు’ అని, తరువాత ‘అయ్యా’ అని ఇపుడు ‘ప్రవక్త’ అని సంబోధించుచున్నది. తన జీవితము గూర్చి మాట్లాడటానికి యిష్టము లేక, ఆమె ఇలా సంభాషణను మార్చినది. సంభాషణను మతముపైకి మరల్చినది, ‘‘మా పితరులు ఈ పర్వతముమీద ఆరాధించిరి. కాని, దేవుని ఆరాధించవసిన స్థలము యెరూషలేములో నున్నదని మీ యూదులు చెప్పుచున్నారు’’ (4:20). మతం పేరిట స్వల్పమైన విషయమై తర్కించుటకు ప్రయత్నించినది. యూదులు ‘యెరూషలేము’లో ఆరాధించెడివారు. సమరీయులు ‘గరిజిమ్‌’ పర్వతముపై ఆరాధన చేసెడివారు. దానికి సమాధానముగా ప్రభువు ఇలా పలికియున్నాడు, ‘‘స్త్రీ నా మాట నమ్ముము. సమయము ఆసన్నమగుచున్నది. మీరు ఈ పర్వతము మీదకాని, యెరూషలేములోకాని తండ్రిని ఆరాధింపరు. మీరు ఎరుగని వానిని మీరు ఆరాధింతురు. మేము ఎరిగిన వానిని మేము ఆరాధింతుము. ఏయన రక్షణ యూదులనుండియే వచ్చును. కాని, నిజమైన ఆరాధనకు ఆత్మయందును, సత్యమందును తండ్రిని ఆరాధించు సమయమిపుడే వచ్చియున్నది. నిజముగ తండ్రి ఆశించునది ఇటువంటి ఆరాధకులనే. దేవుడు ఆత్మస్వరూపి కనుక, ఆయనను ఆరాధించువారు ఆత్మయందును, సత్యమునందును ఆరాధింపవలయును’’ (4:21-24).

యూదులకు, సమరీయులకు మధ్యనున్న వివాదాలన్నీ సమసిపోతాయని యేసు తెలుపుచున్నాడు. యేసుగూర్చి సిమియోను పల్కిన ప్రవచనాలు నెరవేరాయి, ‘‘అన్యులకు ఎరుకపరచు వెలుగు, నీ ప్రజలగు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు’’ (లూకా. 2:32). యేసు ప్రభువుకూడా ఈ ప్రవచనాన్ని మరోవిధముగా చెప్పియున్నారు, ‘‘రక్షణ యూదులనుండియే వచ్చును’’ (4:22).

నిజముగా రక్షకుడు సమరీయులనుండిగాక, యూదులనుండి రావలసియున్నాడు. ‘రక్షణ’ అనేది ‘రక్షకుడికి’ మరో పేరు. “ప్రభూ నీవు ఏర్పరచిన ‘రక్షణమును’ కనులారా గాంచితిని” (లూకా. 2:30,31). లోకానికి రక్షణము నొసగుటకు. దేవుడు యిస్రాయేలును సాధనముగా ఎన్నుకొన్నాడు.

యేసు పలుకులు ఈ పాపాత్మురాలను ఎంతగానో తాకాయి. సత్యము అనెడి పరిధిలోనికి ఆమెను తీసుకొని వెళ్ళాయి. కాని ‘‘ఆత్మయందును, సత్యమందును తండ్రిని ఆరాధించు సమయమిపుడే వచ్చియున్నది’’ అను వాక్యము ఆ స్త్రీకి అర్ధము కాలేదు. ఎందుకనగా, సమరీయులుకూడా మెస్సయా రాకడను విశ్వసించెడివారు. అందుకే ఆమె, ‘‘క్రీస్తు అనబడు మెస్సయా రానున్నాడని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయమును తెలియజేయును’’ (4:25) అని సమాధానం ఇచ్చినది.

సమరీయులు పాత నిబంధనగూర్చి జ్ఞానమును కలిగియున్నారు. అందుకే, దేవుడు ఆశీర్వదించబడిన వానిని ఈ లోకానికి పంపుతాడని విశ్వసించారు. కాని ఆ వ్యక్తి ఒక ప్రవక్తగా మాత్రమే వస్తాడని సమరీయుల విశ్వాసం. యూదులు, ఆ వ్యక్తి భూలోకాన్ని పాలించే రాజుగా వస్తాడని విశ్వసించారు. యేసు ఆమె అల్పవిశ్వాసాన్ని ఎరిగి ఇలా పల్కియున్నాడు, ‘‘నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను’’ (4:26). ఈ ప్రవచనము ద్వారా ఆరాధన సల్పెడి స్థలము ‘యెరూషలేము’గాని, ‘గిరిజిమ్‌’ పర్వతముగాని కాదని, అది క్రీస్తేనని స్పష్ఠమగుచున్నది.

ఈ ప్రవచనాన్ని విన్న ఆ సమరీయ స్త్రీ ఆశ్చర్యముతో నీటికొరకు తెచ్చుకున్న కడవను అక్కడే వదిలిపెట్టి పట్టణములోనికి వెళ్లి ప్రజలతో ఈవిధముగా చెప్పినది, ‘‘ఒక మనుష్యుడు నేను చేసినవి అన్నియు చెప్పెను. వచ్చి చూడుడు. ఆయన ‘క్రీస్తు’ ఏమో!’’ (4:29). ఆమెలో ఆధ్యాత్మిక ప్రగతి చిగురించినది. ఎందుకన, ఆ యూదుడు ‘క్రీస్తు’ అని, ‘రక్షకుడు’ని ఆమె తెలుసుకున్నది. ఆయన తీసుకొనువాడు కాదని, ఇచ్చువాడని ఆమె గ్రహించినది. ఆయన తన సహాయం కోరిరాలేదని, తనే ఆయన సహాయం అవసరమైయున్నదని ఆమె తెలుసుకున్నది.

ఇచ్చట స్త్రీ, యేసును మరో క్రొత్త విధముగా సంబోధించినది. ఆయనను ‘‘క్రీస్తు’’ అని సంబోధించినది. ప్రజలతో ఆరాధనగూర్చి చెప్పిన విషయమునుగాక, యేసు ఆమె జీవితమును గూర్చి చెప్పిన విషయమున్నియు చెప్పినది. సూర్యుడు ఉదయించిన క్షణముననే వెలుగును ప్రకాశించును. నిప్పు రగుల్కొనిన క్షణముననే మండుతుంది. అదేవిధముగా, మానవుని హృదయం దేవునితో సహకరించిన క్షణముననే, ఆయన కృప పనిచేస్తుంది. ఆ సమరీయ స్త్రీ, క్రైస్తవ చరిత్రలోనే, మొట్టమొదటి మత ప్రచార బోధకులలో ఒక ప్రచారకురాలై యున్నది. మొదటగా, ఆమె నీటి కొరకు బావి దగ్గరకు వచ్చినది. కాని, నిజమైన జీవజల ఊటను కనుగొన్న తరువాత, శిష్యులు ఏవిధముగానైతే, తమ వలలను వదిలి ఆయను అనుసరించారో, ఈ స్త్రీ కూడా తన కడవను అచ్చటనే వదిలి పెట్టినది. యేసు కూడా తన ఆకలి దప్పులగూర్చి పూర్తిగా మరచి పోయాడు. శిష్యులు, ‘‘బోధకుడా! భోజనము చేయుడు’’ (4:31) అని అడిగినప్పుడు, ‘‘భుజించుటకు మీరు ఎరుగని ఆహారము నాకు కలదు’’ (4:32) అని వారితో పలికాడు.

ఆమె ప్రచారము ఎంతగానో పని చేసినది. “ఆ పట్టణములోని సమరీయు అనేకులు ఆయనను విశ్వసించిరి’’ (4:39). నేను చెప్పెడిది మీరందరు విశ్వసించాలి అని ఆమె చెప్పలేదు. “వచ్చి చూడుడు’’ అని చెప్పియున్నది. ఆమె చెప్పిన మాటలను బట్టి, ఆమెలోని అతృతను, విశ్వాసాన్ని చూసిన అనేకమందికి నమ్మకం కలిగినది. కొన్ని గంటల తరువాత, ఆ స్త్రీ మరల యేసు వద్దకు తిరిగి వచ్చినది. కాని ఈసారి నీటి కొరకు రాలేదు. ‘జీవజలము’ కొరకు, ‘రక్షణ’ పొందుటకు వచ్చియున్నది.

“ఆ సమరీయ వాసులు వచ్చి ఆయనను తమయొద్ద ఉండుమని వేడుకొనగా, ఆయన అచట రెండు రోజులు ఉండెను. ఆయన ఉపదేశమును ఆలకించి ఇంకను అనేకులు ఆయనను విశ్వసించిరి” (4:40,41). ప్రభువును చూసిన ప్రజలు ఆ స్త్రీతో ఈవిధముగా పలికారు, ‘‘మేము ఇప్పుడు నీ మాటను బట్టి విశ్వసించుట లేదు. మేము స్వయముగా ఆయన ఉపదేశమును వింటిమి. వాస్తవముగా ఆయన లోకరక్షకుడని మాకు తెలియును’’ (4:42).

యేసు క్రీస్తు ప్రభువు అనాటి సాంఘిక నియమములకు వ్యతిరేకముగా (అతీతముగా) ప్రవర్తించి సమరయ స్త్రీని రక్షించుచున్నాడు. ఆమె బలహీనతలను, ఆమె పాపములను తెలియజేసి ఆమెను పవిత్రురాలుగా మారుస్తున్నాడు. బలహీనురాలిని బలవంతురాలుగా చేస్తున్నాడు. చివరకు ఆమెనే తన శిష్యురాలిగా ఉపయోగించుకుని ఆమెద్వారా ఆ గ్రామ ప్రజందరినీ కూడా తన దగ్గరకు ఆకట్టుకోగలిగాడు.

రెండవ పఠనములో, పౌలు రోమాపత్రిక 5:8లో ‘‘మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మనకొరకై మరణించెను కదా! ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు’’. ఇలా దేవుడు బలహీనులైన మానవులను తన దివ్యశక్తిద్వారా, ప్రేమద్వారా బలపరుస్తూనే యున్నాడు. తన జీవజలముద్వారా అందరి దప్పికను తీర్చుతాడు. యేసు ఆమెతో, “ఈ నీటిని త్రాగువాడు మరల దప్పిక గొనును. కాని నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికిని దప్పిక గొనడు” (యోహాను. 4:13) అని చెప్పియున్నాడు.

ఈ అనుగ్రహ కాలములో, మనము ఆ ‘జీవజలము’ను ప్రభువునుండి పొందుకొనుటకు ప్రయాసపడుదాం. ఆయన మనలను క్షమించే దేవుడు, మనలను బలపరిచే దేవుడు. మనకోసం తన ప్రాణాలను సిలువపై అర్పించిన దేవుడు. మనలోని అవిశ్వాసమును, అంధకారమును, చెడును, బలహీనతలను, దురలవాట్లను విడిచిపెట్టి, జీవజలముతో పరిశుద్ధపరచబడి, దేవుని రాజ్యములో చేరుదాం.

No comments:

Post a Comment