దివ్య కారుణ్యం: దివ్యకారుణ్య మహోత్సవము 11 ఏప్రిల్ 2021

 దివ్య కారుణ్యం: దివ్యకారుణ్య మహోత్సవము 11 ఏప్రిల్ 2021
పాస్కా 2వ ఆదివారము
పఠనాలు: అ.కా. 4:32-35, I యోహాను 5:1-6, యోహాను 20:19-31

క్రీస్తు పునరుత్థాన పండుగ తరువాత ఆదివారమును దివ్య కారుణ్య పండుగగా జరుపుకోవాలని పునీత రెండవ జాన్ పౌల్ జగద్గురువులు మే 5, 2000ల సంవత్సరమున పిలుపునిచ్చారు. అప్పటినుండి రోమను కతోలిక సంఘమునందు ఈ పండుగను జరుపు కొంటున్నారు. అసలు ‘దివ్య కారుణ్యం’ అంటే ఏమిటి? ఈ పండుగ జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? దివ్య కారుణ్యం అంటే, ‘దేవుని కరుణఅని అర్ధం.

‘కరుణ’ లేదా ‘కారుణ్యము’ లేదా ‘కృప’ అనే తెలుగు మాటకు ఆంగ్లములో Mercy’ అందురు. ‘Mercy’ అనే ఆంగ్ల మాట misericordia అను లతీను పదం మూలం. misericordia అను పదం రెండు పదాల కలయిక: cor అనగా ‘హృదయం’, misereri అనగా ‘జాలి కలిగియుండటం’ లేదా ‘దయ, కరుణ కలిగియుండటం’. కనుక, కరుణ యనగా “ఇతరులపై హృదయపూర్వకమైన కరుణను కలిగియుండటం”. ఒక వ్యక్తి యొక్క అంత:ర్గత / లోతైన భావమును తెలియజేస్తుంది. misericordia అను పదమునకు మూలం mercedem లేదా merces అనే లతీను పదాలు. Mercedem’ లేదా merces’ అనే మాటకు ‘ప్రతిఫలము’, ‘వేతనము’, ‘కిరాయి’ అనే అర్ధాలు గలవు. నైతిక, మత, సామాజిక, చట్టపరమైన సందర్భాలలో, ‘దయ, క్షమ’ అనే అర్దాలుకూడా ఉన్నాయి. బైబులు పరిభాషలో ఈ మాటకు (Mercy) ‘ప్రతిఫలము’ లేదా ‘వేతనము లేదా కిరాయి చెల్లించ బడినది’ అని అర్ధము.

హీబ్రూ భాషలో rahamim అను పదానికి రెండు అర్ధాలు ఉన్నాయి: ‘గర్భము’ మరియు ‘కరుణ’. “తల్లి ప్రేమ”ను సూచిస్తుంది. re­hem అనగా ‘తల్లి గర్భము’. తల్లి ప్రేమ ఏమీ ఆశించనటు వంటిది. అది హృదయపు లోతులలో నుండి వచ్చును. rahamim అనగా ‘మంచితనము, సున్నితత్వం, సహనం, అర్ధంచేసుకొనుట’ అను అర్ధాలు వస్తాయి. వీటన్నింటికి అర్ధం క్షమించుటకు సిద్ధముగా ఉండటం. “స్త్రీ తన పసికందును మరచినను దేవుడు మాత్రము నిన్ను మరువడు” (యెషయ 49:15; చూడుము 54:6-8) “దేవుడు నిండు హృదయముతో ప్రేమించును” (హోషేయ 14:4; చూడుము 2:19).

‘కారుణ్యము’ అనునది దైవీక స్వభావమని, ఆయన కరుణ సర్వ ప్రాణికోటిపై ఉంటుందని బైబులు బోధిస్తున్నది (కీర్తన 145:9). “దేవుని కృప అపారము” (ఎఫెసీ 2:4).  “తండ్రి కృపామూర్తి” (2 కొరి 1:3). దేవుడు “దయార్ద్ర హృదయుడు” (యిర్మియా 31:20; 42:12; లూకా 1:78). "ప్రభువు మిక్కిలి దయాపరుడు" (2 సమూ 24:14-15; చూడుము కీర్తన 25:6; 51:1; 103:13). ఇది అత్యంత గొప్ప దైవీక లక్షణం. ఈ గొప్ప దైవీక లక్షణాన్ని యేసు ప్రభువు మనకు బహిర్గత మొనర్చారు (యోహాను 1:18, హెబ్రీ 1:1f.). “ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద దేవుని కనికరము తరతరముల వరకు ఉండును” (లూకా 1:50) అని మరియ స్తోత్ర గీతములోని ఈ పలుకులు రక్షణ చరిత్ర యొక్క కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి.

దివ్యకారుణ్య అపోస్తరాలుగా పిలువబడే పునీత ఫౌస్తీనమ్మ గారి మాటలలో చెప్పాలంటే, ఈ పండుగ ముఖ్య ఉద్దేశాలు మూడు: (1). దేవుని కరుణను కోరుకోవడం, (2). యేసుని అనంత కరుణను నమ్మడం, (3). మనం పొందిన/పొందుతున్న ఆ దేవుని కరుణను పంచడం.

ఈ పండుగ సందర్భముగా మనం ఈనాడు విన్న సువిశేషమును ధ్యానిద్దాం. దానికి ముందుగా... నీకు తెలిసిన వారు ఎవరైనా అకస్మాత్తుగా తటస్థ పడితే ఏమి చేస్తావు? లేదా ఏమి అడుగుతావు? నీకు మంచి చేసిన వాడైతే, మేలు చేసిన వాడైతే, నీ అభివృద్ది కోరేవాడైతే, వారు మనల్ని చూడకపోయినా, మనమే ఎదురెళ్లి, వారికి అగుపడి గతమున చేసిన మేలును జ్ఞప్తికి తెచ్చుకొని కృతజ్ఞతలు తెలియజేసి, కుశల ప్రశ్నలు అడుగుతాం! అదే మనకు చెడు చేసిన వారైతే, మనల్ని మోసగించిన వారైతే, మన నమ్మకాన్ని వమ్ము చేసినవారైతే, వంచనతో మన స్నేహాన్ని కోరిన వారైతే, స్వార్ధం కొరకు ప్రేమగా నటించిన వారైతే, వారిని చూసినా కాని, చూడనట్లు నటించి వారి చూపులనుండి, వారి చుట్టు ప్రక్కల నుండి తప్పించు కొనడానికి ప్రయత్నిస్తాం! కొద్దిగా దైర్యవంతులైతే, తప్పు చేయని వాడిని నా కెందుకు భయం అని చూసి చూడనట్లుగా వెళతాం! ఇంకా అతను/ఆమె కాని మనతో మాట్లాడాలని ప్రయత్నిస్తే, జరిగింది, చేసింది, చెప్పింది చాలు! ఇక వెళ్ళు అంటాం! ఇంకా మాట్లాడాలని ప్రయత్నిస్తే మోసగించిన, వంచన చేసిన, అవమానము, ఆ సందర్భము, ఆ సందర్భములో జరిగిన మాటలు, సంభాషణ, హృదయపు లోతులలో చేసిన గాయాలను గుర్తుకు తెచ్చుకొని కోపపడతాము లేదా బాధపడతాము!

ఇదంతా ఎందుకు వివరిస్తున్నానంటే, ఈనాటి సువార్తలో, యేసు ప్రభువు అటువంటి పరిస్థితులలోనే ఉన్నా, దానికి భిన్నముగా ప్రవర్తించారు. ఆయనే వారికి అగుపడుచున్నారు. ఆయనే వారితో మాట్లాడుచున్నారు. యూదుల భయముతో ఉన్న వారికి ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. ఏమి చేయాలో అని పాలుపోని స్థితిలో, ఏమి చేయాలో, ఎలా చేయాలో చెప్పుచున్నారు. బాధను, భయమును పోగొడుచున్నారు. ఇంత జరిగినా, ఏమీ జరగనట్లు, ఏమీ తెలియనట్లు ఉన్నాడు.

అదే మనమైతే, నాయవంచాకులారా! విశ్వాస ఘాతకులారా! గురుద్రోహులారా! పిరికి పందల్లారా! అని అనే వాళ్ళం! కాని ఆయన మాత్రం, షాలోం (శాంతి) సమాధానం కలుగుగాక! సమృద్ధి కలుగును గాక! ఆనందం సంతోషం వర్ధిల్లుగాక! అని వారిని సంభోదిస్తూ ఉన్నారు. ఎందుకంటే, (ఆయన) మన పాపాలకు తగినట్లుగా మనలను శిక్షింపడు, మన దోషములకు తగినట్లుగా మనలను దండింపడు  (కీర్తన 103:10).

ఆయన కరుణగలవాడు, దయగలవాడు. అతడు కరుణామయుడు, దయాపరుడైన దేవుడు. సులభముగా కోపపడువాడు కాదు. ప్రేమామయుడు, విశ్వాసమందు అనంతుడు (నిర్గమకాండము 34:6). అందుకే నమ్మని తన శిష్యులకు, తనకు కలిగిన గాయాలను చూపిస్తున్నాడు. ఈ సందర్భములో మనమైతే, ఇదిగో మీ/నీ నయవంచనకు మోసమునకు, విశ్వాస ఘాతమునకు, గురు ద్రోహమునకు గుర్తు! అని అంటాం! కాని ప్రభువు అంటున్నాడు: ఇదిగో మీ రక్షణ చిహ్నాలు, మీ పాపమునకు పరిహారముగా సిలువ మీద నన్ను సమర్పించుకొన్నాను అనడానికి చిహ్నాలు - మీ పాపములకు జీతము/ప్రతిఫలము/కిరాయి చెల్లించ బడినది అనుటకు గుర్తు. మీ కొరకై, మీ విముక్తి కొరకై, అమ్మబడ్డాను, చంపబడ్డాను/ పరిహార బలిగా అర్పింపబడ్డాను అని అనడానికి గుర్తు.  మీపై గల ప్రేమకు, రక్షణకు, కరుణకు గుర్తులు నా తీపి జ్ఞాపకాలు.  మీరు చెల్లించవలసిన మూల్యం (అప్పు) చెల్లించబడినది అని నిరూపించే రసీదు.

మీరు పొందిన ఈ పరిహారమును, మన్నింపును, విముక్తిని, మీతోనే, మీకొరకే, పరిమితం చేసికొనకుండా, ఇతరులకు పంచండి. మన్నింపులోని మహత్యమును కరుణలోని కమనీయతను వెదజల్లండి అని భోదిస్తున్నాడు యేసు. ఇంకా ఈ కరుణకు దూరముగా ఉంటె, కరుణకు దగ్గరవ్వాలని కోరుకొందాం! మనకు దగ్గరయి, మనలను దేవుని దరికి చేర్చిన క్రీస్తు కరుణను నమ్ముదాం! నమ్మిన ఆ కరుణను పొంది, పంచుదాం ... మన తోటి వారందరికీ...

శ్రీసభలో దివ్యకారుణ్య మహోత్సవం స్థాపించబడాలని ప్రభువే స్వయముగా కోరినట్లు పునీత ఫౌస్తీనమ్మగారు (దివ్య కరుణ అపోస్తురాలు) తన దినచర్య పుస్తకములో తెలిపియున్నారు (699). ప్రభువు ఆమెకి ఈ మహోత్సవమునుగూర్చి ఫిబ్రవరి 22, 1931వ సంవత్సరములో తెలిపియున్నారు, “పునరుత్థాన పండుగ తరువాత వచ్చు ఆదివారమున (పాస్కా రెండవ ఆదివారము) దివ్యకారుణ్య మహోత్సవం కొనియాడబడాలనేదే నా కోరిక. ఆ దినమున, దివ్యకరుణ సకల జనులకు ఒసగబడును. ఆ దినమున, పాపసంకీర్తనం చేసి, దివ్యసత్ప్రసాదమును స్వీకరించు వారికి సంపూర్ణ పాపవిమోచనము, శిక్షనుండి విముక్తియును లభించును. మానవ లోకము నా దరికి చేరిననే తప్ప అది శాంతమును పొందలేదు. ఆనాడు, అనంత దివ్య వరానుగ్రహాలూ ప్రవహించే దివ్య ద్వారాలన్నీ తెరచే ఉంటాయి. వారి పాపాలు ఎంతటివైనను, నన్ను చేరడానికి ఏ ఆత్మగాని భయపడక ఉండునుగాక! నా దరి చేరు ఆత్మలకు నా కరుణా సముద్ర వరాలను క్రుమ్మరించెదను. దివ్యకారుణ్య మహోత్సవం సకల ఆత్మలకు, ముఖ్యముగా పాపాత్ములకు శరణముగాను, ఆదరణముగాను ఉండునుగాక!''

పునరుత్థాన మహోత్సవము తర్వాత వచ్చు ఆదివారమున కరుణ మహోత్సవమును కొనియాడుట ద్వారా, మన రక్షణ పాస్కాపరమ రహస్యమునకు, దివ్యకారుణ్యమునకు ఎంతో సంబంధము కలిగియున్నదని విదితమగుచున్నది. ఆ దినమున, ప్రత్యేకముగా రక్షణ పరమ రహస్యము దివ్యకారుణ్యము యొక్క అతి గొప్ప వర ప్రసాదము అని ధ్యానించాలి. దివ్యకరుణ మహోత్సవానికి ముందుగా దివ్యకరుణ నవదిన ప్రార్ధనలను, దివ్యకరుణ జపమాలను జపించి ధ్యానించి ఉత్సవానికి సంసిద్దులము కావలయునని ప్రభువు కోరుచున్నారు. నవదిన ప్రార్ధనలను చెప్పువారికి సాధ్యమైనన్ని వరాలు ఒసగబడును.

దివ్యకరుణ మహోత్సవాన్ని ఘనముగా, వైభవముగా కొనియాడాలనేదే ప్రభువు ఆకాంక్ష. ఈ మహోత్సవాన్ని జరుపుకొనే విధానాన్ని ప్రభువు రెండు విధాలుగా సూచించారు. మొదటగా, దివ్యకరుణ చిత్ర పటాన్ని ఆశీర్వదించి, సమూహముగా గౌరవించి, ఆరాధించాలి (49, 341, 414, 742). రెండవదిగా, ఆ దినమున గురువులు దివ్యకరుణ గూర్చి దైవప్రజలకు బోధించాలి (570, 1521).

దివ్యకారుణ్య సందేశము

దేవుడు దయామయుడు. ప్రేమ స్వరూపి. మన కొరకు తన ప్రేమను, కరుణను ధారపోసియున్నాడు. దేవుని కరుణను విశ్వసించుదాం. పరులపట్ల కరుణను చూపుదాం. ఎవరును దేవుని కరుణకు దూరము కాకూడదని ఆయన కోరిక. ఇదియే దివ్యకారుణ్య సందేశము. రాబోవు జీవితమున దేవుని కరుణను మనం పొందాలంటే, ఈ జీవితమున ఇతరులపట్ల కరుణతో జీవించాలి. దేవుడు మనందరిని మిక్కిలిగా ప్రేమిస్తున్నాడు. మన పాపములకన్న ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది, అనంతమైనది. హద్దులు లేనిది, షరతులు లేనిది. తద్వారా, నమ్మకముతో ఆ అనంత ప్రేమను కోరి, ఆయన కరుణను పొంది, మన ద్వారా, ఇతరులకు కూడా ఆ కరుణ ప్రవహించాలనేదే దేవుని కోరిక. ఆవిధముగా, ప్రతి ఒక్కరు దైవ సంతోషములో పాలుపంచు కొనగలరు.

దివ్యకారుణ్య సందేశాన్ని మనం పుణికిపుచ్చుకోవాలంటే, మూడు కార్యాలు చేయాలి:

1. దివ్య కరుణను వేడుకోవాలి: ప్రార్ధనలో మనం దేవున్ని తరచూ కలుసుకోవాలన్నదే ఆయన కోరిక. మన పాపాలకి పశ్చత్తాపపడి, ఆయన కరుణను మనపై, సమస్త లోకముపై క్రుమ్మరించబడాలని దివ్య కరుణామూర్తిని వేడుకోవాలి.

2. కరుణ కలిగి జీవించాలి: మనం కరుణను పొంది, మన ద్వారా ఆ కరుణ ఇతరులకు కూడా లభించాలన్నదే దేవుని కోరిక. ఆయన మనపై ఏవిధముగా తన అనంత ప్రేమను, మన్నింపును చూపిస్తున్నారో, ఆ విధముగానే మనము కూడా ఇతరుల పట్ల ప్రేమను, మన్నింపును చూపాలని ప్రభువు ఆశిస్తున్నాడు.

3. యేసును సంపూర్ణముగా విశ్వసించాలి: తన దివ్యకరుణ వరప్రసాదాలు మన నమ్మకముపై ఆధారపడి యున్నవని మనం తెలుసుకోవాలనేదే ప్రభువు కోరిక. మన ఎంత ఎక్కువగా ఆయనను నమ్మితే, విశ్వసిస్తే, అంతగా ఆయన కరుణా కృపావరాలను పొందుతాము.

“దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు” (మత్త. 5:7). “నాకు ఒసగబడిన ఈ దైవకార్యము నా మరణముతో అంతము కాదని, ఇది ఆరంభమేనని, నాకు ఖచ్చితముగా తెలుసు. అనుమానించు ఆత్మలారా! దేవుని యొక్క మంచితనము గూర్చి మీకు ఎరుకపరచుటకు, నమ్మించుటకు పరలోకపు తెరలను తీసి మీ చెంతకు తీసుకొని వత్తును” (పునీత ఫౌస్తీనమ్మ డైరీ, 281).

యేసుక్రీస్తునందు ప్రధమముగా బహిరంగ పరచబడిన దేవుని దివ్యకరుణా రహస్యం, ఈ యుగానికొక గొప్ప సందేశము. మానవ చరిత్ర ప్రతి దిశలోనూ, ముఖ్యముగా, ఈ యుగములోను, దివ్య కరుణా రహస్యాన్ని లోకానికి చాటిచెప్పాల్సిన గురుతర భాద్యత శ్రీసభకు ఉన్నది (పునీత రెండవ జాన్‌ పాల్‌ పోప్‌). “యేసుక్రీస్తు వ్యక్తిగా కారుణ్యమూర్తి. క్రీస్తును దర్శిస్తే దైవకారుణ్యమును దర్శించడమే” (16వ బెనెడిక్ట్‌ పోప్‌).

మనం దేవుని పోలికలో సృజింపబడినాము. కనుక, ఆ దివ్య కారుణ్యము మనకి ఇవ్వబడును. వినమ్ర హృదయులై దేవుని కరుణను అంగీకరించుదాం. మన ప్రేషిత కార్యము ద్వారా, ఇతరులకు దేవుని కరుణను అందిద్దాం. మనం క్రీస్తు శిష్యులముగా కొనసాగాలంటే, ఈ దివ్య కారుణ్యమును, ప్రేమను కొనసాగించాలి.

No comments:

Post a Comment