యోహాను 8:31-42: ధ్యానాంశం
నేటి సువిశేష పఠనములో, యేసు ప్రభువు కొన్ని ముఖ్యమైన
విషయాలను మనకు బోధిస్తున్నారు: 1. సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును
(8:32). 2. యూదులు అబ్రహాము సంతతి వలన దేవుని బిడ్డలైతిరి, కాని నిజమైన
వారసత్వము క్రీస్తునందు విశ్వాసము వలన కలుగుతుంది. 3. పాపము చేయు ప్రతివాడు
పాపమునకు దాసుడు (8:34), కాని క్రీస్తు మనలను దేవునికి బిడ్డలుగా చేసెను. ఈ మూడు
విషయాల గురించి ధ్యానిద్దాం.
1. సత్యము అనగా ఏమి? స్వతంత్రము అనగా
ఏమి? యోహాను 14:6లో “నేనే సత్యము” అని స్వయముగా చెప్పియున్నారు. ఆ సత్యము స్వయముగా
యేసుక్రీస్తు ప్రభువే! కనుక దేవుడు సత్యస్వరూపి (యోహాను 8:26). సత్యమును
గ్రహించాలి, అనగా దేవున్ని గ్రహించాలి, దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని
గూర్చిన ఆ జ్ఞానము మనలను స్వతంత్రులను చేయును. దేవుని గురించి తెలుసుకోవడానికి ఏవిధముగా
ప్రయత్నం చేయాలి? ఆయన వాక్కునందు మనం జీవించాలి. ఆయనకు శిష్యులముగా మారాలి. ఆ
శిష్యరికమే యేసును లేదా దేవుని గూర్చిన జ్ఞానమునకు మనలను నడిపించును. అలాగే, సత్యమును
గూర్చి మనం తెలుసుకోవాలంటే, యేసుప్రభువుతో (దేవునితో) సాన్నిహిత్యాన్ని కలిగియుండాలి.
సాన్నిహిత్యం లేదా అనుబంధాన్ని కలిగియుండటం అనగా “దేవుని బిడ్డలగు స్వేచ్చానుభూతిని
పొందడం” (యోహాను 1:12). కనుక, ఎప్పుడైతే మనం సత్యమును గ్రహిస్తామో, ఆ సత్యము మనలను
స్వతంత్రులను చేయును. ఇది ఎలా జరుగుతుందంటే, మనం దేవుని (సత్యము) గురించి ఎంత
ఎక్కువగా తెలుసుకుంటామో, అంత ఎక్కువగా, మనలను మనం తెలుసుకుంటాము. మన చుట్టూ ఉన్న
పరిస్థితులను, వాస్తవాలను అర్ధం చేసుకుంటాము, అంగీకరించ గలుగుతాము. యోహాను 16:13లో
ఇలా చదువుచున్నాము: “సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ
సత్యమునకు నడిపించును.” కనుక, దేవుని గురించి గ్రహించుటకు కావలసిన శక్తినివ్వుమని
పవిత్రాత్మ దేవుని ప్రార్ధించాలి.
2. అయితే, ప్రభువు చెప్పిన ఈ
మాటలను యూదులు అర్ధం చేసుకోలేక పోయారు. “మేము అబ్రహాము వంశీయులము. మేము ఎన్నడును,
ఎవరికిని దాసులమై ఉండలేదు. మేము స్వతంత్రులమగుదుము అని ఎటుల చెప్పగలవు? (8:33) అని
యేసును ప్రశ్నించారు. వాస్తవానికి యూదులు పాపమునకు దాసులై ఉన్నారు అని యేసుప్రభువు
స్పష్టం చేసియున్నారు. ఎలా పాపమునకు దాసులై యున్నారు? మొదటిగా, వారు దేవునిచేత
పంపబడిన దేవుని కుమారుని వాక్కును అంగీకరించలేదు (8:37). అదిగాక, ఆయనను వారు
చంపుటకు ప్రయత్నించారు (8:37). ఇలా చేయటం వలన వారు స్వతంత్రులుగాలేరని, పాపమునకు
దాసులై ఉన్నారని వారి దుష్టక్రియల ద్వారా, వారి పాప క్రియల ద్వారా
తెలియజేయుచున్నారు. “మేము అబ్రహాము వంశీయులము” అన్న వారి హోదా వలన యేసుప్రభువు
చెప్పే సత్యాన్ని (తండ్రితో ఆయనకున్న సాన్నిహిత్యం) వారు అర్ధంచేసుకోలేక పోయారు.
వారి హృదయాలు వాస్తవాన్ని గ్రహించలేక పోయాయి. యేసుపట్ల వారి అవిశ్వాసం, ఆయనను
చంపివేయాలన్న వారి దురుద్దేశం అబ్రహాము వంశీయులము అన్నదానికి చాలా విరుద్ధముగా
ఉన్నది. వారి హృదయాలు ద్వేషముతో నిండియున్నవి. ఇది వారి నిజస్వరూపం. అబ్రహాము
వంశీయులుగా “దేవుడొక్కడే మా తండ్రీ” అని చెబుతున్నారు. దేవుని చేత
ఎన్నుకొనబడినజాతి అని చెప్పుకుంటున్నారు. ఆ.కాం. 22:17-18లో అబ్రహాముతో దేవుడు
చేసిన వాగ్దానాలకు, ఆశీర్వాదాలకు వారసులమని చెప్పుకుంటున్నారు. ఈవిధముగా, వారి
హోదాకు మాత్రమే ప్రాముఖ్యతను ఇస్తున్నారు. కాని వారి హోదాతోపాటు వారి బాధ్యతను
యేసు యూదులకు గుర్తుచేయు చున్నారు. కనుక, యూదులు అబ్రహాము వంశీయులని వారి చేతలలో,
కార్యాలలో, పనులలో నిరూపించుకోవాలి. అబ్రహాము వలె జీవించాలి. అబ్రహాము ఎలా
జీవించాడు? దేవుని చిత్తానికి విధేయుడై జీవించాడు. దేవుని వాక్యమును ఆలకించి
పాటించాడు. తన కుమారున్ని కూడా బలి ఇవ్వడానికి వెనుకాడనంత విధముగా దేవుని
చిత్తాన్ని అనుసరించాడు.
కనుక, అబ్రహామునకు నిజమైన బిడ్డలు ఎవరు? వంశపారపర్యముగా వచ్చిన ఇశ్రాయేలీయులు
మాత్రమే కాదు. క్రీస్తుయేసు నందు విశ్వాసములో దేవుని యొక్క వాగ్ధానాలను, వాక్కులను
అంగీకరించిన ప్రతీ ఒక్కరు అబ్రహాము సంతతియే! ఇదే విషయాన్ని పౌలుగారు రోమీ. 5:16-25లో
స్పష్టం చేసాడు: “దేవుని వాగ్ధానము విశ్వాసముపై ఆధారపడియున్నది. యూదులకు
మాత్రమే కాదు, అబ్రహాము వలె విశ్వసించు వారికి కూడా అది వర్తించును. ఏలయన,
అబ్రహాము మనకు అందరికి అధ్యాత్మికముగ తండ్రి! అనేక జాతులకు అబ్రహామును తండ్రిని
చేసితిని” అని ఆ.కాం.17:5లో వ్రాయబడియున్నది. “క్రీస్తును అంగీకరించి,
విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలగు భాగ్యమును ప్రసాదించెను” అని యోహాను
1:12లో చదువుచున్నాము. “క్రీస్తు యేసు నందు విశ్వాసము వలన అందరును దేవుని బిడ్డలు”
అని గలతీ 3:26లో చదువుచున్నాము.
మనమందరము కూడా క్రీస్తు యేసునందు విశ్వాసము వలన అబ్రహాము
సంతతి వారమయ్యాము. దేవుని బిడ్డలము, వారసులమయ్యాము. మరి నేడు మన దృక్పధం ఎలా
ఉన్నది? క్రైస్తవులముగా, క్రీస్తునందు సహోదరీ, సహోదరులని చెప్పుకుంటున్నాము. మనము
కూడా దేవుని బిడ్డలమని చాటిచెప్పుకుంటున్నాము. ఇలా చెప్పుకుంటే సరిపోదు! దీనిని
నిరూపించు కొనుటకు, మనం చేసే పనులలో, మాట్లాడే మాటలలో క్రీస్తువలే మనం ఉండాలి,
జీవించాలి. దేవునియొక్క ఆజ్ఞలను మీరి జీవిస్తూ, దేవుని చిత్తాన్ని తిరస్కరించి
జీవిస్తూ, మేము దేవుని బిడ్డలము అని చెప్పుకోవడం భావ్యం కాదు. తోటివారిని మన
వ్యంగ్యముతో, ఉదాసీనతతో బాధపెడుతూ, క్రీస్తునందు సోదరులముగా ఉండలేము. “మీరు
పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో, దానిని బట్టి, మీరు నా శిష్యులని అందరు
తెలిసికొందురు” (యోహాను 13:35) అని ప్రభువు పలికారు.
3. పాపము చేయు ప్రతివాడు పాపమునకు
దాసుడు (8:34). ప్రభువు భౌతిక బానిసత్వము గురించి మాట్లాడుట లేదు. పాపానికి బానిసత్వము
గురించి మాట్లడుచున్నారు. పాపమునకు దాసులు అంధకారములో జీవిస్తారు. అలాంటివారు
క్రీస్తుతో ఎలాంటి సంబంధాన్ని కలిగి యుండరు. వారు క్రీస్తునందు విశ్వాసము
లేనివారు.
“నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును
పొందును” (యోహాను 8:12) అని ప్రభువు పలికారు. కనుక, పాపదాస్యమునుండి మనలను
రక్షించునది ప్రభువగు యేసు క్రీస్తువే! “మీరు నా మాటపై నిలిచి యున్నచో నిజముగా
మీరు నా శిష్యులై ఉందురు. మీరు సత్యమును గ్రహించెదరు. సత్యము మిమ్ము స్వతంత్రులను
చేయును (8:32) అని అందుకే ప్రభువు అన్నారు. ఇదే విషయాన్ని పౌలు రోమీ 7:24-25లో
స్పష్టం చేయుచున్నాడు. “మీరు పాపమునుండి విముక్తులై నీతికి దాసులైతిరి” అని పౌలు
రోమీ 6:18లో చెప్పియున్నారు. పశ్చాత్తాపముతో, పాపక్షమాపణ కొరకు క్రీస్తు చెంతకు
వచ్చినచో, మనం పవిత్రాత్మచే బలపరచబడతాము.
కనుక, క్రీస్తును తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రీస్తును
తెలుసుకోవడమంటే, ఆయనను గురించిన విషయాలను తెలుసుకోవడం మాత్రమే కాదు. యేసు
క్రీస్తును గూర్చిన నిజమైన జ్ఞానం, ఆయనను వ్యక్తిగతముగా నా జీవితములో అనుభవించడం,
లేదా అనుభూతిని పొందడం. అప్పుడే మనం నిజముగా స్వతంత్రులం కాగలము. కేవలము
క్రీస్తును గూర్చిన సమాచారం ఉంటే సరిపోదు. ఆయనతో వ్యక్తిగత అనుభూతిని మనం
పొందియుండాలి. అదే అనుభూతితో ఆయనను అనుసరించాలి. అదే సత్యమును తెలుసుకొనుట!
సత్యముచేత స్వతంత్రులము గావింపబడుట! అలాంటి వ్యక్తి ఇక ఎప్పటికి పాపమునకు దాసులు
కారు.
No comments:
Post a Comment