బాలయేసు సమర్పణ మహోత్సవము – 2 ఫిబ్రవరి 2021

 బాలయేసు సమర్పణ మహోత్సవము – 2 ఫిబ్రవరి 2021


బాలయేసు జన్మించిన 40వ రోజున ఈ ఉత్సవాన్ని మనం కొనియాడుచున్నాము. ఇది బాల యేసును దేవాలయములో కానుకగా అర్పించు మహోత్సవం.

ఈ పండుగను క్రొవ్వొత్తుల దినోత్సవము అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈరోజు ఆశీర్వదించబడిన క్రొవ్వొత్తులతో ప్రదక్షిణ చేస్తూ గుడిలోనికి వచ్చి, బాలయేసుని దేవాలయములో కానుకగా అర్పించినందుకు గురుతుగా ఈ క్రొవ్వొత్తులను సమర్పిస్తూ ఉంటాము. ఈ సంప్రదాయం 8వ శతాబ్దంనుండి వస్తున్నది. సిమియోను బాలయేసును “అన్యులకు మార్గదర్శకమగు వెలుగు” అని ప్రకటించినదాని గురుతుగా ఈవిధముగా చేసేవారు: “అన్యులకు ఎరుకపరచు వెలుగు. నీ ప్రజలగు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు” (లూకా 2:32).  

ఈ పండుగ పరమ రహస్యాన్ని లోతుగా అర్ధం చేసుకోవడానికి, మలాకీ 3:1 చదువుదాం: “ఇదిగో నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అపుడు మీరెదురు చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగ దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును.” ఈ మలాకీ ప్రవచనం నేడు నెరవేరినదని సిమియోను గుర్తించాడు. యేసుకు ఆరు మాసములు ముందుగా జన్మించిన బాప్తిస్మ యోహానును మార్గచూపరిగా దేవుడు పంపియున్నాడు. ఈ విషయాన్ని ఆనాడే మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు తెలియ జేసాడు. ఈ మార్గచూపరి (యోహాను) తర్వాత క్రీస్తు శీఘ్రముగా వచ్చును. అనగా, యోహాను పుట్టిన వెంటనే, దేవుడు (యేసు) తన దేవాలయములోనికి ప్రవేశించెను. కనుక, ఈ పండుగ దేవుడు తన దేవాలయములోనికి ప్రవేశించుటను సూచిస్తుంది. తన కొరకు ఎదురుచూసే వారి కొరకు, తననుతాను దేవాలయములో సమర్పించుకొను చున్నాడు.

మొదటి పఠన వివరణ: యాజకులను, ప్రజలను శుద్ధిచేయుటకు ప్రభువు శీఘ్రముగా యెరూషలేము దేవాలయములో కనిపించును అని మలాకీ ప్రవక్త ప్రవచించాడు. అతడు వేంచేయు దినమును ఎవరుకూడా భరింపలేరని మలాకీ (క్రీ.పూ. 460-450) హెచ్చరిస్తున్నాడు. “అతడు సబ్బువంటి వాడు. లోహములను శుద్ధిచేయు అగ్నివంటి వాడు... (3:2-3). ఎందుకన, ఆనాటి యాజకులు (లేవీ వంశజులు) దేవున్ని చిన్నచూపు చూసారు. అపవిత్రమైన (కుంటి, గ్రుడ్డి, జబ్బుపడిన పశువులను) బలులను పీఠముపై అర్పించేవారు... (1:6-2:4). అలాగే ప్రజలు దేవుని ఆజ్ఞలనుండి వైదొలిగి వానిని పాటింపరైతిరి... (3:6-12). భర్తలు, భార్యలకు ద్రోహము తలపెట్టుచున్నారు (2:14-16). ప్రజలు సామాజిక న్యాయాన్ని పాటించుట లేదు (3:5). ప్రజలు దేవుని ప్రేమను అనుమానించిరి (1:2-5). అందులకే మలాకీ, తీర్పు దినమును గురించి వారికి గుర్తుచేయుచున్నాడు. దేవుని తీర్పు లేదా దేవుని జోక్యం రెండు ప్రక్రియలలో ఉంటుంది: మొదటిగా, మార్గమును సిద్ధము చేయుటకు - అనగా యాజకులను శుద్ధి చేయుటకు, వారు యోగ్యమైన బలిని అర్పించుటకు - దేవుడు తన దూతను పంపును. ఆ తరువాత అప్పుడు ప్రభువు అకస్మాత్తుగ దేవాలయమునకు వచ్చును (3:1). ఆయన తీర్పు చేయుటకు వచ్చును (3:5).

రెండవ పఠన వివరణ: (హెబ్రీ 2:14-18). యేసు క్రీస్తు నూతన ఒప్పందములో శాశ్వతమైన ప్రధాన యాజకుడు. (2:17). కల్వరి బలిపీఠముపై దేవునికి ప్రీతిపాత్రమైన బలిగా తననుతాను అర్పించియున్నాడు. కనుక, ఈనాటి పండుగతో దివ్యబాలయేసు దేవాలయ ప్రవేశముతో యాజకత్వమును పునరుద్ధరణ గావించాడు. పూర్వపు యాజకత్వమును పరిపూర్ణము చేసాడు. ఆయన దయామయుడగు ప్రధాన యాజకుడు. ఎందుకన, ప్రధమ ఫలములుగ, ప్రధాన యాజకునిగా, మనతరుపున, మన పాపముల నిమిత్తమై శాశ్వత బలిని, పరిపూర్ణ బలిని దేవునికి అర్పించాడు. ఈవిధముగా, మృత్యువుపై అధికారముగల సైతానును తన మరణము (బలి) ద్వారా నశింప చేసాడు (2:14). మరణమును, పాపమును జయించాడు. తద్వారా, క్రీస్తు మన రక్షణ మార్గమును సుగమం చేసాడు. ఈ విషయాన్నే, సిమియోను ప్రకటించాడు.

సువిశేష పఠనము: సువార్తలో అనేక విధములైన వ్యక్తులను, సంఘటలను, పాఠాలను చూస్తున్నాము. మొట్టమొదటిగా, మరియ యోసేపులు భక్తిగల యూద దంపతులు. మోషే చట్ట ప్రకారము బాలయేసును యెరూషలేమునకు తీసుకొని వెళ్ళారు. ఎందుకన, “ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింప బడవలయును” (చూడుము నిర్గమకాండము 13:2, 12-13, సంఖ్యాకాండము 18:15). ఈ సమర్పణ ఎందుకనగా, చిన్నపిల్లవాడు, తెరచిన పుస్తకం వంటివాడు. కనుక దేవుడు ఆ బాలున్ని తన ప్రణాళికతో నింపుతాడు. బాలుని జీవితం దేవుని చేతిలో ఉంటుంది. ఈ అర్పణ చాలా అర్ధవంతమైనది, ఫలవంతమైనది. అక్కడ, చట్ట ప్రకారం, పేదవారికి సూచించిన విధముగా, ఒక జత గువ్వలనైనను, రెండు పావురముల పిల్లల నైనను బలి సమర్పణ చేయుటకు వెళ్ళారు. అలాగే, ప్రార్ధనలు చేయుటకు, బలిని అర్పించుటకు. లీవీయకాండము 12:2-8 ప్రకారం, ప్రసవించిన తరువాత స్త్రీల శుద్ధీకరణ కార్యక్రమము జరపవలసి ఉన్నది.

సిమియోను, అన్నమ్మలు (పాత నిబంధన ప్రవక్తలు) అను దైవభక్తులు, నీతిమంతులు, ప్రార్ధనాపరులు. వారు పవిత్రాత్మచే ప్రేరేపించబడినారు. పవిత్రాత్మ శక్తితో వారు మెస్సయ్యను గుర్తించారు. లోకరక్షకునిగా వారు ఆ బాలుని గుర్తించారు. ఇది వారికి ఎలా సాధ్యమైనది? వారు ఎన్నో సంవత్సరముల నుండి ప్రార్ధనలో, ధ్యానములో జీవించారు. ఉపవాస ప్రార్ధనలు చేసారు. వారు గొప్ప ఆశతో జీవించారు. నమ్మకముతో జీవించారు. దేవుని వాగ్దానాల పట్ల విశ్వాసం కలిగి జీవించారు. వారు దేవున్ని దర్శించుకొనుటకు, ఎన్నో కాలముగా ఎదురు చూసారు. ఈ సందర్భముగా, మన ప్రార్ధనలు, ధ్యానాలు, ఉపవాసాలు, దానధర్మాలు హృధాగా పోవని గుర్తుంచు కుందాము. అవి మనలను ఆధ్యాత్మికముగా బలపరుస్తాయి. అలాంటివారు మాత్రమే ఆత్మదేవునికి అందుబాటులో ఉంటారు. దేవుడు తననుతాను బహిర్గతమొనర్చు పరిస్థితులను తెలుసుకొని ప్రభువును గుర్తించగలరు.

మరియమ్మ గురించి సిమియోను ప్రవచనాలు గుర్తించదగినవి: “ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొని పోవుచున్నది.” ఈ ప్రవచనాలు మరియమ్మ శ్రమలను బహిర్గత మొనర్చుతున్నాయి. ఈ పండుగలో మరియమ్మగారి పాత్రకూడా ఎంతగానో ఉన్నది. ఆమెపాత్ర ఎంతగానో ప్రశంసనీయమైనది. మరియమ్మ విషయములో దేవుని ప్రణాళికను, దేవుని చిత్తాన్ని పరిపూర్ణముగావించే కార్యములో, మరొకసారి తననుతాను తండ్రి దేవునికి అంకితం, సమర్పణ చేసుకునే అవకాశం ఆమెకు వచ్చినది. దేవుని రక్షణ ప్రణాళికలో ఆమె ముఖ్యపాత్ర పోషించవలసి యున్నదని తెలియుచున్నది. మరియ తల్లివలె మనముకూడా పరిశుద్ధముగా ఉండాలి.

బాలయేసు గురించి సిమియోను ఇలా ప్రవచించాడు: “ఇదిగో! ఈ బాలుడు యిస్రాయేలీయులలో అనేకుల పతనమునకు, ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి యున్నాడు. అనేకుల మనోగత భావములను బయలు పరచును” (లూకా 2:34-35). ‘వివాదాస్పదమైన గురుతు’ క్రీస్తు సిలువను సూచిస్తుంది. పౌలుగారు “యూదులకు ఆటంకమును, అన్యులకు అవివేకమును అగు, సిలువవేయ బడిన క్రీస్తు” అని కొరింతీయులకు వ్రాసియున్నాడు (1 కొరి. 1:23). క్రీస్తు సిలువ శక్తిని నమ్మినవారికి రక్షణ, జీవితము కలుగును. ఈ సంఘటనలన్నీ కూడా క్రీస్తు ఉత్థానమునకు మనలను నడిపిస్తున్నాయి. బాలయేసు సమర్పణ మహోత్సవం యేసు శ్రమలు, మరణం, ఉత్థానములో పరిపూర్ణమగుచున్నది.

మన బాప్తిస్మం ద్వారా, మనము కూడా దేవునికి అర్పితం చేయబడినాము. కనుక, మనం పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. మనమందరం దేవునికి ప్రతిష్టింప బడిన వారము. దైవ ప్రజలము. కనుక మనము కూడా మన జీవితాలను దేవునికి అర్పిస్తూ ఉండాలి. మన జీవితాలు దేవునికి ప్రీతికరముగా ఉండాలి. బాల యేసు సమర్పణ సంపూర్ణ సమర్పణ, పరిపూర్ణ సమర్పణ. ఆయన సర్వ జీవితాన్ని తండ్రి దేవునికి అర్పించుకున్నాడు. దేవుడు వేసిన బాటలో ఆయన నడిచాడు. దేవుని ప్రణాళికను పరిపూర్ణం గావించాడు.

దేవునికి అర్పణ, సమర్పణ ఎందుకు? అనాది కాలము నుండి ఈ ఆచారం, అలవాటు ఉన్నది. ప్రజలు అర్పణలు, బలులు ఉన్నాయి. ఎందుకు? బలులు, అర్పణలలో ఉన్న అంతరార్ధం ఏమిటి? బలుల అర్పణ మన సమర్పణకు సూచన. కనుక యోగ్యమైన బలులను, కానుకలను, అర్పణలను మనం దేవునికి అర్పించాలి.

ఆబెలు-కయీను కానుక లేదా బలి అర్పణ: (ఆ.కాం. 4) ఆబెలు కానుకను దేవుడు ప్రసన్న దృష్టితో చూచాడు. కయీను కానుకను త్రోసిపుచ్చాడు. కారణం: బాహ్య అర్పణతో అంత:రంగిక అర్పణ కయీను చేయలేదు.

సమూవేలు మొదటి  గ్రంధము 15:21 – “బలుల వలన, దహనబలుల వలన యావే సంతృప్తి చెందునా? విధేయత వలన గదా? బలి యర్పించుట కంటే విధేయత మేలు. పొట్టేళ్ల క్రొవ్వు పేల్చుట కంటే అణకువ లెస్స.” మన సరియైన జీవితాన్ని ప్రభువు కోరుకుంటున్నారు.

కీర్తన 51:16-17 – కీర్తనాకారుడు ఇలా ప్రార్దిస్తున్నాడు; “నీవు బలుల వలన సంతృప్తి చెందవు. నేను దహనబలి నర్పించినచో నీవు ప్రీతీ జెందవు. దేవా! నేనర్పించు బలి పశ్చాత్తాప పూరితమైన హృదయమే. పగిలి నలిగినట్టిదియు వినయాన్వితమునైన హృదయమును నీవు అనాదరము చేయవు.”

వివిధ రకాలైన బలుల గురించి సీరా పుత్రుడవైన యేసు జ్ఞాన గ్రంధములో చదువుచున్నాము: 35:1-3 “ధర్మశాస్త్రమును పాటించినచో చాల బలులు అర్పించినట్లే. దేవుని విధులను పాటించినచో సమాధాన బలిని అర్పించినట్లే. ఉపకారికి నుపకారము చేయుట ధాన్యబలిని అర్పించుట వంటిది. పేదలకు దానము చేయుట స్తుతిబలిని అర్పించుట వంటిది. పాపమునుండి వైదొలగినచో ప్రభువు సంతసించును. కిల్మిషమును విడనాడుట ప్రాయశ్చిత్త బలిని అర్పించుటతో సమానము.”

యెషయా 1:11-20: మీకా 6:6-8: మత్తయి 5:23-24: ఎఫెసీ 4:26

కనుక నేడు మనకు హృదయ శుద్ధీకరణ అవసరం.

No comments:

Post a Comment