ఆమోదయోగ్యమైన బైబులు పవిత్ర గ్రంథాలు

 ఆమోదయోగ్యమైన బైబులు పవిత్ర గ్రంథాలు

మనుగడలోనున్న అనేక గ్రంథాలలో ఏవి పవిత్రమైనవి, చట్టప్రకారం ఆమోదయోగ్యమైనవి అని చెప్పడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. వివిధ క్రైస్తవ సంఘాలు వివిధ ప్రక్రియలను అనుకరించాయి. క్రీ.శ. 85-90 మధ్య కాలములో జరిగిన జామ్నియా సమావేశములో (కౌన్సిల్ అఫ్ జామ్నియా) యూదులు హీబ్రూ బైబులు గ్రంథాలను (పట్టికను) TANAK అని పిలిచారు. TANAK అనగా Torah (తోరా), Neviim (నెవిమ్), Ketuvim (కెతూవిమ్). కతోలిక శ్రీసభ తమ బైబులు పవిత్ర గ్రంథాల పట్టికను ట్రెంటు సమావేశములో (కౌన్సిల్ అఫ్ ట్రెంటు) 8 ఏప్రిల్ 1546వ సంవత్సరములో ఆమోదించినది. ఈ సమావేశములో సెప్తువజింత్ (LXX)ను తిరస్కరించకుండా, వల్గేటు-లతీను బైబులును లేదా హీబ్రూ బైబులును అధికారిక బైబులుగా ఆమోదించడం జరిగింది.

1. పూర్వ నిబంధన గ్రంథాలు: సేకరణ, కూర్పు

బైబులు పండితుల ప్రకారం, తోరా (Torah) గ్రంథాల సేకరణ (ఆది కాండము, నిర్గమ కాండము, లేవీయ కాండము, సంఖ్యా కాండము, ద్వితీయోపదేశ కాండము) క్రీ.పూ. 3వ శతాబ్దములో పూర్తయినది. ఈ సేకరణ యూదులకు అధికారపూర్వకమైన గ్రంథాలు లేదా చట్టముగా అయినది.

క్రీ.పూ. 2వ శతాబ్దముకల్ల మరొక సేకరణ సిద్ధమైనది. అదియే నెవిమ్ (Neviim) లేదా ప్రవక్తల గ్రంథాలు (యెహోషువా నుండి రాజుల రెండవ గ్రంథము వరకు). ఇది యూదుల పవిత్ర గ్రంథములో రెండవ భాగమైనది. క్రీ.పూ. మొదటి శతాబ్దముకల్ల ఈ రెండు సేకరణలు అధికారపూర్వకమైన పవిత్ర గ్రంథాలుగా ఆమోదించబడినవి. ఇవి “ధర్మ శాస్త్రము” మరియు “ప్రవక్తల గ్రంథములు”గా సూచింపబడినవి (చూడుము. 2 మక్క. 15:9).

క్రీ.పూ.190వ సంవత్సరముకల్ల మూడు సేకరణలు ఉండెను. అవి ధర్మశాస్త్రము, ప్రవక్తలు, ఇతర గ్రంథాలు. ఈ మూడవ సేకరణ కెతూవిమ్ (Ketuvim)గా లేదా చారిత్రక గ్రంథాలుగా పిలువబడుచున్నది. కాని మొదటి శతాబ్దం చివరిలో మాత్రమే ఈ సేకరణ అధికారపూర్వకముగా నిర్ణయించబడినది. మొదటి శతాబ్దం చివరికల్ల, రెండు రకాల చారిత్రక గ్రంథాల పట్టికలు ఆచరణలో ఉన్నాయి: ఒకటి, పాలస్తీనా పట్టిక (The Palestinian Canon - Tanak), రెండు, అలెగ్జాండ్రియ పట్టిక (సెప్తువజింత్ - LXX).

2. పాలస్తీనా బైబులు గ్రంథ పట్టిక (The Palestinian Canon - Tanak)

తోరా: చట్టము / ధర్మశాస్త్రము: ఆది కాండము, నిర్గమ కాండము, లేవీయ కాండము, సంఖ్యా కాండము, ద్వితీయోపదేశ కాండము
నెవిమ్ - ప్రవక్తలు:
ప్రమ ప్రవక్తలు: యెహోషువా, న్యాయాధిపతులు, 1,2 సమూవేలు, 1,2 రాజులు
ద్వితీయ ప్రవక్తలు: యెషయా, యిర్మియా, యెహెజ్కేలు, 12 ప్రవక్తలు: హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, జెఫన్యా, నహూము, హబక్కూకు, హగ్గయి, జెకర్యా, మలాకీ
కెతూవిమ్  - ఇతర గ్రంథాలు: కీర్తనలు, యోబు, సామెతలు, రూతు, పరమగీతము, ఉపదేశకుడు, విలాప గీతాలు, ఎస్తేరు, దానియేలు, ఎజ్రా, నెహెమ్యా, 1,2 రాజుల దినచర్య

3. అలెగ్జాండ్రియ బైబులు గ్రంథ పట్టిక (సెప్తువజింత్ - LXX)

పాలస్తీనా పట్టిక కన్న, ఈ అలెగ్జాండ్రియ పట్టిక విభజన భిన్నముగాను ఉంటుంది మరియు ఈ పట్టికలో ఎక్కువ గ్రంథాలు ఉంటాయి. సెప్తువజింత్ – LXX బైబులు దీనినే అనుకరిస్తుంది.

పెంటెట్యుక్Pentateuch: ఆది కాండము, నిర్గమ కాండము, లేవీయ కాండము, సంఖ్యా కాండము, ద్వితీయోపదేశ కాండము

చారిత్రక గ్రంథాలు: యెహోషువా, న్యాయాధిపతులు, రూతు, 1 సమూవేలు , 2 సమూవేలు, 1 రాజులు, 2 రాజులు, 1 రాజుల దినచర్య, 2 రాజుల దినచర్య, ఎస్డ్రాస్ A (1 ఎజ్రా), ఎస్డ్రాస్ B (ఎజ్రా, నెహెమ్యా), ఎస్తేరు, యూదితు, తోబీతు, 1 మక్కబీయులు, 2  మక్కబీయులు, 3  మక్కబీయులు
జ్ఞాన గ్రంథాలు: కీర్తనలు, సామెతలు, ఉపదేశకుడు, పరమగీతము, యోబు, సొలోమోను జ్ఞానగ్రంథము, సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము, సొలోమోను కీర్తనలు
ప్రవక్తల గ్రంథాలు: ఆమోసు, హోషేయ, మీకా, యోవేలు, ఓబద్యా, యోనా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ, యెషయా, యిర్మియా, బారూకు, విలాప గీతాలు, యిర్మియా లేఖ, యెహెజ్కేలు, సూసన్న, దానియేలు, బేలు మరియు ఘటసర్పము

4. జామ్నియా సమావేశము

తోరా (Torah), నెవిమ్ (Neviim), కెతూవిమ్ (Ketuvim) ఈ మూడు సేకరణలను TANAK అని పిలుస్తారు. క్రీ.శ. మొదటి శతాబ్దములో యూదులు అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నారు: క్రైస్తవ మార్గ ఆవిర్భావం, యెరూషలేము దేవాలయ వినాశనము, యూద సంఘం చెల్లాచెదరవడం, సెప్తువజింత్ – LXX క్రైస్తవులు తమ బోధనలలో, వ్రాతలలో ఉపయోగించడం, కెతూవిమ్ (Ketuvim) గ్రంథాలకు సంబంధించిన సంక్షోభం. ఈ నేపధ్యములో, అధికారపూర్వకమైన, ఆమోదయోగ్యమైన గ్రంథాలను నిర్ణయించుటకు, యూదులు క్రీ.శ. 85-90 మధ్య కాలములో, జామ్నియాలో సమావేశమయ్యారు. ఈ సమావేశములో, యూదులు మూడవ సేకరణ అయిన కెతూవిమ్ (Ketuvim) గ్రంథాలకు, ఉపదేశకుడు, రూతు, దానియేలు, పరమగీతము అను గ్రంథాలను చేర్చారు. సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంథమును తొలగించిరి. అప్పటికే అంగీకరించబడిన యెహెజ్కేలు గ్రంథము, ఎస్తేరు గ్రంథములపై దీర్ఘకాలముగా అనుమానము ఉన్నప్పటికిని, వాటిని కూడా చేర్చారు. తుదకు ఈ గ్రంథాలు, పాలస్తీనా పట్టికలోకూడా చేర్చబడెను.

No comments:

Post a Comment