వివాహము

వివాహము
“కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును. వారిరువురు ఏక శరీరులగుదురు”

వివాహము దేవుడు ఏర్పాటు చేసిన ఒడంబడిక. సృష్టి ఆరంభములోనే దేవుడు వివాహమును ఒక పవిత్రమైన ఒడంబడికగా ఏర్పాటు చేసాడు. దేవుడు ఆదాము ఏవలను సృష్టించిన తరువాత (ఆది 1:26-27), ఆది 2:24లో ఇలా చదువుచున్నాము, “కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును. వారిరువురు ఏక శరీరులగుదురు” (ఎఫెసీ 5:31; మత్త 19:5-6; మార్కు 10:7-8). జీవితకాల అనుబంధముతో ఇరువురు వ్యక్తులను (స్త్రీపురుషులు) ఐక్యముచేస్తూ దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప పవిత్ర వ్యవస్థ వివాహము అని ఈ వాక్యము తెలియ జేయుచున్నది. వివాహం అంటే ‘విడనాడటం’, ‘హత్తుకొనిపోవటం’, ‘ఏకశరీరులవటం. ఇవి వివాహ ఒడంబడిక స్వభావాన్ని సూచిస్తున్నాయి. వివాహం దేవుని రూపకల్పన. ఒకరినొకరు పరిపూర్ణం చేసుకొనే భాగస్వామ్యం. కుటుంబ సంబంధాలు ముఖ్యమైనవి. అయితే, వివాహము నూతన కుటుంబాన్ని ఏర్పరస్తుంది. అనగా భార్యతో నూతన ఇంటిని, కుటుంబాన్ని ఏర్పరచు కోవడం. ఉన్న కుటుంబము కంటే ప్రాధాన్యమైనదని అర్ధం. ‘ఆకాలములో’ కుటుంబ సంబంధాలకు, ముఖ్యముగా కుమారుడు-తల్లిదండ్రుల మధ్య బంధం చాలా ప్రాముఖ్యత కలిగి యుండేది. కనుక తల్లిదండ్రులను “విడనాడటం” అనేది నూతన కుటుంబానికి ప్రతీక.
“విడనాడటం” శారీరక సంబంధాలను అధిగమించడాన్ని సూచిస్తుంది. వివాహము సామాజిక, చట్టపరమైన ఒప్పందం మాత్రమేగాక, ఒక ఒడంబడిక బంధాన్ని ఏర్పరస్తున్నది.
“హత్తుకొనిపోవటం” [అంటిపెట్టుకోవడం, ఐఖ్యమవడం], హీబ్రూ పదం ‘దబాక్” అతుక్కొని, అంటుకొని ఉండటం అనే అర్ధాలను కలిగియున్నది. ఇది భార్యాభర్తల మధ్య విడదీయరాని, నమ్మకమైన బంధాన్ని తెలియజేస్తుంది. “హత్తుకొని పోవడం” అనేది పూర్వ నిబంధనలో యావే దేవునితో ఇస్రాయేలు యొక్క సంబంధాన్ని వివరించే ఒడంబడిక బాషను ప్రతిబింబిస్తున్నది. దేవుడు తన ప్రజలతో విడదీయరాని ఒడంబడికను చేసినట్లుగానే, వివాహం అనేది ఒక ఒడంబడికగా చేయబడుచున్నది. వివాహములో ప్రేమ, విశ్వసనీయత బంధముతో ఒకరితో నొకరు కట్టుబడి యుంటారు. “హత్తుకొని పోవడం” అనేది ఇరువురి మధ్యన లోతైన భావోద్వేగ మరియు శారీరక సాన్నిహిత్యాన్ని తెలియ జేయుచున్నది.
“ఏకశరీరులవటం” బైబులులో వివాహానికి సంబంధించి అత్యంత ప్రాముఖ్యమైన వచనం. ఇది భార్యాభర్తల మధ్యన శారీరక సంబంధాన్ని సూచిస్తుంది. శారీరకముగా ఒకటవుతారు. ఇది సంతానోత్పత్తితో ముడిపడి యుంటుంది. “ఏకశరీరులవటం” లోతైన ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ బంధాన్ని కూడా సూచిస్తుంది. వివాహం కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు. ఇది జీవితాల సంపూర్ణ కలయిక. “ఏకశరీరులవటం” స్త్రీపురుషుల సమానత్వమును, పరిపూరకతను ధృవీకరిస్తుంది. “ఏకశరీరులు” అనునది వివాహములోని ఐఖ్యత, సాన్నిహిత్యం, భాగస్వామ్యమును నొక్కిచెబుతుంది. వ్యక్తులు భిన్నముగా ఉన్నప్పటికినీ ఒకటిగా ఐఖ్యమవుతారు. “ఏకశరీరులవటం” వివాహముయొక్క శాశ్వత బంధాన్ని అనగా ‘అవిచ్చిన్నత’ స్వభావమును ధృవీకరిస్తుంది. వివాహం అనేది విడదీయరాని జీవితకాల బంధం. కనుక, మానవ సంబంధాలకు వివాహము పునాది అని ఆది 2:24 నొక్కి చెబుతుంది.
వివాహము యొక్క ముఖ్య ఉద్దేశములు ఏమిటంటే, ఒకటి, సాహచర్యం: “నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు” (ఆది 2:18) అని స్వయముగా యావే దేవుడే పలికియున్నాడు. అందుకే ఆదాముకు తోడుగా, సహచరినిగా ఉండుటకు ఏవను సృష్టించాడు. రెండు, సంతానోత్పత్తి: ఆదాము, ఏవలకు ఇవ్వబడిన తొలి ఆజ్ఞలలో ఇది ఒకటి, “సంతానోత్పత్తి చేయుడు” (ఆది 1:28). కుటుంబ నిర్మాణం, మానవజాతి కొనసాగింపు యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కిచెబుతుంది (సత్యోపదేశం 1652). మూడు, పరస్పర ప్రేమ, సహకారం: వివాహము బంధం అనేది ప్రేమపూరితమైన బంధము. ఈ ప్రేమ త్యాగపూరిత మైనది. ఒకరినొకరు అర్ధంచేసుకోవడం, సహకారం అందించుకోవడం, ఒకరికొకరు మద్దతు నిచ్చుకోవడం ప్రధానం. పరస్పరం ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి (ఎఫెసీ 5:25-33).
వివాహము జీవితకాల బంధము. “దేవుడు జత పరచిన జంటను మానవుడు వేరుపరప రాదు” (మార్కు 10:9) అని యేసు వివాహములోనున్న శాశ్వత అనుబంధాన్ని నొక్కి చెప్పాడు. బైబులులో కొన్ని పరిస్థితులలో విడాకులు అనుమంతిచ బడినప్పటికినీ (మత్త 19:8), దేవుని ఉద్దేశము అది కానేకాదు. ఆరంభమునుండి ఇలా లేదు. మలాకీ 2:16లో ఇలా చదువుచున్నాము, ఇస్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు: “నేను విడాకులను అసహ్యించు కొందును” (చదువుము మత్త 19:3-9).
వివాహము బాధ్యత కలిగిన బంధము. భార్యాభర్తలిరువురు పరిపూరకరమైన బాధ్యతలను కలిగి యుంటారు. ఈ బాధ్యతలు పరస్పర సమర్పణను, త్యాగపూరిత ప్రేమను నొక్కిచెబుతున్నాయి. భర్తయొక్క బాధ్యతలను ఎఫెసీ 5:25-28లో చూడవచ్చు: “క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెనో, అట్లే భర్తలు భార్యలను ప్రేమించాలి.” లోతైన త్యాగపూరిత ప్రేమ, నిస్వార్ధము, విశ్వసనీయత ముఖ్యాంశాలు. భార్యయొక్క బాధ్యతలను ఎఫెసీ 5:22-24లో చూడవచ్చు: “ప్రభువునకు విధేయులైనట్లే, మీ భర్తలకును విధేయులై యుండుడు. శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలయును.” ఈ బాధ్యతలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చూపించడానికి ఎంతమాత్రము కాదు, కాని వివాహ బంధములో పరస్పర గౌరవము, సేవ ఎంతో ప్రాముఖ్యమని తెలియజేయు చున్నది.
వివాహము పవిత్రమైన బంధము. వివాహ బంధములో విశ్వసనీయత చాలా విలువైనది. వ్యభిచారం, అనైతిక జీవితం తీవ్రముగా ఖండించ బడినది. “వ్యభించరింపరాదు” (నిర్గమ 20:14). “వివాహము అందరి చేతను గౌరవింప బడవలెను. వివాహ బంధము నిష్కల్మషమైనదిగా ఉండవలెను. ఏలయన, అవినీతి పరులును, వ్యభిచారులును, దేవుని తీర్పునకు గురియగుదురు” (హెబ్రీ 13:4). వివాహ బంధము స్వచ్చముగా, పవిత్రముగా ఉండాలని బైబులు బోధిస్తున్నది.
వివాహము దివ్యసంస్కారము. క్రీస్తుచే స్థాపించబడిన అంత:ర్గత కృపానుగ్రహ చర్య. వివాహ దివ్యసంస్కారం దంపతుల బంధాన్ని బలోపేతం చేస్తుంది. పవిత్రతలో ఎదగడానికి తోడ్పడుతుంది. తల్లిదండ్రులుగా వారి బాధ్యతలకోసం వారిని సిద్ధం చేస్తుంది.
వివాహ సంబంధమునుగూర్చి కొరింతీయులు అడిగిన ప్రశ్నలకు, పౌలు మొదటి లేఖ 7:1-16లో ఇచ్చిన సమాధానాలను పరిశీలించుదాం: లైంగిక అనైతిక జీవితాన్ని నివారించడానికి ప్రతీ వ్యక్తికి స్వంత జీవిత భాగస్వామి ఉండాలి. ఇది చట్టపరమైన, పవిత్రమైన పిలుపు (1-2). వివాహ బంధములో పరస్పర సమర్పణ ప్రాముఖ్యం. వివాహము ఒక ఒడంబడిక. వివాహములో జీవిత భాగస్వాములు ఒకరికొకరు స్వేచ్చగా ఇచ్చిపుచ్చుకుంటారు (సత్యోపదేశం 1643). ఒకరిపై ఒకరికిగల అధికారం, ఆధిపత్యమునుగాక పరస్పర ప్రేమ, గౌరవం, సంబంధాన్ని సూచిస్తుంది (3-4). ఆధ్యాత్మిక ప్రయోజనాల కొరకుతప్ప, ఇరువురు అంగీకారముతో తప్ప, శారీరక సాన్నిహిత్యాన్ని నిలిపివేయరాదు. తాత్కాలిక సంయమనం ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచడానికై యుండాలి (5). బ్రహ్మచర్యము వ్యక్తిగత పిలుపు, ఉత్తమం అని పౌలు గుర్తించాడు, కాని ఆ వరమును అందరు కలిగియుండలేదు. కనుక, బ్రహ్మచర్యము, వైవాహిక జీవితము రెండూ దేవుని పిలుపు, బహుమానాలే (6-7). బ్రహ్మచర్యము దైవరాజ్యాన్ని, వైవాహిక జీవితము శ్రీసభతో క్రీస్తు ఐఖ్యతను ప్రతిబింబిస్తున్నాయి (సత్యోపదేశం 1617, 1620). అవివాహితులు, విధవలు ఒంటరిగా యుండుట ఉత్తమము. తననుతాను దేవునికి సంపూర్ణ సమర్పణ చేసుకోవడములో బ్రహ్మచర్యము ప్రయోజనకరము. అయినప్పటికినీ, మానవ బలహీనతల దృష్ట్యా, వ్యామోహము వలన, వ్యధ చెందుట కంటె వివాహమాడుట మేలు (8-9). అవివాహితులకైనను, వివాహితులకైనను పవిత్రత అవసరం. “వివాహితులు దాంపత్య జీవిత లైంగిక విశుద్ధతను, ఇతరులు సంయమనముతో పవిత్రముగా జీవించాలి” (సత్యోపదేశం 2349). వివాహము అవిచ్చిన్నమైనది. యేసు బోధనను (మత్త 19:6) పౌలు పునరుద్ఘాటించాడు (10-11). వివాహము రద్దుచేయలేనటు వంటిది. జీవితకాల ఒప్పందం (సత్యోపదేశం 1640). జీవిత భాగస్వామి జీవించియుండగా పునర్వివాహం చేసికోరాదు. పౌలు మిశ్రమ వివాహాల గురించి ఇలా చెబుతున్నాడు. అవిశ్వాసి అయిన జీవిత భాగస్వామి వివాహ బంధాన్ని కొనసాగించడానికి ఇష్టపడితే, విశ్వాసి విడాకులు తీసుకొనరాదు (12-13). మిశ్రమ వివాహాలలో [కతోలిక వ్యక్తిని, జ్ఞానస్నానం పొందిన కతోలికుడు కాని వ్యక్తికి మధ్య వివాహం] ఎన్నో సవాళ్లు ఉంటాయని శ్రీసభ గుర్తుచేస్తూ ఉంటుంది, అయితే, వాటి చెల్లుబాటును సమర్ధిస్తూ ఉంటుంది. విశ్వాసి అయిన జీవిత భాగస్వామి తన విశ్వాసానికి సాక్ష్యమిచ్చేలా ప్రోత్సహిస్తూ ఉంటుంది (సత్యోపదేశం 1633-1637). విశ్వాసియగు భాగస్వామి పరిశుద్ధతను ఆపాదిస్తారు. ఇది వివాహ దివ్యసంస్కారములో నుండి ప్రవహించే కృపయని శ్రీసభ విశ్వాసం. అవిశ్వాసులకు పవిత్రీకరణ సాధనముగా ఉంటుంది (14). అవిశ్వాసియగు జీవిత భాగస్వామి విడిచిపెట్ట దలచిన, విశ్వాసి కట్టుబడి యుండనక్కర లేదు. విశ్వాసి ప్రశాంతముగా జీవించుటకు, అలాగే భాగస్వామియొక్క మారుమనస్సు కొరకు ఆశించాలని శ్రీసభ ప్రోత్సహిస్తున్నది (15-16).
(1). వివాహము దేవుని నమ్మకమైన ప్రేమను ప్రతిబింబించే పవిత్రమైన ఒడంబడిక. దంపతులకు, కుటుంబ సభ్యులకు దేవుని కృపా సాధానము. (2). బ్రహ్మచర్యం విలువైనది. దేవునిపై అసాధారణమైన భక్తికి గొప్ప మార్గం. శ్రీసభలో బ్రహ్మచర్యము, వివాహము రెండూ దైవ పిలుపే. (3). పరస్పర సమర్పణ. వివాహము క్రీస్తు-శ్రీసభ సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. (4). అవిచ్చిన్నత. వివాహము విడదీయరానిది. జీవితకాల కలయిక. విడాకులు దేవుని ఉద్దేశానికి, ప్రణాళికకు విరుద్ధం. (5). వైవాహిక జీవితములో సువార్త ప్రచారం. అవిశ్వాస భాగస్వామిని విశ్వాసమువైపు నడిపించే అవకాశం యున్నది.
నేడు వివాహ జీవితములో ఎన్నో సవాళ్లు. సామాజిక, ఆర్ధిక, చట్టపరమైన మార్పుల కారణముగా అనేక ఆధునిక సవాళ్ళను ఎదుర్కుంటున్నది. ఇది క్రైస్తవ సంఘాలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది. నేటి ప్రధాన సమస్యలు – విడాకులు, భార్యాభర్తలమధ్య, తల్లిదండ్రులు-పిల్లలమధ్య సమన్వయలోపం, వరకట్న వేధింపులు, ఆర్ధిక ఒత్తిళ్ళు, గృహహింస, వివాహేతర సంబంధాలు, పని ఒత్తిళ్ళు, సంప్రదాయ కుటుంబాలు క్షీణించడం..మొ.వి. ఈలాంటి సమయములో మనం [శ్రీసభ నాయకులు, గురువులు, పెద్దలు,] ఆధ్యాత్మిక, ఆచరణాత్మక మద్దతును ఇవ్వగలగాలి. వివాహ జీవిత విలువల గురించి తెలియజేయాలి. వివాహానికి జంటలను సిద్ధం చేయడానికి ముందు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఉంటుంది శ్రీసభ. వాటిలో తప్పక పాల్గొనేలా ప్రోత్సహించాలి. ప్రేమ, పరస్పర గౌరవం, త్యాగం, నిబద్ధత మొదలగు బైబులు ఆధారిత విలువల గురించి వివరిస్తారు. విబేధాలను ఎలా పరిష్కరించుకోవాలో, ఆర్ధిక వ్యవహారాలను ఎలా నిర్వహించాలో, బలమైన ఆధ్యాత్మిక పునాదిని ఎలా ఏర్పరచుకోవాలో అన్న అంశాలను విశదపరుస్తూ, మార్గదర్శకాన్ని చేస్తూ ఉంటారు. వివాహానంతరం కూడా కౌన్సిలింగ్ విసృతముగా అందుబాటులో ఉన్నాయి. భార్యభర్తలిద్దరు కుటుంబ శ్రేయస్సు కొరకు సమానముగా దోహదపడే భాగస్వామ్యముగా క్రైస్తవ వివాహం రూపొందించ బడినదని గుర్తించాలి.

మత్తయి 3:1-12 – యోహాను బోధ

మత్తయి 3:1-12 – యోహాను బోధ

బప్తిస్త యోహాను పరిచర్య, పశ్చాత్తాపానికి పిలుపులో, యేసు రాకడకు మార్గాన్ని సంసిద్ధం చేయడములో అతని పాత్రను తెలియ జేస్తుంది. ఈ భాగమునందు, పశ్చాత్తాపం, జ్ఞానస్నానం, మెస్సయ్య రాకకు సంబంధించిన వేదాంతపరమైన మరియు ఆధ్యాత్మికపరమైన ప్రాముఖ్యతను చూడవచ్చు. యెషయ 40:3లోని ప్రవచనం నెరవేరుస్తూ, యోహాను “ప్రభువుకు మార్గము సిద్ధముచేయ” వచ్చెను. యోహాను పాత నిబంధన ప్రవక్తలలో చివరివానిగా మరియు క్రీస్తునందు నూతన నిబంధనతో, పాత నిబంధనకు వారధిగా పరిగణింప బడినాడు. యేసు ఆరంభించబోవు ‘పరలోక రాజ్యము’యొక్క రాకడ కోసం, పశ్చాత్తాపము, సంసిద్ధత కొరకు ప్రజలను పిలవడం యోహాను లక్ష్యము.

యోహాను జీవితము, జీవనశైలి (3:4) ప్రవక్త ఏలియాతో పోల్చబడుచున్నది. మెస్సయ్య రాకమునుపే ఏలియా ప్రవక్త వస్తాడని మలాకీ 4:5లో ప్రవచనాన్ని చదువుచున్నాము. యోహాను జీవితము అతని సాధారణమైన సరళ జీవితాన్ని, పవిత్ర పరిచర్యను సూచిస్తుంది.

యోహాను బోధ ప్రధాన సందేశం, పశ్చాత్తాపమునకు పిలుపు, “పరలోక రాజ్యము సమీపించినది. మీరు హృదయ పరివర్తనము చెందుడు” (3:2). దేవునితో సహవాస సంబంధములోనికి ప్రవేశించాలంటే, హృదయపరివర్తనము తప్పక అవసరము. పాపమునుండి దూరముగా ఉండటమే కాకుండా, దేవునివైపు, ఆయన చిత్తమువైపు మరలడము. ఈ పిలుపు యేసు రాకను ముందుగానే ఎరుక పరచుచున్నది. యేసు సందేశము కూడా ఇదే పిలుపుతో ప్రారంభమైనది, “హృదయ పరివర్తనము చెందుడు. పరలోక రాజ్యము సమీపించి యున్నది” (మత్త 4:17). యోహాను జ్ఞానస్నానం శుద్దీకరణకు, లేదా ప్రక్షాళనకు సూచన. కాని యేసు పరిశుద్ధాత్మతో తీసుకొని రాబోయే శక్తివంతమైన జ్ఞానస్నానమును సూచిస్తున్నది.

జ్ఞానస్నానము, పాపముల ఒప్పుకోలు: యెరూషలేము, యూదయా అంతటనుండి ప్రజలు తమతమ పాపములను ఒప్పుకొనుచు, యోర్దాను నదిలో జ్ఞానస్నానము పొందుచుండిరి (3:5-6). కతోలిక శ్రీసభలోనున్న జ్ఞానస్నాన దివ్యసంస్కారాన్ని సూచిస్తుంది. జ్ఞానస్నానము ఆదిపాపమును తొలగించి, క్రీస్తు శరీరములో ఐఖ్యము చేయును. యోహాను బప్తిస్మము పశ్చాత్తాపానికి సూచన. యేసుక్రీస్తు స్థాపించిన దివ్యసంస్కారమైన క్రైస్తవ జ్ఞానస్నానము, పాపమునుండి విముక్తులను చేసి, దేవుని వరమగు పవిత్రాత్మయొక్క అనుగ్రహాన్ని ఒసగి నూతన జీవితాన్ని ఒసగుచున్నది (మత్త 3:11; యోహాను 3:5; అ.కా. 2:38).

పరిసయ్యులకు, సద్దూకయ్యులకు యోహాను హెచ్చరిక: “ఓ విష సర్పసంతానమా!” (3:7) అని వారిని తీవ్రముగా మందలిస్తున్నాడు. వారు ఆధ్యాత్మిక మత నాయకులు. వారు పశ్చాత్తాపము, హృదయ పరివర్తనముపై గాక, వారసత్వము మరియు బాహ్యపరమైన మాతాచారాలపై ఆధారపడుచున్నందున వారిని విమర్శించాడు. అబ్రహాము వారసులుగా గుర్తింపు పొందినంత మాత్రమున, వారి రక్షణకు అది సరిపోదని వారిని హెచ్చరించాడు. పశ్చాత్తాపానికి సూచనగా ‘మంచి పనులు’ చేయాలి (3:8). దేవుని చిత్తాన్ని జీవించడానికి, పశ్చాత్తాపము ఎంతో అవసరము.

యోహాను సందేశముయొక్క ఆవశ్యకత: “గొడ్డలి సిద్ధముగా నున్నది” (3:10). దేవుని తీర్పు ఆసన్నమైనదని, పశ్చాత్తాపమునకు చాలా తక్కువ సమయమున్నదని సూచిస్తుంది. “మంచి పండ్ల నీయని వృక్షము నరకబడి అగ్నిలో పారవేయ బడును” (3:10). పశ్చాత్తాప పిలుపునకు ప్రతిస్పందించని వారి విధిని సూచిస్తుంది. “అగ్ని” తీర్పునకు మరియు శుద్ధీకరణకు సూచనగా నున్నది. తీర్పునకు ముందే పశ్చాత్తాపమునకు పిలుపులో దేవుని దయ ప్రతిబింబిస్తున్నది.

పవిత్రాత్మతోను, అగ్నితోను బప్తిస్మము (3:11): యోహాను బప్తిస్మముకన్న, యేసు బప్తిస్మము మరింత శక్తివంతమైనది. ఇది పెంతకోస్తున పవిత్రాత్మ రాకడకు సూచనగా అర్ధం చేసుకోబడుచున్నది (అ.కా. 2). పవిత్రాత్మ రాకడ శిష్యులను, శ్రీసభ పరిచర్యను బలోపేతం చేసినది. “అగ్నితో” బప్తిస్మము అనేది పవిత్రాత్మ యొక్క శుద్ధీకరణ మరియు పరివర్తన కార్యముగా అర్ధం చేసుకొనవచ్చు. బైబులులో “అగ్ని” తరుచుగా శుద్ధీకరణ మరియు దేవుని సన్నిధికి సూచనగా నున్నది (ఉదా. నిర్గమ 3:2; మలాకీ 3:2-3). యేసు బప్తిస్మము దేవుని దయ యొక్క సంపూర్ణతను తెస్తున్నది. పాపము నుండి విముక్తిని చేస్తుంది. ఆత్మను శుద్దీకరిస్తుంది.

తీర్పు, చేట (3:12): “తూర్పార బట్టుటకు యేసు చేతియందు చేట సిద్ధముగా నున్నది. గోధుమ ధాన్యపు గింజలను గిడ్డంగులయందు భద్రపరచి, పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును” (3:12). ఇది అంతిమ తీర్పును సూచిస్తుంది. నీతిమంతులకు ప్రతిఫలం లభిస్తుంది. దుష్టులు ఖండింప బడతారు. విశ్వాసము, మంచి కార్యాలను బట్టి తీర్పు ఉంటుంది. “గోధుమలు” దేవుని కృపకు ప్రతిస్పందించి మంచి ఫలాలను ఫలించే వారిని సూచిస్తాయి. “పొట్టు” పశ్చాత్తాపం కోసం దేవుని పిలుపును తిరస్కరించిన వారిని సూచిస్తుంది.

ఆధ్యాత్మిక సందేశం: (1). రక్షణకు పశ్చాత్తాపం తప్పనిసరి. యోహాను సందేశానికి, యేసు పరిచర్యకు ప్రధానం పశ్చాత్తాపానికి పిలుపు. మనం క్రమం తప్పకుండా ఆత్మపరిశీలన చేసుకొని, పాపములను ఒప్పుకోవాలి. దేవుని చిత్తానుగుణముగా జీవిస్తూ దేవుని దయను పొందుదాం. (2). బప్తిస్మము దేవుని కృపకు మార్గము. బప్తిస్మమువలన దేవుని పరిశుద్ధాత్మను స్వీకరించి, శ్రీసభలో సభ్యులముగా చేర్చబడుచున్నాము. (3). పశ్చాత్తాపము మంచి ఫలాలను ఇస్తుంది. పశ్చాత్తాపము అనగా కేవలం పాపాలకు చింతించడం మాత్రమేగాక, మంచి పనులు, దాతృత్వం, హృదయ పరివర్తన కలిగిన జీవితాన్ని జీవించడం. (4). క్రీస్తు రాకడకు సిద్ధపడాలి. అంతిమ దినమున క్రీస్తు రాకడకై ఎదురు చూస్తూ జీవించాలి. 

మత్తయి 2:16-18 – శిశుహత్య

 మత్తయి 2:16-18 – శిశుహత్య

బాల యేసును చంపే క్రమములో బేత్లెహేము నందును, పరిసరములందున్న రెండేండ్లను, అంతకంటే తక్కువ ప్రాయముగల మగ శిశువులందరు, పవిత్రమైన చిన్నారి బిడ్డలను ఘోరాతి ఘోరముగా చంపమని హేరోదు రాజు ఆజ్ఞాపించాడు. ఇదొక విషాద సంఘటన. హేరోదు రాజుచేత చంపబడిన ఈ చిన్నారులు క్రీస్తు వేదసాక్షులుగా శ్రీసభ పరిగణిస్తుంది. వారు చేసిన త్యాగం, వారికి తెలియక పోయిననూ, వారు యేసుక్రీస్తు కొరకు మరణించారు. డిశంబరు 28న వారిని తల్లి శ్రీసభ స్మరించుకుంటూ ఉన్నది. వేదసాక్షులుగా వారిని గౌరవిస్తూ ఉన్నది. వారి శ్రమలు, బాధలు, క్రీస్తు రక్షణలో పాల్గొనడముగా పరిగణింప బడుతుంది. తరువాత క్రీస్తు మానవాళి కొరకు శ్రమలను పొంది మరణించారు.

2:17-18, యిర్మియా ప్రవక్త పలికిన ప్రవచనం నేరవేరినట్లుగా ప్రస్తావించబడినది (యిర్మియా 31:15). రాహేలు, యాకోబు భార్య, ఇశ్రాయేలు ప్రజలకు తల్లిగా, వారు బానిసత్వము లోనికి కొనిపోబడి నపుడు ఆమె విలపించినది. మత్తయి సువార్తలో బేత్లెహేములోని తల్లులు తమ పిల్లల పట్ల దు:ఖిస్తున్నప్పుడు ఈ ప్రవచనం వర్తింప జేయబడినది. పాత నిబంధన ప్రవచనాలను నెరవేరుస్తూ, యేసు జననానికి సంబంధించిన సంఘటనలు దేవుని ప్రణాళికలో భాగమని అర్ధమగుచున్నది.

చిన్నారుల ఊచకోత, లోకములోనున్న చెడును బట్టబయలు చేస్తుంది. ముఖ్యముగా, గర్వం, భయం, అధికార దుర్వినియోగము యొక్క విధ్వంసకర పరిణామాలను తెలియ జేస్తుంది. యేసు జనన వార్త విని హేరోదు కలత చెందడం, బెదిరింపులకు గురైనప్పుడు, హింసను ఆశ్రయించే మానవ ధోరణి వెల్లడిస్తుంది. అహం, భూలోక శక్తి, అన్యాయాలకు దారితీస్తుంది.

బాలయేసు సాన్నిధ్యమే ప్రపంచ అవినీతి అధికారులను వణికించినది. లోకముననున్న అవినీతి, అన్యాయ, అక్రమ, హింస, అణచివేత మొదలగు దుష్ట శక్తులకు యేసు సువార్త పరిచర్య సవాలుగా ఉండబోతుందని స్పష్టముగా అర్ధమగుచున్నది.

చిన్నారి బిడ్డల మరణం దు:ఖాన్ని కలిగిస్తుంది. ఇది లోకమున అమాయకుల బాధలను ప్రతిబింబిస్తున్నది. నేడు మనం అలాంటి అమాయక బిడ్డలను కాపాడాలి. అన్యాయానికి వ్యతిరేకముగా మనం ఉద్యమించాలి.

అయితే, ఈ లోకములో చెడు తాత్కాలికముగా గెలిచినట్లు అనిపించినప్పటికినీ, అంతిమముగా మంచిదే విజయం. దేవుని ప్రణాళిక ఎన్నటికీ విఫలం కాదు. బాధలలో దేవుని సహాయం ఉంటుంది. బాధలలో దేవుని ఓదార్పు తప్పక ఉంటుంది.

ఆధ్యాత్మిక సందేశం: (1). మానవ జీవితం యొక్క గౌరవాన్ని కాపాడాలి. అందరి జీవితాలు ముఖ్యముగా అత్యంత దుర్భల జీవితాలు కూడా పవిత్రమైనవే అని గుర్తించాలి. (2). దేవుని ప్రణాళికయందు నమ్మకం ఉంచాలి. అర్ధములేని హింసలు, బాధలలోకూడా విశ్వాసులు దేవుని రక్షణ ప్రణాళికపై నమ్మకముంచాలి. (3). ఇతరులతో సంఘీభావం కలిగి జీవించాలి. బాధలు, కష్టాలు అనుభవిస్తున్న వారితో సంఘీభావం కలిగి జీవించుదాం. న్యాయం, శాంతి కోసం కృషి చేద్దాం.

మత్తయి 2:1-12 – జ్ఞానులు – బాలయేసు సందర్శనము

 మత్తయి 2:1-12 – జ్ఞానులు – బాలయేసు సందర్శనము

యేసు దావీదు కుమారుడు. ఆయన యూద వంశములో జన్మించిన రాజు. ఆయన నిజమైన రాజు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. యూదయా సీమయందలి బెత్లేహేమునందు యేసు జన్మించాడు. తూర్పు దిక్కునుండి వచ్చిన జ్ఞానులు యూదేతరులు. యేసు రాజ్యాధికారం ఇశ్రాయేలుకు మాత్రమేగాక, అన్ని దేశాలకు సంబంధించినదని సూచిస్తుంది. ప్రభువు సేవకుని గూర్చిన రెండవ గీతములో, “నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును” (యెషయ 49:6) అన్న ప్రవచనాన్ని నెరవేరుస్తూ, యేసు పుట్టుక విశ్వవ్యాప్తముగా ప్రాముఖ్యమైనదని అర్ధమగుచున్నది. విశ్వమంతయు, క్రీస్తు రాజ్యాధికారమును గుర్తించులాగున జ్ఞానుల సందర్శన మనకు తెలియ జేయుచున్నది.

తూర్పు దిక్కున నక్షత్రమును చూచి జ్ఞానులు యేసును ఆరాధింప వచ్చితిరి. నక్షత్రము దైవీక మార్గదర్శకముగా చూస్తున్నాము. వారు విశ్వాసముతో నక్షత్రాన్ని అనుసరించారు. గమ్యం తెలియకపోయినా, దేవుని ప్రణాళికలో విశ్వాసము, విశ్వాసంయొక్క ప్రాముఖ్యతను ఇది సూచిస్తుంది. హేరోదురాజు, భూసంబంధమైన శక్తి, భయం, అధికారమును కాపాడుకోవాలనే కోరికకు ప్రతీక. యేసు జనన వార్త విని “కలత చెందాడు”, కలవర పడ్డాడు. తన రాజ్యాధికారానికి ముప్పుగా భావించాడు. దీనికి విరుద్ధముగా, జ్ఞానులు వినయముతో రాజుగా జన్మించిన యేసును గౌరవించి ఆరాధింప వచ్చారు. వినయశీలురు దేవుని చిత్తాన్ని అంగీకరిస్తారు. ప్రాపంచిక శక్తి, అహంకారమును అంటిపెట్టుకొని యున్నవారు దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తారు.

జ్ఞానులు తెచ్చిన బహుమతులు, అర్ధవంతమైన బహుమతులు. ‘బంగారం’ యేసు రాజుల రాజు అని సూచిస్తుంది. ‘సాంబ్రాణి’ యేసు దైవత్వాన్ని సూచిస్తుంది. ఎందుకన, ఆరాధనలో సాంబ్రాణి [ధూపం] ఉపయోగిస్తారు. ‘పరిమళ ద్రవ్యములు’ మానవాళి రక్షణ కొరకు యేసు మరణాన్ని సూచిస్తుంది. భూస్థాపనలో పరిమళ ద్రవ్యములను ఉపయోగిస్తారు. భవిష్యత్తులో యేసు శ్రమలను, లోక పాప పరిహార్ధముగా మరణించబోయే రక్షకునిగా ఆయన పాత్రను సూచిస్తుంది.

“హేరోదు చెంతకు మరలి పోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి”. దైవీక రక్షణకు ప్రతీక. మానవ బెదిరింపులు, దుష్టపథకాలు పన్నినప్పుడు, దేవుని సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని అర్ధమగుచున్నది. రక్షణ ప్రణాళికను ఎవరూ అడ్డుకొనలేరు. అది కొనసాగుతూనే ఉంటుంది.

జ్ఞానులద్వారా, అన్యులకు దేవుడు బయలు పరచు [ఎరుక పరచుట] సంఘటనను “యేసు సాక్షాత్కార మహోత్సవము”గా కొనియాడుతూ ఉంటాము. యేసును మెస్సయ్యగా, రాజుగా కొనియాడటం. ఈ సంఘటన యేసును మెస్సయ్యగా, రాజుగా బహిరంగముగా అంగీకరించిన ప్రధమ సంఘటనలలో ఒకటి.

ఆధ్యాత్మిక సందేశం: (1). క్రీస్తును నిష్కపట హృదయాలతో వెదకాలి. జ్ఞానుల ప్రయాణం, నరుని ఆత్మ సత్యమును, అర్ధమును అన్వేషించుటను సూచిస్తుంది. ఎన్ని ఇబ్బందులు, అడ్డంకులు ఉన్నప్పటికినీ, విశ్వాసులు, హృదయపూర్వకముగా, విశ్వాసముతో, అంకితభావముతో యేసును వెదకాలి. (2). దేవుని పిలుపుకు ప్రతిస్పందించాలి. నక్షత్రమనే దైవీక చిహ్నానికి జ్ఞానులు స్పందించినట్లుగా, మన జీవితములో కూడా, ప్రార్ధన, వాక్కు, ఇతర దైవీక మార్గదర్శకాల ద్వారా దేవుని సాన్నిధ్యముగల సంకేతాలకు ప్రతిస్పందించాలి. (3). యేసు ముందు సాష్టాంగపడి వినయపూర్వకముగా ఆరాధించాలి. ‘సాష్టాంగపడటం’ వినయమునకు, గౌరవమునకు సూచన. నిజమైన గొప్పతనం దేవున్ని ఆరాధించడములో ఉంటుంది తప్ప, భూసంబంధమైన శక్తిని, హోదాను వెదకుటలో ఉండదు.

మరణాన్ని ఎలా అర్ధం చేసుకుందాం?

 మరణాన్ని ఎలా అర్ధం చేసుకుందాం?


మరణము–బైబులు: జీవితం దైవానుగ్రహం. ‘ఆత్మ’ తన ఉనికిని కొనసాగించే నూతన జీవితమునకు మార్పుయే మరణము. కనుక, మరణం అంతిమం కాదు. పాపము వలన మరణం లోకమునకు ప్రవేశించినది. ఆదాము ఏవలు దేవున్ని అవిధేయించిన కారణమున, నరుని ఏదెను తోటనుండి వెళ్ళగొట్టెను (ఆది 3:23). తద్వారా, మరణం నరుని జీవితములోనికి ప్రవేశించినది (3:19). నూతన నిబంధనములో పౌలు “పాపము యొక్క వేతనము మరణము” (రోమీ 6:23) అని ఇదే విషయాన్ని పున:ప్రస్తావించాడు. మరణం ఆదిపాపానికి శిక్షయని, అయితే మానవాళిపట్ల దేవుని దయగల ప్రణాళికలో భాగమే అని పునీత అగుస్తీను వర్ణించాడు. మరణం అనగా శరీరమునుండి ఆత్మ వేరుచేయబడుట. “నరుని దేహము ఏ మట్టినుండి వచ్చినదో ఆ మట్టిలోనికి తిరిగి పోవును. అతని ప్రాణము మొదట దానిని దయచేసిన దేవుని చేరుకొనును” (ఉపదేశకుడు 12:7). అయితే, మరణించిన వారి పునరుత్థానముపై నిరీక్షణను కూడా బైబులు నొక్కివక్కానిస్తుంది. యేసు పునరుత్థానం క్రైస్తవ విశ్వాసమునకు పునాది, ప్రధానం. మరణానికి అంతము లేదనే ఆశను మనకు కలిగిస్తుంది. “నేనే పునరుత్థానమును, జీవమును. నన్ను విశ్వసించువాడు, మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికిని మరణింపడు” (యోహాను 11:25-26) అని యేసు ప్రకటించాడు. పౌలు కూడా మరణాన్ని జయించడం గురించి చెప్పాడు, “మృత్యువు నాశనం చేయబడినది. ఓ మృత్యువా! నీ విజయము ఎక్కడ? ఓ మృత్యువా! బాధ కలిగింపగల నీ ముల్లు ఎక్కడ?” (1 కొరి 15:54-55). క్రీస్తుద్వారా మరణముపై ఈ విజయం క్రైస్తవ విశ్వాసానికి ప్రధానం.

మరణము–కతోలిక విశ్వాసం: మరణం భూలోక జీవితమునుండి శాశ్వతజీవితానికి మార్గము. శరీరమునుండి ఆత్మ నిష్క్రమిస్తుంది, కాని వ్యక్తిగత ఉనికికి అది ముగింపు కాదు. ఆత్మ జీవిస్తూనే ఉంటుంది. అది శాశ్వతములోనికి ప్రవేశిస్తుంది. మరణం తరువాత, ప్రతీ ఆత్మ ప్రత్యేక/వ్యక్తిగత తీర్పును ఎదుర్కుంటుంది. “ప్రతి వ్యక్తి ఒక్కసారే మరణించి తదుపరి దేవునిచే తీర్పు పొందవలెను” (హెబ్రీ 9:27). విశ్వాసము, నైతిక జీవిత ఆధారముగా, ఆత్మ పరలోకములోనికిగాని, ఉత్థరించు స్థలములోనికిగాని, నరకములోనికిగాని ప్రవేశిస్తుంది. పరలోకము అనగా [వెంటనే లేదా ఉత్థరించు స్థలముద్వారా] దైవకృపలో నున్నవారు, నీతిమంతులు. ఉత్థరించు స్థలము అనగా రక్షింపబడిన వారు, కాని ఇంకా శుద్ధీకరణ అవసరమైనవారు. నరకము అనగా పశ్చాత్తాపం లేకుండా ఘోర పాపములో మరణించి తద్వారా దైవకృపను తిరస్కరించినవారు. అంతిమ కాలమున, సకల ఆత్మలు సాధారణ తీర్పును పొందును. పునరుత్థానములో ఆత్మలు వారి శరీరములతో ఐఖ్యమగును. దేవుని న్యాయము సంపూర్ణముగా బయలు పరచ బడును (పునీత జస్టిన్, వేదసాక్షి).

మరణము-వేదసాక్షి: శ్రీసభ వేదసాక్షులను అనగా విశ్వాసము కొరకు తమ ప్రాణాలను అర్పించినవారిని ఎంతగానో గౌరవిస్తూ ఉంటుంది. శాశ్వత జీవితమునకు, క్రీస్తుతో ఐఖ్యము, సహవాస జీవితానికి ప్రత్యక్ష మార్గము. వీరు ఎలాంటి శుద్ధీకరణ లేకుండానే నేరుగా పరలోకానికి కొనిపోబడతారు. పునీత అతియోకు ఇగ్నేషియస్ గారు ఇలా ప్రార్ధించారు, “నేను దేవుని గోధుమను. క్రూరమృగాల దంతాలచేత నేను నలిపివేయబడినప్పుడు, నేను క్రీస్తుయొక్క స్వచ్చమైన రొట్టెను కనుగొనగలను” (రోమీయులకు లేఖ, 4వ అధ్యాయం).

నిత్యజీవితము: మరణం అంతిమం కాదని కతోలిక విశ్వాసం. దేవుని కృపలో మరణించేవారు పరలోకములో ఆయనతో నిత్య జీవితాన్ని ఆనందిస్తారు. ఇది దేవునితో పరిపూర్ణమైన సహవాస జీవితము. “దేవుడు ప్రతీ కన్నీటిని తుడిచి వేయును...ఇక మృత్యువు ఏ మాత్రము ఉండబోదు” (దర్శన 21:4) అని దర్శన గ్రంధములో చూస్తున్నాము.

మరణం-క్రీస్తు మరణములో పాల్గొనడము: కతోలిక విశ్వాసం ప్రకారం, క్రీస్తు మరణ-పునరుత్థానముల వలన మరణం రూపాంతరము చెందినది. క్రైస్తవులు జ్ఞానస్నానములో క్రీస్తు మరణ-ఉత్థానములో ఐఖ్యమగుచున్నారు. “మనము అందరము క్రీస్తు యేసు నందు జ్ఞానస్నానము పొందినపుడు ఆయన మరణము నందు జ్ఞానస్నానము పొందితిమి. కనుక మన జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలుపంచుకొంటిమి. ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై యుండినచో, ఆయన పునరుత్థానములో కూడ మనము తప్పక ఆయనతో ఏకమై యుందుము” (రోమీ 6:3-5). అనగా మరణము వలన కలుగు దు:ఖములో నున్నప్పటికిని, మరణము పాస్క పరమ రహస్యములో పాల్గొంటుంది. కనుక, మరణము అర్ధరహితమైనది కాదు. మరణము నిరీక్షణతో నిండియున్నది. ఎందుకన, క్రీస్తు మనందరి కోసం నిత్యజీవపు ద్వారాలను తెరచాడు. “చనిపోయిన వారిని పోగుట్టుకున్న వారివలె దు:ఖపడకూడదు. ఎందుకన, మరణించి ఉత్థానమైన క్రీస్తునందు వారు లేపబడుదురు అని విశ్వసిస్తున్నాము” (పు. జెరుసలెం సిరిల్, సంక్షేప బోధనలు IV 23).

మరణము-దివ్యసంస్కారాలు: కతోలికులు అవస్థ అభ్యంగనమను దివ్యసంస్కారాన్ని విశ్వసిస్తారు. తీవ్రమైన అనారోగ్యము లేదా మరణావస్థలో నున్నవారికి ఈ దివ్యసంస్కారం ఇవ్వబడుతుంది. దైవకృప, ఆధ్యాత్మిక స్వస్థత, కొన్నిసార్లు శారీరక స్వస్థతను చేకూరుస్తూ వారిని ఆత్మీయముగా బలపరుస్తుంది. మరణావస్థలో నున్నవారిని [చివరి] దివ్యసత్ప్రసాదమును (వియాటికుం) స్వీకరించమని శ్రీసభ ప్రోత్సహిస్తుంది. ఇది నిత్యజీవిత ప్రయాణానికి ఆధ్యాత్మిక పోషణగా ఒసగబడుచున్న పవిత్ర దివ్యసత్ప్రసాదము.

పునీతుల బాంధవ్యము-మరణించిన వారి కొరకు ప్రార్ధనలు: పునీతుల బాంధవ్యముద్వారా జీవించుచున్నవారికి, మరణించిన వారికి మధ్యన లోతైన బంధమున్నదని కతోలిక విశ్వాసం. మృతుల కొరకు ప్రార్ధించే సంప్రదాయాన్ని శ్రీసభ పాటిస్తుంది. మరణించిన ఆత్మలకోసం, ముఖ్యముగా ఉత్థరించు స్థలములోనున్నవారి శుద్ధీకరణ కొరకు ప్రార్ధించమని భూలోకములో జీవించుచున్న విశ్వాసులను ప్రోత్సహిస్తుంది. ఈ విశ్వాసం 2 మక్క 12:45న చూడవచ్చు, “చనిపోయిన వారికి పాప విముక్తి కలుగునని యెంచి వారి కొరకు పాపపరిహారబలి అర్పింపజేసెను”. “క్రీస్తు శరీరరక్తముల బాంధవ్యములో శ్రీసభ మరణించిన వారికొరకు ప్రార్ధిస్తూ ఉంటుంది” (పు. అగుస్తీను, ప్రసంగం 172, 2). “ఒక వ్యక్తి శరీరమునుండి నిష్క్రమించిన తరువాత, ఆ వ్యక్తి పేర అర్పించబడే ప్రార్ధనలు, పుణ్యకార్యాలు, దానధర్మాల ద్వారా సహాయం అందించ బడుచున్నది” (పు. నిస్సా గ్రెగోరి, మరణించిన వారిపై ప్రసంగం)

మంచి మరణము కొరకు సిద్ధపడుట: ఆధ్యాత్మిక సంసిద్ధత ఎంతో అవసరము. సుగుణాలతో కూడిన జీవితాన్ని జీవించాలి. విశ్వాసము, పశ్చాత్తాపము కలిగి జీవించాలి. మంచి మరణము అనగా దేవునితో సఖ్యపడి, దేవుని కృపలో మరణించడం. మరణ తీర్పులో మనతో వచ్చేవి మన సద్గుణాలు, మన మంచి పనులు మాత్రమే! “ఈ లోకాన్ని విడచినప్పుడు, మనం ఈ లోకములో వదిలేసిన వాటిపైగాక, మనతో తీసుకొని వెళ్ళే సద్గుణాలు, పుణ్యకార్యాలను బట్టి తీర్పు ఉంటుంది” (పు. జాన్ క్రిసోస్తం, మత్తయి సువార్తపై ప్రసంగం 34).

సారాంశం: పాపము యొక్క ఫలితం మరణము అయితే, క్రీస్తుద్వారా మరణము జయించ బడినది. మరణం అనేది శాశ్వత జీవితానికి మార్పు. ఆత్మలు తీర్పునకులోనై, పరలోకము, ఉత్థరించు స్థలము, నరకములోనికి ప్రవేశిస్తాయి. శరీరము యొక్క పునరుత్థానం, దేవునితో శాశ్వత జీవిత సహవాసం కతోలిక విశ్వాసములో ప్రధానం.

పసిబిడ్డలు - పరలోక రాజ్యము (మత్తయి 18:1-4)

పసిబిడ్డలు - పరలోక రాజ్యము (మత్తయి 18:1-4)

శిష్యులు యేసు వద్దకు వచ్చి, “పరలోక రాజ్యమున అందరి కంటె గొప్పవాడు ఎవడు?” అని ప్రశ్నించారు. యేసు కాలములో, రబ్బయిలు, వారి అనుచరుల మధ్యన హోదా, గొప్పతనం గురించిన చర్చలు సాధారణం. యూద సంస్కృతిలో, గొప్పతనం లేదా హోదా తరుచుగా, సామాజిక స్థితి, మతపరమైన జ్ఞానం, చట్టానికి కట్టుబడి యుండటం వంటిపై ఆధారపడి ఉంటుంది. ఒకానొక సమయములో, శిష్యులు ఎప్పుడుకూడా భూలోకములో, మరియు పరలోకములో వారి హోదా, అధికారము, ఉన్నత స్థానము గురించి ఆలోచించారు, ఆందోళన చెందారు. జెబదాయి కుమారుల తల్లి, తన కుమారులతో (యోహాను, యాకోబు) యేసు వద్దకు వచ్చి, “నీ రాజ్యములో నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపున, ఒకడు నీ యెడమ వైపున కూర్చుండ సెలవిమ్ము” అని మనవి చేయడం. “తక్కిన పదగురు శిష్యులు దీనిని వినినప్పుడు ఆ ఇద్దరు సోదరులపై కోపపడిరి” (మత్త 20:20-28; మార్కు 10:35-45). “తమలో గొప్పవాడెవ్వడు అని వాదించు కొనిరి” (మార్కు 9:33-37). కదరాత్రి భోజన సమయములో కూడా “తమలో ఎవరు గొప్పవాడు అను వివాదము శిష్యులలో తల ఎత్తెను” (లూకా 22:24).

దేవుని దృష్టిలో నిజమైన ‘గొప్పతనం’ ఏమిటో వారు గ్రహించలేక పోయారు! ‘గొప్పతనం’ గురించి ఈ లోకం తీరులో ఆలోచించారు. యేసు జీవించిన కాలం, సమాజములో, చిన్న బిడ్డలకు సామాజిక హోదాగాని, ప్రాముఖ్యతగాని ఉండేది కాదు. ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలపడం, యేసు చిన్న బిడ్డల గొప్పతనాన్ని సవాలు చేస్తున్నాడు! ‘వినయం’ లేదా ‘వినమ్రత’ అనే సుగుణము యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పుచున్నాడు. పరలోకములో ప్రవేశించాలంటే, ‘పరివర్తన’ చెంది చిన్న బిడ్డలవలె రూపొందాలని తెలియ జేశారు. చిన్న బిడ్డలవలె రూపొందడం అనగా హృదయ పరివర్తన చెందడం. బిడ్డలవలె అమాయకత్వం, వినయం, దేవునిపై ఆధారపడే సుగుణాలను కలిగి యుండటం.

సందేశం: ఆధ్యాత్మిక జీవితములో, దేవునితో సహవాస సంబంధ ప్రయాణములో వినయము, నమ్మకము, సరళమైన జీవితము ముఖ్యమని యేసు బోధిస్తున్నాడు. మొదటిగా, వినయం చాలా కీలకం. దేవుని రాజ్యములో ‘గొప్పతనం’ అనగా హోదా, జ్ఞానం, శక్తి కావు. ‘రక్షణ’ను హోదా, జ్ఞానం, శక్తిద్వారా పొందలేము. వినయము కలిగి జీవించడం. ‘చిన్న బిడ్డలవలె’ మన స్వశక్తిపైగాక, దేవునిపై ఆధారపడి జీవించడం. ‘గొప్పతనం అనగా నిస్వార్ధము, సేవ, నిగర్వము అని యేసు పునర్నిర్వచించాడు. “అందరిలో చివరివాడై, అందరకు సేవకుడిగా ఉండవలయును” (మార్కు 9:35). పరలోకములో ప్రవేశించాలంటే, ‘పరివర్తన’ తప్పనిసరి. ‘చిన్న బిడ్డలవలె రూపొందిననే తప్ప’ అనగా పరలోక రాజ్యమున ప్రవేశించాలంటే ఈ ‘పరివర్తన’ ఐచ్చికం (ఆప్షనల్) కాదు, కాని తప్పనిసరి అని అర్ధమగుచున్నది. ఇది మన జీవితాలను, దేవునిముందు సరళత, చిత్తశుద్ధి కలిగి యుండునట్లు చేస్తుంది. గర్వాన్ని, అహంకారాన్ని వీడి దేవునిపై ఆధారపడటం, వినయం కలిగి జీవించడం. దేవుని రాజ్యములో ‘గొప్పతనం’ అధికారము చెలాయించడం కాదు. గొప్పవాడు చిన్నవాని వలెను, నాయకుడు సేవకుని వలెను ఉండవలయును” (లూకా 22:25-26). మనం కూడా ‘గొప్పతనం’ అనేది హోదా, అధికారం, స్థానం కాదు. వినయం, నిస్వార్ధం, సేవ అని గుర్తించుదాం!

“వినయం” ఇతర సద్గుణాలకు పునాది. కనుక, ఈ సద్గుణం లేని హృదయములో, కపటం తప్ప ఏ యితర సద్గుణం ఉండదు” (పునీత అగుస్తీను). ‘పరివర్తన’ అనగా అధికారం, హోదాలపై గల ఆశలను వదులుకొని, దేవునిపై సంపూర్ణ నమ్మకము కలిగి, ఆయనపై ఆధారపడి జీవించడం. వినయం నిజమైన గొప్పతనానికి ఉన్నతమైన మార్గం.

‘పరివర్తన’ (18:3) ముఖ్యమైన మార్పును లేదా టర్నింగ్ పాయింటును సూచిస్తుంది. ‘పరివర్తన’ అనగా పాపమును, సాతానును వీడి, దేవుని వైపునకు మరలడం. పశ్చాత్తాపం, విశ్వాసం, మార్పు కలిగి యుండాలి. పూర్వ నిబంధనములో, ‘పరివర్తన’ హీబ్రూ భాషలో “శువ్”, పశ్చాత్తాపాన్ని, వెనకకు తిరిగి రావడాన్ని సూచిస్తుంది. దారి తప్పిన వారు తిరిగి దేవుని చెంతకు రావడం. ఇదే విషయం ప్రవక్తల బోధనలలో కూడా కనిపిస్తుంది (యోవేలు 2:12-13; హోషేయ 6:1). ‘పరివర్తన’ అనగా హృదయ పరివర్తన అని యెహెజ్కెలు 36:26లో చూడవచ్చు. ఇది అంత:ర్గత పునరుద్ధరణ. నూతన నిబంధనములో, ‘పరివర్తన’ అనగా ఆధ్యాత్మిక పునర్జన్మ అని నొక్కి చెప్పాడు. యోహాను 3:3 – “నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలరు”. దీని అర్ధం యోహాను 3:5లో – “నీటివలన, ఆత్మ వలన జన్మించడం”. క్రీస్తును అంగీకరించడం ప్రాధమిక పరివర్తన. అ.కా. 2:38 – “మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై యేసుక్రీస్తు నామమున బప్తిస్మము పొందవలయును.” పశ్చాత్తాపం, పాపమును వీడటం, యేసుక్రీస్తునందు విశ్వాసం పరివర్తనలో ప్రధానం. పరివర్తనకు, హృదయమార్పునకు, బిడ్డలవలె రూపొందడానికి చక్కటి ఉదాహరణ సౌలు పౌలుగా మారడం (పౌలు పరివర్తన). అలాగే, తప్పిపోయిన కుమారుడు (లూకా 15:11-32), త్రోవ తప్పిన గొర్రె (లూకా 15:1-7).

‘పరివర్తన’ అనగా క్రీస్తులో కొత్త జీవితము, నూతన సృష్టి (2 కొరి 5:17). పరివర్తన అనగా క్రీస్తులో నూతన గుర్తింపు. పాపపు జీవితాన్ని విడిచిపెట్టడం. ‘పరివర్తన’ అంటే కేవలం అంత:ర్గతమే కాదు. అంత:ర్గత మార్పు, మన జీవితములో, మన మాటలలో, చేతలలో, మన ఆలోచనలలో, వైఖరిలో ప్రతిబింబించాలి. ఎఫెసీ 4:22-32లో “మోసకరమగు దుష్టవాంచలచే భ్రష్టమైన పూర్వజీవితపు పాతస్వభావమును మార్చుకొనుడు. మీ మనస్తత్వమును నూత్నీకరించుకొనుడు. సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. అసత్యములు పలుకరాదు. కోపము పాపములోనికి లాగుకొనిపోకుండా చూచుకొనుడు. దొంగతనము మానివేయాలి. అక్కరలోనున్న వారికి సహాయం చేయ మంచి పనులు చేయుచు కష్టపడవలెను. దుర్భాషలు రానీయ కూడదు. వైరము, మోహము, క్రోధము అను వానిని త్యజింపుడు. అరపులుగాని, అవమానములుగాని ఉండరాదు. ఏవిధమైన ద్వేష భావము ఉండరాదు. పరస్పరము దయను, మృదుత్వమును ప్రదర్శింపుడు. ఒకరిని ఒకరు క్షమింపుడు.”

‘పరివర్తన’ ఒకసారి జరిగేది కాదు. ఇది నిత్యమూ కొనసాగే ప్రక్రియ. ప్రారంభమైన పరివర్తన, ఆధ్యాత్మిక పరిపక్వతలో ఎదుగుదల కొనసాగుతుంది.

‘పరలోక రాజ్యము’ ప్రాపంచిక విలువలకు వ్యతిరేకమైనది. మన వైఖరిని ఆత్మపరిశీలన చేసుకుందాం! వినమ్రత, ప్రేమ, సేవా భావముతో జీవిస్తున్నామా?

అస్సీసిపుర ఫ్రాన్సిస్ పంచగాయాలు - 800 సం.ల వార్షికోత్సవము

అస్సీసిపుర ఫ్రాన్సిస్ పంచగాయాలు - 800 సం.ల వార్షికోత్సవము
గురుశ్రీ ప్రవీణ్ గోపు, కపూచిన్
రెక్టర్, వియాన్ని కాలేజి, జానంపేట (ఏలూరు)

అక్టోబరు 4న, విశ్వశ్రీసభ పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి మహోత్సవాన్ని ఘనముగా కొనియాడుతూ ఉంటుంది. సెప్టెంబరు 17న ఫ్రాన్సిస్ వారి పంచగాయాల పండుగను కొనియాడుతుంది. ఈ పండుగను 5వ పౌలు జగద్గురువులు ఆమోదించారు. అయితే, 2024 ప్రత్యేకత ఏమిటంటే, ఫ్రాన్సిస్ పంచగాయాలు పొంది 800 సం.లు (17.09.1224-17.09.2024) పూర్తియైన సందర్భముగా, శ్రీసభ, ముఖ్యముగా, ఫ్రాన్సిస్కన్ సహోదరీ, సహోదరులు వార్షికోత్సవాన్ని కొనియాడుచున్నారు. 3 అక్టోబర్‌ 1226లో ఫ్రాన్సిస్ స్వర్గస్తులైనారు. ఈ సందర్భముగా, జనరల్ మినిస్టర్ బ్రదర్ ఎలియాస్, “నేను మీకొక సంతోషకర, నూతన అద్భుతాన్ని ప్రకటిస్తున్నాను. దైవకుమారుడైన క్రీస్తులో తప్ప ఆరంభమునుండి వినబడని సూచన. అతని మరణానికి కొంతకాలం ముందుగా, మన సోదరుడు, తండ్రియునైన ఫ్రాన్సిస్ తన శరీరములో పంచగాయాలను పొంది, సిలువ వేయబడిన క్రీస్తును పోలినట్లుగా కనిపించారు” అని ఫ్రాన్సిస్ మరణ వార్తను ప్రకటిస్తూ లేఖను విడుదల చేసాడు. అయితే, ఫ్రాన్సిస్ పంచగాయాలను మరణావస్థలో పొందినవి కావు. తన మరణానికి రెండు సంవత్సరాలకు ముందుగా, 17 సెప్టెంబరు 1224న క్రీస్తు పవిత్ర పంచగాయాలను పొందియున్నాడు. క్రైస్తవ చరిత్రలోనే ఇదొక మరుపురాని మైలురాయి. ఇదొక ఆధ్యాత్మిక అనుభవం. క్రీస్తు శ్రమలతో పునీతుని లోతైన ఐఖ్యతకు అద్భుత చిహ్నం. అతని పవిత్రతకు, అంకితభావానికి గొప్ప సూచన. దైవచిత్తానికి సంపూర్ణముగా తలొగ్గడం. క్రీస్తు ప్రేమపట్ల అమితాసక్తి కలిగియుండటం. సిలువలో కొట్టబడిన క్రీస్తుపట్ల, ఆయన శ్రమలపట్లనున్న ఫ్రాన్సిస్ భక్తికి ఇది పరాకాష్ట! పేదరికము, వినయము, దాతృత్వము పట్ల ఫ్రాన్సిస్ నిబద్ధతకు ఇదొక అద్భుత సాక్ష్యము.

 ఇటలీ దేశములోని ‘లవర్నా’ పర్వతమునకు ఫ్రాన్సిస్‌, మరో ఇరువురు సహోదరులతో వెళ్ళాడు. వారిలో బ్రదర్ లియో ఒకరు. ఆగష్టు 15 మరియ మోక్షారోపణ పండుగ తరువాత, ఫ్రాన్సిస్ ‘లవర్నా’ పర్వతమునకు వెళ్లి అక్కడ 29 ఆగష్టు అతిదూతయగు పునీత మిఖయేలు పండుగ వరకు ఉపవాస ప్రార్ధనలో గడపడం ఆనవాయితీ!

1224వ సం.లో, ‘లవర్నా’ ‘పర్వత శిఖరముపై, ఫ్రాన్సిస్ ఏకాంతముగా, తీవ్రమైన ఆధ్యాత్మిక చింతనతో ఉపవాస ప్రార్ధనలు చేయు సమయములో, ఆరు మండుతున్న రెక్కలతోగల సెరాఫీము దేవదూత స్వర్గమునుండి దిగిరాగా, రెక్కల మధ్యన, సిలువపై సిలువవేయబడిన క్రీస్తును ఫ్రాన్సిస్ గాంచాడు. ఆ దృశ్యములో, క్రీస్తు దయగల చూపు ఫ్రాన్సిసును సంతోషముతో నింపగా, యేసు సిలువ వేయబడటం అతనిని దు:ఖముతో నింపినది. ఇది క్రైస్తవ ప్రేమ పారడాక్స్ను వ్యక్తపరుస్తుంది. అలా సిలువ వేయబడిన క్రీస్తు దర్శనములో మమేకమై యుండగా, అకస్మాత్తుగా తన శరీరముపై క్రీస్తు పంచగాయాలు పొందియున్నాడు’. ‘క్రీస్తు దర్శనాన్ని చూసి ఫ్రాన్సిస్ సంతసించాడు. అతని ఆత్మ వేదనతో కూడిన ఆనందాన్ని అనుభవించింది. గతములో ఎన్నడూ వినని, ఆశ్చర్యకరమైన, అద్భుతమైన క్రీస్తు పవిత్ర పంచగాయలతో అలంకరించబడిన నూతన వ్యక్తిగా ఫ్రాన్సిస్ ‘లవర్నా’ పర్వతము దిగివచ్చాడు’ అని థామస్ సెలానొ (1229) మరియు పునీత బొనవెంతుర (ఫ్రాన్సిస్ జీవిత చరిత్ర, 13వ శతాబ్దం మధ్యకాలం) వివరించారు. సెరాఫీము దేవదూతల గురించి యెషయ 6:2-3లో చదువుతాం. “మండుతున్న రెక్కలు” క్రీస్తు ఫ్రాన్సిసుకు తెలియబరచిన ప్రజ్వరిల్లే దైవప్రేమను సూచిస్తుంది. అందుకే, “ఫ్రాన్సిస్ హృదయం ఉత్సాహముతో ప్రజ్వరిల్లినది. అతని శరీరం సిలువ వేయబడిన క్రీస్తు రూపాన్ని కలిగి యున్నది మరియు దైవీక ముద్రతో సీలు చేయబడినది” (అల్బాన్ బట్లర్, “పునేత అస్సీసిపుర ఫ్రాన్సిస్ జీవితము”).

ఫ్రాన్సిస్‌ తన చేతులు, కాళ్ళు, ప్రక్కటెముకలో గాయాలను పొందినట్లుగా స్పష్టముగా వర్ణించారు. ఈ పంచగాయాలు రెండు సంవత్సరాల పాటు, అనగా తన మరణము వరకు ముద్రించబడి యున్నాయి. తాను పొందిన పంచగాయాలను వీలైనంత వరకు ఎవరి కంటబడకుండా గుప్తముగా యుంచేవాడు. ఇది అతని వినయాన్ని, ఆయన జీవించిన పేదరికాన్ని తెలియజేయు చున్నది. ఒక హతసాక్షి మరణాన్ని పొందకున్నాను, ఈవిధముగానైనా క్రీస్తు శ్రమలలో పాల్గొన్నందుకు ఫ్రాన్సిస్ సంతోషపడ్డాడు. పంచగాయాలు భౌతికమైన సంకేతాలు మాత్రమేగాక, లోతైన ఆధ్యాత్మిక సంకేతాలు. ఫ్రాన్సిస్ క్రీస్తు శ్రమలతో పోల్చుకొనుటను, క్రీస్తు వినయమును, త్యాగమును అవి ప్రతిబింబిస్తున్నాయి. ఈ దైవదర్శనం కేవలం ఆధ్యాత్మిక అనుభవం మాత్రమే గాక, ఫ్రాన్సిసుకు క్రీస్తు ప్రేమాభిమానాలతో, సంకల్పముతోనున్న ఐఖ్యతకు, మమేకతకు గొప్ప నిదర్శనం!

గ్రీకు భాషలో, “స్తిగ్మాట” (Stigmata) అన్న పదానికి ‘సిలువ వేయబడిన క్రీస్తు గాయాలను పోలియుండే శరీరముపై పొందు గుర్తులు’ అని అర్ధం. ‘పంచగాయాల’ గురించి బైబులులో వివరించబడనప్పటికినీ, క్రీస్తు బాధలలో భాగస్థులమవడం అనే భావన నూతన నిబంధనలోని ఫిలిప్పీ 3:10; గలతీ 2:20లో చూడవచ్చు. “నా శరీరముపై నేను యేసు యొక్క ముద్రలను ధరించియున్నాను” (గలతీ 6:17) అని పునీత పౌలుగారు తన లేఖలో వ్రాసారు. క్రైస్తవ చరిత్రలో రికార్డ్ చేయబడిన, పంచగాయాలను పొందిన ప్రధమ వ్యక్తి, పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారే! పౌలుగారు చెప్పినట్లుగా, ఫ్రాన్సిస్ పంచగాయాలు క్రీస్తు శ్రమలతో నొకటిగా గావింప బడ్డాయి. గలతీ 2:20, “ఇక జీవించునది నేను కాదు. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు”. ఫ్రాన్సిస్ పంచగాయాలు, తాను క్రీస్తుకు సంపూర్ణముగా చెందినవాడని తెలియజేయు చున్నాయి. అందుకే ఫ్రాన్సిస్ “అపర క్రీస్తుగా’, “మరో క్రీస్తుగా” పిలువ బడుచున్నాడు.

‘క్రీస్తు శ్రమల, మరణ గాయాలు, మానవాళిపై దైవప్రేమకు చిహ్నాలు. క్రీస్తు పంచగాయాలను కొంతమంది క్రైస్తవ విశ్వాసులు [పునీతులు] పొందడం, మనపై, మన రక్షణకోసమై, క్రీస్తు ప్రేమతో తన శరీరములో అనుభవించిన బాధను గుర్తుచేస్తుంది’.

పంచగాయాలపట్ల కొంత సందేహం, ప్రశ్నలు ఉండటం సాధారణమే! చరిత్రలో పంచగాయాల గురించి వివిధరకాలైన వివరణలను ఇచ్చారు. ఎన్నో సందేహాల నివృత్తి తర్వాతనే, విశ్వవ్యాప్తముగా ఆమోదించ బడినవి. ఏదేమైనప్పటికినీ, ఫ్రాన్సిస్ విషయములో, సందేహాలతో సంబంధము లేకుండా, అతని ఆధ్యాత్మిక ప్రయాణానికి, క్రీస్తుతో ఐఖ్యతకు గొప్ప నిదర్శనము, సాక్షిగా నిలిచింది.

‘ఫ్రాన్సిస్ పంచగాయాల అష్టశతాబ్ది వేడుకల’ను కొనియాడు వేళ, ఫ్రాన్సిస్ జీవితం, ఆధ్యాత్మికత మరియు బోధనల గురించి తెలుసుకుందాం, ధ్యానిద్దాం! క్రీస్తు ప్రక్కనుండి ప్రవహించు ప్రేమ బలముతో, క్షమాపణ, స్వస్థత, సంతోషం, సౌభాతృత్వంతో జీవించుదాం. కేవలం సిలువచెంత మాత్రమే సువార్తను పూర్తిగా అర్ధంచేసుకోగలము. ఒక్క మాటలో చెప్పాలంటే, ఫ్రాన్సిస్ పంచగాయాలు ప్రేమలోనున్న శక్తికి నిదర్శనం. కనుక ద్వేషముతోనున్న లోకం ప్రేమతో నింపబడాలి.

ఫ్రాన్సిస్ సువార్త వెలుగులో జీవించిన గొప్ప పునీతుడు. ఆయన జీవించిన ‘పేదరికం ఎవరూ జీవించి యుండరు. పేదవారిపట్ల ప్రేమ, సేవాభావముతో జీవించాడు. ఎప్పుడైతే పేదవారిని ప్రేమించగలనో, అప్పుడే దేవున్ని పరిపూర్ణంగా ప్రేమించగలనని నమ్మాడు. ప్రేమ, కరుణగల దేవుని మంచితనమును అలవర్చుకున్నాడు. పవిత్రాత్మచేత ప్రేరేపింప బడినాడు. ధాతృత్వమును జీవితాంతం ఆచరణలో పెట్టిన గొప్ప వ్యక్తి. తప్పుచేసిన తన సహోదరులను సరిచేయుటకు ఎన్నడు వెనకాడలేదు. “ఇప్పటి వరకు మనం ఏమి చేయలేదు, దేవున్ని సేవించడం ఇకనైనా ఆరంభిద్దాం” అని తన మరణావస్థలో తోటి సహోదరులతో పలికిన గొప్ప పునీతుడు. దేవుని సృష్టిపట్లముఖ్యంగా మూగజీవులపట్ల సోదరభావాన్ని వ్యక్తపరచిన చిరస్మరణీయుడు.

ఇటలీ దేశంలోని అస్సీసి పట్టణంలో క్రీ.శ.1182లో జన్మించారు. తండ్రి పీటర్‌ బెర్నార్డ్‌, తల్లి పీకా. తండ్రి బట్టల వ్యాపారి. ఫ్రాన్సిస్‌ చలాకీగా, కలుపుగోలు తనముతో వ్యాపారంలో తండ్రికి సహాయం చేసేవాడు. కాని, విందు, వినోదాలకు ఖర్చుచేసేవాడు. యుక్తవయస్సులో గొప్ప యోధుడవ్వాలని కళలు కన్నాడు. యుద్ధాలలో పాల్గొన్నాడు. పెరూజియన్‌లతో జరిగిన యుద్ధంలో ఖైదీగా పట్టుబడ్డాడు. చెరనుండి విడుదల అయిన కొద్దిరోజులకే తీవ్రజబ్బున పడ్డాడు. కోలుకున్నాక, ఆపూలియా వెళ్ళు త్రోవలో ప్రభువు స్వరాన్ని విన్నాడు: “ఫ్రాన్సిస్‌, ఎక్కడికి వెళ్ళుచున్నావు? నీవు ఎవరిని సేవించగలవు? యజమానుడినా, సేవకుడినా? ‘యజమానుడిని’ అని ఫ్రాన్సిస్‌ సమాధానం. “నీవు యాజమానుడినిగాక, సేవకుడిని సేవిస్తున్నావు” అని ఆస్వరం పలికింది. అప్పుడు ఫ్రాన్సిస్‌, ‘అయితే, నన్నేమి చేయమంటారు? అని ప్రశ్నించాడు. “నీవు తిరిగి అస్సీసికి వెళ్ళు. నీవు ఏమి చేయాలో అక్కడ తెలుసుకుంటావు” అని ఆ స్వరం పలికింది. ఫ్రాన్సిస్‌ తిరిగి అస్సీసికి వచ్చాడు. అప్పటినుండి ఫ్రాన్సిస్‌ సువార్త ధ్యానం మొదలుపెట్టాడు. ధనాన్ని పేదలకు దానం చేసాడు. రోము నగరములోని పునీత పేతురు సమాధిని సందర్శించి తననుతాను దేవునికి అంకితం చేసుకున్నాడు. పేదలకురోగులకుముఖ్యంగా కుష్ఠరోగులకు సేవలు చేసాడు.

ఫ్రాన్సిస్‌ దైవచిత్తాన్ని అన్వేషించడంలో పొందిన ఆనందం వర్ణణాతీతం. యుక్తవయస్సులో, చిలిపిగా, విచ్చలవిడిగా జీవించినప్పటికినిమార్పుమారుమనస్సు అతని జీవితాన్ని ఆవహించాయి. ఏకాంత ప్రదేశాల్లో దేవుని వాక్యం, ప్రేమపై ధ్యానించాడు, ప్రార్ధించాడు. ‘దమియాను’ దేవాలయంలో సిలువపై వ్రేలాడు క్రీస్తు ఫ్రాన్సిస్‌ హృదిని, మదిని తొలిచింది. ఫ్రాన్సిస్‌ దైవపిలుపును అర్ధం చేసుకున్నది ఆ సిలువనుండియే! అర్ధం చేసుకున్నది వెంటనే ఆచరణలో పెట్టాడు. ఇలా దైవచిత్తాన్ని అన్వేషించాడు.

తన జీవితాన్ని చూసి కొందమంది ఆయన సహోదరులుగా, అనుచరులుగా చేరారు. 1209లో 3వ ఇన్నోసెంట్‌ పోపుగారు ఈ చిన్న సమూహమును దీవించి, ఫ్రాన్సిస్‌ను డీకన్‌గా అభిషేకించి, ఆత్మల రక్షణార్ధం, ప్రాయశ్చిత్తాన్ని బోధించేందుకు, భిక్షమెత్తుకొని దైవసేవ చేయుటకు అనుమతినిచ్చారు. 1219 నాటికే ఫ్రాన్సిస్‌ సోదర బృందం ఐదువేలకు పెరిగింది. ఫ్రాన్సిస్‌ స్థాపించిన సభ ఎంతగానో అభివృద్ధి చెంది, నేడు ప్రపంచమంతట సేవలను అందిస్తున్నది.

“యేసు సిలువ లోకానికి, మానవ చరిత్రకు కేంద్రం. ఒకవైపు సిలువ మానవ క్రూరత్వానికి సంకేతం. గందరగోళ పరిస్థితిలో జీవనదాతనే మనిషి సిలువ వేసాడు. మరోవైపు సిలువ, ఏ హింస, తిరస్కరణ ఆపలేని దేవుని స్వేచ్చకు, అనంత ప్రేమకు సంకేతం. ఫ్రాన్సిస్ తన జీవితములో దైవప్రేమను అనుభవించాడు. దాని సాక్ష్యమే అతను పొందిన పంచగాయాలు. ఈవిధముగా, దైవప్రేమకు, స్వేచ్చకు ఫ్రాన్సిస్ మరో సంకేతముగా, రుజువుగా, జ్ఞాపికగా మారాడు.
క్రీస్తు పంచగాయాలు – నూతన జీవితం
స్వస్థత: యేసు గాయాలు మనకు స్వస్థతను చేకూర్చును. మన గతాన్ని, ప్రస్తుతాన్ని, భవిష్యత్తును నయం చేస్తాయి. క్రీస్తు పంచగాయాలు మన బలానికి, విశ్వాసానికి మూలం. శాంతిని పొందుటలో మనక తోడ్పడగలవు. యెషయ 53:5 (చదువుము).
దేవుని బహిర్గత: యేసు గాయాలు దేవుని శక్తిని, ప్రేమను, దయను వెల్లడి చేస్తాయి. మనము, శ్రమల నొందునపుడు, యేసు తన గాయాలను తాకమని, దేవుని శక్తిని అనుభవించమని మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు.
విశ్వాసం: మన గాయాలు, యేసు గాయాలను తాకినప్పుడు లేదా కలిసినప్పుడు, మనలో నూతన విశ్వాసం జనిస్తుంది.
దివ్యసంస్కారాలు: శ్రీసభ దివ్యసంస్కారాలు, గాయపడిన క్రీస్తు ప్రక్కనుండి ప్రవహిస్తాయి. క్రీస్తు ప్రక్కనుండి నీరు, రక్తము ప్రవహించాయి. జీవదాయక కృప: క్రీస్తు గాయాలు, జీవదాయకమైన కృపను ఒసగును.

వరప్రసాదముల మాత మహోత్సవము

వరప్రసాదముల మాత మహోత్సవము

దేవదూత లోపలి వచ్చి, కన్యక మరియమ్మతో, “అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు” అనెను (లూకా 1:28).
దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మా, వందనము!
వరప్రసాదముల మాత పేరిట శ్రీసభలో ఎన్నో దేవాలయాలు వెలిసాయి. ఈ దేవాలయాల ద్వారా స్థానిక శ్రీసభ మరియతల్లి ద్వారా పొందిన మేలులకు కృతజ్ఞతలు తెలియ జేస్తారు. మరియద్వారా వరప్రసాదమైన క్రీస్తును మనం పొందుకొనుచున్నాము. ముందుగా మరియమ్మను వరప్రసాదముల మాత అని ఎందుకు పిలుస్తున్నాము అంటే, పునీత పౌలుగారు చెప్పినట్లుగా, “సర్వమానవాళి రక్షణకై ‘దేవుని కృప’గా ప్రత్యక్ష మయ్యెను” (తీతు 2:11). ఆ దేవుని కృప ఎవరో కాదు, సత్యము, జీవము, మార్గము అయిన యేసుక్రీస్తు ప్రభువే. మరియ ఆ ‘దేవుని కృపకు’ తల్లి. అందుకే ఆమె క్రుపానుగ్రహ మాత లేదా వరప్రసాదాల మాత. ఈవిధముగా, దేవుడు వాగ్ధానము చేసిన కృప యేసుక్రీస్తు. ఆ దేవుని కృపకు మానవ శరీరాన్ని ఒసగిన మాతృమూర్తి కనుక, మరియ ‘దైవకృప’కు తల్లి అని ఖచ్చితముగా చెప్పగలము. యోహాను సువార్తీకుడు కూడా క్లుప్తముగా “క్రీస్తు కృపాసత్యములతో నిండెను” అని సూచించాడు (1:14). యేసుక్రీస్తు “దేవునికృపకు” పాత్రురాలుగా ఉండుటకు, ఆమెను “అనుగ్రహ పరిపూర్ణురాలుగా” (లూకా 1:28) చేసాడు దేవుడు. కనుక, “దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము” అని ప్రార్ధించి నపుడెల్ల, దేవుని పరిపూర్ణ జీవితమును మరియ కలిగియున్నదని చెబుతున్నాము.

దేవదూత లోపలి వచ్చి, కన్యక మరియమ్మతో, “అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు” అనెను (లూకా 1:28): దేవుని సందేశమును, చిత్తమును, ప్రణాళికను తెలియజేయువారు దేవదూతలు. దేవుని సందేశానికి స్పందించాలని, సమాధాన మివ్వాలని ఆహ్వానిస్తారు. దేవుని సందేశానికి స్పందించడం చాలా ప్రధానం. పిలుపునిచ్చిన దేవునికి సమాధాన మివ్వడం అతిప్రాముఖ్యము. మత్త 1:18-25లో ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, దేవుని ఆజ్ఞను తెలియజేయగా, యోసేపు అటులే చేసాడు. లూకా 1:5-25లో జెకర్యాకు దేవదూత ప్రత్యక్షమై, దేవుని సందేశమును తెలియ జేసెను. జెకర్యా ఆరంభములో స్పందించక పోయినను, నెమ్మదిగా దేవుని చిత్తమును గ్రహించి అటులనే చేసాడు. అలాగే, లూకా 1:26-38లో గబ్రియేలు దేవదూత కన్యక మరియమ్మ దగ్గరకు పంపబడెను. ఆ వృత్తాంతాన్ని ధ్యానిస్తూ, మరియ ఎలా వరప్రసాదముల మాత అయినదో తెలుసుకుందాం!

మరియ “అనుగ్రహ పరిపూర్ణురాలు” అని బైబులు గ్రంథం చెబుతుంది (లూకా 1:28). మరియను మాత్రమే ఇలా పిలువబడి యుండటం చూస్తాము. ఇది దేవుని కుమారునికి తల్లిగా ఆమె ఎన్నికను సూచిస్తుంది. అలాగే, మరియకు “దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును ఒసగినట్లు” (ఎఫెసీ 1:3) సూచిస్తుంది. “అనుగ్రహ పరిపూర్ణురాలు” అనగా మరియ దేవుని జీవముతో, సాన్నిధ్యముతో నింపబడినది అని అర్ధం. దేవుని సాన్నిధ్యముతో పరిపూర్ణముగా నిండియున్నది కనుక, ఆమెలో పాపమునకు ఎలాంటి చోటు లేదు. ఆమె నిష్కళంక మాత. అదియే కృపావరం, వరప్రసాదము. మరియమ్మ వరప్రసాదముల మాత, ఎందుకన “కృపాసత్యములు యేసుక్రీస్తు ద్వారా వచ్చినవి” (యోహాను 1:17). యేసుక్రీస్తు మన యొద్దకు వచ్చును; ఆ కృపానుగ్రహం (యేసుక్రీస్తు) మరియమ్మ ద్వారామన యొద్దకు వచ్చును. అందుకే ఆమె వరప్రసాదముల మాత, అమ్మ! వరప్రసాదముల మాతగా మరియమ్మను ధ్యానించినపుడు, ఆమె మనకు ఆ దేవుని కృపను గురించి, ప్రాముఖ్యత గురించి మనకు బోధిస్తుంది.

వరప్రసాదము అనగా ఏమి?
కృపావరం, వరప్రసాదము అనగా “దేవుని బిడ్డలమగుటకు, దత్తపుత్రులమగుటకు, దేవుని స్వభావములో, శాశ్వత జీవనములో భాగస్వాములమగుటకు పిలుపునిచ్చిన దేవునికి సమాధాన మివ్వటానికి ఆయన అందించే వరప్రసాదం, ఉచితార్ధం, అర్హతకు తగని సహాయమే కృపావరం (grace) అని, దేవుని జీవనములో పాలుపంచుకోవటమే కృపావరం అని సత్యోపదేశం (నం. 1996, 1997) బోధిస్తుంది. దైవకుమారుడు, లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తుకు తల్లి కావడానికి “ఆ పాత్రకు తగిన వరాలతో” దేవుడు ఆమెను దీవించాడు (సత్యోపదేశం, 490). మరియమ్మ దేవునితో లోతైన, స్థిరమైన, అతిసన్నిహిత సంబంధములో జీవించినది. దేవుని చిత్తానికి స్పందించక పూర్వమే దేవుడు ఆమెతో ఉన్నాడు – “ఏలినవారు నీతో ఉన్నారు” (లూకా 1:28) అని గాబ్రియేలు దూత పలికింది. మరియమ్మ దేవున్ని ఎన్నుకొనక మునుపే, దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు అని అర్ధమగు చున్నది.

మనమే దేవున్ని ఎన్నుకున్నామని కొన్నిసార్లు తప్పుగా భావిస్తూ ఉంటాము. ఈ విషయాన్ని యేసుక్రీస్తు యోహాను 15:16లో తన శిష్యులకు స్పష్టం చేసియున్నారు, “మీరు నన్ను ఎన్నుకొనలేదు. కాని, నేను మిమ్ము ఎన్నుకొంటిని”. కనుక, మనం దేవుని అనుగ్రహముచేత నింపబడి, నడిపింప బడుచున్నాము. దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటారు. మనమే ఆయనతో ఉండటము లేదు. తన ప్రేమచేత (యోహాను 3:16) దేవుడే మన చెంతకు వస్తారు, మనలను చేరదీస్తారు. ప్రభువే తన అనుగ్రహాన్ని మనకు దయచేస్తారు. మనము కేవలము ఆ దైవానుగ్రహాన్ని, కృపానుగ్రహాన్ని స్వీకరించు వారము మాత్రమే. ఆ కృపయే, మన మాటలో, చేతలో దేవునికి ప్రతిస్పందించడానికి, సమాధాన మివ్వటానికి, ‘అవును’ అని చెప్పటానికి కదిలిస్తుంది. దేవుడు “ఇమ్మానుయేలు” మనతో ఉన్నాడు. దేవుడు తన ప్రేమానుగ్రహములకు స్పందిస్తూ మన సమాధానం కొరకు ఎదురుచూచు చున్నాడు.

దేవుని కృపకు, అనుగ్రహమునకు సమాధాన మివ్వడములో, మనం మరియమ్మనుండి ఎంతో నేర్చుకోవచ్చు. గబ్రియేలు దూతతో మరియమ్మ అనుభవం మన అనుదిన జీవితములో ఎన్నో పాటాలను నేర్పుతుంది. మన జీవితములో కూడా దేవదూతలను గుర్తించడానికి, ఎలా ప్రతిస్పందించాలో నేర్చుకోవడములో మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దేవుని అనుగ్రహాన్ని విశ్వసించువారికి నేటికీ దేవదూతలు ప్రత్యక్ష మవుతారు, కనిపిస్తారు, దేవునిచేత పంపబడతారు. అయితే, దానికొరకై మనం ఆధ్యాత్మిక కన్నులను తెరవాలి. దేవుని మంచితనము వలన, మరియతల్లి దేవుని కృపతో సహకారము వలన, మనము కూడా దేవుని కృపతో జీవించ గలుగుచున్నాము. మనం ఎల్లప్పుడు దేవుని కృపతో సహకరించాలి. పాపమును, సాతానును, దాని దుష్క్రియలను త్యజించాలి. పవిత్రముగా జీవించాలి. ఏడు దివ్యసంస్కారములు కూడాను ముఖ్యముగా జ్ఞానస్నానము, దివ్యసత్ప్రసాదము, పాపసంకీర్తనములు మనకు దేవుని కృపను ఒసగు మార్గాలు.

లూకా 1:26లో “తదుపరి ఆరవమాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలీయసీమయందలి నజరేతు నగరమునకు పంపెను” అని చూస్తున్నాము. దేవదూతల ప్రత్యక్షత ఒక నిర్దిష్ట సమయములో జరుగునని లేదా దేవుడు నిర్ణయించిన సమయములో జరుగునని స్పష్టమగు చున్నది. మన స్వంత జీవితాలలో కూడా దేవుడు జోక్యం చేసుకోవడానికి తాను ఎంచుకున్న నిర్దిష్ట సమయములో తన దేవదూతలను పంపుతారు. అలాగే, లూకా 1:27లో “ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను” అని చదువుచున్నాము. అనగా ఒక నిర్దిష్టమైన వ్యక్తి (మరియ) దగ్గరకు పంపబడెను. ఆ వ్యక్తి రోజువారి జీవితములోని వాస్తవ పరిస్థితులలో, మానవ సంబంధాల మధ్యన పంపబడెను. దూతలు దేవుని సందేశాన్ని కలిగి ఒక నిర్దిష్ట సమయములో, ఒక నిర్దిష్ట పరిస్థితి అవసరతలో పంపబడతారు. “అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు” (లూకా 1:28) అను దేవదూత శుభవచనము, దేవునితో సంబంధములోనికి ఆహ్వానిస్తున్నట్లుగా యున్నది. దూత పలుకులు చాలా నిర్దిష్టముగా ఉన్నాయి. మరియమ్మను ఆమె హీబ్రూ పేరుతో సంబోధించడం చూస్తున్నాము. అనగా దేవదూత పంపబడక మునుపే దేవునకు మరియమ్మ వ్యక్తిగతముగా తెలుసు మరియు ఆమెతో సత్సంబంధాన్ని కలిగియున్నాడని అని అర్ధం. అలాగే మనతో కూడా దేవుడు ప్రవర్తించును. గొప్ప హీబ్రూ కీర్తన కారుడు దావీదు పాడినట్లుగా:
“నాలోని ప్రతి అణువునునీవే సృజించితివి. మాతృగర్భమున నన్ను రూపొంచించితివి.
నీవు నన్ను అద్భుతముగ కలుగజేసిన భీకరుడవు. కనుక నేను నీకు వందనములు అర్పింతును.
నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి. ఈ అంశము నాకు బాగుగా తెలియును.
నేను రహస్య స్థలమున రూపము తాల్చినపుడు, మాతృగర్భమున విచిత్రముగా నిర్మితుడనైనపుడు
నీ కంటికి మరుగై యుండలేదు.
నేను పిండముగా నున్నపుడే నీవు నన్ను చూచితివి. నాకు నిర్ణయింప బడిన రోజులన్నియు
అవి ఇంకను ప్రారంభము కాకమునుపే, నీ గ్రంథమున లిఖింపబడి యున్నవి” (కీర్తన 139:13-16).

మరియమ్మను “అనుగ్రహ పరిపూర్ణురాలు” అని దేవదూత సూచించినది. ఆమె నిజముగానే దేవుని అనుగ్రహాన్ని పరిపూర్ణముగా పొందినది. పరలోక భూలోకముల ప్రభువు ఆమెను సారవంతమైన నేలగా సిద్ధంచేసి, ఎంచుకొని, తన వాక్యమగు విత్తనాన్ని నాటాడు. ప్రభువు మాటలకు, చిత్తానికి, ప్రణాళికకు ప్రతిస్పందించినపుడు, సమాధానం ఇచ్చినపుడు, మనము కూడా దేవుని అనుగ్రహముచేత నింపబడతాము. మన మనస్సులు పవిత్రముగా యున్నచో, యేసుక్రీస్తు మనలో కూడా జన్మిస్తాడు. ఆధ్యాత్మికముగా ఆయన మనలో వసిస్తాడు. బైబులులో మరియమ్మ గురించి చాలా తక్కువగా చెప్పబడింది. ఎందుకనగా, ఆమె తనకన్నా గొప్పవాడైన ప్రభువు యొక్క అద్దము, ప్రతిబింబము మాత్రమే కనుక! దేవుని అనుగ్రహముతో ఆమె నింపడినది. “ప్రభువు దాసురాలు” (లూకా 1:38) అయినది. పవిత్ర హృదయాలు కలిగిన సాధారణ ప్రజలను దేవుడు నూతన జీవితముతో నింపుతాడు. వారు దేవున్ని కలుసుకున్నప్పుడు, మరియమ్మవలె వారు దేవుని దయతో నింపబడతారు.

నజరేతు వాసియైన మరియమ్మ జీవిత సాక్ష్యముద్వారా పరమరహస్యము సులభతరం చేయబడింది. ఆమె ఫలభరితమైన జీవితాన్ని జీవించినది. పసిబిడ్డ అమాయకత్వము, మనస్తత్వముతోను జీవించినది. అందుకే ప్రభువు ఇలా అన్నారు, “ఓ తండ్రీ! పరలోక భూలోకములకు అధిపతీ! ఈ విషయములను నీవు జ్ఞానులకును, వివేకులకును మరుగుపరచి, పసిబిడ్డలకు వీనిని తెలియపరచినందులకు నీకు ధన్యవాదములు. ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము” (లూకా 10:21).

మరియమ్మ మనకు ఆదర్శమూర్తి: మరియమ్మ మనకు మార్గచూపరి. ఆమె దేవుని వాగ్దానాన్ని ఆలకించినది, విశ్వసించినది, అనుగ్రహముతో నింపబడినది, ప్రేమ స్వరూపుడైన దేవున్ని గర్భమున దాల్చినది. మనము కూడా ప్రార్ధన చేసినచో, దేవుని వాక్యాని, చిత్తాన్ని ఆలకించినచో, దేవునికి ‘అవును’ అని సమాధానం ఇచ్చినచో, మనముకూడా మరియమ్మవలె జీవించగలము. అలా చేసినప్పుడు, ‘దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు’ (లూకా 1:37) అని మరియమ్మవలె గుర్తించ గలము. మనము దేవుని అనుగ్రహముతో నింపబడి, యేసుక్రీస్తును ఇంకా అవసతలోనున్న ఈ లోకములోనికి, మరియమ్మవలె తీసుకొని రాగలము.

వరప్రసాదముల మాత చిత్ర పటము – చరిత్ర
శ్రీసభ ఆరంభము నుండి కూడా అద్భుత వరములు కలిగిన మరియమ్మ చిత్ర పటాలు, స్వరూపాలు ఉన్నాయి. సాంప్రదాయం ప్రకారం, మొట్టమొదటిగా మరియమ్మ పటాన్ని గీసినది సువార్తీకుడు పునీత లూకాగారు. అనాధి కాలము నుండి కూడా కన్యమరియమ్మ చిత్రాలను, స్వరూపాలను ప్రపంచ వ్యాప్తముగా ఎంతోమంది చేత పెయింటింగ్ చేయబడ్డాయి, రూపొందించ బడ్డాయి. వీటిలో కొన్ని, అద్భుత మధ్యస్థ వేడుదల ద్వారా ఎంతగానో ప్రసిద్ధి గాంచాయి. ఆలాంటి వాటిలో ‘వరప్రసాదముల మాత’ (అవర్ లేడి అఫ్ గ్రేస్) చిత్ర పటము ఒకటి. దీనిని ‘అవర్ లేడి అఫ్ బౌవ్డ్ హెడ్’ అని కూడా పిలుస్తారు. ఇది ఆస్ట్రియా దేశములోని వియన్నా నగరములోని కార్మలైట్ ఆశ్రమ దేవాలయములో ఉన్నది.

ఫాదర్ దోమినిక్ అను ఒక కార్మలైట్ సన్యాసి దీనిని రోమునగరములో 1610లో కనుగొన్నాడు. అతను కార్మలైట్ మఠముగా మార్చాలనుకుంటున్న ఒక పాడుబడిన ఇంటిని చూసుకుంటూ ఉన్నాడు. ఆ ఇంటిముందు నడుస్తూ ఉండగా ఒక చెత్తకుప్పలో పడియున్న మరియమ్మ చిత్ర పటము ఒకటి ఆయన కంట బడింది. ఇంత అందమైన చిత్ర పటాన్ని ఎవరు చెత్తకుప్పలో పడేసారు అని ఆశ్చర్యపోయి, బాధపడి మరియమ్మకు క్షమాపణలు చెప్పి, దానిని తీసుకెళ్ళి మఠములోని తన గదిలో పెట్టుకున్నాడు. ఒకరోజు పటముపై నున్న దుమ్మును తుడుస్తూ ఉండగా, మరియమ్మ ముఖము సజీవముగా, నవ్వుతూ కనిపించినది. ఇలా అనేకసార్లు ఫాదర్ దోమినిక్ గారికి కనిపించి, తన సందేశాలను వినిపించినది. ఉత్తరించు స్థలములోనున్న ఆత్మల కొరకు పూజా ప్రార్ధనలు పెట్టించాలని, నా బిడ్డలు రక్షణ పొందుటకు కావలసిన వరములను పొందునట్లు చేయుదునని తెలియ జేసింది. ఇంకా, నా సంరక్షణను కోరువారి, భక్తితో ఈ పటాన్ని గౌరవించేవారి ప్రార్ధనలకు సమాధానం, అనేక వరప్రసాదములను పొందుదురని, ముఖ్యముగా ఉత్తరించు స్థలములోనున్న ఆత్మల విడుదల కొరకు ప్రార్ధించే వారి విన్నపాలకు ప్రత్యేక శ్రద్ధను చూపుతానని తెలియ జేసింది.

అందుకే, ఫాదర్ దోమినిక్, ఆ చిత్ర పటాన్ని రోమునగరములోని ‘సాంత మరియ అల్లా స్కాల’ (Santa Maria alla Scala in Trastevere, Rome) దేవాలయానికి అనుబంధముగా నున్న పునీత చార్లెస్ చిన్న గుడిలో ఉంచాడు. అనేకమంది ఈ చిత్రపటము ముందు ప్రార్ధన చేసారు. అది అనేక వరప్రసాదములకు మూలం అయినది. ఫాదర్ దోమినిక్ మరణించు వరకు అనగా 16 ఫిభ్రవరి 1630వ సం.రం వరకు అది అక్కడే ఉంచబడింది. ఆ తరువాత కొంతకాలము రాజుల కొలువులో ఉన్నతరువాత, కార్మలైట్ మఠవాసినుల దగ్గర ఉంచబడింది. ఆతరువాత 1655వ సం.లో తిరిగి కార్మలైట్ మఠవాసులకు అప్పజెప్పడం జరిగింది. కాలక్రమేనా, వియన్నా పట్టణములో (Silbergasse, 35) నూతన దేవాలయము, మఠము నిర్మించబడటముతో, అద్భుత శక్తిగల వరప్రసాదముల మాత చిత్రపటమును 14 డిసంబరు 1901న నూతన దేవాలయములోనికి మార్చబడినది. 27 సెప్టెంబరు 1931న వియన్నాలో 300ల శతాబ్ద వేడుకలను ఘనముగా కొనియాడారు. ఆ సందర్భముగా, 11వ భక్తినాధ జగద్గురువులు చిత్రపటానికి కిరీటాన్ని అలంకరింప జేశారు.

వరప్రసాదముల మాత మధ్యస్థ ప్రార్ధనను వేడుకొనడం అనగా, ‘దేవునికృప’ అయిన యేసుక్రీస్తు ప్రభువు మనకు అవసరమని గుర్తించడం! మరియతల్లి ద్వారా ఆ దేవుని కృప కొరకు ప్రార్ధన చేయడమే! లోకానికి వెలుగు శ్రీసభ అను చట్టములో ఈవిధముగా చదుచున్నాము, “దేవుని కృపావర శ్రేణిలో తొలి వరుసలో నిలుస్తుంది” మరియ (నం. 61). “నేటికీ ఆ దేవమాత మనలోని ప్రతి ఒక్కరికోసం ప్రార్ధిస్తూ మనకు నిత్యజీవ బహుమానాలను సంపాదించి పెడుతుంది” (నం. 62).

20వ సామాన్య ఆదివారము, Year B

20వ సామాన్య ఆదివారము, Year B
సామె. 9:1-6; ఎఫెసీ. 5:15-20; యోహాను 6:51-58

మొదటి పఠనములో విజ్ఞానమునకు సంబంధించిన లోతైన భావాన్ని గూర్చి వింటున్నాము. “విజ్ఞానమను స్త్రీమూర్తి తన భవనమును నిర్మించి, ఏడు స్తంభములు నెలకొల్పెను” (9:1). ఈ సామెత దైవీక జ్ఞానము యొక్క లోతును మరియు స్థిరత్వమును తెలియ జేయుచున్నది. దైవీక జీవితము, అర్ధవంతమైన మరియు నీతిగల జీవితానికి పునాది అని వివరిస్తున్నది. “ఏడు” అనే సంఖ్య ‘పూర్తిని’ మరియు ‘పరిపూర్ణతను’ సూచిస్తుంది. దీనిని బట్టి జ్ఞానం నశ్వరమైన ఆలోచన కాదని, మన జీవితములోని ప్రతీ అంశానికి మద్దతునిచ్చే సుస్థిరమైన, సమగ్రమైన వాస్తవికత అని ఈ సామెత తెలియజేయు చున్నది. “భవనము” అనేది ఆశ్రయం మరియు పోషణకు తావు లేదా స్థలము. నిజమైన జ్ఞానమును కోరుకునే వారందరిని లోపలకు వచ్చి నివసించుమని ఆహ్వానిస్తున్నది.
“ఆమె వేట మాంసము వండి, సుగంధ ద్రవ్యములు కలిపిన ద్రాక్షారసము సిద్ధము చేసి, భోజన పదార్దములు తయారు చేసెను” (9:2). ఈ విందు జ్ఞానము యొక్క గొప్పతనాన్ని, సమృద్ధిని తెలియజేస్తుంది. జ్ఞానం కేవలం ప్రాథమిక అవసరాలను మాత్రమే గాక, గొప్ప “విందు”ను అందజేయును. ఈ విందు ఆత్మీయ పోషణను, సమృద్ధిని సూచిస్తుంది. విజ్ఞానాన్ని ఆలింగనం జేసుకోవడం అనగా, కేవలం జ్ఞానాన్ని పొందుకోవడం మాత్రమే కాదని, జీవితాన్ని సంపూర్ణముగా ఆస్వాదించడం మరియు జీవితములో నిమగ్నమై జీవించడం అని తెలియజేస్తూ, ఈ విందులో పాల్గొనమని ఆహ్వానిస్తున్నది. “రమ్ము, నేను తయారు చేసిన భోజనము ఆరగింపుము. నేను సిద్ధము చేసిన ద్రాక్షారసము సేవింపుము” (9:5) అన్న ఈ పిలుపు, విజ్ఞానము ఒసగు జీవిత సూత్రాలను, బోధనలను అందుకోవడానికి ఆహ్వానం. ఇది లోతైన మరియు సంతృప్తికరమైన జీవన విధానాన్ని అనుభవించడానికి ఆహ్వానం. ఇచ్చట నిర్ణయాలు, చర్యలు జ్ఞానముచేత (అంత:దృష్టి, అవగాహన) మార్గనిర్దేశం చేయబడతాయి.
ఈ ఆహ్వానము యొక్క ఉద్దేశ్యం స్పష్టం చేయబడినది: “మూర్ఖత్వమును విడనాడెదవేని నీవు జీవింతువు. నీవు విజ్ఞాన పధమున నడువుము” (9:6). జ్ఞానము, మూర్ఖత్వమునకు వ్యతిరేకం. అజ్ఞానమును విడచిపెట్టి, జ్ఞానములో మునిగిపోయిన జీవితాన్ని జీవించమని మనలను ప్రోత్సహిస్తున్నది. ఆలోచనారహిత జీవితమునుండి వివివేచనతో కూడిన జీవితానికి మార్పును సూచిస్తుంది. ఇది ఆధ్యాత్మిక మరియు నైతిక జీవితానికి మార్గాన్ని సుగమము చేస్తూ జీవించడానికి ఆహ్వానం.
ఈ మొదటి పఠనమును ధ్యానిస్తూ ఉండగా, జ్ఞానం మనకొసగే సమృద్ధిని, గొప్పదనాన్ని గుర్తించుదాం. మూర్ఖత్వాన్ని విడచిపెట్టి, విజ్ఞానముతో కూడిన సుసంపన్నమైన జీవితాన్ని జీవించ ప్రయత్నం చేద్దాం. ఈవిధముగా, జ్ఞానాన్ని పొందడం మాత్రమే కాకుండా, దయ, శాంతి, అనుగ్రహములో ఎదుగుతాము. జ్ఞానమును శ్రద్ధతో వెదకుటకు, అది ఒసగు సమృద్ధిగల విందులో పాల్గొనుటకు, విజ్ఞానము ఒసగు లోతైన బోధనలకు అనుగుణముగా జీవించుటకు గల క్రుపను, శక్తిని దయచేయుమని ప్రార్దన చేద్దాం!
రెండవ పఠనములో మన క్రైస్తవ పిలుపును ప్రతిబింబించే జీవితాన్ని జీవించడానికి శాశ్వతమైన మార్గనిర్దేశకాన్ని పౌలు చేయుచున్నాడు: “మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గూర్చి శ్రద్ధ వహింపుడు. జ్ఞానహీనులవలె జీవింపకుడు. వివేకవంతులవలె జీవింపుడు. ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగము చేసికొనుడు.” (5:15). పౌలుగారి ఈ సలహా నేటికీ మనకు ఎంతగానో వర్తిస్తుంది. మన విశ్వాసానికి అనుగుణముగా తగిన నిర్ణయాలతో జ్ఞానయుక్తముగా జీవించమని ప్రోత్సహిస్తున్నాడు. ఇచ్చట జ్ఞానం అనగా క్రీస్తు బోధనలను మన అనుదిన జీవితములో అర్ధముచేసుకొని, అన్వయించుకొని జీవించడం. “చెడు దినములు” మనం ఎదుర్కుంటున్న నైతిక, ఆధ్యాత్మిక సవాళ్ళను సూచిస్తుంది. ఈ లోక ప్రలోభాలు, శోధనలు మన గమ్యమునుండి మనలను పెడత్రోవ పట్టిస్తాయి. వీటిని ఎదుర్కోవడానికి క్రీస్తు వెలుగును ప్రతిబింబించే క్రైస్తవ జీవితాలను జీవించాలని పౌలు ఆశిస్తున్నాడు. జ్ఞానమునకు వ్యతిరేకం మూర్ఖత్వము. మద్యపానం దుర్మార్గానికి దారితీస్తుంది. అది మిడిమిడి ఆనందాలకు దారితీస్తుంది. దానికి బదులుగా ఆత్మపూరితులై జీవించాలి. ఆత్మ నిజమైన ఆనందాన్ని, పరివర్తనను కలుగజేస్తుంది. ఆరాధన, కృతజ్ఞతతో కూడిన జీవితాన్ని జీవించాలి. మన మాటలు, చేతలు దేవునితో మనకున్న సంబంధాన్ని ప్రతిబింబించాలి. అలా జీవించినప్పుడు, మన ఆధ్యాత్మిక జీవితాలను, మన చుట్టూ ఉన్న వారి జీవితాలను సైతం సుసంపన్నం చేస్తూ, విశ్వాసము, ఆనందముతో కూడిన సంఘాన్ని నిర్మించగలము.
ఈ పఠనముపై ధ్యానం చేయుచుండగా, విశ్వాసములో ఎదగడానికి, తోటివారికి సేవ చేయడానికి అవకాశాలను స్వీకరించి, జ్ఞానములో జీవిస్తూ, అవకాశాలను సద్వినియోగము చేసుకోవడానికి కృషి చేద్దాం! లోకపు శోధనలను తప్పించుకొని ఆత్మలో జీవించుదాం! దేవునకు అంకితం కావింప బడిన జీవితము నుండి వచ్చే ఆనందాన్ని వెదకుదాం! తద్వార, దేవుని ప్రేమకు, దయకు ఈ లోకములో నిజమైన సాక్ష్యులుగా జీవించగలము. జ్ఞానములోను, ఆత్మలోను, సేవలోను, కృతజ్ఞతతోను జీవించడానికి కావలసిన శక్తికోసం ప్రార్ధన చేద్దాం!
సువిశేష పఠనములో “నేనే జీవాహారము” అని యేసు ప్రకటించి యున్నారు: “పరలోకము నుండి దిగివచ్చిన జీవముగల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే” (6:51). ఇది దివ్యసత్ప్రసాదాన్ని సూచిస్తుంది. అలాగే, ఈ దివ్యసంస్కారాన్ని లోతుగా అర్ధం చేసుకోవడానికి, ప్రశంసించడానికి సవాలు చేస్తుంది. “ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే” అను వాక్యం యేసు క్రీస్తు యొక్క లోతైన ప్రేమను, శ్రీసభలో “దివ్యసత్ర్పసాదము” యొక్క ప్రాముఖ్యతను వెల్లడి చేయుచున్నది. తన శరీరరక్తములనే ఒసగుట ద్వారా, ఒక నూతన ఒడంబడికను ఏర్పాటు చేయుచున్నాడు. ఇది దేవునితో సహవాసము మరియు నిత్యజీవితాన్ని వాగ్దానం చేయుచున్నది. కడరాత్రి భోజన నేపధ్యములో ఇది మరింత ప్రాముఖ్యతను సంతరించు కున్నది. తను అర్పించే బలికి జ్ఞాపకార్ధముగా దివ్యసత్ప్రసాదాన్ని స్థాపించాడు. తన శరీర రక్తములో మనం పాలుపంచుకోవాలని ఆహ్వానిస్తున్నారు.
“మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఈయగలడు?” అని యూదులు వాదించుకున్నారు. ఇది దివ్యసత్ర్పసాదము యొక్క పరమరహస్యాన్ని నొక్కి చెబుతుంది. ఇది మన తెలివి తేటలకు అందనిది. విశ్వాసముతో మరియు దేవిని విజ్ఞానముతో మాత్రమే గ్రహించగలము.
“నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువాడు నాయందును, నేను వానియందును ఉందును” (6:56). దివ్యపూజలోని లోతైన సహవాసాన్ని తెలియ జేయుచున్నది. ఇది ఒక సూచక క్రియ లేదా ప్రతీకాత్మక చర్య కాదు. నిజముగానే మనం క్రీస్తుతో సహవాసము కలిగి జీవిస్తాము. నిజముగానే మనం క్రీస్తును కలుసుకుంటాము. దివ్యసత్ర్పసాదమును స్వీకరించుట ద్వారా మనం దైవీక జీవితములో భాగస్తుల మగుచున్నాము.
అంతేకాకుండా “ఈ ఆహారమును భుజించు వాడు ఎల్లప్పుడును జీవించును” (6:58). దివ్యసత్ర్పసాదము అనేది స్వర్గపు విందును సూచిస్తుంది. దేవునితో మన అంతిమ సహవాసానికి సంకేతం. ఇది మన జీవిత ప్రయాణములో ఆధ్యాత్మిక పోషణ. మనకు బలాన్ని చేకూర్చుతుంది.
ఈ సువిశేష పఠనమును ధ్యానిస్తూ ఉండగా, భక్తితోను, కృతజ్ఞతతోను దివ్యసత్ర్పసాదమును ఆశ్రయించుదాం! ఇది దేవుని గొప్ప బహుమానము, కృపానుగ్రహము. ఇది క్రీస్తుతోను మరియు తోటివారితోను ఐఖ్యముగా జీవించమని ఆహ్వానం. విశ్వాస పరమ రహస్యాన్ని ఆలింగనం చేసుకొనుటకు, తద్వారా క్రీస్తుతో సహవాసాన్ని కలిగియుండుటకు మరియు దాని ఫలితాలను మన అనుదిన జీవితములో జీవించుటకు ఇది సవాలు!
దివ్యసత్ర్పసాద అనుగ్రహాన్ని ప్రశంసించుటకు, గౌరవించుటకు, పవిత్ర హృదయములతో స్వీకరించుటకు, తద్వారా మనం క్రీస్తుకు ప్రియ శిష్యులుగా మారే అవకాశాన్ని దయచేయమని ప్రార్ధన చేద్దాం!

బప్తిస్మ యోహాను శిరచ్చేదనము (ఆగష్టు 29)

 బప్తిస్మ యోహాను శిరచ్చేదనము (ఆగష్టు 29)

నూతన నిబంధనలో, జెకర్యా-ఎలిశబెతమ్మల కుమారుడు, యేసు బంధువుయైన బప్తిస్మ యోహాను శిరచ్చేదనము ప్రాముఖ్యమైన, కీలకమైన సంఘటన. ఇది యేసుక్రీస్తు మార్గమును సిద్ధపరచిన యోహాను వేదసాక్ష్యము. దీనిని గూర్చిన వివరణ మార్కు 6:14-29, మత్త 14:1-12లో చదవవచ్చు. యోహాను శిరచ్చేదనము గావింపబడుటకు ప్రధాన కారణాలు: హేరోదు [అంతిపాసు; హేరోదు మహారాజు కుమారుడు] తన తమ్ముడగు ఫిలిప్పు భార్య హేరోదియాను వివాహమాడినందున అతనిని యోహాను హెచ్చరించాడు (మత్త 14:3-4; మార్కు 6:17-18); హేరోదియా యోహానుపై పగపట్టి అతనిని చంపదలచెను; హేరోదియా కుమార్తె బప్తిస్మ యోహాను శిరమును పళ్ళెములో పెట్టి ఇవ్వుమని కోరెను (మత్త 14:6-11; మార్కు 6:21-28). రాజుయొక్క త్రాగుబోతు ప్రమాణం, రాణియొక్క ద్వేషం, మొహపూరిత నృత్యం కలిసి యోహాను మరణానికి దారితీసాయి.

అలాగే, యోహాను మరణం, రాజకీయ ఉద్రిక్తల నేపధ్యములో కూడా చూడాల్సి ఉంది. యోహాను ప్రవక్తయని ప్రఖ్యాతి గాంచుటచే, గలిలీయ, పెరియ ప్రాంతాలకు చతుర్దాంశాధిపతియగు [4 BC-39AD] హేరోదు ప్రజలకు భయపడెను (మత్త 14:5). యోహాను నీతిమంతుడు, పవిత్రుడు అని హేరోదు ఎరిగి’ అతనికి భయపడి అతనిని కాపాడ చూచెను. అతని హితోపదేశములకు హేరోదు కలత చెందినను వానిని ఆలకింప మనస్సు కలవాడై ఉండెను” (మార్కు 6:20). అయినను, యోహాను బోధనలను పెడచెవిన పెట్టాడు. తన అధికారానికి, పాలనకు ముప్పుగా భావించాడు. భయముతో ఏమీ చేయలేక చెరసాలలో వేయించాడు. బహుశా, మెస్సయ్య రాకను ఆశించి చాలా మంది ప్రజలు యోహానును వెంబడించారు. కాని, స్వకీర్తికోసం యోహాను ఎప్పుడు ప్రాకులాడలేదు. తప్పుడు గౌరవాన్ని ఎప్పుడూ అనుమంతించలేదు. తాను కేవలం “ప్రభువు మార్గమును సిద్ధపరచుటకు” పంపబడినాడని ఎరిగియున్నాడు. అందుకే, సమయమాసన్న మైనప్పుడు, యోహాను తన శిష్యులకు యేసును “దేవుని గొర్రెపిల్ల”యని పరిచయం చేయగా, వారు ఆయనను వెంబడించిరి (యోహాను 1:35-37).

హేరోదు క్రూరుడు, అహంకారి, గర్విష్టి. ఒకానొక సందర్భములో ప్రభువు అతనిని “నక్క”గా సంబోధించాడు (లూకా 14:32). చట్టబద్ధమైన భార్యను [ఫాసెలిస్] విడచి, సోదరుని భార్య, తనకు మేనకోడలు అయిన హేరోదియాను వివాహ మాడాడు. హేరోదియాతో సహా పలు భార్యలు, ఉంపుడు గత్తెలు ఉన్నారు. యూదుల చట్టం ప్రకారముగానే (లేవీ 18:16; 20:21) హేరోదు-హేరోదియాల వివాహమును యోహాను ఖండించాడు. “ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు” (మార్కు 6:4) అని హెచ్చరించాడు. యూదుల ప్రమాణాల ప్రకారం, వారి వివాహం వ్యభిచారము, అక్రమ సంబంధముగా పరిగణింప బడుతుంది. కుటుంబ ధర్మములను మీరినట్లు అవుతుంది. ఈవిధముగా, పాపమును, అన్యాయమును, ఇతర దుశ్చర్యలను యోహాను ధైర్యముగా ఖండించాడు. దానిపర్యవసానమే, చెరసాలలోనున్న (మృత సముద్రానికి వాయువ్యముగా, ప్రస్తుత జోర్ధాను) యోహాను శిరచ్చేదనము గావింపబడినాడు (సుమారు క్రీ.శ. 30). తన తలను పళ్ళెములో పెట్టి హేరోదియా కుమార్తెకు ఇవ్వగా, ఆ బాలిక [సలోమి] తన తల్లికి ఇచ్చెను (మత్త 14:11; మార్కు 6:28). వెంటనే యోహాను శిష్యులు వచ్చి భౌతిక దేహమును తీసికొని పోయి సమాధి చేసారు. పిమ్మట వారు యేసు యొద్దకు వెళ్లి ఆ విషయమును తెలియజేసారు (మత్త 14:12-13; మార్కు 6:29). ఈ వార్త విని యేసు నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా వెళ్ళారు (మత్త 14:13). ఆతరువాత యేసు యోహానును ప్రవక్తగా, వేదసాక్షిగా గౌరవించాడు (మత్త 11:11; లూకా 7:28).

          బప్తిస్మ యోహాను శిరచ్చేదనము సత్యమునకు సాక్ష్యముగా నున్నది. అతని మరణం తన అచంచలమైన విశ్వాసము కొరకు అంతిమ త్యాగబలిగా సూచిస్తుంది. దేవుని చిత్తము పట్ల తనకున్న నిబద్ధతకు గొప్ప నిదర్శనం. తాను పలికిన “ఆయన హెచ్చింప బడవలెను. నేను తగ్గింప బడవలెను” (యోహాను 3:30) అన్న ప్రవచనం నెరవేరినది. యోహాను మొదటి నుండి కూడా యేసు జీవితానికి ప్రతిబింబముగా నున్నాడు (మార్కు 1:2-14). అతని శిరచ్చేదనము యేసు జీవితానికి శ్రమలకు సూచనగా యున్నది. యోహాను మరణం, యేసు మరణ పునరుత్థానములను సూచిస్తుంది.

          తనకు అప్పగింప బడిన ప్రేషిత కార్యమును, దైవచిత్తమును వెనుకంజ వేయక, నిస్వార్ధముగా చివరి వరకు, మరణానికి సైతం భయపడక సంపూర్ణముగా నెరవేర్చాడు. దేవుని ఆజ్ఞల పట్ల అతనికున్న విశ్వసనీయత అమోఘం! వేదసాక్షి మరణం, శిష్యులకు, విశ్వాసులకు ఏ సమయములోనైనా సంభవించ వచ్చును. బప్తిస్మ యోహాను శిరచ్చేదనము క్రైస్తవ జీవితం, ప్రేషిత కార్యం, దానిలో భాగముగా పొందవలసిన, శ్రమలకు దర్పణముగాను, ఆదర్శముగాను ఉంటుంది. అలాగే, యోహాను మరణం నిజమైన శిష్యరికానికి, దాని స్వభావానికి నిదర్శనం.

          యోహాను ప్రధానముగా “హృదయ పరివర్తనము అనెడు బప్తిస్మము పొందవలెనని” ప్రకటించాడు (మార్కు 1:4). అనగా దేవుని మార్గాలను పాటించాలని ధైర్యముగా బోధించాడు. నిజమైన పశ్చాత్తాపమనగా శిష్యుడు ఉత్థాన క్రీస్తు స్వభావాన్ని ధరించడం. యోహాను బోధించడం మాత్రమేగాక, తన జీవితాదర్శముద్వారా నిరూపించాడు. అతను ఎడారిలో ఉపవాస ప్రార్ధనలతో, సాధారణ జీవితాన్ని జీవించాడు. ఆనాటి ప్రజల అనైతిక జీవితాన్ని ఎండగట్టాడు. నేడు మనం యోహాను జీవితమునుండి అనేక విషయములను నేర్చుకొనవచ్చు. ఆయనవలె, మన చుట్టూ ఉన్నవారికి యేసు మార్గమును సిద్ధపరచవచ్చు. ఈనాటి అనైతికత, అప్రజాస్వామ్యం మొదలగు వాటి గురించి ధైర్యముగా మాట్లాడవచ్చు.

క్రీస్తు ఉత్థాన మహోత్సవము

 క్రీస్తు ఉత్థాన మహోత్సవము

క్రైస్తవ ప్రపంచమంతయు క్రీస్తు ఉత్థానమును గొప్ప మహోత్సవముగా కొనియాడుచున్నది. క్రీస్తు ఉత్థానం సంతోషకరమైన, విజయకరమైన పండుగ. ఇది ఒక నిరీక్షణ పండుగ! ఈరోజు యేసుక్రీస్తు మరణమునుండి ఉత్థానమవుటను కొనియాడుచున్నాము. ఇది విశ్వాసులందరికి ఒక గొప్ప ఆశను, వారి  హృదయాలలో నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది.
క్రీస్తు ఉత్థానం, తిరుసభలో నాలుగు కారణాల చేత అతి గొప్పది, అతి ప్రాముఖ్యమైనది.
1. క్రీస్తు ఉత్థానం, మన విశ్వాసానికి మూలాధారము. అద్భుతాలలోకెల్ల ఉత్థానం మహాద్భుతం, ఎందుకంటే, ఉత్థానం క్రీస్తు దేవుడని మనకు నిరూపిస్తున్నది. అందుకే పౌలు అంటాడు, “క్రీస్తు లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్ధమే, మీ విశ్వాసమును వ్యర్ధమే” (1 కొరి 15:14). “యేసు ప్రభువు” అని, “దేవుడు ఆయనను లేవనెత్తెను” అని రోమీ 10:9 లో చదువుచున్నాము. అపోస్తలుల యొక్క బోధనా సారాంశం: క్రీస్తు ఉత్థానం.
2. క్రీస్తు ఉత్థానం మన పునరుత్థానానికి హామీని ఇస్తుంది. లాజరు సమాధివద్ద మార్తమ్మతో యేసు వాగ్దానం చేసాడు, “నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికిని మరణింపడు” (యోహాను 11:25-26).
3. క్రీస్తు ఉత్థానం నిరీక్షణ పండుగ. ఈ లోకపు బాధలలో, దుఃఖాలలో, కన్నీళ్ళలో క్రీస్తు ఉత్థానం మనకు ఆశను, నిరీక్షణను, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ జీవితం విలువైనదని మనకు గుర్తుకు చేయుచున్నది. శోధనలకు, అనవసరమైన భయాందోళనలకు వ్యతిరేకముగా పోరాడే శక్తిని మనకు క్రీస్తు ఉత్థానం ఇస్తుంది.
4. మనం చేసే వ్యక్తిగత మరియు సంఘ ప్రార్ధనలకు క్రీస్తు ఉత్థానం అర్ధాన్నిస్తుంది. ఉత్థాన క్రీస్తు నిజముగా మన మధ్యన, మనచుట్టూ, శ్రీసభలో, దివ్యసంస్కారములో, పరలోకములో ఉన్నాడు అన్న మన విశ్వాసాన్ని బలపరుస్తుంది.
క్రీస్తు ఉత్థానమును మనం ఎందుకు విశ్వసిస్తున్నాము?
1. స్వయముగా క్రీస్తే తన ఉత్థానము గురించి, తన దైవత్వానికి సూచనగా సాక్ష్యమిచ్చాడు: (చదువుము మార్కు 8:31; మత్త 17;22-23; లూకా 9:22). యోహాను 2:19, “ఈ ఆలయమును మీరు పడగొట్టుడు. నేను దీనిని మూడు రోజులలో లేపుదును”.
2. ఈస్టర్ ఆదివారమున “ఖాళీ సమాధి కనుబడుట” (లూకా 24:3). సైనికులు అబద్ధసాక్ష్యము చెప్పినను (మత్త 28:13), అపోస్తలులు దొంగిలించారని చెప్పినను, అది అసాధ్యమని యూద పెద్దలకు బాగా తెలుసు.
3. ఉత్థాన క్రీస్తు దర్శనాలు. ఆరంభములో శిష్యులు, విశ్వాసులు అవిశ్వాసమును కలిగి యున్నను, ఉత్థాన క్రీస్తు దర్శనాల వలన, వారిలో విశ్వాసం కలిగింది. ఈ దర్శనాలు క్రీస్తు ఉత్థానమునకు బలమైన ఋజువుగా ఉంటుంది.
4. యేసు శిష్యులయొక్క పరివర్తన: యేసు సిలువ మరణం తరువాత, శిష్యులు భయముతో నిస్సహాయ స్థితిలో ఉన్నారు (లూకా 24:21; యోహాను 20:19). క్రీస్తు ఉత్థానం, పవిత్రాత్మ అభిషేకం వారిలో పరివర్తన కలిగించాయి. ఇప్పుడు వారు ధైర్యముగా పునరుత్థాన క్రీస్తుకు సాక్ష్యులుగా మారారు (అ.కా. 2:24; 3:15; 4:2). పునరుత్థాన క్రీస్తు గురించి శక్తివంతముగా భోధించారు.
5. యూదులుగాని, రోమనులు గాని, క్రీస్తు పునరుత్థానానికి వ్యతిరేకముగా ఏవిధముగాను నిరూపించలేక పోయారు. యేసు మృత దేహాన్ని చూపించలేక పోయారు.
6. క్రీస్తు ఉత్థానం కానిచో, అపోస్తలులు గాని, తొలి క్రైస్తవులుగాని అంత ధైర్యముగా బోధించేవారు కాదు, చివరికి తమ ప్రాణాలను సైతము అర్పించే సాహసం చేసియుండేవారు కాదేమో!
7. అపోస్తలుడు పౌలు పరివర్తన, హింసించే సౌలునుండి ఉత్థాన క్రీస్తుకొరకు ఉత్సాహపూరిత బోధకుడిగా మారడం, క్రీస్తు ఉత్థాన సత్యాన్ని బలపరుస్తుంది (గలతీ 1:11-17; అ.కా. 9:1, 24-25; 26:15-18).
8. మొదటి మూడు శతాబ్దాలు, క్రీస్తు కొరకు వేద హింసలను ధైర్యముగా ఎదుర్కొని నిలబడింది, జీవించ గలిగింది తొలి శ్రీసభ. ఇది నిజముగా క్రీస్తు ఉత్థానాన్ని సమర్ధిస్తుంది.
పాస్క పరమ రహస్యం - యేసు ఉత్థానం
"ఆయన పునరుత్థానుడయ్యెను"  - మార్కు 16:6; “నజరేయుడగు యేసు పునరుత్థానుడయ్యెను! మీరు వెళ్లి పేతురునకు, తక్కిన శిష్యులకు చెప్పుడు!” (మార్కు 16:1-7). ఆదివార వేకువజామున, యేసు సమాధి యొద్దకు వెళ్ళిన స్త్రీలతో [మగ్ధలా మరియమ్మ, యాకోబు తల్లి మరియమ్మ, సలోమియమ్మ] తెల్లని వస్త్రములు ధరించి సమాధి కుడిప్రక్కన కూర్చుండి యున్న ఒక యువకుడు [దేవదూత - మత్త 28:5; ఇరువురు పురుషులు లూకా 24:4] ఈ మాటలను చెప్పెను. ఇదొక శుభ సమాచారము! సంతోషకరమైన వార్త! స్త్రీలు ఆ శుభవార్తను పేతురునకు, ఆయన సోదరులకు చెప్పారు. ఆ తరువాత, ఈ శుభవార్తను, పేతురు లోకమంతటికి తెలియజేసాడు. 
50 రోజుల తరువాత, పేతురు ఈ శుభసమాచారాన్ని "యూదయా జనులకు, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులకు", (అ.కా. 2:14), లోకమంతటికి చాటి చెప్పాడు: "నజరేయుడైన యేసును... దేవుడు సమాధి నుండి లేపెను. జరిగిన ఈ విషయమునకు, మేము అందరము సాక్షులము" (అ.కా. 2:22, 32).
యేసు ఉత్థానం గురించి చాటిచెప్పాలంటే, దైవానుగ్రహం ఉండాలి: "పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు 'యేసే ప్రభువు' అని అంగీకరింప జాలడు" (1 కొరి 12:3). యేసు ఉత్థానం గురించి ప్రకటించాలంటేవినయం, దైవభీతి ఉండాలి. క్రీస్తు ఉత్థానం గురించి మనమందరం భయపడక, ధైర్యముగా ప్రకటించాలి: "విలపింపకుము. చూడుము! యూదాజాతి సింహము, దావీదు సంతతిలో శ్రేష్టుడు, గెలుపొందినాడు" (దర్శన 5:5). యేసు పునరుత్థానం గురించి చెప్పుటకు, మనకు మాటలు చాలవు! సిలువ ప్రబోధము నుండి, ఉత్థాన ప్రబోధం చేయడమంటే, ఎండిన నేలనుండి, సముద్ర తీరమునకు పరుగులు తీయడం లాంటిది! "మగ్ధలా మరియమ్మ సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరియొక శిష్యుని యొద్దకు పరుగెత్తుకొని పోయి" (యోహాను 20:2), ఖాళీ సమాధి గురించి చెప్పగా, "పేతురు, ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరుగెత్తు చుండిరి" (యోహాను 20:3).
యేసు ఉత్థాన అనుభూతిని పొందిన మనం, కీర్తనకారునితో కలిసి, "నా ఆత్మమా! మేలుకొనుము! వీణ తంత్రీ వాద్యము మేల్కొనును గాక! నేను ఉషస్సును మేలుకొల్పెదను" (కీర్త 57:8) అని ఎలుగెత్తి పాడాలి. "భూమి కంపించినను, పర్వతములు సాగర గర్భమున కూలినను, సాగర జలములు రేగి ఘోషించి నురగలు క్రక్కినను, సముద్ర జలములు పొంగి కొండలు చలించినను మనము భయపడ నక్కరలేదు. రండు, ప్రభువు కృత్యములను కనుడు. భూమి మీద ఆయన చేసిన మహాకార్యములను వీక్షింపుడు" (కీర్త 46:2-3, 8). దేవుడు చేసిన "మహాకార్యములు" అన్నియు, క్రీస్తు ఉత్థానములో పరిపూర్తి అయ్యాయి. అందుకే పౌలు అంటాడు, “క్రీస్తు లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్ధమే, మీ విశ్వాసమును వ్యర్ధమే” (1 కొరి 15:14). ఉత్థాన క్రీస్తు, తలుపులు మూసి యున్నను, యేసు లోపలి వచ్చి శిష్యుల మధ్య నిలువ బడెను (యోహాను 20:19). మూసియున్న మన హృదయాలలోనికి, సంస్కృతిలోనికి, ఆయనను తిరస్కరించే నాస్తిక పాలనలోనికి, మూసియున్న మన స్నేహాలలోనికి, కుటుంబాలలోనికి, సంఘములోనికి... ఉత్థాన క్రీస్తు రావాలి. ఏదీకూడా మృత్యుంజయుడైన యేసును ప్రతిఘటించలేదు; మూసియున్న తలుపులున్నను, గోడల ఆవలినుండి ఆయన ప్రవేశించును. క్రీస్తు ఉత్థానం యుగాంతముల వరకు, ఆయన మరల తిరిగి వచ్చువరకు కొనసాగుతుంది. “ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము. నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము" అని ప్రతీ దివ్యపూజా బలిలో మనం ప్రకటించు విశ్వాస రహస్యమును ఏదియు కూడా ఆపలేదు.
క్రీస్తు ఉత్థానం - పాస్క పరమ రహస్యము
క్రీస్తు ఉత్థానం చారత్రక సంఘటన. ఇదొక అపూర్వమైన, పునరావృతం కాని సంఘటన. ఈ అద్భుతమైన సంఘటనను, ప్రతీరోజు దివ్యసంస్కారమైన దివ్యపూజాబలిలో జ్ఞాపకార్ధముగా కొనియాడుచున్నాము. క్రీస్తు ఉత్థానం క్రైస్తవుల విశ్వాసము. క్రీస్తు శ్రమలు, ఉత్థానం పాస్క పరమ రహస్యమును ఏర్పరచు చున్నాయి. అయితే, రెండు వేరువేరు సంఘటనలు కాదు. ఒకే సంఘటన - మరణమునుండి జీవమునకు.... క్రీస్తు నిజముగా ఉత్థానమైనారా? “ప్రభువు వాస్తవముగ (ontos - నిజముగానే) సజీవుడై లేచెను. “వాస్తవమును గ్రహించుటకు ఈ గ్రంథమును వ్రాయుచున్నాను" (1:4) అని లూకా సువార్తీకుడు తెలుపుచున్నారు. క్రీస్తు శ్రమలు, మరణం తరువాత, శిష్యులలోనున్న వెలుగు మాయమయింది. ఆయనను వారు దేవుని కుమారుడని విశ్వసించారు. ప్రవక్తలందరికంటే గొప్పవాడని విశ్వసించారు. కాని ఇప్పుడు వారికి ఏమి చేయాలో తోచలేదు. వారి మనసులలోని భావాలను లూకా ఇలా తెలిపాడు: "అయితే ఆయనయే యిస్రాయేలీయులను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి మూడు రోజులాయెను" (24:21). అంతా అయిపోయిందని వారు భావించారు.
పేతురు క్రీస్తు ఉత్థానం గూర్చి చెబుతూ, "విశ్వాసులకు మీకు ఈ రాయి అమూల్యమైనది. కాని అవిశ్వాసులకు ఇల్లు కట్టు వారిచే నిరాకరింప బడిన రాయియే మూలరాయి ఆయెను" (1 పేతు 2:7) అని తెలిపాడు. పేతురు పవిత్రాత్మతో పూరితుడై, "యేసు క్రీస్తునందు తప్ప వేరొకనియందు రక్షణ లభింపదు. ఏలయన, ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు” (అ.కా. 4:12) అని నాయకులకు, పెద్దలకు సమాధానమిచ్చాడు. భయముతో పారిపోయిన శిష్యులు, విశ్వాసం సన్నగిల్లిన శిష్యులు, ఆ తరువాత ధైర్యముగా "యేసు ఉత్థానమాయెను" అని ప్రకటించారు. యేసు పేరిట సంఘములను స్థాపించారు. యేసు కొరకు, హింసలను భరించుటకు, ప్రాణములను సైతము త్యాగము చేయుటకు సిద్ధపడ్డారు. 
పౌలు సాక్ష్యం
క్రీస్తు పునరుత్థానమును గూర్చిన ప్రారంభ సాక్ష్యం పునీత పౌలు 1 కొరి 15:3-8లో చూడవచ్చు:
“నేను పొందిన దానిని మీకు మొదట అందించితిని. పవిత గ్రంథమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పవిత్ర గ్రంథమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి, మూడవ దినమున సజీవముగ లేవనెత్తబడెను. ఆయన పేతురునకు తదుపరి పండ్రెండు మంది అపోస్తలులకును కనబడెను. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో ఐదు వందల మందికి పైగా కనబడెను. వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించియే ఉన్నారు. ఆపైన యాకోబునకు తదుపరి అపోస్తలుల కందరికిని ఆయన కనబడెను. ఆ కాలమందు జన్మించినట్లున్న వాడనైనను, చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను."
పౌలు ఈ వాక్యాలను క్రీ.శ. 56 లేదా 57లో వ్రాసారు. ఈ సాక్ష్యాన్ని పౌలు ఇతరులనుండి స్వీకరించాడని చెప్పాడు. బహుశా, పౌలు తన పరివర్తన తరువాత పొందినట్లయితే, ఈ సాక్ష్యాన్ని మనం క్రీ.శ. 35 నాటిదని చెప్పవచ్చు. నిజానికి చాలా ప్రాచీన సాక్ష్యము. ఈ సాక్ష్యములో ఉన్న రెండు ప్రాథమిక వాస్తవాలు: "యేసు సజీవముగ లేవనేత్తబడెను" మరియు "ఉత్థాన క్రీస్తు దర్శనమిచ్చెను."
"యేసు సజీవముగ లేవనేత్తబడెను" (గ్రీకు: egegertai) అనగా "తిరిగి జీవం పోసుకున్నారు", "మరల లేచారు", "పునరుత్థానం చెందారు", "పునర్జీవం పొందారు" అని అర్ధం. ఆయన పునర్జీవం లాజరువలె మరల మరణించుట వంటిది కాదు.
"ఉత్థాన క్రీస్తు దర్శనమిచ్చెను" (ophthe) అనగా తననుతానుగా ఇతరులకు కనిపించారు; "మేము మా కన్నులార చూచిన దానిని గూర్చి, చెవులార విన్న దానిని గూర్చి మాట్లాడకుండ ఉండలేము" (అ.కా. 4:20) అని పేతురు, యోహానులు బదులు పలికారు.
సువార్తలు - క్రీస్తు ఉత్థానం
యేసు లేవనెత్తబడెను మరియు దర్శనమిచ్చెను, అయితే సువార్తలలో 'ఖాళీ సమాధి' గురించిన అంశం జోడించబడినది. ఖాళీ సమాధిని బట్టియే, యోహాను సువార్తీకుడు యేసు ఉత్థానమునకు ప్రత్యక్ష సాక్ష్యముగా వ్యక్తపరచాడు (యోహాను 20:3f.): నార వస్త్రములు అచట పడియుండుట, తలకు కట్టిన తుండుగుడ్డ నారవస్త్రములతో పాటుకాక, విడిగ చుట్టి ఉండుట.... అలాగే, ఉత్థాన క్రీస్తు దర్శనాలు ఆయన ఉత్థానమునకు సాక్ష్యాలు.
క్రీస్తు ఉత్థానం- విశ్వాసం
క్రీస్తు ఉత్థానమును విశ్వాసముతో అర్ధము చేసుకోవాలి. చారిత్రక సంఘటనలు (ఖాళీ సమాధి) వారి విశ్వాసాన్ని బలపరచాయి, కనుక విశ్వాసం ప్రధానం. "క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్త బడెను" (1 కొరి 15:20) అని పౌలు చెప్పారు. అలాగే, "క్రీస్తే లేవనెత్త బడనిచో మా బోధన వ్యర్ధమే, మీ విశ్వాసమును వ్యర్ధమే" (1 కొరి 15:14). “మన ప్రభువగు యేసును మృతులలోనుండి లేవనెత్తిన ఆయనయందు మనకు విశ్వాసమున్నది” (రోమీ 4:24).
పెంతకోస్తు అనంతరం, పేతురు యెరూషలేము ప్రజలకు, "ఇస్రాయేలు ప్రజలారా! ఈ మాటల నాలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా, దేవుడు మీకు రూడి ఒనర్చెను... యేసును మీరు న్యాయ రహితుల చేతుల గుండా సిలువ వేయించి చంపించితిరి. కాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపేను. మేము అందరము సాక్షులము" (అ.కా. 2:22-32) అని బోధించాడు.
పౌలు ఏతెన్సులో, 'దేవుడు మృతులలో నుండి లేపుట ద్వారా ఈ విషయమును గూర్చి అందరకును దృఢపరచెను” (అ.కా. 17:31) అని ప్రచారం చేసాడు. "మృతులలోనుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయమున నీవు విశ్వసించినచో, నీవు రక్షింప బడుదువు" (రోమీ 10:9). ఉత్థానము వలన, యేసు “ప్రాణ దాతయగు ఆత్మ”గా మారెను (1 కొరి 15:45).
క్రీస్తు ఉత్థానం సంతోషకరమైన పండుగ! ఎందుకన మరణముపై క్రీస్తు విజయాన్ని కొనియాడుచున్నాము. మరణం శాశ్వత ముగింపునకుగాక, నిత్యజీవితానికి ద్వారముగా యేసు చేసియున్నారు. మరణం, మనలను సంతోషముగా తన ఒడిలోనికి ప్రేమగా స్వాగతించే మన తండ్రియైన దేవుని సాన్నిధ్యానికి ప్రవేశము. ఈస్టర్ మహోత్సవం, అంధకారములోనున్న వారికి వెలుగును, బాధలలోనున్న వారికి సంతోషమును, నిరాశలోనున్న వారికి ఆశను, సాతాను దుష్టశక్తులతో పోరాడే వారికి ధైర్యమును, బలమును ఒసగును.
జీవిత పాటాలు
1. ఉత్థాన క్రీస్తు ప్రజలుగా, విశ్వాసులుగా జీవిద్దాం. పాపము, చెడు అలవాట్లు, వ్యసనాలు, నిరాశ, నిరుత్సాహం, సందేహాలు అనే సమాధిలో మనం ఉండకూడదు, సమాధి చేయబడకూడదు. దానికి బదులుగా, ఉత్థాన క్రీస్తు యొక్క సంతోషముతో, శాంతి సమాధానాలతో జీవించాలి. మన అన్ని సమస్యలలో, ఉత్థాన ప్రభువు ఉన్నాడని గుర్తించాలి.
2. ఉత్థాన క్రీస్తు సాన్నిధ్యం, మనతో, మనలో, మనచుట్టూ ఉన్నదని విశ్వసించాలి. అది మనం మంచి, క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవించేలా మనలను బలపరుస్తుంది. ఈ విశ్వాసం మన ఆలోచనలను, కోరికలను, మాటలను, ప్రవర్తనను, క్రియలను నియంత్రించేలా చేస్తుంది.
3. మనలో ఉత్థాన ప్రభువు యొక్క సాన్నిధ్యం ఉన్నదని గుర్తించిన యెడల, మన శరీరాలను, మనస్సులను నిర్మలముగా, పవిత్రముగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాము. చెడు అలవాట్లకు, వ్యసనాలకు దూరముగా ఉంటాము. ఎదుటి వారిని గౌరవిస్తాము. వారిని ప్రేమిస్తాము. వినయపూర్వకమైన నిస్వార్ధ సేవలో జీవిస్తాము.
4. మనం పారదర్శక క్రైస్తవులుగా మారాలి. మన చుట్టూ ఉత్థాన క్రీస్తు వెలుగును ప్రసరింప జేయాలి. నిస్వార్ధమైన, త్యాగపూరితమైన ప్రేమ, దయ, కరుణ, వినయము, సేవ కలిగి జీవించాలి. క్రైస్తవ దాతృత్వం, దయ, క్షమాపణ కలిగి జీవించాలి.