తపస్కాల రెండవ ఆదివారము, ఫిబ్రవరి 28, 2021

 తపస్కాల రెండవ ఆదివారము, ఫిబ్రవరి 28, 2021 
ఆది కాండము 22:1-2, 9-13, 15-18, భక్తి కీర్తన 116: 10-18, రోమీ 8:31-34, మార్కు 9:2-10

ఓ సర్వేశ్వరా! మీ ముఖ సౌందర్యమును ఆశించుచున్నాను. మీ ముఖ అందమునే కోరుచున్నాను. కావున, మీ ముఖమును నానుండి త్రిప్పుకొనకుడు అని నా హృదయం మీతో చెప్పుచున్నది.

దైవ పిలుపు వ్యక్తిగతమైనది మరియు ఆవశ్యకమైనది. దేవునియందు విశ్వాసముతోను, సంపూర్ణ నమ్మకముతోను, ఆయన పవిత్రతలో ప్రవేశించుటకు ఆహ్వానం దైవ పిలుపు. మనతో మాట్లాడే దేవునితో మనం ఎదురు పడుతూ ఉన్నాము. ఆయనను ఆలకించి, ప్రత్యుత్తర మిచ్చుటకు మనం పిలువబడు చున్నాము. తపస్కాల రెండవ వారములోనికి ప్రవేశించిన మనం, మన ఆత్మ పరిశీలన, మార్పు, మారుమనస్సును కొనసాగిస్తూ పాస్కా ఉత్సవమును యోగ్యరీతిన కొనియాడుటకు ముందుకు సాగుదాం. మన ఆలోచనలు దేవుని ఆలోచనల వంటివి కావు. మన మార్గములు దేవుని మార్గముల వంటివి కావు. మానవ మాత్రులమైన మనం మార్పును కోరుకోము, ఇష్టపడము. మార్పును నిరోధించుటకు ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఎదేమైనప్పటికిని, మార్పు మన జీవితములో భాగము. గతములో మనం సాధించిన విజయాలపై, కార్యాలపై, ఈ రోజు ఆధార పడలేము. ఈ లోకములో మనం కేవలం ప్రయాణికులము మాత్రమే. మన ఈ ప్రయాణం నిత్య జీవనము వైపునకు, దేవునిలో సంపూర్ణ ఐక్యత వైపునకు కొనసాగు చున్నది.

అబ్రహాము విశ్వాసం - దేవుని వాగ్ధానం

మొదటి పఠనం, ఆది కాండము నుండి వినియున్నాం. దేవుడు అబ్రహామును పిలచి యున్నాడు. అబ్రహామును దేవుడు పరీక్షించాడు. తాను ఎంతగానో ప్రేమించే తన కుమారుడైన ఇసాకును బలిగా అర్పించమని దేవుడు ఆదేశించాడు. అబ్రహాము విశ్వాసము చాలా దృఢమైనది. దేవుని ఆదేశాన్ని ఎలాంటి తొట్రుపాటు లేకుండా, ఎలాంటి అనుమానము లేకుండా విధేయించుటకు నిర్ణయించి, మరునాటి వేకువజామునే, ఇసాకుతో ప్రయాణ మయ్యాడు. దేవుడు చూపించిన ప్రదేశమునకు చేరగానే, అబ్రహాము బలిపీఠమును నిర్మించి, కట్టెలు పేర్చి తన కుమారున్ని బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయముననే, దేవదూత అబ్రహామును పిలచి, ఇసాకుపై చేయి వెయ్యరాదని ఆజ్ఞాపించినది. దేవుడు అబ్రహాము విశ్వాసమును పరీక్షించాడు. తన కార్యముల ద్వారా, విధేయత ద్వారా, అబ్రహాము తన హృదయం చాలా స్వచ్చమైనదని నిరూపించాడు. అబ్రహాము తన జీవితాంతము దేవునికి విధేయుడై జీవించాడు. తన కుమారునికి బదులుగా, దేవుడు ఒసగిన పొట్టేలును బలిగా అర్పించాడు. అబ్రహాము విధేయతకు ముగ్ధుడైన దేవుడు అతనితో వాగ్దానాన్ని చేసియున్నాడు. అబ్రహాము సంతతి ఆకాశములోని నక్షత్రములవలె, సముద్ర తీరమున ఇసుక రేణువులవలె వ్యాప్తిచెందునని, అన్ని దేశములు ఆయన కుటుంబమునందు ఆశీర్వాదము పొందునని వాగ్దానము చేసియున్నాడు.

మనం ఎందుకు భయపడాలి?

రెండవ పఠనములో, పునీత పౌలుగారు ఓర్పు, సహనము కలిగి విశ్వాస పాత్రులుగా ఉండాలని చెబుతున్నాడు. ఆదిక్రైస్తవులు ఎన్నో హింసలకు గురయ్యారు. వారు తమ ప్రాణాలు కోల్పోతారని భయపడ్డారు. వారిని ఉద్దేశించి, 'దేవుడు మన వైపు ఉన్నప్పుడు మనకు ఎవరు విరుద్ధముగా ఉంటారు?' (రోమీ 8:31) అని చెప్పాడు. మనందరి కోసం దేవుడు తన ఏకైక కుమారున్ని బలిగా అర్పించాడు. తన కుమారునితో మనకి సకలాన్ని ఇస్తాడు. కనుక, మనం భయపడనవసరము లేదు.

క్రీస్తు తననుతాను, తండ్రి చిత్తాను సారముగా, తండ్రికి విధేయుడై మనందరి కోసం ఒక బలిగా మారాడు. మన పాపాలకోసం ఆయన అర్పించిన బలి మహోన్నతమైన మరియు పరిపూర్ణమైన బలి. ఆయన మనకోసం మరణించి, మృతులలోనుండి సజీవముగా లేచాడు. తండ్రి కుడిప్రక్కన కూర్చుండి, మనందరి కోసం తండ్రిని అర్ధిస్తున్నాడు. కనుక, మనం దేనికీ భయపడనవసరము లేదు. మన బాధలలో, కష్టాలలో, హింసలలో, ఓర్పు, సహనము కలిగి తండ్రి దేవున్ని విశ్వసించాలి. “క్రీస్తు ప్రేమనుండి మనల్ని ఎవరు దూరం చెయ్యగలరు? కష్టం, దు:ఖం, హింస, కరువు, దిగంబరత్వం, అపాయం, ఖడ్గం, మనల్ని దూరం చెయ్యగలవా? (రోమీ 8:35).

యేసు దివ్యరూపధారణ

సువిశేష పఠనములో, యేసు ప్రభు దివ్యరూపధారణ గూర్చి వినియున్నాం (మార్కు 9:2-10). ‘దివ్యరూపధారణ’ ముఖ్య ఉద్దేశం యేసు దైవత్వమును బహిరంగ పరచడము. ఈ సంఘటన, యేసు తన మరణాన్ని గురించి చెప్పిన తర్వాత జరిగి యున్నది. "మనుష్య కుమారుడు కష్టాలు అనుభవిస్తాడు. పెద్దలు, ప్రధానార్చకులు, శాస్త్రులు ఆయన్ని తృణీకరిస్తారు. ఆయన చంపబడి మూడు రోజుల తర్వాత మళ్ళీ బ్రతికి వస్తాడు" (మార్కు 8:31). ఇది శిష్యులను ఎంతగానో కలువర పరచింది. వారు మెస్సయ్య గూర్చి ఎంతో గొప్పగా ఊహించారు. ఆయన శ్రమలు పొంది, మరణించ వలసి ఉన్నదని వారు ఎన్నడూ ఊహించలేదు. ఈ సమయములో యేసు దివ్యరూపధారణ వారికి ఊరటను కలిగించి యుండవచ్చు. దివ్యరూపధారణ విశ్వాసముతో సహనము కలిగి జీవించిన వారికి మహోన్నత్వం వేచియున్నదని తెలియ జేస్తున్నది. యోహాను, తన సువిషేశములో, యేసుని మహోన్నత్వమును వారు చూసారని రాసాడు. ఇది యేసు దైవత్వమునకు నిదర్శనం. ఏలియా, మోషేల దర్శనం ప్రవక్తలు, చట్టము యేసు ప్రభువునిలో పరిపూర్ణ మయ్యాయని సూచిస్తున్నది.

"ఈయన నా ప్రియమైన కుమారుడు. ఈయన మాట వినండి" (మార్కు 9:7) అను స్వరమును శిష్యులు వినియున్నారు. తండ్రి దేవుని సందేశమును క్రీస్తు ఈ లోకానికి తెచ్చియున్నాడు. ఆయన సందేశమును మనం ఆలకించాలి. ఆలకించడము మాత్రమే కాక, ఆ సందేశానికి మన ప్రత్యుత్తరాన్ని ఇవ్వాలి. దేవుడు మనతో అనేక విధాలుగా, అనేక రూపాలలో మాట్లాడుచున్నాడు. ఆయన స్వరమును ఆలకించుదాం. దేవుని పిలుపునకు ప్రత్యుత్తర మిద్దాం.

క్రీస్తును ఆలకించాలి. ఎందుకన, ఆయన నిత్య జీవపు మాటలు కలవాడు. ఈనాడు లోకములోనున్న ప్రభుని సాన్నిధ్యాన్ని గాంచుదాం. ఈ తపస్కాలములో మన హృదయాలను తెరచి, ప్రేమను అనుభవించుదాం. ఆ ప్రేమను ఇతరులతో పంచుకొందాం. మన జీవితాలను దేవునికి, ఇతరులకు అర్పించుటకు సిద్ధపడుదాం.

No comments:

Post a Comment