దైవ సేవకుడుBooks on Br. Joseph Thamby, Servant of God

దైవ సేవకుడు, బ్రదర్ జోసఫ్ తంబి ఆధ్యాత్మిక జీవితం మనందరికి ఓ సవాలు!
 


దేవుడు పరమ రహస్యం. పరమ రహస్యమైన దేవుడు తన కరుణ, అనంతమైన ప్రేమలద్వారా, తననుతాను, ఈలోకానికి, ముఖ్యముగా, తన ప్రియబిడ్డలమైన మనందరికి బహిరంగ పరస్తూఉన్నాడు. తనకుతానుగానే కాకుండా, అనేక విధాలుగా (వ్యక్తులు, సంఘటనల ద్వారా) పరమరహస్యాన్ని బహిర్గతమొనర్చడం రక్షణచరిత్రయ౦తయు చూస్తున్నాము. దేవుడు ప్రేమ, మరియు ఆ ప్రేమ అనంతమైనది, అపారమైనది, ఏమియు ఆశించనటువంటిది. ఈ ప్రేమే మనలను ఆ దేవునికి, ఆ ప్రేమకి అంటిపెట్టుకొనేల చేస్తుంది. తన ప్రియకుమారుడు, యేసుక్రీస్తుప్రభువుద్వారా, దేవుడు ఏవిధముగా, తననుతాను మరియు తన హద్దులులేనిప్రేమను బహిరంగపరచినది మనందరికీ తెలిసినదే! దేవుడు అయినప్పటికిని, మానవరూపమును, స్వభావమునుదాల్చి, జీవించి, మరణించి, మనలను ఇహలోకమునకుచెందిన జీవితమునుండి విముక్తినిగావించి, తండ్రి రాజ్యమునకు, అర్హులను మరియు వారసులుగా చేసియున్నాడు. క్రీస్తునందు, దైవప్రేమ రూపమునుదాల్చి యున్నది. తద్వారా, ఆ పరమరహస్యముతో, బాంధవ్యాన్ని ఏర్పరచుకోగల్గుతున్నాము. దేవుడు పరమరహస్యం. కాని, క్రీస్తునందు తననుతాను బహిర్గతమొనర్చుతూ మనదరికి చేరువవుతూ ఉన్నాడు. ఈ పరమరహస్య బహిర్గత, ప్రతి క్రైస్తవ జీవితముద్వారా, ఈనాటికి కొనసాగుతూ ఉన్నది. ఎందుకన, క్రీస్తునందు ప్రతి ఒక్కరు సంపూర్ణ జీవితమునకు పిలువబడి ఉన్నారు. పునీతులు, దైవభక్తులు, ఈ కార్యాన్ని ప్రత్యేక విధముగా ప్రదర్శించి మనందరికీ ఆదర్శ ప్రాయులుగా నిలుస్తున్నారు. దైవమానవ ప్రేమలో సంపూర్ణముగా ఎదగడానికి మనం పిలువబడినామని గుర్తు చేస్తున్నారు.

అలాంటివారిలో మనం గుర్తుకుచేసుకోదగ్గ వారు దైవసేవకుడు బ్రదర్ . జోసఫ్ తంబి. తనదైనశైలిలో, దేవుని అపారప్రేమను, దైవ రక్షణ సందేశమును బహిర్గతమొనర్చుటకు తన జీవితాన్ని అంకితముచేసిన ఓ గొప్ప మహనీయుడు. పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి జీవితము అతనికి ప్రధాన ప్రేరణగా నిలచింది. ఫ్రాన్సిస్ వారి జీవిత ఆదర్శవిలువలు ఆయన జీవితాన్ని ముందుకు నడిపించాయి. దైవకృపతో పునీత ఫ్రాన్సిస్ వారి మార్గములో, శ్రమల కొలిమిలో, పవిత్ర వస్త్రాన్ని ధరించిన కుసుమం బ్రదర్. జోసఫ్ తంబి.
పునీత ఫ్రాన్సిస్ వారి త్రితీయ సభలో సభ్యునిగా ఉండి , తన జీవిత చివరి అంఖము వరకూ, అనంతమైన దేవుని ప్రేమను, నలుదిశల వ్యాపింపచేయడానికి కృషిచేసియున్నాడు. ఈ క్రమములోనే, విజయవాడ మేత్రాసనములోని పెద్దావుటపల్లికి చేరుకొని యున్నాడు. ఆయన అచ్చట 1939 వ సం,, నుండి 1945 వ సం,, వరకు, దైవ ప్రేమను, రక్షణ సందేశమును బోధిస్తూ, దైవ సేవలో జీవించి యున్నాడు. తన బోధన మరియు సేవాజీవితము తన వాక్తుచర్యము వలనగాక, సాధారణమైన, ప్రమాణసిద్ధమైన మరియు సిలువలోని క్రీస్తానుకరణము ద్వారా కొనసాగింది.

దీనదైవసేవకుడు, పునీత అస్సీసిపుర ఫ్రాన్సిసువారి అనుచరుడు, దైవపుత్రుడైన బ్రదర్ జోసఫ్ తంబీ గారు జనవరి 15, 1945 సం,,ము తన 63 వ యేట మరణించారు. ఆయన మరణానంతరం, కుల, మత, జాతి, అంతస్తు అను బేధాలు లేకుండా విశ్వాసులు ఆయనను ఒక పునీతునిగా గౌరవించడం ప్రారంబించారు. ఆయన సమాధిచెంతకుచేరి, ప్రార్ధన సహాయాన్ని కోరుచున్నారు. గడచిన శతాబ్దాలలో, విశ్వాసుల సందర్శన అధికమదికముగా పెరిగింది. అదేవిధముగా, దివ్యపూజాబలి పీటముయందు, పునీతుల బాంధవ్యములో తంబీగారిని చూడాలని అనేకమంది విశ్వాసులు వ్యక్తపరచియున్నారు. దీని నిమిత్తమై, విజయవాడ పీఠాధిపతుల సలహా మరియు సహాయసహకారాలతో, మరియు ఆంధ్రప్రదేశ్ పీఠాధిపతుల సమావేశ సహాయముతో, మేరిమాత కపూచిన్ ప్రావిన్సు, బ్రదర్ జోసఫ్ తంబీగారి పునీతపట్టముయొక్క కార్యమునకు ప్రతిబూనింది. అందునిమిత్తమై, 24 జూన్ 2007 సం,,న, పెద్దవుటపల్లిలో, యేసుతిరుహృదయ దేవాలయమున, పవిత్ర దివ్యపూజాబలిలో, రెవ.మల్లవరపు. ప్రకాష్, విజయవాడ పీఠాధిపతులు, బ్రదర్ జోసఫ్ తంబిగారిని ''దైవ సేవకుడు'' గా ప్రకటించియున్నారు. తద్వారా, పునీతపట్టముయొక్క కార్యం ప్రారంభించడమైనది.

''దైవ సేవకుడు'' బ్రదర్ జోసఫ్ తంబీ గారు, మన కాలములోనే జీవించియున్నారు. తన జీవితముద్వారా, పుణ్యముగా జీవించడం సాధ్యమేనని సాక్ష్యం ఇచ్చియున్నాడు. ఈ దైవసేవకుని పుణ్యజీవితమును చాటిచెప్పడానికి, ఆంధ్రప్రదేశ్లోని కపూచిన్సభ సహోదరులు, తంబిగారి భక్తిగీతాలు, ''తంబి వెలుగు'' ద్విమాస పత్రిక, తంబి ప్రార్ధనకూటాలు మొ,,గు అనేక కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు. స్వర్గీయగురువులు, కపూచియన్ సభకు చెందిన అవిటో పొట్టుకులం గారు 1984 వ సం,,లో, ''బ్రదర్ జోసఫ్ తంబిగారి జీవిత చరిత్ర'' అను పుస్తకమును ఆంగ్లములో రచించియున్నారు. ఈ పుస్తకం, తెలుగు, తమిళం, మలయాళం, ఫ్రెంచి భాషలలోనికి అనువాదం చేయబడింది. మూడుదశాబ్దాల అనంతరం, 2002 వ సం,,లో, స్వర్గీయ గురువులు ఒస్వాల్డు ప్రతాప్ కుంపలకురి గారు, తంబిగారి జీవితమునుగూర్చి చక్కటి అద్బుతమైన పుస్తకమును ఆంగ్ల బాషలో రచించియున్నారు. ఈ పుస్తకాన్ని 2011 వ సం,,లో తెలుగులోనికి అనువాదం చేయబడింది.

బ్రదర్ జోసఫ్ తంబి గారు దైవ ప్రేమను, కరుణను, ప్రకటించియున్నారు. ఈనాడు, మనము అదే చేయాలని దైవ సేవకుడు మనల్ని సవాలు చేస్తున్నారు. దైవరహస్యం ప్రేమరహస్యమే. ఆరహస్యాన్ని బయలుపరచడం మన అందరి ధర్మం.