నూతన సంవత్సర సందేశము

నూతన సంవత్సర సందేశము

కాలం ఎవరి కోసం ఆగదు. క్షణాలు, రోజులు గడుస్తూనే ఉంటాయి. ఒక సంవత్సరమును పూర్తి చేసుకొని, మరో నూతన సంవత్సరములోనికి అడుగిడుతూ ఉన్నాము.

గడచిన సంవత్సరములో ఎన్నో చేయాలని అనుకున్నాము. కొన్ని సాధించాము. కొన్ని చేయలేక పోయాము. కొన్ని తీపి జ్ఞాపకాలు, కొన్ని చేదు అనుభవాలు. కనుక, నూతన సంవత్సరమును గొప్ప ఆశతో, నమ్మకంతో ప్రారంభిద్దాం.

నూతన సంవత్సరములోకూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక, భౌతిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆరోగ్య మొదలగు విషయాలలో… క్రైస్తవులముగా, నూతన సంవత్సరమును ఎలా జీవించుదాం.

దైవార్చన కాలెండర్ నూతన సంవత్సరమును మరియ మాతృత్వ మహోత్సవముతో ఆరంభిస్తుంది. రక్షణ ప్రణాళికలో మరియపాత్ర గురించి ధ్యానిస్తాము. అలాగే, ఈరోజు, యేసు జన్మించి 8వ రోజు, కనుక దివ్యబాలునికి పేరు పెట్టిన రోజు (లూకా. 2:21) ఆయన పేరు. ‘యేసు’, అనగా, “యాహోవా రక్షిస్తాడు.” మన రక్షణను గురించి ధ్యానిద్దాం.

నూతన సంవత్సరమును విజయవంతముగా మనము జీవించాలంటే, క్రైస్తవులుగా మొట్టమొదటిగా మనము క్రీస్తునందు జీవించాలి. క్రీస్తునందు జీవించడము లేదా క్రీస్తునందు ఉండుట అనగా ఏమిటి?

“క్రీస్తు యేసునందు” దేవుడు మనకు ఇచ్చిన అనుగ్రహములు:

1. క్రీస్తునందు ఉండుట అనగా అనాది కాలముననే క్రీస్తుయేసునందు అనుగ్రహమును మనకు ప్రసాదించెను. “మనము చేసిన కార్యముల వలనగాక, అనుగ్రహపూర్వకముగా తన సొంత ఉద్దేశంతోనే ఆయన మనలను రక్షించి, పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను. అనాది కాలముననే క్రీస్తుయేసునందు దేవుడు అనుగ్రహమును మనకు ప్రసాదించెను” (2 తిమో. 1:9).

2. క్రీస్తునందు దేవుడు మనలను తన వారిగా ఎన్నుకొ నెను. “ఆయన ఎదుట మనము పవిత్రులను నిర్దోషులను ఉండుటకు లోకసృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తనవారిగా ఎన్నుకొనెను”(ఎఫెసీ. 1:4).

3.  క్రీస్తు యేసునందు మనము దేవుని చేత ప్రేరేపింపబడుచున్నాము. “మన ప్రభువైన క్రీస్తు యేసుద్వారా మనకు లభించిన దేవుని ప్రేమనుండి మనలను మృత్యువుగాని, జీవముగాని, దేవదూతలుగాని, లేక ఇతర పాలకులుగాని, ఇక్కడ ఉన్నదిగాని, రానున్నవిగాని, శక్తులుగాని, పైలోకముగాని, అదో లోకముగాని, సృష్టిలో మరి ఏదియు వేరు చేయజాలదు” (రోమీ. 8:38-39).

4. క్రీస్తు యేసునందు మనము క్షమించబడి రక్షించబడ్డాము. “క్రీస్తు రక్తం వలన మనము విముక్తులమైతిమి. ఆయన కృప ఐశ్వర్యములచే మన పాపములు క్షమింపబడినవి” (ఎఫెసీ. 1:7).

5. క్రీస్తునందు మనము దేవునితో ఏకమైయున్నాము. “క్రీస్తు పాపరహితుడు. కాని, దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగ చేసెను. ఎలయన, ఆయనతో ఏకమగుటవలన, మనము దేవుని నీతిగా రూపొందింపవలెనని అట్లు చేసెను” (2 కొరి. 5:21).

6. క్రీస్తు యేసునందు మనము నూతన సృష్టిగా మారియున్నాము, దేవుని బిడ్డలమైనాము. “ఎవ్వరైనను క్రీస్తునందున్న యెడల అతడు నూతన సృష్టి! పాత జీవితము గతించినది. కొత్త జీవితము ప్రారంభమైనది (2 కొరి. 5:17). “క్రీస్తు యేసునందు విశ్వాసము వలన మీరు అందరును దేవుని పుత్రులు” (గలతీ. 3:26).

క్రీస్తునందు జీవించిన యెడల దేవుడు మనకు ఇన్ని ప్రయోజనాలను కలుగజేసి యున్నాడు. కనుక నూతన సంవత్సరం మనకు శుభదాయకంగా ఉండాలంటే, క్రీస్తునందు మనము జీవించాలి. పునీత పౌలు చెప్పినట్లు, “ఆయనయందే మనము జీవించుచు, సంచరించు చున్నాము! ఉనికిని కలిగి ఉన్నాము” (అ.కా. 17:28).

అలాగే, క్రీస్తునందు జీవించుట అనగా “క్రీస్తు సాన్నిధ్యము”ను మనతో తీసుకెళ్లడం. క్రీస్తు సాన్నిధ్యము అనగా మనము క్రీస్తుతో జీవించటం, క్రీస్తుతో ఉండటం. క్రీస్తు అనుభవాన్ని కలిగి జీవించటం. విశ్వాసంలో నమ్మకముతో జీవించటం. దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని చిత్తాన్ని తెలుసుకుని దాని ప్రకారం జీవించటం. దివ్య సంస్కారాలలో క్రీస్తు సన్నిధిని క్రీస్తు అనుభవాన్ని, దేవుని అనుగ్రహాలను పొందటం. ప్రార్థన జీవితానికి విశ్వాసముగా ఉండటం.

మన జీవితములో, మన బంధాలలో,  క్రీస్తు యేసు సర్వం అయి ఉండాలి. మన క్రైస్తవ విశ్వాసాన్ని యేసులో, ఆయన వాక్కులో బలపరచు కొందాం.

క్రైస్తవులముగా, నూతన సంవత్సరములో ఈ క్రింది విషయాలను గుర్తుంచుకుందాం:

1. దేవుడు నిన్ను సృష్టించాడని, ఈ లోకానికి నిన్ను ఒక అందమైన కానుకగా ఇచ్చాడని మరువకు. నిన్ను తన అర చేతులలో మోస్తూ కాపాడుచున్నాడు. ఆయన లేనిది, నీవు లేవని మరువకు.

2. నీతో, నీకున్న దానితో సంతోషముగా ఉండు. నిన్ను చేసిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు (ద్వితీయ. 23:5). ఆయన సహాయం కోరుకో.

3. నీవు తీసుకొనే నిర్ణయాలకు, నీవే బాధ్యుడవు. కొన్నిసార్లు, మన నిర్ణయాలు బాధిస్తాయి. నిరాశ చెందక, నేర్చుకొని ముందుకు సాగిపో! నీ అనుభవానికి, దేవునికి కృతజ్ఞతలు తెలుపు (1 రా.ది.చ. 16:8).

4. కొన్నిసార్లు, మనం అనుకున్నవి, ఆలోచించినవి, ఊహించినవి, జరగకపోవచ్చు! దీనిని ఒక ఆశీర్వాదముగా భావించండి. ఒక తలుపు మూసుకుంటే, మరో తలుపు మన కోసం తెరచుకుంటుంది. జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకో!

5. నీ కష్టాలను, బాధలను లెక్కింపక, నీవు పొందే వరాలను లెక్కింపు (రోమీ. 8:18). దేవుడు నీకు ఇచ్చే వరాలను నీవు లెక్కించు!

6. ఎల్లప్పుడూ, నీకు సాధ్యమైనది, మనస్ఫూర్తిగా చేయి. దేవుడు నీనుండి ఆశించేది ఇదే!

7. నీ జీవితములో వచ్చే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో!

8. ప్రార్థన, శక్తిగల ఆయుధమని, నీకు సహాయంగా ఉండునని మరువకు! (ఫిలిప్పీ. 4:6).

9. నిజమైన సంతోషం పొందుటలో కన్న, ఇవ్వడంలో ఉంటుందని తెలుసుకో!

10. అద్భుతాలు జరుగుతాయి: నీవు, నేను ఒక అద్భుతమే!

11. శోధనలు అన్ని చోట్ల ఉంటాయి, వాటికి ‘కాదు‘ అని చెబితే సరిపోతుంది.

12. నీ పొరుగువారికి, తెలియనివారికైనా, సహాయంచేయడం మరచిపోకు. అన్నింటికన్నా ఎక్కువగా మనందరం మంచి మానవతాబంధాలను కలిగి జీవించుదాం. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, సహాయం చేసుకుంటూ ముందుకు సాగుదాం. నిజమైన స్వేచ్ఛ సత్యములను కనుగొని జీవించుట న్యాయం సామాజిక నైతిక విలువలతో జీవించుట శాంతి స్థాపన మరో ముఖ్య అంశం కనుక అది మన ద్యేయం అయి ఉండాలి.

ప్రతి ఒక్కరంకూడా, జీవితములో ఎగుడుదిగుడులను, ఒడిదుడుకులను ఎదుర్కొంటాము. మనుము తల్లి శ్రీసభ ఒడిలో పదిలంగా ఉంటాము; దేవదూతలు, పునీతులు మనకు సహాయము చేయుదురు; మరియ తల్లి మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది; దివ్యసంస్కారాలు మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడును.

నూతన సంవత్సరమున ధ్యానమునకు, బైబుల్ వాక్యాలు:
2 కొరిం. 5:17
ఎఫే 4:22-24
యెషయా 43: 18-19
యిర్మీయా 29:11

పునీత అస్సీసి పుర ఫ్రాన్సిస్: బాల్యము, యవ్వనము

పునీత అస్సీసి పుర ఫ్రాన్సిస్ వారి జీవిత చరిత్ర
(మూలము: పునీత అస్సీసి పుర ఫ్రాన్సిస్: పోవరెల్లో)

1. బాల్యము, యవ్వనము

జోవాన్న పీకా పురిటినొప్పులతో ప్రసవ వేదన పడుచున్నది. ఆమె భర్త పీటర్ బెర్నడోనె, అస్సీసి పట్టణంలోని ప్రముఖ బట్టల వ్యాపారులలో ఒకరు. ఆ సమయంలో వ్యాపార నిమిత్తమై ఫ్రాన్స్ దేశమునకు వెళ్లి యున్నాడు. అస్సీసి మార్గముగా వెళుతున్న ఒక యాత్రికుడు పీకా తో ఇలా అన్నాడు, “అమ్మా, దగ్గరలో ఉన్న పశువుల పాకలోనికి వెళ్ళినట్లయితే ఎలాంటి నొప్పులు లేకుండా మగబిడ్డను ప్రసవించెదవు.”

దేదీప్యమైన గది, పాలరాయితో నేల, బంగారు రేకు పూత పూసిన సీలింగ్, ఇలాంటి విలాసవంతమైన భవంతిని వీడి, పీకా ఆ పశువుల పాక లోనికి వెళ్ళినది. సుతిమెత్తని పట్టువస్త్రాలతో గాక ఎండు గడ్డితో ఆమె పరిచారకురాండ్రు, ప్రసవించుటకు పడకను పశువుల పాకలో సిద్ధము చేసియున్నారు. బెత్లెహేములోని పశువుల పాకలో కన్య మరియ వలనే 26 సెప్టెంబరు 1182 వ సం,,న పీకా అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది.

“అందరికీ హాయ్! అంతయు సిద్ధముగా ఉన్నది. బిడ్డకు జ్ఞానస్నానం ఇచ్చుటకు సాన్ రుఫీనొ కేతెద్రల్ కు వెళ్లెదము. అత్తా! ఏమి పేరు పెట్టాలని అనుకుంటున్నావు” అని పీకా మేనకోడలు బెయాట్రిస్ అడిగింది.

కొద్దిసేపు మౌనం తర్వాత పీకా ఇలా సమాధానం చెప్పింది, “జాన్ అని నామకరణం చేయబడును. బాప్తిస్త యోహాను గారి వలె, యేసు ప్రభువును ఆయన సువార్తను ఈ లోకానికి ప్రకటించుటకు పిలువబడునని నా అంతరాత్మ దృఢముగా చెప్పుచున్నది.”

తండ్రి పీటర్ బెర్నడోనె వ్యాపార నిమిత్తమై వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి తన కుమారుని చూచి చాలా సంతోషించాడు. కాని తన కుమారుని పేరు అతనికి నచ్చలేదు. ఫ్రాన్సిస్ అని పేరు పెడితే చాలా మంచిదని అన్నాడు. ఎందుకన, ఫ్రాన్స్ దేశం తనని సంపన్నునిగా, కీర్తిమంతునిగా చేసింది (ఫ్రాన్సిస్ అనగా ఫ్రాన్స్ దేశస్తుడు అని అర్థం). ఫ్రాన్సు దేశం తన మాతృదేశం అగుటచేత, ఫ్రాన్సిస్ అని పేరు పెట్టుటకు పీకా అంగీకరించింది.

ఫ్రాన్సిస్ పెరిగి పెద్దవాడయ్యాడు. తన తండ్రి బట్టల దుకాణంలో పనిచేయుటకు ఇష్టపడ్డాడు. వారు అమ్మెడి పట్టువస్త్రాలు ఎంతో అందమైనవి, నాణ్యత కలవి. వారి దుకాణములో వస్త్రాలను అమ్మడంలో ఫ్రాన్సిస్ ఎంతగానో గర్వపడే వాడు. అంతేగాక అక్కడికి వచ్చే గృహిణులు, యువతులతో పరిహాసాలాడెడి వాడు. పట్టు వస్త్రాలపై అతిశయోక్తులు విసురుతూ వారిని ఎంతగానో ఆకర్షించేవాడు.

తన తండ్రి వ్యాపారము విరాజిల్లుటకు తను ఓ ప్రధాన కారణమని ఫ్రాన్సిస్ కు తెలుసు. ఆ పట్టణములో ఉన్న యువతులంతా, బట్టలు కొనడానికి గాక, ఫ్రాన్సిస్ అందాన్ని, మాటల సరళిని, చక్కని సంభాషణ చతురతను చూచుటకు వచ్చెడివారు. యువతులే గాక గృహిణులు కూడా ఫ్రాన్సిస్ ను అభినందించేవారు. తనే స్వయముగా అత్యంత సుందరమైన బట్టలు కొనమని అందరిని ఆలరించేవాడు.

వ్యాపారము లో దిట్ట అయిన పీటర్ బెర్నడోనె తన కుమారుని వ్యాపార సరళిని చూసి ఎంతగానో గర్వపడే వాడు. తరచుగా ఫ్రాన్సిస్, తలుపు దగ్గర నిలబడి, మీసాలు మెలేస్తూ, వచ్చే ప్రతి అమ్మాయి చెవిలో గుసగుసలాడే వాడు.

ఫ్రాన్సిస్ పెరిగి పెద్దవాడవుతున్న కొలది చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఆకర్షణకు కారణమైన ప్రతి ప్రదర్శనకు ఆహ్వానం పలికే వాడు. పగలంతా దుకాణంలో వ్యాపారం చేస్తూ, సాయంత్రానికి సంపాదించిన డబ్బుతో సరదాలు చేసేవాడు. కొద్దిపాటి శ్రమ కలిగితే చాలు, సంగీత సరళితో కాలం గడిపేవాడు. కొద్దిమంది గాయకులతో స్నేహం పెంచుకున్నాడు. యవ్వన కాలమంతా పట్టణములో జరిగే వినోద కార్యక్రమాల్లో, బహిరంగ ప్రదేశాల్లో జరిగే విందులు వినోద కార్యక్రమాల్లో, పొద్దు పోయే వరకు గడిపేవాడు. ఆస్సీసి పట్టణములో ఫ్రాన్సిస్ ప్రముఖ గాయకుడిగా, కళారంగ అభిలాషిగా గుర్తింపు పొందాడు.

పీటర్ బెర్నడోనె మంచి మనిషి, మంచి తండ్రి. కాని, చాలా గర్విష్టి. ఎందుకన, ఆనాటి సంస్కృతి, సాంప్రదాయాలు ఆయనను అలా మార్చివేశాయి. ఆయన జీవిత విలువలు ‘డబ్బు’ అనే పదముతో పోల్చవచ్చు. సుఖం, సంతోషం, హోదా, అధికారం, పేరు ప్రతిష్టలు, డబ్బుతో కొనగలిగే ప్రతీది ఆయన జీవితంలో ప్రాముఖ్యమైనవే!

తండ్రిగారి ఆశయాల ప్రభావం తెలియకుండానే ఫ్రాన్సిస్ పై పడింది. మంచి వ్యాపారవేత్తగా సుసంపన్నుడిగా పెరగాలని, యుద్ధములో పోరాట పటిమలు చూపి కీర్తి ప్రతిపత్తులు సాధించాలని, జీవితాంతం ధైర్యసాహసాలతో, శక్తిసామర్థ్యాలతో ఉత్తమ యోధునిగా, వీరుడు, ధీరుడుగా కొనసాగాలని, క్షమింపక తిరిగి దెబ్బ వేయాలని, కేవలము ధనవంతులు మాత్రమే జీవితంలో గెలవగలరని, జీవితాన్ని కలిగియుందురని ఫ్రాన్సిస్ మనసులో బలంగా పడిపోయింది.

సాహసాలు చేయడంలో ప్రీతిని, అనుకున్నది సాధించాలనే మొండి పట్టుదలను, వాస్తవంలో జీవించడం, తండ్రి నుండి ఫ్రాన్సిస్ వారసత్వంగా పుణికి పుచ్చుకున్నాడు.

అలాగే, తల్లి నుంచి మంచి అలవాట్లయిన మృదువైన మనస్తత్వం, ప్రేమానురాగాలు, సంగీతం, సాహిత్యం మొదలగు గుణాలను అలవర్చుకున్నాడు. ఆమె ఎప్పుడూ తన కుమారుడు విశ్వాసముతో, మంచితనముతో పెరగాలని ఆశించింది. ఆమె సద్గుణ మంతురాలు కనుక పేదవారిలో యేసుని చూడాలని, వారు ఎప్పుడు వచ్చినా వట్టి చేతులతో తిరిగి పంపకూడదని నచ్చచెబుతూ ఉండేది. “పేదలగు మీరు ధన్యులు... వినమ్రులు ధన్యులు... శాంతి స్థాపకులు ధన్యులు. మంచిగా జీవించు. నీకు దేవుని ఆశీర్వాదములు కలవు. పేదవారి పట్ల, బడుగువారి పట్ల, పీడితుల పట్ల, దయగా ఉండు. నిన్ను గాయ పరచిన వారిని క్షమించు” అని తల్లి యొక్క మృదువైన స్వరము ఫ్రాన్సిస్ లో ప్రతిధ్వనించేది.

తల్లిదండ్రుల విభిన్న అభిప్రాయాల మధ్య ఫ్రాన్సిస్ కుస్తీ పడే వాడు. యువకుడైన ఫ్రాన్సిస్ వారిరువురి ఆలోచనలతో రాజీ పడటానికి ప్రయత్నం చేసేవాడు. అంతయు సక్రమంగానే సాగుతున్నట్లుగా కనిపించింది. కాని, క్రమక్రమముగా తనలోని అంతరాత్మ ప్రబోధనాను సారముగా నూతన ప్రపంచం వైపు దృష్టిని సారించాడు. అప్పుడు దేవుడు-సాతాను, ఆత్మ-శరీరం, మంచి-చెడు, వెలుగు-చీకటి, ఎన్నటికీ రాజీపడవని, అవి ఎప్పుడూ కూడా విరుద్ధమైనవని తెలుసుకున్నాడు.

అదే సమయంలో, తన కుమారుడు ఫ్రాన్సిస్ యొక్క విలాసవంతమైన జీవితాన్ని, ఆర్థిక దుబారా ఖర్చులను చూసి తండ్రి పీటర్ బెర్నడోనె మిక్కిలిగా బాధపడేవాడు. తల్లి పీకా మాత్రం తన కుమారుని గురించి చాలా నిస్సందేహముగా, గొప్ప నమ్మకముతో ఉండేది. ఒకసారి పీటర్ బెర్నడోనె ఫ్రాన్సిస్ పై పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి, కోపగించుకున్నప్పుడు తల్లియే కాపాడింది. ఆమె తన భర్తతో, “ఫ్రాన్సిస్ ఎన్నటికీ చెడ్డవాడిగా మారడు. అతను ప్రభువును ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కనుక ఈ లోక సంబంధమైన జీవితాన్ని ఎక్కువకాలం కొనసాగించలేడు. తన పేరుకు తగ్గట్లుగా, యోహాను గారి వలె క్రీస్తుకు నిజమైన శిష్యుడిగా మారతాడు” అని తేల్చేసి చెప్పింది.

క్రిస్మస్ సందేశము (పగలు)

క్రిస్మస్ సందేశము
 
కొన్ని సంవత్సరముల క్రితం ఒక క్రిస్మస్ రోజున, చిన్న పిల్లలతో మాట్లాడుతుండగా, వారిని ఒక ప్రశ్న అడిగాను, ‘క్రిస్మస్ రోజున మీరు పొందేటటువంటి బహుమతులలో మీరు ఏ బహుమతిని పొందాలని అనుకుంటున్నారు?’ పిల్లలు అందరూ కూడా అనేక రకాలైనటువంటి సమాధానమును ఇచ్చి ఉన్నారు. అయితే వారిలో ఒక అమ్మాయి నేను ‘యేసు’ ని బహుమతిగా పొందాలని అనుకుంటున్నాను’ అని సమాధానం ఇచ్చింది. నిజమే కదా! క్రిస్మస్ రోజున యేసు ప్రభువు కంటే గొప్ప బహుమతి, బహుమానం, అనుగ్రహం, దేవుని వరం ఏముంటుంది? వారిని మరో ప్రశ్న అడిగాను, ‘ఈ లోకానికి ఏ బహుమతి కావాలి అంటే మీరు ఏమి కోరుకుంటారు?’ మరలా అనేక సమాధానాలు వచ్చాయి. అయితే అదే అమ్మాయి, ‘ఈ లోకానికి శాంతి కావాలని కోరుకుంటాను’ అని చెప్పింది.

ఈరోజు మనం యేసు జన్మ దినమును కొనియాడుచున్నాము. ఇది దేవుని యొక్క ప్రేమకు నిదర్శనం. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అనే దానికి ఒక గొప్ప సాక్ష్యం, నిదర్శనం. కనుక, ఆ దివ్య బాల యేసు మన హృదయాలలో, మన కుటుంబాలలో, మన సంఘములో, ఒక గొప్ప బహుమానంగా జన్మించాలని ఆశిద్దాం. అలాగే లోక రక్షకుడైన యేసు శాంతి స్థాపకుడు కనుక, ఈ లోకంలో శాంతి నెలకొనాలని ప్రత్యేకంగా ప్రార్థించుదాం! ప్రభువు శాంతి ఈ లోకంలో నెలకొనాలంటే నీవు నేను మనమందరం కూడా శాంతి స్థాపకులుగా, శాంతిని బోధించే సందేశకులుగా మారాలి.

మనం ఎప్పుడైతే యేసు ప్రభువును అనుసరిస్తామో, ఆయన బోధనలను పాటిస్తామో, ప్రభువు శాంతి మనదవుతుంది. మనం ఎప్పుడైతే మన తల్లిదండ్రులను గౌరవిస్తామో, వారిపై దయ, కనికరము కలిగి జీవిస్తామో, మన తోటి సహోదరీ సహోదరులను గౌరవిస్తామో, ప్రేమిస్తామో, అప్పుడు ప్రభువు శాంతి మన కుటుంబంలో భాగమవుతుంది.

ఈ క్రిస్మస్ రోజున మనము చిన్నపిల్లల వలే ఉండాలని ప్రభువు మనల్ని కోరుతున్నాడు. చిన్న బిడ్డల విశ్వాసాన్ని మనము కలిగి జీవించాలి. ఆ విశ్వాసమే నిజమైన శక్తి గల క్రిస్మస్ అంటే ఏమిటో మనకు తెలియజేస్తుంది.

క్రిస్మస్ అనగా ‘ఇమ్మానుయేలు’, దేవుడు మనతో ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి అంధకారాన్ని పటాపంచలు చేసి నూతన వెలుగును ఇచ్చుటకు ప్రభువు మనతో ఉన్నాడు. మనము ఇక భయపడవలసిన అవసరం లేదు. విచ్చిన్నమైనటువంటి మన బంధాలను, కుటుంబాలను, సంఘాలను, దేశాలను, ఏకం చేయడానికి ప్రభువు మనతో ఉన్నాడు. మనలను ఐక్యం చేయుటకు ప్రభువు మనతో ఉన్నాడు. మనము ప్రశాంతముగా జీవించుటకు ఆయన మనకు సహాయము చేయును. మన పాపములలోనూ, మన బలహీనతలలోనూ, మనలను క్షమించుటకు, మనలను ప్రేమించుటకు, మనలను ఒక నూతన సృష్టిగా తయారు చేయుటకు, ప్రభువు మనతో ఉన్నాడు. మన ఒంటరితనంలోను, మన కష్టాలలోను, బాధలోనూ, మనలను ఓదార్చుటకు ప్రభువు మనతో ఉన్నాడు.

గతంలో ఎంతో మంది దేవుని కోసం వెదకి ఉన్నారు. దేవుని చేరుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఉన్నారు. కానీ క్రిస్మస్ రోజున, దేవుడే మన మధ్యన జన్మిస్తూ ఉన్నాడు. దేవుడు మానవుడై మన మధ్యలో ఉంటున్నాడు. అదే నిజమైన క్రిస్మస్ కు అర్థం.

ప్రభువు మనతో ఉండాలి అంటే, మనము ప్రభువు పట్ల విశ్వాసముగా జీవించాలి. మరియ జోజప్ప గారి వలె మంచి కుటుంబ జీవితం జీవించాలి. ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ జీవించాలి. దేవుని పట్ల మరియ తల్లి చూపించిన వినయ విధేయతలను బట్టియే, ఆమె జీవించిన విశ్వాసమును బట్టియే, ఆమె ధన్యురాలు అయ్యింది.
ప్రభువు మనతో ఉండాలి అంటే దేవునికి మనము ప్రత్యుత్తరము ఇవ్వాలి. దేవుని యొక్క సందేశము గబ్రియేలు దూత ద్వారా అందించినప్పుడు మరియ తల్లి ‘ఇదిగో నేను నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక’ అని జవాబు ఇచ్చింది.

ప్రభువు మనతో ఉండాలి అంటే మనము దేవుని స్వరాన్ని వినగలగాలి. మరియమ్మ దేవుని స్వరమును విని దేవుని యొక్క చిత్తానికి, ప్రణాళికకు తలవొగ్గింది. దేవుని తనలో మోసింది. 9 నెలలు గడిచిన తర్వాత ఆ లోక రక్షకుడు ఆమె గర్భమున జన్మించి ఉన్నాడు. ఆ సమయములో ఆ దివ్య బాల యేసు స్వరమును విన్నది కేవలము ఇద్దరు మాత్రమే, ఒకరు గొల్లలు, మరొకరు జ్ఞానులు.

మనము దేవుని స్వరాన్ని వింటున్నామా? మనలను రక్షించుటకు దివి నుండి భువికి దిగి వచ్చిన ప్రభువును మనము విశ్వసిస్తున్నామా? “ఆయన తన వారి యొద్దకు వచ్చెను. కాని, తన వారె ఆయనను స్వీకరించలేదు” (యో 1:11). కనుక ప్రభువు మనతో ఉండాలి అంటే మనము ప్రభువును స్వీకరించాలి. మన హృదయాలను తెరవాలి. మరియ ప్రసవించుటకు ఎక్కడా చోటు లేదు అని అందరూ అన్నారు. మరి ప్రభువును స్వీకరించుటకు నీ సమయాన్ని, నీ చోటును కేటాయించుటకు నీవు సిద్ధముగా ఉన్నావా?

క్రిస్మస్ ఈ రోజు నాకు ఏలాంటి అర్థాన్నిస్తుంది, అని మనమందరము వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవాలి. రెండువేల సంవత్సరముల క్రితం జరిగిన క్రిస్మస్ ఈరోజు నాకు ఎలాంటి అర్థాన్ని ఇస్తుంది?

ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రిస్మస్ ద్వారా దేవుని దయ నాపై దిగి వస్తుంది. ఈ దయ నాకు దేవునికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని తగ్గిస్తుంది. నా పాపానికి పరిహారంగా తన ప్రాణమును, తన రక్తాన్ని వెలగా చెల్లించుటకు దేవుని దయ దిగివస్తుంది.

మనం ఇచ్చట ఎందుకు సమావేశమై ఉన్నామో కూడా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్ యొక్క అర్థాన్ని మనము తెలుసుకోగలం.

క్రిస్మస్ అంటేనే ఎంతో హడావిడి. చివరి క్షణం వరకు కూడా అలంకరణలు చేస్తూ ఉంటాము. షాపింగ్ చేస్తుంటాము. ఇంటిని, దేవాలయాన్ని శుభ్రపరుస్తూ ఉంటాము. క్రిస్మస్ కేకులు, బహుమతులు పంచుతూ ఉంటాము. వీటితోపాటు అలసట, ఒత్తిడికి కూడా లోనవుతూ ఉంటాము. కనుక మన ఆలోచనల ఉరుకులు పరుగులను నెమ్మదించవలసినటు వంటి సమయం. క్రిస్మస్ అంటే కేవలము ఉరుకులు పరుగులు, అలంకరణలు, ఆచారాలు మాత్రమే కాదు. మనం ఇక్కడ సమావేశమైనది ఇతరులను చూడటానికి లేకపోతే ఇతరులు మనలను చూడటానికి కాదు. మనకు ఇష్టమైన క్రిస్మస్ పాటలను పడుకోవడానికి కాదు. మన స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కూర్చోవడానికి కాదు. లేకపోతే, ఒక మంచి ప్రసంగాన్ని వినాలని కాదు.

కాని, దేవుడు మన కోసం తన సింహాసనాన్ని వదిలిపెట్టి మనలో ఒకనిగా జన్మించిన ఆ రాత్రిని గుర్తు చేసుకోవడానికి. మనకోసం జన్మించిన దివ్య బాలయేసును ఆరాధించటానికి మనం ఇచట సమావేశమై ఉన్నాము. ఈ బాలుడు మనకు రక్షణ మార్గమును చూపించి యుండుట వలన, తన జీవితాన్నే మనకోసం అర్పించుట వలన మనం ఇక్కడ సమావేశమై ఉన్నాము. క్రిస్మస్ అనగా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, మనందరికీ ఒక ఆశను, ఒక గొప్ప నమ్మకమును మనకు కలిగిస్తున్నాడు. అందుకే, మనం ఇక్కడ సమావేశమై ఉన్నాము.

క్రీస్తు అను ఒక గొప్ప బహుమానము ఈ రోజు మనందరికీ ఇవ్వబడి ఉంది, కనుక, మనము ఇక్కడ సమావేశమై ఉన్నాము. అందుకే మనము పాటలు పాడుతూ ఉన్నాము, అలంకరణలు చేస్తున్నాము, బహుమతులు పంచుకుంటూ ఉన్నాము. దీనిని మనము ఎల్లప్పుడూ మరువరాదు.

రెండు వేల సంవత్సరముల క్రితం బెత్లెహేములో ప్రభువు జన్మించినప్పటికిని, ఈరోజు, ప్రభువు, నా విశ్వాసమును బట్టి, నా హృదయంలో జన్మించక పోయినట్లయితే నాకు ఎలాంటి ఉపయోగం లేదు.

కనుక, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు మన హృదయాలలో జన్మించాలి. అప్పుడే అది మనకు నిజమైన క్రిస్మస్ అవుతుంది.

లోక రక్షకుడు మీ హృదయాలలో జన్మించాలని, మీ జీవితాలు రక్షణ మార్గము వైపు నడిపింప బడాలని, ప్రార్థిస్తున్నాను. మీరు దేవుని యొక్క స్వరమును ఆలకించి, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జీవించాలని ఆశిస్తున్నాను.

అందరికీ నా హృదయపూర్వక యేసు క్రీస్తు రక్షకుని జన్మదిన శుభాకాంక్షలు!

Dear CRI, Eluru Diocese (Religious Men and Women),

Fraternal Greetings!

Hearty welcome to Eluru CRI Christmas celebrations to be held on Saturday 22/12/2018 at SCJ study house near Janampet, Eluru, at 4 p.m.

Fr. Praveen Kumar Gopu OFM Cap
President
Local CRI, Diocese of Eluru

ఆగమనకాల నాలుగవ ఆదివారము, YEAR C

ఆగమనకాల నాలుగవ ఆదివారము
మీకా 5:1-4, హెబ్రీ 10:5-10, లూకా 1:39-45

ఓ ఆకాశములారా! మేఘములారా! మాకు రక్షకుని స్వర్గమునుండి పంపుడు. ఓ భూతలమా! తెరచుకొని రక్షకుని పంపుము.
 
ఈ రోజు నాలుగవ ఆగమన ఆదివారము. ఈ వారముతో క్రిస్మస్ పండుగకు మన ఆయత్తం ముగుస్తుంది. మన ప్రార్ధనలన్నీ కూడా "ఇమ్మానుయేలు" (దేవుడు మనతో ఉన్నాడు) అను అంశముపై కేంద్రీకృతమై ఉంటాయి. ఆయన మనలో, మన శ్రమలో, మన జీవితములో ఒకనిగా, మనతో లోకాంత్యము వరకు ఉండటానికి, ఆయన (దైవ) స్వభావాన్ని మనతో పంచుకొనడానికి ఆశించియున్నాడు. ఈనాటి పఠనాలు క్రిస్మస్ పండుగకు మనలను మరింత దగ్గరగా తీసుకొని వస్తున్నాయి. మూడు పఠనాలు, మూడు కోణాలలో ఈ పరమ రహస్యాన్ని మనకు అర్ధమయ్యేలా విశదపరుస్తున్నాయి. దేవుడు తన ప్రణాళికను, ఆయన ఎన్నుకొన్న వ్యక్తులద్వారా నెరవేర్చడం వలన, సమస్తము ఆయనకు సాధ్యమే అన్న సత్యాన్ని మనం చూస్తున్నాము. ప్రభుని రాక, ముందుగానే సమస్త లోకానికి తెలియజేయడమైనది.

మొదటి పఠనము - మీకా గ్రంథమునుండి వింటున్నాము. మీకా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు రాబోవు గొప్ప రాజు గూర్చి ప్రవచిస్తున్నారు. బెత్లెహేమునుండి ఇశ్రాయేలు పాలకుడు ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. దేవుని ప్రభావముతో తన మందలను పాలించును. లోకములో నరులెల్లరు అతని ప్రాభవమును అంగీకరింతురు. అయితే, ఆ రాజు ఎప్పుడు వచ్చునో పరలోక తండ్రి మాత్రమే ఎరిగియున్నాడు. రక్షకుడు వచ్చినప్పుడు, సమస్త లోకానికి శాంతిని ఒసగును. దైవ ప్రజలు పాప బానిసత్వము నుండి విడుదలై స్వతంత్రులుగా జీవించెదరు.

రెండవ పఠనముయేసుక్రీస్తు మనలో ఒకనిగా వచ్చిన ఆ పరమ రహస్యాన్ని, క్రీస్తు తనను తానుగా అర్పించిన బలి, ఆయన విధేయత వలన మాత్రమే సంపూర్ణముగా అర్ధము చేసుకోవచ్చని రెండవ పఠనము తెలియ జేస్తుంది. యేసు క్రీస్తు ఈ లోకానికి ఏమీ ఆశించక తండ్రి చిత్తాన్ని నేరవేర్చ ఆశించాడు. దేవుడు జంతు బలులను, అర్పణలను కోరలేదు. దహన బలులకు, పాప పరిహారార్ధమయిన అర్పణలను ఇష్టపడలేదు. పాత బలులను అన్నింటిని తొలగించి వాటి స్థానమున దేవుడు క్రీస్తు బలిని ఏర్పాటు చేసాడు (హెబ్రీ 10:5-6,10). ఈ పరిశుద్ధ  కార్యానికి క్రీస్తు తననుతాను త్యజించి, తండ్రి దేవుని చిత్తానికి విధేయుడై, మన పాపపరిహారార్ధమై తననుతాను బలిగా అర్పించుకొనుటకు ఈ లోకములో జన్మించియున్నాడు. ఆయన జన్మము మనకు జీవమును, శాంతిని, సమాధానమును, స్వతంత్రమును ఒసగుచున్నది. మన జీవితము వెలుగులో ప్రకాశింపబడుచున్నది. క్రీస్తు బలిద్వారా మనలను ఆయనలో ఐక్యము చేసి పవిత్రులనుగా చేసియున్నాడు.

"ఇదిగో, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!"

సువిశేష పఠనము - మరియమ్మ ఎలిశబెతమ్మను దర్శించిన సంఘటనను తెలియజేస్తుంది. యేసు జనన సూచనను దూత ప్రకటించిన కొద్దిసమయములోనే, మరియమ్మ ఎలిశబెతమ్మను సందర్శించినది. గబ్రియేలు దూతే ఈ సందర్శనను సూచించినది. "నీ బంధువు ఎలిశబెతమ్మను చూడుము. ఆమెకు వయస్సు మళ్ళినది గదా! గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము" (లూకా 1:36). ఆ విషయము గ్రహించిన మరియమ్మ, యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమై వెళ్ళినది.

మరియమ్మ పవిత్రాత్మ శక్తివలన అప్పుడే గర్భము ధరించినది. దైవకుమారున్ని ఈ లోకానికి స్వాగతించడానికి ముందుగానే సిద్ధపడినది. దేవుడు తనకు అప్పగించిన పవిత్రమైన భాద్యతను ఆమె గుర్తించినది. తన ద్వారానే లోక రక్షకుడు ఈ లోకానికి రావలసియున్నదని గుర్తించి, దేవుని చిత్తాన్ని అంగీకరించినది. "నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!"

మరియమ్మ, జెకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిశబెతమ్మకు వందన వచనము పలికింది. పవిత్రాత్మతో నింపబడి వందన వచనములను పలికినది. దైవకుమారుడిని, లోకరక్షకుడిని గర్భము ధరించినప్పటికిని, మరియమ్మ తనే స్వయముగా  ఎలిశబెతమ్మను సందర్శించినది. యేసు, ఈ లోకానికి సేవింపబడుటకుగాక, సేవచేయడానికి వస్తున్నాడన్న విషయం స్పష్టముగా తెలుస్తుంది. సేవద్వారా ఈ లోకం ఆయనను ప్రభువుగా గుర్తిస్తుంది. ప్రభువు సన్నిధిలో, వందన వచనములు  ఎలిశబెతమ్మ చెవినపడగానే, ఆమె గర్భ మందలి శిశువు (బప్తిస్మ యోహాను) గంతులు వేసెను.

క్రీస్తు మన మధ్యలో ఉన్నప్పుడు, మనలో సంతోషము, ఆనందము తప్పక ఉంటాయి. క్రీస్తు మన హృదయములో నున్నప్పుడు, జన్మించినప్పుడు, మన హృదయాలు, మనస్సులు ఆనందముతో గంతులు వేస్తాయి. ప్రభువు మనతో ఉంటే, మనకు ఆశీర్వాదము, శాంతి సమాధానాలు ఉంటాయి.

పవిత్రాత్మ వరముతో,  ఎలిశబెతమ్మ గర్భములోనున్న శిశువు గంతులు వేయడమేగాక,  ఎలిశబెతమ్మ కూడా ఎలుగెత్తి ఇలా పలికింది: "స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు. నీ గర్భ ఫలము ఆశీర్వదింప బడెను." మరియమ్మ జీవితములో గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనను, ధన్యతను పొందినది. దీనికి ముఖ్య కారణం, "ప్రభువు పల్కిన వాక్కులు నేరవేరునని మరియమ్మ విశ్వసించినది" (లూకా 1:45). మరియ ద్వారా ఈ లోకానికి వచ్చు ఆ శిశువు "యేసు" అను పేరు పొందును. మహనీయుడై, మహోన్నతుని  కుమారుడని పిలువబడును. ప్రభువైన దేవుడు, తండ్రియగు దావీదు సింహాసనమును పొందును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు (లూకా 1:31-33). గబ్రియేలు మరియమ్మతో పలికిన వాక్కులు.

ప్రభువు మనతో కూడా ఈనాడు మాట్లాడు చున్నాడు. ఆయన పలుకులు తప్పక నెరవేరుతాయని విశ్వసించుదాం. ఆ విశ్వాసము వలననే దేవుడు మనలనుకూడా ఆశీర్వదిస్తాడు. మరియమ్మ తన జీవితాంతము దేవునికి విశ్వాసపాత్రురాలుగా జీవించినది. ఆమె విశ్వాసము వలననే, దేవుని ప్రణాళికకు, చిత్తానికి  "నీ మాట చొప్పున నాకు జరుగునుగాక" అని చెప్ప గలిగినది.

మన అనుదిన జీవితములో, ప్రభువు మనలో తన ఉనికిని గ్రహించుటకు అనేక ఆనవాళ్ళను ఇస్తూ ఉంటాడు. అనేక సంఘటనలద్వారా, వ్యక్తులద్వారా, తన ఉనికిని చాటుతూ ఉంటాడు. జ్ఞానస్నానములోను, భద్రమైన అభ్యంగనమున పొందిన పవిత్రాత్మ, మనం విశ్వాస కన్నులతో చూచునట్లు సహాయం చేయును. దైవరాజ్యమును స్వీకరించుటకు సిద్ధపడునట్లు చేయును.

క్రిస్మస్ దినమున, పభువును స్వీకరించుటకు ఆయత్త పడుదాం!

ఆద్యంత రహితులైన ఓ సర్వేశ్వరా! మా మనసులను మీ కృపతో నింపుడు. ఈ విధమున మీ దూత సందేశముద్వారా, మీ కుమారుని మనుష్యావతార వార్తనందుకొనిన మాకు ఆయన సిలువ పాటుల ఫలితమున ఆయన పునరుత్థాన మహిమలో చేరు భాగ్యము లభించునుగాక!

ఆగమనకాల మూడవ ఆదివారం, YEAR C

ఆగమనకాల మూడవ ఆదివారం, YEAR C
పఠనాలు: జెఫన్యా 3:14-18, ఫిలిప్పీ 4:4-7, లూకా 3:10-18

"ప్రభువునందు మీరు ఎల్లప్పుడును ఆనందింపుడు! మరల చెప్పుచున్నాను! ప్రభువు త్వరలో విచ్చేయుచున్నాడు."
[ఆనంద ఆదివారము, Gaudete Sunday]

సంతోషం / ఆనందం / పరమానందము

సంతోషంగా ఉండాలని అందరు కోరుకొంటారు
అందరు సంతోషంగా ఉండాలని కొందరు కోరుకొంటారు
తమ సంతోషం కొరకు, ఇతరుల సంతోషం కొరకు అం(కొం)దరు శ్రమిస్తారు.

ఆ సంతోషమునే ధ్యేయముగా, లక్ష్యముగా చేసుకోవాలని ఈనాటి పఠనాలు ప్రభోదిస్తున్నాయి: మారు మనస్సు, మరోమార్గం, మంచిమార్గం, మంచిజీవితం అని ఎడారిలో బోధిస్తున్న యోహాను సందేశమును వినుటకు వచ్చినవారు, యోహాను సందేశమునకు స్పందించి, ఆ సంతోష జీవితమును పొందుటకు "మేము ఏమి చేయవలెనను" అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నను ఈనాటి ధ్యానంశముగా చేసుకొని, ఈ ప్రశ్నకు సమాధానమును సువార్తలోను, మొదటి రెండు పఠనాలలోనూ చూద్దాం!

సంతోషమునకు కారణములెన్నో ఉన్నాయి (ఉంటాయి). ఏదైనా పొందినప్పుడు, అనుకున్నది సాధించినప్పుడు, ప్రేమగా చూసే వారి చెంత ఉన్నప్పుడు, మనలను అర్ధం చేసుకొనే వారున్నప్పుడు... ఇలా ఎన్నో!

మొదటి పఠనములో, జెఫన్యా ప్రవక్త ఇస్రాయేలీయులతో "ఆనందించండి, హర్షద్వానము చేయండి, నిండు హృదయముతో సంతసించండి." అని ఆనంద గీతాన్ని పలుకుచున్నాడు. ఎందుకనగా, మీకు విధించబడిన తీర్పు, శిక్ష తొలగించబడినవి. మీ శత్రువును ప్రభువు చెల్లాచెదరు చేసెను. అన్నటికంటే ముఖ్యముగా "ప్రభువు మీ మధ్యనే ఉన్నారు." ప్రభువు మీ చెంతనే ఉన్నారు, ప్రభువు మీతో ఉన్నారు. అందుకే భయపడకుడి. దైవభయం (భీతి) తప్ప మీలో ఏ భయం ఉండకూడదు. నిర్భయముగా ఉండండి. మీ చేతులను వ్రేలాడ నీయకుము, (చేతులను వ్రేలాడనీయడం అనగా శక్తి లేక, బలము లేక, పోరాడక, చేస్తున్న పనిని వదిలి వేయడం). నీలో సత్తువ సన్నగిల్లినను, నీలో(తో) ఉన్న ప్రభువు నీచేత మంచి కార్యములు జరిగిస్తాడు. నీ సంతోషమును నీ ద్వారా ఇతరులకు సంతోషమును కలుగ జేస్తారు. చితికిన, నలిగిన, విరిగిన నీ పైనే (నా పైనే) ప్రభువు అండగా ఉండి సంతోషమును కలుగ జేస్తారు. దైవప్రజలు దేవున్ని ఎడబాసి అన్య దేవుళ్ళను కొలుస్తున్నారు. అలాంటి సందర్భములో, వారి జీవితములో గొప్ప మార్పు సంభవించబోతున్నదని తెలియజేయు చున్నాడు. వారిలో ఓ గొప్ప ఆశను నింపుచున్నాడు. ఆ ఆశ కొరకే మనం మెస్సయ్య అయిన క్రీస్తు కొరకు ఎదురుచూస్తూ ఉన్నాము.

అందుకే ఇశ్రాయేలు జనమా, యేరూషలేము నగరమా, సియోను కుమారీ! సంతసించండి. సంతోషముగా ఉండటానికి ఆయన కీర్తనలు పాడండి. ఆయన మీ(నా)తో, మీ(నా)లో ఉన్నారని గుర్తించండి. ఆయన రాజుగా, అధిపతిగా, నాయకుడిగా ముందుండి మన(నా)తో ఉండి నడిపిస్తున్నాడని తెలుసుకోండి. ఎవరులేకున్నా ఆయన ఉన్నాడని, ఉంటాడని విశ్వసించండి. సంతోషముగా ఉండటానికి ఈ ఒక్క కారణం చాలదా?

రెండవ పఠనములో, పునీత పౌలు ఇదే సంతోషాన్ని ధృఢపరుస్తున్నారు. అనుభవపూర్వకముగా ఆయన మనకిస్తున్న సందేశమిది. క్రీస్తు సందేశమును భోధించినందుకు, ఖైదీగా ఉండి, శిక్ష (మరణ శిక్ష) విధించబడి, ఆ శిక్ష అమలుకొరకు ఎదురు చూస్తున్న పౌలు వ్రాసిన సందేశమిది. ఆయనలో విచారం లేదు, దు:ఖం లేదు, ఆతురత అంతకంటే లేదు. ఎందుకంటే, ఈ సమయములోనే ప్రభువు యొక్క సన్నిధిని, సహవాసమును, ఆదరణను, ప్రేమను ఆయన అనుభవించారు. ఆ అనుభవముతో చెప్పిన (వ్రాసిన) సందేశమే. "ఆనందించండి, ప్రభువునందు ఎల్లప్పుడును ఆనందించండి" (ఫిలిప్పీ 4:4). ఎందుకంటే, ప్రభువుకు సాధ్యము కానిది ఏదీలేదు (చూ. లూకా 1:37, యిర్మి. 32:27). ఆయన ఆధీనములో లేని పరిస్థితి ఏదీలేదు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా, ధైర్యముగా ఎదుర్కొనండి. విచారించకండి. అది మిమ్ము, మీనుండి, దేవుని నుండి దూరం చేస్తుంది. కాబట్టి, కృతజ్ఞతతో కూడిన ప్రార్ధనతో దేవునికి దగ్గరగా రండు. ఆయన మీ (నీ)తో ఉన్నాడని తెలుసుకోండి. అప్పుడు మీకు సమాధానం, దేవుని శాంతి మీ హృదయములను, మనస్సులను భద్రముగా ఉంచుతుంది. ఇంతకంటే, ఇంకా ఏమి కావాలి సంతోషముగా ఉండటానికి? పౌలు ప్రభువు రెండవ రాకడ గురించి ఎదురుచూసే సందర్భమున, ప్రభువు రాకతో కలుగు సంపూర్ణ ఆనందము (పరమానందము), సమాధానము గురించి చెప్పుచున్నారు.

సువిశేష పఠనములో, "మేము ఏమి చేయవలయును?", "మా కర్తవ్యము ఏమి?" (లూకా 3:10,12,14) అని అడిగిన వారికి సంతోషము గురించి బాప్తిస్మ యోహాను తనదైన శైలిలో జనులకు, సుంకరులకు, రక్షక భటులకు తెలియజేయు చున్నాడు: సామాన్య జనులు దుస్తులను, భోజన పదార్ధములను ఏమీ లేనివారితో పంచుకోవాలి; సుంకరులు నిర్ణయింప బడిన పన్నుకంటే అధికముగా ఏమియు తీసికొనవలదు (చదువుము మత్త. 16:26; 1 తిమో 6;10); రక్షకభటులు బలాత్కారముగా గాని, అన్యాయారోపణ వలన గాని, ఎవ్వరిని కొల్లగొట్ట వలదు. వేతనముతో సంతృప్తి పడుడు. 

వారి జీవితాలను, దానికి కావలసిన పనిని మానుకోమని యోహానుగారు చెప్పడంలేదు. దానిని నిజాయితీగా చేయమని చెబుతున్నాడు. ఇప్పటి వరకు వీరు ఎంత ఎక్కువ ఇతరులనుండి పొందితే అంత ఎక్కువ సంతోషం తమ స్వంతమవుతుందని అనుకొన్నారు. దానికి భిన్నముగా యోహానుగారు నిజమైన సంతోషం 'ఇవ్వడములో' ఉన్నదని బోధిస్తున్నారు. ఇప్పటి వరకు పొందాలని (ఎక్కువ పొందాలని) తమ వారినుండి దూరమయ్యారు. ఇకనుండి ఇస్తూ, తమకున్న దానిని ఇతరులతో పంచుకొంటూ సంతోషాన్ని పొందండని, దేవుని ప్రత్యక్షతను (సన్నిధిని) అవసరం ఉన్న ప్రతీ సోదరిలోను, సోదరునిలోను గుర్తించి, అనుభవించండని పిలుపునిస్తున్నాడు. అలాగే, నిజమైన సంతోషమును ఒసగు మెస్సయ్య రాక కొరకు ప్రజలను సంసిద్ధం చేయుచున్నాడు (పశ్చాత్తాపం, మారుమనస్సు, హృదయ పరివర్తన, జీవితశైలిలో మార్పు, జీవితములో పునరుద్ధరణ, జ్ఞానస్నానం). 

మనం ఏమిచేద్ధాము? మనకు సాధ్యమయ్యే చిన్నచిన్న విషయాలనే, చాలా సాధారణమైన విషయాలనే చేయాలని యోహాను చెప్పారు. వాటిని హృదయపూర్వకముగా, చిత్తశుద్ధితో చేయాలి. మన బాధ్యతలను సక్రమముగా, సరిగా నిర్వహించుదాం. సోదరప్రేమతో జీవిద్దాం (చదువుము అ.కా. 2:36-39).

క్రైస్తవ ఆనందం దేవుని వరం. ఎవరుకూడా దానిని మనలనుండి తీసివేయలేరు. నిజమైన ఆనందం క్రీస్తునందే! తన మరణం, ఉత్థానం ద్వారా, మనకు నిజమైన స్వర్గీయ ఆనందాన్ని ఒసగాడు. ఆ సంపూర్ణ ఆనందాన్ని పొందాలంటే, యోహాను బోధించిన విధముగా, హృదయపరివర్తన చెందాలి. దేవుని వైపునకు మరలాలి. అన్యాయాన్ని అధిగమించి, న్యాయపరమైన సమాజాన్ని నిర్మించాలి. మన ప్రవర్తనలో నీతి, న్యాయం, నిజాయితీ, నైతికత ఉండాలి.

యోహానే క్రీస్తేమో! - యోహాను గొప్ప వినయం: యోహాను బోధనలను విన్న ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో! అని తమలోతాము ఆలోచించు కొన్నారు. ఇచ్చట యోహాను వినయాన్ని ఆదర్శముగా తీసుకోవాలి. తననుతాను తగ్గించుకొని, "నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను" అని ప్రజలకు స్పష్టం చేసాడు. రానున్నవాడు పవిత్రాత్మతోను, అగ్నితోను జ్ఞానస్నానము చేయించును. ఆ అగ్ని చెడును ధ్వంసముచేసి మంచిని పోషించును. ఆత్మ మనలను దేవుని బిడ్డలుగా చేయును. అది నిజమైన సంతోషం! కనుక, మనం పవిత్రాత్మ కొరకు ప్రార్ధన చేయాలి (చదువుము యోహాను 14:16). అలాగే, మనము  మన జీవితముద్వారా, మన క్రియలద్వారా, ప్రభువును హెచ్చించాలి, దేవున్ని మహిమ పరచాలి.

తీర్పు దినమున (లూకా 3:17) మనలను తూర్పారబట్టుటకు క్రీస్తు చేతియందు చేట సిద్ధముగా ఉన్నది. కనుక, మంచి జీవితముద్వారా, గింజల వలె గిడ్డంగులలో అనగా దైవరాజ్యములో ప్రవేశించుదాం. చెడు జీవితమును జీవిస్తే, పొట్టువలె అగ్నిలో వేసి కాల్చివేయబడతాము. కనుక, ప్రభువును కలుసుకొనుటకు సంసిద్ధ పడదాం. పవిత్ర జీవితముతో ప్రభువును ఆహ్వానిద్దాం.

త్రిలోక అధినేతవైన ఓ సర్వేశ్వరా! ఈ ప్రజలు రక్షకుని రాకకై ఉత్సాహముతో వేచియుండుట మీరు కాంచుచున్నారు. అట్టి ఘన రక్షణానందమును చేరుకొనను, ఆ ఉత్సవములను ఎల్లప్పుడు గొప్ప వేడుకతో చేసికొనను, మాకు మీ కృపను ప్రసాదింపుడు.

ఆగమనకాల రెండవ ఆదివారము, YEAR C

ఆగమనకాల రెండవ ఆదివారము, YEAR C
బారూకు గ్రంధము 5:1-9; ఫిలిప్పీ 1:4-6, 8-11; లూకా 3:1-6

ప్రభువు మార్గములో నడచెదము

సియోను వాసులారా! వినుడు. ప్రజలను రక్షించు నిమిత్తము రక్షకుడు వచ్చును. ఆయన వచ్చి తన ఇంపైన స్వరమును మీ హృదయములకు ఆనందకరముగా వినిపింపజేయును.

ఈరోజు శ్రీసభ మనకు ఒక గొప్ప వ్యక్తిని ఆదర్శముగా చూపిస్తూ ఉంది. అతడే పునీత బప్తిస్మ యోహాను. ప్రవక్తలందరిలోకెల్ల గొప్ప ప్రవక్త, చివరి ప్రవక్త బప్తిస్మ యోహాను. దేవుని వాక్యాన్ని ఆలకించి, దానిని మనసారా స్వీకరించి, దైవ ప్రజలకు అందించడం ప్రవక్తల మొదటి కర్తవ్యం. కనుక ప్రవక్త దేవునికి ప్రజలకు మధ్యవర్తి.

అలాంటి ప్రవక్తలలో ఒకరైన యెషయా ప్రవక్త పలికిన మాటలు, బప్తిస్మ యోహాను జీవితము ద్వారా నిజమవుతూ ఉన్నాయి. "ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు" (యెషయ 40:3; లూకా 3:4) అని ప్రవక్త పలికిన ఈ మాటల ద్వారా బప్తిస్మ యోహాను దైవప్రజలను ప్రభువు మార్గములోనికి ఆహ్వానించియున్నాడు. ప్రభువు రాకకోసం మార్గమును సిద్ధము చేయాలని కోరుతున్నాడు. యోహాను ప్రభువు రాకకోసం ప్రజలను సిద్ధము చేసాడు. పశ్చాత్తాపము, జ్ఞానస్నానము అను మార్గములద్వారా ప్రజలను సిద్ధముచేసి ముందుకు నడిపించాడు. ప్రవక్తగా, ప్రభువు మార్గమును సిద్ధపరచడం, ప్రభువును అనుసరింపగోరువారికి పశ్చాతాపముగూర్చి ప్రకటించడం యోహాను పాత్ర. ప్రభువు దరికి వచ్చు వారి జీవితాలను సక్రమం చేయడం ఆయన భాద్యత.

మొదటి పఠనములో బారూకు ప్రవక్త చెప్పిన విధముగా: "ప్రతీ లోయ పూడ్చబడును. పర్వతములు, కొండలు సమము చేయబడును. వక్రమార్గములు సక్రమము చేయబడును. కరకు మార్గము నునుపు చేయబడును" (5:7; లూకా 3:5). మొదటి పఠన నేపధ్యము, ఇశ్రాయేలు ప్రజల బానిసత్వ ముగింపును, రక్షణ (మార్గము)ను, త్వరలో వారు పొందబోవు ఆనందమును ఈ వాక్యం సూచిస్తుంది. ఈవిధముగా, ప్రభువు తన ప్రజల పాపములను క్షమించి తన దయను చూపును.

క్రీస్తు రాకకొరకు మనలను మనం తయారుచేసుకొనే ఈ పవిత్ర ఆగమన కాలములో, మనలోనున్న లోయలగు చెడును తీసివేయడానికి ప్రయత్నించాలి. అలాగే, గర్వాన్ని, అహంకారాన్ని విడచి పెట్టాలి. మనం తీసుకొనే చెడు నిర్ణయాలకు స్వస్తి చెప్పాలి. మనలో ఉన్న రాతి హృదయాన్ని కరిగించమని ప్రభువును వేడుకోవాలి. పాపము మన రక్షణ మార్గమునకు ఆటంకము. రక్షణ మార్గమునకు మొదటి మెట్టు నిజమైన పశ్చాత్తాపము, పరిపూర్ణమైన ప్రేమ. రక్షణ అనేది దేవుని వరం. అయినను, మన కృషిని, సహకారాన్ని దేవుడు ఆశిస్తాడు. 'యేసు క్రీస్తునందు విశ్వాసము' మనకు రక్షణ వరము లభింప జేయును: 1). క్రీస్తు పిలుపును (మార్కు 1:17; 2:14) అందుకొని ఆయనను అనుసరిస్తూ, ఆయన ప్రేషిత కార్యములో భాగస్తులం కావాలి. 2). క్రీస్తు శ్రమలు, మరణములో పాల్గొనునట్లు చేయు ఆయన సిలువను అంగీకరించాలి (మత్తయి 16:24). అన్నింటికన్న, ఆయనను పరిపూర్ణముగా ప్రేమించాలి. 3). అన్ని విషయములలో క్రీస్తును అనుసరించాలి, అనుకరించాలి (యోహాను 12:26).

అయితే, ఇక్కడ మనం ఒక ముఖ్య విషయాన్ని గ్రహించాలి. మనం ప్రభు చెంతకు వెళ్ళటం కంటే కూడా, ఆ ప్రభువే మన చెంతకు వస్తూ ఉన్నాడు. మనం ఆయన చెంతకు వెళ్లకముందే ఆయన ఒక అడుగు ముందుకేసి మనకన్న ముందుగా మన దగ్గరకు వస్తున్నాడు. ఎందుకన, రక్షణ కార్యములో మొదటి అడుగు వేసింది ప్రభువే కదా! కనుక, క్రిస్మస్ పండుగ రోజున దేవుడే మానవ రూపాన్ని ధరించి యేసు అను వ్యక్తిగా మన మధ్యకు వస్తూ ఉన్నాడు. ఆ గొప్ప ఘడియనే మనం క్రీస్తు జయంతిగా కొనియాడుతూ ఉన్నాము. ఒక విధముగా దేవుడే మనకు మార్గాన్ని తయారు చేస్తున్నాడు. ఆ మార్గములో మనలను నడచుకోమని, జీపించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకే ప్రభువు "నేనే మార్గమును, సత్యమును, జీవమును" (యోహా 14:6) అని చెప్పారు. కనుక, ప్రభువు పిలుపును గుర్తించి, గ్రహించి, అది ఒక భాద్యతగా స్వీకరించి, ప్రభువుకు సమాధానం చెప్పాలి. ఆయన మార్గములో నడవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ప్రభువు మార్గము మన మార్గాలకన్న భిన్నమైనది. ఆయన మార్గము రక్షణ మార్గము. "ప్రతీ ఒక్కరు దేవుని రక్షణమును కాంచును" (లూకా 3:6) అని సువార్తలో వినియున్నాము. కనుక, ఎవరైతే ప్రాపంచిక మార్గాలను విడిచి, ప్రభువు చూపించే మార్గములో నడుచుకొంటారో, వారు తప్పక ఆయన రక్షణములో పాలు పంచుకొంటారు.

దేవుని వాక్యము ఎడారిలో జీవించే బప్తిస్మ యోహానుగారికి వినిపించింది. మనుగడలేని ఎడారిలో ఆయన దేవుని వాక్కును వినగలిగాడు. అదేవిధముగా, మన జీవితములో కూడా కొన్ని సందర్భాలు ఎడారిగా మారుతూ ఉంటాయి. జీవితములో కష్టం వచ్చినప్పుడు, నిరాశ కలిగినప్పుడు, జీవితం అంధకారముగా కనిపించినప్పుడు, ఎటు వెళ్ళాలో దారి తెలియనప్పుడు, మన జీవితం ఎడారిలా కనిపిస్తుంది. ఒంటరివారము అవుతాము. జీవం లేనివారముగా ఉంటాము. బ్రతకాలన్న ఆశ కూడా ఉండదు. ఈ సందర్భాలన్నీ మన జీవితములో ఒక ఎడారి అనుభవాన్ని తలపిస్తాయి. కాని, మన దేవుడు, ఆయన వాక్కు ద్వారా మనతో మాట్లాడతాడు. ఇలాంటి సందర్భాలలోనే అనేకమంది ప్రవక్తలు దైవపిలుపును పొందియున్నారు. వారిలాగా మనము కూడా మన అంత:రంగమునుండి దేవుని వాక్యాన్ని విని, ధ్యానించినట్లయితే, మనంకూడా తప్పక ఆయన ప్రేమ పిలుపును పొందగలుగుతాము. ఆయన ప్రేమ పలుకులు మనకు జీవాన్ని ఇస్తాయి.

కష్టసమయములో ప్రవక్త ఒక నూతన సృష్టిగా మారతాడు. దేవుని వాక్కును విని, గ్రహించి తనలో ఉన్న దైవశక్తి చేత నూతన వ్యక్తిగా తయారవుతాడు. అదేవిధముగా, ఈ పవిత్ర ఆగమన కాలములో దేవుడు తన వాక్యముద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రవక్తలవలె మనం కూడా దేవుని వాక్యాన్ని విని, గ్రహించినట్లయితే, మనంకూడా నూతన వ్యక్తులుగా తయారు కావడానికి ఆస్కారం ఉంటుంది. కనుక, కష్ట సమయాలలో అధైర్యం చెందక ఉండాలి. దేవుని వాక్య సహాయముతో ఒక నూతన జీవితానికి నాంది పలుకగలుగుతాము. దేవుడు ప్రతీ రోజు నూతన జీవితానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు.

ఆగమన కాలంలో, 'ప్రభువు వస్తున్నాడు' అన్న సందేశం మన హృదయాలలో మ్రోగుతూ ఉంటుంది. ఆ సంతోషకర సందేశమే మనలను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ప్రభువు రాకతో, తన జీవితాన్ని, ప్రేమను మనతో పంచుకొంటున్నాడు. అదే సమయములో, మన జీవితాన్ని, ప్రేమను దేవునితోను, ఇతరులతోనూ పంచుకోవాలని  ఆహ్వానిస్తున్నాడు. యోహాను ప్రకటించిన 'క్రీస్తు రాకడ' కొరకు విశ్వాసముతో నిరీక్షించాలి. ప్రభువు రాకను స్వాగతించి, ఆయనకు మన హృదయాలలో స్థానం ఇవ్వాలి.

యోహానువలె మనముకూడా ఈనాడు మన సంఘములో ప్రవక్తలుగా మారాలి. ఇతరులకు మార్గచూపరులుగా ఉండాలి. ఇతరుల జీవితాలలో వెలుగును నింపాలి. ప్రభువు దరికి రావడానికి వారికి మార్గమును సిద్ధపరచాలి. దేవుని వాక్యమును బోధించాలి.

ఈ నిరీక్షణలో మరియమ్మగారిని ఆదర్శముగా తీసుకొందాం. లోకరక్షణకోసం ఆమె ఎంతగానో నిరీక్షించారు. తననుతాను సిద్ధంచేసుకున్నారు. ప్రార్ధనలు చేసారు. దేవునివాక్యం విని ధ్యానం చేసారు.  మరియతల్లి ప్రార్ధన సహాయం మనకు తోడ్పడునుగాక!

రెండవ పఠనములో మూడు అంశాలను చూడవచ్చు: 1). కృతజ్ఞత: ఫిలిప్పీ క్రైస్తవుల ఉదారస్వభావాన్నిబట్టి, తన అపోస్తోలిక కృషిలో వారు చేసిన సహాయాన్ని బట్టి, పౌలు సంతోషముతో దేవునకు కృతజ్ఞతలు తెలియజేయు చున్నాడు. వారియందు దేవుడు ప్రారంభించిన మంచి పనిని సంపూర్ణము చేయును. 2). ప్రేమయందు ఎదుగుదల: దైవప్రేమ, సోదర ప్రేమ వారిలో ఎదగాలని ఆశిస్తున్నాడు. వారి ప్రేమ వర్ధిల్లాలని పౌలు ప్రార్ధన చేయుచున్నాడు. 3). క్రీస్తు దినము: క్రీస్తు దినమున వారు కల్మషము లేనివారుగా, నిర్దోషులుగా ఉండాలని ఆశిస్తున్నాడు. అది వారి ప్రేమద్వారా సాధ్యమగును.

సర్వశక్తి వంతులును, కనికరపూరితులైన ఓ సర్వేశ్వరా! మీ కుమారునికై ఎదురేగ ఉత్సాహముతో వచ్చు మమ్ము లోక అవరోధములేవియు ఆటంకపరపకుండునుగాక. స్వర్గీయ జ్ఞాన సంపూర్ణమును, ఆయనతో నేకమగు భాగ్యమును మాకు ప్రసాదింపుడు.

ఆగమనకాల మొదటి ఆదివారం, Year C


ఆగమనకాల మొదటి ఆదివారం, YEAR C
యిర్మియా 33:14-16; 1 తెస్స 3:12-4:2; లూకా 21:25-28, 34-36
ప్రభువు వచ్చుచున్నాడు – సిద్ధపడుదాo

    ఈరోజు మనము, ఆగమన కాలాన్ని ప్రారంభిస్తున్నాము. దీనితో నూతన దైవార్చన సంవత్సరాన్ని ఆరంభిస్తున్నాము. ప్రభువురాక కొరకు మనం సిద్ధపడాలని తల్లి తిరుసభ మనలను కోరుచున్నది. యేసు రాకను ధ్యానించి, సిద్ధపడే కాలము. మన జీవితములో దేవుని వాగ్దానాలు పరిపూర్ణమయ్యే కాలము. దేవుని వాగ్దానాలు యేసు ప్రభువు ద్వారా నెరవేరబడతాయి. 

    ‘ఆగమనము’ అనగా ‘ఎదురు చూడటం’. మనం ప్రేమించే వారి కొరకు, ఇష్టపడే వారికొరకు, ఎంతో ఆతురతతో ఎదురు చూస్తూ ఉంటాము; వారి కొరకు మన సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాము. ఆగమనం సంతోషముతో కూడుకొన్న కాలము; ప్రేమతో చూసే ఎదురు చూపు. ఇచ్చట మనం యేసు కొరకు ఆతురతతో ఎదురు చూస్తూ ఉన్నాము. ఈవిధముగా, దేవుడు మానవుడయ్యే గొప్ప సంఘటన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము.

    ప్రభువు ఆగమనం మూడు అంశాలతో ఉన్నది: మొదటగా, గతములోనికి చూస్తూ 2000 సం.ల క్రితం చరిత్రలో జరిగిన యేసు జన్మమును కొనియాడుట. రెండవదిగా, ప్రస్తుత కాలములో, మన అనుదిన జీవితములో ప్రభువును స్వీకరించుటకు సిద్ధపడుట. ప్రభువును మనం వాక్యము ద్వారా, దివ్యబలి పూజలో స్వీకరిస్తూ ఉన్నాము. మూడవదిగా, భవిష్యత్తులోనికి చూస్తూ ప్రభువు తన మహిమలో అంత్యకాలములో వచ్చుట కొరకు ఎదురు చూచుట. ప్రభువు రాకడలో వాగ్దానం, ప్రేమ, సంసిద్దత, జాగరూకత, ఆత్మ పరిశీలన, ప్రార్ధన, కొత్త ఆరంభం, పరిపూర్ణత ఉన్నాయి.

ఈనాటి పఠనాలు, ఆధ్యాత్మికముగా, పైన చెప్పిన మూడు అంశాలపై ధ్యానించమని ఆహ్వానిస్తూ  ఉన్నాయి. మొదటి పనములో యిర్మియా ప్రవక్త శిధిలమైన, అభద్రతలోనున్న యేరూషలేమునకు భోధిస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం, ‘హృదయ పరివర్తన చెందుడు’ అన్న పిలుపును వారు పెడచెవిన పెట్టియున్నారు. దేవుని వారు నిర్లక్ష్యం చేసి, వారికున్న వనరుల మీద, ఇతర దేశాలతో కూటమి ఏర్పాటు చేసుకోవడములో వారి భద్రతను చూసుకొన్నారు. యిర్మియా ప్రవక్త, వారి వినాశనాన్ని వారిస్తూనే, వారి ఉజ్వల భవిష్యత్తును చూస్తూ ఉన్నాడు. దీనికి ముఖ్య కారణం, దేవుడు తాను చేసిన వాగ్దానాలకు విశ్వసనీయముగా ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసాడు, “నిన్నెక్కువ దీవింతును. ఆకాశము నందలి నక్షత్రములవలె, సముద్ర తీరమునందలి ఇసుకరేణువులవలె, లెక్కకందనంతగా నీ సంతతిని విస్తరిల్ల జేయుదును” (ఆ.కాం. 22:17; 26:4). వారి శత్రువులను జయించి, వారి ద్వారా సకల జాతి జనులు  దేవుని ఆశీర్వాదాలు పొందుదురు. ఆ తర్వాత, దేవుడు దావీదుతో వాగ్దానం చేసాడు (యిర్మి. 23:5; 33:15). వారికి ఒక నీతిగల రాజు వస్తాడని, ఆయన ద్వారా దేశమంతట నీతిన్యాయములు, భద్రత నెలకొనునని ప్రవక్త తెలియ జేయుచున్నాడు. దేవుని వాగ్దానం యేసు రాకతో నెరవేరింది. యేసు ప్రభువు, దేవుని వాగ్ధాన పరిపూర్ణం.

రెండవ పనములో పౌలు ప్రభువు చివరి రాకడ గురించి తెలియజేస్తూ, ప్రభువు రాక కొరకు ఎలా సిద్ధపడాలో చక్కని సలహా ఇస్తున్నాడు. ప్రభువు రాకడ ఎంతో వైభవముగా, మహా మహిమతో ఉంటుంది. ప్రభువును మన అనుదిన జీవితములో ‘ఇప్పుడు, ఇక్కడే’ స్వీకరించాలని పౌలుగారు ఆహ్వానిస్తూ ఉన్నారు.

ఈవిధముగా, ప్రభువు అనుచరులమైన మనము బెత్లేహేములో జరిగిన ప్రభువు రాకడను, జన్మను గుర్తించి, మనకు తెలియని భవిష్యత్తులో రాబోయే ప్రభువు రాకకొరకు సిద్ధపడాలి. దీనినిమిత్తమై, మనము పవిత్రమైన జీవితాలను జీవించాలి. ప్రభువు వచ్చునప్పుడు మనం ఒకరినొకరు ప్రేమిస్తూ జీవించాలి, ప్రేమలో, ప్రేమగా జీవించాలి. మన ప్రేమ మన వారిపై మాత్రమేగాక, మన ప్రేమ మన విరోధులపై, శత్రువులపై కూడా ఉండాలి. ఎందుకన, వారు కూడా దేవుని బిడ్డలే, దేవుని పోలికలో సృష్టింపబడ్డారు. మన హృదయాలు, దేవుని సన్నిధిలో పవిత్రముగా ఉండాలి, నిష్కళంకముగా ఉండాలి. దీనిని మనం సాధించాలంటే, మనం పరిశుద్దాత్మలో నడవాలి. మనం పవిత్రతలో నడచుటకు మనకు క్రమశిక్షణను నేర్పుతుంది. దేవుని సహవాసములో ఉంటూ, క్రీస్తువలె మనము మారవలెను. మనం నిండిన విశ్వాసములో జీవించినప్పుడే ఇది సాధ్యమవుతుంది.

సువిశేష పనము లోకాంత్యము గురించి, ప్రభువు రాకడ గురించి బోధిస్తూ ఉన్నది. ప్రభువును కలవడానికి మనం ఎలా సిద్ధపడాలో తెలియజేస్తూ ఉన్నది. ప్రభువు పునరాగమనమునకు ముందు జరగబోయే సంఘటనల తర్వాత (లూకా 21:25-26), “మనుష్య కుమారుడు శక్తితోను, మహా మహిమతోను ఆకాశమున మేఘారూరుడై వచ్చుటను వారు చూచెదరు” (21:27). ఈ లోకములో మన జీవితం ఒక ప్రయాణమని, యాత్ర అని, ఈ భూలోకం మన చివరి గమ్యం కాదని గుర్తుకు చేస్తుంది. యేసు క్రీస్తు ప్రభువు మన చివరి గమ్యం, నిరీక్షణ. ఈ సందర్భముననే, ప్రభువు రెండవ రాకడ గురించి సువిశేషం బోధిస్తున్నది. జరగబోయే సంఘటనలు (21:25-26) ప్రభువు రాకడ దగ్గర ఉన్నదని సూచిస్తూ ఉన్నాయి, “ఇవన్ని సంభవించినప్పుడు, మీ రక్షణ కాలము ఆసన్నమైనది” (21:28). ప్రభువు రాకడ, ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలె వచ్చి పడును (21:34). కావున, మనం అప్రమత్తులై ఉండవలయును, ఎల్లప్పుడును జాగరూకులై ప్రార్ధన చేయాలి (21:34-36).

ప్రభువు రాకడ ఆయన తీర్పు కొరకు. ఇది తీర్పు దినము కనుక మనం మారుమనస్సు పొందాలని, సేవా జీవితాన్ని గడపాలని సువిశేషం ఆహ్వానిస్తూ ఉన్నది. లూకా సువార్తలో 'అంత్యదినము' అనగా దేవుని చిత్తము పరిపూర్తియగుట. అందుకే ఆ దినమును “ప్రభువు దినము”గా పిలువబడుచున్నది. లోకాశాలకు గురికాకూడదని ప్రభువు కోరుచున్నారు (21:34). ఆయన రాకకై ఎదురు చూడాలి. ఇలా నిత్యజీవితం కొరకు సిద్ధపడాలి.

ఆగమన కాలము (ఆగమన కాలము గురించి క్లిక్ చేయండి)