సర్వాధికారియగు క్రీస్తు రాజు మహోత్సవము, Year B

సర్వాధికారియగు క్రీస్తు రాజు మహోత్సవము, Year B
కడపటి (34 ) సామాన్య ఆదివారము
పఠనములు: దానియేలు 7:13-14; భక్తి కీర్తన 93:1-2,5; దర్శన గ్రంధము 1:5-8; యోహాను 18:33-37

బలియైన గొర్రెపిల్ల అధికారమును, దైవత్వమును, వివేకమును, శక్తి సామర్ధ్యములను, మహిమలను పొందుటకు అర్హత కలిగియున్నది. దీనికే యుగయుగముల పర్యంతము మహిమ రాజ్యాధికారములు లభించును.

సర్వేశ్వరుడు రాజ సింహాసనమందు ఆసీనుడై యుండును. ఆయన తన ప్రజలకు శాంతి వరమును ప్రసాదించును (కీర్తన 29:10-11).

ఈ రోజు దైవార్చన సం,,లో చివరి ఆదివారము మరియు ఈ రోజు సర్వాధికారియగు క్రీస్తు రాజు మహోత్సవమును కొనియాడుచున్నాము. ప్రపంచ దేశాలెన్నో గతములో రాజులచేత పరిపాలించబడ్డాయి. రాజుల పాలనను మనం చూడక పోయిన, ఎంతగానో వినియున్నాము కాబట్టి, ఎంతో కొంత అవగాహన మనందరికీ ఉన్నది. ఎంతోమంది గొప్ప గొప్ప రాజుల చరిత్రలు మనకు తెలుసు. అలాగే పాలితులను, రాజ్యాలను కొల్లగొట్టి వినాశనము చేసిన రాజుల చరిత్రలూ మనకు తెలుసు. రాజు అనగానే, మన మదిలో మెదిలేది భయం, క్రూరత్వం, సైన్యం, యుద్ధం మొ,,వి. రాజు అనేవాడు తన ప్రజలకు ఓ గొర్రెల కాపరివలె, ప్రేమించే హృదయాన్ని కలిగి యుండాలి. సంఘాన్ని న్యాయముతో, శాంతి పధములో నడిపించగలగాలి. ప్రజల అవసరాలను గుర్తెరిగి వాటిని నెరవేర్చే వాడై ఉండాలి. అలాంటి పరిపాలనను మనం స్వర్ణయుగముతో పోల్చుతూ ఉంటాము.

ఈనాడు మనం కొనియాడే ఈ పండుగ, క్రీస్తుని సర్వాధికారము మరియు సర్వాధిపతియని తెలియజేస్తుంది. ఈ పండుగ మన భవిష్యత్తును ధ్యానించేలా చేస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రోజులు. ఐహికత్వం పెరుగుతున్న కాలం. యూరోపు మరియు ఇతర దేశాలలో భయానకర నియంతలు వెలుగులోనికి వస్తున్న కాలం. ఇలాంటి సమయములో, క్రీస్తు ఒక రాజుగా గౌరవించబడాలని, చర్చికి కూడా స్వతంత్ర౦ కలదనే విషయం లోకం తెలుసుకోవాలని, విశ్వాసులు బలాన్ని, ధైర్యాన్ని పుంజుకొంటారని తలంచి, ఈ పండుగను 1925 వ సం,,లో 11 వ భక్తినాధ పాపుగారు స్థాపించారు. ప్రతీ దైవార్చన సం,,ర చివరి ఆదివారమున ఈ ఉత్సవం కొనియాడటం జరుగుతూ ఉంది. ఈ పండుగ ద్వారా, మనం గుర్తుకు చేసుకోవాల్సింది, క్రీస్తు మన హృదయాలను, మనసులను పరిపాలించాలి.

ప్రజాస్వామ్యం కలిగిన దేశాలలో 'రాజు', 'ప్రభువు' అన్న పదాలను సంభోదించడం సమంజసం కాదేమో! ఎందుకన, ఇవి నిరంకుశ ప్రభుత్వ పాలనలోంచి పుట్టుకొచ్చాయి కనుక. అనేక సందర్భాలలో, రాజు గర్వానికి, అధికార దుర్వినియోగానికి, యుద్ధాలకు, అవినీతికరమైన జీవితాలకు ప్రతీక. అయితే, క్రీస్తు ప్రభుని  రాజరికం, అణకువ మరియు సేవకు ప్రతీక.

క్రీస్తు తన శిష్యులతో ఇలా అన్నారు: "అన్య జాతి ప్రజలలో పాలకులు పాలితులను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై పెత్తనం చెలాయించుచున్నారు. మీకు ఇది తగదు. మీలో ఎవడైన గొప్పవాడు కాదలచిన అతడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడైన ప్రముఖుడై ఉండదలచిన అతడు మీకు బానిసయై ఉండవలెను. ఏలయన, మనుష్య కుమారుడు సేవించుటకేగాని, సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను (మార్కు 10:42-45). యేసు పిలాతుతో ఇలా అన్నారు: "నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని. ఇందు కొరకే ఈ లోకమునకు వచ్చితిని" (యోహాను 18:37).

ఈనాటి మహోత్సవం క్రీస్తు రాజరికపు బిరుదులను స్థిరపరుస్తుంది. మొట్టమొదటిగా, క్రీస్తు దేవుడు, సృష్టికర్త. కనుక తన సర్వాధికారాన్ని సమస్తముపై చాపుచున్నాడు. "దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా, ఆయన కొరకు సృష్టించెను" (కొలస్సీ 1:16). రెండవదిగా, క్రీస్తు మన రక్షకుడు; తన పవిత్ర రక్తాన్ని వెలగా పెట్టి మనలను తన స్వంతం చేసుకొన్నాడు. మూడవదిగా, క్రీస్తు శ్రీసభకు అధిపతి. చివరిగా, క్రీస్తు రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు.

క్రీస్తు ఈ లోకమున జీవించినప్పుడు, దైవ రాజ్యము గూర్చి భోదించాడు మరియు తన శిష్యులతో, "మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకుడు" (మ 6:33) అని చెప్పాడు. దేవునికి ప్రధమ స్థానాన్ని ఇవ్వాలని సూచించాడు. తన శిష్యులను సేవకులని గాక స్నేహితులని పిలిచాడు. తన గురుత్వమును, రాజరికాన్ని వారితో పంచుకొన్నాడు. ఆయన మరణించినప్పటికిని, ఈ లోక రాజులవలె గాక, ఆయన ఇష్టపూర్తిగా, తన ప్రజల రక్షణార్ధమై మరణించాడు. ఆయన మరణం యుద్ధము వలన వచ్చినది కాదు. రక్షణ ప్రణాళికలో సృష్టి పూర్వమే ఏర్పాటు చేయబడినది.

ఆయన మహిమతో పుణరుత్తానుడై మోక్షారోహనుడైనాడు. రాజుగా ఈ లోకములో ఒక సేవకునిగా ప్రజల దరికి చేరాడు. తన శిష్యులను సైతం సేవకులుగా ఉండాలని ఆజ్ఞాపించాడు. ఆయన నిజమైన స్వాతంత్రాన్ని ఒసగువాడు.  ఈ విధముగా, 'రాజు'కు ఓ నూతన అర్ధాన్ని ఇచ్చాడు.

మొదటి పఠనములో (దానియేలు 7:13-14), దానియేలు ప్రవక్త, శాశ్వత జీవి, నరపుత్రుని రాకను గూర్చిన దర్శనము గూర్చి తెలియజేయుచున్నాడు. "ఆ నరపుత్రుడు పరిపాలనమును, రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలతనికి దాసులైరి. అతని పరిపాలనము శాశ్వతమైనది. అతని రాజ్యమునకు అంతము లేదు. ఈ పఠన౦, దేవుడు రాజుగా కలకాలం ప్రజల చెంత ఉన్నాడని, దేవుని రాజ్యం భూలోకమునకు ఏతెంచినదని నిరూపిస్తున్నది.

రెండవ పఠన౦ (దర్శన గ్రంధము 1:5-8), క్రీస్తును ప్రేమించే రాజుగా వర్ణిస్తుంది. "ఆయన మనలను ప్రేమించుచున్నాడు" (1:5). మనకోసం ఒక రాజ్యాన్ని స్థాపించిన సర్వాధికారియైన క్రీస్తు రాజసత్వమును గూర్చి భోదిస్తుంది. ఈ రాజ్యములో క్రీస్తు మనలను దైవసేవకు అంకితము చేసియున్నాడు. "ఆయన రక్తము ద్వారా, మనలను పాప విముక్తులను చేసి (1:5), తన ప్రేమను నిరూపించుకొన్నాడు. అందుకే, ఆయన సర్వాధికారమునకు పాత్రుడైనాడు. ఆయన మరల మహిమతో తిరిగి వచ్చును. ఆయన "ఆల్ఫా, ఒమేగ" (1:8).

సువిశేష పఠన౦లో (యో 18:33-37) పిలాతు ఎదుట ప్రభువు తన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని, తన రాజ్యము ఆధ్యాత్మికమైనదని, తన రాజ్యము సత్యము, న్యాయములపై ఆధారపడి ఉన్నదని చెప్పాడు, కాని, పిలాతు అర్ధము చేసుకోలేకపోయాడు. సిలువ క్రీస్తు రాజ్య విజయానికి చిహ్నము. ఈ విజయం జీవితం, సత్యం, ప్రేమ కొరకు.

క్రీస్తు మన రాజు, అందరి రాజు మరియు సర్వాధికారము కలిగిన వాడు. ఆయన మన జీవితాలకు, హృదయాలకు రాజు. ఆయన చూపిన ప్రేమ-సేవ మార్గములో పయనిద్దాం. ఇతరులకు సేవకులమై దేవుని రాజ్యాన్ని ఈ లోకములో బలపరచుదాం.

సర్వ శక్తిగల ఓ సర్వేశ్వరా! సమస్తము మీద రాజ్యాధికారముగల మీ ప్రియతమ పుత్రుని ద్వారా సృష్టినంతటిని పునరిద్దరించ చిత్తగించితిరి. సృష్టి అంతయు పాప దాస్యమునుండి విముక్తి చెంది మీ వైభవ సేవకు అంకితమగునట్లును, నిత్యము మీ స్తుతిగానమందు నిమగ్నమై యుండునట్లును చేయుమని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. ఆమెన్.

33 వ సామాన్య ఆదివారము, Year B

33 వ సామాన్య ఆదివారము, Year B
దాని. 12:1-3; హెబ్రీ. 20:11-14, 18; మార్కు. 13:24-32

ఉపోద్ఘాతము

దైవార్చన సంవత్సరము చివరి రెండవ వారము లోనికి ప్రవేశించి ఉన్నాము. మరికొన్ని రోజులలో నూతన దైవార్చన సంవత్సరాన్ని ఆరంభిస్తాము. ప్రతి  దైవార్చన సంవత్సరము క్రీస్తు రాజు మహోత్సవముతో ముగుస్తుంది. ఈ మహోత్సవాన్ని వచ్చే ఆదివారం అనగా దైవార్చన సంవత్సర చివరి ఆదివారంనాడు కొనియాడ బోవుచున్నాము. ఈ సమయంలో శ్రీసభ అంతిమ దినాల (తుది తీర్పు, లోకాంత్యము) గురించి ధ్యానించమని మనలను కోరుతున్నది. అందుకే ఈనాటి పఠనములు, అంతిమ దినము గురించి బోధిస్తున్నాయి. యేసుక్రీస్తు ఆల్ఫా-ఒమేగా, ఆదియు-అంతము ఆయనేనని, సమస్తము ఆయన ద్వారానే ఉండునని, సర్వానికి మూలం ఆయనయేనని సందేశాన్ని ఇస్తున్నాయి.

అంతిమ దినము అనగా ఏమి?

బైబిలు ప్రకారము, క్రైస్తవ వేదాంతం ప్రకారం, అంతిమ దినాలు అనగా లోకము అంతం కావడం కాదు... అంతిమ దినము అనగా ‘క్రీస్తు నాయకత్వమున దివి యందలి, భువి యందలి సర్వ సృష్టిని ఒకటిగా చేయుట’. దానిని ఆయన పరిపూర్ణమైన సమయమున నెరవేర్చును (ఎఫెసీ. 1:10). అంతిమ దినము అనగా ‘క్రీస్తు రెండవ రాకడ’ లేక ‘ప్రభువు పునరాగమనము’ అని కూడా అర్థం. దీని సంపూర్ణ అర్థము “సర్వము విరాజిల్లుట” (1 కొరి. 15:28). సమస్తమును క్రీస్తు పాలనలో, రాజ్యంలో పాలుపంచుకొనును. ఇదే విషయాన్ని మనం పరలోక ప్రార్థనలో జపిస్తున్నాము: “నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము నెరవేరునుగాక” (మత్త. 6:10).

అంతిమ దినము అనగా ‘దైవ దర్శనము’. దేవుడు తన మహిమలో ప్రదర్శింపబడును. ఆయనను మనము ముఖాముఖిగా గాంచెదము. మన క్రైస్తవ ప్రయాణము ప్రభువును కలుసుకోవడమే!

మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసినట్లయితే, ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు. అంతట అవినీతి, టెర్రరిజం, పేదరికం. ఇలాంటి స్థితిలోనున్న మనకు ప్రభువు మాటలు నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. దేవుని రాజ్యము, ప్రేమను కరుణను దయను మన ఆశకు నమ్మకానికి గుర్తుగా ఇస్తుంది. అనగా శ్రమలు, కష్టాలు, బాధల మధ్య కూడా దేవుని వాక్యం సజీవముగా, చురుకుగా ఉన్నది. మనము క్రీస్తులో దైవరాజ్య స్థాపన పరిపూర్ణ మగుట కొరకు అనగా నీతి, న్యాయం, ప్రేమ, శాంతి గల రాజ్యము / సమాజము కొరకు ఎదురుచూస్తున్నాము.

మొదటి పఠనములో దానియేలు దర్శనాన్ని గాంచు తున్నాము. దేవుని విశ్వాసులు “సజీవులగుదురని” “నిత్యజీవము బడయుదురని” (12:2) చూస్తున్నాము. రెండవ పఠనములో క్రీస్తు అర్పించిన ఒకే ఒక బలి సర్వ పాపములను పరిహారార్థం చేసిందని, మనలను తన తండ్రికి అంకితం చేసి శాశ్వతంగా పరిపూర్ణులుగా చేసి ఉన్నాడని గుర్తు చేస్తుంది (10:12-14). సువిశేష పఠనము, అంతిమ దినములలో జరగబోవు మహోపద్రవములను గూర్చి తెలియజేస్తుంది. అయితే వీటిని గురించి మనం భయపడకుండా జాగరూకులై ఉండాలని ప్రభువు బోధిస్తున్నారు.

నిరీక్షణ - నిత్య జీవితం

దేవుడు వాగ్దానం చేసిన నిత్యజీవములో పాలుపంచుకోవడం మన నిరీక్షణ. దివ్య సంస్కారముల ద్వారా మనము ఇప్పటికే నిత్య జీవితపు ఆనందంలో భాగస్తులమై ఉన్నాము. అయితే ఇంకా దీనిని పరిపూర్ణముగా సాధించవలసి ఉన్నది. నిత్య జీవము యొక్క రుచిని పొందియున్నాము, కాని ఇంకా దానిని పరిపూర్ణముగా పొందవలసి ఉన్నది. ఈ లోకమున విశ్వాసములో ప్రభుని కలుసుకోవడం, ఈ లోక జీవితం ముగిసిన తర్వాత దేవునిలో ఐక్యం అవ్వడం మన నిరీక్షణ.  ఇప్పటికే (already) ఇంకా కాదు (not yet) అనే రెండింటి మధ్య జీవిస్తున్నాము. అనగా, మనం ప్రభునిలో ఇప్పటికే ఉన్నాము కాని ఇంకా అంతిమ మహిమను చూడలేదు. ఈ సందర్భములో మనకున్న ఒకే ఒక రక్షణమూలం, పరిష్కారం: నిరీక్షణ. నిరీక్షణ లేనిచో మనం ఇప్పటికే మరణించిన వారము. నిరీక్షణ జీవితాన్ని నిలబెడుతుంది (ఎఫీ 2:12). మన నిరీక్షణ దేవుని యందు ఉండవలయును. దేవుడు మనలను ప్రేమించాడు; “చివరి వరకు” (యో 13:1), అంతయు “సమాప్తమగు” (యో 19:30) వరకు మనలను ప్రేమిస్తూనే ఉంటాడు.

జ్ఞానస్నాన సాంగ్యములో కూడా “తిరుసభ నుండి ఏమి కోరుచున్నారు” అని ప్రశ్నించినప్పుడు విశ్వాసము, యేసుక్రీస్తు వరము, తిరు సభలో ప్రవేశము, నిత్య జీవము అని సమాధానం ఇస్తాము. “నేను జీవము నిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చియున్నాను (యోహాను. 10:10) అని ప్రభువు చెప్పియున్నాడు. నిత్యజీవము అనగా “ఏకైక సత్య దేవుడవు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసుకొనుటయే నిత్య జీవము” (యోహాను. 17:3). జీవితం అనగా సంబంధం. జీవమునిచ్చు దేవునితో సంబంధము కలిగి ఉండటం; ఆయనతో సంబంధం కలిగి ఉంటే మనము జీవములో ఉన్నట్లె! మనం జీవిస్తున్నట్లే!

నిరీక్షణ అనగా మన బాధ్యతలను పక్కనపెట్టి దేవుని జోక్యం కొరకు ఎదురు చూడటం కాదు. నిరీక్షణ అనగా జాగరూకతతో, నిరంతర ఆత్మ పరిశీలనతో దుష్ట శక్తుల నుండి మన జీవితాన్ని రక్షించుకుంటూ, అర్థవంతమైన జీవితాన్ని జీవించడం.

మొదటి పఠనములో ఓ గొప్ప నిరీక్షణను చూస్తున్నాము. “అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలామంది సజీవులగుదురు” (12:2). మట్టిలో నిద్రించు వారు అనగా జీవము లేని వారు. ఈ వాక్యమును మనము రెండు రకాలుగా వర్ణించవచ్చు:

మొదటిగా, ఈనాడు మనిషి అనేక సందర్భాలలో నిరాశకులోనై జీవిస్తున్నాడు; జీవిత ఘర్షణలలో దిక్కుతోచక గందరగోళానికి గురియై జీవిస్తున్నాడు; స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా జీవించలేక పోతున్నాడు; బలవంతంగా, భారంగా జీవిస్తున్నాడు; కుటుంబ భారం, సామాజిక - ఆర్థిక - రాజకీయ ఒత్తిడులు, ఆధ్యాత్మిక అస్థిరతల మధ్య నలిగి పోవుచున్నాడు. ఏది సరైన మార్గమో తెలుసుకోలేకపోతున్నాడు. క్రైస్తవ జీవితంలో కూడా ఇదే పరిస్థితి! క్రీస్తు సత్యము, జీవము, మార్గము అని ఎరిగి ఉన్నాము, కాని మన రోజువారీ అవసరతలకు ప్రాధాన్యం ఇస్తూ విశ్వాస జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. అనవసరమైన వాటికై ఆరాటపడుతున్నాము. ఇదే మట్టిలో నిద్రించడం అంటే! ఇదే జీవము లేనివారిగా ఉండడం అంటే! ఇదే నిజమైన జీవితాన్ని కోల్పోవడమంటే! అయినప్పటికిని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు: “చాలామంది సజీవులగుదురు”. అనగా నిత్య జీవితాన్ని కలిగి ఉండటం; అయితే, ఇది ఎప్పుడు సాధ్యం? మారుమనస్సు పొంది, దేవునివైపుకు మరలినప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఈ నిత్య జీవితం ఇప్పుడు ఇక్కడే (here and now) ఇవ్వబడును.

రెండవదిగా, ఈ నిత్య జీవితం లోకాంతమున ఇవ్వబడును. దేవుని వాగ్దానం కలకాలం ఉండును. ఆయన వాక్యము కలకాలము ఉండును. మట్టిలో నిద్రించుచున్న వారు సజీవులగుదురు; అనగా రాబోవు కాలంలో (eschatological) జరుగునది. అనగా చనిపోయిన వారందరూ లోకాంత్యమున, తుది తీర్పున సజీవులగుదురు. దేవుని యొక్క మహిమను అందరూ గాంచెదరు. విశ్వాసముగా, ప్రేమగా ప్రభువు కొరకు జీవించిన వారందరు, ఆయన మహిమను గాంచెదరు. ఆయనను, ఆయన వాక్కును నిరాకరించి జీవించువారు శాశ్వతమైన అంధకారము లోనికి త్రోసివేయబడుదురు.

లోకాంత్యము తప్పక వచ్చును

ఆరోజు, ఆ గడియ ఎప్పుడు వచ్చునో ఎవరికీ తెలియదు, కాని ప్రభువు పునరాగమనము తప్పక సంభవించును. ఈనాటి సువిశేషములో ప్రభువే స్వయంగా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేయుచున్నారు. ప్రభువు పునరాగమనము వలన మనము భయపడనవసరం లేదు. మొదటి పఠనములో గాని, సువిశేష పఠనములో గాని వాడబడిన “అప్పుడు విపత్తు కాలము ప్రాప్తించును”, “మహా విపత్తు”, “తుదితీర్పు”, మొదలగునవి అలౌకిక భాషలో  (apocalyptic language) వాడబడినవి. కొంతమంది వీటిని గూర్చి ప్రజలను భయపెడుతూ ఉంటారు. అవి మన మనస్సాక్షిని వైఖరిని మేల్కొలుపుతూ ఉంటాయి. దేవుని దయ పట్ల ఆశ్రయము కలిగి ఉండునట్లు అవి తోడ్పడును. కనుక మనము భయపడనవసరం లేదు. ప్రభువు చెప్పినట్లుగా మనం “జాగరూకులై” ఉండవలయును.

జాగరూకత, ఆత్మ పరిశీలన

దేవునిని మన జీవిత ఆధారంగా, మన జీవిత గమ్యంగా చూడాలి. ఆత్మ పరిశీలన, దేవుని ఇష్ట ప్రకారము జీవించునట్లుగా చేయును. గతించిపోవు నది - కలకాలము ఉండునది ఏదో, తాత్కాలికమైనది - శాశ్వతమైనది ఏదో, ప్రమాద వశాత్తు జరుగునది - నిర్ణయాత్మకంగా జరుగునది ఏదో తెలియునట్లు చేయును. ఈనాటి విశేషములో విన్నట్లుగా ‘సమస్తమును గతించిపోవును, కాని దేవుని వాక్యము శాశ్వతముగా ఉండును’.

మనం వేసే ప్రతి అడుగులో జాగ్రత్తగా, శ్రద్ధగా ఉండాలి. జాగరూకత, మన గమ్యాన్ని జాగ్రత్తగా చేర్చునట్లు చేయును. మన మార్గాన్ని ప్రకాశవంతముచేసి దేవుని భాంధవ్యంలోనికి మనలను నడిపించును. జాగరూకత అనగా ‘మేలుకొని ఉండుట’. మనం మాట్లాడే ప్రతి మాటకి, చేసే ప్రతి పనికి మనం బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తు చేస్తుంది. ఈ విధముగా నిరీక్షణ, వాగ్ధానము చేయబడిన నిత్యజీవము కొరకు జీవించునట్లు చేయను.

ఆత్మ పరిశీలన చేసుకుందాం! మన ప్రయాణం దేవుని వైపు ఎంతవరకు వెళ్ళుచున్నది? మన ఆధ్యాత్మిక జీవితంలో ఎంతవరకు మనము ఎదుగుతూ ఉన్నాము? మన జీవితాలను సరిచేసుకొందాం. పునరాగమనం అయ్యే ప్రభువును ఆలింగనము చేసుకొనుటకు సిద్ధపడుదాం.

దళిత విమోచన ఆదివారం ఆరాధన 11 నవంబరు 2018

దళిత విమోచన ఆదివారం ఆరాధన
11 నవంబరు 2018

2017 నుండి నవంబరు రెండవ ఆదివారం దళిత విమోచన ఆదివారంగా కొనియాడాలని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భముగా రేపటి ఆదివారమునకు ప్రత్యేకమైన ధ్యానాంశమును మోస్ట్. రెవ. శరత్ చంద్ర నాయక్ పీఠాధిపతులు అందించిన ధ్యానాంశమును మీతో పంచుకొనుటకు సంతోషిస్తున్నాను. ఎంతోకొంత మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.

దళిత విమోచన ఆదివారం ఆరాధన
11 నవంబరు 2018
ఒడిషా రాష్ట్రంలోని కందమాల్ లో జరిగిన విశ్వాస పరీక్ష సాక్ష్యము - 10 వ వార్షికోత్సవం

అతి పూజ్య అగ్ర పీఠాధిపతులు, పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలు, దైవ ప్రజలారా!

ప్రభువు పేర మీ అందరికీ శాంతి, సంతోషముల శుభ వందనములు

భారతదేశ కతోలిక పీఠముల సమాఖ్య, మన నుండి విడిపోయిన సోదర క్రైస్తవ శాఖల జాతీయ సమాఖ్యతో కలసి దళిత విమోచన ఆదివారమును కొనియాడుచున్నాము. భారత జాతీయ కతోలిక పీఠాధిపతుల సమాఖ్య వారి నిర్ణయం ప్రకారం 2017 నుండి నవంబరు రెండవ ఆదివారం దళిత విమోచన ఆదివారంగా కొనియాడాలని నిర్ణయించాము. ఈ సంవత్సరము ఒరిస్సా రాష్ట్రంలోని కంధమాల్ క్రైస్తవులకు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక సంఘటన దశమ వార్షికోత్సవమును పురస్కరించుకొని ఈ సంవత్సరం దళిత విమోచన ఆదివారమునకు “నేను నా కుటుంబం మాత్రము యావేను ఆరాధింతుము” అనెడి ప్రత్యేక ఉద్దేశ్యమును ఎన్నిక చేశాము.

దళిత విమోచన ఆదివారపు ఆరాధన క్రైస్తవ సమాజమునకు ఇవ్వబడుచున్న గొప్ప పిలుపు. మన విశ్వాసమును నూతన పరచుకొనుటకు మన మనస్సులను మేల్కొల్పుటకును, సమాజంలో పీడింపబడుచున్నప్పటికిని నోరెత్తి వారికి జరిగే అన్యాయాలు సమాజానికి తెలియచేయలేని దళితుల పక్షాన నిలబడుటకు ఇవ్వబడుచున్న పిలుపు దళిత విమోచన ఆదివారం. సోదర భావంతో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సమైక్యతతో దైవ ప్రేమను పంచెడి సమయం. మన రాజ్యాంగము మనకిష్టమైన మతమును విశ్వసించుటకు, పాటించుటకు, ప్రచారం చేయుటకు, ప్రతి ఒక్కరికి హక్కును కల్పించినది. కాని వాస్తవముగా దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరించినచొ రాజ్యాంగము కల్పించిన దళిత హక్కులను వారికి ప్రభుత్వము నిరాకరించుచున్నది. ఈ విధముగా దళితులకు మత స్వేచ్ఛ లభించకుండా ప్రభుత్వాలు అడ్డుపడుచున్నవి.

10 సంవత్సరాల క్రితం ఒరిస్సాలోని కందమాల్ లో క్రైస్తవుల యెడల జరిగిన మారణకాండలో క్రైస్తవులు ప్రదర్శించిన విశ్వాసము అత్యంత ఆదర్శమైనది. వారు విశ్వాసము కొరకు తమ ప్రాణాలర్పించారు. ఆస్తులను, ఇండ్లను, జీవనాధారములను, సమస్తమును కోల్పోయారు. విశ్వాసమును నిలుపుకొనుటకు రక్తార్పణ గావించారు. ఇదే సమయంలో 7 గురు అమాయకులు గత 10 సం,,ల నుండి జైల్లోనే గడుపుచు న్యాయం కొరకు ఎదురుచూస్తున్నారు. వారి కొరకు మనందరము ప్రార్ధించుదము.

మన దళిత సోదరులు ఆర్థికంగా పేదవారే కాకుండా రాజకీయ అధికారాలు లేకుండా సామాజికంగా అంటరాని వారుగా జీవిస్తున్నారు. మానవమాత్రులు కల్పించిన కుల వ్యవస్థ సామాజిక రుగ్మతగా మన అందరిని విడదీస్తూ తరతరాల నుండి ప్రజలను వేరు చేస్తూ మన మధ్య నెలకొని ఉన్న దేవుని గుర్తించలేని, ఆయన ప్రేమను అనుభవించలేని స్థితిని కల్పించుచున్నది. దేవుని బిడ్డలుగా జీవించుటకు క్రీస్తు వలే మనము కొనసాగుటకు దేవుడు మనలను సృజించాడు కాని దేవుని దివ్య దేహంలో భాగస్తులమైన మనము కుల వ్యవస్థ వలన పరస్పరము ఒకరికొకరు తెలియని వారముగా వేరుచేయబడి జీవించుచున్నాము. దళిత క్రైస్తవులు ఇటు క్రైస్తవ సంఘములోను, బయట సమాజంలోను, ప్రభుత్వ పరంగాను తీవ్రమైన వివక్షకు గురియగుచున్నారు.

భారత జాతీయ పీఠాధిపతుల సమాఖ్య శ్రీ సభలో కొనసాగుతున్న కులవివక్షను తొలగించుటకు తమ ప్రయత్నాలను కొనసాగించుచున్నారు. ఈ సందర్భమున దళిత క్రైస్తవుల సాధికారత కొరకు భారత జాతీయ కతోలిక పీఠాధిపతుల సమాఖ్య వారు అధికారపూర్వక విధానం పత్రమును 2016 డిసెంబరులో విడుదల చేశారు. “కులపరమైన వివక్ష తీవ్రమైన సామాజిక పాపమని” ప్రకటించారు.

దళిత విమోచన ఆదివారము దళిత సోదరులలో ఆశను సాధికారతను ఉన్నతమైన ఆలోచనలను ప్రేరేపించుటకు సదవకాశము ఏలియా ప్రవక్త ఆకలితో అలమటించు విధవరాలి వద్దకు పంపబడినట్లు తన లేమిలో నుండి ఉదారముగా దానము చేసిన విధవరాలిని ప్రభువు ప్రశంసించినట్లు, దేవుడు పేదల అణగారిన ప్రజల పక్షాన ఉంటాడన్న నిరీక్షణ మనకు కలుగుచున్నది. శాంతియుతమైన, సమైక్యత కలిగిన సమాజమును నిర్మించుటలో ప్రేమతో పరస్పర సహకారంతో జీవించుటలో మనందరము ముందడుగు వేద్దాం.

దళిత క్రైస్తవులకు దళిత హోదా కల్పించాలన్న న్యాయమైన హక్కుల కొరకు భారత జాతీయ పీఠాధిపతుల సమాఖ్య వారు సుప్రీంకోర్టులో వేసిన కేసు విషయంలో ఇప్పటికీ ఏవిధమైన పురోగతి లేదు. రాజ్యాంగంలోని 1950, 3 వ పేరాలోని అధికరణను సవరించి దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు దళిత హోదా కల్పించాలన్న న్యాయమైన పోరాటం సంవత్సరముల తరబడి కొనసాగుచున్నా పరిష్కారం కొరకు ఇంకను మనం ఎదురు చూస్తున్నాం. దళిత క్రైస్తవుల మతస్వేచ్ఛకు ప్రభుత్వము ఆటంకములను తొలగించుటలేదు.

మన న్యాయసమ్మతమైన డిమాండును సాధించుటలో మనము విజయం సాధిస్తామనే ఆశతో ఎదురు చూస్తున్నాము. 2019 లో జరుగనున్న లోకసభ ఎన్నికల ప్రణాళికలలో మన న్యాయమైన కోరికను తీర్చెదమని దళిత క్రైస్తవులకు దళిత హోదా కల్పిస్తామన్న వాగ్దానమును తమ పార్టీల ప్రణాళికలలో చేర్చాలని వివిధ రాజకీయ పార్టీలకు మన తరఫున ప్రతిపాదనలు అందచేయుచున్నాము.

దళిత విమోచన ఆదివారమును అర్థవంతముగా నిర్వహించుటకు కొన్ని కార్యాచరణ ప్రణాళికలను పంపుతున్నాము. మన దళిత క్రైస్తవ సహోదరీ సహోదరులకు సంఘీభావమును తెలియజేయుటకు ఈ సందర్భంలో మనమందరము ముందుండాలని కోరుచున్నాము.

మీ అందరి ప్రార్థన పూర్వక సహకార మునకు తోడ్పాటు నకు వందనములు.

ప్రభు క్రీస్తు సేవలో

మోస్ట్. రె వ. శరత్ చంద్ర నాయక్
అఖిలభారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య
యస్.సి.బి.సి. విభాగపు అధ్యక్షులు.

32 వ సామాన్య ఆదివారము, Year B

32 వ సామాన్య ఆదివారము, Year B
రాజులు మొదటి గ్రంథము 17:10-16; హెబ్రీ. 9:24-28; మార్కు.  12:38-44

ఉదారత్వం దేవుని ఆశీర్వాదం

క్రీస్తు ప్రభువు నందు ప్రియమైన సహోదరీ సహోదరులారా! మనమందరము కూడా ప్రభువు నుండి ఎన్నో దీవెనలను, ఆశీర్వాదములను, కృపావరములను పొందియున్నాము. వీటన్నిటిని కూడా ప్రభువు మనకు ఉచితంగా ఇచ్చి ఉన్నాడు. ఒక్కొక్కరము వ్యక్తిగతంగా ప్రత్యేకమైనటువంటి వరములను పొందియున్నాము. అయితే ఇవన్నీ కూడా దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన దానములు. ఏవిధంగానైతే మనము ఉచితంగా పొంది ఉన్నామో వాటిని ఇతరులకు ఉచితంగా ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇతరులకు దానము చేయాలి అంటే మనలో ఇతరుల పట్ల కనికరము, శ్రద్ధ తప్పనిసరిగా ఉండాలి.

ఈనాటి పఠనాల ద్వారా, ఉదారత్వం కలవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అనే గొప్ప విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాయి. ఉదారత్వం లేని సంపద విలువ లేనిది. మన సంపద ఇతరులతో పంచుకున్నప్పుడు, అది దేవుని వరంగా మారుతుంది. ఈనాటి పరిశుద్ధగ్రంధ పఠనాలలో సారెఫతు లోని అన్యురాలు, నిరుపేద అయిన  విధవరాలు యావే ప్రభువు నందు విశ్వాసంతో తనకు ఉన్నదంతా దేవుని మనిషి ఏలియాకు దానము చేయ సిద్ధపడగా ఆమె ఘోరమైన క్షామము నుండి కాపాడబడిన ఉదంతాన్ని నేటి మొదటి పఠనం వర్ణిస్తుంది. మరో పేద విధవరాలు దేవునియందు ప్రేమ విశ్వాసంతో తనకున్న మొత్తాన్ని సమర్పించి యేసుక్రీస్తు మెప్పుకు అర్హురాలు అయింది అని నేటి సువార్త పఠనం వర్ణిస్తుంది.

ఈనాటి మొదటి పఠనంలోనికి చవిచూస్తే, క్రీస్తుపూర్వం 9వ శతాబ్దంలో అహబు ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా పరిపాలన చేసేవాడు. అతని భార్య జేజెబెలు ఎంతో క్రూరురాలు. యావే ప్రభువును కాక బాలు దేవుళ్ళను, దేవతలను కొలిచేది. అతని భార్య ప్రభావం బాలు దేవుని ఆరాధన ఇజ్రాయేలు దేశంలో ప్రబలిపోయింది. అప్పుడు యావే ప్రభువు ప్రజలను చిల్లర దేవుళ్ల నుండి తన వైపుకు మరల్చడానికి ఏలియా ప్రవక్తను పంపియున్నాడు. ఏలియా ప్రవక్త దేశంలో రాబోయే మూడు సంవత్సరములు వర్షాలు, పంటలు ఉండవని దైవ శిక్షను ప్రకటించాడు. ప్రవక్త ప్రవచనం అక్షరాలా నెరవేరింది. దేవుని యొక్క వాగ్దానం ప్రకారం ఏలియా ప్రవక్త కటిక పేదరాలు అయిన సారెఫతులోని విధవరాలు వద్దకు వెళ్లి ఉన్నాడు. ఆమె తాను తన కుమారునికి జీవితంలో చివరి భోజనం వండుకొని తిని ఆ తర్వాత చనిపోవడానికి సిద్ధపడి దానికి కావలసిన వస్తువులను సమకూర్చుకుంటున్న సమయంలో ఏలియా ప్రవక్త ఆమెతో సంభాషించి ఆమెను కొంచెం నీరు ఆహారం తీసుకురా అని అడిగి ఉన్నాడు. కరువులో అధికమాసం అన్నట్లు ఆమెకు లేక చస్తుంటే ఇక ఏలియాను పోషించుట ఎలా? ఎంత కష్ట స్థితిలో ఉన్నప్పటికిని దేవునిపై పూర్తి నమ్మకం, భారం ఉంచిన ఆమె ఏలియాకు ఆతిథ్యమిచ్చి తనకున్న సర్వస్వాన్ని అనగా ఉన్న కొద్ది పిండినీ, రొట్టెను త్యాగం చేయడానికి, ఇవ్వడానికి సిద్ధపడింది. ఆమె త్యాగశీలతకు భగవంతుడు మెచ్చుకొని ఆమెను ఆశీర్వదించాడు. ఆమెను ఆమె కుమారున్ని మరణము నుండి కాపాడి ఉన్నాడు. ఇతరుల అవసరాలకు తక్షణం స్పందించడమే అసలైన సిసలైన ఉదారత్వం.

ఈనాటి సువిషేశములో కానుకల, అర్పణల విషయంలో ఒక విధవరాలు కూడా అట్లే సంపూర్ణ త్యాగం చేసి ఉన్నది. యేరుషలేము దేవాలయంలో స్త్రీలకు ప్రత్యేక స్థలము ఉండేది. ఆ సమీపంలోనే ప్రజల కానుకలకై 13 పెట్టెలు ఉండెడివి. దేవాలయంలో జరిగే ఆరాధన, బలుల ఖర్చులకు ఆ కానుకలను వాడెడివారు. ప్రజలు తమ యొక్క ఉద్దేశాలను, అవసరాలను, విన్నపాలను, ప్రార్థన రూపంలోనే కాక, కానుకల రూపంలోను అర్ధించేవారు.ఇదంతా బహిరంగంగా దేవాలయంలో జరుగుతుంది. ఎవరు ఎక్కువగా కానుకలు సమర్పిస్తే వారు గొప్పవారు అనే ఆలోచన ప్రజలలో ఉండేది. నాణెములను పెట్టెలో వేసినప్పుడు శబ్దం వినిపించేది. దీనిని బట్టి ఎవరు ఎక్కువగా కానుకలు సమర్పిస్తున్నారో ప్రజలకు తెలిసిపోయేది. ఈ కానుకల విషయంలో ఎంతో మంది ధనికులు తమకున్న సంపదలో నుండి దేవునికి సమర్పించటం దేవునికి సహజంగా కనిపిస్తుంది. కాని ఒక పేద విధవరాలు రెండు నాణెములు మాత్రమే అనగా తనకున్న దంతయు దానం చేయడం ప్రభువు గమనించి ఆమెను ఎంతగానో అభినందించాడు.

సందేశం

1. మన విచారణలోనున్న విధవరాలులను గౌరవించుదాము. వారు అనుభవించే ఆర్థిక ఇబ్బందులలో తోడుగా ఉందాము. వారి కుటుంబాలను ఒంటరిగా నడిపించే వారి ధైర్యాన్ని మెచ్చుకొందాము. విచారణకు వారు చేసే సేవలను గుర్తించి, అభినందించి, ప్రోత్సహించుదాము.

2. ఇతరులను క్రీస్తు వలె అర్థం చేసుకుందాం. ఇతరులను వారికున్న ఆస్తి పాస్తులను, అధికారమును, మాటను చూసి గౌరవిస్తాం. మిగతా వారిని తక్కువ చేసి చూస్తూ ఉంటాం. కాని క్రీస్తు హృదయంతరాన్ని చూస్తాడు. ఇతరుల మెప్పు కోసం చేసే దాన ధర్మాలు దేవుని దృష్టిలో అంగీకార యోగ్యం కావు. ఏమీ చేసిన మనస్ఫూర్తిగా చేస్తేనే దేవునికి అంగీకార యోగ్య మగును.

3. మన జీవిత సర్వాన్ని ఇవ్వగలగాలి. మనం ఏమి చేసినా హృదయ పూర్వకంగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి.  ఈనాటి పఠనాలలోని విధవరాలులవలె, మన సర్వాన్ని దేవునికి, ఇతరులకు ఇవ్వగలగాలి. అప్పుడు మనం కూడా వారివలె దేవుని ఆశీర్వాదములు, దీవెనలు పొందుతాము. మనకున్న సమయాన్ని, టాలెంట్స్ ను ఇతరులతో పంచుకోగలగాలి. ఆకలితో అలమటిస్తున్న ఏలీయాకు విధవరాలు భోజనం పెట్టిన విధముగా, మన చుట్టూ ఆకలి దప్పులతో ఉన్నవారిని ఆదరించుదాం.

4. పొందడంలో కన్న ఇవ్వడంలో చాలా ఆనందం ఉంటుంది. సంతోషముతో దానమొనర్చు వానిని దేవుడు ప్రేమిస్తాడు (2 కొరి. 9:7). యేసు మనకు మార్గదర్శి. ఆయన తనను తాను సర్వాన్ని మనకు ఇచ్చాడు. దేవుడై యుండి మానవుడై తన జీవితాన్ని త్యాగం చేశాడు. “మనకు జీవమును ఇచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు తన జీవితమును మనకు ఇచ్చి యున్నాడు (యోహాను. 10:10). ఇతరులకు ఇచ్చినప్పుడు మన సంపదలను పరలోకములో కూడ బెట్టుకొంటున్న వారము అవుతాము (మత్త. 6:20). ఇతరులకు ఇవ్వాలంటే మనలో గర్వం, అసూయ ఉండ కూడదు.

5. మన సంపదలపై గాక దేవునిపై ఆధారపడి జీవించుదాము. క్రీస్తు ప్రభువును నమ్ముకుందాము. పఠనాలలోని విధవరాలులవలే దేవుని విశ్వసిస్తూ మనకున్న దానిని ఇతరులతో పంచుకుందాము.

సత్యోపదేశము - ప్రాముఖ్యత

సత్యోపదేశము - ప్రాముఖ్యత

    “ఏకైక సత్యదేవుడవగు నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును వారు తెలుసుకొనుటయే నిత్యజీవము” (యోహాను. 17:3). “మానవులు అందరు రక్షింపబడవలయునని, సత్యమును తెలిసికొనవలయునని దేవుని అభిలాష” (1 తిమో. 2:4). “ఆయనయందుతప్ప వేరొకనియందు రక్షణ లభింపదు. ఏలయన, ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు” (అ.కా. 4:12).

    సత్యోపదేశము అనగా సువిషేశ ఆనందమును, శ్రీసభ బోధనలను ఉపదేశించడము. మనిషి జీవితం దేవున్ని తెలుసుకొని ప్రేమించడం. పరిపూర్ణుడు పవిత్రుడైన దేవుడు తన ప్రణాళిక ప్రకారం తన దివ్యజీవితంలో పాలుపంచుకోవడానికి మానవుని స్వేచ్ఛతో సృష్టించాడు. తనను తెలిసికొని సంపూర్ణశక్తితో తనను ప్రేమించేందుకు దేవుడు మానవుని ఆహ్వానిస్తున్నాడు. తన కుటుంబమైన శ్రీసభలో చేరి ఒకటి కావాలని పిలుస్తున్నాడు. ఈ కార్యమును పరిపూర్తిచేయటానికి తన కుమారుని రక్షకునిగా పంపాడు. తన కుమారునిద్వారా తన దివ్యజీవితానికి వారసులు కావాలని ఆహ్వానిస్తున్నాడు. సువార్తను బోధించాలని ఆదేశించి క్రీస్తు తన అపోస్తలులను పంపియున్నాడు. అపోస్తలులనుంచి వారసులుగా విశ్వాసులు ఈ సువార్త బోధనను చేసియున్నారు.

    తండ్రి దేవుని చిత్తప్రకారం మనం ఆ నిత్యజీవితంలో భాగస్తులమవ్వాలి. దీనికోసమే సువార్త బోధింపబడాలి. అందుకే సువార్తను బోధించే అధికారం యేసు తన శిష్యులకు ఇచ్చియున్నాడు (మత్త. 28:19-20). “పిదప శిష్యులు వెళ్లి అంతట సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు, అద్భుతములద్వారా, వారి బోధ యదార్ధం అని నిరూపించుచుండెను (మార్కు. 16:20). శిష్యులతోపాటు, క్రీస్తు పిలుపును ఆహ్వానించి, స్వేచ్ఛగా ఆ పిలుపుకు బదులు ఇచ్చినవారు, సువార్త బోధనలో పాలుపంచుకున్నారు. శిష్యులనుంచి అందుకున్న సువార్త సంపదను వారి విశ్వాసముద్వారా పరిరక్షిస్తూ వచ్చారు. సువార్త జీవితముద్వారా, ప్రార్థనద్వారా, సువార్త బోధనను తరతరాలవారికి అందించియున్నారు (అ.కా. 2:42).

    సత్యోపదేశం అనగా విశ్వాసాన్ని అందివ్వడం; మనుషులను క్రీస్తు శిష్యులుగా మలచటం; యేసు దేవుని కుమారుడని మనుషులు నమ్మడానికి వాళ్లకు తోడ్పడటం; ఆయనపేర జీవముపొందేలా చూడటం; ఈ జీవములో వాళ్లకు విద్యగరిపి శిక్షణ ఇవ్వడం. ఆ విధముగా క్రీస్తు దేహాన్ని (శ్రీసభ) నిర్మించటం. శ్రీసభచేసే ఈ కార్యమునంతా “సత్యోపదేశం” అని పిలువబడుచున్నది.

    క్రైస్తవ జీవిత సంపూర్ణతలోనికి ఇతరులను ప్రవేశపెట్టడం; ఒక క్రమపద్ధతిలో క్రైస్తవ సిద్ధాంతాలను, సువార్త విలువలను, పిల్లలకు యువతకు, వయోజనులకు వివరించి అందించే విశ్వాస విద్యయే సత్యోపదేశం. అయితే, కేవలం క్రైస్తవవిద్యను అందించడం ఒక్కటే సత్యోపదేశము కాదు. దీనిలో ప్రధానంగా ఉండవలసిన అంశాలు ఏమనగా: ప్రారంభదశలో సువార్తను ప్రకటించటం లేదా సువార్త ప్రచారంద్వారా విశ్వాసాన్ని రేకెత్తించడం; నమ్మడానికిగల కారణాలను పరిశీలించడం; క్రైస్తవ జీవన అనుభవం; దివ్యసంస్కారాల ఆచరణ; శ్రీసభలో ఇమిడిపోవడం; అపోస్తలులే సాక్షులుగా నిలచి సువార్త ప్రచారం చేయటం.

    సత్యోపదేశం ఉద్దేశం ఏమనగా: విశ్వాసాన్ని, నైతిక జీవన విలువలను, కతోలిక సిద్ధాంతాన్ని సమగ్రంగా, క్రమబద్ధంగా అందించడం.

సత్యోపదేశంలో ఉండవలసిన నాలుగు ముఖ్యాంశాలు:

1. విశ్వాస ప్రమాణం: జ్ఞానస్నానములో పొందిన విశ్వాసాన్ని బాహాటంగా ఒప్పుకోవాలి. “కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతివానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేను అంగీకరింతును” (మత్త. 10:32). “నీ నోటితో యేసు ‘ప్రభువు’ అని ఒప్పుకొని, మృతులలోనుండి దేవుడు ఆయనను లేవనెత్తినని నీ హృదయమున నీవు విశ్వసించినచొ నీవు రక్షింపబడుదువు” (రోమీ. 10:9). ఈ విశ్వాసాన్ని ప్రకటించాలంటే సత్యోపదేశం ఎంతో అవసరం. విశ్వాస ప్రమాణం దేవుడు మనకి ఇచ్చే మూడు వరాల గురించి వివరిస్తుంది. అవేమనగా: దేవుడే మన మూలదాత; దేవుడే మన ముక్తిదాత; మనలను పవిత్రం చేసేవాడు.

2. విశ్వాస సంస్కారాలు: యేసుక్రీస్తుద్వారా పవిత్రాత్మద్వారా ఒకేసారి సిద్ధించిన దేవుని రక్షణ శ్రీసభ జరిపే పవిత్ర కర్మలైన అర్చనలు దేవుడు మనకు ఒసగిన ఏడు దివ్యసంస్కారాలు.

3. విశ్వాసమయ జీవనం: దేవునిరూపంలో చేయబడిన మానవుని చరమాశయము గురించి వివరించడం; మోక్షానందం దాన్ని అందుకునే మార్గాలు, దేవుని చట్టం ఆయన కృపావర సహాయముతో స్వేచ్ఛగా ఎంపిక చేసుకున్న సత్ప్రవర్తన, దేవుని పది ఆజ్ఞలలో నిర్దిష్టమవుతున్న ద్విముఖ ప్రేమను ఈ సత్ప్రవర్తన నెరవేర్చడం అను విషయములను గురించి వివరించడం.

4. విశ్వాసమయ జీవనంలో ప్రార్ధనం: విశ్వాసుల జీవితంలో ప్రార్థనకున్న అర్థాన్ని, దాని ప్రాముఖ్యాన్ని వివరించడం; ప్రభువు నేర్పిన ప్రార్థనలోని ఏడు విన్నపాలను వివరించడం.

సత్యోపదేశమును ప్రథమంగా బోధించేవారు: తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉపదేశకులు. అలాగే, జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. ప్రతీ క్రైస్తవుడు కూడా ఒక ఉపదేశియే!

వారి ముఖ్య బాధ్యత: వారి విశ్వాసాన్ని పంచుకోవడం. వారి దైవానుభవాన్ని పంచుకోవడం. ఇతరులకు ముఖ్యముగా పిల్లలకు యేసు ప్రభువును పరిచయం చేయడం. అనగా వారు ప్రభువును తెలుసుకోవాలి, ఆయన అనంతప్రేమను, కరుణను తెలుసుకోవాలి. ఇలా చేసినప్పుడే ప్రభువు గురించి తెలుసుకోవాలనే ఆశ, తపన వారిలో కలుగుతుంది.

సత్యమును బోధించాలి. కేవలము జ్ఞానంకోసం మాత్రమేకాకుండా, వారి జీవితం కొరకు చెప్పాలి.
ఉపదేశకులు ఆదర్శ జీవితాన్ని జీవించడం చాలా ముఖ్యం, లేనిచో వారి బోధనలు హృదాయే!

మనం జీవించే జీవితం ఆదర్శం కావాలి.

తల్లిదండ్రులు వారి బాధ్యత:

కుటుంబం ఓ చిన్న శ్రీసభ. గృహస్థ దేవాలయం. కుటుంబం ఐక్యతకు పవిత్రతకు నిలయం. కుటుంబం సమాజానికి పునాది. కుటుంబమే సమస్తము. కుటుంబము ప్రార్థనకు నిలయం (1 కొరి. 16:19; రోమీ. 16:5; కొలస్సీ. 4:15; ఫిలే. 2). కుటుంబం దేవుని సన్నిధికి నిలయం (దర్శన. 3:20). కుటుంబంలో ఐక్యతను, పవిత్రతను భద్రపరచుకోవాలి అంటే విశ్వాసం, ప్రార్థన, సువార్త జీవితం ఎంతో అవసరం. అప్పుడే మీరు మీ పిల్లలకు సత్యోపదేశాన్ని చెప్పగలరు. ప్రభువు గురించి తెలియజేయడానికి, తల్లిదండ్రులు పిల్లలతో తగిన సమయాన్ని వెచ్చించాలి, విశ్వాస సత్యాలను బోధించాలి.

కనుక తల్లిదండ్రులు పిల్లలపట్ల విశ్వాస విషయంలో, గుడివిషయంలో, సువార్త విలువల విషయంలో, నైతిక విలువల విషయంలో, చాలా శ్రద్ధవహించండి. పిల్లలను మనం ఎటువంటి వాతావరణంలో పెంచుతున్నాము? వారి ఎదుగుదలకు (మానసిక, శారీరక, ఆధ్యాత్మిక) ఎంతవరకు మనం న్యాయంచేస్తున్నాము? పిల్లలు, యువత ఎన్నోదురలవాట్లకు బానిసలవుతున్నారు. ఈనాటి ప్రసార మాధ్యమాలకు బానిసలవుతున్నారు. తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏమిటి?

పిల్లల ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు:

-ప్రార్థనలు నేర్పాలి
-ప్రార్థన చేయటం నేర్పాలి
-బైబిలు చదవటం నేర్పాలి
-వాక్యమును వినేలా నేర్పాలి
-గుడికి రావడం నేర్పాలి
- దేవునిపై ఆధారపడటం నేర్పాలి
- నైతిక విలువలు నేర్పాలి
- సువార్త విలువలు నేర్పాలి
- పునీతుల జీవితాలు తెలియజెప్పాలి
- శ్రీసభ సంప్రదాయాలను తెలియజేయాలి
- విచారణ గురువుల పట్ల బాధ్యతలను తెలియజేయాలి.

చివరిగా ఒక మాట:

ఒక్కోసారి మనం అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. ఇప్పటికే పిల్లలు అదుపుతప్పి ఉండవచ్చు. అయినను అధైర్యపడవద్దు. ఓపికగా ఉండాలి. ప్రార్థన చేయాలి, దేవునిపై భారం వేయాలి. మన కష్టాన్ని దేవుడు ఎప్పుడు కూడా హృదా కానివ్వడు.

31 సామాన్య ఆదివారము, Year B

31 సామాన్య ఆదివారము, Year B
ద్వితీయ. 6:2-6; హెబ్రీ. 7:23-28; మార్కు. 12:28-34

ప్రేమ కలిగి జీవించినప్పుడు దైవ రాజ్యంలో ఉంటాము

దేవునికి మానవునికి మధ్య ఉన్న బంధం ఓ ప్రత్యేకమైన ప్రేమానుబంధం. దేవుడు ప్రేమ. ఆయన ప్రేమామయుడు, కనుక దేవుడు ఈ లోకమును సృష్టించి మానవుని ఈ లోకానికి అధిపతిగా చేసి ఉన్నాడు. దేవుడు తన సృష్టిలో అణువు అణువున తన ఉనికిని కలిగి ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ప్రేమిస్తూ ఉంటాడు. అలాగే మనము ప్రేమించాలని ఆహ్వానిస్తూ ఉంటాడు. పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ మనల్ని మనం దేవునికి అర్పించుకుంటూ దేవుని ఆహ్వానానికి సమాధానం ఇవ్వాలి, అనగా ప్రేమగా జీవిస్తూ ఉండాలి. దేవుని ప్రేమను మనం క్రీస్తు సాన్నిధ్యము ద్వారా అనుభవించుచున్నాము. క్రైస్తవ ప్రేమ దేవుని ప్రేమతో ముడిపడి ఉండాలి.

మొదటి పఠనములో దేవుని ప్రేమ పది ఆజ్ఞలద్వారా వ్యక్త పరచబడి ఉన్నది. “మీ ప్రభువైన దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమింపుడు” (6:5) అని ప్రభువు తన ప్రజలను ఆహ్వానిస్తున్నాడు. తద్వారా వారు ఆశీస్సులను పొందుతున్నారు. రెండవ పఠనములో క్రీస్తు ప్రధాన యాజకునిగా తనను తాను ఏ విధంగా అర్పించుకుని మనలను రక్షించి ఉన్నాడో ధ్యానించుచున్నాము. ప్రధాన యాజకునిగా తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒకే ఒక బలిగ, శాశ్వతంగా అర్పించుకొనెను (7:27) సువిశేష పఠనములో ప్రభువు ప్రముఖ శాసనమును ఇస్తున్నాడు. “నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ శక్తితోను, ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకొనునట్లు నీ పొరుగు వానిని ప్రేమింపుము. ఇది రెండవ ఆజ్ఞ (12:30-31). “దీనిని మించిన ఆజ్ఞ మరియొకటి లేదు” అని ప్రభువు చెప్పియున్నాడు.

పది ఆజ్ఞలు దైవ ప్రేమ

మోషే సినాయి కొండపై యెహోవా దేవుని పది ఆజ్ఞలను స్వీకరించి ఉన్నాడు. వానిని దైవప్రజలకు-ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించవలసి యున్నది. వారు ఆజ్ఞలను పాటిస్తే ఆశీస్సులు పొందుతారు అని తెలియజేయడం జరిగింది. దైవాను బంధమును కలిగి ఉండాలంటే ఈ పది ఆజ్ఞలు పాటించటం ఎంతో ముఖ్యము. దేవుని బంధములో ఉండాలంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలని మోషే బోధించి ఉన్నాడు. భయభక్తులు కలిగి ఉండటం అనగా దేవుని ఆజ్ఞలను/ చట్టాన్ని/ చిత్తాన్ని పాటించటం. భయము అనేది క్రమశిక్షణలోనికి నడిపిస్తుంది. క్రమశిక్షణ ఆత్మను పవిత్రముగావించుటకు ఒక ప్రక్రియ, క్రమము లేదా పద్ధతి. ఎప్పుడైతే, ఒక విశ్వాసి పవిత్రతలో ఎత్తునకు ఎదుగుతారో, అప్పుడు భయము క్షీణిస్తుంది. భయము దేవుని ప్రేమతో లేదా నిజమైన ప్రేమతో భర్తీ చేస్తుంది.

తరువాత మోషే “దేవుడు ఏకైక ప్రభువు” (6:4) అని ఆ ప్రభువును “పూర్ణ హృదయముతో, పూర్ణమనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమింపుడు” (6:5) అని దైవప్రజలకు ఉపదేశించాడు. ఇదే వారు తమను తాము దేవునికి ప్రతిష్టించుకోవటం, అర్పించుకోవడం, అంకితం చేసుకోవటం, దేవునికొరకు జీవించటం, దేవునితో జీవించడం, మరియు దేవునిద్వారా జీవించటం. దేవుని గౌరవించాలి, ఆయన పట్ల భక్తిని కలిగి ఉండాలని మోషే బోధించాడు. భక్తి అనగా అన్ని వేళలా, అన్ని పరిస్థితులలో దేవుని ఆజ్ఞలను పాటించడం. దీనిద్వారా వారు పొందే ఆశీర్వాదాలు - కలకాలం బ్రతికిపోవటం (6:2), పెద్ద కుటుంబమును కలిగి ఉండటం మరియు వాగ్ధత్తభూమిని పొందటం (6:3).

క్రీస్తు ప్రధానయాజకుడు

క్రీస్తు “ఇతర ప్రధాన యాజకుల వంటివాడు కాదు” (7:27). పాత ఒప్పందములో ఎంతోమంది ప్రధాన యాజకులు ఉన్నారు. నూతన ఒప్పందంలో ప్రధానయాజకుడు క్రీస్తు ఒక్కడే. పాత నిబంధనలో ప్రధాన యాజకులు, వారి పాపముల కొరకు, ప్రజల పాపముల కొరకు ప్రతిరోజు బలులను అర్పిస్తూ వేడుకొనెడివారు. క్రీస్తు ప్రధానయాజకుడు “ప్రతి దినము మొదట తన పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకు బలులను అర్పింపవలసిన అవసరము ఆయనకు లేదు. ఒకే బలిగ, శాశ్వతముగా అర్పించుకొనెను (7:27).  ఎందుకన, ఆయనలో ఏపాపము లేకుండెను. మోషే చట్టము బలహీనులగు వ్యక్తులను ప్రధాన యాజకులుగా నియమించెను. కాని దేవుని ప్రమాణ వాక్కు సర్వదా సంపూర్ణుడుగ చేయబడిన దైవపుత్రుని ప్రధానయాజకునిగా నియమించెను (7:28). పాత ఒప్పంద ప్రధాన యాజకులు బలహీనులు, పాపాత్ములు, మృతమానవులు కాని క్రీస్తు ప్రధానయాజకుడు పాపరహితుడు, పవిత్రుడు, దైవ కుమారుడు. వారు పాపాత్ములు, బలహీనులు, మృతమానవులు కనుకనే అనేక ప్రధాన యాజకులు ఉండెడివారు. కాని క్రీస్తు ప్రధాన యాజకత్వం మరణముతో ముగియలేదు. అందుకే క్రీస్తు ప్రధానయాజకుడు ఒక్కడే. వాస్తవానికి క్రీస్తు ప్రధాన యాజకత్వం సమర్థత ఆయన ఉత్థానంతో ప్రారంభమైనది. ఇప్పుడు ఆయన అంతర్గత మహాపవిత్రస్థానమున ఉండి మన అందరి కొరకు వేడుకొనుచున్నాడు. ఆయన శాశ్వతముగా తండ్రి దేవుని సింహాసనమున ఉన్నాడు. దేవుని చెంతకు చేరుకోవాలని కోరుకునే వారందరి కొరకు ఆయన తండ్రి చెంత ప్రాధేయపడుతున్నారు. క్రీస్తు ద్వారా తప్ప వేరే మార్గం లేదు. మానవ స్వభావంలో ఆయన సంపూర్ణ మానవుడు. దేవుని ఆజ్ఞలను తు.చ. తప్పకుండా పాటించి వాటికి విధేయుడై జీవించాడు. అనంతమైన విలువ కలిగిన ఏకైక బలిని అర్పించి ఉన్నాడు. తద్వారా ఒకే ఒక బలిగ, శాశ్వతముగా అందరి కొరకు, అన్ని కాలాలకు అర్పించుకోవడం తగినది.

దైవ ప్రేమ సోదర ప్రేమ

ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు “ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది” అని యేసుని ప్రశ్నించాడు. ఆ కాలములో శిష్యులు బోధకుడుని లేదా గురువుని ప్రశ్నలు అడగటం సాధారణం. ప్రాముఖ్యమైనది ఏదో తెలుసుకొని శాశ్వత జీవమును, దేవుని రాజ్యమును, దేవుని రక్షణను పొందుటకు, వేడుకొనుటకు, నిజాయితీతో కూడిన ప్రశ్నగా మనకి కనిపిస్తుంది. ఎందుకనగా, ఇక్కడ ప్రభువును ఇబ్బంది పెట్టుటకు అడగటం లేదు. పది ఆజ్ఞలలో ఏది ప్రధానమైన ఆజ్ఞ అని వారు ఒకరినొకరు తర్కించుకొంటున్నారు. నిజాయితీగా వాస్తవాన్ని తెలుసుకొనుటకు ప్రశ్నించడం జరిగింది. సాధారణంగా ధర్మశాస్త్ర బోధకులు చట్టాన్ని వివరించడంలో నిపుణులు, సమర్ధులు. కనుక ప్రభువు యొక్క ఉద్దేశము తెలుసుకొనుటకు వారు ప్రభువుని ప్రశ్నించారు. ప్రశ్న నిజాయితీతో కూడినదని ప్రభువు కూడా చక్కగా సమాధానము ఇచ్చి ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించడం పొరుగు వానిని ప్రేమించడం ప్రముఖ శాసనమని ప్రభువు చెప్పియున్నాడు. ఇచ్చట ప్రభువు మొదటి ఆజ్ఞ కొరకు ద్వితీయోపదేశకాండము నుండి చెప్పియున్నాడు. “ప్రభువైన దేవుడు ఏకైక ప్రభువు” అని మోషే యూదులకు ఆదేశించాడు. ఒక వ్యక్తి పరిపూర్ణముగా దేవుడిని ప్రేమించాలి దీనికి ప్రభువు రెండవ ఆజ్ఞను చేర్చి ఉన్నాడు. “నిన్ను నీవు ప్రేమించుకొన్నట్లు నీ పొరుగు వానిని ప్రేమించుము” (12:31). ఈ రెండవ ఆజ్ఞ కూడా కొత్తది ఏమీ కాదు. లేవీయకాండములో చెప్పబడింది. “పొరుగువానిమీద పగతీర్చుకొనకుడు. వైరము పెట్టుకొనకుడు. నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రిమింపుము” (లేవీ.19:18). అయితే క్రీస్తు బోధించిన కొత్త విషయం ఏమంటే, ఈ రెండు ప్రధాన ఆజ్ఞల మధ్యనున్న బంధము. దైవ ప్రేమ, సోదర ప్రేమల మధ్యన సన్నిహిత సంబంధము ఉన్నది. క్రైస్తవ ప్రేమలో దేవుడు, పొరుగువారు వేరు వేరు కాదు. ఈ రెండు విడదీయలేనటువంటివి (చూడుము మత్త. 25:40). ఇది ప్రభువు చెప్పిన కొత్త విషయం. మరొక కొత్త విషయం ప్రభువు నేర్పునది - పొరుగువారు ఎవరు? పొరుగువాడు అనగా ప్రభువు ఒక నూతన అర్ధాన్ని బోధిస్తున్నాడు. లేవీయకాండము సమయములో పొరుగువాడు అనగా కేవలం తోటి యూదుడు మాత్రమే కాని ప్రభువు ప్రకారం ప్రతి మనిషి కూడా పొరుగువాడే.

ప్రభువు ఇచ్చిన సమాధానమునకు బదులుగా ఆ ధర్మశాస్త్ర బోధకుడు ప్రభువు బోధనను అంగీకరించాడు. “బోధకుడా నీవు యదార్థము చెప్పితివి” (12:32) అని అన్నాడు. “దేవుడు ఒక్కడేనని, దేవుని, పొరుగువారిని ప్రేమించుట సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది” (12:33) అని ఉద్ఘాటించాడు. బలుల కన్న, బాహ్యమైన కార్యములకన్న ప్రేమ గొప్పది. అంతర్గతముగా నిజమైన ప్రేమ ఉన్నప్పుడే బాహ్యముగా మనము చేయు ప్రార్థనలు, పనులకు నిజమైన విలువ, అర్థం చేకూరుతుంది. అందుకే ప్రభువు ఆ ధర్మశాస్త్ర బోధకునితో, “దేవుని రాజ్యమునకు నీవు దూరంగా లేవు” (12:34) అని అన్నాడు. దేవుని రాజ్యమునకు దగ్గరగా ఉండటం వేరు. దేవుని రాజ్యములో ఉండటం వేరు. దేవుని రాజ్యంలో ఉండటానికే, కలువరి సిలువపై తనను తాను ఒక బలిగ, శాశ్వతముగా అర్పించి ఉన్నాడు (హెబ్రీ. 7:27). నిజమైన ప్రేమ తన్ను తాను బహుమానముగా ఇతరులకు అర్పించడం. ఆ ఇతరులే దేవుడు మరియు పొరుగువారు.

మనం నేర్చుకోవలసిన పాఠాలు

1. క్రైస్తవ జీవన విధానానికి పునాది దైవప్రేమ మరియు సోదర ప్రేమ. “దీనిని మించిన ఆజ్ఞ మరియొకటి లేదు” అని ప్రభువే స్వయముగా చెప్పియున్నాడు. మిగతా ఆజ్ఞలు అన్ని కూడా ఈ రెండు ఆజ్ఞలలో ఇమిడియున్నవి. పొరుగువారికి ఎలాంటి హాని, కీడు చేయకూడదు. ఎందుకన ప్రతి ఒక్కరు దేవునికి సంబంధించినవారే. ప్రతి ఒక్కరికి జీవము నిచ్చిన దేవుడు ఒక్కడే. అదే దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించాలని గౌరవించాలని ఆజ్ఞాపించాడు. ఇతరులకు హాని చేయడం దేవుని హక్కులను జోక్యం చేసుకోవడమే, మరియు ఆయన ఆజ్ఞను అవిధేయించడమే! శాశ్వతమైన పరిపూర్ణమైన దేవున్ని మనం ప్రేమించాలి. వాస్తవానికి మనం మన పొరుగు వారిని ప్రేమించినప్పుడు దేవుడిని కూడా ప్రేమిస్తున్నాము. ఎందుకన దేవుని స్వరూపం ఇతరులలో ఉన్నది. దేవుడు అందరినీ తన పోలికలో, తన రూపములో సృజించి ఉన్నాడు (ఆది. 1:27). దేవుడు మనకు జీవమును, జీవితమును, సమస్తమును ఇచ్చి ఉన్నాడు. ఆయన మనలను మిక్కిలిగా ప్రేమిస్తున్నాడు. కనుక మనము ఆయనకు ఎంతగానో ఋణపడి ఉన్నాము. కనుక మనం ఆయనను ప్రేమించాలి, ఆయన నామమును గౌరవించాలి, ఆయన సాన్నిధ్యమును గౌరవించాలి.

2. దేవునితో మన ఆధ్యాత్మిక అనుబంధం ఈ రెండు ఆజ్ఞల ద్వారా సాధ్యమవుతుంది. ఎవరైతే ప్రేమించరో, వారు శూన్యం, ఏమీ లేని వారు. ప్రార్థనచేయుచు పొరుగు వారిని ప్రేమించనిచో నిజమైన ప్రేమ వారిలో లేనట్లే! దేవుడు వారిలో వాసం చేయలేడు. దేవుడు ప్రేమ స్వరూపుడు. కనుక ప్రేమించువాడు దేవునిలో వాసము చేయును. అట్టివారు పొరుగువారి పట్ల శ్రద్ద వహించగలరు, ప్రేమించగలరు. ఈ రెండు ఆజ్ఞలను పాటించడం ద్వారా మనం దైవ రాజ్యంలో చేరగలం.

3. క్రీస్తు ప్రేమ మనకు ఆదర్శం. ఆయన ప్రేమ దైవీకమైనది, శాశ్వతమైనది. పొరుగు వారి ప్రేమను మనకు నేర్పించి ఉన్నాడు. ఆయన శత్రువులను సైతం ప్రేమించి ఉన్నాడు. సిలువ నుండి తన శత్రువుల కొరకు క్షమాప్రార్థన చేసి ఉన్నాడు.

4. ఈరోజు ప్రేమ అనే పదం తప్పుగా అర్థం చేసుకోబడుచున్నది; తప్పుగా ఉపయోగించబడుతున్నది. నిజమైన ప్రేమ సంపూర్ణ అర్పణం, త్యాగం; ఇతరులకు మన సమయాన్ని ఇవ్వటం; సహాయం చేయటం; తోడుగా ఉండటం. ప్రేమ అనగా సంపూర్ణముగా ఇవ్వటం; ఇతరులతో మనం ప్రేమింపబడాలి. ప్రేమించబడినప్పుడే మనం ఇతరులను ప్రేమించగలము.

5. కుటుంబ సభ్యులను ప్రేమించుదాం. వారికి మన సమయాన్ని కేటాయించుదాం. పనిచేయు స్థలములలో ఇతరులతో ప్రేమగా ఉందాం. అందరిని సమానంగా చూద్దాం.