30 వ సామాన్య ఆదివారము, Year B

30 వ సామాన్య ఆదివారము, Year B
యిర్మీ. 31:7-9; కీర్తన. 125; హెబ్రీ. 5:1-6; మార్కు. 10: 46-52.

సరిచేయువాడను... సమకూర్చువాడను... నేనే!

ఈనాటి మొదటి పటనములో, బాబిలోనియా బానిసత్వంలో మగ్గుతున్న ఇజ్రాయిలు ప్రజలకు దేవుడు ఊరటను, ఓదార్పును ఇర్మియా ప్రవక్త యొక్క సందేశముద్వారా తెలియజేస్తున్నాడు. ఈనాటి మొదటి పటనము, ఇర్మియా గ్రంథములోని ఓదార్పు ప్రవచనములకు చెందినవి (యిర్మీ. 30:1-33:26). ఈ ప్రవచనముల యొక్క సందర్భమును, సందేశమును తెలిసికొని, ఈనాడు ప్రభువు, ఈ వాక్యము ద్వారా మనకు ఇచ్చే సందేశమును ధ్యానించుకుందాం!

ఈనాటి మొదటి పటనం మూడు వచనాలే అయినా చాలా ముఖ్యమైన సందేశం నిగూఢమై ఉంది. కావున ఈ వాక్యములను క్షుణ్ణముగా పరిశీలించుదాం! మనం విన్న వాక్యములు (7-9), యిర్మీయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన మాటలు. ‘ఇశ్రాయేలును తలంచుకొని సంతసముతో పాటలు పాడమని’ ఆహ్వానిస్తున్నాడు. ఈ ఆహ్వానమును అర్థంచేసుకొనుటకు, ఈ మాటలు పలుకబడిన సందర్భమును విపులంగా అర్థం చేసుకోవాలి.

సందర్భం: సొలోమోను తర్వాత రాజయిన రెహబాము కాలములో సామ్రాజ్యం రెండుగా చీలిపోయింది. ఉత్తరమున 10 తెగలతో కూడిన సామ్రాజ్యమును ఇజ్రాయేలు అని, దక్షిణమున రెండు తెగలతో కూడిన (యూదా, బెంజమిన్ తెగలు) రాజ్యమును యూదా అని పిలిచినారు. ఈ విభజన దాదాపు క్రీస్తుపూర్వం 922 (B.C.) సంవత్సరంలో జరిగింది. క్రీస్తుపూర్వం 722 లో ఉత్తర రాజ్యం (ఇశ్రాయేలు), క్రీస్తుపూర్వం 586 లో దక్షిణ రాజ్యం (యూదా) పరాయి రాజులచే జయింపబడి బానిసత్వంలోకి కొనిపోబడ్డాయి. ఉత్తర రాజ్యమును సమరియా అని కూడా పిలిచేవారు. పూర్వం 722 లో అస్సీరియా రాజు ఇశ్రాయేలుపై దాడిచేసి వారిలో కొంతమందిని బందీలుగా కొనిపోయాడు. తమలో కొందరిని సమరియాలో నివసింపచేసి ఇజ్రాయేలు స్త్రీలను వారి భార్యలుగా చేసుకున్నారు. వీరికి కలిగిన సంతానాన్ని సువార్తలలో సమరీయులుగా, సంకరజాతి వారిగా, అంటరానివారిగా, అపవిత్రులుగా పరిగణించారు. బానిసత్వంలో ఉన్న రెండు రాజ్యముల ప్రజలు “ఇజ్రాయిలు” అను పేరు గుర్తుకు రాగానే వారికి పట్టిన దుర్గతిని గురించి చింతించి దుఃఖించే వారు. ఈ సందర్భంన ‘ఇశ్రాయేలు’ అంటే ఉత్తర రాజ్యం కాదు. యాకోబు కుమారుల సంతానము అనగా 12 తెగలను ఉద్దేశించి ఈ మాటలు పలుకబడినవి. ఈనాడు మనం విన్న వాక్యములను ఇర్మియా ప్రవక్త రెండు రాజ్యంలో ఉన్న శేషజనమును ఉద్దేశించి మాట్లాడిన వచనములు. ఈ శేషజనము ఎవరంటే, ముదుసలి ప్రాయంలో ఉన్నవారు, రోగస్తులు, బలహీనులు, అస్సీరియులకు పనికిరాని వారు. వారు తమను పోషించే కుమారులను, కుటుంబాలను తలచుకొని దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు. వీరిని ఉద్దేశించి ప్రవక్త సంతోషించమని ఆహ్వానిస్తున్నాడు. దానికి గల కారణాలను 7వ వచనంలో వివరిస్తున్నాడు. ప్రభువు”తన ప్రజలను” రక్షించెను. “తన ప్రజలు” అన్న ఈ మాటను మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఇశ్రాయేలు, యూదా రాజ్యములు కూల్చబడినప్పుడు, ప్రజలు బానిసలుగా కొనిపోబడినప్పుడు, దేవుడు తమను త్యజించాడని, తనను వదిలివేశాడని, తమను పట్టించుకోవడంలేదని, తమ పాపములను బట్టి త్రోసివేశాడని, తమతో జీవించడంలేదని, అందుకే ఈ దుర్గతి పట్టిందని అనుకున్నారు. దేవుడు తమతో తమ రాజ్యంతో తమ ప్రజలతో విసిగిపోయారని అనుకొన్నారు. తమను తమ ఇష్టానికి వదిలేశాడని అనుకున్నారు. కాని దేవుడు వారిని వదిలిపెట్టలేదు, వారిని త్యజింపలేదు. దేవుడు వారిని ఇంకా ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. బాబిలోను బానిసత్వంద్వారా, పరాయి రాజుల పాలనలో దేవుడు వారిని సరిచేయాలని, సవరించాలని, తన ప్రేమకు పాత్రులుగా సిద్ధపరచాలని దేవుడు ఆలోచించాడు. దేవునియొక్క రక్షణ, ఆయనయొక్క పునర్ నిర్మాణ కార్యక్రమం “ఉత్తర దేశం” నుండి ఆరంభమవుతుందని 8వ వచనం తెలియజేస్తుంది. “ఉత్తరం వైపు” నుండి (యిర్మీ. 4:6) విపత్తు, వినాశనం, శత్రువు వచ్చాడు. అదే మార్గము గుండా దేవుడు రక్షణమును, సంతోషమును, ఆనందమును, అభివృద్ధిని, ఆశీర్వాదమును కలుగజేస్తాడు. ఏ వైపును చూసి జనులు భయభ్రాంతులయ్యారో, ఆ వైపునుండి ప్రభువు అభయమును, ఆపన్నహస్తమును కలుగజేస్తాడు. ఆ వైపునుండి ప్రభువు తన ప్రజలను తిరిగి తోడ్కొని వస్తాడు. ఈ తిరుగు ప్రయాణంలో ప్రభువు ఎవరిని తిరస్కరించడు. అంధులను, కుంటివారిని, గర్భవతులను, ప్రసవించువారిని అందరిని సమూహముగా తోడ్కొని వస్తారు. పైన పేర్కొన్న వారు బలహీనులు, వేరే వ్యక్తుల సహాయము అవసరమైన వారు. వారి బలహీనతను బట్టిగాని వారి నిస్సహాయతను బట్టి గాని ఎవరు నిరాకరింపబడరు. అందరినీ కలుపుకొని అందరూ కలసి వారి దేశమునకు, వారి పట్టణములకు, వారి ఇళ్లకు, వారి దేవుని యొద్దకు వచ్చెదరు. బలవంతులు మాత్రమే కాదు, బలహీనులు కూడా దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన వారే. వారిని దేవుడు వదిలిపెట్టడు. వారిని దగ్గర ఉండి తోడ్కొని వస్తాడు. 9వ వచనములో “వారు ఏడుపులతోను, ప్రార్థనలతోను, ప్రభువు నడిపింపున వచ్చెదరు” అని విన్నాము. “ఏడుపు, ప్రార్ధన” మానసిక భావోద్వేగములు. పశ్చాత్తాపమునకు, పరితాపమునకు గుర్తు. మారుమనస్సుకు మారిన వ్యక్తికి గుర్తు. తిరిగి వచ్చేవారు ప్రభువు యొక్క ప్రేమను ఆయన యొక్క గొప్పతనమును గుర్తించినవారు. పూర్వము అనగా, పరాయి బానిసత్వమునకు ముందు, వారి హృదయములు కఠినంగా, రాతివలె అనగా భావోద్వేగాలులేక ఉండెను. ఇప్పుడు వారి హృదయములు మారినవి. వారి హృదయములు దేవుని కార్యములకు, నడిపింపునకు స్పందించుచున్నవి. దేవుని నడిపింపులో ఆయన ప్రేమను వారు చవిచూస్తున్నారు.

సందేశం

ఈనాడు ఈ వాక్యమును ఆలకిస్తున్న సోదరా! సోదరీ! నీ జీవితంలో నీకు కష్టాలు వచ్చినప్పుడు దేవునిచే త్యజింపబడినావని అనుకుంటున్నావా? నీవు అనుకున్నట్లు నీకు జరగనప్పుడు దేవుడు నీతో లేడని అనుకున్నావా? దేవుడు నీతో రాడని అనుకున్నావా? ఆయన నీతో సంబంధం తెంచుకున్నాడని అనుకున్నావా? నీవు దేవుని ప్రేమకు దేవుని మాటకు స్పందించనపుడు దేవుడు నిన్ను సరిచేయాలని అనుకున్నాడు, స్పందింప చేయాలనుకున్నాడే కానీ, నిన్ను వదలలేదు, త్యజింపలేదు, నీతో సంబంధం తెంచుకోలేదు. ఆయన తన సంబంధాన్ని పెంచుకుంటున్నాడు. ఆయన నిన్ను తన బిడ్డగా ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను జేష్ఠపుత్రునిగా చేసుకుని నీకు వారసత్వమును ప్రసాదిస్తున్నాడు.

నీవు ఎక్కడైతే అవమానమును పొందావో, ఆవేదన చెందావో, అక్కడే ప్రభువు నిన్ను ఘనపరుస్తాడు. అక్కడే నిన్ను ప్రభువు హెచ్చిస్తాడు. ఏ వైపునుండి నీ శత్రువు వచ్చి, నిన్ను బెదిరించాడో, నిన్ను భయబ్రాంతులకు గురిచేశాడో, ఆ వైపునుండే ప్రభువు నీకు అభయమును, ఆశీర్వాదమును దయచేస్తాడు. ఏ వైపుకు చూసి నీవు ఆందోళన చెందావో, ఏ పేరు వింటే నీవు కలవరపడ్డావో, ఆ వైపునుండి ప్రభువు నీకు ధైర్యం ఇస్తాడు. ఆ పేరులోనే నీకు నిశ్చలతను ప్రభువు దయచేస్తాడు. సరళమైన, తిన్నమార్గముల గుండ నిన్ను నడిపిస్తాడు. బానిసత్వంలోనికి వెళ్లేటప్పుడు ఇంటిని, భార్యా బిడ్డలను, సంపదలను, సొంత జనమును, వీడునప్పుడు ఇశ్రాయేలీయులకు కలిగిన భావన నీకు కలిగితే, తిరిగి వచ్చేటప్పుడు ఏవిధముగా ప్రభువు నీదగ్గరుండి నడిపించాడో, అదే విధముగా నిన్ను తన ఇంటికి నడిపిస్తాడు. గుడ్డివారిని, కుంటివారిని, గర్భవతులను, బాలింతలను, ఏవిధముగా జాగ్రత్తగా నడిపించాడో, ప్రభువు నీ బలహీనతలో నిన్ను నడిపిస్తాడు; నీ పక్కనే ఉంటాడు; నీకు కావాలిగా, రక్షణగా, ఆసరాగా, అండగా ఉంటాడు. ఈ మహా కార్యమును నీ కనులారా చూచుటకు, అనుభవించుటకు నీవు చేయవలసిన కార్యం ఒక్కటే! ఇశ్రాయేలువలె దేవుని ప్రేమను తెలుసుకొని, ఆయన మాటను ఆలకించి, ఆయన మార్గమును తెలుసుకొని, ఆయన మంచితనాన్ని చూసి నీ తప్పిదములను, నీ పాపములను, నీ హృదయ కాఠిన్యమునకుగాను, నీ నడవడికకుగాను, నీ దుష్కార్యమునకుగాను, పశ్చాత్తాపంచెంది, పరితాపంపొంది, ఆయనయొద్దకు ఏడుపుతో, ప్రార్థనతో తిరిగి రావడమే! చేసిన తప్పులకు క్షమాపణలు కోరడమే! దానికి నీవు సిద్ధంగా ఉన్నావా? అయితే ఆలస్యమెందుకు, ప్రభువు నీ పక్కనే ఉన్నాడు. నీకు కావలసినవన్నీ ఆయన సమకూరుస్తాడు. ఎందుకంటే ఆయన నీ తండ్రి! నా తండ్రి! మనందరి తండ్రి!

తప్పు చేసినప్పుడు శిక్షించేవాడు, పశ్చాత్తాపం చెందితే రక్షించేవాడు, మాట విననప్పుడు చెడగొట్టేవాడు, మారినప్పుడు చేరదీసేవాడు, తప్పుడు మార్గంలో వెళ్ళినప్పుడు సరిచేయువాడు, ప్రతి అవసరములో సమకూర్చువాడు ఆయనే - మనందరి తండ్రి!

29వ సామాన్య ఆదివారము, Year B

29వ సామాన్య ఆదివారము, Year B
యెషయ 53:10-11; కీర్తన. 32; హెబ్రీ. 4:14-16; మార్కు. 10:35-45.

అధికార వ్యామోహం - సిలువ పరమార్ధము
ధర్మ, అర్ధ, కామ, మోక్షలు పురుషార్ధాలు అని మన భారతీయ సనాతన ధర్మం తెలియజేస్తుంది. అంటే పుట్టిన ప్రతి మనిషి ధర్మంగా ఉంటూ ఆస్తి అంతస్తులు సంపాదించి, సంసారం చేసి, పిల్లలను కని, అటు వెనుక మోక్షం పొందాలనే అర్థాన్ని తెలియజేస్తుంది. కాని, దానికి భిన్నంగా, క్రీస్తు జీవిత పరమార్ధం ఇతరులను ప్రేమతో సేవిస్తూ, జాలి, కనికరము, సోదరభావంతో సేవక పాత్ర పోషిస్తూ కార్య నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను, శ్రమలను భరిస్తూ దైవరాజ్య స్థాపనకై శ్రమిస్తూ జీవితాంతము ఇతరులకై జీవించడమే జీవిత పరమావధి అని తెలియజేస్తున్నారు. మోక్ష రాజ్యాన్ని మనము పొందాలంటే క్రీస్తును అనుసరిస్తూ సేవాభావంతో జీవిస్తూ, ఆయన సిలువలో భాగస్థులను కావాలి. ఆయన పాత్రను నుండి మనము పానము చేయగలమా ఆయన సిలువను మనము మోయగలమా అని ప్రశ్నించుకోవాలి. ఆయన పాత్ర చేదుగా ఉంటుంది కాని మనకన్నా ముందే ఆయన పానంచేసి, మనము కూడా పానము చేయగలమని తెలిపియున్నారు. ఆయన సిలువ బరువుగా ఉంటుంది కానీ మన కన్నా ముందే ఆయన సిలువను మోసి దానిని తేలికగా చేసి ఉన్నాడు. సిలువ ప్రేమకు సేవకు చిహ్నం.

క్రీస్తు జీవితమే మనకు ఆదర్శం. ఆయన సేవింపబడుటకు కాక సేవచేయుటకు తన జీవితమును అర్పించుటకు వచ్చిఉన్నాడు - మార్కు. 10:45; మత్త. 20:24-28; లూకా. 22: 24-27.

శ్రమలు - అంతరార్థం
జీవితం సుఖమయం కావాలని అందరూ ఆశిస్తారు. కాని శ్రమలు బ్రతుకు బండిని కుంగదీయాలని ఎవరు కోరుకోరు. అందరిలో గొప్పగా ఉండాలని, అందరూ చెప్పుకునే విధంగా ఆస్తి అంతస్తులతో, అధికారంతో, ఇతరులను శాసించాలని మనసు అంతరాలలో వ్యామోహం మనుషుల్లో దృఢంగా ఉంటుంది. కానీ బాధను భరిస్తూ ఇతరుల యోగక్షేమాలపై వారి పాపాల పరిహారమై ఒకరు మరణించటం మనం క్రీస్తునందు చూస్తున్నాము. “అతని మరణం పాపపరిహారబలి అయ్యెను...అతనిని చూసి నేను వారి తప్పిదాలను మన్నింతును” (యెషయ 54:10-11). ఈనాటి మొదటి పటనములోని బాధామయ సేవకుడు, క్రీస్తు రక్షకుని సరిగ్గా పోలియున్నాడు. శ్రమలు అనుభవించి తన మరణము ద్వారా క్రీస్తు మానవాళిని పాప బంధవిముక్తులను చేయటం తండ్రి దేవుని చిత్తం. ఈ బలియాగంలో క్రీస్తు సేవ, శ్రమలే బలియాగం లేక జీవిత అర్చన ప్రార్ధనలని, మానవ బలహీనతలను తనే స్వయముగా భరించి శోధనలను గెలిచి మనకై బలియై, ప్రధాన అర్చకుడై, మన రక్షణకు అవసరమైన కృపావరాన్ని మనకు అందించాడు (హెబ్రీ. 4:14-16). ప్రేమకోసం, ఇతరులను పాపవిముక్తులను చేయటంకోసం శ్రమలను అనుభవిస్తూ, కావాలంటే చివరకు ప్రేమకోసం మరణించడం క్రీస్తు శ్రమల్లోని పరమార్ధం.

అధికార వ్యామోహం - సేవాభావం
జెబదాయి పుత్రులు యోహాను, యాకోబులు యేసుని తన రాజ్యంలో మహిమాన్విత సింహాసనముపై కుడి ఎడమ కూర్చుండ అవకాశం కావాలని కోరారు (మార్కు. 10:35-37). క్రీస్తుని అనుసరించడం అంటే అధికారం, సింహాసనం, క్రీస్తు తరువాత ప్రధాన పదవి అని వారు అనుకున్నారు. సేవ పేరిట వచ్చి సంఘంలో పదవి, అధికారంకోసం ఎందరో జీవితాన్ని కోల్పోవటం చూస్తున్నాము. సంఘములో చూసిన మేమే పెత్తనం చేయాలని, మావాళ్లే, పైన ఉండాలని చూస్తూ ఉన్నాం. శ్రీ సభ బలహీనంగా ఉండటానికి కారణం అధికార వ్యామోహం, సేవించటానికి వచ్చి సేవించబడటం; సిలువ మోస్తాను అని వచ్చి సింహాసనముపై కూర్చోవటం; ప్రేమిస్తాను అని చెప్పి ఇతరులను అగౌరవపరచటం. అధికారం కావాలి అంటే, సేవ, శ్రమల పాత్రను సేవించాలని క్రీస్తు ఆదేశిస్తున్నారు. జబదాయి కుమారుల మనవిని క్రీస్తు అంగీకరించలేదు.

క్రీస్తుమార్గం - జీవిత సాఫల్యం
జీవిత పరమార్ధం పదవులు అధికారం ఆధిపత్యం కాదని, జీవితం సోదరభావం, అందరిలో చిన్నవాడిగా అందరికీ సేవకునిగా తనను తాను కరిగిపోతూ, ప్రేమ, కరుణ, జాలి, అదే జీవిత పరమార్థమని క్రీస్తు తెలియజేస్తున్నారు. జబదాయి కుమారులు క్రీస్తుని అధికారం కోసం మనవి చేసినప్పుడు, శిష్యుల  బృందంలో అలజడి మొదలైంది. ఈర్ష, ద్వేషం, భేదభావంకోసం అనేక విధాలైన వ్యతిరేక భావనలు కలిగాయి. వెంటనే క్రీస్తు వారిని దగ్గరకు పిలిచి వారిని ఐక్యపరచి వారిలోని భావాలను తీసివేసి సోదరభావాన్ని నింపారు. అధికారము, ఆధిపత్యము, కోపాగ్నిని రగుల్చుతుంది. సేవ, సేవాభావం మనుషుల్లో దీనత, కరుణ, జాలిని నింపుతుంది. శ్రీసభ అధికారంతో విచ్ఛిన్నమైనప్పుడు నిస్వార్థ సేవకులు పుట్టాలి. అందరూ సింహాసనాల కోసం ప్రాకులాడుతున్నప్పుడు, సంఘంలో ప్రజల మధ్య పనిచేసి, సేవలో అలసిపోయే మంచి సేవకులు రావాలి. సంఘములో చిన్నవానిగా ఉండటం, శోధన జయించిన వారికే సాధ్యం. అన్నీ ఉండి ఏమీ లేని వారిగా, అధికారం ఉండి సర్వ సామాన్యంగా ఉంటూ, సన్మానాలకు, ఆర్భాటాలకు, పూజలందుకొనుటకు దూరంగా ఉండి, ప్రజలకు ఏది మంచో తెలియచేసే సేవకులు కావాలి. ఇదే జీవితం. ఇదే క్రైస్తవ జీవిత పరమార్థం.

ప్రపంచాన్ని సేవతో జయించాలి. మనం జ్ఞానంతో జీవించాలి. పరలోక రాజ్యము ను పొందాలంటే మనము యేసుప్రభువును ఎన్నుకోవాలి. ఎందుకనగా క్రీస్తే మన ఆశయం. ఆయనే మన జీవితానికి అర్థాన్ని ఇవ్వగలడు.

28 వ సామాన్య ఆదివారము, Year B

28 వ సామాన్య ఆదివారము, Year B
సొ. జ్ఞాన. 7:7-11; హెబ్రీ. 4:12-13; మార్కు. 10:17-30

ధనం కన్నా దైవం ముఖ్యం

మానవుడు ఈ లోకంలో అనేక సందర్భాలలో, అనేక విషయాలలో దేవుని యొక్క కృపను, ఆశీర్వాదాన్ని మరచిపోయి, ధనమే దైవంగా భావిస్తూ, విశ్వ ప్రయత్నాలు చేస్తూ, నిజమైన జ్ఞానం కలిగి జీవించలేక పోతున్నాడు.

ఈనాటి మొదటి పటనంలో దైవభక్తుడు ఇజ్రాయేలు ప్రజలకు రాజు అయిన సొలోమోను, జ్ఞానంకోసం ప్రార్ధించాడు. “నేను ప్రార్ధన చేయగా దేవుడు నాకు వివేకమును ఒసగెను. నేను మనవి చేయగా, జ్ఞాన ఆత్మను నా మీదికి దిగి వచ్చెను అని సొలోమోను దైవ జ్ఞానముతో తన ప్రజలను పరిపాలించెను. ఆ దేవుని జ్ఞానమే నూతన నిబంధనలో యేసుక్రీస్తు రూపంలో ప్రజల మధ్య ప్రత్యక్షమై ఉన్నది. అందుకే ఈనాటి రెండవ పటనములో దేవుని యొక్క వాక్కు గురించి దాని ప్రతిఫలం గురించి పౌలుగారు అర్థవంతంగా వివరించారు: “దేవుని వాక్కు సజీవ మును చైతన్యవంతం అయినది అది కత్తి రెండంచులకంటే పదునైనది… మానవుల హృదయము నందలి ఆశలను, ఆలోచనలను అది వీక్షింపగలదు” (హెబ్రీ. 4:12).

దేవుని యొక్క వాక్యమును అర్థం చేసుకోవాలంటే ప్రతి మానవునికి దేవుని యొక్క జ్ఞానం చాలా అవసరం. ఎందుకంటే, కీర్తన కారుడు 119:105 లో ఈ విధముగా సెలవిస్తున్నాడు “నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు.”

మన అనుదిన జీవితంలో, మన నడవడికలో, దేవుని యొక్క వాక్కురూపంతో కూడిన జ్ఞానం చాలా అవసరం. బైబిల్ గ్రంధంలో పలుచోట్ల దేవుని వాక్కుగురించి ఈ విధంగా వివరించబడింది:

దేవుని అద్భుతం: కంటికి కనిపించని వానిని నుండి కంటికి కనిపించునట్లుగా దేవుని వాక్కుచేత ప్రపంచం సృజింపపబడింది.

దేవుని వాక్కు యొక్క ఫలం: “వానయు మంచుయు ఆకాశము నుండి దిగివచ్చి, అచ్చటికి మరలిపోక… దేవుని నోట నుండి వెలువడు వాక్కు నిష్ఫలంగా తిరిగి పోక దేవుని సంకల్పం నెరవేర్చును” (యెషయ 55:10-11).

దేవుని వాక్కు నూతన సృష్టి: ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు తన వాక్కు ద్వారా సృష్టిని, జీవరాసులను, కాలములను, యుగములను చివరికి మానవుని తనదైన రీతిలో వాక్కు ద్వారా సృజించెను.

ఇటువంటి గొప్పదైన జ్ఞానమును మరచిపోయి ధనాపేక్ష వలన పరలోకాన్ని కోల్పోయిన ఒక యువ ధనికుని ఉపమాన రీతిలో ప్రభువు ఈనాడు తానే నిజమైన జ్ఞానాన్ని అని నిరూపిస్తున్నారు. నేటి సువిశేష పఠనాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు:

ధనాన్ని పేదలకు పంచి యేసుని అనుసరించి ఇష్టము లేని ధనవంతుని పాత్ర.

యేసుని అనుసరించటానికి తనకు ఉన్న సమస్తమును త్యజించాలన్న శిష్యుని పాత్ర.

దైవ రాజ్యంలో ప్రవేశించటం ధనవంతులకు అసాధ్యం అన్న యేసు పాత్ర.

ఈ మూడింటిపై మనకు దేవుడు ఇచ్చే గొప్ప జ్ఞానం ధనం కంటే దేవుని యొక్క రాజ్యం చాలా విలువైనది అని తెలుపబడుతుంది. సకల అనర్థాలకు మూలం ధనాపేక్ష (1 తిమో 6:10). మనం ఈ లోకాన్ని గమనించినట్లయితే ధనం ఉన్నవారు ఏదైనా చేయగలరు అనునది నిజమైన జ్ఞానం కాదు. ఎందుకంటే, ధనం మానవుడు తన మనుగడకు సృజించుకొన్న ఒక వ్యాపనం. దీపం విలువ చీకట్లో తెలుస్తుంది; రూపాయి విలువ అవసరంలో తెలుస్తుంది; స్నేహితుని విలువ ఒంటరితనంలో తెలుస్తుంది; కానీ దేవుని ప్రేమ, కృపను మనం వెలకట్టలేము; దాన్ని అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది.

ధనానికి దైవానికి ఉన్న వ్యత్యాసం

ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం (1 తిమో. 6:10)

ధనమును నమ్ముకున్నవాడు పాడయిపోవును (సామె. 11:28)

నీ ధనము ఎక్కడ ఉండునో, అక్కడే నీ హృదయము ఉండును (మత్త. 6:21)

భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు (మత్త. 6:19)

పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడు (మ 6:20)

వారు సమృద్ధిగా కానుకలు వేసిరి కాని పేద విధవరాలు తన లేమినుండి ఉన్నదంతయు త్యాగం చేసింది (మార్కు. 12:44).

దేవుడు ధనవంతునితో, ఓరి! అవివేకి, ఈ రాత్రికి నీ ప్రాణములు తీసివేయబడును. నీ సంపద ఎవరిదగును? (లూకా. 12:20).

ఈనాటి మూడు పఠనాల సారాంశమును గ్రహిస్తే, సొలోమోనువలె జ్ఞానవంతులై, ధనానికి దైవానికి గల వ్యత్యాసాన్ని గ్రహించగలం. ధనము అనేది మంచికి ఉపయోగించాలి కాని దానికి మనం లొంగితే దేవుని జ్ఞానాన్ని, ప్రేమను, ఆశీర్వాదాన్ని, పరలోక సంపదను కోల్పోతాము. దేవుడు మనకు కలిగించిన దానిని, దేవుని సేవకై, దేవుని వాక్కు ప్రకటనకై, వెచ్చిస్తూ సంతృప్తి కలిగిన దైవ బిడ్డలవలె జీవించుదాం!!!

పశ్చాత్తాప జీవితం

పశ్చాత్తాప జీవితం

    ‘పశ్చాత్తాపము’ అను పదమునకు ‘తపస్సు’ అని ‘ప్రాయశ్చిత్తము’ అని ‘తనకుతానే విధించుకును శిక్ష’ లేక ‘స్వీయ అవమానము’ అనే అర్ధాలు ఉన్నాయి. సాధారణ భాషలో పశ్చాత్తాపము అనగా ఒక వ్యక్తి చేసిన తప్పులకు, పాపాలకు దుఃఖపడుట, పాపాత్ముడు తన పాపాలకు పశ్చాత్తాప పడుట. అలాంటి వ్యక్తి మత్తయి సువార్త 5:3 లో చెప్పబడిన ‘దీనాత్ములు ధన్యులు’ గా ఉండుట. పశ్చాత్తాపం ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పును తీసుకుని వస్తుంది. అయితే ఈ మార్పుకోసం పశ్చాత్తాపపడే వ్యక్తి ఎలాంటి మార్పులనైనా లేదా సవరణలనైనా చేయటానికి సిద్ధపడతాడు. 

    పశ్చాత్తాప పడటం అనగా వినయాన్ని కలిగియుండటం. పశ్చాత్తాప పడటం అనగా విచారాన్ని, దుఃఖాన్ని తెలియజేయటం లేదా చింతించటం, దేవుని క్షమాపణను పొందటం. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలి. విచారానికి, పశ్చాత్తాపానికి మధ్య భేదాన్ని మనము గుర్తించి తెలుసుకోవాలి. పశ్చాత్తాప పడటం అనగా చేసిన పాపాలకు కేవలం విచారిస్తే, బాధపడితే, దుఃఖపడితే సరిపోదు. ఒక వ్యక్తి తప్పుగాని, పాపంగాని చేసి వాటి వల్ల వచ్చిన పరిణామాలనుబట్టి చాలా బాధపడవచ్చు, కాని పశ్చాత్తాప పడకపోవచ్చు; తన తప్పుడు నిర్ణయానికి చింతించ వచ్చు - అయ్యో! నేను అలా చేసి ఉండకూడదు అని, కాని చేసిన పాపానికి పశ్చాత్తాప పడకపోవచ్చు. పునీత పౌలుగారు రెండవ కొరింతీయులకు వ్రాసిన పత్రిక 7:10 లో నిజమైన పశ్చాత్తాపం గురించి తెలియజేస్తూ ఉన్నారు. 

ఇచ్చట పౌలుగారు రెండు రకాలైన విచారముల గురించి తెలియజేస్తూ, నిజమైన పశ్చాత్తాపం గురించి తెలియజేస్తూ ఉన్నారు: “దేవునిచే వినియోగించబడిన విచారము రక్షణకు దారిచూపు హృదయ పరివర్తనను కలిగించును. కనుక విచారింప పనిలేదు. కాని ప్రాపంచిక విచారమే మృత్యుహేతువగును.” మొదటిది ‘దేవునిచే వినియోగించబడిన విచారము’ - ఇది రక్షణకు దారిచూపు హృదయ పరివర్తనను కలిగించును. దీని భావము ఏమంటే, నిజమైన పశ్చాత్తాపంనకు అర్థము ‘హృదయ పరివర్తన’ చెందడం. 

దీనినే యిర్మియా ప్రవక్త 8:6 లో ‘ఆత్మ విచారము’గా చెప్పియున్నారు. అనగా ‘ఆత్మ విచారము’ చేసికొనుట నిజమైన పశ్చాత్తాపం. ‘దేవునిచే వినియోగించబడిన విచారము’ లేదా ‘ఆత్మ విచారము’ అనగా పాపము ఎంత చెడ్డదో అని దేవునితో ఏకీభవించటం; చేసిన పాపము ఏమిటో తెలిసికోవటం మరియు దేవునియొక్క సహాయముతో ఆ పాపము పునరావృతం కాకుండా చేయటం. ‘ప్రాపంచిక విచారము’ కేవలం మన చెడు భావాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది; అనగా మనం తప్పు చేసినప్పుడు ఇతరులు ఏమనుకుంటారో అని, ఈ తప్పువల్ల పరిణామాలు ఎలా ఉంటాయో అన్న విషయాలపై మాత్రమే దృష్టి ఉంటుంది; ఇలాంటి విచారం నిజమైన పశ్చాత్తాపము కాదు.

    యోహాను 8:11 న, వ్యభిచారములో పట్టుబడిన స్త్రీతో ప్రభువు “ఇక పాపము చేయకుము” అని చెప్పియున్నారు.  “ఇక పాపము చేయకుము” అన్నది నిజమైన పశ్చాత్తాపం. అలాగే యోహాను 5:14 న కోనేటి వద్ద 38 ఏండ్లనుండి వ్యాధి పీడితున్ని, అనగా నడవలేని స్థితిలోనున్న వ్యక్తిని స్వస్థపరచి ప్రభువు “ఇదిగో నీవు స్వస్థుడవైతివి. నీకు మరింత కీడు కలుగకుండుటకు ఇక పాపము చేయకుము” అని చెప్పియున్నాడు. “ఇక పాపము చేయకుము” అన్నది నిజమైన పశ్చాత్తాపం.

    నిజమైన పశ్చాత్తాపం గురించి 51వ కీర్తనలో దావీదు తెలియజేయుచున్నాడు. దావీదు ఊరియా భార్య అయినా బత్షెబతో పాపము చేసాడు. నాతాను ప్రవక్త దావీదును మందలించినప్పుడు దావీదు పశ్చాత్తాప పడ్డాడు. దావీదు నాతానుతో, “నేను యావేకుకు ద్రోహముగా పాపము చేసితిని” అని అన్నాడు (2 సమూ 12:13). తన పాపమునకు పశ్చాత్తాపమును వెల్లడిస్తూ, దావీదు ఈ కీర్తనను వ్రాసియున్నాడు. ఎప్పుడైతే తను చేసిన పాపమును తెలిసికొన్నాడో, తన పాపము కొరకు కన్నీరు పెట్టుకున్నాడు; పాపక్షమకై ప్రార్థన చేసి ఉన్నాడు. తన పాపము వలన దేవునితో తెగిపోయిన బంధాన్ని తిరిగి నిర్మించమని వేడుకున్నాడు. తను చేసిన పాపానికి పరిణామముగా, తనకు పుట్టిన బిడ్డడు మరణించినప్పటికిని, దావీదు చేసిన పాపానికి పశ్చాత్తాప పడ్డాడు. అతని పశ్చాత్తాపము నిజమైనది, శాశ్వతమైనది. 4 వ వచనములో దావీదు అంటున్నాడు “నీకే, నీకే ద్రోహముగా నేను పాపము చేసితిని.”ఈ వాక్యం దావీదుయొక్క నిజమైన పశ్చాత్తాపాన్ని తెలియజేస్తుంది. తను ఎంత ఘోర పాపము చేశాడో, దాని స్వభావము ఏమిటో మరియు అది దేవుని ఎంతగా బాధించిందో తెలియజేస్తుంది. అందుకే 17 వ వచనములో దావీదు అంటున్నాడు “దేవా! నేను అర్పించు బలి పశ్చాత్తాప పూరితమైన హృదయమే. పగిలి నలిగినట్టిదియు, వినయాన్వితమైన హృదయమును నీవు అనాదరము చేయవు.” పగిలి, నలిగిన హృదయం, పరివర్తన చెందిన హృదయం, పశ్చాత్తాపానికి ఆధారాలు.

    తను చేసిన పాపానికి దావీదు రక్షణ ఆనందమును కోల్పోయాడు (వ. 12), సంతోషమును ఉత్సాహమును కోల్పోయాడు (వ. 8). అయినప్పటికిని దావీదు పశ్చాత్తాపము నిజమైనది కనుక, దేవుడు ఆయన పాపమును క్షమించి ఉన్నాడు; దావీదు మరణించక బ్రతికెను (2 సమూ 12:13).

    కనుక, పశ్చాత్తాపము అనగా పాపము నుండి దేవుని వైపునకు మరలుట (అ. కా. 20:21); హృదయ పరివర్తనము అనగా ఎన్నటికిని పాపము చేయకుండుట; యేసుక్రీస్తు నందు విశ్వాసము కలిగియుండుట; దేవుని యొక్క చట్టానికి విధేయత కలిగి జీవించుట; ప్రేమ కలిగి జీవించుట.

    యెహెజ్కేలు 18:30-31 ప్రకారం, పశ్చాత్తాపం అనగా ‘దుష్కార్యములనుండి మరియు పాపకార్యములనుండి వైదొలగుట”. యావేలు 2:12 ప్రకారం, పశ్చాత్తాపము అనగా ‘పూర్ణ హృదయముతో దేవుని చెంతకు మరలుట”. యిర్మియా 8:6 ప్రకారం పశ్చాత్తాపము అనగా “ఆత్మ విచారము చెందుట” (2 కొరిం. 7:10, ‘దేవునిచే వినియోగించబడిన విచారము’).

    బప్తిస్మ యోహాను పశ్చాత్తాపము గురించి బోధించి యున్నాడు: “మీరిక హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుడు” (మ 3:8). ఇదే విషయాన్ని యేసుప్రభువు కూడా “తప్పిపోయిన కుమారుడు” (లూకా 15) మరియు “పరిసయ్యుడు - సుంకరి” (లూకా 18) ఉపమానాలలో బోధించి ఉన్నాడు. సీమోను ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండగా ఒక స్త్రీ, పాపాత్మురాలు పశ్చాత్తాపముతో ఏడ్చుచు తన కన్నీటితో యేసు పాదములు తడిపి, తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనెను (లూకా 7:36-50). ఆ స్త్రీ పశ్చాత్తాప వృదయముతో తన పాపములను కడిగి వేసుకున్నది.

శ్రీసభ బోధన:
పశ్చాత్తాపము ఎంతో అవసరమని శ్రీసభ బోధిస్తుంది. ఎందుకనగా, ఘోరపాపమునుండి ఉపశమనం, విముక్తి, పాప మన్నింపు కొరకు పశ్చాత్తాపం ఎంతో అవసరం. పశ్చాత్తాపము చెందని chor దేవుడు పాపాన్ని మరణించాడు అని కొంతమంది పునీతులు చెప్పియున్నారు (ఉదా,, పునీత తోమాసు అక్వినాస్). యేహేజ్కేలు 18:24, “దుష్కార్యములు చేయువాడు బ్రతకడు. అతని సత్కార్యములు కూడా లెక్కకు రావు. అతని ద్రోహములకు పాపములకు అతడు చచ్చితీరును.” లూకా 13:5, “హృదయ పరివర్తనము చందనిచో, నాశనముగుదురు.” కనుక పశ్చాత్తాపము ఎంతో అవసరం.

పశ్చాత్తాపము - దివ్య సంస్కారం
    ఈ దివ్య సంస్కారాన్ని స్వయముగా క్రీస్తు ప్రభువే స్థాపించి ఉన్నారు. ఈ సంస్కారము ద్వారా, జ్ఞానము పొందిన తరువాత మనము చేసిన పాపములకు శ్రీసభ ద్వారా దేవుడు మనకు పాపక్షమాపణను దయచేస్తున్నాడు; ఒక గురువు ద్వారా పాపవిమోచనను దేవుడు మనకు దయ చేయుచున్నాడు.

    పాప సంకీర్తనము ఒక సాంగ్యము కాదు; ఇది ఒక దివ్య సంస్కారము; దీని ద్వారా మనము చేసిన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొనుచున్నాము. దీనిలో మనము చేసిన పాపములకు పశ్చాత్తాప పడుట ఎంతో ముఖ్యము. దీని ద్వారా ఆత్మకు దైవానుగ్రహము లభించును.

    ఈ రోజుల్లో ఈ పశ్చాత్తాప సంస్కారం గురించి ఎన్నో అపోహలను కలిగి ఉన్నాము. మనం గ్రహించ వలసిన విషయాలు:

    ఈ దివ్య సంస్కారం ఎంత మాత్రము మానవుడు స్థాపించినది కాదు. పాప మన్నింపు కొరకు స్వయముగా క్రీస్తు ప్రభువే ఈ సంస్కారమును స్థాపించి యున్నారు. కనుక, క్రైస్తవులమైన మనకు ఇది పోతివి సంస్కారము మరియు మనకు ఇది ఎంతో అవసరము.

    పాపసంకీర్తనములో మన పాపములను మన్నించునది గురువు కాదు; పాపమును మన్నించు అధికారము కేవలము దేవునికి మాత్రమే ఉన్నది. కనుక శ్రీసభ పరిచర్య ద్వారా, గురువు ద్వారా, దేవుడు పాపవిమోచనమును మనకు దయచేయుచున్నాడు.

    పాపసంకీర్తనములో పాపములను ఒప్పుకొనినంత మాత్రమున, పాప మన్నింపు దొరుకుననునది వాస్తవము కాదు. పాపమన్నింపునకు ప్రధానముగా కావలసినది పశ్చాత్తాపము. చేసిన పాపములకు నిజముగా పశ్చాత్తాప పడవలెను ఇది లేనప్పుడు పాపసంకీర్తనం వృధాయే!

    పాపములు క్షమింపబడుతున్నాయని మరల పాపము చేయవచ్చు అన్నది తప్పుడు భావన. చేసిన పాపము మరల చేయనప్పుడే నిజముగా పశ్చాత్తాప జీవితమును జీవించినట్లు అవుతుంది.

    పాపమును మన్నించు అధికారమును మొట్టమొదటిగా యేసుప్రభువు పేతురు గారికి ఇచ్చి ఉన్నారు (మ 16:19). ఆ తరువాత అందరి శిష్యులకు ఈ అధికారమును ఇచ్చియున్నారు (మ 18:18). మరల ప్రభువు ఘనమైన తర్వాత కూడా తన శిష్యులతో దీని గురించి చెప్పి ఉన్నారు (యో 20:21-23). కనుక శిష్యుల ప్రేషిత కార్యములో, పరిచారములో, సేవలో, బోధనలో, పాపమన్నింపు తప్పక ఉండవలెను. ఎందుకన, ఇది ప్రభువు ఆజ్ఞ. ఈ విధముగా, శ్రీసభలో ఓ దివ్యసంస్కారమై ఉన్నది. కనుక, దీనిని మనము గౌరవించవలెను.

    పాపసంకీర్తనమును స్వస్థత సంస్కారమని, పాపవిమోచన సంస్కారమని, సఖ్యత సంస్కారమని, పరివర్తన సంస్కారమని, పాపోశ్చరణ సంస్కారమని, క్షమా సంస్కారమనికూడా  పిలుస్తారు.

    ఈ దివ్యసంస్కారము వలన దేవునికి విరుద్ధమైన పాపములనుండి క్షమాభిక్ష దేవుని దయవలన మనకు కలుగును మన పాపముతో గాయపరచిన శ్రీసభతో కూడా సఖ్యత పడగలము. ఇది “పరివర్తన సంస్కారం” ఎందుకనగా, పాపము వలన దేవుని విడచి వెళతారు; అయితే ఈ సంస్కారము ద్వారా యేసుప్రభువు పరివర్తనమునకు పిలుస్తున్నాడు; తండ్రి వద్దకు తిరిగి రావటానికి ఇది “పరివర్తన తొలిమెట్టు.” పరివర్తనం, ప్రాయశ్చిత్తం, అపరాధం చెల్లింపులు, దశలవారిగా ఉంటాయి. ఇది “పాపోశ్చరణ” లేదా “పాపముల ఒప్పుకోలు సంస్కారం” ఎందుకనగా, ఈ సంస్కారములు గురువుకు పాపములను చెప్పటం లేదా ఒప్పుకోవటం అతిముఖ్యమైన అంశము. ఇది “క్షమా సంస్కారం” ఎందుకనగా గురువు సంస్కారములు ఇచ్చే పాపక్షమాపణ ద్వారా ‘క్షమను, శాంతిని’ దేవుడు పాపికి అనుగ్రహిస్తాడు. ఇది “సఖ్యత సంస్కారం” ఎందుకనగా దీనిద్వారా దేవునితో సఖ్యపడుతున్నాము మరియు సోదరులతో  సఖ్యపడుతున్నాము.

పశ్చాత్తాప క్రియలు
    చేసిన పాపములకు శిక్షణ ప్రాయశ్చిత్తము అంటారు. పాపసంకీర్తనములో మనము చేసిన పాపములకు గురువు ప్రాయశ్చిత్తమును ఇస్తారు: ప్రార్థనలు చేయమని, మంచి కార్యములు చేయమని, దేవాలయములను సందర్శించమని, సిలువ మార్గము చెప్పమని మొ,,వి.

    పశ్చాత్తాప క్రియలు రెండు రకాలుగా మనము చెప్పుకోవచ్చు: 1. అంతరంగ ప్రాయశ్చిత్తం 2. బాహ్యప్రాయచిత్తం. పరివర్తనకు, ప్రాయశ్చిత్తానికి ప్రభువు పిలుపునిచ్చాడు. అంతరంగ పరివర్తనమే యేసు పిలుపుయొక్క లక్ష్యం. ఇవి లేకుంటే ప్రాయశ్చిత్తం నిష్ఫలం, కృత్రిమం. అయితే బాహ్యమైన ప్రాయశ్చిత్త క్రియలు అంతరంగ పరివర్తనను వ్యక్తం చేయటానికి అవసరం (చదువుము: యోవెలు 2:12-13; యేష 1:16-17; మ 6:1-6;16-17). అంతరంగ ప్రాయశ్చిత్తం అనగా హృదయం పూర్తిగా దేవుని వైపు మరలటం; పరివర్తన చెందడం; దుష్క్రియలనుండి, చెడు నుండి వెనుదిరగడం; పాపానికి అంతం పలకటం; హృదయ పశ్చాత్తాపం చెందడం; నూతన హృదయాన్ని కలిగి ఉండటం. ప్రాయశ్చిత్త క్రియలు: ఉపవాసం, ప్రార్ధన, దాన ధర్మాలు.

ముగింపు: 
    పశ్చాత్తాపము అనగా హృదయ పరివర్తనను, పాపము నుండి దేవుని వైపుకు మరలడం.

27 వ సామాన్య ఆదివారం, Year B

27 వ సామాన్య ఆదివారం, Year B
ఆది. 2:18-24; హెబ్రీ. 2:9-11; మార్కు 10:2-16

నరుడు-నారి-విడాకుల సమస్య

“నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అతనికి తోడుగా స్త్రీని సృష్టింతును” అని దేవుడు అనుకొనెను. అనుకున్న తోడనే దేవుడు మానవుని ఈ విధముగా సృష్టించెను. దేవుడైన యావే భూమిని, ఆకాశమును సృష్టించెను, కాని, నేలమీద పచ్చని చెట్టుచేమలేవియును లేవు. ఏలయన, దేవుడు భూమిమీద వానలు కురిపించలేదు. నేలను సాగుచేయువాడు ఎవడును లేడు. కాని, వానలు లేకపోయినా, భూమినుండి నీరు పెల్లుబికి నేలను తడుపుచుండెను. అప్పుడు, దేవుడైన యావే, నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కురంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. అనగా దేవుడుతన శ్వాసను, జీవమును, జీవితమును, ఆత్మను మానవునిలో నింపెను. అప్పుడు నరుడు జీవముగలవాడయ్యెను.

దేవుడు ప్రేమ. ఆయన ప్రేమ స్వరూపుడు. దేవుడు ఒంటరి వాడు కాదు. ఆయన త్రిత్వైక సర్వేశ్వరుడు. దేవుడు ఒక కుటుంబము. పిత, పుత్ర, పవిత్రాత్మల కుటుంబము. వీరి మధ్య ఎల్లప్పుడూ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను పంచుటకే, దేవుడు మానవుని తన పోలికలో, తన రూపంలో సృష్టించాడు, అనగా దేవుడు నరుని ప్రేమలో మరియు ప్రేమ కొరకు సృష్టించాడు. కనుక నరుని లో ప్రేమించే గుణము, ప్రేమించే శక్తి ఉన్నది. ప్రేమ కోసం ప్రేమ కొరకు సృష్టింపబడినప్పుడు, నరుడు ఒంటరిగా ఉండలేడు.

అంతట దేవుడైన యావే “నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు అతనికి సాటి అయిన తోడును సృష్టింతును” అని పలికెను. కావున దేవుడైన యావే నేలనుండి అన్ని రకముల మృగములను, పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలిసికొనగోరి వాని నన్నిటిని అతని కడకు కొనితెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేరే వాని పేరుగా నిలిచిపోయినది. ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూరమృగములకు నరుడు పేరు పెట్టెను కాని అతనికి తగిన తోడెవ్వరు దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాడ నిద్ర పోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముక నొక దానిని తీసి ఆ చోటును మరలా మాంసముతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడుకొని వచ్చెను. అప్పుడు నరుడు “చివరకు ఈమె నా వంటి దైనది. ఈమె నరుని నుండి రూపొందినది కావున నారి యగును” అనెను. దేవుడు స్త్రీని పురుషుని యొక్క దేహము నుండి సృష్టించాడు. దీని మూలముగా వారిరువురూ సమానము అని, దేవుని సృష్టి అని, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని, మనం అర్థం చేసుకోవాలి.

కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొనిపోవును. ఇదియే ప్రేమయొక్క స్వభావము. వారిరువురు ఏక శరీరులగుదురు. నరుడు నారిలను, దేవుడు వేరువేరుగా సృష్టించినప్పటికీ వారు శరీరంలోనూ, ఆత్మ లోను ఒకటిగా జీవించెదరు; ఈ విధముగా, దేవుడు మానవాళి పై ఉన్న తన ప్రేమను చాటుకున్నారు. త్రిత్వైక దేవుని లో కూడా ఇదే చూస్తున్నాము: వారు ముగ్గురు వ్యక్తులు అయినప్పటికిని, వారు ఏకమై ఒకే సర్వేశ్వరుడుగా ఉన్నారు.

కనుక ఈ మానవ ప్రేమలో, వివాహ బంధములో విడాకులు లేదా పరిత్యజింపు ఉండకూడదని దేవుని సంకల్పం. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ కలకాలం ఉండాలనేది దేవుని ప్రణాళిక, చిత్తం. ఈ లోక సృష్టిలోనే ప్రేమను మానవునిలో నింపియున్నాడు. నరుడు నారీలను ఐక్యము చేసేది దేవుడే. వారిరువురు కూడా సమానులే.

పరిసయ్యులు యేసు ప్రభువును విడాకుల గురించి అడిగినప్పుడు మరియు మోషే చట్టమును ప్రస్తావించినప్పుడు, “మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే విడాకులను అనుమతించెను” అని చెప్పెను. హృదయ కాఠిన్యము వలన మనము దేవుని యొక్క ప్రేమను, మానవాళిలో దేవుడు ఉంచిన ప్రేమను, ఇతరులలో ఉన్న ప్రేమను, తృణీకరిస్తూ ఉన్నాము. కనుక ప్రభువు సృష్టిలో తండ్రి దేవుడు నరునిలో ఉంచిన ప్రేమను గుర్తుచేస్తున్నాడు. తండ్రి దేవుని యొక్క ప్రణాళికను చిత్తమును గుర్తు చేయుచున్నాడు. ఈ ప్రేమ అనంతమైనది, శాశ్వతమైనది. కనుక, “దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరరాదు.”

వివాహ బంధములో స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రేమ ఇతర ప్రేమలకు ఆదర్శవంతంగా ఉన్నది. ఎందుకన, ఈ ప్రేమ త్రిత్వైక దేవునిలో ఉన్న ప్రేమ నుండి ఉద్భవించినది. నిజమైన ప్రేమ స్వార్ధం లేనిది; ఒక వ్యక్తి తనకు తాను పూర్తిగా ఇచ్చుకొనును. ఇలాంటి ప్రేమలోనే దేవుని పోలికను, దేవుని రూపమును చూడగలము. ఇలాంటి పవిత్రమైన ప్రేమ వివాహ బంధం, కుటుంబంలోనూ ఉంటుంది. ఈ ప్రేమే సమాజంలో వ్యక్త పరచ బడుతుంది. కనుక భార్యాభర్తలు, కుటుంబము కలకాలం కలిసి ఉండాలి.

కష్ట కాల సమయములో, అపార్ధ సమయంలో, వ్యాధి బాధలలో, పిల్లలులేమి సమయంలో, మొదలగు సమయంలో ఒకరినొకరు పరిత్యజింపక, వివాహ వాగ్దానములను గుర్తుచేసుకుంటూ, దేవుని పై ఆధార పడుతూ, ప్రార్థనలు దేవునిపై భారం వేస్తూ, సమస్యలకు పరిష్కారం కనుగొని ఐక్యంగా కలకాలము జీవించుట మనము అలవర్చుకొనవలెను. ప్రభువు అంటున్నారు: “తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడు వాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ, వ్యభిచరించుచున్నది.”

భార్యాభర్తలిరువురు తమ జీవితంలో చివరి వరకు తోడుగా నీడగా ఉండవలసి వస్తుంది. కనుక ఒకరినొకరు ప్రేమించాలి, గౌరవించాలి. అమ్మ మనకు జన్మనిస్తుంది, భార్య ఆ జన్మకు అర్థం ఇస్తుంది. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు. కనుక అమ్మ భారం కాకూడదు, భార్య బానిస కాకూడదు. అర్థం చేసుకొని మసలుకోవడంలోనే అనంతమైన ఆనందం ఉందని గుర్తిస్తే, జీవితం సంతోషమయం అవుతుంది. ఒకే వ్యక్తితో ప్రతిరోజు ప్రేమలో పడటం వివాహము.