పాస్క పరమ రహస్యము – పాప పరిహారార్ధ బలి

పాస్క పరమ రహస్యము – పాప పరిహారార్ధ బలి

    క్రీస్తు పాస్కా బలి పాప పరిహారార్ధ బలి (హెబ్రీ 10:18). ఇది పాప క్షమాపణ బలి. క్రీస్తు పాస్కా బలి ఫలితం ‘పాప క్షమాపణ’. మన రక్షణ నిమిత్తమై ‘పాప క్షమాపణ’ ఎంతో ముఖ్యమైనది మరియు చాలా అవసరం. “పాప క్షమాపణ మూలమున రక్షణ కలుగుతుంది” (లూకా 1:77). మొట్ట మొదటిగా, పాప క్షమాపణ దేవుని వరం; దేవుని నుండి వస్తుంది. దేవుడు మాత్రమే పాపాన్ని క్షమించగలడు. ఉదా,, యేసు ప్రభువు దేవుని కుమారునిగా, ఎంతోమంది పాపాలను క్షమించాడు. పాపాన్ని క్షమించి స్వస్థతను చేకూర్చాడు. ఈ విధముగా ఆధ్యాత్మిక స్వస్థతయే ‘పాప క్షమాపణ’.

    యేసు ఈ లోకానికి అనగా సర్వమానవాళికి, జీవితమును దానిని సమృద్ధిగా ఇవ్వడానికి; నిత్యజీవమును, దేవుని రాజ్యమును, రక్షణను ఒసగడానికి వచ్చియున్నాడు. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను” (యోహా 3:16) మరియు దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెను (యోహా 3:17). ఈ రక్షణ పాప క్షమాపణ ద్వారా ఇవ్వబడుతుంది.

    క్రైస్తవ జీవితము ‘సంతోషము’ మరియు ‘విజయము’తో కూడినటువంటి జీవితము. నిజమైన క్రైస్తవుడు ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటాడు. ఎందుకనగా, క్రీస్తు పాస్కా బలిద్వారా, పాప క్షమాపణను ఒసగియున్నాడు. అయితే, ఈ సంతోషాన్ని, విజయాన్ని, మన అనుదిన జీవితములో సమృద్ధిగా పొందాలంటే, దైవ ప్రేమను, దేవుని క్షమను మనం పొందియుండాలి. అప్పుడే మన జీవితం మారుతుంది.

    ఈనాటి ప్రపంచం చింతన, విచారం, ఆత్రుత, భయం, భీతి, బెదరు, ఆందోళన, ప్రాణభీతి, ఆపద, ఆపత్కాలం, జబ్బులు, నేరాలు, అవినీతి, చట్టవిరుద్ధమైన పనులు, మాదకద్రవ్యాలు, తాగుబోతుతనము, అశ్లీలత, అబార్షన్లు, విడిపోయిన కుటుంబాలు, విడాకులు మొ,,గు వాటితో నిండియున్నది. ఈ ప్రపంచం క్రీస్తును కలుసుకోవాలి. అప్పుడే నిజమైన జీవితాన్ని ఈ లోకం పొందగలదు. అదియే క్రీస్తుతో కూడిన జీవితము. క్రీస్తు ఒసగే ఈ జీవితం, ‘దేవునికి అంగీకార యోగ్యలముగా’ ఉండే జీవితము. ఇది కేవలం క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం.

    ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న ఈ లోకం దేవుని ప్రేమను, దేవుని క్షమాపణను పొందాలంటే ఎలా? “క్రీస్తు మరణం” క్షమాపణకు మూలం. క్రీస్తు తన పరిశుద్ధ రక్తాన్ని వెలగా పెట్టి, మన పాపములకు క్షమాపణను కల్పించాడు. “క్రీస్తు శరీర బలి అర్పణచేత (మరణము) మనమందరమును, పాపమునుండి, శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి” (హెబ్రీ 10:10). “పాపమునుండి శుద్ది పొందిన వారిని, తన ఒకే ఒక బలిద్వారా శాశ్వతముగా పరిపూర్ణులను చేసియున్నాడు” (హెబ్రీ 10:14). క్రీస్తు అర్పించిన ఈ సిలువ బలి పాప పరిహారార్ధ బలి. కనుక, దేవుని క్షమాపణను మనం పొందాలంటే, మన పాపములను ఒప్పుకోవాలి. పాప సంకీర్తనము చేయాలి. “దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో, ఆయన మన పాపములను క్షమించి, మన అవినీతినుండి మనలను శుద్ది చేయును” (1 యో 1:9).

    ‘ఒప్పుకోవడం’ అనగా దేవునితో మన పాపములను ఒప్పుకోవడం. ఇచ్చట మూడు విషయాలు ఉన్నాయి:
(అ) మన పాపములు దేవున్ని దు:ఖపెట్టునని, నొప్పించునని మనం గ్రహించాలి;
(ఆ) దేవుడు ఇప్పటికే మన పాపములను, తన కుమారుడు క్రీస్తు మరణము ద్వారా, ఆయన రక్తమును చిందించడము ద్వారా, క్షమించాడని మనం తెలుసుకోవాలి;
(ఇ) మనలో మారుమనస్సు/మార్పు రావాలి: అనగా ‘దేవుని చిత్తాన్ని నెరవేర్చడం’.
కాబట్టి పాపములను ఒప్పుకొనుట ద్వారా, దేవుని క్షమాపణను పొందగలము. దేవుని క్షమాపణను పొందలేని వారు ఎప్పుడు బాధలలో, వేదనలలో ఉంటారు; వారి హృదయము గాయపడి ఉంటుంది. దేవుని క్షమాపణను పొందని వారు, ఎప్పుడు నిరుత్సాహముతో ఉంటారు; కలవరపడుతూ ఉంటారు; భయముతో ఉంటారు; అసహనముతో ఉంటారు; కోపము, ద్వేషము, అసూయతో ఉంటారు.

    పాప క్షమాపణ స్వతంత్రాన్ని ఇస్తుంది. ఇదియే నిజమైన పాస్క. పాప క్షమాపణ, “ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత మరియు నిగ్రహము” (గలతీ 5:22-23) అను ఆత్మ ఫలాలను ఒసగుతుంది:

    మనం క్షమాపణను పొందాలంటే, మనం ఇతరులను క్షమించాలి. క్షమించినప్పుడే క్షమను పొందుతాము. “పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు” (లూకా 6:38). “మా పాపములను క్షమింపుము. ఏలయన, మేమును, మా ఋణస్తులందరును క్షమించుచున్నాము” (లూకా 11:4). తోటివానిని క్షమించని సేవకుడు (మ 21:23-35) మనందరికి గుణపాటం. “ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపని యెడల పరలోకమందలి నా తండ్రియు మీ యెడల అట్లే ప్రవర్తించును” (మ 21:35) అని ప్రభువు చెబుతున్నారు.

    అయితే, మన తోటివారిని మనం ఎన్నిసార్లు క్షమించాలి? (మ 18:21-22). “ఏడు కాదు ఏడు డెబ్బది పర్యాయములు” (మ 18:22) అని ప్రభువు చెప్పియున్నారు. అనగా లెక్కకు లేనన్ని సార్లు. పాప క్షమాపణ దేవుని వరం; దేవుడు మనలను క్షమించడానికి ఎప్పుడూ సిద్దముగా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుని తండ్రివలె, ప్రేమతో, దయతో మనకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే మనం చేయవలసినదెల్ల – పాపమును ఒప్పుకోవడం, పశ్చాత్తాపము-మారుమనస్సు పొందడం.

    యేసు సిలువపైనుండి, గొప్పనేరము చేసిన వానితో, “నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు” అని చెప్పాడు (లూకా 23:43). ఎందుకు? ఎందుకనగా, “యేసూ నీవు నీరాజ్యములో ప్రవేశించునప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుడు” (23:24) అని ఆ నేరస్తుడు ప్రభువును విన్నవించుకొన్నాడు. ఆ విన్నపాన్ని ఎలా చేయగలిగాడు? తన తోటి నేరస్తునితో “మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది” (23:40) అని చెబుతూ తన పాపాన్ని, పాప జీవితాన్ని ఒప్పుకున్నాడు. పశ్చాత్తాపపడ్డాడు, మారుమనస్సు చెందాడు కనుక.

పాస్క పరమ రహస్యము – విశ్వాసము


పాస్క పరమ రహస్యము – విశ్వాసము


    విశ్వాసము అనగా “మనము నిరీక్షించు విషయముల యందు నిస్సందేహముగ ఉండుట; మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట” (హెబ్రీ 11:1). పునీత పౌలుగారు మన విశ్వాసము గూర్చి జ్ఞప్తికి చేస్తున్నారు. మన విశ్వాసమునకు మూలాధారమగు సువార్తను గురించి జ్ఞాపకము చేయుచున్నారు: “మీరు ఉద్దేశరహితముగ విశ్వసించి ఉండిననే తప్ప, నేను మీకు బోధించిన విధముగ మీరు దానికి గట్టిగ అంటిపెట్టుకొని ఉంటిరేని మీరు రక్షింపబడుదురు.” మరి ఇంతకి మనం విశ్వసింప వలసిన మరియు పౌలుగారు బోధించిన ఆ పాస్క పరమ రహస్యము ఏమిటి? “పరిశుద్ధ గ్రంధమున వ్రాయబడినట్లు, క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పరిశుద్ధ గ్రంధము, వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి, మూడవ దినమున సజీవుడుగా లేవనెత్తబడెను” (1 కొరి 15:3-4). ఇదే విషయాన్ని పౌలుగారు రోమీయులకు వ్రాసిన లేఖ 4:25 లో ఈ విధముగా చెప్పియున్నారు: “మన పాపమునకుగాను ఆయన మరణమునకు అప్పగించబడెను. మనలను దేవునికి అంగీకారయోగ్యులముగా ఒనర్చుటకుగాను (for our justification) ఆయన లేవనెత్తబడెను.”

    “అంగీకారయోగ్యులముగా ఒనర్చుట” ఎలా జరుగుతుంది? పౌలుగారు చెప్పిన విధముగా, పాస్క పరమ రహస్యమును గట్టిగ విశ్వసించుట వలన. అనగా, క్రీస్తు మన పాపముల కొరకు మరణించాడని, మన రక్షణ నిమిత్తమై మరల సజీవముగ లేవనెత్తబడ్డాడని విశ్వసించాలి. యాకోబు ప్రకారం, కేవలము విశ్వాసము వలనగాక, మన చేతల/క్రియల ద్వారా జరుగుతుందని చెబుతున్నారు: “నాకు విశ్వాసము ఉన్నది” అని చెప్పుకొనినచో, తన చేతలు దానిని నిరూపింపకున్న యెడల దాని వలన ప్రయోజనమేమి? ఆ విశ్వాసము అతనిని రక్షింపగలదా?; క్రియలులేని విశ్వాసము నిర్జీవమే; చేతలు లేని విశ్వాసము నిష్పలమైనది; విశ్వాసము చేతలద్వారా పరిపూర్ణత పొందును; కేవలము విశ్వాసము వలన మాత్రమేకాక, చేతలవలన మానవుడు నీతిమంతుడుగా ఎంచబడును; ఆత్మలేని శరీరము నిర్జీవమైనట్లే, చేతలులేని విశ్వాసమును నిర్జీవమే” (యాకో 2:14-26):

    అయితే, విశ్వాసము, క్రియలు రెండు వేరువేరు కావు; అవి వ్యతిరేఖము కావు. పౌలుగారు “ధర్మ శాస్త్రములను” పాటించు విషయములను గూర్చి చెప్పినప్పుడు, వాటిని గుడ్డిగా పాటించడంకన్న, విశ్వాసం ముఖ్యమని చెప్పియున్నాడు. అంతేగాని, పౌలుగారు క్రియలను త్రోసివేయడము లేదు. “విశ్వాసము-క్రియలు” ఒకే నాణేనికి రెండు వైపులు. రెండింటిని వేరు చేయలేము. మన విశ్వాసము మన చేతలలో కనిపిస్తుంది; అలాగే, మన క్రియలు మన విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. అందుకే పౌలుగారు గలతీయులకు వ్రాసిన లేఖలో ఇలా అంటున్నారు: “క్రీస్తుతో ఐఖ్యమై ఉన్నప్పుడు, సున్నతి ఉన్నను లేకున్నను ఎట్టి భేదమును లేదు. కాని ప్రేమ ద్వారా పని చేయు విశ్వాసమే ముఖ్యము” (గలతీ 5:6) ధర్మశాస్త్రాన్ని ప్రేమతో పాటించాలి. అంతేగాని ఇతరుల మెప్పుకోసం కాదు, ప్రశంసల కొరకు కాదు.

    క్రీస్తుపై ఉన్న మన విశ్వాసము, మన అనుదిన జీవితములో ప్రదర్శింపబడాలి. ఇవియే పాస్క పరమ రహస్యమును విశ్వసించి ఫలవంతముగా జీవించాలంటే, మన అనుదిన జీవితములో, మొదటిగా, దేవుని ఆజ్ఞలను పాటించాలి: దైవ ప్రేమ మరియు సోదర ప్రేమ. వీటిని ప్రేమతో పాటించాలి. రెండవదిగా పశ్చాత్తాపము-మారుమనస్సు. క్రీస్తు పాస్క బలి మనకు వరముగా, అనుగ్రహముగా అందించిన స్వేచ్చలో జీవించాలంటే మనలో నిత్యము మన పాపాలకు పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాప ఫలితమే మారుమనస్సు: మార్పు – మన ప్రవర్తనలో, ఆలోచనలో మరియు చేతలలో.... “స్వతంత్రులుగ జీవించుటకై క్రీస్తు మనకు విముక్తిని (పాపమునుండి) కలిగించెను. కనుక దృఢముగ నిలబడుడు; బానిసత్వము (పాపము) అను కాడిని మరల మీపై పడనీయకుడు” (గలతీ 5:1).

    విశ్వాసము వలన మనము పాపాత్ములమని తెలుసుకొంటాము. ఉదా,, ప్రభువు పేతురుగారిని (జాలరులను) తన శిష్యునిగా పిలచినప్పుడు, పేతురుగారు ప్రభువు మాటను విశ్వసించిన తర్వాత (లూక 5:5-6), యేసు పాదములపై పడి, “ప్రభూ! నేను పాపాత్ముడను, నన్ను విడచి పొండు (లూక 5:8) అని చెబుతూ తన పాప జీవితమును తెలిసికొన్నాడు, తను పాపాత్ముడనని ఒప్పుకొన్నాడు. ఇదియే పశ్చాత్తాపపడటం, మారుమనస్సు పొందడం: మన అయోగ్యతను ప్రభువు సన్నిధిలో గుర్తించి, పాపాత్ములని గ్రహించి, ఒప్పుకోవడం నిజమైన పశ్చాత్తాపము మరియు మారుమనస్సుకు పునాది.

పాస్క పరమ రహస్యాన్ని నీవు విశ్వసిస్తున్నావా?
    హెబ్రీయులకు వ్రాసిన లేఖలో చదువుచున్నాము: దేవుని కుమారుడు మనవలె రక్తమాంసములను పొంది, “మృత్యువుపై అధికారముగల సైతానును తన మరణము ద్వారా నశింప చేయుటకును, తద్వారా, మృత్యువు భయముచేత తమ జీవితమంత బానిసత్వమును గడపిన వారికి విముక్తిని ప్రసాదించుటకును, ఆయన అట్లయ్యెను” (2:14-15). మనము ఆయనతో జీవించుటకు అట్లు చేసెను. “మనము ఆయనతో మరణించి ఉండినచో ఆయనతోనే మరల జీవింతుము” (2 తిమో 2:11). సువార్త కొరకై, శ్రమలు మరియు మరణము క్రీస్తు ఉత్థానము ద్వారా, క్రొత్త జీవితానికి మార్గమును సుగమము చేయును. కనుక, క్రీస్తు శ్రమలలో మనం ఐక్యమయినచో, ఆయన మహిమలో మనం పాలుపంచుకొనెదము.

    యేసు మార్తమ్మను ఇలా ప్రశ్నించాడు: నీవు దీనిని విశ్వసిస్తున్నావా? అప్పుడు ఆమె “ప్రభువు మీరు ఇచట ఉండియున్నచో నా సహోదరుడు మరణించి ఉండేడివాడు కాడు. యేసు బదులుగా, “నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణింపడు.” నీవు దీనిని విశ్వసిస్తున్నావా? (యోహా 11:21-26). క్రైస్తవ జీవితము అనగా ఇదియే: మరణమునకును, జీవమునకును క్రీస్తులో ఐక్యమవడము. మనం ఒకేసారి మరణించి దేవుని తీర్పు పొందవలెను (హెబ్రీ 9:27). మనము ప్రభువు కొరకు జీవిస్తున్నట్లయితే, మరణం మరియు జీవితము ప్రభువుతో ఉండటానికి కేవలము అవి రెండు మార్గాలుగా మాత్రమే ఉంటాయి. పౌలుగారు చాల చక్కగా చెప్పియున్నారు: “మనలో ఎవ్వడును తనకొరకే మరణింపడు. మనము జీవించినను ప్రభువు కొరకే జీవించుచున్నాము. మరణించినను ప్రభువు కొరకే మరణించుచున్నాము. కనుక, జీవించినను, మరణించినను మనము ప్రభువునకు చెందిన వారమే.” (రోమీ 14:7-8).

మరణం మనకి ఏమి నేర్పుతున్నది?
    క్రీస్తు మరణముపై విజయము క్రీస్తు సువార్తప్రచారములో (kerygma) భాగము. మనం నిత్యము మరణము గురించి ధ్యానము చేయాలి. ఎందుకంటే, మరణమును గురించిన ఆలోచనలో మనలోని భయాన్ని తొలగించి, శాంతతను చేకూర్చును. మరణం మనలోని భ్రమలను, వ్యర్ధమైన పరవశములను మరియు శూన్యమైన పరవశతలను తొలగించును. మరణము సంపూర్ణమైన సత్యములోనికి మనలను నడిపించును. మరణము తర్వాత జీవితమును గమనిస్తూ ప్రస్తుత జీవితమును చూసినట్లయితే, మంచి జీవితము జీవించడానికి మనకు గొప్పగా సహాయము చేయును. భాదలతో, సమస్యలతో సతమతమగు చున్నావా? నీ మరణశయ్యపై నుండి వాటిని చూడు. నీవు ఎలా ప్రవర్తిస్తావో అలోచించు. మరణముపై ధ్యానము ‘ఈ భూమిపై మనకి స్థిరమగు నగరము ఏదియు లేదని, ఇక ముందు రాగల నగరము గూర్చి ఎదురుచూచునట్లు’ చేయును (హెబ్రీ 13:14). “చనిపోయినప్పుడు సొత్తును తన వెంట కొనిపోజాలడు. అతని సంపద అతని వెంట పోదు” (కీర్తన 49:17).

    మరణము జాగరూకులై ఉండునట్లు చేయును, సంసిద్దులుగా ఉండునట్లు చేయును. “కనుక మెలకువతో ఉండుడు. ఏలయన, ఆ రోజును, ఆ గడియను మీరెరుగరు” (మ 25:13). దావీదు మహారాజు ఇలా అన్నాడు: ప్రభువు నివసించును...కాని నాకును, చావునకును ఒక్క అడుగు ఎడమ మాత్రము ఉన్నది (1 సమూ 20:3). ఇది చాలా వాస్తవము. మనము మరణమునకు కేవలము ఒక్క అడుగు దూరములోనే ఉన్నాము. మరణం మన చుట్టూనే ఉన్నది. ప్రతీ నిమిషం ఎన్నో వేలమంది చనిపోవుచున్నారు. వారిలో ఎంతమంది మరణము గూర్చి ఆలోచించియున్నారు. కనుక మరణము, మనకి అనేక విషయములను నేర్పును. ఆమె మన సహోదరీ! విధేయతతో ఆలకించినచో ఎన్నో విషయాలను మనకు నేర్పును.

    మనము ఎల్లప్పుడూ దేవునకు ప్రార్ధన చేయవలసినది: ప్రభువా! మరణముతో హటాత్తుగా నన్ను చవిచూడకుము. కాని పశ్చాత్తాపపడుటకు, మారుమనస్సు పొందుటకు తగిన సమయమును ఇవ్వండి: ఓ తపస్కాలం, ఒక రోజు, ఒక గంట, ఓ మంచి పాపసంకీర్తనం! పునీత సిల్వెస్టర్ గోజ్జోలిని ఒకసారి తన బంధువు శవమును చూస్తున్నప్పుడు ఒక స్వరమును విన్నాడు: ‘ఇప్పుడు నీవేమిటో నేను ఒకప్పుడు; ఇప్పుడు నేను ఏమిటో నీవు ఉంటావు’. మనం మరణించవలసినదనే విషయాన్ని గుర్తు పెట్టుకుందాము. “నీవు మట్టినుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కలిసిపోవుదవు” (ఆ.కాం. 3:19). మరణం మనకు అనేక విధములుగా పాఠాలను నేర్పిస్తూ ఉంటుంది... ప్రకృతి ద్వారా, ఉదాహరణకు రాలిపోయే ఆకుల ద్వారా... మరణాన్ని ఎవరుకూడా మౌనముగా ఉంచలేరు. మనం వినడం తప్ప మరో మార్గము లేదు. అలాగే, మరణం గురించి భయపడనవసరం లేదు. ఎందుకన, క్రీస్తు ఈ లోకానికి వచ్చినది మరణభయపు చేరలోనున్న వారిని విడుదల చేయుటకు కదా!

    “మరణపు ముల్లు పాపము” (1కొరి 15:56). పాపము వలన మరణము సంభవించును; పాపము వలన మరణ భీతి కలుగును. ప్రభువు ఇలా అంటున్నారు: “శరీరము నాశనము చేయువారికి భయపడకుడు. మిమ్ములను చంపి, నరకకూపమున పడవేయగల వానికి భయపడుడు” (లూకా 12:4-5). ఎప్పుడైతే పాపాన్ని తీసి వేస్తామో, అప్పుడు మరణపు ముల్లును తీసి వేయగలము.

పాస్క పరమ రహస్యం

పాస్క పరమ రహస్యం

    'పాస్క' అనగా ఏమి? 'పాస్క పండుగ' రోజున మనం ఏమి కొనియాడుచున్నాము? 'పాస్క జాగరణ' ఎందుకు? పాస్క పరమ రహస్య ఆచారమేమి? (నిర్గమ 12:26). ఈ ప్రశ్నల ద్వారా పాస్క పరమ రహస్యాన్ని లోతుగా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.

    పాస్క ఓ "జ్ఞాపకార్ధం." పూర్వ నిబంధన ప్రకారం: (అ) "ఇది ప్రభువు పాస్క బలి (నిర్గమ 12:27). పాస్క యనగా "దాటి పోవుట". "మీ బిడ్డలు 'ఈ ఆచారమేమి?' అని మిమ్ము అడిగినప్పుడు, మీరు వారితో 'ఇది పాస్క బలి. ఆయన ఐగుప్తు దేశములోని యిశ్రాయేలీయుల ఇండ్ల మీదుగా దాటి పోయెను. ఐగుప్తు దేశము నెల్ల నాశనము చేసెను. కాని, మన యిశ్రాయేలీయుల యిండ్లను వదిలివేసెను'" (నిర్గమ 12:26-27). కాబట్టి, పాస్క (దాటి పోవడం) దేవుని రక్షణ. ఎందుకన, ప్రభువు 'దాటి పోయెను'. అనగా, ఇశ్రాయేలు ప్రజలను వినాశనము నుండి రక్షించెను.

    (ఆ) 'పాస్క' ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశమునుండి వచ్చుటను సూచిస్తుంది (ద్వితీయ 16 మరియు నిర్గమ 13-15). అనగా బానిసత్వమునుండి, స్వతంత్రమునకు వచ్చుట. ఈ విధముగా పాస్క, సీనాయి నిబంధనమునకు సిద్ధపరచుచున్నది. ఈ పాస్క, ఇశ్రాయేలు ప్రజలకు మతపరమైన స్వతంత్రమును ఒసగియున్నది. ఇశ్రాయేలు దేశము "దేవున్ని ఆరాధించుటకు" స్వతంత్రము గావించబడియున్నది (నిర్గమ 4:23; 5:1).

    యేసు కాలమున పాస్క ఉత్సవమును ప్రధానముగా "ప్రభువు దాటిపోవుట" ను కొనియాడెడివారు. ఈ పండుగను అనేక ఆచార క్రియలను బట్టి (Rituals) మరియు బలులను బట్టి (Sacrifices) కొనియాడెడివారు. డయాస్పోర యూదులు (Diaspora Jews), యిశ్రాయేలీయులు 'ఎర్ర సముద్రమును దాటిపోవడమును' పాస్కగా కొనియాడెడివారు.

    ఏది ఏమయినప్పటికిని, నిజమైన పాస్క ప్రతీవ్యక్తి, వ్యక్తిగతముగా బానిసత్వమునుండి, స్వతంత్రమునకు నడిపింపబడుట. పాస్క ఓ "జ్ఞాపకార్ధము", మరియు "కృతజ్ఞతాస్తోత్రము". ఇది ఐగుప్తు బానిసత్వమునుండి నిర్గమము. పాస్క 'ఆత్మప్రక్షాళనమును' (Purification of Soul) సూచిస్తుంది. పాస్క పాపమునుండి పుణ్యమునకు దాటిపోవడము. ఇలాంటప్పుడు, ఆచార క్రియలు, బలులను బట్టిగాక, దేవుని విశ్వాసములో జీవిస్తూ, మంచి కొరకై, సత్ప్రవర్తనకలిగి జీవింపవలయును. ఒక్క మాటలో చెప్పాలంటే, మన ఆధ్యాత్మిక జీవితములో 'ఎదుగుదల'యే పాస్క.
నూతన పాస్క:

    ఇది క్రీస్తుబలి మరియు జ్ఞాపకార్ధము. అలాగే, క్రీస్తురాకకై కొనియాడు పాస్క పరమ రహస్యము (Eschatological). ఆత్మలోను, సత్యములోను ఈ పాస్క పరమ రహస్యము కొనియాడబడుచున్నది. నిజమైన పాస్కగూర్చి పౌలుగారు యిలా చెప్పుచున్నారు: "ద్వేషము, దౌష్టము అను పాత పిండితో చేసిన రొట్టెతో కాక, నిజాయితీ, సత్యము అనువానితో కూడిన పులియని పిండితో చేసిన రొట్టెతో మనము పండుగ చేసికొందుము" (1 కొరి 5:8).

    క్రొత్త నిబంధనలో పాస్క పరమ రహస్యమునకు ఓ క్రొత్త అర్ధము చేకూరియున్నది. యూదుల పాస్క పండుగ దినమున క్రీస్తు యేరూషలేములో మరణించెను (మరల ఉత్తానమయ్యెను). ఆయన మరణము మరియు యేరూషలేము దేవాలయములోని పాస్క గొర్రెపిల్ల బలి, ఏక కాలములో జరిగెను (యోహాను). ఇది మాత్రమే గాక, క్రీస్తు అర్పణ బలి, పాత పాస్క బలిని పరిపూర్ణము చేసియున్నది.

    ఈ విధముగా, శ్రీసభ పాస్క ఉత్సవమును ఇశ్రాయేలు ప్రజలనుండి పొందియున్నది. అయితే, ఈ పాస్కకు చేకూర్చిన నూతన అర్ధము, పరమార్ధము ఏమిటి?

    (అ) క్రీస్తుబలి జ్ఞాపకార్ధము. "నా జ్ఞాపకార్ధము చేయుడు" (లూక 22:19: 1 కొరి 11:24) అని క్రీస్తు ఆజ్ఞాపించియున్నాడు. క్రీస్తు ఉత్థానం (Easter) మన "రక్షణ చరిత్రను" కొనియాడుచున్నది. 'క్రీస్తు మరణం' ఈ పాస్క మహోత్సవములో ప్రధానమైన భాగము. క్రీస్తు మరణము ద్వారా "మృత్యువు నాశనము చేయబడినది; విజయము సంపూర్ణమైనది" (1 కొరి 15:54). ఇదియే క్రీస్తు పాస్క.

    (ఆ) అలాగే, నిజమైన పాస్క రాబోవుకాలములో, పరలోకమున జరుగబోవు పాస్కను కూడా సూచిస్తున్నది. మనం ఎప్పుడయితే ఈ లోకాన్ని జయించి, మరణాన్ని దాటి, పరలోకములో చేరుకుంటామో, మన పాస్కా పరిపూర్ణమగును.

పాస్క – శ్రమలు:
    

    నిజమైన పాస్క క్రీస్తు శ్రమలు మరియు మొక్షారోహణము. ఎమ్మావుసు మార్గములో యేసు శిష్యులతో “క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కాదా?” అనెను (లూక 24:26). పౌలు గారు, “మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింప వలయును” అని భోదించిరి (అ.కా. 14:22). ఈ పాస్క ఓ నూతన మరియు శాశ్వత నిబంధనమును ఏర్పాటు చేసియున్నది.

    తన పాస్కాద్వారా, క్రీస్తు మనందరికీ ఓ నూతన ఆశను, ఆశయమును, జీవమును, జీవితమును కల్పించాడు. “మన పాపమునకునుగాను ఆయన మరణమునకు అప్పగించబడెను” (రోమీ 4:25). మనలను మరణమునుండి జీవమునకు నడిపించియున్నాడు. ఈ పాస్కాద్వారా, క్రీస్తు సర్వమానవాళిని తండ్రి చెంతకు దాటించియున్నాడు. “మన జీవితము క్రీస్తుతో దేవునియందు గుప్తమైయున్నది” (కొల 3:3). ఆలాగే, క్రీస్తు పాస్కానందు క్రీస్తు శరీరమునైన శ్రీసభ ఆవిర్భవించినది.

    జ్ఞానస్నాన దివ్యసంస్కారము ద్వారా, విశ్వాసములో, మనం ఇప్పటికే క్రీస్తుతోపాటు ‘దాటియున్నాము’. కాని, మన అనుదిన జీవితములోకూడా క్రీస్తును అనుసరిస్తూ ఇది కొనసాగాలి. దేవుణ్ణి ప్రేమిస్తూ, తోటివారిని ప్రేమిస్తూ ఉన్నప్పుడే ఇది సుసాధ్యమవుతుంది. అప్పుడే మరణమును జయించి, నిత్య జీవములోనికి ప్రవేశిస్తాము. ఈ లోకమును దాటి, పరలోకమున ప్రవేశించగలము. పాపము అనే శత్రువును దాటి, తండ్రి ఒడిలోనికి చేరుకోగలము. ఇదియే నిజమైన పాస్కా పరమ రహస్యము.

    దయగల ప్రభువు, క్రీస్తు రక్షణ పవిత్ర కార్యములద్వారా, ఈ ‘పాస్క’ను విజయవంతముగా పరిపూర్తి చేయుటకు మరియు అంతిమమున, దేవునితో ముఖాముఖిగా (దైవ సాన్నిధ్యము) చూచు భాగ్యమును ఒసగునుగాక!

యేసు శోధన పరమార్ధం:

యేసు శోధన పరమార్ధం
"యేసు ఆత్మప్రేరణ వలన ఎడారి ప్రయాణమునకు కొనిపోబడి సైతానుచే శోధింప బడెను"

    ఈ లోకములో మనషి సంతోషం, వ్యామోహాల లేమిలో కాదు, కాని వాటిని జయించడములో ఉంది. తపస్కాలం దేవుడిచ్చిన ప్రత్యేక కాలం. యేసు ప్రభువు చేసిన ఉపవాసం, ప్రార్ధనలో పాలుపంచుకొని పరివర్తన పొందడానికి, తపస్కాలం ఒక మంచి అవకాశం.

    నేటి సువిషేశములో యేసు ప్రభువు ఎడారిలో ఎదుర్కొన్న మూడు శోధనల గురించి చెప్పబడింది. ఆత్మ ప్రేరణ వలన ఎడారికి నడిపింపబడి, నలుబది దినములు గడిపినపుడు సైతానుచే శోధింపబడెను. సైతాను యేసు ప్రభువును శోధించినది. ఎందుకంటే, యేసు దేవునికి ప్రియమైన కుమారుడు, లోక రక్షకుడు. ప్రపంచముపై ఆధిపత్యం చెలాయించాలన్న కోరికతో సైతాను యేసు ప్రభువును శోధించడానికి వెదకని మార్గం లేదు. అయితే, మనం గమనించ వలసిన ముఖ్య విషయం, యేసు సాతాను శోధనలను త్రోసిపుచ్చిన తీరు. "సైతాను, నానుండి దూరముగా పొమ్ము!" అని గద్దించాడు. ఈ భావాన్ని యేసు పేతురుపట్ల చూపించాడు. "ఛీ, పో! సైతాను! నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని, దేవునికి సంబంధించినవి కావు" (మార్కు. 8:33).

    పునీత పౌలు హేబ్రీయులకు వ్రాసిన లేఖలో, అంత్యంత తీవ్రమైన శోధనలపై యేసు ప్రభువు విజయం, సకల మానవాళిలో, సరిక్రొత్త నమ్మకాన్ని, సరిక్రొత్త ఆశను నింపుతుంది అని చెబుతున్నారు.
యేసు ప్రభువు, శోధనలపై మరియు సాతానుపై తాను సాధించిన విజయము ద్వారా గొప్ప సందేశమును ఇస్తున్నారు:

మొదటి శోధన: 
    "నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుము". మానవుడు కేవలము రొట్టేవలన జీవింపడు. కాని దేవుడు వచించు ప్రతీ వాక్కు వలన జీవించును" అని యేసు సమాధానమిచ్చాడు. నిజమైన ఆనందం దైవ వాక్కును ఆలకించి దేవుని చిత్తం నెరవేర్చడములో ఉన్నది అని అర్ధము. యేసు దైవ కార్యాన్ని గురించి చేసిన భోదనల అంతరార్ధం ఈ వాక్యములో ఇమిడి ఉన్నది: "కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తన చెంది సువార్తను విస్వసింపుడు" (మార్కు. 1:15).

    దేవుని వాక్యం మనకు మార్గ దర్శం కావాలంటే రెండు ముఖ్య విషయాలున్నాయి. మొదటగా, దానిని సరిగా అర్ధము చేసుకోవాలి. రెండధిగా, దైవ చిత్తానికి పూర్తిగా లోబడటము. మనం వాక్యాన్ని చదివినప్పుడు, మన స్వంత ఇష్టము కంటే, దైవ చిత్తానికి అధిక ప్రాధాన్యం ఇవ్వకుంటే, పరిశుద్ధ గ్రంధం మనలకు నిరాశాపరిచేదిగానే ఉంటుంది. కొంత మంది విశ్వాసులు కొన్ని సార్లు వాక్యములోని ఆజ్ఞలకు అడ్డదారి కనిపెట్టి తమకు ఇష్టం వచ్చినట్లుగా జరిగిస్తూనే తమకు తాము సమర్హ్దించుకొనే మార్గం వెదకుతూ ఉంటారు. ఉదా: పరిసయ్యులు.

రెండవ శోధన: 
    "నీవు దేవుని కుమారుడవైనచో, ఈ శిఖరమునుండి క్రిందికి దుముకుము." అని సాతాను శోధించెను. యేసు మరొకసారి తిరస్కరించారు. "ప్రభువైన నీ దేవుని నీవు శోధింపరాదు. మన సామర్ధ్యాలను, గర్వముగా ప్రదర్శించుకొనే శోధన, ఆడంబరముగా గొప్పలు చెప్పుకొనే శోధనలో మనము అప్పుడప్పుడూ పడుతూ ఉంటాము. ఇవి దేవుని చిత్తాన్ని నేరవేర్చలేవు. యేసు లేఖన భాగాలను ఉదాహరించడము ద్వారా, వీటన్నింటిని జయించాడు. దేవుని వాక్యానికి కట్టుబడి ఉంటే, సాతాను శోధనలు ఎప్పటికీ మనపై విజయం సాధించలేవు. యేసు ప్రభువు ఎన్ని అద్భుతాలు చేసిన తన గొప్ప తనాన్ని, తన సామర్ధ్యాన్ని, తన బలాన్ని నిరూపించుకొనే ప్రయత్నం ఏనాడు చేయలేదు. ఎప్పుడుకూడా, ప్రతీ అద్భుతాన్ని దేవుణ్ణి మహిమపరచడానికి చేసాడు. ఉదా: "నీవు నీ ఇంటికి నీ బంధువుల యొద్దకు పోయి, ప్రభువు నిన్ను కనికరించి, నీకు చేసిన మేలును గూర్చి వారికి తెలియ చెప్పుము" (మార్కు. 5:19).

మూడవ శోధన: 
    "నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన యెడల నీకు సమస్తమును ఇచ్చెదను". అప్పుడు యేసు, "సైతానూ! పొమ్ము! ప్రభువైన నీ దేవుని ఆరాధింపుము. ఆయనను మాత్రమే సేవింపుము" అని చెప్పెను. అధికారం, ప్రభావం అంతా తనదేనని, యేసుకు దానినంతటినీ ఇవ్వగలననే సాతాను అబద్ధం చెప్పాడు. చెడుతనముతో, లోకముతో రాజీ పడితే దేవుని కోసం ఏదైనా చేయడం మరింత సులువుగా సాధ్యపడుతుందని అప్పుడప్పుడూ మనం భావిస్తాం.

    ఇటువంటి బేరసారాలకి మన జీవితములో అనేక సార్లు లొంగి పోతాం. దేవునికి దగ్గరగా ఉండాలని ఆరాటపడతాం. కాని, లోకాశాలకులోనై సాతాను శోధనలకు లొంగి పోతాం. ఇక్కడ ఒక వాక్యాన్ని గుర్తుకు చేసికోవాలి. "మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఈయగలదు? (మత్త. 16:26).

    యేసు ప్రభువు సాతాను శోధనలను జయించిన తీరు ఎంతో గొప్పది. మానవుని జీవితములో ప్రతీ రోజు సాతాను శోధనలకు గురి అవుతున్నాడు. శోధనలను జటించే శక్తి కోసం దేవుణ్ణి ప్రార్ధించాలి. తపస్సు కాలములో ఉపవాసం, త్యాగ క్రియలు చేయడము ద్వారా సాతానుకి చిక్కకుండా దేవునికి ప్రియమైన బిడ్డలముగా, దేవుని నామానికి మహిమను చేకూర్చి పెట్టే బిడ్డలుగా జీవించడానికి కావలసిన శక్తిని దయచేయమని దేవుణ్ణి ప్రార్ధిద్దాం.

మ్రాని కొమ్మల (శ్రమల) ఆదివారము

మ్రాని కొమ్మల (శ్రమల) ఆదివారము
యెషయ 50:4-7; ఫిలిప్పి 2:6-11; లూకా 22:14-23, 56
పాస్కా పవిత్ర వారాన్ని క్రైస్తవులందరూ కూడా ఈ ఆదివారముతో ప్రారంభిస్తూ ఉన్నారు. తపస్సు కాలము పరిశుద్ద సమయముగా చెప్పబడుతుంది. దేవుని ఆశీర్వాదములు నిండుగా పొందుతూ ఉన్నాము. అయితే, ఈ ఆదివారముతో మనం దైవార్చన సం,,లో అతి పవిత్రమైన, ముఖ్యమైన సమయములోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ సమయాన్ని మనం యేసు యెరూషలేములో ప్రవేశించే ఘట్టాన్ని గుర్తు చేసుకొంటూ ఆరంభిస్తూ ఉన్నాము.
ప్రపంచ చరిత్రలో తప్పుచేసిన అనేక మంది శిక్షించబడటం మనం చదువుకొని యున్నాము. చాలా మంది సిలువ మరణాన్ని కూడా పొందియున్నారు. అనేక శతాబ్దాలుగా కొన్ని దేశాలలో సిలువపై మరణ దండన విధించడం అనేది తరచుగా జరుగుతూ ఉంది. అయితే, ఇలా సిలువపై మరణించిన వారి గురించి కాని, శిక్షను పొందిన వారి గురించి కాని, మనం ఎక్కువగా మాట్లాడుకోము, చర్చించుకోము. కాని ఈ సిలువపై మరణించిన ఒక వ్యక్తి గురించి ఈనాడు ప్రత్యేకముగా ధ్యానము చేసుకొంటున్నాము. ఆ వ్యక్తి మరణాన్ని స్మరించు కొంటున్నాము. అతడే నజరేయుడైన యేసు ప్రభు. ఈ రోజు తిరుసభ ప్రత్యేకముగా యేసు శ్రమల, మరణ ఘట్టాలను చదువుకొని ధ్యానించు కొంటున్నాము.
ఈనాటికి కూడా మనం ఆయనను గురించి తలంచి, ఆయన శ్రమలను, మరణాన్ని గురించి మాట్లాడు కొంటున్నాము. ఆయనే దేవుని ఏకైక కుమారుడు. ఈ లోకానికి ఒక చిహ్నాన్ని, ప్రేమ చిహ్నాన్ని ఇవ్వడానికి, ఈ లోకానికి రక్షణను, విమోచనమును ఇవ్వడానికి, తన తండ్రి చిత్తం ప్రకారముగా శ్రమలను, సిలువ మరణాన్ని అనుభవించాడు, భరించాడు.
ఆయన తన జీవితాన్ని సర్వ మానవాళి కోసం సమర్పించాడు. దైవ కుమారుడిగా దేవుని ప్రేమను గురించి మాట్లాడాడు. ఆ ప్రేమతోనే అనేక మందికి స్వస్థతను, ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. ఆ ప్రేమ కారణం చేతనే దేవుని కరుణను, ఓదార్పును పంచి పెట్టాడు. చివరికి ఆ ప్రేమ కారణముగానే, శ్రమలను, సిలువ పాటులను తన పూర్తి స్వేచ్చతో అంగీకరించి, మనoదరికి కూడా నిజమైన ప్రేమ ఎలా ఉండాలో చూపించాడు. ఈ చిహ్నాన్నే యేసు సిలువ, శ్రమల పాటుల ద్వారా ఇస్తూ ఉన్నాడు.
మానవుని జీవితం, వెలుగు చీకటిల మధ్య ఒక సమరముగా చూస్తూ ఉన్నాము. కష్ట సుఖాలు కావడి కుండలు అంటారు. అవి అందరి జీవితాలలో ఒక భాగం ఈ కష్ట సుఖాలు అనేక రకాలుగా మనకు తారస పడతాయి. అయితే యేసు ఈ లోకానికి వచ్చింది మనకు కష్టం రాకుండా ఆపడానికి కాదు. ఆయన వచ్చింది మన కష్టాలలో పాలు పంచుకోవడానికి, మన కష్టాలలో మనతోఉండటానికి, మనతో జీవించడానికి, మన మధ్య జీవించడానికి, తన సన్నిధానముతో మనలను నింపడానికి. ఆయన మనలో ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన మనతో ఉండుట వలన, మనం శక్తిని, బలాన్ని పొందుతూ ఉన్నాము.
కనుక, మనం ఎక్కడ ఉన్న ఎలా ఉన్న, క్రీస్తు వైపు చూడటానికి ప్రయాస పడదాం! క్రీస్తు మనలను తన వెలుగులోనికి, ఉత్తాన పండుగ సంతోషములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన ఆహ్వానాన్ని అందుకొని, ధైర్యముగా ముందుకు సాగుదాం.
యేసు యేరుషలేము పట్టణ మార్గాన్ని ఎంచుకొని, ఆ పట్టణములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రజలు ఆయనకు జయజయ ధ్వానాలు పలికారు. అయితే, యేసు యేరుషలేము ప్రయాణాన్ని ఈనాడు మనoదరి జీవితాలలో పోల్చుకోవాలి. ఈ లోకాన్ని రక్షించడానికి యేసు ఎన్నుకున్నది యేరుషలేము మార్గము. అయితే ఈ మార్గమే ఆయనను సిలువ మరణానికి గురి చేసింది. ఈనాడు యేసు తన రక్షణ కార్యాన్ని ఈ లోకములో కొనసాగించ డానికి, జ్ఞానస్నానం పొందిన ప్రతీ బిడ్డను ఎన్ను కొంటున్నాడు. యేసు ఏవిధముగా యేరుషలేము పట్టణములో ప్రవేశించాడో, అదే విధముగా మనందరి హృదయాలలో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆయన మన జీవిత బాటలో ప్రయాణిస్తూ ఉన్నాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్న, ఆయన మన చెంతకు వస్తూనే ఉంటాడు. ఆయన మనతోనే ఉన్నాడు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాడు. కనుక మన కష్ట బాధలను ఆయనతో పంచుకొందాం. ఈ పవిత్ర వారములో ఆయనతో ఎక్కువ సమయాన్ని గడపటానికి ప్రయత్నిద్దాం. ఆయన మనలను ఎన్నటికి మోసం చేయడు. కారణం, ఆయన మన తండ్రి మరియు ఆయన ప్రేమ స్వరూపుడు.