26వ సామాన్య ఆదివారము, YEAR C

26వ సామాన్య ఆదివారము, YEAR C
పఠనాలు: ఆమోసు 6:1,4-7, I తిమోతి 6:11-16; లూకా 16:19-31

ప్రియ సోదరీ, సోదరా! మన గమ్యం పరలోక రాజ్యం. ఈ లోకములో మనం కేవలం ప్రయాణికులం. ఏదో ఒకప్పుడు ఈ ప్రయాణం ముగియవలసినదే! అయితే, పరలోక రాజ్యములో స్థానాన్ని పొందాలంటే, ఈ భూలోకయాత్ర దేవుని చిత్తానుగుణముగా కొనసాగాలి. తుదితీర్పును (మత్తయి 25:31-44) దాటి తండ్రి రాజ్యములో ప్రవేశించాలంటే, భూలోక జీవితం క్రీస్తు ఆజ్ఞలు, చూపిన విలువలు, బోధనలప్రకారం కొనసాగాలి. మారు మనస్సు, పశ్చాత్తాపం మనకి ఎంతో అవసరం. దివ్య సంస్కారములద్వారా దైవానుగ్రహాన్ని, పవిత్రాత్మ వరాలను పొందుతూ మన జీవితాలను ముందుకు కొనసాగించాలి.


అదేవిధముగా, ఈనాటి పఠనాలు, మనం సమాజములో, మన అనుదిన జీవితాలను ఎలా జీవించాలో బోధిస్తున్నాయి. పేదవారితో మన సంపదలను పంచుకోవాలి. ఆకలిగొన్నవారికి ఆహారం ఒసగాలి, దప్పికగొన్నవారికి దాహమును తీర్చాలి, పరదేశులను ఆదరించాలి, వస్త్రహీనులకు వస్త్రములను ఇవ్వాలి, రోగులను పరామర్శించాలి, చెరసాలలో ఉన్నవారిని దర్శించాలి. ఈ అత్యల్పులలో ఏ ఒక్కరికిని ఇవి చేసినను అవి ప్రభువుకు చేసినట్లే!


మొదటి పఠనములొ ఆమోసు ప్రవక్త భోగప్రియులైన ఇస్రాయేలు ప్రజలకు అనర్ధము, ఘోరశిక్ష తప్పదని ప్రవచిస్తున్నాడు. ఎందుకన, వారు పేదవారిని, బాధలలో ఉన్నవారిని పీడిస్తూ, అణగద్రొక్కుతూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుచున్నారు.


"నీతిమంతులు నిత్య జీవితములో ప్రవేశింతురు. అవినీతి పరులు నిత్య శిక్షకు వెడలిపోవుదురు" (మత్తయి 25:46). మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో ఆత్మపరిశీలన చేసుకొందాం!


ఈ విషయాన్ని ఈనాటి సువిశేష పఠనములొని ధనికుడు-లాజరు ఉపమానము ద్వారా, ప్రభువు మనకు క్షున్నముగా, అర్ధవంతముగా తెలియజేస్తున్నారు. అయితే, ముందుగా ప్రభువు ఈ ఉపమానాన్ని ఎందులకు చెప్పారో తెలుసుకొందాం: ప్రభువు ఈ ఉపమానాన్ని ధనాపేక్ష కలిగిన పరిసయ్యులకు, పేదవారిపట్ల కనికరములేని పరిసయ్యులకు గుణపాఠం చెప్పడానికి చెప్పియున్నారు. మరియు ఈ ఉపమానాన్ని, ఆకాలములో యూదులలో ఉన్న తప్పుడు భావనలను సరిదిద్దుటకు చెప్పియున్నాడు. ఆ తప్పుడు భావనలు ఏవనగా: మొదటగా, లోకసంపదలు కేవలం కొంతమందికి ముఖ్యముగా నీతిగా పరిగణింపబడే వారికే దేవుడిచ్చిన గొప్ప వరమని, పేదరికం, అనారోగ్యం పాపాలకి శిక్షయని భావించెడివారు. కనుక వారికి సహాయము చేయనవసరములేదు. వారు దేవునిచేత శపింపబడియున్నారని భావించెడివారు. రెండవదిగా, సంపద దేవుని వరము కనుక దేవునికి కృతజ్ఞతలు తెలపడానికి, మొదటగా దశమభాగము దేవునికి ఇచ్చిన తరువాత, ఆ సంపదను  భోగవిలాసాలతో, తినుతూ, త్రాగుతూ అనుభవించాలని భావించెడివారు. మూడవదిగా, మరణం తర్వాత ఆత్మ జీవింపదని మన కార్యాలను బట్టి నూతన జీవితములో ప్రతిఫలం ఉండదని సద్దూకయ్యులు భావించెడివారు. ఈ ఉపమానము ద్వారా, ఈ తప్పుడు భావనలను యేసు ఖండించారు.


ఉపమానములో విన్నట్లుగా, ధనికుడు ఈ భూలోకమున పట్టువస్త్రములు ధరించి, నిత్యము విందులతో, వినోదములతో కాలాన్ని గడిపాడు. తన వాకిట ఉన్న లాజరు అను పేదవాన్ని ఎప్పుడూ చేరదీయలేదు, పరామర్శించలేదు. ఇరువురు ఈ భూలోక యాత్ర ముగించిన తరువాత, ధనికుడు పాతాళములోనికి త్రోయబడ్డాడు. లాజరును దేవదూతలు అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు, సంపదతో జీవించాడని పాతాళములోనికి త్రోయబడలేదు. కాని, అతడు సకల సంపదలను అనుభవించుచూ, మోషే, ప్రవక్తల బోధనలను, హెచ్చరికలను పెడచెవిన పెట్టాడు. ధనికుడు శారీరకముగా ఎవరికీ ఏ హాని చేసి ఉండక పోవచ్చు. కాని, తన చుట్టూవున్న పేదవారిని ఆదరించలేదు, కష్టములో, బాధలో ఉన్నవారిని పరామర్శించలేదు. అందుకే, పాతాళమునుండి దాటుటకు వీలులేని అగాధమును ఏర్పాటు చేసుకొన్నాడు. ధనికుడు, తుదితీర్పు తరువాత బాధపడ్డాడు, కనికరింపుమని అబ్రహామును వేడుకొన్నాడు. కాని, ప్రియ సోదరీ! సోదరా! మనం ఈ భూలోకమున ఉండగానే మారుమనస్సు పొందాలి, పశ్చాత్తాప పడాలి. క్రీస్తు బోధనలను ఆలకించి, పాటించాలి. మనం దేవుని నుండి ఎన్నో వరాలను, అనుగ్రహాలను పొందిన గొప్పవారము. మనమందరమూ ధనికులమే! దేవుడు మనకు కావలసిన ధనాన్ని, సంపదనూ, ఆరోగ్యాన్ని, సమయాన్ని, తెలివి తేటలను, ఇలా ఒక్కొక్కరికి ఒకో విధముగా ప్రత్యేకమైన వరాలను ఒసగియున్నాడు. ఆ అనుగ్రహాలన్నింటినికూడా స్వార్ధముతో కేవలము మనకొరకేగాక, ఇతరులకొరకుకూడా  ముఖ్యముగా అవసరములో ఉన్నవారికి కొరకు ఉపయోగించాలి.


ఈ ఉపమానముద్వారా, సంఘములో స్వార్ధముతో జీవింపక, మనం సామాజిక జీవులమని, ఒకరికొరకు ఒకరం జీవింపాలని, అలాగే, ఇతరుల పట్ల మనం బాధ్యతకలిగి జీవింపాలని, మనకున్నవాటిని పంచుకోవాలని బోధిస్తున్నది. మన తుదితీర్పు కూడా ఈ పంచుకోవడముపైనే ఉన్నదని మత్తయి 25 వ అధ్యాములో చూస్తున్నాము. ఆహారమును, పానీయమును, గృహమును, ఇతరులతో పంచుకోవాలి. ఇతరులపట్ల దయ, కనికరముతో జీవించాలి.  ధనికుడు లాజరును ఒక సోదరునిగా పరిగణించలేదు. జగమంతా ఒకే కుటుంబము. ఎన్ని భిన్నత్వాలున్న ఐక్యముగా జీవింపాలి.


ఈనాటి రెండవ పఠనములొ పౌలుగారు ఎఫేసు సంఘానికి అధిపతియైన (ఈనాటి పీఠాధిపతి) తిమోతిని హెచ్చరిస్తూ, అతనికి మంచి సలహాలను ఇస్తున్నాడు. "ధనకాంక్ష సర్వ అనర్ధములకు మూలము" (1 తిమో. 6:10). పొగరుబోతుతనం, వాగ్వివాదములు, వాగ్యుద్ధములు, అసూయలు, కలహములు, దూషణలు, దుష్టసందేహములు, ధనకాంక్షలకు దూరముగా ఉండమని పౌలుగారు తెలియజేస్తున్నారు. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యముతో జీవింప ప్రయత్నం చేయాలి (6:11). మనము ఈ లోకములోనికి వచ్చునప్పుడు ఏమియు వెంటతీసుకొనిరాలేదు. మనము ఈ లోకమునుండి నిష్క్రమించునప్పుడు ఏమియు వెంటతీసుకొనిపోజాలము (6:7). కనుక, ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులుగా ఉండక, అస్థిరములగు ధనములందు నమ్మకముంచక, మనము సంతోషముగా అనుభవించుటకు దారాళముగా కావలసినదంత దయచేయు దేవునియందే నమ్మకము ఉంచవలయును (6:17). ఇదియే, నిజమైన జీవమును సంపాదించుకొనుటకై రాబోవు కాలమునకు దృఢమైన పునాదిని ఏర్పాటు చేసుకోవడం.


అయితే, సలహాలు మనకు కావలసినన్ని ఉన్నాయి కాని, వాటిని పాటించినప్పుడే, వాటి ఫలితాన్ని పొందగలము. కనుక, దేవుడు మనకు ఇచ్చిన సంపదను, వరాలను ఇతరులతో పంచుకోవడానికి ప్రయాసపడుదాం. పేదవారిని అవమానపరచక, కించపరచక, ఆదుకొనే ప్రయత్నం చేద్దాం. వ్యాధిగ్రస్తులను పరామర్శించుదాం. కష్టములోనున్నవారికి చేయూతనిద్దాం. మన జీవితాన్ని, ఇహలోక సంపదపైగాక, దేవునిపట్ల నమ్మకముపై నిర్మించుకొందాం. యేసుక్రీస్తు చూపిన మార్గములో పయనిద్దాం. ఆయన బోధనలను పాటిద్దాం. మోక్షవాసులమవుదాం!


కీర్తన. 119: 49-50: "ఈదాసునికి నీవు చేసిన వాగ్ధానమును జ్ఞప్తికి తెచ్చుకొనుము. అది నాకు ఆశను కల్పించెను. నీ వాగ్ధానము నాకు జీవమును  ఒసగెను. కనుక నా బాధలలో కూడా నేను ఓదార్పును పొందితిని."

25వ సామాన్య ఆదివారము, YEAR C

25వ సామాన్య ఆదివారము, YEAR C
ఆమో. 8:4-7; 1తిమో. 2:1-8; లూకా. 16:1-13

మనమందరమూ దేవుని దత్తపుత్రులం. క్రీస్తానుచరులము. మన ప్రాధాన్య పిలుపు ఈ లోకములో దైవరాజ్యాన్ని స్థాపించడం. దీనినిమిత్తమై భగవంతుడు మనకు ఎన్నోవరాలను, అనుగ్రహాలను దయచేసియున్నారు. వాటిని వివేకముతో, దైవానుచిత్తముగా ఉపయోగించాలి. దైవరాజ్యమును స్థాపించుటకు మనమందరమూ నీతి న్యాయాలతో జీవించాలని ఈనాటి పఠనాలు మనకు బోధిస్తున్నాయి."మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకుడు" (మత్త. 6:33). "నీవు న్యాయమును పాటింపుము, ప్రేమతో మెలుగుము, నీ దేవునిపట్ల వినయముతో ప్రవర్తింపుము" (మీకా. 6:8).

'న్యాయం' అనగా ఇతరుల హక్కులను గౌరవించడం. అలాగే ఇతరులు ఆ హక్కులను  పొందటములో మనం బాధ్యతలను కలిగియుండటము. న్యాయాన్ని రెండు రకాలుగా చెప్పవచ్చు: సామాజిక సేవ, సామాజిక న్యాయం. సేవ అప్పటికప్పుడు ఇతరుల కష్టాలను, బాధలను తీర్చటం లేదా ఒదార్చటం. ఉదా. ఆకలితో నున్నవారికి అన్నం పెట్టడం. అదే సామాజిక న్యాయం ఆ కష్టాలకు, బాధలకు కారణాన్ని కనుగొని శాశ్వత పరిష్కారం చేయడం. న్యాయం అనగా ఇతరులకు చెందిన దానిని వారికి చెందేలాగున చేయడం. ఈనాటి మన సమాజ దుస్తుతికి, అనగా అసమానతలకు కారణం సామాజిక న్యాయం లేకపోవటం వలననే. మన ప్రభుత్వాలు, ఇతర సామాజిక సంఘాలు అలాగే మనమందరమూ సామాజిక న్యాయం కొరకు కృషి చేయాలని ఆశిద్దాం.

న్యాయముగా జీవించడం దేవుని వరం. ఇది కేవలం వరదాయకమైనదేకాక, రక్షణదాయకమైనది. ఈ దేవుని వరాన్ని మనం పొందాలంటే, మన పాపాలకు పశ్చాత్తాపపడి దివ్యసంస్కారమైన పాపసంకీర్తనం చేయాలి. ఈ దివ్య సంస్కార ఫలితముగా ఈ వరాన్ని మనం పొందగలం.

ఈనాటి పఠనాలను ధ్యానిద్దాం:
ఆమో. 8:4-7: "దీనుల తలమీద కాలు మోపుచు, పేదలను నాశనము చేయువారలారా వినుడు!..." తెకోవకు చెందిన ఆమోసు ప్రవక్త ఇస్రాయేలు రెండవ యరోబాము (క్రీ.పూ. 782-753), యూదాలో ఉజ్జియా (క్రీ.పూ.767-740) కాలములోని ప్రవక్త. ఆమోసు యూదారాజ్యానికి చెందిన వ్యక్తి. గొర్రెలకాపరిగా జీవితం గడుపుతూ అత్తిపండ్లను అమ్ముకొంటూ జీవనోపాధిని సాగిస్తున్న అతనిని ఇస్రాయేలు ప్రజలకు ప్రవచనము చెప్పమని దేవుడు పిలుచుకొన్నారు. ఆమోసు అనగా "బరువు మోయువాడు" అని అర్ధము. యరోబాము కాలములో ఇస్రాయేలు రాజ్యము బాగా విస్తరించింది. వ్యాపారపరముగా, ఆర్ధికముగా ప్రజలు పుంజుకున్నారు. అయితే, ఈ అభివృద్ది మత్తులో పడిపోయి, మతాచార వ్యవహారములో, ఆధ్యాత్మిక విషయాలలో చిత్తశుద్ది లోపించి అంతా బాహ్యమైన తంతుగానే ఉండిపోయింది. అవినీతి, అన్యాయం, మోసం బాగా పెరిగి పోయాయి. ఈ పరిస్థితుల్లో అవినీతి, అన్యాయాలకు విరుద్ధముగా ఆమోసు ప్రవచించాడు. ప్రజల అవినీతిని ఎదురించడం ప్రవక్త కర్తవ్యం. పశ్చాత్తాపపడి దేవునివైపు తిరగాలనే దేవుని హెచ్చరికలను ఆమోసు ప్రవక్త ప్రవచించాడు. దురాశాపరులు, అవినీతిపరులు నిరుపేదలను వంచించడం వంటి సాంఘిక అన్యాయాలను ఎత్తిచూపి, సాంఘిక న్యాయం కోసం పోరాడిన ప్రవక్త ఆమోసు.

ఈనాటి పఠనములో ప్రజల వ్యాపారములో అవినీతి, అన్యాయపు కార్యాలను ఆమోసు ఎత్తిచూపుతున్నాడు. తప్పుడు కొలమానములు, తూకములతో, దొంగత్రాసులతో ప్రజలను మోసగిస్తున్నారు. తాలు గోధుమలనుకూడా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. బాకీలు చెల్లింపలేని పేదలను, చెప్పులజోడు వెలకూడా చెల్లింపలేని పేదలను కొంటున్నారు. ఇది అన్యాయం అని, అవినీతి అని ప్రవక్త వారికి తెలియజేసియున్నాడు. "దొంగ తూకములకు, దొంగ కొలతలకు పాల్పడు వారిని ప్రభువు అసహ్యించుకొనును" (సామె. 20:10). "పేదవానిని పీడించువాడు అతనిని కలిగించిన సృష్టికర్తను అవమానించును. దరిద్రుని గౌరవించువాడు దేవుని గౌరవించును" (సామె. 14:31). అలాగే, దేవుడు ఏర్పాటు చేసుకొన్న ఒడంబడికకు ఇస్రాయేలు ప్రజలు విశ్వాసులుగా ఉండాలని ప్రవక్త కోరియున్నాడు.

దేవుడు నమ్మకస్తుడు కావున, ఆయన ప్రజలుకూడా నమ్మకముగా ఉండాలి. అదేవుడు అందరికి సమానముగా న్యాయతీర్పును చేయువాడు. ఆయనకు అందరు సమానమే. "క్రీస్తు యేసునందు మీరందరునూ ఒక్కరే" (గలతీ. 3:28).

పౌలు తిమోతికి వ్రాసిని మొదటి లేఖలో (రెండవ పఠనం) అందరికొరకు ప్రార్ధన చేయాలని కోరుతున్నాడు. తిమోతి పౌలుకు ప్రీతిపాత్రుడు. ప్రభువునందు విశ్వసనీయ సహచరుడు. పౌలు లేఖలు రాయడానికి సాయపడ్డాడు. పౌలు తిమోతిని ఫిలిప్పు సంఘానికి తన రాయబారిగా పంపాడు. ఆపిమ్మట ఎఫేసు, తెస్సలోనిక సంఘాలలో పనిచేసాడు. తిమోతి అనగా "దేవుని గౌరవించడం" అని అర్ధం. నిజమైన విశ్వాసాన్ని పటిష్టం చేయడానికి పౌలు ఈ లేఖను రాసాడు. ఇతరుల కొరకు ప్రార్ధన చేయడం క్రైస్తవ బాధ్యత. ఇది దైవచిత్తం. ప్రార్ధన శక్తివంతమైనది. అధికారములోనున్న వారికొరకు ప్రార్ధన చేయాలి. మన ప్రార్ధనలద్వారా అన్యాయం, అవినీతి, దేవుడంటే అయిష్టత ఉన్న వారి హృదయాన్ని మార్చవచ్చు. ప్రతీ ఒక్కరు సత్యమును తెలుసుకొని, రక్షణ పొందాలని ప్రార్ధన చేయాలి.

ఈనాటి సువిశేష పఠనములో, "ముందు చూపుగల గృహనిర్వాహకుడు" అను ఉపమానమును ప్రభువు చెప్పియున్నారు. ఈ గృహనిర్వాహకుడు మొదటగా అవినీతిపరుడు. యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని నేరము అతనిపై మోపబడినది. ఆ రోజుల్లో గృహనిర్వాహకుడు ఒక బానిస. యజమాని అతనికి ఎంతో స్వేచ్చను, స్వతంత్రాన్ని ఇచ్చి, గృహనిర్వాహన బాధ్యతలు అప్పజేప్పేవాడు. గృహనిర్వాహణలో యజమానికి లాభాలు చేకూర్చవలసి ఉంటుంది. కాని, గృహనిర్వాహకుడు ఇదే అదనుగా తీసుకొని స్వలాభంకోసం ఎక్కువ వడ్డీలను వసూలు చేసేవాడు. అది తెలుసుకున్న యజమాని 'లెక్కలు అప్పజెప్పుమని, ఇక గృహనిర్వాహకుడిగా ఉండ వీలుపడదు' అని చెప్పియున్నాడు. అయితే, తన పని కోల్పోయిన తరువాత ఋణస్తుల ఆశ్రయం, సహాయం పొందుటకు వారిని పిలిపించి వారి ఋణాలను తక్కువగా చేసియున్నాడు. ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా, ముందుచూపుతో ప్రవర్తించినందులకు యజమానుడు మెచ్చుకొన్నాడు.

ఈ ఉపమానమునుండి మనం ఏమి నేర్చుకోగలము?
1. గృహ నిర్వాహకుని అవినీతిని అన్యాయాన్ని , ఉపమానం చెప్పిన ప్రభువు కాని, యజమాని కాని, మనం కాని సమర్ధించడం లేదు. అతని యుక్తికి, ముందుచూపుతనాన్ని మెచ్చుకొంటున్నాము. ఋణాలను తగ్గించి రాయడం వలన, అతను యజమానుని మోసంచేయలేదు. తన స్వలాభాన్ని త్యజించాడు. కారణం ఏదైనా, తను చేసిన తప్పును సరిచేసుకోవడానికి ప్రయత్నం చేసాడు. మనంకూడా, మన అనుదిన జీవితాలలో అవినీతికి, అన్యాయాలకు దూరముగా ఉంటూ, యుక్తిగా ప్రవర్తించుటకు ప్రయాసపడాలి.

2. ప్రభువు అంటున్నారు: "స్వల్ప విషయములలో నమ్మదగినవాడు, గొప్ప విషయములలోనూ, నమ్మదగిన వాడిగా ఉండును. అల్ప విషయములలో నమ్మదగనివాడు, గొప్ప విషయములలోనూ నమ్మదగనివాడుగా ఉండును" (లూకా. 16:10). నమ్మకం చాలా గొప్పది. మన బంధాలలో, చేసే పనిలో తప్పకుండ నమ్మకం ఉండాలి. క్రైస్తవులముగా, మనం ఈ లోకములో ఎన్నో బాధ్యతలను కలిగియున్నాము. నమ్మకముగా వానిని నేరవేర్చుదాం. ఈలోక సంపదలయందు నమ్మకముగా ఉన్నప్పుడే, పరలోక సంపదలను దేవుడు మనకు అప్పజెప్పును. "ఈలోక సంపదలయందు మీరు నమ్మదగిన వారు కానిచో, పరలోక సంపదలను ఎవడు మీకు  ఇచ్చును?" (లూకా. 16:11). చిన్న పనులను గొప్ప ప్రేమతో చేయాలి.

3. మనకున్న ఆధ్యాత్మిక వనరులను సద్వినియోగ పరచుకోవాలి. దివ్యసంస్కారాలు దేవుడు మనకిచ్చిన గొప్ప వరాలు. వానిద్వారా దైవానుగ్రహాన్ని పొందగలుగుచున్నాము. అలాగే దివ్యగ్రంధము, తిరుసభ బోధనలు గొప్ప వరాలు. గృహనిర్వాహకునివలె మనంకూడా మనకు ఇవ్వబడిన వరాలనుబట్టి అనగా మన సమయం, సామర్ధ్యం, అవకాశాలు, ఆరోగ్యం, తెలివితేటలు, విద్య మొ.గు వానినిబట్టి దేవునికి మనం లెక్కజెప్పవలసి ఉంటుంది. "మనము అందరమును న్యాయవిచారణకై క్రీస్తు ఎదుట అగపడవలెనుగదా! అప్పుడు వారివారి అర్హతలనుబట్టి మంచివిగాని, చెడ్డవిగాని భౌతికశరీరమున వారువారు ఒనర్చిన కృత్యములనుబట్టి వారికి ప్రతిఫలము ఒసగబడును" (2 కొరి. 5:10).

4. ఈ లోక సంపద ఏదీ శాశ్వతం కాదు. ఈలోక సంపద మనకు శాశ్వత ఆనందమును ఇవ్వలేదు. శాశ్వత ఆనందమునొసగు పరలోకములో మన సంపదను కూడబెట్టుకోవాలి. సంపదలున్న చోటనే మన హృదయం కూడా ఉంటుంది (మత్త. 6:19-21). ఈ లోక సంపదలు మన అవసరాలకొరకు ఇవ్వబడ్డాయి. అంతేగాని వాటిమీద మనం ఎప్పటికి ప్రేమను పెంచుకోరాదు. అత్యాశతో వాటిని కూడబెట్టుకోవడం మంచిది కాదు. మనం సామాజిక న్యాయంకోసం కృషి చేయాలి. ఎవరికి చెందిన దానిని వారిని చెందనివ్వాలి. సామాజికన్యాయం లోపించుట వలననే, ఇన్ని అసమానతలు, ఘోరాలు, బేదాభిప్రాయాలు ...

5. అవినీతి, అన్యాయాలతో డబ్బు సంపాదించిన అది శాశ్వతం కాదు. అది ఎలా వస్తుందో అలాగే పోతుంది. అవినీతి, అన్యాయాలు చేసేవారు గృహనిర్వాహకునివలె బాధ్యతలనుండి తప్పించబడతారు, అనగా వారి జీవనోపాధిని కోల్పోతారు. దేవుని తీర్పుకు, ఖండనకు గురియవుతారు.

5. దైవరాజ్య స్థాపనకై కృషిచేయాలి. దైవరాజ్యం ఈలోకానికి చెందినదికాదు. పాత ఒప్పందములో, దేవుడు మహారాజుగా, తన శక్తితో, ఈ లోక దుష్టశక్తులతో కూడిన అన్యాయాన్ని అంతం చేసి న్యాయాన్ని, సంతోషాన్ని, శాంతిని నెలకొల్పియున్నారు. ఇదే దేవుని సృష్టి ఉద్దేశాన్ని పరిపూర్ణం చేయడం. ఇదే తండ్రి దేవుని కార్యాన్ని, పుత్రుడైన యేసు నూతన ఒప్పందములో గావించారు. "కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు." (మార్కు. 1:15). ఇదే దైవ పాలనారంభం. రక్షణకు మార్గం. ఇది దైవరాజ్య స్థాపనకు శుభవార్త. యేసు తన బోధనలద్వారా, అద్భుతములద్వారా, తన వ్యక్తిత్వంద్వారా, మరణ-పునరుత్తానముల ద్వారా దైవప్రేమ రాజ్యమును స్థాపించారు. ఈ దైవరాజ్యమును పవిత్రాత్మ శక్తి వలన కొనసాగించే బాధ్యత తిరుసభది, అనగా మనందరిది. కాట్టి యుక్తిగా ప్రవర్తించుదాం.

క్రీస్తు యేసుకూడా ఈ లోకమున అన్యాయాన్ని, అవినీతిని వ్యతిరేకించారు. సామాజిక న్యాయంకోసం తపించారు. దైవరాజ్యాన్ని స్థాపించారు. "చిన్న బిడ్డలదే దేవుని రాజ్యం" (మార్కు. 10: 14-15) అన్నారు ప్రభువు. అనగా చిన్న పిల్లలవలె ఎలాంటి కల్మషం లేకుండా ఉండాలని అర్ధం. దేవుని రాజ్యం పవిత్రాత్మతో నింపబడిన రాజ్యం. ప్రేమ, శాంతి సమాధానాలు కలిగిన రాజ్యం. నీతిన్యాయములు నెలకొనిన రాజ్యం. ఇది ఆధ్యాత్మికమైన రాజ్యం. విమోచన కలిగిన రాజ్యం. ఈ రాజ్యములో అందరూ సమానమే. "మీ రాజ్యం వచ్చును గాక" అని ప్రతీ రోజు మనం ప్రార్ధన చేస్తున్నాం. ఇలాంటి రాజ్యమే మన ఈ భూలోకములో స్థాపించబడాలని ప్రార్ధన చేద్దాం.

24 వ సామాన్య ఆదివారము, YEAR C

24 వ సామాన్య ఆదివారము, YEAR C
నిర్గమ. 32: 7-11,13-14; I తిమో. 1:12-17; లూకా. 15:1-32

దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, కోపపడువాడు, కాని క్షమించువాడు. దేవుని కోపం, ఆయన ప్రేమతో సమానం. తను ఎన్నుకొన్న ప్రజలు అవిధేయించినప్పుడు, అవిశ్వాసములో జీవించినప్పుడు, కోపపడినను, తన కరుణాహృదయముతో వారిని క్షమించి, వారిపై తన ప్రేమను చాటుకొంటూ ఉంటారు. మనందరి వ్యక్తిగత జీవితములో, దేవుని ప్రేమను, కరుణను, క్షమను పొందియున్నాము. దానినిమిత్తమై, ముందుగా దేవునికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొందాము. "మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక! యేసుక్రీస్తు పునరుత్థానముద్వారా మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము" (1 పేతు. 1:3).

మొదటి పఠనములో, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను క్షమించడం చూస్తున్నాము. వారు చేసిన పాపం చాలా పెద్దది: బంగారు దూడను చేసి, విగ్రహారాధన చేసారు, దానిని బలులతో ఆరాధించారు, వారు మతభ్రష్టులైరి, తద్వారా దేవుని ఆజ్ఞను మీరారు. ఐగుప్తు దేశమునుండి బయలుదేరిన మూడు నెలలకు, యిస్రాయేలీయులు సినాయి అరణ్యమునకు వచ్చిరి. అచటనే కొండకెదురుగా విడిది చేసిరి. మోషే కొండనెక్కి దేవుని కడకు వెళ్ళెను. దేవుడు కొండనుండి అతనిని పిలచి యిస్రాయేలీయులకు తన ఆజ్ఞలను, నియమాలను, కట్టడలను వెల్లడించుమని చెప్పెను (నిర్గమ. 3). మోషే కొండమీదికి వెళ్లి చాలా కాలము వరకు తిరిగి రాలేదు. ఈలోగా వారు మోషే ఇక తిరిగి రాడని భావించి, బంగారు దూడను చేసి పూజించారు, ఆరాధించారు, బలులు అర్పించారు. ఐగుప్తునుండి తోడ్కొని వచ్చిన దేవర యితడే అని పల్కారు. అది చూసిన దేవుడు కోపపడ్డారు. ఆయన కోపము గనగన మండి వారిని బుగ్గి చేయాలని హెచ్చరించారు. ఆ తరువాత, మోషేనుండి మహాజాతిని పుట్టించ తలచాడు. కాని, మోషే దేవునికి వారిని నాశనం చేయవద్దని మొరపెట్టుకొన్నాడు, మనవి చేసుకొన్నాడు, ప్రార్ధన చేసాడు. కనుక ప్రభువు తన తలంపును మార్చుకొన్నారు, యిస్రాయేలీయులకు తలపెట్టిన కీడును విరమించుకొన్నారు (నిర్గమ. 32). దీనినిబట్టి, దేవుని ప్రేమను, కరుణను, క్షమను మనం అర్ధం చేసుకోవచ్చు. మానవుని పాపం - దేవుని క్షమ గురించియే, బైబిలు చరిత్రనంతయును చూస్తూ ఉంటాము. ఆనాడు మోషే వేడుదల వలన, ఇశ్రాయేలు ప్రజలు క్షమించబడినారు. ఈనాడు మనం క్రీస్తు పాస్కా పరమరహస్యము ద్వారా (శ్రమలు, మరణం, ఉత్థానం) క్షమించబడియున్నాము.

రెండవ పఠనములో, పౌలుగారు దేవుని కృపకు, దయకు, కనికరమునకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. సౌలుగా అతను క్రీస్తును, క్రీస్తానుచరులను దూషించి, హింసించి అవమానపరచాడు. అయితే  క్రీస్తు అతనిని కనికరించి, ఎంచి తన సేవకు, పరిచర్యకు నియమించుకొన్నారు. ఆయనను విశ్వసింపవలసిన వారందరికి, పౌలు ఆదర్శప్రాయుడుగా ఉండునట్లు చేసారు. దేవుని ప్రేమకు, దయకు, కరుణకు, క్షమకు పౌలుగారి జీవితం ఓ గొప్ప నిదర్శనం! "దేవుని కృప అపారము. మన పట్ల ఆయన ప్రేమ అమితము" (ఎఫెసీ. 2:4). కనుక, మనము నిత్యము దేవునకు కృతజ్ఞతలు అర్పించవలయును.

సువిశేష పఠనము - యేసు మూడు ఉపమానములను (త్రోవతప్పిన గొర్రె, పోగొట్టుకొన్న నాణెము, తప్పిపోయిన కుమారుడు). చెప్పుచున్నారు. ఈ మూడు కూడా, హృదయపరివర్తనమును గురించిన ఉపమానములు. ఇవి దేవుని ప్రేమ, దయ, కరుణలను తెలియజేస్తున్నాయి. పాపులు, సుంకరులు అందరును యేసు బోధలు వినుటకు (వినుటకు, ఆలకించుటకు 5:1; 6:47; 9:35) ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూసి పరిసయ్యులు, ధర్మశాస్త్రబోధకులు యేసు పాపులను చేరదీయుచు వారితో కలసి భుజించుచున్నాడని సణుగుకొనసాగిరి (సుంకరులకు, పాపాత్ములకు మిత్రుడు 7:34. 5:30; 19:7). అయితే ప్రభువు ఉద్దేశం, 5:32లో స్పష్టం చేయబడినది: "హృదయ పరివర్తనము పొందుటకై పాపులను పిలువ వచ్చితినికాని, నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు." అలాగే 19:10 - "మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చియున్నాడు." అప్పుడు యేసు వారికి ఉపమానములను చెప్పారు (15:3). ఈ ఉపమానములద్వారా, సుంకరులను, పాపాత్ములను చేరదీయడాన్ని సమర్ధించుకుంటున్నారు. ఎందుకన, తన ఉద్దేశ్యం - వారి హృదయపరివర్తనము.

"త్రోవతప్పిన గొర్రె" - పాత నిబంధనలో, దేవుడు మంచి కాపరిగా చెప్పబడినారు (ఆ.కాం. 48:15; 49:24; కీ. 23; యిర్మియా 23:3). మంచికాపరి అయిన ప్తరభువు ప్పిపోయిన గొర్రెలను వెదకునని, యెహెజ్కేలు 34:16లో చూడవచ్చు. దేవుని దృష్టిలో ప్రతీ ఒక్కరు ముఖ్యమే. వందలో ఒకటి అని కాకుండా, ప్రతీ ఒక్కరు సమానమే! తప్పోపియిన వారిని కనుగొన్న తరువాత, ఆయన తన భుజములపై మోస్తారు (15:5). ప్రవాసమునుండి తిరిగి వచ్చు సమయములో, దేవుడు తన ప్రజలను తన భుజములపై మోసెను (చదువుము యెషయ 40:11; 49:22). తిరిగి వచ్చిన వారిని తిరిగి దేవుడు పునరుద్దరించును. పరివర్తన చెందినవారిపట్ల పరలోకములో ఆనందము ఉండును (15:7 అలాగే దేవదూతలు సంతోషించును (15:10). ఆ ఆనందాన్ని స్నేహితులతో, ఇరుగుపొరుగు వారితో కూడా పంచుకోవాలి (15:9). యెహెజ్కేలు 18:23లో ఇలా చదువుచున్నాము: "దుర్మార్గుడు చనిపోవుట వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపము నుండి వైదొలగుట వలన కాదా అని ప్రభువు నుడువు చున్నాడు".

"పోగొట్టుకొన్న నాణెము" - తప్పిపోయిన వారిని దేవుడు "పట్టుదలతో" (15:8) వెదకునని తెలియజేయుచున్నది.

యేసు పాపులకొరకై, వారి రక్షణ నిమిత్తమై వచ్చెను. అందరూ పాపాత్ములే. మనలో పాపము చేయనివారు ఎవరునూ లేరు. నీతిమంతులని చెప్పుకొనెడి పరిసయ్యులు, ధర్మశాస్త్రబోధకులు కూడా పాపాత్ములే! పాపులు, సుంకరులు పశ్చాత్తాపముతో యేసు బోధనలను ఆలకించుటకు వచ్చారు. కాని పరిసయ్యులు, ధర్మశాస్త్రబోధకులు దైవకుమారుడైన యేసునే త్రునీకరించారు. మనం అందరం ఈలోకములో పాపము వలన తప్పిపోయిన వారమే! ప్రభువు పరలోకమును వీడి మనలను వెతుక్కొంటూ ఈ లోకానికి వచ్చియున్నారు. ఆయన మంచి కాపరి. గొర్రెలకాపరి ఎలా తప్పిపోయిన గొర్రెను వెదకుతాడో, మనం పోగొట్టుకున్న నాణెమును (ఒక రోజు వేతనము) ఎలా వెతకుతామో, తప్పిపోయిన కుమారుని రాకకై ఓ తండ్రి ఏవిధముగా ఎదురు చూస్తాడో, పాపముచేసి తప్పిపోయిన మనందరి కోసం కూడా దేవుడు తన ప్రేమ, దయ, కరుణతో మన రాకకై ఎదురు చూస్తూ ఉన్నారు. "పశ్చాత్తాపము అవసరములేని తొంబది తొమ్మిదిమంది నీతిమంతులకంటే (పరిసయ్యులు - హృదయ పరివర్తనము అవసరంలేదని భావిస్తారు 18:9), హృదయపరివర్తనము చెందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండును" (లూకా. 15:7) అని ప్రభువు చెప్పియున్నారు.

"తప్పిపోయిన కుమారుడు" - ఉపమానం ప్రపంచములోనే అతి గొప్పదైన కథగా పేరు. దీనిద్వారా, పరలోక తండ్రి దయ, ప్రేమ, కరుణా స్వభావములు మనకు అర్ధమగుచున్నాయి. తండ్రి ప్రేమ అనంతమయినది. ఆ ప్రేమకు ఎలాంటి షరతులు లేవు. తప్పిపోయిన కుమారుడు తిరిగివచ్చినప్పుడు ఆ తండ్రి అతనిపై కోపపడలేదు. దానికి బదులుగా, మేలిమి వస్త్రములను కట్టబెట్టెను, వ్రేలికి ఉంగరమును, కాళ్ళకు చెప్పులను తొడిగెను, క్రొవ్విన కోడెదూడను వధించి విందును ఏర్పాటు చేసెను. తండ్రి అనంత ప్రేమకు, కరుణకు నిదర్శనం!

ఒకనికి ఇద్దరు కుమారులు ఉండిరి (15:11): ఆ ఒకరు తండ్రి దేవుడు. పెద్ద కుమారుడు - ఇస్రాయేలు ప్రజలను (చదువుము నిర్గమ 4:22). చిన్న కుమారుడు - దూరదేశమున వసించుచు, ధర్మశాస్త్రమును పాటించక, పందులను మేపుకొను చిన్నకుమారుడు అన్యులను సూచిస్తుంది. 15:12-24 చిన్నకుమారుని గురించి, 15:25-32 పెద్దకుమారుని గురించి వేరువేరుగా వింటున్నాము. ఈ ఇరువురు కుమారుల మధ్యనున్న వ్యత్యాసాన్ని చూస్తున్నాము. అయితే, ఇరువురి విషయములో తండ్రిదే ఆఖరిమాట!

15:12 - తండ్రి మరణం తరువాతనే ఆస్తి పంచబడాలి (సంఖ్యా 27:8; సీరా. 33:20-24). చిన్న కుమారుడు ఆస్తిని పంచమని అడిగాడు. తన తండ్రి తనకు చనిపోయినట్లేనని భావించాడు. చిన్నకుమారుని కోరిక మేరకు తండ్రి ఆస్తిని పంచి యిచ్చాడు. ద్వితీయ. 21:17 ప్రకారం, పెద్దకుమారునికి ఆస్తిలో రెండువంతులు పంచి ఇవ్వాలి, కనుక, చిన్నకుమారునికి రావలసినది పంచి ఇచ్చాడు.
15:13-16 - చిన్నకుమారుడు దూరదేశమునకు వెళ్ళాడు. అక్కడ భోగవిలాసములతో, ధనమంతయు దుర్వినియోగము చేసి, తన ఆస్తిని మంట కలిపాడు. కరువు దాపురించుటచే, పందులను మేపాడు. యూదులకు పందులు అపరిశుభ్రమైన జంతువులు (లేవీ. 11:7; ద్వితీయ 14:8 అశుచికరమైనది). అనగా అతను అన్యులవలె "చాలా దూరముగా" జీవిస్తున్నాడు అని అర్ధం. అతను ఇస్రాయేలు సంఘము నుండి వెలివేయబడినవాడు. దేవుడు లేకుండా ఈ ప్రపంచమున జీవించడం అని అర్ధం (చదువుము ఎఫెసీ 2:12-13).
15:17-19 - తనకు కనువిప్పు కలిగినది. తన తండ్రి చనిపోయాడని భావించిన అతను ఇప్పుడు చనిపోవుచున్నది తానే అని గుర్తించాడు. తాను తప్పిపోయానని గుర్తించాడు. తన పశ్చాత్తాపాన్ని తనలోతాను అనుకొని (18-19), తండ్రి వద్ద తన పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచాడు (15:21): "పరలోకమునకును, నీకును ద్రోహము చేసితిని..." - తోటివారిపట్ల పాపం చేసినప్పుడు, చివరికి దేవునికి వ్యతిరేకముగా కూడా పాపము చేసినట్లే అని అర్ధం (నిర్గమ 10:16). పశ్చాత్తాప సూచనలు - తండ్రి దయను గుర్తించడం (15:17); "లేచి తండ్రి వద్దకు వెళ్ళడం" (15:18, 20); "లేవడం" అనే పదం క్రీస్తు ఉత్థానమును గురించి కూడా వాడబడింది (లూకా 18:33; 24:7, 46). అనగా, "మరణించిన" కుమారుడు "మరల జీవము" పొందుచున్నాడని అర్ధం (15:24, 32).
15:20 - దేవుడు పాపి హృదయపరివర్తన కొరకు ఓపికతో ఎదురుచూచుచున్నాడు. దూరమున ఉండగానే, తండ్రి అతనిని చూచాడు. అతని మనసు కరిగింది (యేసు కనికరం 7:13; 10:33). కుమారుని వద్దకు పరుగెత్తి వెళ్ళాడు. కుమారున్ని కౌగలించుకున్నాడు. కుమారున్ని ముద్దు పెట్టుకున్నాడు. ఇవన్నీ దేవుని కనికరమునకు నిదర్శనాలు.
15:21-24 - తండ్రి కుమారుని పశ్చాత్తాపాన్ని మధ్యలోనే అడ్డుకున్నాడు. పూర్తిగా చెప్పేవరకు కూడా ఆగలేదు. మేలివస్త్రములను కట్టబెట్టమని, వ్రేలికి ఉంగరమును, కాళ్ళకు చెప్పులను తొడుగుడని, క్రొవ్విన కోడె దూడను వధింపమని సేవకులకు ఆజ్ఞాపించాడు. వీటన్నింటికి అర్ధం, తిరిగి "కుమారుని" స్థానాన్ని తండ్రి తిరిగి ఇచ్చాడు. మరణించినవాడు, బ్రతికాడని, పోయినవాడు తిరిగి దొరికాడని తండ్రి గుర్తించాడు. అనగా, తండ్రి పూర్తిగా క్షమించాడు. దీనిని పౌలు ఎఫెసీ 2:1, 4-5లో విచారించాడు (చదువుము). కనుక, ఆనందముతో, సంతోషముతో విందు చేసుకున్నారు.
15:25-28 - రెండవ భాగములో పెద్దకుమారుని గురించి చూస్తున్నాము. జరిగిన విషయాన్ని పనివానిద్వారా తెలుసుకున్నాడు. అందుకు పెద్దకుమారుడు "మండి పడ్డాడు" (15:28). తండ్రి వెలుపలకు వచ్చి పెద్దకుమారున్ని బ్రతిమాలాడాడు.
15:29-30 - పెద్దకుమారుడు తననుతాను సేవకునిగా, పనివానిగా భావించాడు. "తండ్రీ!" అని ఎప్పుడు సంభోదించలేదు. చిన్నకుమారుని సోదరునిగా భావించలేదు. "నేను ఎన్నడు నీ ఆజ్ఞను మీరలేదు" అని అన్నాడు (ద్వితీయ 26:13). తండ్రి కనికరాన్ని గుర్తించలేదు. ఒకరకముగా, పెద్దకుమారుడు కూడా తప్పిపోయిన వాడే!
15:31-32 - పెద్దకుమారుడిని "కుమారా!" అని సంబోధించాడు. విందునకు ఆహ్వానిస్తున్నాడు. పెద్దకుమారుడు, విందులో చేరినది లేనిదీ చెప్పబడలేదు. అనగా, ఎవరివారే నిర్ణయం చేయాలి అని అర్ధం.

ప్రతీ దివ్యపూజా బలిలో, తన శరీర రక్తములను స్వీకరించుటకు, తన క్షమను పొందుటకు క్రీస్తు మనలను ఆహ్వానిస్తూ ఉన్నారు. పెద్దకుమారుడు, 'ఇతరులు మనకన్న ఎక్కువ' అని భావించి బాధపడ్డాడు. తండ్రి పక్షపాతం చూపిస్తున్నాడని భావించాడు. హృదయపరివర్తనం చెంది ఇంటికి తిరిగి వచ్చిన తమ్ముని ఆదరించక, తండ్రిని తప్పుబట్టాడు. కాని, దేవునిదృష్టిలో అందరమూ సమానమే. అసమానతలు, ఎక్కువ-తక్కువ, పేద-ధనిక, మొ.నవి, మన స్వార్ధము వలన ఏర్పరచుకొన్నవే! దేవుని కుటుంబములో అందరం సమానమే!
1. ఆత్మపరిశీలన చేసుకొందాం. పాపములోనున్న మనలను, దేవుడు తన కరుణతో క్షమించి స్వీకరించుటకు సిద్దముగా ఉన్నారు. క్రీస్తు పాపాత్ములను ఆదరించారు. దేవుని ప్రేమ, క్షమ మన జీవితములోనికి రావాలని ప్రార్ధన చేద్దాం. అదే ప్రేమను, క్షమను ఇతరులపై చూపునట్లు శక్తినివ్వమని ప్రార్ధన చేద్దాం. "మీరు దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలు. ఆయనకు పరిశుద్దులును, ప్రియులును అయినవారు. కాబట్టి, మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవరచుకొనుడు. ఎవడైనను మరియొకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగియున్న ఎడల ఒకనిని ఒకడు సహించుచు క్షమించవలయును. మిమ్ములను ప్రభువు క్షమించునట్లుగానే, మీరు ఒకరినొకరు క్షమించవలయును. వీనికంటే అధికముగా, ప్రేమను అలవరచుకొనుడు. అది అన్నింటిని, ఐక్యముగా ఉంచగలదు" (కొలస్సీ. 3:12-14). "మీ తండ్రి వలె మీరును కనికరము కలిగి ఉండుడు" (లూకా. 6:36).
2. హృదయ పరివర్తనము చెంది, పశ్చాత్తాపముతో మన పాపాలను ఒప్పుకొని తిరిగి మరల శాంతిని, దేవుని స్నేహాన్ని పొందుదాము. దుడుకు చిన్నవాడు, తాను చేసిన తప్పును తెలుసుకొన్నాడు. పశ్చాత్తాప పడ్డాడు. హృదయ పరివర్తనముతో తండ్రి చెంతకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకొన్నాడు. తండ్రి కుమారున్ని చూసినప్పుడు, కుమారుని కళ్ళల్లో పశ్చాత్తాపాన్ని చూసాడు. అందుకే తండ్రి అతనిని కుమారునిగా అంగీకరించి, గొప్ప విందును ఏర్పాటు చేసాడు. "హృదయ పరివర్తనము చెందు పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండును." మార్పు, కనువిప్పు, పశ్చత్తాపం మనకూ కలగాలి. అప్పుడే దేవుడు మనపట్ల సంతోషిస్తాడు. దేవుని చెంతకు తిరిగి రావాలని నిర్ణయించుటకు పవిత్రాత్మ శక్తికి ప్రార్ధన చేద్దాం.

23 వ సామాన్య ఆదివారము, YEAR C

23 వ సామాన్య ఆదివారము, YEAR C
సొ. జ్ఞాన. 9:13-18; ఫిలే. 9-10, 12-17; లూకా 14:25-33
క్రీస్తు - శిష్యరికం

మన భౌతిక జీవితాలు ఎంతో ఉన్నతముగా ఉండాలని ఆశిస్తున్న మనం, మన ఆధ్యాత్మిక జీవితాలు ఇంకా ఎంత మహోన్నతముగా ఉండాలని కోరుకోవాలి? ఆధ్యాత్మిక అభివృద్ధికికూడా పట్టుదల, కృషివలే విశ్వాసము, నమ్మకము, దైవభక్తి, సోదరప్రేమ కలిగి యుండాలి. దేవుని చిత్తానుసారముగా జీవించాలి. అన్నింటికన్నా ముఖ్యముగా, క్రీస్తును అనుసరించాలి. క్రీస్తును అనుసరించడమనగా, ఆయనలోనే మన సంపూర్ణ నమ్మకం. ఆయన బోధనలను పాటించడం. క్రీస్తునకు నిజమైన మరియు జీవితకాలం శిష్యులముగా ఉండాలంటే, క్రీస్తు మనలనుండి ఏమి ఆశిస్తున్నాడో తెలుసుకుందాం. ఈనాటి సువిశేష పఠనములో అదే విషయాన్ని స్పష్టముగా తెలియజేస్తున్నాడు.

నేటి సువిశేషం క్రీస్తు శిష్యరికంగూర్చి, శిష్యులకు ఉండవలసిన లక్షణాలగూర్చి బోధిస్తుంది. ప్రభువు గ్రామాలలో, పట్టణాలలో దైవరాజ్యముగూర్చి బోధిస్తున్నప్పుడు, అద్భుతాలు చేస్తున్నప్పుడు, గుంపులు గుంపులుగా ఎంతోమంది ఆయనను అనుసరించారు. అయితే, వారిలో ఎంతమంది నిజమైన క్రీస్తు అనుచరులు ఉన్నారు? ఈరోజు మనం జ్ఞానస్నానముద్వారా క్రీస్తు అనుచరులం. రోజూ ప్రార్ధనలు చేస్తూ ఉన్నాము. ఆరాధనలో, దివ్యపూజాబలిలో పాల్గొంటున్నాము. అయితే, మనలో ఎంతమందిమి నిజమైన క్రీస్తు అనుచరులము? ఇది తెలుసుకోవాలంటే, క్రీస్తును అనుసరించడానికి మనలనుండి ఆయన ఏమి కోరుతున్నాడో తెలుసుకోవాల్సినదే!

1. మొదటిగా, మన కుటుంబాన్ని, మన ప్రాణాన్ని త్యజింపాలి. గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను (11:29; 12:1). యేసు యెరూషలేమునకు ప్రయాణం చేయుచున్నారు (9:51). అనగా శ్రమలు, మరణం వైపునకు (9:22; 13:31-35). వారు ఏ ఉద్దేశముతో అనుసరిస్తున్నారు? రాజకీయ స్వతంత్రము కొరకా? స్వస్థత కొరకా? భోజనం కొరకా? యేసు వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను: “నన్ను వెంబడింపగోరి, తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు, నా శిష్యుడు కానేరడు (లూకా. 14:26). మన కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను ద్వేషించాలని కాదు. యేసు తన తల్లిదండ్రులను ఎప్పుడు ద్వేషించలేదు! వారికన్న ఎక్కువగా ప్రభువును ప్రేమించాలి. ప్రభువు తరువాతనే ఏదైనా, ఎవరైనా అని అర్ధం. ప్రభువునకు ప్రాధాన్యత ఇవ్వాలని అర్ధం. ఇదే విషయాన్ని మత్త. 10:37 లో చూస్తున్నాము. తన తండ్రినిగాని, తల్లినిగాని, నాకంటె మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారునిగాని, కుమార్తెనుగాని, నాకంటె మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు.” కనుక, క్రీస్తు శిష్యులు వారి కుటుంబముకన్న, తన ప్రాణముకన్న, ప్రభువును ఎక్కువగా ప్రేమించాలి. క్రీస్తును మనం సంపూర్ణముగా అనుసరించాలంటే, ఇహలోక బాంధవ్యాలను వీడి, క్రీస్తుతో బాంధవ్యాన్ని ఏర్పరచుకోవాలి. తన ప్రాణమునైనను త్యజింపనివాడు” అనగా, క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడం; అవసరమైతే, వేదసాక్షి మరణాన్ని పొందడం. చదువుము లూకా. 18:29-30 – ప్రతిఫలం=నిత్యజీవితము.

2. రెండవదిగా, “తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు, నాకు యోగ్యుడు కాడు (లూకా. 14:27; 9:23). ఆత్మత్యాగాన్ని సూచిస్తుంది. మన సిలువను ఎత్తుకొని ప్రభువును అనుసరింపవలెను. అనగా, ప్రభువు నిమిత్తము మన ప్రాణమును ధారపోయాలి (లూకా 9:24). క్రీస్తును అనుసరిస్తున్నప్పుడు, విశ్వాసము కొరకు ఎన్నో కష్టాలను, అవమానములను, బాధలను పొందవలసి ఉంటుంది. ఇరుకైన మార్గమున ప్రవేశించవలసి ఉంటుంది. రోమను కాలములో, సిలువ మరణానికి, అవమానానికి చిహ్నం. సిలువపై మరణ శిక్షను పొందెడివారు, వారి సిలువను ఎత్తుకొని వెళ్ళెడివారు. అయితే, సిలువ మరణాన్ని పొందిన క్రీస్తు, దానికి ఓ నూతన అర్ధాన్ని ఇచ్చాడు. ఇప్పుడు సిలువ ప్రేమకు, క్షమకు, త్యాగానికి, దైవానుగ్రహానికి చిహ్నం. సిలువ ఎత్తుకోవడం అనగా, అది ఒక భారముగాని, అవమానముగాని కాదు. క్రీస్తును అనుసరించుటకు, మనలను మనం త్యజించుకోవడము. ప్రేమతో, ఓర్పుతో, క్షమతో, త్యాగముతో జీవించడం. నా నిమిత్తమై ప్రాణమును ధారబోయువాడు, దానిని దక్కించుకొనును(లూకా. 9:24). ఆనాటి ప్రజలు, యేసును రాజుగా భావించారు. రోమనులపై జయించి, ఒక నూతన సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడని భావించారు. ఆ రాజ్యము త్వరలోనే వస్తుందని తలచారు (లూకా. 19:11). అయితే, ఎప్పుడైతే యేసు తాను అనేక శ్రమలను అనుభవించి, పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి, మరణాన్ని పొందవలసి యున్నాడని బోధించినప్పుడు (లూకా. 9:22), అనేకమంది ఆయనను తృణీకరించారు. వారి ఆలోచనలను, పద్ధతులను, కోరికలను ప్రభువు కొరకు విడనాడలేక పోయారు. అంతా మంచిగా, సాఫీగా సాగుతున్నప్పుడు, క్రీస్తును అనుసరించడం సులభమే! కాని, కష్టాలు, బాధలు, అవమానములు, సమస్యలు వచ్చినప్పుడు మన అనుసరణ ఎంత సత్యమో తెలుస్తుంది! ఆయనను అనుసరించువారు, కష్టాల పాలవుతారని, ప్రభువే చెప్పియున్నారు (యోహాను. 16:33). లూకా. 9:57-62 లో చూస్తున్నట్లుగా, ముగ్గురు వ్యక్తులు క్రీస్తును అనుసరించాలని ఎంతో ఉత్సాహముతో వచ్చారు. కాని, దానికి కావలసినటువంటి త్యాగాన్ని వారు చేయలేక పోయారు.

3. మూడవదిగా, మన సంపదలను త్యజింపాలి. తన సమస్తమును త్యజియించిన తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు (లూకా. 14:33). సమస్తమును త్యజించడం అనగా అన్నీ వదలి అనామకముగా జీవించడము కాదు. మనకున్న సంపదలపై వ్యామోహాన్ని విడనాడాలి. ఇహలోక సంపదలపై అత్యాశను విడనాడాలి. పరలోక సంపదలపై మన దృష్టిని సారించాలి. మనకున్న దానిని ఇతరులతో పంచుకోవాలి. పొరుగు వారిని ప్రేమించాలి. న్యాయం కోసం కృషి చేయాలి. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో, వెళ్లి నీ ఆస్తిని అమ్మి, బీదలకు దానము చేయుము. అపుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను అనుసరింపుము (మత్త. 19:21). చదువుము లూకా. 12:15.

నేడు క్రీస్తు శిష్యులు కానేరని వారు ఎవరంటే, దేవుని వాక్యాన్ని చదివి, విని దానిని పాటించనివారు, క్రీస్తు శిష్యులు కానేరరు. శ్రమలను భరించలేనివారు శిష్యులు కానేరరు. సువార్తను బోధించి పాటించనివారు, శిష్యులు కానేరరు.

- కనుక, క్రీస్తును అనుసరించడం అనగా, ఆయనకు ప్రధమ స్థానాన్ని ఇవ్వడం. క్రీస్తును అనుసరించడం అనగా, సంపూర్ణ పరిత్యాగం. నిత్యజీవితానికి ఏ ఆటంకాన్నైనను మనం తీసివేయాలి. లూకా 16:13లో ఇలా చదువుచున్నాము: (చదువుము). ఇహలోక వ్యామోహాలలో జీవిస్తూ, పాపములో జీవిస్తూ మనం క్రీస్తును అనుసరించలేము. ఆయన శిష్యులు కానేరము. కనుక, మనలో పరివర్తన కలగాలి.

* క్రీస్తును అనుసరించుటకు తగిన విధముగా సిద్ధపడాలి. యేసును అనుసరించడం అనేది అంత తేలికగా తీసుకొనే నిర్ణయం కాదు! ఈ విషయాన్ని రెండు ఉపమానములతో స్పష్టముగా వివరించియున్నాడు (లూకా. 14:28-32). గోపురము కట్టువాడు దానిని పూర్తి చేయుటకు తగిన వ్యయము ఉన్నదా లేదా అని ఆలోచింపడా? యుద్ధమునకు వెళ్ళు రాజు తన దగ్గర కావలిసినంత సైన్యము, బలగము ఉన్నదా లేదా అని  ఆలోచింపడా? అదేవిధముగా, మనము కూడా, క్రీస్తును అనుసరించుటకు తగిన విధముగా సిద్ధపడాలి. ప్రతీ నిత్యము దృఢచిత్తముతో క్రీస్తును అనుసరింపవలయును. రెండు ఉపమానములద్వారా, మనకు వివేకము మరియు దూరదృష్టి ఉండాలని అర్ధమగుచున్నది. క్రీస్తు శిష్యరికం చివరి శ్వాసవరకు.

క్రీస్తును అనుసరించుటకు కావలసిన ధృడనిర్ణయాన్ని తీసుకోవడానికి మనకు దైవజ్ఞానం అవసరము. ఈ దైవజ్ఞానాన్ని కేవలం పవిత్రాత్మ మాత్రమే మనకు ఇవ్వగలదు. నీవు నీ జ్ఞానమును దయచేసిననే తప్ప, స్వర్గమునుండి నీ పవిత్రాత్మమును పంపిననే తప్ప, నీ చిత్తమును ఎవడు తెలుసుకోగలడు? ఈ రీతిన నీవు దయచేసిన జ్ఞానముద్వార భూమి మీది నరులు ఋజుమార్గమున నడచుచున్నారు. నీకు ప్రీతికరమైన కార్యము ఏదో తెలుసుకొనుచున్నారు (సొ.జ్ఞాన. 9:17-18). క్రీస్తు చెప్పిన విధముగా పవిత్రాత్మ శక్తి, మనకు మార్గము, సత్యము, జీవము గూర్చి తెలియజేయును. దేవున్ని సంతృప్తి పరచుట ఎలాగో మనకు తెలియ జేయును. మరియు ఆత్మయొక్క దైవజ్ఞానము ద్వారా మనము రక్షింపబడుదము. ఆత్మశక్తిద్వారా మనం మరల నూతనముగా జన్మించియున్నాము. మనం ఆత్మశక్తిచేత నడిపింపబడుచున్నాము. కనుక, క్రీస్తును అనుసరించుటకు నిత్యము ప్రార్ధన చేయాలి.

చివరిగా, క్రీస్తు శిష్యులముగా కొనసాగాలంటే, 1. ప్రతీ దినము ప్రార్ధన చేయాలి. 2. ఆదివార దివ్య పూజాబలిలో పాల్గొని, దివ్య సత్ప్రసాదాన్ని యోగ్యరీతిన స్వీకరించాలి. 3. దివ్యగ్రంద పఠనం చేయాలి. 4. సేవాపూరిత జీవితాన్ని జీవించాలి. 5. అందరితో ఆధ్యాత్మిక స్నేహాన్ని చేయాలి. 6. దైవకార్యము కొరకు మన సమయాన్ని, శక్తిని వెచ్చించాలి.