22 వ సామాన్య ఆదివారము, YEAR C

22 వ సామాన్య ఆదివారము, YEAR C
సీరా. 3:17-18,20,28-29; హెబ్రీ. 12:18-19,22-24; లూకా. 14:1,7-14 
వినయము

ఈనాటి పఠనాల సారాంశం: వినయము. మనం సాధారణముగా అధికారాన్ని మరియు సర్వం మన ఆధీనములో ఉండాలని ఆశిస్తూ ఉంటాము. ఇతరులకన్న తగ్గకుండా ఉండాలని, ఆధిక్యములో ఉండాలని ఆశిస్తూ ఉంటాము. మనలో ఉన్నటువంటి గర్వం, వినయమును అణచివేయడము వలన మన జీవితములో ముందుకు కొనసాగలేక పోవుచున్నాము. క్రైస్తవ జీవితానికి వినయము (వినమ్రత, తనను తాను తగ్గించుకొనుట) అతి ముఖ్యమైన సుగుణము. ఈ సుగుణాన్ని మనం ప్రభువునుండి నేర్చుకోవాలి. "సాధు శీలుడననియు, వినమ్ర హృదయుడననియు మీరు నానుండి నేర్చుకొనుడు" (మత్త. 11:29). వినయమను సుగుణము, ఇతరులతో పంచుకొను గొప్ప స్వభావాన్ని నేర్పుతుంది.

క్రీస్తు శిష్యరికత్వానికి తప్పకుండా కావలసినది ఈ సుగుణము. ఈ సుగుణముపైనే, ఇతర క్రైస్తవ సుగుణాలన్నీకూడా ఆధారపడి యున్నాయి. కాబట్టి మనం ముందుగా వినయము అను సుగుణాన్ని అలవర్చుకోవాలి. దేవునిపట్ల వినయ వినమ్రతలను కలిగియుండాలి. మరియు, మన సమాజములో అణచివేయ బడినవారిని, పేదవారిని ఆదరించాలి. ధనవంతులు దేవునిపట్ల వినయాన్ని కలిగియుండటము చాలా కష్టము. ఎందుకన, వారి స్వబలముపై, భద్రతపై ఆధారపడుతూ ఉంటారు.

మొదటి పఠనములో, ఒక జ్ఞాని తన శిష్యులకు వినయముగూర్చి భోదిస్తున్నాడు. "కుమారా! నీవు చేయు పనులన్నిటను వినయముతో మెలుగుము. బహుమతులిచ్చు వానికంటెకూడ వినయవర్తనుని నరులు అధికముగా మెచ్చుకొందురు. నీవెంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము. అప్పుడు ప్రభువు మన్ననను బడయుదవు."

ముందుగా, వినయము అంటే ఏది కాదో తెలుసుకుందాం: వినయము అనేది మన ముఖ కవలికలో ప్రదరిశించెడిది కాదు. వినయము అనేది మన మాట, నడక, వస్త్రధారణ కాదు. వినయము అనేది కేవలం భౌతిక వ్యక్తీకరణ కాదు. వినయము అనగా బలహీనత కాదు.

వినయం మనస్సు, హృదయం యొక్క అంత:ర్గత లక్షణం. అది మన పరిమితులను గుర్తించి, అంగీకరించడానికి సహాయపడుతుంది. వినయం స్వార్ధముగాని, అహంభావముగాని కాక, ఇతరులను మనకంటే అధికులుగా భావింపుట (ఫిలిప్పీ 2:3) అని పౌలుగారు తెలియజేయు చున్నారు. వినయము అనగా స్వసేవగాక, ఇతరులకు సేవచేయడము. దైవ భక్తుని యొక్క సుగుణము వినయము. ఒక వ్యక్తి ఎంత గొప్పగా ఉండాలని కోరుకుంటాడో, అంతగా వినయాన్ని అలవర్చుకోవాలి. మనలో వినయమున్నప్పుడే, మనం ఏమిటో తెలుసుకోగలము. తద్వారా, మనలను మనం దేవునికి అర్పించుకొనగలము.

'పరలోకానికి నిజమైన, సురిక్షితమైన మార్గము వినయము' (పు. అగుస్తీను). 'మనలను మనం మోసము చేసుకోకూడదు. మనలో వినయము లేనిచో, ఏదియు లేనట్టే' (పు. విన్సెంట్ ది పౌల్). వినయము అనగా మనలను మనం కించపరచుకోవడము కాదు, అవమాన పరచుకోవడము కాదు. మనల గురించి అసలు ఆలోచించుకోపోవడమే వినయము. అనగా మనలను మనం గొప్పగా చేసుకొని, ఇతరులను తక్కువ చేయడము కాదు. "వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు" (మత్త. 5:5). వినయమునకు మరియ తల్లి ఆదర్శం. ఆమె దేవుని చేత గొప్ప స్థానానికి ఎత్తబడినది. ఆమె "అనుగ్రహ పరిపూర్ణురాలు" (లూకా. 1:28-29), "స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినది" (లూకా. 1:42), దైవకుమారునికి తల్లి. అయినను, ఆమె వినయముతో జీవించినది. మనలో ఉన్న మంచి గుణాలన్నియుకూడా, వినయమను సుగుణముతో జతచేయనిచో అవి వ్యర్ధమే! 

క్రీస్తు స్థాపించిన సంఘముద్వారా, పరలోకాన్ని ముందుగానే చూడగలిగియున్నాము. క్రీస్తు శిష్యులముగా, దేవుని మంచితనమును నమ్ముకొంటూ, మన జీవితాలను వినయముతో దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి. అలాగే, మనం మారుమనస్సు పొందకముందు జీవించిన పాత జీవితానికి తిరిగి వెళ్లక, జీవితాంతము వరకు కూడా, మనలను పరలోకమున చేర్చు మార్గముననే పయనించాలని బోధిస్తుంది.  వినయమున్నచోట, స్వార్ధం, గర్వం, మొండితనము ఉండవు.

మొదటి పఠనము: "కుమారా! నీవు చేయు పనులన్నిట వినయముతో మెలుగుము. బహుమతులిచ్చు వానికంటే కూడా వినయవర్తనుని నరులు అధికముగా మెచ్చుకొందురు. నీవెంత అధికుడవో, అంత వినయవంతుడవు కమ్ము. అప్పుడు ప్రభువు మన్ననను పొందుదువు (సీరా. 3:17-18). వినయం అనగా, భూమిమీద మన కాళ్ళపై నిలబడటం (లతీను పదమూలం).

ఈనాటి సువిషేశములోని క్రీస్తు భోదనా సారాంశంకూడా వినయము. స్వార్ధముతో, గర్వముతో, మొండితనముతో ఉన్న వారికి ముఖ్యముగా, పరిసయ్యులకు, ధర్మశాస్త్రబోధకులకు వినయము గూర్చి ప్రభువు బోధిస్తున్నారు. అలాగే, ఈ బోధన మనందరికీ కూడా వర్తిస్తుంది.

దేవుని రాజ్యము అనగా, పరిపూర్ణమైన సంఘము. ఈ సంఘము అనేకసార్లు విందుతో పోల్చబడినది. దైవరాజ్యము అనే ఈ విందుకు అందరూ ఆహ్వానితులే. విందుకు వచ్చిన వారు మొదటి స్థానాలలోకాక, చివరి స్థానాలలో కూర్చోవాలని ప్రభువు చెప్పియున్నారు. అప్పుడు, ఆహ్వానించిన వ్యక్తి, ఎవరి అర్హతను బట్టి వారికి చెందిన స్థలాలను వారికి ఇవ్వగలడు. ఇతరులచేత నిరాకరించబడిన వారిని గౌరవించాలనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి. అప్పుడే ప్రభువు ఆశీర్వాదాలు మనపై తప్పక ఉంటాయి. దేవుని రాజ్యములో ధనికులని, పేదవారని, ప్రాంతాలవారని, జాతులవారని, కులాలవారని, భాషలవారని భేదాభిప్రాయాలు ఉండవు. ఈ రాజ్యములో ప్రవేశించాలంటే, వినయము అనే సుగుణమును కలిగి యుండాలి.

సంఘములో గొప్పవారిగా ఎదగాలంటే, మనలను మనం త్యజించుకోవాలి, తగ్గించుకోవాలి. "తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును . తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును" (మత్త. 23.12).

క్రీస్తు వినయము: 
- దేవుని కుమారుడైనను, పశువుల పాకలో జన్మించాడు (లూకా 1:12, 16). 
- మనుష్యకుమారునకు తల దాచుకొనుటకైనను చోటు లేకుండెను (లూకా 9:58). 
- సేవకరూపము దాల్చి, తన శిష్యుల పాదాలను కడిగారు (యోహాను. 13:4-5).
- "తనను తాను రిక్తుని చేసుకొని, సేవకుని రూపమును దాల్చి, మానవ మాత్రుడుగా జన్మించెను. అన్నివిధముల మానవ మాత్రుడై ఉండి, అంతకంటె వినయము కలవాడై, సిలువపై మరణము వరకు విధేయుడాయెను" (ఫిలిప్పీ. 2:7-8). 
- ఆయన దేవునితో సమానము, దేవునిచేత పంపబడినవాడు. సకల జ్ఞానమును, శక్తియును కలిగియున్నవాడు. అయినను, వినయమును కలిగియున్నాడు. "ఆయన ఎల్లప్పుడును దైవ స్వభావమును కలిగియున్నను, దేవునితో తన సమానత్వమును గణింపలేదు" (ఫిలిప్పీ. 2:6). 
- వినయమమే మోక్షమునకు మార్గమని బోధించాడు. వినయముతో పవిత్రాత్మ శక్తితో నింపబడుటకు అంగీకరించాడు (లూకా 4:1). 
- వినయముతో దేవుని చిత్తానికి విధేయుడై జీవించాడు. వినయముతో తండ్రి దేవునిపై సంపూర్ణముగా ఆధారపడి జీవించాడు. (యోహాను. 5:19, 30, 41; 6:38; 7: 16, 28; 8:28, 42, 50; 14: 10, 24). 
- సమాజమునుండి వెలివేయబడిన వారితో, పాపాత్ములతో, రోగులతో, పేదవారితో సాన్నిహిత్వం చేయడానికి ఆయన భయపడలేదు (మత్త. 9: 9-13; మార్కు. 2:14-17; లూకా. 5:27-32; 15:1).

బప్తిస్మ యోహాను వినయము (యోహాను 3;30); పౌలు వినయము (1 కొరి. 15:9; ఎఫే 3:8; 1 తిమో. 1:15).

వినయముతో జీవించుదాం. మనం జీవించే జీవితం దేవుని వరం. కనుక దేవుని రాజ్య స్థాపనకు కృషి చేద్దాం. మానవులందరు సమానులని గుర్తించుదాం.

21 వ సామాన్య ఆదివారము, YEAR C

21 వ సామాన్య ఆదివారము, YEAR C
యెషయ 66:18-21; హెబ్రీ. 12:5-7, 11-13; లూకా. 13: 22-30 
"ఇరుకైన మార్గము"

మన జీవిత అంతిమ గమ్యం ఏమిటి? మన జీవితానికి నిజమైన అర్ధం ఏమిటి? రక్షణ. "మానవుడు లోకమంతటిని సంపాదించి, తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి?" (మత్త. 16:26). మన ప్రాణమును, జీవితాన్ని, ఆత్మను, రక్షించుకోవాలంటే, మన జీవిత గమ్యాన్ని చేరుకోవాలంటే, మనం ప్రభువు చెప్పిన, మరియు ఆయన తన జీవితము ద్వారా చూపిన ఇరుకైన మార్గములో పయనించాల్సిందే!

1. మన జీవితములో, సరియైన నిర్ణయాలను తీసుకొని, ఇరుకైన మార్గమున పయనించాలి. అనగా, ఇహలోక ఆలోచనలనుగాక, సంపదలనుగాక, అధికారమునుగాక, ఎల్లప్పుడూ దేవుని మార్గమును ఎంచుకొనడము. మనలను మనం త్యజించుకొని, దేవుని అనుగ్రహమునకు సహకరించడము. పాపపు వాంఛలను విడనాడటము. ఇరుకైన మార్గము మన అనుదిన జీవితముతో ముడిపడియున్నది. దేవునితోను, తోటివారితోను సఖ్యతను కలిగియుండటము, మంచి కారణానికై, మంచి పనులను చేయడము, మన పేరు, ప్రతిష్టలనుగాక, దైవరాజ్యమును, నీతిని వెదకడము, పాప జీవితానికి పశ్చాత్తాపపడటము, విధేయత, వినయము, నీతి న్యాయము, సత్యములతో జీవించడము. ఈ విధముగా, ప్రార్ధన ద్వారా, ఇరుకైన మార్గమున ప్రవేశించుటకు, ప్రయాసపడవలయును. ఇదియే, పరలోకరాజ్య ప్రవేశమార్గము. ఈ మార్గమున ప్రవేశించుటకు, మన జీవితములో వచ్చు అడ్డంకులన్నింటిని తొలగించమని దేవున్ని వేడుకోవాలి.

2. ప్రతీ రోజు, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సమయం చాలా కొరవగాయున్నది. ప్రతీరోజు, మనం ఎన్నో అవకాశాలను కోల్పోవుచున్నాము. "అవకాశం ఒకేసారి మన తలుపు తడుతుంది" అనే నానుడి మనకు తెలిసినదే! దేవుడు ఇచ్చిన అవకాశాలను, నేను ఎలా వినియోగించాను? ఆ అవకాశాలకు, నేను ఎలా స్పందించాను? క్షమించుట ద్వారా, అన్నదానము, వస్త్రదానముద్వారా, ఇతరులను ప్రేమించడముద్వారా, క్రీస్తుకు నేను సాక్ష్యము ఇచ్చియున్నానా? ఇరుకైన మార్గమున ప్రవేశించుటకు, నేను ఈరోజు ఎంత వరకు ప్రయత్నం చేసియున్నాను?

"ప్రభువా, నా పాపాలను క్షమించుము. నన్ను నడిపించుటకు, బలపరచుటకు, నీ ఆత్మను ఒసగుము".

ఇరుకైన మార్గమునకు ఉదాహరణ, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన తీరు. వారి గమ్య స్థలమునకు, వాగ్దత్త భూమికి చేరుకొనుటకు వారు ఇరుకైన మార్గమును అనగా, బానిసత్వము, ఆకలిదప్పులు, పశ్చాత్తాపము, మన్నింపు, ప్రేమ, సేవ, నీతి, న్యాయములతో కూడిన మార్గమున పయనించవలసియున్నది. అదేవిధముగా, క్రీస్తు ప్రభువు, ఈ భూలోకమున, మన రక్షణార్ధమై, ప్రేమ, సేవ, బోధన, త్యజింపు, శ్రమలు, అవమానములు, మరణములతో కూడిన ఇరుకైన మార్గాముననే ఎన్నుకొన్నాడు.

హేబ్రీయులకు వ్రాసిన లేఖలో, పునీత పౌలుగారు, ఇరుకైన మార్గము అనగా, దేవుని క్రమశిక్షణ అని చెబుతున్నాడు. విశ్వాసులు పొందే శ్రమలు, బాధలు, దేవుని క్రమశిక్షణలో భాగమే! ఇవన్నియుకూడా ప్రేమతో ఇవ్వబడుచున్నాయి. తల్లిదండ్రులు, తమ బిడ్డను దండిస్తున్నారంటే, ఆ బిడ్డ నాశనం కావాలని కాదు. కాని, క్రమశిక్షణ ద్వారా, ఆ బిడ్డ బాధ్యతాయుతముగా ఎదగాలని, వారు ఆశిస్తూ ఉంటారు. విశ్వాసులు దేవున్ని, తండ్రిగా భావించినప్పుడే, ఈ క్రమశిక్షణ విలువను అర్ధం చేసుకోగలరు.

రక్షణ కేవలం కొందరికి మాత్రమేగాక, సర్వమానవాళికి ఏర్పాటు చేయబడియున్నది. అయితే, మన రక్షణ, మన విశ్వాసము, నమ్మకము, మన జీవిత విధానముపై మరియు మనం ఎన్నుకొనే మార్గముపై ఆధారపడియున్నది. రక్షణయనగా, ముఖాముఖిగా దేవున్ని చూడటము. రక్షణ విశ్వాసముతో మొదలవుతుంది. ఆ విశ్వాసాన్ని, మన అనుదిన జీవితములో ఎలా జీవిస్తున్నాము అన్నది ప్రాధాన్యము. మన విశ్వాసాన్ని, ఎలా ప్రకటిస్తున్నాము అన్న దానిలోనుంచి వచ్చెడిదే రక్షణ. అలాంటి విశ్వాసాన్ని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరియు ప్రవక్తల జీవితాలలో చూస్తున్నాము. రక్షణను పొందాలంటే, దేవుని అనుగ్రహం మన జీవితములో కార్యరూపణ దాల్చాలి. "నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం" అని పలికిన యేసయ్యే, మన నిజమైన మార్గం. కాబట్టి, ఆయన బోధనలను పాటించి, ఆయన చెప్పిన, చూపిన మార్గములో పయనించుదాం!

పరిశుద్ధ కన్యమరియమ్మ మోక్షారోపణము, 15 ఆగష్టు

మరియమాత మోక్షమునకు కొనిపోబడుట, 15 ఆగష్టు
ద.గ్రం. 11:19, 12:1-6, 10; 1 కొరి. 15:20-26; లూకా. 1:39-56

"ఆకాశమందు ఒక గొప్ప సూచకము ప్రదర్శితమాయెను. ఒక స్త్రీ సూర్యుని వస్త్రముగా ధరించి చంద్రుని తన పాదముల క్రిందను, శిరస్సునందు పండ్రెండు నక్షత్రముల కిరీటము కలిగియుండి ప్రత్యక్ష మాయెను" (దర్శన. 12:1).

ఈరోజు పరిశుద్ధ కన్య మరియమ్మ మోక్షారోపణ మహోత్సవాన్ని కొనియాడు చున్నాము. ఏలినవారియందు ఆనందించుచు, కన్య మరియ గౌరవార్ధము ఆమె ఉత్సవమును కొనియాడుదము. ఆమె మోక్షారోపణ సందర్భమున దేవదూతలు పరవశించి దైవ కుమారుని స్తుతించిరి.

ఈనాటి ఉత్సవ సారాంశం: దైవసుతుని తల్లియగు నిష్కళంక కన్య మరియమ్మను ఆత్మ శరీరములతో స్వర్గీయ మహిమలోనికి దేవుడు చేర్చుకొని యున్నాడు. ఈ దినము కన్యకయగు దేవమాతకు స్వర్గ ప్రవేశ వరము లభించెను. ఈవిధముగా, మరియ సత్యసభ పొందవలసియున్న పరిపూర్ణ రూపురేఖలకు సూచకముగా ఉన్నది. ఈ లోకమందు జీవిత యాత్ర గడుపు మనందరికీ నమ్మక పూరిత ఆశగాను, దుఃఖ:బాధల మధ్యన ఊరటగాను ఆమె వెలసి యున్నది. దైవ కుమారుని కనిన ఆమె శరీరము మరణానంతరము శిధిల మొందుటకు అంగీకరించలేదు. ఆమె ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడి యున్నది. అందుకే, మరియ స్తుతి గీతములో చెప్పిన వాక్యాలు, అక్షరాల నేరవేర్చబడ్డాయి. "తరతరములవారు నన్ను ధన్యురాలని పిలుతురు. ఎందుకన, సర్వేశ్వరుడు నాయందు ఘనకార్యములను నెరవేర్చెను." దేవుడు మరియ జీవితములో చేసిన ఒక మహోన్నత కార్యము, ఆమెను ఆత్మ శరీరములతో స్వర్గీయ మహిమలోనికి చేర్చుకొనుట.

ఈ ఉత్సవం, మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఏవిధముగా తోడ్పడుచున్నది? యేసు చెప్పినట్లుగా, "తండ్రి గృహమున అనేక నివాసములు కలవు" (యోహాను. 14:2). మానవుని నివాసము దేవుడు. అదే నిత్య నివాసము, నిత్య జీవితము, నిత్య సంతోషము. మరియ ఆ నివాసమునకు ఆత్మ శరీరములతో కొనిపోబడి యున్నది. అంత మాత్రమున మరియమ్మ మనకు దూరము కాలేదు. దేవునిలో ఐక్యమైన మరియ దేవుని సానిధ్యాన్ని పంచుకొనియున్నది. దైవ సాన్నిధ్యం మన దరిలోనే ఉన్నది. దేవున్ని ఆశ్రయించే ప్రతీ వారి దరికి ఆయన వచ్చును. దేవునిలో మనకొరకు నివాసమున్నట్లే, మనలో కూడా దేవుని కొరకు నివాసమున్నది. మరియ దేవుని సాన్నిధ్యాన్ని హృదయములో పదిల పరచుకొన్నది. అలాగే, మనలో దైవ సాన్నిధ్యమున్నదంటే, మనలో దేవునికి నివాసము ఉన్నట్లే గదా! ఈ సాన్నిధ్యం, విశ్వాసమున ప్రదర్శింపబడు చున్నది. విశ్వాసమున మన జీవిత ద్వారాలను తెరచిన దేవుడు మనలో కొలువు దీరును. దేవుని కొలువుతో మన జీవితం ధన్యమవుతుంది.

మరియమ్మ మనకు ఎన్నో విధాలుగా ఆదర్శప్రాయులు. ఈరోజు ప్రత్యేకముగా అమ్మ మరియ ప్రార్ధన సహాయాన్ని వేడుకొందాం. ఆమె ప్రార్ధన ఫలితమున మన విశ్వాసం అధికమధికమగునుగాక. దేవుడు మనకు ఇచ్చిన సమయములో గొప్ప నమ్మకముతో జీవింతుముగాక. మనముకూడా పునరుత్థాన మహిమను సాధించగలుగుదుముగాక.

ఈరోజు మన దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని కొనియాడుచున్నాము. మన దేశాభివృద్ది కొరకు ప్రార్ధన చేద్దాం. స్వాతంత్రం, సమానత్వం, అభివృద్ది ప్రతీ భారతీయుడు చవిచూడాలని ఆశిద్దాం. మన స్వాతంత్రం కొరకు పాటుబడి మరణించిన వారిని గుర్తుకు చేసుకొంటూ, వారు చూపించిన సన్మార్గములో మనం నడవడానికి కావలసిన శక్తిని ఇవ్వుమని దేవున్ని ప్రార్ధిద్దాం.

19వ సామాన్య ఆదివారము, YEAR C

19వ సామాన్య ఆదివారము, YEAR C
సొ. జ్ఞాన. 18: 6-9; హెబ్రీ. 11:1-2, 8-19; లూకా. 12:32-48
ప్రభువు రాకడ - మన సంసిద్ధత

ఉపోద్ఘాతం: మన జీవితం ఒక ప్రయాణం. మన గమ్యం ఎటువైపో మనకు తెలియదు, అయినా ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. అయితే, ఈ ప్రయాణం చివరన, క్రీస్తును కలుసుకుంటామనేది వాస్తవం, ఖచ్చితం! మనలను కలుసుకొనుటకు, తన రాజ్యములోనికి మనలను ఆహ్వానించుటకు ప్రభువు సిద్ధముగా ఉంటారు. అది ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికీ తెలియదు, కనుక ఎల్లప్పుడు జాగరూకులమై, సంసిద్దులమై జీవించాలి. సంసిద్ధత యనగా, ప్రతీక్షణం క్రీస్తు కొరకే జీవించడం! అలా జీవిస్తే, ఏ క్షణములోనైనా ప్రభువును కలుసుకొనుటకు సిద్ధపడినవారమవుతాము. ఈ సంసిద్ధత మనం రోజు కలుసుకొను వారిపట్ల మన సేవా జేవితముపై కూడా ఆధారపడి యుంటుంది. "ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినపుడు అవి నాకు చేసితిరి" (మత్త 25:40) అని ప్రభువు చెప్పియున్నారు. కనుక, ప్రతీరోజు మనకు అప్పగించబడిన బాధ్యతలను నెరవేర్చాలి. ఇతరులతో సఖ్యతతో, శాంతితో జీవించాలి. తద్వారా, ప్రభువు రెండవ రాకడ కొరకు సిద్ధపడాలి. అలాగే, ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, బాధలు ఉన్నను, ప్రభువు జీవితానికి, ఆయన ప్రేషిత కార్యానికి కట్టుబడి జీవించాలి. విశ్వసనీయత కలిగి జీవించాలి.విశ్వసనీయత అనగా నిబద్ధత కలిగి జీవించడం.

ప్రసంగం: సృష్టి ఆరంభమునుండి దేవుడు మానవునికి ఎన్నో వాగ్దానాలను, ఒప్పందాలను చేస్తూ, వాటిని కార్యరూపణ దాల్చుతూ ఉన్నారు. ఆ దేవుని వాగ్దానాలను దృఢముగా విశ్వసించాలి అనేది ఈనాటి పఠనాల భోదాంశం. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు దేశములో ఫరోరాజు బానిసత్వములో ఉన్నప్పుడు, దేవునిపట్ల, దేవుని వాగ్దానాలపట్ల వారి విశ్వాసమే వారిని మోషే నాయకత్వములో స్వాతంత్రాన్ని పొందగలిగేలా చేసింది. తద్వారా వారు వాగ్దత్త భూమికి నడిపించబడినారు.

రెండవ పఠనములో పౌలుగారు విశ్వసించుటయన, "మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట; మనము చూడజాలని విషయములనుగూర్చి నిశ్చయముగా ఉండుట" అని నిర్వచించాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల విశ్వాసమును మనకు గుర్తుకు చేస్తున్నారు. స్వదేశమును విడచి, దేవుడు వాగ్దానము చేసిన శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరియున్నారు. "విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము" (హెబ్రీ. 11:6). "పూర్వాకాలపు మనుజులు, తమ విశ్వాసము చేతనే, దేవుని ఆమోదము పొందిరి. కంటికి కనిపింపని వానినుండి, కంటికి కనిపించునట్లుగా, దేవుని వాక్కుచేత ప్రపంచము సృజింపబడినదని, విశ్వాసము వలన మనకు అర్ధమగుచున్నది" (హెబ్రీ. 11:2-3).

సువిశేష పఠనములో, తన రాజ్యములో శాశ్వత ఆనందమును ఒసగు దేవుడు వాగ్దానమందు విశ్వసించవలెనని యేసు తన శిష్యులను కోరుచున్నారు. అయితే, దానికొరకు ఎల్లప్పుడూ సిద్దముగా ఉండాలి. ఎందుకన, మనుష్యకుమారుడు ఏ ఘడియలో వచ్చునో ఎవరికినీ తెలియదు. యజమాని-సేవకుని ఉపమానము ద్వారా, మనము ఎల్లప్పుడూ ప్రేమాజ్ఞకు విధేయులై, ఇతరులకు విధేయతాపూర్వకమైన సేవలనందిస్తూ, దేవుని చిత్తమును నెరవేర్చవలయునని గుర్తుచేయుచున్నారు. యజమాని-దొంగ ఉపమానముద్వారా, మనం, ఎల్లప్పుడూ జాగరూకులై ఉండాలని, తద్వారా, దొంగ (సాతాను, శోధనలు) దైవానుగ్రహమైన మన సంపదను దోచుకోలేడు అని బోధిస్తూ ఉన్నారు.

ప్రభువును చవిచూచుటకు మనము ఎల్లప్పుడూ జాగరూకులై ఉండాలి. జాగరూకులై ఉండుటకు మనము నిత్యమూ ప్రార్ధన చేయాలి. ప్రార్ధనలో దేవున్ని ఆలకించాలి. దేవుని "మెల్లని స్వరమును" (1 రాజు. 19:12) ప్రార్ధనలో వినగలగాలి. ఆ మెల్లని స్వరమును వినాలంటే, ప్రతీ రోజు మన ప్రార్ధన సమయాన్ని ప్రశాంతతో గడపాలి. ఈ ప్రశాంత వేళలోనే దేవుని స్వరమైన ప్రేమను, స్నేహాన్ని, శాంతిని వినుటకు మన వీనులను ట్యూన్ చేసుకోవచ్చు. "వినుము! నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరచిన లోనికి వత్తును. వానితో భుజింతును. అతడును నాతో భుజింతును" (దర్శన. 3:20).

క్రీస్తు రాకకై మనం ఎల్లప్పుడూ ఎదురు చూడవలయును. క్రీస్తు రాకకై ఎదురు చూడటమనగా, దేవుని రాజ్యము కొరకు పనిచేయడమే. అనగా, ఇతరులకు సేవచేయడముద్వారా, పేదరికాన్ని పోరాడటముద్వారా, మనలను విభజించే ద్వేషాన్ని తొలగించడముద్వారా, శాంతిని వ్యక్తుల మధ్య, దేశాల మధ్య స్థాపించడముద్వారా, ఇతరులను గౌరవించే సమాజాన్ని నిర్మించుట వలన దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే!

చేసిన వాగ్దానాలను అక్షరాల నెరవేర్చువారు మన తండ్రి దేవుడు. ఆయనయందు, ఆయన వాగ్దానాలయందు దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉందాము. ఆ విశ్వాసము ప్రతీక్షణం అధికమధికమవ్వాలంటే, మన జీవితములో ప్రశాంత క్షణాలతో కూడిన ప్రార్ధన ఎంతో అవసరము. ప్రార్ధనలో దేవుని స్వరమును వినుటద్వారా, ఆయన చిత్తాన్ని తెలుసుకోగలుగుతాము. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటయే, ఆయనలో జీవించడం. ఆయన రాజ్యము కొరకు జీవించడము. విశ్వాసులుగా, దేవుడు వాగ్దానము చేసిన శాశ్వత ఆనందాన్ని పొందాలంటే, ఇలాంటి జీవితము అవసరమని తెలుసుకొందాం!

18 వ సామాన్య ఆదివారము, Year C

18 వ సామాన్య ఆదివారము, Year C 
ఉప. 1:2, 2:21-23; కొలొస్సీ. 3:1-5, 9-11; లూకా. 12:13-21
పరలోక సంపదలు

నేడు 18వ సామాన్య ఆదివారము. మన దేవుడు వ్యక్తిగతముగా మనలనందరినీ, ఎల్లప్పుడూ తన కాపుదలలో ఉంచుతాడు. మనలను ఎన్నటికి విడనాడనివాడు మన దేవుడు. మనమే ఆయనను విడిచిపెట్టే అవకాశం ఉంది కాని, దేవుడు మనలను ఎన్నటికి విడనాడడు. ఆయన మన తండ్రి. తన బిడ్డల అవసరాలను తీరుస్తూ, వారి భవిష్యత్తుకు ప్రణాలికలను చేస్తూ ఉంటాడు.

ఈనాటి పఠనాలు, మన జీవితములో ముఖ్యమైన ప్రధానాంశాలను, ధ్యేయాలుగా కలిగి యుండాలని, దేవునియందు మన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచాలని భోదిస్తున్నాయి. సువిశేష పఠనము (లూకా 12:13-21), ఆత్యాశతో ఇహలోక సంపదలను కలిగియుండటము వలన, జీవితము పరిపూర్ణము కాదని తెలియజేస్తుంది. సంపదలు సంతోషాన్ని ఇచ్చిననూ, శాశ్వతమైన ఆనందాన్ని మనకు ఇవ్వలేవు. మన ఆత్మకు ఆనందాన్ని ఇవ్వలేవు. ధనికుడు తన నమ్మకాన్ని, దేవునిపైకాక, తనపైనే ఉంచాడు. తన భవిష్యత్తును తనే రూపొందించుకోగలడని అనుకొన్నాడు. తనకున్న సంపదలు తన జీవిత విజయానికి సూచనలుగా భావించాడు.

రెండవ పఠనము (కొలొస్సీ 3:1-5, 9-11)లో పౌలుగారు, "పరలోక మందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. అచ్చట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనముపైన అధిష్టించి ఉండును. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువులమీద గాక, ఆచట పరలోకము నందుగల వస్తువులపైన లగ్నము చేయుడు" (1-2) అని స్పష్టం చేయుచున్నారు. పరలోక మందలి వస్తువులు అనగా - దైవరాజ్య విలువలు, సువార్తా విలువలు కలిగిన జీవితం. ఇవే మనలను ఎల్లకాలం జీవించులా చేయును. ప్రేమ (సేవ) అను గొప్ప సుగుణం కలిగి జీవించాలి (1 కొరి 13:4-7). 
- ఆలోచన పరులుగా జీవించాలి
- సత్ప్రవర్తన కలిగి జీవించాలి
- నైతిక విలువలు కలిగి జీవించాలి: వ్యభిచారం అనైతికం అని మనందరికీ తెలుసు; అయినను భర్తలు, భార్యలను, భార్యలు భర్తలను మోసం చేస్తూ జీవిస్తారు!
- సత్యమునే పలుక వలెను: అసత్యమాడుట, అబద్ధాలాడుట తప్పు అని మనందరికీ తెలుసు. తప్పును కప్పిపుచ్చుటకు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాము?
- పవిత్రముగా జీవించాలి: మనసులలో దురుద్దేశాలు, అసూయ, లైంగిక ఆలోచనలు ఉండరాదు.
- దురాశ ఉండకూడదు: దురాశ కలిగినవారు స్వార్ధముతో జీవిస్తారు. ఎవరినీ పట్టించు కొనరు. 
డబ్బుపై వ్యామోహం ఉండరాదు. భౌతిక వస్తువులకు అతిప్రాముఖ్యత ఇవ్వరాదు. అవినీతి ఉండరాదు. "ధనాపేక్ష నుండి మీ జీవితములను దూరముగ ఉంచుకొనుడు. ఉన్నదానితో తృప్తిచెందుడు" (హెబ్రీ 13:5). ధనం దుష్టత్వంతో సమానం. మాదకద్రవ్యాల మాదిరిగానే డబ్బుకు బానిసలమై బ్రతుకుచున్నాం! ఈ బానిసత్వమునుండి మనం విడుదల పొందాలి. ధనం కోసం, ఆస్తులకోసం కన్న తల్లిదండ్రులను కడతేరుస్తున్న రోజులు! స్వంత కుటుంబాలను, బంధువులను నిరాకరిస్తున్న రోజులు! దేవుడు మనకు ఎంత డబ్బు ఇస్తే అంతగా దాతృత్వం కలిగి జీవించాలి. వాటిని ఇచ్చిన దేవుడు, తిరిగి తీసుకోవడం ఆయనకు ఎంత సమయం పట్టదని గుర్తుంచుకో!
డబ్బుతో మంచం కొనవచ్చు కానీ నిద్రను కొనలేము;
డబ్బుతో పుస్తకాలు కొనుక్కోవచ్చు కానీ జ్ఞానాన్ని కాదు;
డబ్బుతో ఆహారాన్ని కొనుక్కోవచ్చు కానీ ఆకలి కాదు;
డబ్బుతో ఇల్లు కొనుక్కోవచ్చు కానీ కుటుంబాన్ని (గృహం) కాదు;
డబ్బుతో మందులు కొనవచ్చు కానీ ఆరోగ్యం కాదు;
డబ్బుతో సహచరులను కొనుగోలు చేయవచ్చు కానీ నిజమైన స్నేహితులను కాదు;
డబ్బుతో పెళ్లి చేసుకొనవచ్చు కానీ ప్రేమను కొనలేము;
డబ్బుతో ఏదైనా కొనవచ్చు కానీ పరలోక రాజ్యాన్ని కొనలేము;
- చెడు తలంపులు తలవరాదు. ప్రతీకారం తీర్చుకోవాలి అన్న ఆలోచన సరికాదు;
డబ్బు, సంపదలు కలిగియుండుట మంచివే! అవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి! మన మనుగడకు అవి ఎంతో సహాయం చేస్తాయి! అయితే, అతిగా వాటికోసం ఆరాట పడటం, ఆశపడటం మాత్రం దయ్యముతో సమానము! ఉపదేశకుడు (మొదటి పఠనం) చెప్పినట్లుగా, అంతయు వ్యర్ధమే! కాని దేవునితో కూడిన జీవితం ఎప్పటికీ వ్యర్ధము కాదు!

ప్రతీ వ్యక్తి తన జీవితానికి ఒక ధ్యేయాన్ని, ఉద్దేశాన్ని ఏర్పరచుకోవాలి. విశ్వాసులుగా, మన విశ్వాసాన్ని, నమ్మకాన్ని, మన సంపదలు, ఆస్తులపైగాక, తండ్రి దేవునిపై ఉంచాలి. సంపదలు వస్తాయి, పోతాయి కాని, మన ఆత్మను కాపాడుకోవడం చాలా ముఖ్యం. మన సంపదలను, ఇహలోకములోగాక, పరలోకములో కూడబెట్టుకోవాలి. అప్పుడే మన ఆత్మలను కాపాడుకోగలము. 

ఈనాడు మనలను నాశనము చేస్తున్నవి, మన అత్యాశ, స్వార్ధము. వీనిని శాశ్వతముగా మనలనుండి తీసివేసినప్పుడే, నిజమైన సంపదలు, రక్షణ  - దేవునిలోను, క్రీస్తు భోదనలలోను ఉన్నాయని గుర్తించగలము.